దంతవైద్య లహరి-7

19
11

[దంత సంరక్షణ కోసం డా. కె. ఎల్. వి. ప్రసాద్ గారు నిర్వహిస్తున్న ప్రశ్నలు జవాబులు ఫీచర్ – ‘దంతవైద్య లహరి’.]

దంతాలు – రంగు మార్పు

ప్ర: ప్రకృతి సిద్ధంగా పళ్ళు తెల్లగా ఉంటాయి కదా! కాలక్రమేణా దంతాలు తమ సహజ రంగు మార్చుకుంటున్నట్లు గమనిస్తాం. ఇలా దంతాలు రంగు మారడానికి కారణం వయసా? అశ్రద్ధయా? అలా రంగు మారిన దంతాలను తిరిగి మరలా తెల్లగా చేసే అవకాశం ఉందా? వివరించగలరు.

–విజయకుమార్ నల్లి, సఫిల్ గూడ, హైదరాబాద్.

జ: పళ్ళు – పళ్లల్లో జరిగే మార్పులు మీరు చాలా శ్రద్ధగా గమనిస్తున్నట్లు మీ సందేహం ఋజువు చేస్తున్నది. మీ సందేహం చాలా సబబుగా వుంది. అందరూ తెలుసుకోదగ్గదిగా వున్నది. ఈ సందర్భంగా ముందు మీకు అభినందనలు తెలియజేస్తున్నాను.

ఇక అసలు విషయానికి వస్తే, రంగు పళ్ళు గురించి చర్చించుకునే ముందు ‘తెల్లని పళ్ళు పళ్ళ ఆరోగ్యానికి చిహ్నం కాదు!’ అన్న విషయం తెలుసుకోవాలి. అలాగే తెల్లని పళ్ళు అందరికీ దంతసౌందర్యంలో పనికి రావని కూడా తెలియాలి.

ఇక, మొదట తెల్లగా వుండి తర్వాత రంగు మారడానికి చాలా మట్టుకు కారణం వృద్ధాప్యమే అని చెప్పక తప్పదు. అలా అని వయసు మళ్ళిన వారందరి పళ్ళు రంగు మారతాయనుకోవడానికీ లేదు! ఇలా వృద్ధాప్యంలో రంగు మారడం అంటే, సహజమైన పింగాణీ పొర (ఎనామిల్) అరిగిపోవడం. ఎనామిల్ తరువాతి పొర అయిన ‘డెంటీన్ పొర’ తెల్లగా లేకపోవడం. అంతేగానీ సహజంగా రంగు పోదు. అయితే ఈ వయసులో అందచందాలకు ప్రాముఖ్యత నిచ్చేవాళ్ళు తప్ప,మిగతా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు.. వయసుతోపాటు అదీ అనుకుంటారు.

ఇకపోతే, గర్భిణీ స్త్రీలు గాని, పాలిచ్చే తల్లులుగానీ, ఎదుగుతున్న చిన్న పిల్లలుగానీ, తెలియక లేక అవగాహన లేక కొన్ని రకాల మందులు, ముఖ్యముగా, టెట్రా సైక్లిన్ గ్రూప్ మందులు వివిధ కారణాల మూలంగా వాడడం వల్ల, ఆ పిల్లలకు వచ్చే పళ్ళు పసుపురంగులో వస్తాయి. ఇది అంతర్గతంగా ఏర్పడిన రంగు కనుక, పర్మనెంట్‌గా ఈ రంగును పోగొట్టే అవకాశం లేదు. కానీ ‘బ్లీచింగ్’ పద్ధతిలో కొంతవరకు రంగు మార్చగలిగినా, ఇది కూడా తాత్కాలికమే! పైగా, బ్లీచింగ్ అంటే, ఆమ్లాలతో చర్య కనుక, ఆమ్లాలలో, పంటి పింగాణీ పొర కరిగిపోయే గుణం కలిగినందున, ఈ చికిత్స మూలంగా ఇతర సమస్యలు ఎదురయ్యే సమస్య వుంది. పిల్లలు పెద్దయ్యాక పంటి తొడుగులు వేసుకోవడం తప్ప, రంగుపళ్ళను తిరిగి తెల్లగా మార్చే అవకాశం లేదు.

రంగు పళ్ళు రావడానికి మరో కారణం, గ్రామాలలో త్రాగేనీటిలో, ముఖ్యంగా బావి నీటిలో, ఫ్లోరిన్ శాతం అధికంగా ఉంటే కూడా స్థిరదంతాలు రంగుగా వచ్చే అవకాశం వుంది. ఇలాంటి పళ్ళను ‘ఫ్లోరోసిస్ పళ్ళు’ అంటారు. ఇవి చూడడానికి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటాయి. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో ఇది ప్రాముఖ్యతను సంతరించుకుని ఉంటుంది. అంటే ఇంకా వివరంగా చెప్పాలంటే, ‘పెళ్లి’ సమస్య అన్నమాట! దీనికి కూడా తాత్కాలిక చికిత్సలు తప్ప మరో మార్గం లేదు.

కొందరికి జన్యుపరంగా మొదటినుండీ రంగు పళ్ళు ఉంటాయి. ఇలాంటి వారికి కూడా అవసరం అనుకుంటే, పంటి తొడుగులు (జాకెట్ క్రౌన్స్) మాత్రమే ఉపయోగపడతాయి. డబ్బు వుండి సాహసం చేయగలిగితే, ఆధునిక చికిత్సా పరంగా అలాంటి రంగు పళ్ళు తీయించుకుని వాటి స్థానంలో ‘ఇంప్లాంట్స్’ చికిత్స చేయించుకోవాలి. ఇది హడావిడి చికిత్స కాదు, కాస్త సమయం తీసుకునే చికిత్స. ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి.

ఇకపోతే, కొందరు బద్ధకస్థులు, సరిగా దంతధావనం చేసికొనక పోవడం వల్ల పంటి ఉపరితలం మీద రంగు ఏర్పడే అవకాశం వుంది. అలాగే పంటికి-చిగురుకు మధ్య గార (గట్టిపడ్డ పాచి) పట్టే అవకాశం వుంది. ఈ పరిస్థితిని ‘స్కెలింగ్ & పాలిషింగ్’ చికిత్స ద్వారా మెరుగైన తెలుపు రంగులోనికి తీసుకుని రావచ్చును. శాస్త్రీయ పద్ధతిలో దంతధావనం చేసుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా జాగ్రత్త పడవచ్చు.

వయసు రీత్యా తెల్లని పళ్ళు వివిధ కారణాల మూలంగా రంగుమారితే వాటిని తిరిగి నూటికి నూరు శాతం తెల్లగా మార్చే శాశ్వత చికిత్సా విధానాలు లేవనే చెప్పాలి. భవిష్యత్తులో అలాంటి చికిత్సావిధానాలు కూడా రావాలని ఆశించడంలో తప్పు లేదనుకుంటాను.

~

పిల్లల్లో రెండు వరుసల్లో దంతాలు:

ప్ర: డాక్టర్ గారు, మా మనవడి వయసు పది సంవత్సరాలు. పళ్ళు సరిగానే తోముకుంటాడు. కానీ, ఇతర పిల్లలకు మాదిరిగా కాకుండా మా వాడికి క్రింది దౌడలో రెండువరుసల పళ్ళు వున్నాయి. ఇలా ఉండడం వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉందా? తెలియజేయగలరు.

సి. సుభాషిణి,కాచిగూడ, హైదరాబాద్.

జ: ఈ సమస్య కొద్దిమంది పిల్లల్లో కనిపిస్తుంది. ఇది పెద్దగా భయపడే అంశం కానే కాదు. అయితే పంటి పరిశుభ్రతకు, రెండు వరుసల పళ్లకు ఎలాంటి సంబంధము లేదు. కానీ, ఈ పరిస్థితి చూసిన పిల్లల తల్లిదండ్రులు తప్పక ఇదొక సమస్య అని భయపడటం సహజమే! ఎందుచేతనంటే సహజ పలువరుసకు, ఈ పలువరుసకు తేడా ఉండడమే!

సాధారణంగా పిల్లల దవుడల్లో ఒక్కొక్క వయసులో ఆయా పాలపళ్ళు రాలిపోయి, వాటి స్థానంలో పెర్మనెంట్ పళ్ళు వస్తాయి. జ్ఞానదంతాలు తప్ప మిగతా పళ్ళన్నీ పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేసరికి దౌడలో వచ్చేస్తాయి. ఇది సాధారణంగా జరిగే క్రియ. అయితే కొన్ని సాంకేతిక కారణాల మూలంగా ఊడవలసిన పళ్ళు ఊడకపోగా, రావలసిన స్థిరదంతాలు అవి రావలసిన సమయంలో వచ్చేయడం వల్ల దౌడలో, రెండు వరుసల పళ్ళు కనిపిస్తుంటాయి. ఇవి కొన్ని సమస్యలు సృష్టిస్తాయి. ముఖ్యంగా ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు, చిన్న చిన్న ఆహారపు అణువులు రెండు వరుసల పళ్ళ మధ్య ఇరుక్కుని, సరైన దంతధావనం లేకపోవడం మూలాన, ఆయా ఆహారపు అణువులు కుళ్ళి కృశించి పోవడం మూలాన, విపరీతమైన నోటి దుర్వాసన వచ్చే అవకాశం వుంది. అంతమాత్రమే కాదు, చిగుళ్లు వ్యాధిగ్రస్థమై చిగుళ్లు వాయడం, చిగుళ్లనుంచి రక్తస్రావం జరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే పిప్పిపన్ను వ్యాధి వచ్చే అవకాశం కూడా ఉంటుంది.

దీనికి చికిత్స ఊడని పాలపళ్లను తీయించేయడమే! చిన్నపిల్లలు కదా అని పన్ను తీయించడానికి ఎట్టి పరిస్థితి లోనూ వెనుకాడకూడదు. ఇలాంటి అదనపు పళ్ళు ఎంత త్వరగా తీసేస్తే అంత మంచిది!

అలాగే, కొందరి దౌడలు బహు చిన్నవిగా ఉండడం వల్ల, ఉండవలసిన పళ్ళన్నీ ఉండడం మూలాన దౌడలోని పళ్ళు రెండు వరుసల్లో కనిపిస్తాయి.

ఇక్కడ దౌడల కదలిక, రెండు దౌడల పళ్ళ కలయికలో ఇబ్బందులు వచ్చి ఆహరం నమిలే విషయంలో అసౌకర్యం కలగవచ్చు. అందుచేత ఇలాంటి వారు అవసరాన్నిబట్టి, ఆర్థోడాంటిక్ వైద్యం చేయించుకుని, ఈ సమస్యకు పరిష్కార మార్గం పొందవచ్చు.

పిల్లల్లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా, ప్రతి ఆరునెలలకొకసారి ముందస్తు దంతవైద్య పరీక్షలు చేయించాలి. అలా కాకపోయినా సంవత్సరానికి ఒకసారి దంతవైద్య పరీక్షలు చేయించాలి. ముఖ్యంగా ఇలాంటి ఆడపిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. దంతసంరక్షణ అనేది పాలపళ్ళు స్థాయి నుండే మొదలుపెట్టాలన్న విషయం విస్మరించకూడదు.

డా. కె. ఎల్. వి. ప్రసాద్, సివిల్ సర్జన్ (రిటైర్డ్), 9866252002

~

పాఠకులు తమ దంత సమస్యలకు సంబందించిన ప్రశ్నలు (ఎన్నైనా, ఇందులో ఎలాంటి నియమం లేదు) ‘సంచిక’ సంపాదకులకు kmkp2025@gmail.com అనే మెయిల్ ఐడికి, ప్రతి గురువారం లేదా అంతకంటే ముందు పంపవచ్చు. ప్రశ్నలు పంపేవారు విధిగా తమ పూర్తి పేరు, ఊరు, మొబైల్ నంబరు రాయాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here