దరి చేరిన హృదయాలు

32
6

[dropcap]చిం[/dropcap]తపల్లె దారిలో ఎర్ర బస్సు వేగంగా వెళ్తూ వుంది. కిటికీలోనుండి రివ్వున వీస్తున్న గాలిని ఆనందిస్తూ, వెనక్కి పరిగెడుతున్న పచ్చని పొలాలను, రోడ్డు పక్కలో వున్న ఎత్తైన పెద్ద చెట్లను చూస్తూ వూరు ఎంత దూరమో అనుకుంటూ, రోడ్ పక్కన వుండే మైలు రాళ్లకై కిటికీలో తల బయట పెట్టి చూడసాగాడు. ఎంతసేపు చూసినా ఒక్కటీ కనపడలేదు. ఇహ లాభం లేదనుకుని వెనక్కి చేరగిలబడి కళ్ళు మూసుకున్నాడు రాజశేఖర్.

కొద్ది సేపటికి, బస్సు పెద్దగా హారన్ కొడుతూ రోడ్డు పక్కన ఆగింది.

“సార్ మీరు దిగవలసిన ఊరు ఇదే” అని అరిచాడు కండక్టర్ రాజశేఖర్‌ని చూసి.

బస్సు తలుపు ఒక్క తన్ను తన్నితే గాని తెరుచుకోలేదు.

అందులోనుండి దిగగానే బస్సు వెనకాల గాలితో వచ్చిన దుమ్ము రాజశేఖర్‌ని కమ్మేసింది. కళ్ళలో పడిన దుమ్ము రుమాలుతో తుడుచుకుంటూ, మళ్ళీ దుమ్ము రేపుతూ వెళుతున్న బస్సుని చూసి, చూపు తిప్పి చింతపల్లె అనబడే ఆ ఊరిని పరికించాడు.

చుట్టూ దట్టమైన అడవి, దూరంగా ఒక వేపు ఎత్తైన కొండలు, ఇంకొక వేపు చిన్న చెరువు. దానికి పక్కలోనే ఎత్తైన గుడి గోపురం కనపడుతూ వుంది. దారి పక్కన ‘ఆంద్రా బ్యాంక్’ బోర్డు చూసాడు. ఈ మారుమూల ఇలాంటి చిన్న పల్లెటూర్లలో కూడా బ్యాంకు ఉన్నప్పుడు మన దేశం అభివృద్ధి చెందలేదంటే ఎలా అని నవ్వుకున్నాడు.

ఊరు వేపు నుండి ఒక పాత డొక్కు సైకిల్ తొక్కుకుంటూ వస్తున్న నడి వయసు వ్యక్తిని ఆపి “స్వామీ! ఇక్కడ బ్యాంకు మేనేజర్ చారి ఇల్లెక్కడ?” అని ప్రశ్నించాడు.

ఆ వ్యక్తి సైకిల్ దిగి వెనక్కి చెయ్యెత్తి చూపిస్తూ, “అలా.. ముందుకు వెళ్లి ఆ పక్కకు తిరగ్గానే రెండో ఇల్లు. కరణం గారి ఇల్లు అని అడగండి.. చూపిస్తారు బాబయ్య” అని చెప్పి మళ్ళీ సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు.

అతను చెప్పిన దారి వెంబడి బాబాయ్ ఇల్లు వెతుక్కుంటూ నడవసాగాడు. రోడ్ మీద ఎప్పుడో వేసిన తారు అంతా కొట్టుకుపోయి అంతా రాళ్ళమయం అయిపోయింది.

జాగ్రత్తగా నడుస్తూ కింద ఉన్న రాళ్ళను తప్పించుకుంటూ నడుస్తున్నాడు. ఇంతలో వెనుక నుండి ఒక అమ్మాయి అకస్మాత్తుగా సైకిల్ మీద గంట మోగించుకుంటూ చాలా వేగంగా వచ్చి రాజశేఖర్‌ను ఢీ కొట్టినంత పని చేసి పక్కనుండి అంతే వేగంగా ముందుకు వెళ్ళి “కాస్త పక్కగా నడవచ్చు కదా” అని చాలా కోపంగా చూస్తూ పోయింది.

ఆ చిన్న దారిలో ఇంకా పక్కకు ఎక్కడ నడవాలో అర్థం కాలేదు అతనికి. పోనీలే, రక్షించింది, ఇంకా నయం వెనకనుంచి కొట్టేసింది కాదు, అనుకుని ముందుకు అడుగులు వేశాడు.

పెద్ద వసారా వున్న ఇల్లు అది. పైన కూడా గదులు కనపడుతూ వున్నాయి. పెంకులతో వేసిన కప్పు. పైన గదుల చుట్టూ విశాలమైన డాబా కనపడుతూ ఉంది. ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ, ముందుగా ఎత్తయిన ఇనప గేటు కనిపిస్తూ ఉంది. లోపల ఒక వైపు ఆవులు గేదెలు కట్టేసి ఉన్నాయి. ఇంకోవైపు ఎండు గడ్డి, పచ్చి గడ్డి రాసులుగా వేసి ఉంది.

గేట్ పక్కలో పెద్ద బావి, దాని చుట్టూతా నీళ్లు నింపిన ఇత్తడి గంగాళాలు మెరుస్తూ వున్నాయి. ఆవరణ మొత్తం మామిడి, జామ, వేప చెట్లతో నిండి పోయి పచ్చగా ఉంది.

ఇంటి గుమ్మం ముందు తడకలతో కట్టిన పందిరి, దాని కింద నవారు మంచం మీద చేరగిల పడుకుని వున్న ఆరడుగుల పెద్దాయన లేచి నుంచుని రాజశేఖర్‌ను చూసి “ఎవరు బాబు మీరు? ఎవరు కావాలి?” అని అడిగారు..

“బ్యాంకు మేనేజర్ చారి గారి ఇల్లు ఇక్కడే అని చెప్పారు, అదే వెతుకుతున్నాను”అని చిరునవ్వుతో అన్నాడు.

ఆ పెద్దాయన మొహం విప్పారింది. “ఇదే బాబు. లోపలికి రండి. వారి ఇంటి తలుపు అటు వైపుగా వుంది. కానీ పరవాలేదు మన ఇంట్లో నుంచి కూడా వెళ్లొచ్చు” అని లోనికి దారి చూపాడు.

“థాంక్స్ అండీ” అంటూ అతను చూపిన వైపు నుండి బాబాయ్ ఇంట్లోకి దారి తీసాడు రాజశేఖర్.

“పిన్నీ” అంటూ కేకేశాడు లోనికి అడుగు పెడుతూనే.

“ఒరేయ్ రాజు” అంటూ ఆప్యాయంగా వచ్చి దగ్గరకు తీసుకుంది అరుణ.

లోపలి గది వైపు చూస్తూ “ఏమండీ మన రాజు వచ్చాడు, లోపల ఏం చేస్తున్నారు, రండి” అని భర్త ను పిలిచింది అరుణ.

“ఇదుగో వస్తున్నా” అంటూ పంచ సరి చేసుకుంటూ బయటకు వచ్చి రాజశేఖరాన్ని చూసి “ఏరా రాజు? అన్నా, వదినా బాగున్నారా? ముందుగా స్నానం చేసి రా” అని భార్యను చూసి “వాడికి ఒక కప్పు కాఫీ, నాకు అర కప్పు కాఫీ ఇచ్చేయి అర్జెంటుగా” అని ఈజీ చైర్‌లో చేరగిల పడ్డాడు కృష్ణమాచారి.

***

మరునాడు ఉదయం చారి, పిల్లలు, రాజు అందరూ కూర్చుని టిఫిన్ తింటూ ఉండగా, పక్క ఇంటిలో నుండి “అమ్మా కాలేజీ వెళుతున్నా” అని గంభీరంగా పెద్ద అరుపు వినిపించింది.

ఆ అరుపు విని ఒక క్షణం విస్తుపోయాడు రాజు.

“ఎవరు పిన్ని? మగాడిలా అరుస్తోంది” అని అడిగాడు.

“ఇంటి ఓనర్ పెద్ద కూతురు ఝాన్సీ, ఆ మాట తీరు అంతే.” అంది అరుణ పిన్ని అతి మామూలుగా.

“మరీ.. అబ్బాయి లాగా ఆ గొంతేమిటి, ఆ అరుపు లేంటి?” అన్నాడు నవ్వుతూ.

“వాళ్ళ నాన్నను చూసావుగా, ఆయనే కూతురిని అబ్బాయి లాగా పెంచాడు.” నవ్వుతూ అన్నాడు కృష్ణమాచారి.

కృష్ణమాచారి ఆఫీస్‌కు, పిల్లలు స్కూల్‌కు వెళ్ళిపోయాక, ఆ రోజంతా టీవీ చూస్తూ గడిపాడు రాజశేఖర్.

“అబ్బా!! పిన్ని! అప్పుడే సాయంకాలం అయ్యింది, నేనలా బయటకు వెళ్ళొస్తా” అని చెప్పి ఆ పల్లెలో జనాలను చూస్తూ ఊరి పొలిమేరల్లోకి చేరుకున్నాడు.

పొలాల్లో పనులు ముగించుకుని రైతులు, కూలీలు వెనుతిరిగి వస్తూ ఉన్నారు.

ఆ చిన్నని కాలి బాట వెంబడి గోవులు వస్తుంటే వాటి గోధూళి పైకి లేచి అస్తమిస్తున్న సూర్యుడి కిరణాలను కమ్మేస్తూ వుంది.

అలాగే ముందుకు నడుస్తూ, అసుర సంధ్య వేళలో పచ్చని పొలాల గాలి పీలుస్తూ, ముందు వైపు వస్తున్న కాలేజీ అమ్మాయిల గుంపును చూసి పక్కకు జరిగి నడవసాగాడు.

అంతలో వారి ముందు నుండి సైకిల్ నడుపుతూ రాజును సీరియస్‌గా ఓర చూపుతో చూస్తూ పక్కనుండి దాటి వెళ్ళి పోతూ ‘అబ్బో మేనేజర్ కొడుకు కదూ’ అనుకుంది ఝాన్సీ రాణి. కాస్త దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి ఆ అమ్మాయిని చూసాడు రాజు. సరిగ్గా అదే సమయానికి ఝాన్సీ కూడా వెనక్కి మరలి చూసింది. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. వెంటనే ఇద్దరు చటుక్కున తలలు తిప్పుకున్నారు..

‘అబ్బా… దొరికిపోయా’ అనుకున్నాడు రాజు.

‘అనవసరంగా వెనక్కు చూసా’ అనుకుంది ఝాన్సీ రాణి.

***

ఆ రోజు రాత్రి భోజనాల సమయంలో రాజశేఖర్, అరుణతో కాలేజీ విషయాలు చెప్పుతూ ఆగి “పిన్ని! ఇక్కడ కాలేజీ లేదా?”అని అడిగాడు.

“లేదురా, పక్కన రెండు కిలో మీటర్ల దూరంలో వున్న వూర్లో ఉంది, అందరూ అక్కడికే వెళ్లి వస్తూ వుంటారు., ఏ, ఎందుకు అలా అడిగావు” అర్థం కాక రాజు వేపు చూసింది అరుణ.

“ఏం లేదు పిన్నీ… సాయంత్రం కొందరు అమ్మాయిలు పక్క ఊరి నుండి వస్తూ కనిపించారు, అందుకని.” సమాధానం చెప్పాడు.

“అలాగా, అదే మన రంగారావు గారి అమ్మాయి ఝాన్సీ రాణి కూడా వెళ్లి వస్తుంది. అదేరా, సైకిల్ మీద వెళ్తూ పొద్దునే అరుస్తూ వుందే, ఆ అమ్మాయే” అని వివరించింది.

‘ఓహో.. పేరు ఝాన్సీ రాణి, మనిషికి తగిన పేరే’ అని మనసులో అనుకున్నాడు రాజశేఖర్.

***

“అత్తయ్యా!” అంటూ లోనికి రాబోయి రాజశేఖర్‌ను చూసి ఆగి పోయింది ఝాన్సీ.

ఒత్తుగా కాటుక దిద్దిన ఝాన్సీ కళ్ళను చూసి “రండి, లోపల వుంది పిన్ని” అన్నాడు.

ఏమీ సమాధానం చెప్పకుండా సరసరా వంటింట్లోకి వెళ్ళిపోయింది ఝాన్సీ. అంతలో ఝాన్సీ వాళ్ళ అమ్మగారు సుగుణ లోనికి వచ్చి రాజును చూసి “ఏం పేరు బాబు మీది, అమ్మా నాన్న ఎక్కడ ఉండటం?” అని కుశల ప్రశ్నలు వేసింది. చెప్పసాగాడు రాజు.

రాజు చెబుతున్న విషయాలన్నింటిని నుంచి ఆసక్తిగా వినసాగింది ఝాన్సీ రాణి.

“ఏం చదువుతున్నారు అత్తయ్య.. మీ అబ్బాయి” అని అడిగింది ఝాన్సీ.

”డిగ్రీ అయిపోయింది, ఎంఎస్సీకి వెళతాడు, కాలేజీ ఫస్ట్, డిస్టింక్షన్‌ పాస్ అయ్యాడు, చాలా మంచివాడు. నేనంటే బాగా అభిమానం, ప్రేమ” అంది అరుణ, ప్రేమ తొణికిసలాడుతున్న స్వరంతో.

“అలాగా అత్తయ్యా” అని తల ఊపింది ఝాన్సీ.

“చిన్నప్పటినుండి వాడికి చాలా పట్టుదల, బంధువులంటే ప్రేమ. సెలవులు వచ్చాయంటే చాలు, మా దగ్గరికి పరుగెత్తుకు వస్తాడు” అంది కాస్త గర్వంగా.

“సరే మళ్ళీ కాసేపటిలో వస్తా అత్తయ్యా” అంటూ వెళుతూ సోఫాలో కూర్చొని పేపర్ చదువుతూ వున్నరాజశేఖర్ వేపు ఒకసారి చూసింది.

తనను చూస్తున్న విషయం గమనించి అసలు ఝాన్సీ వేపు కళ్ళు తిప్పకుండా ఉండడానికి చాలా కష్టపడవలసి వచ్చింది రాజశేఖరానికి. పెద్ద కళ్ళు పైగా వాటికి నిండుగా కాటుక. చూపులు చాలా తీక్షణం, ఏదో తెలీని అందం, ఆకర్షణ రెండూ వున్నాయి ఈ పిల్లలో అనుకున్నాడు. అలా తనను గమనించకుండా కూర్చొని ఉండటం ఝాన్సీకి అసలు ఏమాత్రం నచ్చలేదు.

***

మరుసటి సాయంకాలం,సంధ్యా సమయంలో, హాల్ లో కూర్చుని టీవీలో పాటలు చూస్తున్నాడు రాజశేఖర్. ఆ సమయంలో రెండు పెద్ద టెక్స్ట్ బుక్స్ తీసుకుని ఝాన్సీ చెల్లెలు కాంతి వచ్చి “రాజు, నాకు ఫిజిక్స్‌లో ఇది అర్థం కావట్లేదు, చెబుతావా?” అని పుస్తకంలో ఒక పాఠం చూపించింది.

“సరే చెపుతాను కాంతి, కానీ నువ్వు నా కంటే చాలా చిన్నదానివి, అంటే దాదాపుగా ఆరు సంవత్సరాలు చిన్న, కదా? పెద్ద వారిని బహువచనంతో సంబోదించాలి. ఓకే?” అన్నాడు నవ్వుతూ.

“సరేనండి” అంది మొహం చిన్నబుచ్చుకుని.

పుస్తకం తీసి చెప్పటం మొదలు పెట్టాడు. దాదాపుగా రెండు గంటలు అలాగే గడిచిపోయాయి. పక్క వరండాలో నుండి అన్నీ వింటూ అతనికున్న పరిజ్ఞానానికి, వివరించే పద్ధతిని చూసి ‘అబ్బో, బాగా తెలివైనవాడే’ అనుకుంది ఝాన్సీ.

“ఇలా ఉంటే కష్టం, బాగా కృషి చెయ్యాలి కాంతి” అనునయంగా చెప్పాడు రాజశేఖర్.

“సరేనండి.” అని పుస్తకాలు సర్దుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది కాంతి.

***

ఇంతలో కరెంట్ పోయి ఇల్లంతా చీకటి అలుముకుని ఏమి కనపడలేదు రాజుకు. లేచి మెల్లిగా టార్చ్ లైట్ తీసుకుని కాండిల్స్ కొరకు వెతికాడు.

అవి దొరకలేదు కానీ లాంతర్ కనపడింది, దాన్ని తీసుకొచ్చి హాల్‌లో పెట్టి దాని గ్లాస్ పైకి లేపి అంటించడానికి ప్రయత్నించ సాగాడు. కానీ అది అంటుకోవటం లేదు.

ఎదురుగా వున్న తన ఇంటి వరండాలో నుండి ఇదంతా గమనిస్తున్న ఝాన్సీ, చక చకా నడుచుకుంటూ రాజశేఖర్ దగ్గరకు వచ్చి నిలబడింది.

తల వంచి దీపాన్ని సరి చేస్తూ వున్న రాజశేఖర్ తల ఎత్తి,ఝాన్సీని చూసి ఆశ్చర్యంతో పక్కకు జరిగాడు. లాంతర్ పక్కన కూర్చొని ఒడుపుగా దాన్ని సరి చేసి అగ్గి పుల్లతో వెలిగించి, సరిచేసి, చటుక్కున లేచి లాంతర్ పట్టుకెళ్లి ఎదురుగా వున్న టేబుల్ పైన పెట్టింది ఝాన్సీ.

కాస్త తమాయించుకున్న రాజశేఖర్ అప్పుడు లేచి నిలబడి “థాంక్యూ రాణి గారు”అన్నాడు

సన్నని దీపపు వెలుతురులో పెద్దగా విప్పారిన కాటుక కళ్ళ లోకి చూసాడు. ఆ కళ్ళ అందాన్ని చూస్తుంటే ఏదో తెలియని తీయని భావం కదిలింది రాజశేఖర్ మనసులో.

“నా పేరు ఝాన్సీ” అంది స్నేహపూర్వకంగా, ఎటువంటి భావాన్ని కనపడనీయకుండా జాగ్రత్త పడుతూ.

“అరెరే అలాగ, రాణి అనుకున్నాను, క్షమించండి” అన్నాడు మర్యాద పూర్వక చిరునవ్వుతో, మనసుని అదుపులో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తూ.

“పరవాలేదండి, ఎన్ని రోజులుంటారు?”అంది.

ఈ ప్రశ్నతో ఖంగు తిన్నాడు రాజశేఖర్. అది చూసి “మరేమి లేదు, నాకు కూడా కాస్త ఫిజిక్స్ చెబుతారేమో… అని అడిగాను.” అంది ఝాన్సీ ఈసారి కాస్త చిరునవ్వుతో.

నవ్వితే మంచి ఆకర్షణ ఉందీ అమ్మాయిలో అనుకుంటూ “రండి, రోజంతా ఖాళీనే కదా… సాయంకాలం అయితే బెటర్” చెప్పాడు.

“సాయంకాలం నాకు స్పోర్ట్స్ ట్రైనింగ్ ఉంటుంది. మరి ఏడు గంటలకు మీకు వీలు అవుతుందా?”

“స్పోర్ట్స్ ట్రైనింగ్ అంటే ?” అడిగాడు.

“కబడ్డీ, వాలీ బాల్… నేను జిల్లాలో ఫస్ట్” అంది కాస్త గంభీరంగా.

 “వెరీ నైస్, నేను స్ప్రింట్స్, అంటే పరుగు పందెంలో స్టేట్ రన్నర్‌ను  ” అని చెప్పి ఆపాడు రాజశేఖర్.

 గోడకు వొరిగి ఒక కాలు వెనక్కు మడిచి “ఎమ్మెస్సీ ఎక్కడ చేస్తారు ఇంతకీ” ఆసక్తిగా ప్రశ్నించింది.

లాంతర్ వెలుగులో, అలా అజంతా శిల్పం లాగ నిలబడ్డ ఝాన్సీని చూసి ‘ అందంగా వుంది’ అనుకున్నాడు మనసులో.

“యూనివర్సిటీ‌లో సీట్ వచ్చింది. అక్కడే హాస్టల్‌లో వుంటాను” ఏదో ఆలోచిస్తూ చెప్పాడు.

ఇంతలో కరెంటు వచ్చి లైట్లు వెలిగాయి.

“అన్నయ్యా” అంటూ ఇంట్లోకి రాజశేఖర్ తమ్ముడు, చెల్లెలు పరుగెత్తుకొచ్చారు. అరుణ లోనికి వస్తూ “అదేమిటి ఝాన్సీ నిలబడే మాట్లాడుతున్నావు కూర్చో, మీ ఇల్లే కదా” అంది నవ్వుతూ.

“పరవాలేదు అత్తయ్య, ఇప్పుడే వచ్చాను… వెళ్తాను మరి” అంటూ తన ఇంటి వేపు అడుగులు వేసింది ఝాన్సీ.

ఝాన్సీ వెళ్ళిపోయిన తర్వాత రాజశేఖర్ వేపు చూసి “అమ్మాయి అలా కాస్త మొరటుగా కనిపిస్తుంది గాని మనసు మంచిదే, అయితే… అన్నయ్యలు కాస్త రౌడీ మనుషులు రా, రాజా! కాస్త జాగ్రత్తగా ఉండాలి” అంది స్వరంలో చిన్నపాటి హెచ్చరికతో.

***

“ఈ రోజు సెలవే కదా, అందరం కలిసి ఓనర్ పొలానికి వెళదాం, అక్కడే వంట చేసుకుంటే ఇంకా బావుంటుంది” అంది అరుణ పిన్ని, రాజశేఖర్‌ను ఉద్దేశించి.

“సరే పిన్నీ, అక్కడ వంట ఏర్పాట్లు అవీ ఎలా?” ప్రశ్నించాడు రాజశేఖర్

“ఆ ఏర్పాట్లు, అవన్నీ మీ బాబాయి చేస్తారు. ఆఫీస్ నుండి పనివాళ్ళు వస్తారు. వాటికేమీ కష్టం లేదు, నువ్వు సరేనంటే ఒక మారు ఓనర్‌కు చేబితే సరిపోతుంది.” అని రాజశేఖర్ వేపు చూసింది. అంగీకారంగా తల ఊపాడు రాజశేఖర్.

“ఏమండీ, మీరు వెళ్లి రంగారావు గారికి చెప్పండి” అంది అరుణ భర్తను ఉద్దేశించి.

కాసేపటికి కృష్ణమాచారి తిరిగి వచ్చి,”ఏమోయ్, ఇటు విను, వాళ్ళు కూడా వస్తానంటున్నారు.” అన్నాడు అరుణను చూసి.

“మంచిదే…ఇంకో గంటలో బయలుదేరదాం” అంది.

ఇంటి గేట్ ముందు జీపులో కుటుంబం అంతా కూర్చున్నారు.

“ఇంకా స్థలం వుంది, ఝాన్సీ!! ఎవరైనా రండి” అంది అరుణ, ఝాన్సీని చూసి.

ఝాన్సీ వస్తుందని అనుకుంటూ అటువైపుగా చూడసాగాడు రాజశేఖర్, కానీ కాంతిని చూసి “నువ్వెళ్లు జీపులోకి” అంది ఝాన్సీ.

“మరి అయితే మీరు?” అడిగాడు ఝాన్సీని ఉద్దేశించి రాజశేఖర్.

“నేనా?… నేను రాను” అంది పెద్ద కళ్ళతో రాజశేఖర్‌ని సీరియస్‌గా చూసి.

‘ఏమిటో ఈ అమ్మాయి, అగమ్య గోచరం’ అనుకుని జీప్ ఎక్కి కూర్చున్నాడు రాజశేఖర్.

రంగారావు కుటుంబం అందరూ ఎడ్ల బండిలో కూర్చున్నారు. జీప్ స్టార్ట్ అయ్యింది. వెనక్కు చూసాడు రాజశేఖర్. ఝాన్సీ గేట్ బయట నిలబడి రాజశేఖర్ వేపు చూస్తూ నిలబడి వుంది.

***

గతుకుల మట్టి రోడ్ మూలాన జీప్, ఎడ్ల బండి రెండూ కూడా మెల్లిగా వెళ్ళసాగాయి. దారికి ఇరువైపులా వున్న పచ్చని పొలాల మీదుగా చల్లని గాలి వీస్తూ వుంది. అక్కడక్కడా రైతులు పొలంలో మందులు పిచికారీ చేస్తున్నారు.

కాస్త దూరంగా ఎడమ వేపు వున్న చిన్న కాలిబాట మీదుగా వేగంగా సైకిల్ తొక్కుతూ వస్తున్న ఝాన్సీను చూసాడు రాజశేఖర్. చిన్నగా చిరునవ్వు వెలిసింది రాజశేఖర్ మొహంలో.

రంగారావు గారి తోటలో, మామిడి చెట్ల కింద నులక మంచాలు వేసి ఉంచారు. మరికొద్ది దూరంలో ఒక పక్కగా ఈత చాపలు పరిచి వున్నాయి. మరొపక్కన పెద్ద కట్టెలతో పొయ్యిలు పెట్టి, కొందరు పనివాళ్ళు వంట పనులు మొదలు పెట్టారు.

ఒక చెట్టుకు కొబ్బరి తాళ్లతో పొడవాటి ఊయలలు కట్టి వున్నాయి. తోటకు మరొక వైపు ఖాళి ప్రదేశంలో వాలీ బాల్ కోర్ట్ కూడా ఉండటం గమనించాడు రాజశేఖర్.

బాబాయి ఒక కుర్చీలో కూర్చొని న్యూస్ పేపర్ చదవటం మొదలు పెట్టాడు.

కాసేపటికి రంగారావు వచ్చి అరుణ ముందు కూర్చొని “అవునమ్మా చెల్లెమ్మా, ఇంతకు మీ అబ్బాయి ఏం చేస్తున్నట్లు?” అని మాటలు కలిపాడు. ఆ తర్వాత వాళ్లిద్దరూ కుటుంబ విషయాలు మాట్లాడుతూ ఉండిపోయారు.

ఝాన్సీ మాత్రం వీరున్న వైపు రాకుండా తోటలో వుండే పనివాళ్లను ఆజమాయిషీ చేస్తూ కనిపించింది. ఝాన్సీ చెల్లెలు కాంతి వచ్చి రాజశేఖర్‌తో తన స్కూల్ విశేషాలు ఆగకుండా చెప్పటం మొదలెట్టింది. వాటికి వూ కొడుతూ తన ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచించ సాగాడు.

అంతలో ‘పాము పాము’ అంటూ అరిచారు కొందరు పిల్లలు. అప్పుడే అటుగా వస్తున్న ఝాన్సీ అది చూసి “మీరంతా కాస్త దూరంగా వెళ్ళండి, అది తన దారిలో తాను వెళ్ళిపోతుంది.” అంది ఎటువంటి కంగారు లేకుండా.

“అది త్రాచు పాము లాగ వుంది, పట్టడం.. చంపటం చేయరా?” కుతూహలంగా ప్రశ్నించాడు రాజశేఖర్.

రంగారావు లేచి నిలబడి “లేదు బాబు. ఎన్నని చంపుతాము. అవి వుండే ప్రదేశాలే ఇవి. అవేమి మన వెంట పడి వేటాడి చంపవు.  వాటికి దూరంగా ఉంటే చాలు, పొరపాటున కాలు, చెయ్యి వాటి దగ్గరకు వెళ్లకూడదంతే, పంటలను నాశనం చేసే ఎలుకలను అవి పట్టుకుంటాయి. అవి మాకు మేలు చేసినట్టే.” అని నవ్వాడు.

అంతలో ఆ పాము కనపడకుండా వెళ్లిపోయింది. అందరూ వంట పనిలో మునిగి పోయారు.

ఝాన్సీ వెళ్లి అన్నయ్యలతో, అక్కడున్న అబ్బాయిలతో సమానంగా ఊయల ఎక్కి చాలా వేగంగా పైపైకి ఊగ సాగింది. అది చూసి ‘ఈవిడ లేడీ జేమ్స్ బాండ్’ అనుకున్నాడు రాజశేఖర్.

అలాగే నులక మంచంపై పడుకుని నెలలో పది రోజులు అర్ధాకలితో పడుకునే తన కుటుంబం గురించి ఆలోచించ సాగాడు.

కొద్దిసేపటికి “వాలీ బాల్ ఆడదామా?” అని పిలిచింది ఝాన్సీ. ఎవరూ సమాధానం చెప్పలేదు.

మంచం పై నుండి లేచి ఝాన్సీని చూసి నేను రెడీ అన్నట్లుగా సైగ చేసి అటు వైపుగా నడిచాడు రాజశేఖర్.

జిల్లామొత్తం వాలీబాల్ మొదటి స్థానం టీమ్‌లో వున్న తనతో, ఇతను ఏం ఆడతాడులే అనుకుంటూ మొదలు పెట్టింది ఝాన్సీ. కానీ కాసేపట్లోనే అనుకున్నంత ఆషామాషీ కాదని, అతను కూడా మంచి వాలీ బాల్ ఆటగాడు అని అర్థం అయ్యింది.

చాలా సులువుగా, ఎక్కడా అలసట లేకుండా ఆడటం చూసి విస్మయానికి గురయ్యింది. ఒక గంటలో దాదాపుగా ఓడిపోయినంత పనయ్యింది ఝాన్సీకి.

ఆఖరున రాజశేఖర్ ఓడిపోయినప్పటికీ అతను కావాలనే గేమ్ వదిలేసినట్లుగా, అనుమానం వచ్చింది ఝాన్సీకి. అంత బాగా ఆడుతున్నవాడు ఆఖరున ఎందుకలా గేమ్ వదిలేశాడు అని చాలాసేపు ఆలోచించింది.

“వంట అయ్యింది, అందరూ రండి” అంటూ ఝాన్సీ అమ్మగారు పిలిచిన పిలుపు వినపడి ఆట చాలించారు.

మధ్యాహ్న భోజనాల తర్వాత అందరూ రక రకాల ఆటలు ఆడుతున్నప్పటికీ ఝాన్సీ మాత్రం పని వాళ్ళతో కలిసి తోట పనిలో మునిగి పోయింది.

ఝాన్సీ రాలేదు కానీ అన్నయ్యలు, పని వాళ్ళతో కలిసి రాజశేఖర్ కబడ్డీ ఆడాడు.

సాయంకాలం అందరూ కాఫీలు త్రాగి తిరుగు ప్రయాణం కొనసాగించారు. ఈ సారి రాజశేఖర్ వెళ్లి ఎడ్ల బండి ఎక్కాడు. అది గమనించిన ఝాన్సీ తాను సీరియస్‌గా వెళ్లి అరుణను చూసి “అత్తయ్యా! నేను జీప్‌లో వస్తా” అని జీప్‌లో కూర్చొని రాజశేఖర్‌ను చూసి నవ్వింది..

ఝాన్సీ కేసి కాసేపు చూసి “అయితే నేను మీ సైకిల్‌పై వస్తానండి” అని బండి దిగి సైకిల్ చేతిలోకి తీసుకున్నాడు రాజశేఖర్.

“అది మీ ఇష్టం” అంది రాజశేఖర్ కళ్ళ లోకి కళ్ళార్పకుండా సూటిగా చూస్తూ.

“అయితే నేను కూడా సైకిల్ మీద వస్తా.” అంటూ వచ్చింది ఝాన్సీ చెల్లెలు కాంతి.

“పదమ్మ, మనిద్దరం సైకిల్ మీద వెళదాం” అంటూ కాంతిని ముందు కూర్చోపెట్టుకుని సైకిల్ ముందుకు ఉరికించాడు రాజశేఖర్.

***

అరుణ పిన్ని ఇంట్లో హడావిడిగా వుంది. కృష్ణమాచారి ఆఫీస్‌కు వెళ్లిపోయారు. ఆలస్యమైపోయిందని పిల్లలు స్కూల్‌కు వెళ్ళటానికి బ్యాగ్స్ తీసుకుని పరుగెత్తారు.

హాల్‌లో కూచొని చూస్తే రంగారావు గారి ఇంట్లో కూడా కాంతి స్కూల్‌కు వెళ్ళటం కనిపించింది రాజశేఖర్‌కు. ఝాన్సీ కాలేజీకి వెళ్లకుండా ఇంట్లో పనులు చేస్తూ తిరగటం చూస్తున్నాడు.

రాజశేఖర్ తననే చూడటం గమనించి వెంటనే హాల్‌లో నుండి పక్కకు తప్పుకుంది ఝాన్సీ. కాసేపటికి ఎటూ తోచక ఏదో పని వున్నట్లుగా మళ్ళీ హాల్ లోకి వచ్చి ఓరకంట రాజశేఖర్‍ను చూసింది.

కానీ అక్కడ అతను కనిపించలేదు. ఇంకో గదికి వెళ్లి అక్కడ పక్కనున్న కిటికీలో నుండి అటూ ఇటూ చూసింది. ఎక్కడా జాడ లేదు. ఏమైపోయాడబ్బా అనుకుంటూ వెను తిరిగింది.

గుమ్మం ముందు రాజశేఖర్ నవ్వుతూ నిలబడి వున్నాడు. కంగారుపడి పోయింది ఝాన్సీ.

ఇంతలో “ఏమండి మిమ్మల్నే” అన్న పిలుపుతో ఉలిక్కి పడింది ఝాన్సీ.

ముందు తలుపు దగ్గర నిలబడి “ఏమండీ పిన్ని మిమ్మల్ని రమ్మంటోంది” అన్నాడు రాజశేఖర్.

“ఇదుగో వస్తున్నా” అంటూ తత్తరపాటుతో సమాధానం ఇచ్చింది ఝాన్సీ. భలేగా దొరికి పోయాను అనుకుంది ఝాన్సీ.

ఝాన్సీ కంగారు చూసి కనుబొమలు మడిచి, అర్థం కాక వెనుతిరిగాడు రాజశేఖర్.

ఆ రోజంతా పిన్నితో వంట ఇంట్లో పిండి వంటలు చేయటంలో సహాయం చేస్తూ ఉండి పోయింది ఝాన్సీ. ఒక్క మారు అయినా తాను లోపలి వస్తాడేమో అని ఎదురుచూసింది,. కానీ రాజశేఖర్ హాల్‌లో, సోఫా పైన పడుకుని పుస్తకాలు చదవటంలో మునిగి పోయాడు.

ఆ రోజంతా మనసంతా ఏదో తెలీని నిరుత్సాహంగా అనిపించింది ఝాన్సీకి. సాయంకాలం గ్లాస్ నిండా పాలు తెచ్చి అరుణకు ఇచ్చింది ఝాన్సీ.

“ఒరే రాజు ఇదిగో ఇవి నువ్ తాగెయ్యి, పిల్లలకు ఆల్రెడీ కలిపి వుంచాను” అంటూ అరుణ ఆ గ్లాస్ రాజశేఖర్ చేతిలో పెటింది.

తీసుకుని తాగి చూసాడు రాజశేఖర్. చాలా చిక్కగా రుచికరంగా వున్నాయి. తన ఇల్లు, అక్కడ తాగే పలచటి టీ గుర్తొచ్చి మనసంతా మూగగా రోదించింది.  అసలు పాలు అంటూ తాగి ఎన్నిరోజులు అయ్యిందో? అనుకున్నాడు రాజశేఖర్.

తన చదువు అయిపోయి పెద్ద వుద్యోగం దొరికితే గాని ఇంట్లో అందరూ రెండు పూటలా భోజనం చేయటం కుదిరే పని కాదు అనుకున్నాడు.

తాను తెచ్చిన పాలు రాజశేఖర్ తాగటం చూసి తృప్తిగా నవ్వుకుంటూ తన ఇంట్లోకి వెళ్ళిపోయింది ఝాన్సీ. ఇది గమనించిన చారి బాబాయి భృకుటి ముడిచి ఆలోచనలో పడ్డాడు.

రాజశేఖర్ పాలు త్రాగి గ్లాస్ కింద పెట్టి మళ్ళీ నవల చదవటంలో మునిగి పోయాడు.

రాత్రి భోజనాలయ్యాక పడక గదిలో “చెల్లెలి పెళ్లి వివాహ నిశ్చయం అయ్యిందట, ఖర్చులకు, ఆర్థిక సహాయం అడగటానికి వచ్చాడు రాజు.” అంది అరుణ తన భర్తతో.

“తెలుసు, అన్నయ్య ఉత్తరం వ్రాసాడు.” అన్నాడు ముభావంగా కృష్ణమాచారి.

“ఇంకా సమయం ఉందిగా అలోచించి, మనకెంత వీలవుతోందో చూడండి, మనం గాక వారికి ఇంకెవరు ఇస్తారు… అదీగాక మన పెళ్లి.. ఆ రోజుల్లో మీ అన్నగారే కదా జరిపించడం” అంది బాధ్యత కలిగిన స్వరంతో.

“నాకవన్నీ తెలుసు కానీ… నువ్ పడుకో. నాకు నిద్దరొస్తోంది” అని మరో వేపు తిరిగి పడుకున్నాడు కృష్ణమాచారి.

6

ఇంటి ఆవరణలో ఆరు బయట నవారు మంచం మీద పడుకొని నల్లటి వినీలాకాశం, మెరుస్తున్న చుక్కలను చూస్తూ వున్నాడు రాజశేఖర్.

అంతలో కాస్త ప్రక్కగా రంగారావు కూడా మంచం ఏర్పాటు చేసుకుని మేను వాల్చి, రాజశేఖర్ వైపు చూసి “నాకు ఇలా బయట ప్రకృతిలో ఈ చల్లని గాలిలో పడుకోవటం ఇష్టం బాబు. మరి నువ్వేంటీ ఎయిర్ కూలర్ లేకుండా…. ఇలా అలవాటేనా?”అడిగాడు.

“అవేవి మాకు అలవాటు లేదండి. ఇలా ఆరు బయట హాయిగా నిద్రపోవటమే మాకు తెలిసింది.” అని సమాధానం చెప్పి నవ్వుకున్నాడు.

రంగారావు పల్లెటూరి రాజకీయాల గురించి చెప్పసాగాడు. వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా ఝాన్సీ వచ్చి కాస్త దూరంగా వున్న ఇంకో నులక మంచం మీద కూర్చొని వినసాగింది. అది చూసి పడుకున్నవాడు కాస్త లేచి కూచున్నాడు రాజశేఖర్. చుట్టూ పిండార పోసినట్లున్న వెన్నెల, చిన్నగా కీచురాళ్ళ చప్పుడు. దూరం నుంచి చిన్నగా గుడిలో భజన వినపడుతూ ఉంది.

తననే తదేకంగా చూస్తున్న ఝాన్సీ కేసి చూసాడు రాజశేఖర్. ఝాన్సీ కళ్ళలో అనిర్వచనీయమైన భావం గమనించాడు.

కాసేపు ఇద్దరు అన్నీ మరచిపోయి ఉండిపోయారు. ఒక క్షణం తర్వాత కళ్ళు దించుకుంది ఝాన్సీ. తను కూడా చూపులు మరల్చుకుని మళ్ళీ ఝాన్సీ కేసి చూసాడు. ఈసారి చూపులు కలిపిన రాజశేఖర్‌కు ఝాన్సీ మొహంలో చిరునవ్వు కనిపించింది. మళ్ళీ మళ్ళీ ఝాన్సీ కాటుక కళ్ళలోకి చూసాడు. అది చూసి కెరటంలా ఎగిసి పడ్డ మనసుని అదుపు చేసుకుంటూ, చటుక్కున లేచి ఇంట్లోకి వెళ్ళిపోయింది ఝాన్సీ.

వెళుతూ వెనక్కి చూసిన ఝాన్సీకి చిన్నగా చేయి లేపి గుడ్ నైట్ చెప్పాడు రాజశేఖర్.

మంచం పైన దిండు సరి చేసుకుని తల వాల్చి, చుట్టూ ముసురుకున్న ఝాన్సీ ఆలోచనలతో చాలా సేపటి తర్వాత నిద్ర పట్టింది రాజశేఖర్‌కు.

తన గదిలో ఝాన్సీకి చాలా సేపు నిద్ర పట్ట లేదు.

***

చటుక్కున ఎవ్వరో పిలిచినట్లుగా అనిపించి నిద్రలోనుండి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసాడు రాజశేఖర్. వెచ్చటి నీలాకాశం, ఎదురుగా పెద్దగా విప్పారిన కాటుక కళ్ళతో, ఇంకా తడి ఆరని వదులుగా వదిలేసిన శిరోజాలు, లేత నీలి రంగు పోచంపల్లి చీరలో, నవ్వుతూ “గుడ్ మార్నింగ్ రాజా గారు” అంది ఝాన్సీ.

ఏమి అర్థం కాక కళ్ళు నులుముకుని చూసాడు రాజశేఖర్, ఆకాశం నుండి అప్పుడే దిగి వచ్చిన అప్సరస లాగ అనిపించింది.

“తెల్లగా తెల్లవారి పోయింది, కళ్ళాపి చల్లటానికి ఇదుగో పనివాళ్ళు ఎదురు చూస్తున్నారు. అందుకే లేపాల్సి వచ్చింది.” అంది మనోహరంగా చూస్తూ ఝాన్సీ.

చుట్టూ చూసాడు, ఎండ వచ్చేసింది. “సారీ, ఏమిటో బాగా నిద్ర పట్టేసింది” అని కాస్త సిగ్గుపడుతూ లేచి పరుపులు చుట్టేసి, మంచం తీసి పక్కకు పెట్టి ఇంట్లోకి అడుగులు వేశాడు రాజశేఖర్.

“ఇంత సేపు నిద్రా? సోమరి రాజు!!” అంటూ కిల కిలా నవ్వసాగింది కాంతి.

చేయి లేపి కొట్టడానికన్నట్లుగా వెళ్ళాడు రాజు.

“అమ్మా!!” అంటూ కేక పెట్టి, బిగ్గరగా నవ్వుతూ దూరంగా పరుగెత్తింది కాంతి.

అది చూసి ఆనందిస్తూ బయటకు పొలం వేపు దారి తీసాడు రంగారావు.

***

స్నానం, పూజ, టిఫిన్ పూర్తి చేసుకుని, హాల్‌లో కూర్చొని ఝాన్సీని చూడాలనిపించి పక్కన గది వేపు చూపులు సారించాడు రాజశేఖర్.

ఇంట్లో పనులు చేసుకుంటూ రాజశేఖర్ చూస్తున్న గదిలోకి అప్పుడప్పుడూ వచ్చి, ఒకసారి ఓరగా కళ్ళు కలిపి అతడి కళ్ళలో భావాలను చదవటానికి ప్రయత్నిస్తూ వెళ్ళిపోతూ వుంది ఝాన్సీ.

మొదటి సారి అతడి మనసులో అత్యంత మధురమైన అనుభూతి కలిగింది. అదే సమయానికి రేడియోలో ‘మధుర భావాల సుమ మాల మనసులో పూచే ఈ వేళా’ అనే పాట వినపడసాగింది.

కొద్దిసేపటికి ఝాన్సీ పెద్దగా “అమ్మా.. నేను చెరువు గట్టు అమ్మోరి గుడికెళ్ళి వస్తా” అని చెప్పి సైకిల్ తీసుకుని బయటకు వెళ్ళటం చూసాడు రాజశేఖర్.

లేచి ముందు తలుపు వద్దకు వచ్చి “నేనూ వస్తా, వుండండి.” అని వంటింట్లోకి వెళ్లి పిన్నికి చెప్పి ఝాన్సీ వేపు నడిచాడు.

“ఊరిలో అందరూ మనం కలిసి వెళ్ళటం చూస్తే బావుండదు. మీరు వెళ్ళండి నే వస్తా” అన్నాడు.

“మా ఊరిలో అలాంటి భయాలు అక్కరలేదు రండి.” అంది ఝాన్సీ ఎటువంటి సంకోచం లేకుండా.

గుడికి చేరుకోవటానికి ఎక్కువ సమయం పట్టలేదు. గుడి, చెరువుకి ఆనుకుని ఉంది. అక్కడ నుండీ కాస్త దూరంలో వూరు కనపడుతూ ఉంది. చెరువు పక్కన చూస్తే కనుచూపు మేర పచ్చని పంట పొలాలు కనపడుతూ వున్నాయి. వాటి పై నుండి వీచే చల్లని గాలి ఒంటికి తాకుతూ మనసుకు హాయి గొలుపుతూ ఉంది.

“ఈ రోజు ప్రకృతి ఎంత బాగా ఉంది కదా?!!” అన్నాడు రాజశేఖర్, ఝాన్సీని మొదటి సారి చాలా దగ్గర నుండీ చూస్తూ.

చుట్టూ కలయ చూసి “రోజులాగే ఉంది. మాకైతే ఏమీ తేడా తెలీటం లేదు” అంది ఝాన్సీ నవ్వి.

చుట్టూ వున్న అందమైన రమణీయ దృశ్యాన్ని చూస్తూ కాసేపు మైమరచి పోయాడు రాజశేఖర్.

“అయ్యా, మీరు ఈ లోకం లోకి వస్తే మనం గుడిలోకి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు” అంది కిలకిలా నవ్వుతూ.

అంత కలగలుపుగా నవ్వటం చూసి ‘ఎంత అందంగా వుంది నవ్వితే’ అని అనుకున్నాడు.

నవ్వటం ఆపి “బాబూ ఏమిటంత ఆనందం? పదండి కాసేపైతే మధ్యాహ్నం గుడి తలుపులు వేసేస్తారు” అంది.

జడ వేసుకోకుండా, చిన్న ముడి వేసిన తడి ఆరని వెంట్రుకలు, కాటుకతో నిండిన కలువ రేకుల్లాంటి కళ్ళను చూసి రాజశేఖర్ హృదయంలో ఝాన్సీ రూపు నిండిపోసాగింది. మంత్రముగ్ధుడిలా ఝాన్సీ వెనకాలే అడుగులు వేసాడు.

అమ్మోరికి పూజలు చేసిన తర్వాత గుడి బయటకు వచ్చి చెప్పులు వేసుకుని “ఇంక వెళదామా?” అని అడిగాడు.

“సరే, కానీ.. కాసేపు గుడిలో, పరిసరాల్లో కూచోవటం మన సంప్రదాయం” అంది చిన్న పిల్లాడికి చెప్పినట్లుగా… కళ్ళతో నవ్వులు కురిపిస్తూ. చెరువుకు ఆనుకుని వున్న పిట్ట గోడ పైన కూర్చున్నారిద్దరు.

“మీ కుటుంబ విషయాలు చెప్పండి.” అంది రాజశేఖర్ జీవితాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ.

“మాది మధ్య తరగతి జీవితం, మా నాన్నగారు వార్తాపత్రికకు విలేఖరి, …జర్నలిస్ట్.” అన్నాడు బరువుగా నిట్టూరుస్తూ.

“ఇంకా?” కుతూహలంగా ప్రశ్నించింది.

“నేనే పెద్దవాడిని, ఇద్దరు తమ్ముళ్లు ఇద్దరు చెల్లెల్లు.” అన్నాడు బరువుగా.

“మీ హాబీస్ ఏమిటట?” అతడి స్వరంలో బాధను తగ్గించటానికి ప్రయత్నిస్తూ, టాపిక్ మార్చింది.

“స్పోర్ట్స్, గేమ్స్, మ్యూజిక్, రీడింగ్” చెప్పాడు నవ్వుతూ.

“అబ్బో!…..చాలా?” గలాగలా నవ్వింది ఝాన్సీ. ఆ నవ్వు చూసి రాజశేఖర్ గుండె లయ తప్పింది. ఉవ్వెత్తున ఎగసి పడే మనసుని అదుపు చేసుకుంటూ రెండు చేతులు వెనక్కి ఆనించి పైకి చూస్తూ కూర్చున్నాడు.

రాజశేఖర్‌ని చూసి ‘అన్నీ మంచి విషయాలే వున్నాయి ఇతనిలో.. ఎక్కడా తన పరిమితులు దాటడు!’ అనుకుంది. అక్కడ మౌనం తాండవించింది. కానీ ఇద్దరి మనసులు మౌనంగా ముచ్చటించుకున్నాయి. ఇద్దరికీ కూడా అక్కడనుండి లేవాలనిపించలేదు.

“గుడి మూసేసి చాలా సేపు అయ్యింది, వెళదామా?” అడిగింది ఝాన్సీ.

“వెళదాం రాణి, జస్ట్ కొద్ది సేపుండి” అభ్యర్థనగా అన్నాడు.

“సరే” అంది. నిజానికి ఝాన్సీ మనసులో కూడా కాసేపు రాజశేఖర్‌తో గడపాలనే ఉంది.

“మీరు వుండే ఇల్లు ఎన్ని గదులు?” అడిగింది ఏమీ తోచక.

“మొత్తానికి మూడే గదులు, అద్దె ఇల్లు కదా, అంతే.” అన్నాడు కాస్త నిరాశగా

“స్వంత ఇల్లెక్కడ ఇంతకీ?”

“స్వంత ఇల్లు లేదండి. మా బాబాయిని చూసి, మేము కూడా వున్న వాళ్ళం అనుకోకండి” అన్నాడు కాస్త బాధగా. మళ్ళీ కాసేవు మౌనంగా వున్నారిద్దరు.

“ఇప్పుడు ఏం చేద్దామని అనుకుంటున్నారు?” అన్నాడు రాజశేఖర్ ఝాన్సీ కేసి తిరిగి.

“డిగ్రీ కాలేజీ పక్క వూర్లో, కానీ దూరం కదా… రోజూ వెళ్లి రాలేను… అక్కడే రూమ్ తీసుకుని ఉండాల్సి రావచ్చు” అంది భవిష్యత్తును అంచనా వేస్తూ.

“తప్పనిసరిగా చదవండి, ఎంత ఇబ్బంది అయినా సరే. చదువు కొనసాగించాలి” అన్నాడు.

అది విని ఝాన్సీ మనసులో ధైర్యం ఇనుమడించింది. చెట్టు పైనుండి పున్నాగ పూలు పడుతూ వున్నాయి. ఆ ప్రదేశమంతా వాటి సువాసనతో నిండి పోయింది. చల్లని గాలి చెరువు మీదినుండి వీస్తూ వుంది.

ఝాన్సీ తన కాళ్ళు మడిచి, మోకాళ్ళ పైన గడ్డం ఆనించి, చెరువు కేసి చూడసాగింది. అలా కూర్చున్న ఝాన్సీని చూసి పట్టు తప్పుతున్న తన మనసుని అదుపులో పెట్టుకుంటూ “ఏమిటి ఆలోచిస్తున్నారు” అని ప్రశ్నించాడు రాజశేఖర్.

“మీ చదువు ఇంకా రెండు సంవత్సరాలుగా?” అడిగింది మోకాళ్ళ మీద నుండి తల తీయకుండా.

“అంతే కదా” సమాధానమిచ్చాడు భవిష్యత్తు గురించి, ఇంటి గురించి ఆలోచిస్తూ.

“మీరెందుకు అప్పుడప్పుడూ ఉన్నట్టుండి చాలా బాధగా వుంటారు?” కనుబొమలు ముడిచి అడిగింది.

మొహంలో బాధ కనపడనీయకుండా చిన్నగా చిరునవ్వు నవ్వి,చెప్పాడు “మా అమ్మ, నా ఇంటి పరిస్థితి, నా బాధ్యత గుర్తుకొస్తాయి” అన్నాడు.

“మీరు మంచి తెలివైనవారు, మీకు మంచి భవిష్యత్తు వుంది, బాధ పడకండి” ధైర్యం చెప్పింది ఝాన్సీ.

“అంతేనంటారా” అని నవ్వేసాడు రాజశేఖర్.

ఎంత నిర్మలంగా ఉంటాడు, ఇతనితో జీవితమంతా కలిసి ఉంటే ఎలా ఉంటుందో,అనుకుంది ఝాన్సీ.

“ఇంక వెళదాం”అని లేచి నిలబడింది ఝాన్సీ.

తాను కూడా లేచి నిలుచున్నాడు రాజశేఖర్.

“రేపు మధ్యాహ్నం పొలం వెళ్తాను… మీరు వస్తారా?” పిలుస్తున్నట్లుగా అంది ఝాన్సీ.

“చాలా దూరం కదా? ఎలా వెళ్ళటం?”

“నా సైకిల్ ఉందిగా” అంది చిలిపిగా నవ్వుతూ

“మీరా? నేనా?… ఎవరు నడపటం” అన్నాడు ఇంకా కొంటెగా చూస్తూ.

“మీరే, మగ హీరో కదా” అంది చిలిపిగా.

“సరే, అలాగే కానిద్దాం” అని నవ్వుకుంటూ ఇంటి వేపు అడుగులు వేశారు.

ఆ రోజంతా రాజశేఖర్ మనసు తేలికగా, అనిర్వచనీయమైన ఝాన్సీ అనుభూతులతో నిండి పోయింది. రాత్రి భోజనాలు అయిపోయాక ఎప్పటిలాగే ఇంటిముందు ఆవరణలో నులక మంచం వేసుకుని వెల్లకిలా పడుకుని ఆకాశం కేసి చూస్తూ ఝాన్సీ గురించి ఆలోచనల్లో పడ్డాడు. అమ్మాయి వయసు చిన్నదే..కానీ పరిపూర్ణమైన వ్యక్తిత్వం అనుకున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ఇలా ఆకర్షణకు గురి అయ్యి, ఇంకొకరి మనసు లోకి ప్రవేశించడం ఎంత వరకు సబబు?

నిర్మలమైన మనసుతో వున్న మంచి పల్లెటూరి అమ్మాయి. ఆర్థికంగా మంచి జీవితం గడుపుతోంది. ఏది ఏమైనప్పటికీ తనున్న పరిస్థితుల్లో మనసును అదుపులో పెట్టుకోవటమే సరి అయిన పని అనుకున్నాడు. అలా ఝాన్సీ ఆలోచనల తోటే నిద్రా దేవి ఒడిలోకి జారిపోయాడు.

***

ఉదయాన్నే ఇంకా తెల్లవారక ముందే ఉలిక్కిపడి లేచాడు రాజశేఖర్. మొహాన నీటి చుక్కలు పడ్డాయి, చేత్తో తుడుచుకున్నాడు. కళ్ళు నులుముకుని చూస్తే ఎదురుగా ఝాన్సీ నవ్వుతూ వుంది.

ఝాన్సీ ఇంత చనువుగా ప్రవర్తించటమేంటీ అనుకుని ఆశ్చర్య పోతుండగా… పక్కనుండి కిలకిల నవ్వులు విన్పించాయి. అటు వేపుగా చూసాడు.

కాంతి నీటి చెంబు చేతిలో పట్టుకుని “నేనే వేశా” అని చెప్పి చెంగున ఇంట్లోకి పరిగెత్తింది. ఏం చెయ్యాలో అర్థం కాక ఝాన్సీని చూసి సంతోషంతో లేచాడు రాజశేఖర్.

పిన్ని, బాబాయిలతో కూచొని టిఫిన్ చేసాక, పొలానికి వెళదామని ఝాన్సీ చెప్పిన విషయం గుర్తుకొచ్చి “పిన్నీ! ఝాన్సీతో కలిసి పొలానికి వెళ్ళొస్తాను, ఏమి తోచటం లేదు” అన్నాడు అనుమతి కోరుతున్నట్లుగా..

“చాలా దూరం కదా? ఏమన్నా తినటానికి ఇస్తానుండు” అంటూ కొన్ని చిరు తిండ్లు స్టీల్ డబ్బాలో పెట్టి ఇచ్చింది అరుణ. చేతిలో సైకిల్ పట్టుకుని వూరు దాటాక, అడిగాడు శేఖర్ “మరిప్పుడు సైకిల్ స్టార్ట్ చేద్దామా?”అని.

“సరే” అని వచ్చి ముందు వేపు సైకిల్ మీద కూచుంది.

“థ్యాంక్ యు రాణి” అని సైకిల్ నడపడం మొదలు పెట్టాడు. ఎప్పుడూ లేనంత ఆనందంగా, ఝాన్సీ మనసంతా గాలిలో తేలిపోసాగింది.

“జీవితం ఎప్పుడూ ఇలాగే గడిచిపోవాలి” అంది ఝాన్సీ, హృదయం నిండా తీయని ఆలోచనలు ఉప్పొంగుతుండగా. అసలు ఈ రాజశేఖర్ మాయ ఏమిటో అనుకుంది.

ఝాన్సీ జడలో వున్న మల్లె పూల నుండి వస్తున్న సువాసనలు, ఝాన్సీ మాటలు రెండూ శేఖర్‌ను మరో లోకం లోకి తీసుకెళ్లాయి. ఝాన్సీ ఏవేవో మాటలు చెప్పుతూ వుంది కానీ ఆ మత్తులో తనకేమీ వినపడటం లేదు.

సైకిల్ ముందు కూర్చున్న ఝాన్సీ వెనక్కి చూసి “అయ్యా మహానుభావా.. ఏంటి సమాధానం లేదు.. ఏంటి పరధ్యానం… మీకసలు అనుభూతులు లేవా?” అంది.

అలాగే ఝాన్సీ కాటుక కళ్ళల్లోకి దగ్గర నుండి చూస్తూ “ఎందుకు లేవు… వున్నాయి… నాకూ మనసనేది వుంది.” అన్నాడు చిరు మందహాసంతో.

దారి పొడవునా తన కాలేజీ విషయాలు చెప్పుతూనే వుంది, వూ కొడుతూ ఝాన్సీ సాన్నిహిత్యంలో వుండే, తనకిప్పటి వరకూ తెలియని, మధురమైన భావాల్లో తేలిపోయాడు శేఖర్.

పొలం దగ్గరకు చేరుకోగానే, సరాసరి, దూరంగా పని చేస్తున్న పనివాళ్ల దగ్గరికి వెళ్ళిపోయింది ఝాన్సీ. చదువుకుంటున్న అమ్మాయి కానీ పని విషయంలో మాత్రం గట్టిదే అనుకున్నాడు.

కాసేపటికి తిరిగి వచ్చి పొలం మధ్యలో కనపడుతున్న మంచెను చూపించి “అక్కడ పైన, చాలా బావుంటుంది. అక్కడ కూర్చుందాం.. పదండి” అంది.

వెంట తెచ్చుకున్న చిరుతిండి, మంచి నీళ్ల బాటిల్ వెంట తీసుకుని వెళ్లి మంచె ఎక్కి పైన కూర్చున్నారు.

“మీ విషయాలు చెప్పండి, ఫ్రెండ్స్ ఎంత మంది, మీకేమైనా అలవాట్లున్నాయా?”అంది ఝాన్సీ.

“నా జీవితం అంతా కష్టాలకు ఎదురీత, నాకు అలవాట్లు అంటూ ఏమి లేవు. నేనున్న ప్రస్తుత పరిస్థితి, మా ఆచార వ్యవహారాలు మాకు అలాంటి అలవాట్లని దగ్గరకు రానివ్వవు.” అన్నాడు కాళ్ళు జాపుకుని కూర్చుంటూ.

కుటుంబ విషయాలు, కాలేజీ విషయాలు చెప్పసాగాడు శేఖర్. రెండు అర చేతులు గడ్డం కింద పెట్టుకుని,ఆసక్తిగా వినసాగింది ఝాన్సీ.

చెప్పటం ఆపి పక్కకు తిరిగి ఝాన్సీ కళ్ళలోకి చూస్తూ, ఏమి మాట్లాడకుండా కాసేపు ఆగి, ఊపిరి బిగ పట్టి అన్నాడు “మీ దగ్గర ఆకర్షణ, అందం వున్నాయి, దగ్గరయ్యే కొద్దీ మిమ్మల్ని చూడకుండా ఉండటం కష్టం” నిజాయితీ, అనురాగం ఉట్టిపడే స్వరంతో.

“నాకూ అలాగే వుంది, ఏం చేస్తున్నా మీరే నా కళ్ళ ముందు” అంది తల వంచుకుని, కను రెప్పలు కిందకు వాల్చి.

ఝాన్సీ కాళ్లకు వున్న వెండి పట్టీలను వేలితో కదిలించి “వీటి చప్పుడు అయితే చాలు తలుపు వేపు చూస్తూ ఉంటున్నా. తెలుసా?” మెల్లిగా చెప్పాడు.

కాళ్ళను చటుక్కున దూరం జరిపి “నాకైతే ఏమీ తోచటం లేదు లేదు రాజశేఖర్ గారు” అంది గుస గుసగా కాస్త సిగ్గుతో.

“అబ్బో ఝాన్సీ కి సిగ్గుపడం తెలుసే” అని, “నాకు యూనివర్సిటీలో క్లాసెస్  మొదలు అవుతాయి. పైగా వచ్చే నెల మా చెల్లి పెళ్లి వుంది, ఇంకో రెండు సంవత్సరాలు…, నేను నా కాళ్ల మీద నిలబడటానికి.” అన్నాడు తన పరిస్థితిని సూచిస్తూ.

“నేను…. గుర్తుంటానా అప్పటివరకూ..” అంది తల, మడిచిన తన మోకాళ్ళ పైన పెట్టుకుంటూ. ఝాన్సీ హృదయం నాట్య మయూరి లాగ గంతులు వేస్తూ ఉంది.

“నా జీవితం మీ లాగా పూల బాట కాదు.. మీకది తెలీటం లేదు.” నవ్వలేక నవ్వుతూ అన్నాడు. మొదట్లోనే చెప్పటం మంచిది అనుకుంటూ.

“మనిద్దరం కలిసి నడిస్తే జీవితం.. పూల బాటలా మారిపోతుంది” అంది కళ్ళు మూసుకుని.

“నాకంత అదృష్టమే, నేను మీ లాగ జమీందారును కాదు, కనీసం స్వంత ఇల్లు లేదు, ఆలోచించండి” అన్నాడు గుండెల్లో సంతోషం ఉప్పొంగుతుండగా.

“అలోచించి చేసేది ప్రేమ కాదు” అంది నిలకడగా.

ఝాన్సీ చెయ్యి తన చేతిలోకి తీసుకుని, మౌనంగా వుండిపోయాడు. అతడి సాహచర్యంలో… అతడి స్పర్శలో వుండే మాధుర్యాన్ని అనుభవిస్తూ

“ఇన్నాళ్లు ఎందుకు కలవ లేదు రాజు” అంది కళ్ళు తెరవకుండానే.

ఝాన్సీ చేతి వేళ్ళని వదిలి గాజులను కదిలిస్తూ “నేను కూడా అదే అడుగుతున్నా రాణి” అన్నాడు.

మంచె మీద వున్న గడ్డిలో వెనక్కి వొరిగి రెండు కాళ్ళు మంచె కిందకి వేసి, పళ్లతో గడ్డిని కొరుకుతూ అంది ”ఇన్నాళ్లు ఎలా గడిపానో తెలీదు కానీ, ఇప్పుడు నువ్వెళ్ళిపోతే ఎలా ఉండటం?”

”నిజం చెప్పాలంటే, నాకూ, ఇప్పుడు వెళ్ళటమే అసలు కష్టం!!” అన్నాడు సమ్మోహనంగా ఝాన్సీ వేపు చూస్తూ.

“అబ్బో,అలాంటి ఫీలింగ్స్ వున్నట్లుగా కనిపించవుగా” ఓర కళ్ళతో చిలిపిగా నవ్వుతూ అంది ఝాన్సీ.

“రోజంతా మీ ఇంటి వేపు చూస్తూ ఉంటున్నాను” అన్నాడు నవ్వుతూ, ఆకాశంవేపు చూసి..

“నాకు ఏదో రకంగా మీ ఇంట్లోకి రావాలని, మిమ్మల్ని చూడాలనే ధ్యాస” మనసు విప్పి చెపుతూ అంది ఝాన్సీ.

ఝాన్సీ అరచెయ్యి తీసుకుని వేళ్ళతో ఆడుకుంటూ అన్నాడు

“ఇంకో నెలలో చెల్లి పెళ్లి ఉంది, మీరు కూడా రండి మా ఇంటికి….రేపు నేను మా ఊరికి వెళ్ళాలి” అన్నాడు.

“మీరు మేము వేరు కదా, నే వస్తే, మీ ఇంట్లో వాళ్లకు ఇబ్బందిగా వుండదా?” అనుమానం వ్యక్తం చేసింది.

“అటువంటి ఇబ్బందులు ఏమీ వుండవు.” అన్నాడు ఆ విషయంపై మాట్లాడటానికి ఇక తావివ్వకుండా.

“ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్లి మళ్ళీ ఎప్పుడొస్తారు? బహుశా ఈసారి మీరు వచ్చేటప్పటికి నేను కూడా టౌన్ హాస్టల్‌లో చేరవచ్చు, ఇంట్లో ఉండనేమో?” అంది అనుమానంగా.

“అక్కడికి నేను వస్తాను, అడ్రస్ ఎక్కడో తెలపండి” చెప్పాడు రాజశేఖర్.

“నేను ఉత్తరం రాస్తాను” అంది.

“చాలా సేపయ్యింది మరి వెళదామా ఇంటికి” అన్నాడు రాజశేఖర్.

“పదండి” అని లేచి నిలుచుంది ఝాన్సీ.

కానీ పట్టు తప్పి పక్కకు ఒరిగింది. ఆ సమయానికి, చటుక్కున చేయి సాచి ఆపాడు రాజశేఖర్. అలాగే కాస్త ముందుకు వాలి అతని యెద మీద ఆనుకుని నిలబడి, అంతలోనే మైమరుపుతో అతని భుజం మీదకు వాలి పోయింది. కదలకుండా ఉండిపోయిందలాగే ఝాన్సీ.

సముద్రపు అల లాగ రాజశేఖర్ మనసు ఎగిసి పడింది. అక్కడ ప్రపంచం మొత్తం, కాలం, స్తంభించి పోయాయి ఇద్దరికీ. ఒకరి గుండె సవ్వడి మరొకరికి తెలుస్తోంది. రెండు చేతులు రాజశేఖర్ మెడ వెనక్కి వేసి తల అతని గుండెల మీద ఆనించి కళ్ళు మూసుకుంది ఝాన్సీ.

‘ఝాన్సీ” అంటూ మంద్రంగా పిలిచాడు రాజశేఖర్.

తల పైకి ఎత్తి అతడి కళ్ళలోకి చూసింది.

ఝాన్సీ జడ లోని మల్లెల్ల సువాసన, ఆవిడ స్పర్శ, బాహువుల వెచ్చదనం రాజశేఖర్‌ని మధురమైన మరో ప్రపంచం లోకి స్వాగతం పలికాయి. ఏమీ అర్థం కాని, అలౌకిక స్థితిలో ఝాన్సీ కళ్ళల్లోకి చూసాడు.

ఝాన్సీ కూడా కళ్ళు ఆర్పకుండా రాజశేఖర్ కళ్ళలోకి చూస్తూ అతని మనసు లోని మాధుర్యాన్ని గ్రోలుతూ అతని మనసులోని భావాలను చదువుతూ ఉండిపోయింది. ప్రపంచం తిరుగుతూనే వుంది, కానీ వాళ్లిద్దరి మధ్య కాలం చాల సేపు అలాగే కదలకుండా ఉండి పోయింది.

***

మంచె మీదనుండి కిందకు దిగి, చేను గట్టు పైన నడుస్తూ, పొలం నుండీ బయటకు వచ్చి సైకిల్ ముందు బాగాన ఝాన్సీని కూర్చోబెట్టి సైకిల్ నడపసాగాడు.

సైకిల్ ముందు బాగాన కూర్చుని అతడి ముంజేయిని నిమురుతూ “రాజు… నిన్ను వదలను ఎప్పటికీ” అంది గట్టి నిర్ణయం తీసుకుని.

“నేను కూడా.” సమాధానమిచ్చాడు.

ఇంతలో ఎదురుగా ట్రాక్టర్ నడుపుతూ వచ్చి వీళ్ళను చూసి ఆపాడు ఝాన్సీ అన్నయ్య. ఇద్దరూ సైకిల్ దిగారు. “ఏంటి, పొలం నుంచా.. ఇద్దరే వెళ్ళారా?” ముఖంలో చిరాకు అణుచుకుంటూ అడిగాడు ఝాన్సీ అన్నయ్య.

“అవునన్నా” అంది ఝాన్సీ బెదురు లేకుండా.

“సరే ఇంటికి వెళ్ళండి” అన్నాడు రాజశేఖర్ వేపు సీరియస్‌గా చూసి.

ఇంట్లోకి వెళ్ళగానే పిన్ని ఎదురొచ్చి “ఇంత లేటయ్యిందే?” అంది ఆదుర్ధాగా.

“అవును పిన్ని.. ఝాన్సీ పొలం పనులు పురమాయిస్తూ వుండి పోయింది.” అన్నాడు.

కొద్దిసేపు అలోచించి మళ్లీ అన్నాడు. “పిన్నీ రేపు నేను బయలుదేరతాను, నాకిక క్లాసులు మొదలవుతాయి. పైగా పెళ్లి పనులు మొదలు పెట్టాలి”.

“ఆ సమయానికి కొన్ని డబ్బులు సర్దుతానన్నారు మీ బాబాయి. ఒక వారం ముందుగానే వస్తాము” అంది.

ఆ రోజు రాత్రి బయట నులక మంచం మీద పడుకుని చెల్లి పెళ్లి పనులు, డబ్బుల సర్దుబాట్ల గురించి ఆలోచిస్తూ ఆకాశంలో చంద్రుడు, నక్షత్రాలను చూడసాగాడు.

తన ఇంటి ముందు గుమ్మం దగ్గర నిలబడి కాళ్ళ పట్టీలు కదిలించింది ఝాన్సీ. అది విని నవ్వుతూ అటు వేపు చూసాడు.

‘రేపు వెళుతున్నావా’ అంటూ సైగ చేసి అడిగింది ఝాన్సీ.

‘అవును’ అన్నట్లుగా తల ఊపాడు రాజశేఖర్.

మొహం సీరియస్ గా పెట్టి కోపంగా ‘ఎందుకు’ అన్నట్లుగా చెయ్యి ఊపింది.

‘ఇలా రా’ అని సైగ చేసాడు.

‘మళ్ళీ వస్తా’ అని చెయ్యి ఊపి లోనికి వెళ్ళింది ఝాన్సీ.

పనివాడు వచ్చి రంగారావు గారి మంచం ఒక పక్కగా వేసి దానిపై పరుపు దిళ్లు సర్ది వెళ్ళిపోయాడు. మరి కాసేపటికి రంగారావు వచ్చి మంచం పైన కూర్చుని రాజశేఖర్‍ని చూసి “యేటి బాబు.. విశేషాలు.. మా పొలం చూసావుట. ఎలా వుంది” అన్నాడు గలగలా నవ్వుతూ.

“బావుందండి… వచ్చే నెలలో మా చెల్లెలి పెళ్లి పెట్టుకున్నాము… శుభలేఖ పంపిస్తాను… తప్పకుండా రండి.” అన్నాడు రాజశేఖర్ తాను కూడా లేచి కూర్చొని.

పెళ్లి విషయాలు మాట్లాడుతూ ఉండగా ఝాన్సీ పాల గ్లాస్ తీసుకుని వచ్చి రంగారావు చేతికిచ్చింది.

“అదేంటమ్మా.. మరి రాజుక్కూడా ఇవ్వు..” అని మళ్ళీ రాజశేఖర్ వేపు తిరిగి “ఏం బాబు పాలు.. తీసుకుంటావుగా.. పట్నం కుర్రోడివి అందుకు అడుగుతున్నా.” అని పెద్దగా నవ్వాడు. రాజశేఖర్ కూడా నవ్వేసాడు.

పెద్ద గ్లాసులో నిండుగా పాలు తీసుకు వచ్చి రాజశేఖర్‍కి అందించింది ఝాన్సీ.

గ్లాస్ అందుకుని మెల్లిగా అన్నాడు “ఏంటిది.. అడ్వాన్స్ గానా” మొహంలో భావం కనిపించకుండా మెల్లిగా అడిగాడు.

పెదవుల మీద నవ్వు చిందించి ఓరగా కాటుక కళ్ళతో చూస్తూ వెళ్లి నాన్న దగ్గర కూచుంది ఝాన్సీ. నాన్న కాళ్ళు నొక్కుతూ అడిగింది “నాన్నా! మరి మనం వెళదామా వీళ్ళ వూరికి?”

రంగారావు తన కూతురి చేతిని స్పర్శిస్తూ అన్నాడు “నీ ఇష్టం తల్లీ, నీ ఇష్టం నేనెప్పుడూ కాదనను. కాస్త ముందుగా గుర్తు చెయ్యి” అని కళ్ళు మూసుకుని ఒకే ఒక నిముషంలో గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు.

అలాగే మెత్తగా కాళ్ళు నొక్కుతూ కూర్చుని రాజశేఖర్‍ని చూడసాగింది ఝాన్సీ. పక్కకు తిరిగి పడుకుని, అరచెయ్యి తలకు ఆనించి చూస్తూ చాలా సేపు చూస్తూ వుండిపోయాడు రాజశేఖర్.

అప్పటి వరకూ వీళ్ళిద్దరిని దూరంగా వంటింటి కిటికీలో నుండి చూస్తున్న సుగుణ వెనక్కి తిరిగి సీరియస్‌గా ఆలోచిస్తూ వెళ్ళిపోయింది.

పడుకునే ముందు తలుపులు వేయబోతున్న అరుణ వచ్చి ఝాన్సీ, రాజశేఖర్‍ని చూసి చిన్నగా నవ్వుకుని తలుపేసుకుంది.

రాబోయే ఇబ్బందులు తెలీని రాజశేఖర్, ఝాన్సీ మాత్రం ప్రణయ రాగాల్లో మునిగి పోయారు.

***

ఉదయాన్నే లేచి బ్యాగ్ పట్టుకుని రెడీ అవుతున్న రాజశేఖర్‍ని చూసి వెంటనే బయటకు వెళ్ళిపోయింది ఝాన్సీ. అందరికీ వీడ్కోలు చెప్పి,ఝాన్సీ కొరకు వెదికాడు రాజశేఖర్. రాజశేఖర్ మనసుని కనిపెట్టి “త్వరలో మళ్ళీ వస్తావుగా.. సంతోషంగా వెళ్లి రా” అంది అరుణ.

చుట్టూ చూసాడు, ఝాన్సీ ఎక్కడా కనిపించక పోయే సరికి, నిరుత్సాహంగా బస్సు స్టాండ్ వేపు కదిలాడు రాజశేఖర్. బయటకు వచ్చి ఝాన్సీ ఇంటిని చూసాడు. స్వర్గాన్ని వదిలి వెళ్తున్నట్లుగా అనిపించింది.

నీరసంగా అడుగులు వేశాడు బస్సు స్టాండ్ వేపు.. ఊరికి దూరంగా రోడ్ మీద వున్న బస్సు షెల్టర్ వేపు చూసాడు. అక్కడ సైకిల్ ఆపుకుని నిలబడి వుంది ఝాన్సీ.

రాజశేఖర్ మనసు ఉప్పెన లాగ ఎగసి పడింది. పరుగెత్తుకెళ్ళి బ్యాగ్ కిందకి పడేసి ఝాన్సీ రెండు చేతులు పట్టుకుని ఆగకుండా నవ్వసాగాడు. బలవంతంగా నవ్వు ఆపుకుని “ఏంటిది ఝాన్సీ.. అబ్బా నన్ను కంగారు పెట్టేసావు” అన్నాడు.

“ఈ మాత్రం దానికే? మా నాన్న, ఇంట్లో వాళ్లకి తెలిస్తే అప్పుడెలా?” అంది కాస్త భయంగా.

“నాకు వుద్యోగం రాగానే, నే వచ్చి అడుగుతానుగా, అప్పటి వరకు ధైర్యంగా ఉండాలి” అన్నాడు.

“మా నాన్న మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు” అంది తల దించుకుని.

“ఒప్పించే బాధ్యత నాదే, నువ్వంత వరకూ ధీమాగా వుండు” సముదాయించాడు.

“బస్సు కాస్త లేట్ అయితే బావుండు” అంది ఝాన్సీ రోడ్ వేపు చూస్తూ.

“అదుగో బస్సు వస్తోంది. ఝాన్సీ ఇదుగో నా అడ్రస్. ఉత్తరాలు వ్రాస్తూ వుండు.పెళ్ళికి తప్పని సరిగా వచ్చేయి. మా పక్కింటి ఫోన్ నెంబర్ రాసి వుంది చూడు, వీలయితే ఫోన్ చేయి. జాగ్రత్త..” అంటూ గుక్క తిప్పుకోకుండా అన్నీ చెప్పాడు.

ఝాన్సీ కళ్ళలో నీళ్లు తిరగటం గమనించాడు రాజశేఖర్. “ఓయ్ ఝాన్సీరాణి.. పెళ్ళికి వస్తావుగా,,ఇంకెన్నో రోజులు లేదు.. దాంతర్వాత నే వస్తాను.. మీ కాలేజీ హాస్టల్‌కి..” అని చెయ్యి గట్టిగా నొక్కాడు.

రెండవ చేతిని కూడా గట్టిగా పట్టుకుని నించుంది ఝాన్సీ. బస్సు దగ్గరకు రాగానే తప్పనిసరిగా చేతులు వదిలి బస్సు ఎక్కాడు రాజశేఖర్. వెళ్లిపోతున్న బస్సులో నుండి చేయి ఊపుతున్న రాజశేఖర్‍ని చూస్తూ నిస్త్రాణగా నిలబడి పోయింది.

‘ఒక్క నెలలోపు తనలో ఎంత మార్పు, నెల కిందటి వరకూ తానెవరో అతనికి తెలీదు. అతడెవరో తనకు తెలీదు’ అనుకుంది ఝాన్సీ.

***

రాజశేఖర్ చెల్లెలి వివాహం పల్లెలో, రాజా వారి సత్రంలో జరగాలని నిశ్చయించారు. బంధు మిత్రులందరికీ వసతి సౌకర్యాలు, వూరిలో ఖాళీగా వున్న ఇళ్లలో కల్పించారు. ఇంటి ముందు రిక్షా ఆగగానే ఇంట్లో వున్నపిల్లలు పరుగెత్తుకెళ్లి సామానులు దింపుకొని ఇంట్లోకి చేరవేయటం, వచ్చిన వారికి మంచి నీరు, కాఫీలు అందచేయటం జరుగుతూ వుంది. పెళ్లికి వారం రోజుల ముందే బంధువులందరూ పెళ్లింటికి చేరుకోసాగారు.

ఝాన్సీని వదిలి వచ్చినప్పట్టి నుండి ప్రతి దినం ఝాన్సీ నుండి ఒక వుత్తరం వచ్చింది కానీ ప్రత్యుత్తరం ఎక్కడికి రాయాలో తెలీక వుండిపోయాడు రాజశేఖర్.

వారం నుండీ రోజూ అందరూ వస్తున్నారు. ఝాన్సీ రాలేదు. పెళ్లి పనులు అందరి సహకారంతో జరిగి పోతూ వున్నాయి. అందరూ హడావిడిగా వున్నారు.

సరిగ్గా పెళ్ళికి రెండు రోజుల ముందు చేతిలో సూటుకేసు మోసుకుంటూ, పిల్లలను వెంటేసుకుని అరుణ పెళ్లి ఇంట్లోకి అడుగు పెట్టింది. అది చూసి రాజశేఖర్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇంటి బయటకు చూపు సారించాడు. కానీ ఝాన్సీ కనపడలేదు. “పిన్నీ..ఇంకెవరూ రాలేదా” అన్నాడు.

“మీ బాబాయికి ఆఫీసులో ఏదో పని వుండి పోయిందిరా, రేపు వస్తారు.” అంది టవల్‍తో మొహం తుడుచుకుంటూ.

వొళ్ళంతా నిస్సత్తువ ఆవహించింది రాజశేఖర్‍కి. ఝాన్సీ కేమైంది? వస్తున్నాను అని ఉత్తరం రాసిందిగా అనుకుంటూ నిల్చుండిపోయాడు.

అంతలో అరుణ అంది “ఈ పిల్ల ఝాన్సీ, అన్ని సామానులు ఒక్కతే పట్టుకొస్తోంది కామోసు.. ఇంకా బయటే వున్నట్లుంది, ఒరేయ్ రాజు వెళ్లి చూడరా” అని బయట గుమ్మం వేపు చూసింది.

అది విని ఆనందం పట్టలేక బయటకు వేగంగా అడుగులు వేసాడు రాజశేఖర్. బయట రిక్షా వెళ్ళిపోయింది కానీ ఝాన్సీ సామానులన్ని గుమ్మం పక్కన పెట్టి, నిలబడి రాజశేఖర్‍ని చూసి నవ్వుతూ వుంది. సంతోషాన్ని అదుపులో పెట్టుకుని వెళ్లి చేతిలో వున్న సూటుకేస్ తీసుకుని, ఝాన్సీని తృప్తిగా చూస్తూ “లోపలి రాకుండా ఇక్కడే ఎందుకున్నట్లు.. నువ్ రాలేదనుకుని..” అని ఆగిపోయాడు.

“ఎలా వస్తాను.. మా ఆయన.. స్వాగతం చెప్పాలిగా?” అంది చిరునవ్వుతో మెల్లిగా ఎవరికీ వినపడకుండా.

“ఇవి విడిదిళ్లు… మా ఇల్లు పక్క వీధిలో వుంది, స్వాగతం అక్కడ.” అన్నాడు రాజశేఖర్.

అందరికీ పరిచయం అయిన కొద్దిసేపట్లోనే ఝాన్సీ పెళ్లి పనుల్లో మునిగి పోయింది. అది చూసి తృప్తిగా వెళ్ళిపోయాడు రాజశేఖర్.

పెళ్లి పనులు ఊపందుకున్నాయి. ఖర్చులు వేగంగా అవుతున్నాయి. రాజశేఖర్ నాన్న సుబ్రహ్మణ్యం గారు చేతిలో వున్న డబ్బులతోటి కార్యక్రమాలంటిని పూర్తి చేయగలనని అనుకున్నారు. కాస్త తక్కువ అయితే ఎలా అని అనుమానం, భయం పట్టుకుంది. కొడుకు రాజశేఖర్‍ను చూసి రమ్మని సైగ చేశారు. దగ్గరగా వచ్చిన రాజశేఖర్‌ను చూసి “ఏమప్పా.. మీ బాబాయిలు ఏమైనా సహాయం చేస్తానన్నారా?”.అని అడిగారు.

“లేదు నాన్నగారు.. నేను చెప్పాను.. కానీ ఇంత వరకూ ఏమీ ఇవ్వలేదు” అన్నాడు.

నిరాశ నిస్పృహలతో నిట్టూర్చారు సుబ్రహ్మణ్యం గారు. మధ్య తరగతి ఉద్యోగులయిన తమ్ములు ఇద్దరూ తమ వంతుగా కొద్దిగా డబ్బులు ఆ రోజు సాయంకాలం ఇచ్చారు. కానీ బాగా డబ్బులున్న తమ్ముడు మాత్రం మొహం చాటేశాడు.

రాజశేఖర్ వెళ్లి నాన్నగారిని మళ్ళీ ఒక సారి కదిలించాడు. “నాన్నగారు.. అత్యవసరానికి.. నా దగ్గర స్కాలర్షిప్ డబ్బులు కొన్ని వున్నాయి.. పెద్ద బాబాయి వివాహం, ఆ రోజుల్లో మీరే అన్ని ఖర్చులు భరించి చేశారు కదా.. మీరు ఒకసారి కదిలించి చూస్తారా? తానే ఏమీ ఇవ్వలేదు.” అన్నాడు తల కిందికి వంచుకుని.

“లేదమ్మా.. నేను చేసిన సంగతి నేనెప్పుడో మర్చిపోయా.. ఇప్పుడు నేనెవ్వరినీ అడగను.. చూద్దాం అన్నింటికీ ఆ భగవంతుడే వున్నాడు” అని తల పైకెత్తి ఆకాశం వేపు చూసి మొక్కాడు సుబ్రహ్మణ్యం.

నాన్నగారి పరిస్థితి చూసి చలించి పోయాడు రాజశేఖర్. డబ్బులు బాగా సంపాదించే సమయంలో ఇద్దరి తమ్ముళ్ల వివాహలు తనే చేశారు, ఒక్క కూతురి పెళ్ళికి ఇప్పుడింత దీనావస్థలో వున్నారు అనుకుని, మానసిక వ్యధను అనుభవిస్తూ పనుల్లో మునిగి పోయాడు రాజశేఖర్.

పెళ్లి రోజు వుదయాన్నే ఇంకా ఇద్దరు అమ్మాయిలతో కూడి పందిరి మంటపం అలంకరణ చేస్తూ వుంది ఝాన్సీ. అక్కడికి పూలు తెచ్చిన రాజశేఖర్‍ను చూసి “కనీసం కాఫీ అయినా తాగారా లేదా?” అడిగింది ఝాన్సీ.

సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచిస్తున్న చూసి మళ్ళీ అడిగింది “ఏంటి రాజశేఖర్ ఏవన్నా ఇబ్బందా?”అని.

“ఏమీ లేదు ఝాన్సీ” అని నవ్వుతూ వెళ్ళి పోయిన రాజశేఖర్‍నే చూడ సాగింది ఝాన్సీ. అతడి మొహంలో కొండంత దిగులు కనిపెట్టింది ఝాన్సీ

సరిగ్గా, పెట్టిన ముహుర్తానికే మంగళ సూత్రధారణ జరిగింది. అందరూ కోలాహలంగా వెళ్లి దంపతుల మీద అక్షింతలు వేసి ఆశీర్వదించారు. పెళ్లి మంటంపంలో రాజశేఖర్ తల్లి తండ్రుల పక్కనే నిలబడింది ఝాన్సీ.

అందరూ విందు భోజనాలకు కూర్చున్నారు. హడావిడిగా వడ్డనలు మొదలయ్యాయి.

బంధు మిత్రులు తలా ఒక చెయ్యి వేసి పనులు చేస్తూ వున్నారు. అన్నింట్లో రాజశేఖర్ కలియతిరుగుతూ పనులు చేస్తున్నాడు..

పెళ్లి మంటపంలో ఏవో అరుపులు గట్టిగా వినపడుతూ వున్నాయి. అదేంటో అర్థం కాక వడ్డనలు వదిలేసి అటు వేపుగా వెళ్ళాడు రాజశేఖర్. అది గమనించి ఝాన్సీ కూడా వెళ్ళింది.

అక్కడ పెద్ద వాళ్ళందరూ గుమికూడి వున్నారు. మధ్యలో రాజశేఖర్ నాన్నగారు మాట లేకుండా నిలుచుని వున్నారు. పెళ్ళికొడుకు తల్లి అరుస్తోంది “పెళ్లి సమయంలో మెడలో మూడు గొలుసులు వేశారు.. చేతిలో నాలుగు గాజులు వేశారు, పెళ్లి కాగానే తీసేసుకున్నారు. ఇలాంటి మోసం నేనెక్కడా చూడలేదు”

పెళ్లి కూతురు తల వంచుకుని నిలబడి వుంది. విషయం అర్థం అయ్యి “ఏంటసలు ఇదంతా ఏంటమ్మా”అని అడిగాడు తల్లిని చూసి రాజశేఖర్.

“మనం ముందుగా అనుకున్నట్లుగా చెప్పిన బంగారం పెట్టారు మీ నాన్న. మెడలో, చేతిలో నిండుగా ఉంటుందని, ఇదుగో మీ పిన్ని అవేవో అదనంగా వారి నగలు తీసి నీ చెల్లెలి మెడలో, చేతికి వేశారు. వీళ్ళేమో అవన్నీ మావే.. వెనక్కి తీసుకుంటే ఎలా, ఇదేదో మోసం అంటున్నారు.. చెప్పితే వినిపించుకోవడం లేదు” అంది కంగారుగా.

తల పట్టుకున్నాడు రాజశేఖర్.

ఎంత మంది సముదాయించినప్పటికీ కూడా పెళ్లి కొడుకు తరఫున వాళ్ళు గొడవ మానలేదు.

ఆఖరున రాజశేఖర్ మధ్యలో నిలబడి చెప్పాడు “సరేనండి.. అదేదో పొరపాటు జరిగింది.. ఇప్పటికిప్పుడు మేము పది తులాలు అదనంగా ఇవ్వలేము. కొద్ది సమయం తర్వాత సర్దుతాము.” అని అభ్యర్థనగా అన్నాడు.

“పెళ్లి అయిన తర్వాత ఇంకేమి ఇస్తారు.. ఇప్పుడే ఇవ్వండి” అని మంకు పట్టుతో అంది పెళ్ళికొడుకు అమ్మగారు. పరిస్థితి గమనించి మెల్లిగా అందరూ అక్కడ నుండీ జారుకోవటం మొదలు పెట్టారు.

ఏం చెయ్యాలో అర్థం కాక.. చుట్టూ చూసాడు రాజశేఖర్, బాబాయిలు ఏమైన కలుగ చేసుకుంటారేమోనని. ఎవరూ మాట్లాడలేదు. కాస్త దూరంగా నిలబడ్డ ఝాన్సీ చేతి సైగతో రాజశేఖర్‌ను పిలిచి పక్కనున్న గదిలోకి వెళ్ళింది. అందరూ ఏం చేద్దామని తర్జన భర్జన పడుతుండగా రాజశేఖర్, ఝాన్సీ వెళ్లిన గది లోకి వెళ్ళాడు.

ఝాన్సీ తన చేతి నుండి గాజులు, మెడ లోని చైన్లు రెండూ వేగంగా తీసి… చేతిలో నున్న రుమాలులో కట్టి “ఇవి ముందు తీసుకెళ్లి ఇచ్చేసి.. గొడవ పెద్దగా కాకుండా చూడండి” అంది.

“నువ్వు ఇవ్వటం ఏంటి.. వద్దు ఝాన్సీ.. కాస్త సమయం తీసుకుని ఇస్తామని నే నచ్చ చెపుతాను..” అని బాధతో అంటుండగానే, బయట ఇంకా కేకలు ఎక్కువయ్యాయి.

“నే చెప్పింది విను రాజశేఖర్, అదేదో సమయం తీసుకుని మళ్ళీ నాకే ఇద్దువు గాని. ముందుగా ఇవి వాళ్లకు ఇవ్వు.” అని రాజశేఖర్ చేతులు లాగి అరచేతిలో పెట్టింది. ఆ సమయంలో ఏమీ చేయలేక అలాగే వాటిని తీసుకెళ్లి అమ్మ చేతిలో పెట్టి “ఇవి వేసేయమ్మా” అన్నాడు చెల్లెలి వేపు అమ్మను జరుపుతూ. అవెలా వచ్చాయో అర్థం కాక అయోమయంగా అలాగే కూతురి మెడలో వేసి, చేతులకు గాజులు తొడిగింది రాజశేఖర్ అమ్మగారు.

పెళ్లికూతురు కళ్లలోనుండి అశ్రువులు ఏకధాటిగా కారిపోతూ వున్నాయి. తన నిస్సహాయత చూపలేక తలవంచుకుని నిలబడ్డారు సుబ్రహ్మణ్యం. అమ్మయ్య బ్రతికాం అని రాజశేఖరం బాబాయిలందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కళ్ళలో నీరు బలవంతంగా ఆపుకుంటున్న రాజశేఖర్‍ను చూసి, నేను వున్నాను బాధపడకు అంటూ తల ఊపింది ఝాన్సీ. మొదటి సారి నిజంగానే పైనుండీ దిగివచ్చిన దేవత లాగ కనిపించింది రాజశేఖర్‍కి.

గొడవ సద్దు మణిగి, భోజనాలయ్యాక, అప్పగింతలు కార్యక్రమం పూర్తి చేసుకుని, వియ్యాల వారు తిరుగు ప్రయాణానికి బస్సు ఎక్కారు.

విడిది ఇల్లు ఖాళీ అయిపోయింది, బాబాయిలు, పిన్నమ్మలు, అత్తలు, మామలు అందరూ కూర్చొని పెళ్లి విశేషాలు మననం చేసుకుంటూ వున్నారు. విడిదింటి పెరట్లో వేప చెట్టు కింద కుర్చీల్లో కూర్చొని అమ్మతో మాట్లాడుతూ వున్నాడు రాజశేఖర్. రెండు చేతుల్లో కాఫీలు తీసుకుని వచ్చింది ఝాన్సీ.

కాఫీ గ్లాస్ అందుకుని ఝాన్సీ‍ని చూసి అంది రాజశేఖర్ అమ్మగారు. “సమయానికి నీవు చేసిన సహాయం నేనెప్పటికీ మరచిపోనమ్మా,త్వరలోనే నీ నగలు వెనక్కు ఇప్పిస్తాను…, రా కూర్చో” అని కుర్చీ చూపించింది.

”ఈ రోజు సాయంత్రం నేనిక బయలు దేరుతానండి.” అంది ఝాన్సీ.పక్కన కూర్చుంటూ.

“కాలేజీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది” అడిగాడు రాజశేఖర్

“వచ్చే వారం హాస్టల్‍కు వెళ్ళిపోతాను” చెప్పింది ఝాన్సీ.

“మీరు మాట్లాడుతూ వుండండి నే ఇప్పుడే వస్తాను” అంటూ లేచి వెళ్ళింది రాజశేఖర్ అమ్మగారు.

“ఇప్పుడు ఇంట్లో నగలేవి అంటే ఏం చెప్పుతావు ఝాన్సీ” ఆందోళనగా అడిగాడు రాజశేఖర్.

“ప్రస్తుతానికి ఏమి చెప్పను… నా అల్మిరాలో వున్నాయనుకుంటారు.” సాలోచనగా అంది ఝాన్సీ.

“నెలలోగా వెళ్లి వేరే నగలు ఇచ్చి.. నీ నగలు తెచ్చేస్తాను.. వెంటనే హాస్టల్ కొస్తాను.” చెప్పాడు రాజశేఖర్.

“నీకు త్వరగా వుద్యోగం వస్తే బావుండు” అంది ఝాన్సీ నేల చూపులు చూస్తూ.

“వెళ్ళగానే ఫోన్ చేయటం మరువద్దు” గుర్తు చేసాడు రాజశేఖర్.

ఝాన్సీతో సహా అందరూ బంధువులూ వెళ్లిపోయారు. రాజశేఖర్ యూనివర్సిటీ హాస్టల్‌లో చేరిపోయాడు. ఝాన్సీ ప్రతి రోజు కాలేజీకి వెళ్లలేక టౌన్‌లో కాలేజీ హాస్టల్‍కు వెళ్ళిపోయింది. ప్రతి రోజూ ఉత్తరాలు రాస్తూ వుంది.

నెల తర్వాత ఓక రోజు ఝాన్సీ తన హాస్టల్ రూమ్‌లో చదువుకుంటూ ఉండగా వార్డెన్ నుండి పిలుపు వచ్చింది.

వార్డెన్ రూమ్ లోకి ఝాన్సీ వెళ్ళగానే “మీకు ఫోన్” అంది వార్డెన్.

వెంటనే ఫోన్ దగ్గరకు వెళ్లి కంగారుగా రిసీవర్ పట్టుకుని “హలో” అంది వణుకుతున్న కంఠం తో ఆతృతగా.

“హలో ఝాన్సీ నేను రాజశేఖర్” అవతలి నుండి రాజశేఖర్ గొంతు విన్పించింది..

“హలో నేనే ఝాన్సీని. చెప్పు ఎలా వున్నావు.. ఎప్పుడొస్తావు”  అంది సంతోషంతో కంగారుగా. గుండె వేగంగా కొట్టుకుంది ఝాన్సీకి.

“రేపే వస్తున్నా, నీ నగలు కూడా తెస్తున్నాను.. నాకు వుద్యోగం వచ్చేసింది.. రేపే మీ నాన్నతో మన విషయం మాట్లేడేస్తాను.. సరేనా? ముందు నీ హాస్టల్‍కు వస్తాను.. అక్కడ నుండి మీ ఊరికి వెళదాం.. ఓకే… రేపు పది గంటలకు..” చెప్పాడు సంతోషంగా.

గొంతు పెగలటం లేదు ఝాన్సీకి. ఆశ్చర్యం.. సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపొయింది.

మళ్ళీ అవతలి నుండి అన్నాడు రాజశేఖర్ “ఏంటి..వింటున్నావా?” అన్నాడు.

“ఆఁ ఆఁ.. విన్నా.. వచ్చేయి” అంది ఝాన్సీ.

జలపాతం లాగా ఉరుకులు పెడుతోంది ఝాన్సీ మనసు. ఫోన్ పెట్టేసి రూమ్ లోకి వచ్చి బట్టలు అన్నీ సర్దుకుంది. రాత్రి మీల్స్ గంట కొట్టారు. ఆనందంతో భోజనం చేయాలనిపించ లేదు. ఒక వేపు పట్టలేని సంతోషం, మరోవైపు నాన్న కెలా చెప్పాలి ఈ విషయం. మనసులో భయం మొదలయింది. అదీ కాకుండా వచ్చే ముందు ‘తానెలాంటి తప్పు చేసి తలవంపులు తేనని’ నాన్నకు తానిచ్చిన మాట గుర్తొచ్చింది.

రాత్రంతా నిద్ర లేకుండా గడిపింది ఝాన్సీ. తెలవారుతు ఉండగా నిద్ర పట్టింది.

***

అమ్మా నాన్నకు ఝాన్సీ విషయం టూకీగా చెప్పి బయలు దేరాడు రాజశేఖర్. బస్సు ఎక్కి పడుకుని నాన్న చెప్పిన విషయం గుర్తు చేసుకున్నాడు.

ఝాన్సీ గూర్చి విన్న తర్వాత రాజశేఖర్ కేసి చూసి అన్నారు సుబ్రహ్మణ్యం “అమ్మాయి తల్లి తండ్రిని ఒప్పిస్తేనే వివాహం చేసుకోవటం సబబు. ఎట్టి పరిస్థితుల్లో ఎదిరించ వద్దు. అమ్మాయి కుటుంబాలను, వారి వ్యవస్థ, కట్టుబాట్లు, సంప్రదాయలను చెడగొట్టే హక్కు నీకు లేదు, అది మనసులో పెట్టుకుని వ్యవహరించి, సాధించు” అని చెప్పి ఇంక నీ ఇష్టం అన్నట్లుగా కొడుకుని చూసారు.

“అల్లాగే నాన్నా..” అని పడుకున్నాడు రాజశేఖర్. అమ్మతో మిగిలిన విషయాలు మాట్లాడాడు.

“సార్ మీ స్టాప్ వచ్చింది” అన్న డ్రైవర్ పిలుపుతో ఉలిక్కి పడి గతంలో నుంచి బయట పడి.. బస్సు దిగాడు రాజశేఖర్.

బస్సు దిగి ఆటో రిక్షా ఎక్కి గర్ల్స్ హాస్టల్‍కు వెళ్ళాడు. గేట్ దగ్గర జవానుకు చెప్పి వెళ్లి వెయిటింగ్ రూమ్‍లో అడుగు పెట్టిన ఒక క్షణం లోనే ఝాన్సీ పరుగెత్తుకొచ్చింది.

రాజశేఖర్, ఝాన్సీ ఒకరినొకరు చూసుకుంటూ కొన్ని క్షణాలు నిలబడి పోయారు. కొద్దిసేపటి తర్వాత “టిఫిన్ ఏమైనా చేశావా” అని అడిగి రాజశేఖర్ చేయి పట్టుకుని తీసుకెళ్లి కుర్చీలో కూర్చో పెట్టి తాను పక్కనే కూర్చుంది ఝాన్సీ.

“చేసాను.. వెళదామా.. నువ్ ముందు అమ్మ నాన్నతో మాట్లాడి తర్వాత నన్ను పిలిస్తే బావుంటుంది” అన్నాడు.

“వెంటనే.. వాళ్ళు ఒప్పుకోరు.. చూద్దాం ఏమంటారో” అంది భయంగా మొహం పెట్టి.

“సరే బయలుదేరు మరి” అని లేచాడు రాజశేఖర్.

బస్సులో ఇద్దరు ఏమీ మాట్లాడకుండా కూర్చున్నారు. రాజశేఖర్ భుజం మీద తలవాల్చి పడుకుంది ఝాన్సీ. ఊరి స్టాప్ రాగానే దిగారు ఇద్దరు.

పోయినసారి వచ్చినప్పుడు కొత్తగా కనిపించిన వూరు ఇప్పుడు చాలా ఆత్మీయంగా అనిపించింది రాజశేఖర్‍కి.

ఇద్దరూ కల్సి ఇంటి గేట్ లోకి అడుగు పెట్టగానే మొదటగా వాళ్ళని చూసింది సుగుణ. ఆవిడ మనసులో ఏదో కీడు శంకించి మొహం అసంతృప్తిగా పెట్టి, “ఏంటమ్మా, అబ్బాయి ఎక్కడ కలిసారు? రా” అంది..

“ఇక్కడే..” అని చెప్పి లోపలి వెళ్ళిపోయింది ఝాన్సీ.

ఆవిడకు నమస్కరించి బాబాయి ఇంట్లోకి వెళ్ళాడు రాజశేఖర్.

రాజశేఖర్‍ని చూసి తన బాబాయి, పిన్ని ఇద్దరూ ఆశ్చర్యపోయారు. మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత ఇద్దరినీ కూర్చోపెట్టుకుని అసలు విషయం చెప్పసాగాడు రాజశేఖర్.

ఝాన్సీతో రాజశేఖర్ ప్రేమ, పెళ్లి విషయాలు విని, అరుణ, చారి నిటూర్చారు.

“ఇలాంటి పల్లెటూర్లలో వాటిని ఆమోదించరు.. కష్టం, పైగా ఝాన్సీ నాన్నగారు పేరున్న పెద్ద మనిషి.” అని గంభీరంగా చూసాడు చారి.

“మనం వాళ్ళతో ఈ విషయం మాట్లాడటం కూడా ఇబ్బందే” అంది అరుణ అసహనంగా.

అదే సమయంలో ఝాన్సీ “నాకు ఆ అబ్బాయి నచ్చాడు అమ్మా, మంచి వాడు, కుటుంబం కూడా మంచిదే, నువ్వే ఎలాగైనా నాన్నకు నచ్చచెప్పాలి” అంది.

కాసేపటికి రంగారావు,ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కుని భోజనం చేసి బల్ల పీట మీద ఒరిగాడు. భార్య, కూతురు ఇద్దరూ వచ్చి పక్కన కూర్చోవటం చూసి లేచి కూర్చున్నాడు.

భార్య చెప్పినవి విని నోట మాట రాకుండా.. ఆలోచనలో పడ్డాడు రంగారావు.

“నాన్నా.. నీకు ఇష్టమైతేనే.. లేదంటే.. నేను మీరు చెప్పినట్లే చేస్తాను” అంది మెల్లిగా ఝాన్సీ.

“ఇంకా చెల్లెలు, అన్నయ్యల పెళ్లి కూడా నేనే చెయ్యాలి. కుల గోత్రాలు కాదు గాని, శాఖ బేధం కూడా మనకు కష్టమే. అమ్మా ఝాన్సీ.. నేను ఏమీ చెప్పే పరిస్థితిలో లేను. రేపు మాట్లాడదాము” అని వెనక్కి వొరిగి కళ్ళు మూసుకున్నాడు రంగారావు.

ఝాన్సీ బరువైన మనసుతో లేచి వెళ్ళింది. ఆ రాత్రి ఝాన్సీ ఆలోచిస్తూ చాల సేపు నిద్ర పోలేదు. కూతురు వెళ్ళిపోగానే, మంచం మీదనుండి లేచి భార్యను పిలిచాడు.

“నీ ఉద్దేశం ఏంటి.. ఏం చేద్దాం” అడిగాడు భార్యని రంగారావు.

“మీరు చెప్పండి. అబ్బాయి మాత్రం మంచివాడు. దాని జీవితం బావుంటుందని చెప్పగలను. ఇలా పెళ్లి చేయ వలసిన అవసరం మీకేంటి, అబ్బాయిలు దొరకరా అంటే, మన బంధువులకు సమాధానం చెప్పటం కష్టం.” అంది భయంగా.

రంగారావు ఏమీ మాట్లాడలేదు. లేచి కిటికీలో నుండి బయటకు చూస్తూ ఆలోచించ సాగాడు.

“సరే రేపొక సారి అబ్బాయితో మాట్లాడుదాం.. ఏమంటారు?” అంది భర్త వేపు చూసి.

సాలోచనగా భార్య వేపు చూసాడు రంగారావు.

రంగారావును చూసి అంది సుగుణ “ముందు అలా చేయటం మంచిది.”

దీర్ఘంగా నిట్టూర్చి మేను వాల్చాడు, కానీ అసలు నిద్ర పోలేదు రంగారావు.

***

మరుసటి ఉదయం అందరూ లేచి పనుల్లో మునిగి పోయారు.

అరుణ ఇంటి గుమ్మం వరకూ వచ్చి రంగారావు వేపు చూసి “అన్నయ్య.. రండి మా ఇంట్లో టిఫిన్ చేద్దురు కానీ” అని పిలిచింది.

“సరేనమ్మా, నువ్ పిలిస్తే కాదంటానా” అని నవ్వుతూ భుజం మీద కండువా వేసుకుని వెళ్ళాడు రంగారావు.

“నమస్కారం మామయ్య” చేతులు జోడించి అన్నాడు రాజశేఖర్.

“ఆ.. నమస్కారం బాబు.. చెల్లెలి పెళ్లి బాగా జరిగిందటా” అని కుశల ప్రశ్నలు వేసాడు.

“రాజు నువ్వెళ్ళి మీ బాబాయిని పిల్చుకుని రా, డాబా మీద ఉన్నట్టున్నారు” రాజును చూసి చెప్పింది అరుణ.

సందర్భం అర్థం చేసుకుని బయటకు వెళ్ళాడు రాజశేఖర్.

రంగారావును చూసి ఎలా మొదలు పెట్టాలో అర్థం కాక అంది అరుణ “అన్నయ్య గారు.. ఎలా చేద్దామనుకుంటున్నారు.. పిల్లల విషయం”

ఏమీ మాట్లాడకుండా.. తల కిందికి వంచి ఆలోచనలో పడ్డాడు రంగారావు.

మళ్లీ అంది అరుణ “కులాల ప్రస్తావన వస్తే కూడా.. పెద్ద తేడా అనుకోను. ప్రస్తుతం వాళ్ళకు ఆర్థికంగా కాస్త బాగాలేదు.. కానీ అబ్బాయికి మంచి భవిష్యత్తు వుంది.. గుణ గణాలల్లో బంగారం.” అని చెప్పటం ఆగి రంగారావు కేసి చూసింది.

గుమ్మం బయట పక్కకు నిలబడి వినసాగింది ఝాన్సీ. మౌనం వహించాడు రంగారావు.

“వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. భగవంతుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది. మనం నిమిత్తమాత్రులమే”  అనునయిస్తున్నట్లుగా అంది అరుణ రంగారావు మొహంలో వున్నబాధను గమనించి.

చాలాసేపు మాట్లాడలేదు రంగారావు. వున్నట్లుండి అడిగాడు “మా అమ్మాయిని వివక్షత లేకుండా మీ ఇంట్లో అందరితో సమానంగా ఆదరిస్తారా?” స్థిరంగా వుంది స్వరం.

“ఆ విషయంలో మీకెటువంటి అనుమానం అవసరం లేదు అన్నయ్య గారు… దానికి మేము హామీ. మాకూ అమ్మాయిలున్నారు” భరోసా ఇస్తూ అంది అరుణ.

“నాకు ఆలోచించుకోవటానికి సమయం కావాలి.. వస్తానమ్మా” అంటూ లేచాడు రంగరావు.

అది విని అక్కడనుండి పక్కకు తప్పుకుంది ఝాన్సీ. అది గమనించి వెళ్ళిపోయాడు రంగారావు. ఆ రోజు ఎక్కడకూ వెళ్లకుండా తన గదిలోనే ఆలోచిస్తూ ఉండిపోయాడు. మధ్యాహ్న సమయంలో భార్యను పిలిచి “అరుణమ్మతో చెప్పు.. వాళ్ళ అబ్బాయిని ఒక మారు పంపమని.” అన్నాడు.

ఆ మాట విని బయటకు వచ్చి అంతా వింటున్న కూతురిని చూసి “వెళ్లి.. రమ్మని చెప్పమ్మా” అంది సుగుణ.

కొద్దిసేపటి తర్వాత రంగారావు గదిలోకి ప్రవేశించాడు రాజశేఖర్. గదిలోకి వచ్చిన రాజశేఖర్ను  చూసి “రా బాబు కూర్చోండి” అంటూ ఎదురుగా వున్న చిన్న కుర్చీ చూపించాడు రంగారావు.

ఇద్దరూ కాసేపు ఏమీ మాట్లాడ లేదు. బయట ఝాన్సీ పక్కకు నిలబడింది. లోపలికి అడుగు పెట్టిన భార్యను చూసాడు రంగారావు.

గొంతు సవరించుకుని సుగుణ అంది “చెప్పండి బాబు, మాకు పెద్ద సమస్య ఇది.. ఏంటి మీ ఆలోచన?”

కొద్దిసేపు అలోచించి జాగ్రత్తగా అన్నాడు రాజశేఖర్ “మీకు సమస్య అనుకోకండి… నా మీద నమ్మకంతో మీరు, నన్ను ఇంటి మనిషి లాగ చూసుకున్నారు.. మీ అమ్మాయిని ఎటువంటి సమస్య లేకుండా జీవితాంతం చూసుకుంటాను. అంత మాత్రం చెప్పగలను”.

“మా కుటుంబంలో ఏమని సమాధానం చెప్పుకోవాలి, ఎందుకిలాంటి వివాహం అంటే ఎంతమందికి చెప్తాం?, మరి మీ ఇంట్లో వాళ్ళందరూ ఒప్పుకుంటారా?.. కట్న కానుక విషయం,..కుల గోత్రాలు.. అంతస్తులు, ఇవన్నీ ఎలా.. అసలు మాకు ఏమీ పాలు పోకుండా వుంది, పైగా మాకు ఇంకో చిన్నమ్మాయి వుంది, తర్వాత దానిపెళ్లికి ఇబ్బందులు వస్తాయి” అని ఆగింది సుగుణ.

“మా ఇంట్లో ఎటువంటి సమస్య రాదు.. అందరినీ ఒప్పిస్తాను.. ధర్మ,శాస్త్ర, సాంప్రదాయక పద్ధతుల్లోనే ప్రకారమే పెళ్లి జరుగుతుంది. ఎవరినీ బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు.. మీకు మనస్ఫూర్తిగా నచ్చినప్పుడే, మీ ఆశీర్వాదం తోనే వివాహం చేసుకుంటాను.. పెద్దలను ఎదిరించి నేను అడుగు ముందుకు వేయను… మీ కూతురు బాగోగులు మీ కంటే బాగా ఎవరికీ తెలీదు. కానీ మా ఇంట్లో వాళ్లకు నేను నచ్చచెప్పుకుంటాను. నాకు ఇంక ఏమీ అవసరం లేదు.. ఝాన్సీతో వివాహం చేయండి.” అని ఝాన్సీ తలితండ్రులకు నమస్కారం చేసాడు రాజశేఖర్.

అంతలో గదిలోకి ప్రవేశించారు చారీ, అరుణ.

వారిని చూసి “నమస్కారం బావగారు, రండి” అన్నాడు రంగారావు విషణ్ణ వదనంతో.

మరో రెండు కుర్చీలు తెచ్చి వేసింది ఝాన్సీ.

“మీరు మాట్లాడండి బాబాయి, నేనిప్పుడే వస్తాను” అంటూ లేచి బయటకు వెళ్లి తలుపు పక్కన నిలబడ్డ ఝాన్సీని చూసి ధైర్యంగా వుండు అన్నట్లుగా అరచేతితో ఝాన్సీ చెయ్యి గట్టిగా నొక్కి వెళ్ళాడు రాజశేఖర్.

చాల సేపు తర్జన భర్జనలు, సమస్యలు మాట్లాడి వచ్చేసారు అరుణ, చారి గారు. వచ్చే ముందు అరుణ అంది. “అందరిలో కలిసి పోయింది.. ఝాన్సీ…. మా వాళ్లలో చాలామంది చూసారు కూడా.. మా వరకూ ఎటువంటి ఇబ్బందులు రాకుండా మేము చూసుకుంటాము” అని చెప్పి వచ్చేసారు.

చాలా సేపు ఆలోచిస్తూ గదిలో పచార్లు చేసాడు రంగారావు. మెల్లిగా లోనికి అడుగులు వేసి మంచం పక్కగా నిలబడి అంది ఝాన్సీ “నాన్నా… నాకేమి వద్దు.. మీరు ఒప్పుకుంటే చాలు. ఆ అబ్బాయితో వివాహం మీకు ఇష్టం లేదంటే కాస్త ఆలోచించండి… అయితే నాకు అతడితో జీవితం బావుంటుందని తెలుసు… నేను జీవితంలో ఇంకేమీ అడగను.”

ఏమీ మాట్లాడ లేదు రంగారావు. దీర్ఘంగా ఆలోచిస్తూ మంచం పైన కూర్చున్నాడు.  కొద్దిసేపు నిలబడి.. నాన్న ఆలోచించటం చూసి వెళ్ళిపోయింది. ఝాన్సీ మనస్సులో భయం మొదలైంది. నాన్న ఒప్పుకోక పోతే ఎలా అన్న అనుమానం ఎక్కువైంది ఝాన్సీకి. అమ్మ దగ్గరకు వెళ్లి పక్కన కూచుంది.

“ఝాన్సీ..అన్నీ వున్న మనకు లేని పోని తలనొప్పి పెట్టావమ్మా.. మనవాళ్ళల్లో మంచి అబ్బాయిలు చాలా వున్నారు. వూర్లో, మన చుట్టాలల్లో ఎంత మందిని ఎదుర్కోవాలి. పైగా ఈ అబ్బాయిలో ఏంటి అంత గొప్ప విషయం… ఎందుకు మీ నాన్నను ఈ వయసులో మనం ఇంత కష్ట పెట్టాలి.. ఆలోచించు” అన్న అమ్మ మాటలు విని సమాధానం చెప్పింది ఝాన్సీ.

“అమ్మా.. నాకీ అబ్బాయి ఇష్టం.. వేరే ఎవరిని చేసుకోను.. మీరు ఒప్పుకోకుంటే నేనసలు ఇంక పెళ్లి చేసుకోను, కనపడకుండా ఎటైనా వెళ్ళిపోతాను” అని దృఢంగా చెప్పి ఏడుస్తూ పడుకుంది. కూతురి పరిస్థితి చూసి లేచి భర్త దగ్గరకి వెళ్ళింది ఝాన్సీ అమ్మగారు.

భార్యను చూసి అడిగాడు రంగారావు. “ఏమైంది?”

“దాని పరిస్థితి ఏం బావోలేదు.. ఆ అబ్బాయినే చేసుకుంటానంటోంది.. మనకు తప్పేట్లు లేదు” అని చెప్పి కళ్ళలో నీళ్లు పెట్టుకుంది.

“సరే, వెళ్లి అమ్మాయిని పిలువు” అని కళ్ళు మూసుకున్నాడు.

కాసేపటికి ఝాన్సీ గదిలోకి అడుగు పెట్టింది. తల వంచుకుని నేల చూపులు చూస్తూ నిల్చుంది ఝాన్సీ.

“అమ్మా ఝాన్సీ.. నే చెప్పేది జాగ్రత్తగా విను.. నీకు తెలుసుగా మన కుటుంబం.. మనకున్న గౌరవం ఎలాంటిదో.. ఈ వివాహం చేయటం నువ్వనుకున్నంత సులువు కాదు.. నీకేమో ఈ అబ్బాయి నచ్చాడు. మనింట్లో ఇంకా నీ చెల్లెలు, తర్వాత.. అన్నయ్యలకు పెళ్లి చేయాలి. ఇలా ఇప్పుడు నేను కులానికి, సంప్రదాయాలకు వ్యతిరేకంగా పెద్దరికం చేసి మీ వివాహం జరిపిస్తే నీ తర్వాత నీ చెల్లెలికి సంబంధాలు రావటం కష్టం అవుతుంది. ఈ పరిస్థితిలో నేను నీ పెళ్లి జరిపించ లేను.” అని ఆగాడు.

ఆ మాటలు విని ఝాన్సీ గుండెలు వేగంగా కొట్టుకో సాగాయి. ఒంట్లో శక్తి అంతా హరించుకుపోయింది.

మళ్ళీ అన్నాడు రంగారావు “నేనొక పని చేయగలను.. మీ పెళ్ళికి అంగీకరిస్తాను.. కానీ పెళ్ళి మీరిద్దరూ చేసుకోండి.” అంటూ గొంతులో ఏదో అడ్డం పడ్డట్లుగా ఆగి దుఃఖాన్ని అణుచుకుని మళ్ళీ మొదలు పెట్టాడు. “ఇంత కంటే నేను చెప్పలేను” అని ఆగాడు.

అది విని కింద కూర్చుండి పోయింది ఝాన్సీ. “వద్దు నాన్న నీవు లేని ఈ పెళ్లి నాకు వద్దు.. నాకసలు వద్దే వద్దు..” అని ఏడుస్తున్న ఝాన్సీని పైకి లేపి చెప్పాడు రంగారావు.

“అమ్మా.. నేను నీ సంతోషం, జీవితం గురించి అలోచించి చెబుతున్నాను…. నా ఆశీర్వాదలెప్పుడు నీకే.. మీరు హాయిగా ఉండటమే నాక్కావాలి. నేనెప్పటికీ నీ నాన్ననే, అబ్బాయితో మాట్లాడుతాను.. కాస్త ప్రశాంతంగా వుండు.” అని చెప్పి భార్య వేపు తిరిగి “ఆ అబ్బాయిని.. వాళ్ళ బాబాయి గారిని పిలువు” అని చెప్పాడు.

సుగుణ చెప్పిన విషయమంతా విని ఆశ్చర్యపోయి “పదండి మాట్లాడదాము” అని లేచారు చారి.

గదిలో రంగారావు చెప్పింది విని అన్నాడు చారి “మేమెం మాట్లాడాలో మాకర్థం కావటం లేదండి. ఒక కూతురి తండ్రి గా మీ బాధ మాకర్థం అయ్యింది.”

అంతా వింటున్న రాజశేఖర్ చాలా బాధగా అన్నాడు “మిమ్మల్ని ఇంత బాధ పెట్టి మేము సుఖ పడేదేమీ లేదండి. సంతోషంగా చేసుకోవలిసిన వివాహం ఇలా చేసుకోవటం, అందరినీ బాధ పెట్టటం సరి అయినది కాదు”

ఎవరూ మాట్లాడలేదు.

కాసేపు ఆలోచనగా పైకి చూసి అన్నాడు రంగారావు “ఎవ్వరూ బాధ పడొద్దని నేనీ నిర్ణయం తీసుకున్నాను, మీరు నన్నర్థం చేసుకుని నాకు సహకరించండి, ఈ వయసులో నేను వూర్లో, చుట్టాలల్లో అందరికీ సమాధానం చెప్పుకోలేను.” అని కూతురు వేపు చూసి

“అమ్మ ఝాన్సీ, నీకు నేనుప్పుడూ వుంటాను, నువ్వేమీ బాధ పెట్టుకోకు. నీ సంతోషం నాకు ముఖ్యం” అని తల నిమిరాడు.

“మరేం చేయమంటారు మామయ్య” ప్రశ్నార్థకంగా చూసాడు రాజశేఖర్.

రంగారావు తల లేపి చారి కేసి చూసి గొంతు బిగ పట్టి అన్నాడు “మీరు అమ్మాయిని తీసుకెళ్లి వివాహం జరపండి, తండ్రిగా ఖర్చులు, ఆడబిడ్డ సొమ్ము పంపిస్తాను”

అందరూ స్తబ్దులై పోయారు. ముందుగా చారి తేరుకుని “వచ్చే నెలలో మంచి ముహుర్తాలున్నాయి.. చూసుకుని కార్యక్రమాలు మొదలు పెట్టిస్తాను. మిగినవి మళ్ళీ మాట్లాడుకుందాము” అన్నాడు.

మరుసటి ఉదయం నాలుగు గంటల సమయం, చారి ఇంటి ముందు కార్ ఆగింది. ఝాన్సీ, చారి ఇంటి సభ్యులందరూ బయటకు వచ్చి నిలబడ్డారు. ఝాన్సీ, రాజశేఖర్ అందరికీ ప్రణామాలు చేసి ఆశీస్సులతో కారు ఎక్కి కూర్చున్నారు. కుటుంబ సభ్యులందరూ వీడ్కోలు చెబుతుండగా కారు ముందుకురికింది.

కళ్ళనీళ్ళతో వెనక్కి తిరిగి నాన్నను చూస్తూ వుండి పోయింది ఝాన్సీ. కూతురిని రెండు చేతులు పైకెత్తి ఆశీర్వదించాడు రంగారావు. కార్లోనుండి చేయి ఊపుతున్న కూతురిని చూడటానికి బాగా యత్నించాడు రంగారావు కానీ కళ్లలో ఉబుకుతున్న నీళ్ల మూలంగా చూడలేకపోయాడు. కంటి నీరు తుడుచుకుని చూసేటప్పటికి కారు చాలా దూరం వెళ్ళిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here