దర్శనాచార్యుని బౌద్ధ కావ్యం

0
12

[శ్రీ కొండూరు వీరరాఘవాచార్యులు రచించిన పద్య కావ్యం ‘అమరావతి’ లోని విశేషాలను శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల ఈ వ్యాసంలో వివరిస్తున్నారు.]

[dropcap]ద[/dropcap]ర్శనాచార్య బిరుదాంకితులు కొండూరు వీరరాఘవాచార్యులు రచించిన పద్య కావ్యం ‘అమరావతి’. మహోజ్జ్వల మైన అమరావతి గాథను వస్తువుగా చేసుకుని వ్రాసిన తొలి పద్య కావ్యం ఇది. ప్రాచీనాంధ్ర వైభవానికీ, అమరావతీ శిల్ప కళా లక్ష్మికి దర్పణంగా వారు ఈ కావ్యాన్ని రచించారు.

కవి విద్యార్థి దశలో మద్రాసు మ్యూజియంలో చూసిన అమరావతీ స్తూప శిల్పఖండాలు, వారిని అలనాటి ధాన్య కటక బౌద్ధ ఆంధ్ర వైభవ రచనకు ప్రేరేపించాయి. వారు ప్రాచీన గ్రంథాలు చదివిన వారు. ‘సంప్రదాయ జ్ఞానముతో అనుభవ పూర్వకంగా రచనలు చేసిన వార’ని విశ్వనాథ వంటి పండితుల ప్రశంసలను పొందారు.

‘శిల్ప సాహిత్యములు నాకు జీవగర్రలు

ఔప నిషద వనాలు విహార వీధులు’,

అని వచించారు కవి. ఆంధ్రాభిమానమూ, అకలంకమైన బౌద్ధ ధర్మాసక్తి, పరంపరాగతమైన శిల్ప కళాభిమానం. అనవరతమైన కవితావేశం, నిసర్గమైన ఔచిత్య సంపదా ‘అమరావతి’ కావ్యానికి ఉత్కృష్టమైన స్థానాన్ని కలిగించాయి.

ప్రాచీన శిల్పకళా నాగరికతలను తెలిపే ఈ కావ్యం విశ్వ శ్రేయాన్ని ప్రతిపాదిస్తుంది.

ఈనాటికీ మానవులను పీడిస్తున్న సమస్యలెన్నింటికో బౌద్ధ మతం పరిష్కార మార్గాలను చూపుతుందని విశ్వసించారు కవి. అమరావతిలో శిథిల కళాకృతులను చూసి కవి గారు పొందిన దుఃఖం కరుణరసాన్ని కురిపించింది.

ఆఢ్యులైన మనుజు లాదిగా వీధిలో

పేడ ప్రోవు చేయు పిల్ల దాక

చదువు నీతి గలిగి చదురులై వెల్గి రా

బౌద్ధ భూమిపతుల పాలనమున..

ప్రాచీన తెలుగు వైభవాన్ని తలచి ఉత్తేజితులయ్యారు కవి.

శాతవాహన రాజులు మగధ నుండి, కన్యాకుమారి వరకు, పరిపాలించే కాలంలో మూడవ శతాబ్దానికి పూర్వమే అమరావతి గొప్ప విద్యా నిలయంగా బౌద్ధ మత ప్రధాన పీఠంగా విలసిల్లింది.

ఆశోకుడు పంపగా బౌద్ధ మత వ్యాప్తి కొరకు వచ్చిన మహాదేవ భిక్షువు ధాన్యకటకాన్ని నివాసంగా చేసుకుని, శాతవాహనుల అభిమానాన్ని చూరగొన్నాడు. అతడు బౌద్ధంలో చైత్యక వాదం అనే సంప్రదాయాన్ని స్థాపించాడు.

అమరావతీ చరిత్రశోభకు ముఖ్య చిహ్నం అమరావతీ స్తూపము. బుద్ధుని నిర్యాణానంతరం ఆతని శరీరావశేషాలను ఉంచి కట్టిన ఎనిమిది స్తూపాలలో అమరావతీ స్తూపం ఒకటి.

బౌద్ధ మత ప్రచారకులు, నదీతీర ప్రదేశాలలో బౌద్ధ విహారాలను, స్తూపాలను, చైత్యాలను నిర్మించారు. కృష్ణా నది ఒడ్డున అమరావతి, నాగార్జున కొండ, జగ్గయ్య పేట, భట్టిప్రోలు, ఘంటశాల మొదలైన చోట్ల బౌద్ధ క్షేత్రాలున్నాయి.

బౌద్ధ మతస్థులకు, రెండవ బుద్ధుని వలె పూజనీయుడు నాగార్జునాచార్యుడు. ఆతని కాలం లోనే అమరావతీ విద్యా పీఠాన్ని ఆదర్శంగా తీసుకుని టిబెట్టులో లాసా నగర సమీపంగా దాపంగ్ సంఘారామాన్ని స్థాపించారు. దాపంగ్ అంటే ధాన్యరాశి అని అర్థం. ఉత్తర హిందూ స్థానంలో బౌద్ధ విద్యాలయాలు తక్షశిల నాలంద దంతపురి. దక్షిణ భారతంలో ధాన్యకటకం. వేంగి, కాంచీ పురం, శ్రీగిరి (నాగార్జున కొండ) ప్రసిద్ధాలు.

అమరావతీ స్తూపాన్ని నాగార్జునుడు అభివృద్ధి చేశాడు. ఈ స్తూపానికి చుట్టూ గల ప్రాకారాన్ని నిర్మింప జేసాడు. నాగార్జునుడు రాసిన సుహృల్లేఖ శాతవాహన రాజుకు నాగార్జునుని ధర్మోపదేశం పట్ల ఆకర్షితుని కావించింది.

సింహళం లోని అనూరాధాపురంలో మహా స్తూపం నిర్మించేటప్పుడు ఆంధ్ర దేశం నుంచి మహాదేవ భిక్షువు వెళ్ళాడు. అతడు పల్లవ ధోగం అని పిలువ బడిన పల్నాటి నుండి నాల్గు లక్షల అరవైవేల భిక్షువులను వెంట తీసుకునివెళ్ళి, సింహళంలోని స్తూప స్థాపనలో పాల్గొన్నాడు. అతని వెంట తెలుగు శిల్పమూ. నాగరికతలు అక్కడ విస్తరించాయి.

బుద్ధునిపై గల భక్తికి చిహ్నంగా బుద్ధునిజీవిత గాథలను, ఘట్టాలను, చరిత్రను చిహ్నాలను కూడ స్తూపాల మీద అఖండంగా చిత్రించారు. ఈ విధంగా విగ్రహారాధన లేని మతంలో శిల్పకళ, సౌందర్య పూజ నెలకొంది.

అమరావతీ స్తూపం త్రిజగన్మోహన మైనది. ఆయా కంబాలలో, ప్రాకారం గోడ మీద మనోహర దైవ శిల్పం మూర్తీభవించింది. భారతీయ శిల్ప సంప్రదాయంలో అమరావతీ రీతి ప్రత్యేక మైనది.

పూర్వం నాగార్జున కొండకు దగ్గరగా పెందోట (బృహద్వని) అనే నగరం, శిల్పాచార్యులకు నివాసం. ఈ శిల్పాచార్యులకు పెందోట పురవరాధీశ్వరులని పేరు. ఈ పెందోట పంచార్షేయ బ్రాహ్మణ ప్రభువుల పాలనలో ఉంది. 1570 నుండి, నలభై సవత్సరాలు ధవళేశ్వర మార్కండేయ ప్రభువు పెందోట రాజధానిగా ఆంధ్ర దేశాన్ని పరిపాలిస్తూ నాగరఖండము కృతి నందు కున్నాడు. (1951 ఏప్రిల్ భారతిలో వీర రాఘవ వ్యాసావళి) (1948 ఏప్రిల్ భారతి -అమరావతి -విజ్ఞాన పీఠము).

ఈ బౌద్ధము వైదికత్వంతో మేళవించింది. ఈ స్తూపాలలో ఆర్యక స్థంభ నిర్మాణ త్రిశూల కల్పన వైదికాన్ని ప్రతిపాదిస్తుంది. నాగార్జునుడు కూడా పెందోట శిల్పాచార్యుడే అనడానికి అతడు సమీపంలో ఉన్న కొండను ఆవాసముగా చేసుకొనడం అక్కడే స్తూప నిర్మాణమును కావించడం ఈ వాదానికి ఆలంబన మిస్తుంది.

ఈ అమరావతీ శిల్పాలననుసరించి ఆనాటి వస్త్రధారణ, నాట్యం, నాగరికత, వేణీ బంధములను చుట్టుటలో నేర్పు, అలంకారాలు, శృంగారము సింగారము, యుద్ధవీరులు ఆయుధాలను పట్టడంలో ఒడుపు ఇత్యాదులు ప్రకటమవుతాయి.

ఈ పవిత్ర క్షేత్రాలలోనే శ్రీముఖాది చక్రవర్తులు, ఆపస్తంబాది మహర్షులు, శాలివాహనాది కవి రాజులు, మహా శిల్పులు, నాగార్జునుడు, భావ వివేక స్వామి మొదలైన బౌద్ధాచార్యులు వణిక్కులు, వెలసారు. వివిధ పరిశ్రమలు నిరుద్యోగ సమస్యను దూరం చేసాయి.

“పొట్టకు గూడు, కట్టుటకు బుట్టము గానని పేదవారు లే

-నట్టి జగమ్ము నెట్లు సుగతాంధ్రులు సృష్టి యొనర్చి నారలో –

పంచ విధ శిల్పముల దేశ భాగ్యమునకు -సాధనముగా నొనర్చి ఐశ్వర్య లక్ష్మి

-సంతరించుట కానాటి స్థపతి వరులు-

వెదుక కున్నట్టి దొక చిన్న వృత్తి లేదు.” అన్నారు కవి.

అమరావతీ పద్య కావ్య ముద్రణకు, తుమ్మనపల్లి లింగయ్య, పురుషోత్తము సోదరులు 600 రూపాయ లిచ్చి తోడ్పడ్డారట. ఈ కావ్య ముద్రణ 1950, 51,66,79 లలో జరిగింది

ఆ మహత్తర చరిత్ర హ్యుయెంత్సాంగు అనే చీనా యాత్రికుని కాలానికి క్షీణ దశ (1948 భారతి అమరావతి విజ్ఞాన పీఠము) లో ఉన్నట్లున్నదని, నేటికి నామ మాత్రంగా మిగిలిన ప్రాచీన వైభవానికి కవి కన్నుల అశ్రువులు రాల్చారు.

కవిగారు కావ్య నేతగా కేసరి సింగు గారికి తమ కృతి కన్యా రత్నము నిచ్చారు.

కావ్యారంభం ఆముఖము లోనే – తాము అమరావతీ మధుర మంజుల గాథలను త్రవ్వి, తెనుగుల సచ్చరిత్రములను, ప్రతిభలను, తల పోసారు. ఆనాటి, బౌద్ధాంధ్ర కల్యాణ కథలు, వీరగాథలను తలచారు. ఆ ధాన్య కటక ఐశ్వర్యం వమ్మైన రీతిని తచుకుంటే, రాతి కైనా దుఖం పొంగి పొరలుతుందని పఠితలకు ఒకనాటి చారిత్రక వైభవాన్ని వినిపించనెంచారు. గతించిన ఆవైభవ చరిత్రను తలచుకొన్న దుఃఖార్ద్రతకు పఠితలను సిద్ధం చేసారు.

“రావోయీ” అంటూ కావ్య పఠనానికి పిలిచారు. పూర్వాంధ్ర ప్రభావంబు చేతో వీథి న్నటియింప పాడుచు సముద్యోగింత మీ వేళలన్ అని ఉత్సాహాన్ని ప్రకటించారు.

ఈ కావ్యంలో ప్రథమ ఖండము ఉపదేశము:

ఆనాడు జాతి విభేదం ఇసుమంతైనా పొడ చూపక సమత పరిఢవిల్లింది. అశోకుడు బౌద్ధాన్ని సర్వావనీ తలాన వ్యాప్తము చేయగా తలచాడు. అశోకుని పనుపున మహాదేవ భిక్షుకుడు శాతవాహను డేలు సామ్రాజ్య వీటికి వచ్చాడు. ఆరాజు సర్వమతాలను యోగ్యతా మూలము కావించాడు. ఆ రాజు ఆ భిక్షువునకు అంజలి ఘటించాడు. ఆతని మనస్సు బౌద్ధ ఘన ధర్మాలను విని నిలువెల్లా కరుణతో కరగి పోయింది. ఆ భిక్షుకుడు, శోక మొహములు పరిశోషమంది, సుస్థిరానందాన్నిచ్చే బౌద్ధమును ఉపదేశించాడు. జన్నములలో పశువులను చంపు పాప కర్మలన్నీ బుద్ధుని బోధ వలన రూపు మాసాయని,

“చీమ మొదలుగ గల సర్వ జీవకోటి

కడుపులో నీరు కదల కక్కటిక మలర

బ్రతుకు చుండవె యా ధర్మ రాజు తపము

కారణము గాగ మర్త్య లోకమ్ము నందు, ..”

అని చెప్తూ, వైదికం లోని దశావ తారాలలో బుద్ధ దేవుడొక్కరుడు, ఆ మతము అనీశ్వరము కాదని ప్రతిపాదించాడు.

అహింసా మతము దొడ్డదో చెడ్డదో ఆలోచించు కొనమన్నాడు.

తాను వచింప బోయే మాటకు మద్దతుగా ఒక బౌద్ధ గాథను విన్నవించాడు. ఒక కాపు కన్య తన పెయ్య మూపుపై గల పుండును చీల్చి తింటున్న కాకులను తరిమింది. ఆ పెయ్యకు భూత హిత బుద్ధి  కట్టు కట్టింది. ఆపై కాకులకు ఆహారాన్ని అందనివ్వక పాపం చేసానని తలచింది. కాకులకు ఆహారాన్ని అందించాలని ఒక చేయిని చీల్చుకొని గాయం చేసుకుంది. కాకములకు కారుణ్య దీక్షతో తన మాంసాన్ని తిండిగా పెట్టింది. అలనాటి శిబి చరిత్రను తలపిస్తూ పేదకాపు కన్య తన ‘మేని’ కండలను కాకులకు ఆమెతను చేసింది. ఇటువంటి బౌద్ధ గాథలు శిల వంటి హృదయాలను కరిగిస్తాయి కదా అని వివరించాడు. మునుపు కళింగ యుద్ధంలో కూడా బుద్ధ దేవుని బోధనల వలననేకదా అశోకుడు దయా వ్రతమ్మున దీక్షను పూనాడు! అని చక్రవర్తికి బౌద్దమత పారమ్యమును తెలిపాడు.

వెంటనే శాతవాహన సామ్రాజ్యం లోని సాంఘిక పరివర్తనాన్ని ప్రస్తుతించాడు. ఆ రాజు పాలనలో గరితలు సైతము క్రమ ధర్మములను, సంఘమును సేవించు చున్నారు. జనులందరకు చదువు సంధ్యలలో సమానావకాశాలున్నాయి, తమ జీవితాలలో ధర్మ సూత్రపాలన ప్రత్యంశములో కావిస్తున్నారు. అటువంటి స్థలంలో శాక్యసింహుని పుణ్యాస్థి శకలాల నుంచి, స్తూపాన్ని కట్టడానికి అనుమతిని కోరాడు. అంధ్రులలో సృష్టికి ప్రతి సృష్టి చేయగల శిల్ప పారగులున్నారని ప్రస్తుతించాడు. ఆ శిల్ప యోగుల తపము పండి బుద్ద మౌనికి శిల్ప పూజ చేయాలని విన్న వించాడు. ఆ రాజునకు భిక్షువుడిచ్చిన ఉపదేశం నచ్చింది. స్తూప నిర్మాణానికి అనుమతి నిచ్చాడు.

అది బృహద్వని, పెందోట. అది అసమ శిల్పీశ్వరుల విహార సీమ. ఆ తెలుగు శిల్ప కళామూర్తులే ఈ అవని నంతటిని మహిత శిల్ప ఉపవనంగా మార్చారు. అచ్చటి, వేద విద్యా పాండిత్య కళా ధౌరేయులను, శిల్పాచార్య గురువులను పిలిచి స్తూపము నొక్కటి నిర్మించమని ఆ రాజు ఆనతి చేసాడు. వచ్చిన శిల్పాచార్యులను తాంబూలమిచ్చి భక్తితో గౌరవించాడు. కళా మర్మాలను తెలిసిన ఆ రాజు వారికి మణులను, జాంబూ నద బహుమానముల నిచ్చి సత్కరించాడు. ఆశిల్పులు తెలుగు దేశమునందలి, పల్లీ నగరమ్ముల లోని, విశ్వ బ్రాహ్మణ శ్రేష్టులను తోడు చేసుకుని, ధాన్య కటకంలో స్తూప నిర్మాణమును ఆరంభించారు.

ఆ స్థపతులలో శిల్ప సహస్ర విశిష్ట ప్రతిభ కలిగిన మయుడను వాడొకడున్నాడు. ఆతనికి తోడుగా శిల్పు లు అందరూ, “నమ శ్శ్రీ విశ్వ కర్మణే” అని విశ్వ కర్మను వేదవిధులతో ధ్యానించి, చైత్య నిర్మాణాన్ని ఆరంభించారు.

రెండవ అధ్యాయం స్తూప శ్రీ:

సిద్ధహస్తులైన మన తెలుగు శిల్పులు మూడు వందల ఏళ్ళు అమోఘమైన తపస్సును చేసి, స్తూప శిల్ప కృతుల నిర్మాణం కావించారంటూ కవి ఈ అధ్యాయాన్ని అరంభించారు. చైత్య సంప్రదాయాన్ని స్థాపించిన నిర్మాణము సాంఘిక చరిత్ర పుటలలో, మహాచైత్యంగా జగత్ శాంతి దూత బుద్ధుని అంఘ్రి పద్మములందలి శిల్ప పుష్పాంజలిగా ప్రసిద్ధి వహించింది.

ఈ చైత్యంలో కరుణా రసముప్పొంగే బుద్దుని మూర్తికి రూపు దిద్దారు. యక్ష కామినుల భువన సౌందర్య రూపమును నిలిపారు. బుద్ధుని జీవన చరిత్రను, విచిత్ర జంతువులను, అచ్చెరువొందగ చెక్కారు. ఆ రాతి ఫలకములలో ఆంధ్ర సంస్కృతిని తీర్చిదిద్దారు. బుద్ధ సభ నంతటిని ఒక అద్భుత కళా నిధానమొనరించారు. బుద్ధుని బోధనములను వినుచు తన్మయం చెందిన మనుజ వ్రాతము నందరినీ చెక్కారు. “ఆ శిల్పుల కెంగేలికి చలువ రాయి నవనీతమై పోయింది” అన్నారు కవి.

సూచీ శిల్పాలలో ఏనుగులను, జనుల వైఖరులను, మనోజ్ఞ పద్మాలను చెక్కారు. ఊర్ధ్వ పటములలో నాట్య వేదాన్ని, నడిమి ఫలకాలలో బౌద్ధ జాతక కథలను, అపురూపంగా చెక్కారు. ఎన్నెన్నిశిల్పాలు, అదిగో అక్కడ బుద్దుని ధర్మ చక్రం, ఆ నైపుణ్యం అనూహ్యం, ఇక తెలుగువీరులు కూర్చున్న గుర్రాలు తెలుగు నాగరికతను నాల్గు దిక్కులందు విస్తరింపగా ఉన్నట్లుంది.

అపర బుద్దుడని పించుకున్న నాగార్జునుడు శిల్పాగ్ర శోభలను జిమ్మెడు ప్రాకార రేఖా కల్పన కావించాడు. ఆయక కంబాలలో పంచమూర్తులను, సృష్టి హేతువుల స్థాపనను కావించారు. ఈ పంచశక్తులు అభిన్న మత మూర్తులు. బుద్ధుడు, ధర్మము, సంఘము, అనే త్రిరత్నాలను, త్రిశూల చిహ్నంలో చెక్కారు. పద్మ చిత్రాలలో బుద్ధోదయాన్ని, వారువమ్ములలో మహాభినిష్క్రమణాన్ని, బోధి వృక్షమున మార జయమును, ధర్మచక్రాలలో సౌగత ధర్మ ప్రచారమును, స్తూప శతములలోమహా పరినిర్వాణమును, ఈ విధంగా శాక్యసింహుని జీవన సారాన్నంతా శిలా గ్రంథాలలో చెక్కారు.

కామ కల్పితమైన సంసార కంధి దాటి బుద్ధత్వ సిద్ధి నొందు గెలుపుకు చిహ్నముగా సింహ సముదాయాలను చెక్కారు.

ఇక బుద్ధుని పాదములు చెక్కిన రీతి అపూర్వం.

దివ్య తమ శిల్పముల నిట్లు తీర్చి, ఆత్మ నామంబులను చెక్కుకోనట్టి శిల్పులు ఎంత వైరాగ్యనిధులో, ఎంతటి కీర్తి కామనా దూరులో కదా!

ఆర్యక స్థంభాలలో లతలు, పూలు, అండ చిత్రాలలో దివ్యాకార మూర్తులు. ప్రాకార రేఖ మీద లోకాద్భుత శిల్పాలు, ఉష్ణీష శిల్పాల సముజ్జ్వల సౌందర్యం, ఊర్ధ్వ పటాలలోని దివ్య శిల్పాలు, అన్నింటిని చూచి ఉబ్బిన కవి, ఆ మహిత నిర్మాణ కళకు నమస్కరించారు.

నా కవిత చాలదోయి, సుందరములయిన,

నీ రచించిన శిల్ప ఖండికలనెన్న,

భావనా వీధి దలపుల ప్రాకులాడి,

మాయమైపోవుగడకే సమాధి యందొ!

ఈ అద్భుత. శిల్పాలను అన్య దేశీయులు తమ స్వస్థలాలలో భద్రపరచుకున్నారు అంటూ ముగించారు.

మూడవ అధ్యాయం వైభవము:

ఇందులోకవి పురా వైభవాన్ని వర్ణన కావించారు. ధాన్య కటకపురీ సౌందర్య లక్ష్మిని వర్ణిస్తూ, అదిగో అక్కడ బౌద్ధ సన్యాసులాదరించిన అనాథ బాలుర శరణాలయాలు అవిగో హోమ కుండాలకు ఆహుతికాబోవు, పశువులను రక్షించిన భవనాలు, అవిగో దీక్షా గృహాలు, అష్టాంగ యోగ బోధనాదివ్యశాలలు,

“పరుల గుండెలు తీయు బంట్లైన తెల్గు జో

-దుల బాకులు దిగంతముల వెలింగె

కులభేదములను ముక్కలుగా జీలిన

మానవు లేక సమాజమైరి”

శాంతి తోరణ స్థితమైన నగరంలో నౌకా శ్రేణులు తెల్గు వర్తకుల విన్నాణమును సూచించాయి.

అన్ని విధములా సుభిక్షమైన ఆ నగరంలో బుద్ధ దేవునిలా త్యాగమును చేసి జీవితాన్ని సార్థకం కావించుకున్న జనులు అగ్గలమై ఉండేవారు.

శాతవాహన నేత శ్రీముఖుడు, హాలుని గొల్చిన గుణాఢ్యుడు ప్రాగ్గాథలను కూర్చి బృహత్కథా రచనను కావించాడు. మహాయాన హీనాయానార్య బౌద్ధ శాఖాను యాయులు సమితులు గలసి బుద్ధుని తొంటి విజ్ఞాన రీతులను గూర్చి చర్చించుకున్నారు.

శాతకర్ణి ఆంధ్ర సామ్రాజ్యాన్ని దిక్కులకు పెంచి, నాల్గు దిక్కుల తెలుగు జెండాలను నర్తింప జేసాడు.

అమరావతీ శిల్ప కళా విన్యాసం చీనా, జపాన్. జావా సుమిత్రా కాంబోడియా లలో విస్తరిల్లింది. అంతే కాదు అమెరికా లో కూడ మన శిల్ప ఖ్యాతి అడుగు పెట్టింది.

సింహళ ద్వీపంలో స్తూప నిర్మాణానికి ఆంధ్ర దేశం నుంచి నాల్గు లక్షల శిల్పులు అక్కడకు వెళ్ళారట. ఆ సందర్భంలో ఆ చిరు ద్వీపంలో తెలుగు నాగరికతా సంపదలు అక్కడ నెలకొన్నాయట.

శాలివాహనుడు ప్రాకృతంలో మేలిమి గాథలను ఏడు నూర్లు రచించాడు. భాష ప్రాకృతంలో

‘జుమ్మని తేటులు మూగెనో,

కమ్మని వాగ్దేవి గజ్జె కదలించెనొ, మా

కుమ్మరి దొరగారిమ్మహి

కమ్మని గాథా మథూళి గార్చెడు వేళన్’

అని వాకొన్నారు కవి. శ్రీనాథుడు నూనూగు మీసాల నూత్న యౌవనంలో దీనిని తెలుగు చేసాడు.

అమరావతీ వైభవాన్ని ఆచార్య నాగార్జునుని తలంపు ద్విగుణీకృతం కావిస్తుంది. నాగార్జునుడు మహా యాన బౌద్ధ శాఖా ప్రణీత. అతడు శాతవాహన రాజుకు సుహృల్లేఖను పంపాడు. ఆతని నిర్దేశాన్ని పరమ పూజ్యంగా తలచి శిల్ప కళా చైత్య నిర్మాణములు వెలశాయి.

ఆదిశంకరులు నాగార్జున కొండ అభ్యుదయము వికృత బౌద్ధముగా పరిగణించి వేద ధర్మ సంస్థాపనా సమయంలో ఖండించాడు.

అమరావతీ వైభవ చిహ్నం విశ్వవిద్యాలయం. ఈ కళాపరిషత్తు మరెన్నో దేశములకు ఆత్మ విద్యను బోధించింది. అక్కడ ఎనిమిది వేల శిష్యులు శాస్త్రములను, కళలను అభ్యసించారు. శతాధిక పండితులు శాస్త్ర చర్చలను జరిపారు. శిల్పులు కవులు నిత్య కళార్చన కావించారు.

ఆ విశ్వవిద్యాలయ ప్రవేశ ద్వారం అతిలోక శిల్పాలకు ఆట పట్టు. యోగ్యతా పత్రాలను పట్టభద్రులకు అందించిన దివ్య భవనం, శాస్త్రార్థాలను బోధించిన హర్మ్యాలు, పుస్తకాగారము ఇత్యాదుల ఘనత టిబెట్టులో నిర్మితమైన దాపంగు విశ్వవిద్యాలయానికి ఆదర్శంగా నిలిచింది.

అమరావతిలో బుద్ధజయంతి ప్రతి వసంత వైశాఖాలలో వాడ వాడలలో వెలిగి పోతుంది. ఆ పవిత్ర దినాన ప్రభుడు ధర్మ చక్రాన్ని తిప్పాడట. అటువంటి ధర్మ చక్రం ప్రజలలో హెచ్చు తగ్గులను తరిమింది. అందరికి అందదగిన నిత్య నిర్వాణ సిద్దికి బౌద్ధ ధర్మం ఒక్కటే ప్రాతిపదిక అయింది. అద్భుతమైన నిర్వ్యాజ మానమైన బౌద్ధ ప్రాచుర్యానికి ‘లలిత విస్తర ‘కావ్యాన్ని చదివి అందులోని నవ ధర్మపద్ధతులను ఆంధ్ర పండితులు బుద్ధ మతాభిమానులకు వివరించారు.

ఇక విషాదము ఆరంభ మయింది

సుధన్వుడను రాజు సభలో బౌద్ధ వాద ప్రతివాదాలు ఆరంభం అయ్యాయి. కుమారిల భట్టు వైదిక మత వాదాన్ని కావించాడు. ఆతని వాదాన్ని అందరూ మెచ్చారు. ఆ రాజు బౌద్ధులను ఆగ్రహించాడు. తానొక పరీక్షను పెట్టదలచాడు. గెలిచిన వారు ఉండవచ్చు నన్నాడు. ఒక చిలువను ఘటములో బిగించి, ఆ కుండలో ఉన్న వస్తువును చెప్పమన్నాడు.

వేదపండితులు గెలిచారు. రాజు బౌద్ధులను ఖండించ సాగాడు. ఒకప్పటి బౌద్ధ విహారవాటి ఇప్పుడు ‘శవ నివాసోగ్ర భయద శ్మశాన వాటి’ అయింది. ‘బౌద్ధ మునీంద్ర మహిష్ట ధర్మ బోధ లన్నీ గాలి కబుర్లయ్యాయి’.

ఒకప్పటి ముసాఫిరు ఖానాలన్ని పాయిఖానాలయ్యాయి.

“బౌద్ధ మత చిహ్న మన్నదేపాటి యున్న

పొడి పొడి యొనర్చి కృష్ణమ్మ కడుపులోన” –

అంటూ మత విద్వేషుల దుష్కార్యాలకు కవి చింతిల్లారు. ఈ విషాదాన్ని కవి నిజ చరిత్రల గత నేపథ్యంతో కరుణరసాత్మకం కావించారు.

ఇక ఒకప్పటి బౌద్ధ దేవాలయంలో ఇప్పుడు అమరేశ్వర స్వామి కొలువయ్యాడు. తెలుగు దేశాన ఆరామ పంచకాలలో ఒకటైన అమరేశ్వరాలయం కొండవీటి రాజుల మేలి సేవలలో కొత్త చెలువాన్ని పొందింది. పురాతత్వ విదులకు ఆ గుడిలో బౌద్ధ చిహ్నాలు కనుపడుతాయి.

కరుణా సాంద్రుడు అమరేశ్వరుడు, బుద్ధుడు కరుణా మయుడు, వారిరువురి పరమ స్నేహం తెలుగు దేశానికి ఐశ్వర్యమును తెచ్చింది. మరల ఆనాటి హైందవ కళా లక్ష్మీ విలాసోన్నతులు వెలయింపగా ఇరువురు సమకట్టాలన్న మంగళాశంసతో కావ్యాన్ని ముగించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here