దంతవైద్య లహరి-22

2
14

[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]

సగం విరిగిన పన్ను:

ప్ర: డాక్టర్ గారు, అనుకోని రీతిలో ఆడిటోరియం తలుపు నా ముఖానికి కొట్టుకుని నొప్పి మొదలయింది. పన్ను కూడా కొద్దిగా కదులుతున్నది. వెంటనే దగ్గరలోవున్న డెంటల్ డాక్టర్ గారికి చూపించాను. వారు ఎక్స్-రే, తీసి చూసి, పన్ను తీసేయాలన్నారు. పన్నుతీయడం అవసరం అంటారా? నా ఎక్స్-రే చూసి సలహా ఇవ్వగలరు.

– డా. పి. వెంకటయ్య గౌడ్, హన్మకొండ.

జ: వెంకటయ్య గారూ.. మీరు పంపిన ఎక్స్-రే చూసిన తర్వాత, మీకు తగిలిన దెబ్బ ఎంత గట్టిదో అర్థం అవుతున్నది. అక్కడ దంతవైద్యులు చూసి, చికిత్స గురించి వివరించిన తర్వాత కూడా, నన్ను సెకెండ్ ఒపీనియన్ అడగడం, నా మీద మీకున్న నమ్మకానికి నిదర్శనం. ఈ సందర్భంగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

ఇక, అసలు విషయానికి వస్తే, మీ ముందరి కొరుకుడు పన్ను (లేటరల్ ఇన్సిజార్) సరిగ్గా సగానికి విరిగి పోయింది. అందుకే పన్ను కదులుతున్నట్టు మీకు అర్థమయింది. అయితే, దవుడ లోపల వుండే మూలం (రూట్) మాత్రం బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నది. ఇక్కడ మీ పంటి చికిత్సకు రెండు మార్గాలు కనిపిస్తున్నాయి. మీరు చూపించిన దంతవైద్యుల సలహా మేరకు, ఈ రెండు పద్ధతుల్లో, మీకు ఇష్టమైన పద్ధతిలో చికిత్స చేయించుకొనవచ్చును. అది పూర్తిగా, మీ ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. అవి –

  1. పన్ను తీయించుకుని, కృత్రిమ పన్ను పెట్టించుకోవడం.
  2. విరిగిన పంటి భాగం మాత్రమే తీయించుకుని, దౌడలో వుండే మూలం సహకారంతో కృత్రిమ పన్ను తయారు చేయించుకోవడం.
డెంటల్ ఎక్స్-రే లో విరిగిన పన్ను

సమయం, సొమ్ము వృథా కాకుండా సులభ మార్గంలో, తేలిగ్గా పూర్తి అయ్యే పద్ధతి, మొదటి పద్ధతి. అంటే పన్ను తీయించుకోవడం. దౌడ లోపల వున్న మూలం (రూట్) తో సహా తీయించుకోవడం. తర్వాత పంటి కుదురు (టూత్ సాకేట్) పూర్తిగా మూసుకుపోయేవరకూ, అంటే పుండు పూర్తిగా మానిపోయేవరకు ఆగి, కట్టుడు పన్నును పెట్టించుకోవచ్చు. ఇది కూడా రెండు రకాలుగా ఉంటుంది. 1) కావలసినప్పుడు తీసి పెట్టుకునే సదుపాయం వున్నది (రిమూవబుల్ పార్షియల్ డెంచర్). 2) తీయడానికి వీలుకాని కట్టుడు పన్ను (ఫిక్సెడ్ పార్షియల్ డెంచర్). ఇది మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది. 1) పక్క పన్ను సహకారంతో కట్టుడుపన్ను (దీనినే బ్రిడ్జి వర్క్ అంటారు) 2) ఇంప్లాంట్స్ -ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది.

దవుడ లోని మూలం (రూట్) ఆధారంగా, పంటి నిర్మాణాన్ని కృత్రిమంగా పెంచి, దానిపై, కేప్ అమర్చడం మరొక పద్ధతి. ఇలా,ఏది అనుకూలమైతే,ఆ కృత్రిమ దంతం అమర్చుకోవడం మంచిది.

~

పిల్లలలో దంతధావనం పద్ధతి:

ప్ర: మా అబ్బాయి వయసు రెండున్నర సంవత్సరాలు. పాలపళ్ళు వచ్చాయి. అందుకని మామూలుగా ఉదయం బేబి బ్రష్‌తో, పళ్ళు తోముతున్నాము. అయితే, బాబు పేస్ట్ మింగుతున్నాడు. దీనివల్ల ప్రమాదమా? వివరించగలరు.

-మీనాక్షి. జె. మాసాబ్ ట్యాంక్,హైదరాబాద్.

జ: మీనాక్షి గారూ, పాలపళ్ళు రాగానే, పళ్ళు తోమించడం (దంతధావనం) అనేది చాలా మంచి అలవాటు. తరువాత రాబోయే స్థిరదంతాలు, జీవితాంతము వుంటాయి కనుక వాటికి, ఈ పాలపళ్ళు పునాదిరాళ్లుగా ఉంటాయి. అందుచేత పాలపళ్ళ సంరక్షణ కూడా చాలా అవసరమైనదే! చాలామంది, పాలపళ్లను – ఊడిపోయే పళ్లే కదా! అని పెద్దగా పట్టించుకోరు. కానీ, అది కరెక్ట్ కాదు.

తల్లి మార్గదర్శనంలో దంతదావనం

చిన్న పిల్లలకు వారి వయసును బట్టి, ప్రత్యేకమైన టూత్ బ్రష్‌లు, టూత్ పేస్ట్‌లు విపణిలో లభ్యం అవుతున్నాయి. అందుచేత, టూత్ బ్రష్ & పేస్ట్ వాడవచ్చును. అయితే చిన్నపిల్లలు, ఆ పేస్ట్ రుచిని బట్టి గాని, మరి ఏ ఇతర కారణం వల్ల గాని, బ్రష్ నోట్లో పెట్టగానే, పేస్ట్‌ను చప్పరించడమో, మింగడమో చేస్తుంటారు. అలా చేయడం వల్ల ప్రమాదం లేదు గానీ, నోట్లో లాలాజలంతో పాటు, అందులో కరిగిన పేస్ట్‌ను బయటకు ఉమ్మివేసే అలవాటును పిల్లలకు నేర్పిస్తే మంచిది. పిల్లలు త్వరగానే అలవాటు చేసుకునే అవకాశం వుంది.

పిల్లల పాలపళ్ళు సంరక్షణ విషయంలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు అభినందనీయం. అలాగే, పిల్లలకు సంవత్సరానికొకసారి ‘ముందస్తు దంత వైద్య పరీక్షలు’ చేయిస్తుండండి. దీనితో పాటు పిల్లల ‘డెంటల్ రికార్డు’ జాగ్రత్త పరచడం అలవాటు చేసుకోండి.

డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002

~

పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here