దశావతార సూర్యకాంతం!!

1
13

[శ్రీమతి సూర్యకాంతం శతజయంతి సందర్భంగా ఆమె నటించిన పాత్రల స్వభావాలతో ఈ రచనని అందిస్తున్నారు సముద్రాల హరికృష్ణ.]

(వాణి, బాణి, వాగ్ధోరణి!)

1. పెళ్ళి పెద్ద!!

ఏవమ్మోయ్, ఏవిఁటీ ఈ ముచ్చట్లు! పెళ్ళెప్పుడనుకున్నావేం, తెల్సుగా! రేపీ పాటికి పెళ్ళి వాళ్ళతో ఇల్లు కళకళలాడి పోతుంటుంది, అది గుర్తుంచుకుని, పనుల మీద ధ్యాస పెట్టండి, అందరూనూ!

ఇదిగో, అన్నపూర్ణమ్మా, ఇటు రావమ్మా ఓ క్షణం!  రాత్రికల్లా బంగారు బంతుల్లల్లే, లడ్డూలు బుట్టల్లో నిండిపోవాలి. కాస్త ఏలకులు, పచ్చకర్పూరం దట్టించి వేయమను ఆ వంటవాళ్ళను. సువాసన ఘాటుకి, వియ్యాలవారు మైమరచిపోవాలి. ఒకటి తినేవాళ్ళు రెండు తినాలి, అర్థమయ్యిందా?! ఊఁ, నీదీ పూచీ ఇక, పైగా అవి వాళ్ళకు విడిదికి పంపించాల్సిన వాటిలో అతి ముఖ్యమైనవి కూడా!

అన్నట్టు పులిహోర ఎవరూ కలిపేది?! ఆ భీమయ్యేనా, ఆఁ, బాగానే చేస్తాడులే, కానీ ఇంగువ విషయంలో అతనితో హెచ్చరించాల్సిందే! వేస్తే ఎక్కువేస్తాడు, లేదా బొత్తిగా పీనాసి భద్రయ్యై కూచుంటాడు. తగు పాళంలో ఉండాలమ్మా వంటలో ఏదైనా, ఏమంటావ్?!

నేను చేస్తే, పులిహోర ఇంగువ వాసన మా రాజమండ్రి నుంచి గుప్పుమని ఇచ్ఛాపురం వరకు కొట్టాల్సిందే! అట్లాగని, రుచి విషయంలో వీసమంత తగ్గటానికి లేదమ్మోయ్!

ఊఁ, సరే వెళ్ళు, ఆ పనులమీద ఉండు!!

***

2. సవతి పోరు!

హయ్యో హయ్యో, నా ఇల్లు గుల్ల చేసేశాడ్రోయ్ దేవుడా, అంతా దానికే తోడి పెట్టేస్తున్నాడు! ఇంక నాకూ నా పిల్లలకు, చేత చిప్పే గతి, ఓరి దేవుడా నేనెవరికి చెప్పకోన్రా ప్రభో!!

ఇంత చక్కని దాన్ని నాలో లేనిదేవిటి, ఆ చుప్పనాతిలో ఉన్నదేవిఁటీ అని?! అయినా మన బంగారం మంచిదైతే, అనుకోవటానికి ఏముందీ?!ఇదంతా నా ఖర్మ!

ఏ నోములో ఏ వత్తులు తక్కువ పెట్టానో, ఏ పోపు విషయం ఆలోచిస్తూ, మా లలితమ్మ స్తోత్రం పరాగ్గా చదివానో, ఓరి దేవుడా, ఏ దేవత నడగనూ, ఎక్కడికెళ్ళనూ, ఏమీ పాలుపోవడం లేదే!

ఈ గుంటలందరూ, ఇంకా అమ్మ కూచులై, నా చుట్టూ తిరిగే వాళ్ళేరా భగవంతుడా!

చీమకు కూడా అపకారం చేయని పతివ్రతను- నాకీ అవస్థ తెచ్చిపెట్టావేమిట్రా తండ్రీ! తిరుపతి వెంకన్నా, దయ చూడవయ్యా ప్రభో, నా కాపురం నిలబెట్టవయ్యా!

ఆ జోలి ఆయన చేత వదిలించేస్తే, వెంటనే ఆయనకు గుండు ఖాయం ప్రభో, నీ కొండ మీద! నేను మొక్కుకుంటున్నాను నమ్ము ప్రభో, రక్షించు, వెంకన్నా!!

అబ్బ, నోరెండిపోతోంది, ఇదిగో లక్ష్మీ,ఓ గ్లాసెడు మంచినీళ్ళు ఇయ్యమ్మా!

***

3. తెలివి నా సొత్తు!!

ఇదిగో, మీకేమీ తెలియదు, బెల్లం కొట్టిన రాయిలా మీరు చడీ చప్పుడు లేకుండా ఊరుకోండి, నే నడిపిస్తాగా కథంతా! ఈ రాజమండ్రి రాజ్యలక్ష్మి అంటే, ఏవిఁటో తడాఖా చూపించనూ?!

తిమ్మిని బొమ్మిని జేసి మీ తమ్ముడి మతి పోగొట్టి, ఆస్తి మొత్తం మీ పేర బదలాయిస్తాను, మఠం వేసుకుని కూర్చొని చూస్తూ ఉండండి, చాలు!!

భర్త: నీ కెందుకే, మేము అన్నదమ్ములం మాట్లాడుకుని, ఫైసలా చేసుకుంటాంగా?!

ఈమె: ఆఁ ఆఁ, చేసుకుంటారు, ఆ తెనాలి పొలం పంపకంలో మీరేం నిర్వాకం చేసుకొచ్చారో మర్చిపోయారా, లేక నేను మర్చిపోయానని అనుకుంటున్నారా?! అదేమీ కుదరదు, ఈ సారి నేనే చూస్తాను వ్యవహారమంతా!

ఎవడొస్తాడో చూస్తాను నా దారి కడ్డం,నేను చెప్పే న్యాయానికి ఎదురూ?!

భర్త: ‘ఎవడు’ కాదే, ‘ఎవతె’, అను! మా మరదలు, అదే నీ తోటి కోడలు రంగంలోకి దిగుతుంది, పైగా ఆ అమ్మాయి, బీ ఏ కూడా!

ఈమె: బీఏ అయితే నాకేంటి, ఎఫ్ ఎం అయితే నాకేంటి, నే తగ్గేదేలేదు.

భర్త: ఓసినీ, బీఏ అంటే ఎఫ్ఏ కంటే ఎక్కువే!!

ఈమె: అవన్నీ అనవసరం అండి నాకు. డిగ్రీ ల్లేకపోతే ఏం, మా నాన్న వారసత్వంగా ఇచ్చిన తెలివి లేదూ, మా నాన్న కరణం అండి, ఈ లెక్కలు, గోల్మాళ్ళూ అన్నీ మా పుట్టుకతో వచ్చే బుద్ధులు, మరేమీ బెంగ లేదు, అర్థమయిందా?!

భర్త: అఘోరించు, అనుభవించు-నీ కర్మకు నే కర్తనా?!

***

4. తోడికోడలు!

ఆహాహా, అక్కడికేదో నీవు ఇంటిల్లిపాది చాకిరీ చేసి అలసిన దానివీ, నేనేమో పూచిక పుల్ల ఇటు దటు పెట్టని, ఒళ్ళొంగని బద్ధకపు జేజెమ్మనూ! ఏం నంగనాచి వేషాలే! అత్తగారమాయకురాలని తెలిసి, ఆటాడిద్దామనేగా!

నే సాగనిస్తాననే, ఈ అన్యాయం?! నా బొందిలో ప్రాణం ఉండగా, మా అత్తగారిని మోసపోనిస్తానా?!

***

5. మాటల కోటలు!!

నా మొహం, ఆ ఎదురింటి వెంకటలక్ష్మికి డిగ్రీలు తప్ప, భాష ఎక్కడిదే?! నాలుగు వాక్యాలు ఇంగ్లీషులో పట్టుమని మాట్లాడలేదు, ఆమె గారు మహిళా మండలి అధ్యక్షురాలు, నా శ్రాధ్ధమూ! నేను చదువుకోక బోతే ఏం, స్టేజీ ఎక్కానంటే దడదడలాడించనూ, ఏ భాషలో నైనా! ఈ సరస్వతమ్మతో, ఈ పిడత లేవీ నిలబడవు, తెల్సుకోవే,సుబ్బీ!

ఏవంటావే, ఉలుకు పలుకూ లేదు! హాసిని, తుర్రుమన్నట్టుంది!

***

6. పతి సేవ!

భర్త: అబ్బా, ఉండవే అలా లాగితే, పాదపూజ సంగతేమో కానీ, ఒంటి చేయి వాణ్ణవటం ఖాయం, ఆ తరువాత నీ ఇష్టం!

ఈమె: హేమీ కాదు, మీ కేవిటి ఉక్కు కడ్డీలా ఉంటేనూ! అయినా అన్నింట్లో ఇంత నెమ్మది పనికి రాదు, చేయాలనుకున్న పూజ వెంటనే జరిగిపోవల్సిందే, నా ఖాతాలో ఆ కాస్త పుణ్యం జమ అయిపోవల్సిందే! అబ్బబ్బ, ఉంచండి ఆ కాళ్ళు కదల్చకుండా, పళ్ళెంలో రెండు నిమిషాలు, ఈ పూజే నా మాంగల్యానికి అమ్మవారి రక్ష, తెలుసా! ఎవ్వరేమన్నా, ఎవ్వరికేమి అయినా, నేను చేసే తీరుతాను.

భర్త: ఎవరికో ఏదో ఎందుకవుతుంది, అయితే నాకే ఏదన్నా అవుతుంది, ఇట్లా నన్ను గంటల పాటు పళ్ళెంలో కాళ్ళు పెట్టి కూచోమని నిర్బంధిస్తే, తెలిసిందా?!

ఈమె: ఏమన్నా అయితే, ఆ యముడితో పోట్లాడి మరీ మిమ్మల్నిబతికించుకుంటాను. మర్చిపోయినట్టున్నారు-సతీసావిత్రి వంశం దాన్ని నేను,ఆషామాషీ కాదు మరి!

భర్త: అంతటి వాళ్ళతో ఎందుకే మనకు పోలికలూ, సామ్యాలూ?! గుట్టుగా ఉందామే, అంటే వినవుగదా,హతవిధీ!

ఈమె: అయిపోయింది, ఇంకెంత సేపు, ఓ గంటే!

భర్త: ఇంకా గంటా, నాకు వాడి గంట వినిపించేట్టే ఉన్నావు ఇవాళ! కానీ, విధి బలీయం!

***

7. వీరమాత!

సుపుత్రా, సుపుత్రా, ఇపుడెవరి మీదకు నాయనా యుద్ధము?!

కొడుకు: ఇది సన్నాహము మాత్రమే మాతా, రాబోవు మహాయుధ్ధమునకు!

ఈమె: అది చక్కటి యత్నమే సుపుత్రా, అటులే కానిమ్ము! అది పుత్రునిగ నీ కర్తవ్యము కూడ. మీ తండ్రికి బాసటగ నీవుండిన, నేను మెచ్చుకొనెదను! వారును సంతసింతురు. కీర్తిమంతుడవు కమ్ము, నాయనా, నీ సేనలను ఇట్లే ద్విగుణం, బహుళము కానిమ్ము! ఇంతకు అంత చేసి, అంతకు మరింత చేయకున్న, మన జాతి గౌరవమేమి కావలె, మీ తండ్రుల విక్రమ పౌరుషము లేమి కావలె! వీరమాతగ, నా ఆశీస్సులివె, సుపుత్రా, వర్ధిల్లుము!

***

8. అత్తగారు!

ఈమె: ఇదిగో, ఏమేవ్ సక్కూ ఎక్కడా?!

సక్కు: ఇక్కడే ఉన్న నత్తయ్యా!

ఈమె: ఆఁ, అట్లా బుధ్ధిగా మసలుకో! ఆ గుండిగ పప్పు విసిరి తొందరగా ముగించి రా! కాళ్ళు లాక్కుపోతున్నాయి పట్టాలి, లేదా ప్రాణం పోయేటట్లు ఉంది! విన్నావా?!

సక్కు: పోనీ ఇప్పుడే పట్టమంటారా?!

ఈమె: ఏమి నంగనాచి మాటలు నేర్చావే, ఆ వంకన ఈ పని ఎగ్గొట్టచ్చు అనేనా?! నా దగ్గర ఈ పప్పులు ఉడకవు, పూర్తి చేసి రా, అంతే! (కాస్సేపాగి,) ఏవిటే,నన్ను చంపేద్దామనేగా నీ ఆలోచన, కాస్త ఆలస్యం చేస్తే అదే పోతుంది, హాయిగా అమాయకుణ్ణి చేసి,మా వాడిని ఆడించివచ్చని కాదూ నీ ఉపాయం?! కుదరదు తెలుసుకో, నేను గట్టి ఘటాన్ని ఇప్పుడే ఎక్కడికీ పోను! కనుక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మసలుకో! (కాళ్ళు పట్తుంటే) అబ్బబ్బ, మెల్లగానే! కంఠం బదులు,కాళ్ళు పిసికి అంతం చేయాలనే?! ఎండ కన్నెరగకుండా పెరిగిన దాన్ని, నీ బండ చేతుల బలం నే నోర్చుకోలేను! అయినా, పని ఎగ్గొట్టి, తిని కూర్చుంటే, ఇట్లా మొరటు బలం కాక ఏమొస్తొంది, చోద్యం కాకపోతే!

ఊఁ ఊఁ ఇక చాలు, బావిలో నీళ్ళు తోడి, ఆ  గంగాళాలు నింపు! వెంటనే, స్నానం చేసి, నదికెళ్ళి, మంచినీళ్ళు తీసుకొచ్చి, వంట చేసి తగలడు! నేను ఓ గడియ నడుము వాల్చి లేస్తాను, అబ్బా అన్నీ నేనే చూసుకోవటంతో, అలసటగా ఉంది! అట్లా గుడ్లేసుకొని చూస్తావేం, కదులూ!

అబ్బో, ఏమి నాజూకులే! కలికాలం కాకపోతేను!!

***

9. దొడ్డ ఇల్లాలు!!

ఏవండోయ్, ఇల్లు జాగ్రత్త, అసలే మీకు మతిమరుపు! నేను, మన పది మంది పిల్లలూ, అలా మన కారులో షికారుకు కెళ్ళి బీచీ చూసి, బృందావనం వెళ్ళి వస్తాము.

భర్త: బృందావనం అంటే, ఆ పార్కు పక్కనే ఉన్న హోటలు, అదేగా!

ఈమె: అహఁ కాదు శ్రీక్రిష్ణ మూర్తి వారు నడయాడే బృందావనం! ఫ్లూటు కచ్చేరి విందామని! లేకపోతే పిల్లలకు ఏదో సరదాగా వెళ్ళేది హోటలు గాక, దేవళం అవుతుందిటండీ, అంతా చాదస్తపు గోల మీది. ఏయ్, పిల్లలు అందరూ వచ్చారా?! (వచ్చాం అమ్మా, అందరం వచ్చాము.)

ఈమె: వచ్చామని అట్లా నోటితో అంటే చాలదు, పేర్లు పిలుస్తాను, ఒక్కొక్కరూ చేయి పైకి లేపాలి. ఇట్లాగే అందరూ ఉన్నారనుకొని కిందటి సారి, సర్కస్‌కి వెళ్ళేటప్పుడు, సరిగ్గా పులి వచ్చే టయానికి చూస్తే, చంటివాడు కనబడలేదు. వాడెక్కడ తప్పిపోయాడ్రా భగవంతుడా. అనుకుంటుంటే, డ్రైవరు పక్షి తీసుకొని వచ్చాడు, వీడు డిక్కీలో దూరిపోయాట్ట!

వీడికి నాలుగు  అంటించి, వాడిని డిస్మిస్ చేస్తే గాని నా కోపం చల్లారలేదు. ఆ మాత్రం బాధ్యత లేదూ, వెంటనే తెచ్చి అప్పగించ నక్కర లేదు, ఆ డ్రైవరు!!

ఊఁ, పాడ్యమీ!

ఉన్నానమ్మా!

షష్టి వరకు బాగానే సాగింది వరుస, సప్తమి అనగానే ఉలుకు లేదు, పలుకూ లేదు!

పాడ్యమి లంకంత ఇల్లూ, వాకిలీ అంతా వెదికి, మల్లెపొదల్లో దాక్కుని, ఒక్కతే దాగుడుమూతలు ఆడుకుంటున్న సప్తమిని మొత్తానికి తెచ్చింది.

అందరూ బయలుదేరి, నెమ్మదిగా దూరం దారిలో ప్రయాణించి, బీచ్ చేరి,ఓ గంటన్నర తర్వాత ‘బృందావనం’ చేరారు.

అందరికీ ఎవరికి ఏది కావాలో ఇప్పించిన కాంతామణి గారు,- ఉత్త కాంతామణి గారు కాదు, రోటరీకి అధ్యక్షురాలు!(లేడీస్ వింగ్)-తాను ఒక ఇడ్లీ ముక్క నోట్లో వేసుకో బోతుంటే యుద్ధం మొదలైంది.

చవితి, ఏడుస్తూ చెప్పింది: “అమ్మా, తదియ నా మీద ఇడ్లీ విసిరి కొట్టింది, చూడు”!

వెంటనే, పాదరసం లాంటి బుర్ర అని గర్వించే మణి గారు సలహా పడేశారు!

“నువ్వు చట్నీతో కొట్టమ్మా, ఊరుకుంటావేఁ!!”

ఆ పిల్ల అదే చేసింది!

దాంతో పది మంది పిల్లలు, తినటం సంగతి మర్చిపోయి, ఒకరిమీద ఒకరు పచ్చడితో, ఇడ్లీ వడలతో కొట్టుకోసాగారు. మరీ కంట్రోల్ తప్పే లోపలే, బేరర్లూ, మేనేజర్లు వచ్చి పిల్లమూకని శాంతింప జేశారు. మణి గారు అందరికీ ధాంక్సులు చెప్పి, టిప్పులు దండిగా చదివించి బయట పడ్డది. నాది మహా పకడ్బందీ పెంపకం అని ఆవిడ గట్టి నమ్మకం కూడా!

నమ్మకం మాత్రమేనా, ఈ విషయం మీద, అంటే పిల్లల పెంపకం మీద పలుసార్లు మహిళా మండలిలో, లేడీస్ క్లబ్ లో ఉపన్యాసాలు దంచి పారేస్తేనూ!!

***

10. సవతి తల్లి!

ఇదిగో. లక్ష్మీ, ఎక్కడున్నావే, అరిచీ అరిచి నా శోషొస్తోందే గానీ ఉలకవూ, పలకవూ! ఇట్లాగైతే కుదరదమ్మాయ్, తెల్సుకో! నా నోటి మాట ముగిసింది లేదో, నా ముందుండాలీ, నాక్కావాల్సింది చెయ్యాలి, అంతే!

లక్ష్మి: నువ్వే కదు పిన్నీ, పాలు పితకమన్నావు,అందుకని ఆ పనిలో ఉన్నాను-వినిపించలేదు, నువ్ పిలిచింది!

ఈమె: ఆహాఁ, అంతవరకు వచ్చిందీ-వినిపించలేదు, కనిపించలేదు, అనిపించలేదు ఇట్లాంటి కుంటి సాకులు నా దగ్గర చెల్లవ్, తెలుసుకో! పిలుపంటే పిలుపే నాది, ఒక్కటే సారి పిలుస్తాను, వచ్చి నా ముందు వాలాలి, వినిపించినా, వినిపించక పోయినా,అంతే!

లక్ష్మి: (బిక్క మొహంతో) అట్లాగే పిన్నీ!!

ఈమె: (మొహం వెలిగిపోతూ) ఆఁ, అదీ మాట!

(ఇంతలో ఆమె సొంత కూతురు, సరళ కాలేజి నుంచి వచ్చి, విసవిసా మేడ పైకి తన గదిలోకి వెళ్తుంది.)

ఈమె: చూస్తా వేమిటే, ఎంత అలసిపోయిందో నా తల్లి, వెళ్ళి కొనుక్కో, ఏం కావాలో, శిలా విగ్రహం లాగా నా ముందు నుంచోక!

(అంతలో వేయి గుళ్ళ పూజారి, పెళ్ళిళ్ళ శరభయ్య వస్తాడు)

శర: నమస్కారమమ్మా, కులాసాయేనా?! ఈ వీథి గుండా వెళ్తూ, పెద్దలు, తమర్ని పలకరించి వెళ్దామని వచ్చాను.

ఈమె: ఆఁ, రావయ్యా రా! ఏం లాభం, నే చెప్పిన పని మాత్రం చేయలేక, పలకరింపు కొచ్చాడట, పలకరింపుకి!

శర: మీ పెద్దమ్మాయి లక్ష్మి పెళ్ళి గురించేనా?! చూస్తున్నానమ్మా, త్వరలో చెప్తాను!

ఈమె: ఇదిగో, ఆ మాటంటేనే, నా కరికాలి మంట నెత్తికెక్కేది! పెద్ద కూతురట, పేద్ద కూతురు! ఏదో అణా కాణీ సంబంధం తేవయ్యా, కట్టబెట్టేసి, ఇద్దరినీ పనివాళ్ళుగా ఆ కొట్టంలో పడి ఉండమందామని, నా ఆలోచన అయితే!

నీకేమి బోధ పడ్డట్లేదు అంతరంగం! నీ దెక్కడి పనికిరాని గడుసుదనమయ్యా, శరభయ్యా?!

శర: అంత మాటనవాకండి, తల్లీ, మీ లాంటి వారి ప్రాపకం లేకపోతే, నా మనికి ఏం గాను?! అన్నట్టు, మొన్న తిప్పాపురం వెళ్ళినప్పుడు, పొలం దగ్గర, ఒకణ్ణి చూశానండీ! అయ్య, అమ్మ, అక్క, చెల్లి, ఎవ్వరూ లేని అనాథ, అమాయక పక్షి! దుక్క లాగా ఉన్నాడు, మీరు ఎంతైనా చాకిరీ చేయించు కోవచ్చు! వాడైతే ఎట్లా ఉంటుందా అని, ఒక మెరుపు రేఖ ఇప్పుడే మెరిసింది బుర్రలో, మీరౌనంటే వాణ్ణి తీసుకొస్తాను!

ఈమె: రాకుండా ఎట్లా ఉంటయయ్యా, మంచి ఆలోచనలు, నా సమక్షంలో! ఎద్దైనా సరే, చురుకు తేలాల్సిందే, అది అంతే! మరింకేం, రేపే వెళ్ళి తీసుకురా ఆ గంతని, ఈ బొంతకు అంటగట్టేద్దాం!

శర: చిత్తం, మరి ఏదైనా..

ఈమె: వెళ్ళి రావయ్యా, ఈ కార్యం అవనీ, నీ కేదో ముట్టచెప్తాలే! ఆఁ ఆఁ, ఇక త్వరపడు, ఆ పని మీద ఉండు!

శర: చిత్తం చిత్తం, సెలవిప్పించండి!

***

ఇదీ, సూర్యకాంతం గారి, దశవిధ వైభవం! ఈ ‘దశ’, అనేది మచ్చుకు చూపించినది మాత్రమే! నిజానికి, ఆమెది సహస్రముఖీన అభినయ చాతుర్యం!

అది మనం చెప్పేదేముందీ! జగద్విఖ్యాతమే!!

స్వస్తి!!

(Images courtesy: Internet)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here