డెడ్ ఎండ్

18
9

[శ్రీ వేణు మరీదు రచించిన ‘డెడ్ ఎండ్’ అనే కథను అందిస్తున్నాము.]

[dropcap]న[/dropcap]గరం మధ్యలోని ఫైనార్ట్స్ కాలేజ్. ప్రిన్స్‌పల్ గిరిధర్ ఆఫీస్ చాంబర్.

“డియర్ ప్రిన్స్‌పల్, ‘ప్లీజ్ గ్రాంట్ వన్ డే లీవ్ యాజ్ ఐ వాంట్ టు గో ఔట్ ఆన్ ఏ డేట్ విత్ ద గయ్ హూ వన్స్ హ్యాడ్ ఎ హెవీ క్రష్ ఆన్ మి!.. యువర్స్ లవింగ్లీ అండ్ లవ్‍లీ’ – ఏంటిది అభిసారీ? వెరీ సిల్లీ.. ఈ మెసెజ్ ఎవరైనా చూస్తే?” టేబుల్‍పై తన ఫోన్‌ను ఆమె ముందుకు నెడుతూ కళ్ళెర్రజేసాడు గిరిధర్.

“సె‘లవ్వు’ చీటీ ఆర్యా.. అలా ఎగరకండి.. గిరిధారి ఓ మా అధికారి!” కళ్ళు మత్తుగా మూస్తూ అతన్ని ఆటపట్టిస్తూ హమింగ్ చేస్తున్నట్లుగా మాట్లాడుతున్న ఆమె పెదాలపైన లిప్‌స్టిక్ తడి హానీడ్యూలా మెరుస్తుంది.

“ ‘లవ్వు’  లేదు గివ్వు లేదు … మరచిపోతున్నావు .. ఇదో విద్యా సంస్థ.. నేను ప్రిన్స్‌పల్‌ని!.. నువ్వు లెక్చరర్‌వి!.. పిచ్చి పీక్స్‌కు ఎగబాకింది నీకు!”

“నన్నా ‘పీక్స్’కు ఎక్కించింది తమరే గిరిధర్.. అప్పుడర్థం కాలేదు. వద్దనుకున్నా.. ఇప్పుడు నువ్వు నాకు కావాలనిపిస్తుంది.. కాంట్ హెల్ప్ ఇట్!”

“అవన్నీ పిచ్చి రోజులు అభీ”

“అవే మంచి రోజులు.. ఇవే పిచ్చి రోజులనిపిస్తుంది”

“అసలు ఏ రోజులూ పిచ్చివి కాదులే.. మన బుద్ధులే.. ఏమయింది నీకు?.. ఎంతో అపురూపంగా చూసుకుంటాడట మీ ఆయన నిన్ను!.. ఇద్దరికీ ఉద్యోగాలు. చక్కటి కూతురు. ఫామ్‌హౌజ్‍ను తలదన్నే ఇల్లు.. హ్యాపీ హోంమేకింగ్ నీది..”

“హోం మేకింగ్ హ్యాపీనే గిరిధర్. హోం మేకరే ఇప్పుడు హ్యాపీగా లేదు”

“ఇంకేం కావాలి అభిసారి నీకు. యువర్ హబీ ఈజ్ ఆల్సో ఎ గుడ్ స్టడ్.”

“బట్ హి వజ్ నాట్ మై వ్యాలంటైన్!”

“టు హెల్ విత్ ద వ్యాలంటైన్.. పదిహేనేళ్ళ క్రితమే మర్చిపోయాను. కర్స్ ద డే! అసలు నువ్విక్కడకు ట్రాన్స్‌ఫర్ అయి వచ్చిన రోజునుండీ నా ప్రశాంతత మొత్తం పోయింది. సంవత్సరం నుండీ సతాయిస్తున్నావు! నీలో ఇంత తెగింపు చూడటం నాకే భయంగా ఉంది అభీ! చాలు. వెళ్ళు.. క్లియర్ చాట్ కొట్టేసేయ్ పాత విషయాల్ని.. ఇప్పుడు మనకు ఉద్యోగాలు, కుటుంబాలు ముఖ్యం. పొర్లిపోయిన నీళ్ళకు ఆనకట్ట కట్టలేం! ఇప్పుడు ఎలాంటి రిలేషన్ కైనా మనం అనర్హులం.. వెళ్ళు ప్లీజ్.. ఈ రోజు చాలా పనుంది. బిజీగా ఉన్నా.. అటు చూడు.. అటెండర్లు మనల్నే గమనిస్తున్నారు. ప్లీజ్ గో టు యువర్ డిపార్ట్‌మెంట్ చాంబర్ అభిసారీ.. ప్లీజ్.. అర్థం చేసుకో!”

“ఎవరైనా చూడనీ పర్లేదు.. ఎప్పుడైనా ఎవరైనా ఎవరికైనా దగ్గరవ్వచ్చు! ఎంత ఆరాధించావు నన్ను అప్పట్లో.. ఆ రోజు.. మీ డిగ్రీ ఫైనలియర్ వాళ్లకు మేమిచ్చిన ఫేర్‌వెల్ లోనే నీ ప్రపోజల్‌ని యాక్సెప్ట్ చేసి, నిన్ను స్టేజ్ మీదకు లాక్కెళ్ళి, బిగ్ హగ్‌తో గట్టిగా చుట్టుకుని నా ప్రేమను నీపై గుమ్మరించాలని నాకూ ఉంది. కానీ.. నీకంతా తెలుసు.. సో హెల్ప్ లెస్ ఐ వజ్ దెన్. మా నాన్నగారే మన కాలేజ్ ప్రిన్స్‌పల్ అవ్వటం.. ఏం చేయను?”

“ఇప్పుడు నేనిక్కడ ప్రిన్స్‌పల్‌ని కదా.. అర్థం అవుతుందిగా.. ప్లీజ్ లీవ్ మీ నౌ.. వియ్ కెన్ టాక్ లేటర్..”

“ఓహ్! ‘టాక్ లేటర్’.. దట్స్ యినఫ్ ఫర్ మీ.. బై ఫర్ నౌ.. ఎప్పుడైనా ఒకే.. భయమేం వద్దు. వియ్ కెన్ మేనేజ్..” అంటూ మెరుపులా మాయమైంది ఆమె.. ఆమె కొంటె నవ్వుల్ని అతడెంత హషప్ చేసినా అవి ఆ గదిలో ఇంకా రెవర్బరేట్ అవుతూనే ఉన్నట్లున్నాయి.

ఆమె బయటకు నడుస్తున్నపుడు చూసాడు అతడు.. అతని నిగ్రహాన్ని నిలువునా కూల్చేస్తానని అతన్ని హెచ్చరిస్తున్నట్లుగా ఉంది. శిశిరానికల్లా పచ్చనాకులను కొంత రాల్చుకుని మిగిలిన ఆకులన్నిటికీ పసుపు బంగారు రంగును పులుముకున్న విల్లో పొదలా ఉంది తను..  బాగా వద్దువద్దనుకుంటూనే ఏదో బాగా కావాలనుకుంటున్నాడు లోలోపట అతడు!

అభిసారి కాలేజ్‍లో అతనికి జూనియర్.. ‘మంచు ఖండాల్లో హిమకుహరాల్లో సుప్తావస్థలో ఉన్న ధృవపు ఎలుగుబంటిలా మూడేళ్లపాటు కష్టంగా తన గుండెల్లో దాచుకున్న ప్రేమను తమ ఫైనలియర్ బైటపెట్టాడు అతడు. తియ్యటి కనికట్లు.. చేతిపై పచ్చబొట్లు.. ఎన్నో తిప్పులాట్లు.. ఐనా “యస్.. ఐ టూ” అనే మూడు మాటలు ఆమె నోటి వెంట రాలేదు ఏనాడూ! వాళ్ళ నాన్ననే వాళ్ళ కాలేజ్ ప్రిన్స్‌పల్ అవటం పెద్ద మైనస్.. ఆయనదంతా మార్టినెటిష్ డిసిప్లిన్ అట ఇంటి దగ్గర.. తనను బాగానే ఇష్టపడుతున్నట్లుగానే వుంది. అయితే అభిసారి భయం ఆమెలో ఇష్టాన్ని ఓవర్ కమ్ చేసింది అప్పుట్లో.. మరిప్పుడేంటి ఆమె ఇలా?.. ఇన్నేళ్ల తర్వాత!.. మరుపుకు గురైన మైదానంపై మళ్ళీ ఏవో అంకురాలు చల్లుతానంటోంది.. లవ్ ఆర్ లస్ట్.. వాటెవర్ యు కాల్ ఇట్..రియల్లీ ఫ్యాటల్ వెన్ ఎక్స్‌ట్రా -మ్యారిటల్.. తనకూ అది తెలుసు.. అదీగాక.. తామున్నది గురుస్థానంలో.. రాష్ట్రంలోనే ఎంతో గొప్ప కళాకారుల్ని అందించిన ఫైనార్ట్స్ కాలేజ్‍లో చేస్తున్నారు.. ఇద్దరికీ స్టూడెంట్ కమ్యూనిటీలో మంచి పేరుంది.. విషయం పబ్లిక్ ఐతే? కుప్పకూలిపోతాం.. అసలే మీడియా మంద ఇలాంటి వాటి కోసమే వేటపులుల్లా కాచుక్కూచుంటారు.. తననీ, అభిసారినీ వాళ్ళ కెమెరాల చోప్‌స్టిక్స్ కింద న్యూడిల్స్‌లా  మెత్తగా మింగేస్తారు! నో.. నో.. వియ్ విల్ నాట్ గివ్ దట్ బ్యాడ్ మెసెజ్..’ అని గట్టిగా అనుకున్నాడు గిరిధర్, తమ కాలేజ్ డేస్ నాటి రెవరీస్ నుండి తేరుకుంటూ. ఇంతలో వరండాలో పాతకాలపు మొజాయిక్ గచ్చుపై ‘కిర్.. టక్.. కిర్..టక్..ల శబ్దం. ఇంకా ఎక్కడ దొరుకుతున్నాయో అటెండర్ బిక్షమయ్యకు ఈ షోలాపూర్ చెప్పులు!

“నమస్తే సార్” అంటూ లోపలికొచ్చాడు. తను మోసుకొచ్చిన పొడవాటి రిజిస్టర్లను టేబిల్‌పై పెట్టాడు. తర్వాత వెడల్పుగా ఇకిలిస్తూ దగ్గరగా వచ్చి వంగుతూ తలను గిరిధర్‍కు దగ్గరగా తీసుకొచ్చి గొణిగినట్లుగా మాట్లాడాడు. ఏ ఫిల్టర్స్ లేకుండా డైరెక్ట్‌గా పాయెంట్ కొచ్చి ధైర్యంగా మాట్లాడటం భిక్షమయ్య ప్రత్యేక శైలి.

“సారు.. చనువు తీసుకుంటున్నా.. కోప్పడకండి.. ఆ మేడమ్ గారికి మీరంటే ఎంతో ఇష్టమనుకుంటా.. పెద్ద వయసోళ్ళేం కాదుగదా మీరు!”

“ఐతే?” సీరియస్‌గా చూసాడు ప్రిన్స్‌పల్ గిరిధర్.

“పెద్ద పెద్ద కోర్టులు కూడా అదేం తప్పనట్లేదు కదయ్యా! ఆ మద్దెన పేపర్లల్లో చూసాలెండి. తమరికెందుకంత భయమా అని!” అంటూ ఇంకా ఏదో ముసిముసిగా నసగబోయాడు.

“బిక్షమయ్యా.. ఇంక ఆపు!.. చెత్త సలహాలివ్వకు.. పో.. పోయి నీ పని చూసుకో.. ఇంకోసారి అలాంటి విషయాలు నా ముందు మాట్లాడకు.. నీ గౌరవం కాపాడుకో!” హెచ్చరించాడు గిరిధర్. ముఖం ముడుచుకుని బయటకు నడిచాడు బిక్షమయ్య.

మళ్లీ లోలోపల ఒక మోనోలాగ్ మొదలయ్యింది గిరిధర్‍కు.

‘భయమా! తనకు నిజంగా భయమా? ఇదే అంటుంది అభిసారి ప్రతిసారి.. తను ఆ మధ్య వాదిస్తూ ఇంకోమాట కూడా అంది.. ఇల్లిసిట్ రిలేషన్‍పై సుప్రీం తీర్పు వచ్చినప్పటి మాట.. జస్టిస్ నారీమన్ గారనుకుంటా అన్నది – ‘‘మ్యాన్ బీయింగ్ ద సెడ్యూసర్ అండ్ వుమన్ బీయింగ్ విక్టిమ్ నో లాంగర్ ఎగ్జిస్ట్స్’’.. అది సరే.. ఏదేమైనా.. ఇదంతా ఇప్పుడెలా కుదురుతుంది?’ ఆలోచిస్తున్న కొద్దీ తలలోంచి వేడి సెగలు కక్కుతున్నట్లనిపిస్తుంది అతనికి.. ‘ఆమె తన భర్త గురించి ఆలోచించటం లేదా? మరి తన భార్య?.. పిచ్చిది పాపం! తన బాబు?.. ‘వండర్ కిడ్’ వాడు.. ప్లస్ టూ చదువుతున్నాడు.. వాడే మా ఫ్యూచర్.. తనకు వాడిమీదున్నట్టే అభిసారి భర్తకూ వాళ్ళ పాప మీదా ఎన్ని ఆశా స్వప్నాలుండి ఉంటాయో కదా! మరి అదంతా ఇప్పుడు చెదిరిపోతే? కానీ.. అభిసారిని పైకి వారిస్తున్నా అతడు ఆమె సాంగత్యాన్ని మనసులో ఏ మూలనో కోరుకుంటున్నాడని అన్పిస్తుంది.. తను యవ్వనంలో పోగొట్టుకున్న చందనపు బొమ్మ అభిసారి.. మళ్ళీ తిరిగొచ్చి మోహపుసానపై కరిగిపోయి ప్రేమగంధం పూస్తానంటుంది.. కానీ టీచింగ్ వృత్తిలో ఉన్నామే!.. సమాజానికి ఏం సమాధానం చెప్పాలి? ఇద్దరి మధ్య రిలేషన్ మొదలైతే?.. అడల్ట్రీ కేస్ అవుతుందా? తమది నేరం కాకపోవచ్చు.. ఇద్దరికీ ఇష్టం అయితే? బట్ ఇట్ కెన్ బీ ఎ గ్రౌండ్ ఫర్ డివోర్స్.. అప్పుడు తమ రెండు కుటుంబాల పరిస్థితి?.. అని అనుకుంటూ ఉన్న గిరిధర్ మనసు ఆలోచనల కందిరీగల దాడికి గురై ఉక్కిరిబిక్కిరై పోతుంది. ఐతే అతను కొంతసేపాగి ఏదో అసందిగ్ధ అంశాన్ని స్పష్టంగా తేల్చుకున్న తర్వాత వచ్చే ప్రశాంతను పొంది తల వెనక్కి వాల్చి కళ్ళుమూసుకుని మౌనముద్రలోకి వెళ్ళిపోయాడు.

***

కారులో మ్యూజిక్ సిస్టం నుండి అనురాధా పౌడ్వాల్, కుమార్ సానుల ‘దిల్ హై కె మానతా నహీఁ’ తీయటి పాట లోపలంతా స్వర సుగంధాలు చల్లుతూ పరిమళ భరితం చేస్తుంది.

“ఎందుకంత స్పీడ్ మాస్టర్ గారు.. ఐడియల్ డ్రైవింగ్ చెయ్యొచ్చుగా”

“నో వే అభిసారీ మ్యామ్.. కొత్త క్రూజరే కదా ఇది.. కొంచెం ఉరకనీలే!”

“నలభై దాటినై.. ఇంకా దౌడు తీయాలనే ఉందన్నమాట.. నువ్వేం కుర్రజాకీవి కావు.. హార్స్ పవర్ తగ్గించుకోవాలోయ్ డియర్ ప్రిన్స్‌పల్” – గలగలా నవ్వింది ఆమె.

“వయసుతోపాటు సొగసూ పెంచుకుంటున్న నీలాంటి పవరున్న హార్స్ చిక్కితే.. గుడ్డి జాకీ కూడా అందకుండా దౌడ్లు తీస్తాడులే బేబీ!” ఇంకా గట్టిగా ఎక్స్‌లేటర్‌ను తొక్కుతూ ఆమె వైపు తిరిగి చిలిపిగా కళ్ళెగరేసాడు గిరిధర్.

“నిన్న మొన్నటి వరకూ నీతులు చెప్పావ్!”

“కలికాలపు మగాళ్ళం.. ఆ మాత్రం భయం ఉండాలిగా మాకు.. ఐనా అభీ ‘ఇట్స్ నాట్ పాసిబుల్ టు లవ్ అండ్ పార్ట్.. యు కెన్ మ్యూట్ లవ్, ఇగ్నోర్ ఇట్.. బట్ యు కెన్ నెవర్ పుల్ ఇట్ ఔటాఫ్ యు’ చెప్పాడుగా ఎప్పుడో ఈ.ఎమ్. ఫారెస్టర్.. నేనూ అతీతుడ్ని కాదులే”

“లిటరేచర్ బాగానే గుర్తుందిలే గానీ.. మనదిప్పుడు లవ్ కాదులే కుర్ర ప్రిన్స్‌పల్ గారూ.. ‘లస్ట్’ కదా! లస్ట్!..” అంటూ కవ్వింపుగా భళ్ళుమని నవ్వింది అభిసారి. ఒక్క క్షణం స్టీరింగ్ వదిలేసి మెలికలు తిరిగాడతను తనూ ఆహ్లాదంగా నవ్వుతూ.

కారు నగరం దాటింది. బాటకిరువైపులా లక్షల పచ్చజెండాలు పాతినట్లుగా పచ్చదనం పరుచుకుంది. చిరుచినుకులతో వాన మొదలైంది. కార్ రూఫ్ పైన వర్షపు జల్లు ఇళయరాజా గారి గిటార్ నోట్స్ పలుకుతుంది. ఫ్రంట్ మిర్రర్ వానజల్లుతో వేసుకున్న ఇంప్రెషనిస్ట్ పెయింటింగ్‍ని వైపర్ క్రూరంగా చెరిపేస్తుంది.

“అభీ.. ఎప్పుడో గతంలోనే బరీ ఐన ఫీలింగ్స్‌ని మళ్లీ నిద్రలేపావు.. ఈ రిలేషన్ ఎక్కడికి పోతుందో ఏమో!?”

“ఎక్కడికీ పోదు. ఆ ‘లవ్‌నెస్ట్’ కేలే సర్.. అవునూ.. ఇంతకూ మీ ఫ్రెండ్ సిటీకింత దూరంలో ఎందుకు ఇల్లు కట్టాడు?”

“వాడికి సిటీలో మంచి త్రీ బీహెచ్ కే ఉంది.. పక్షి ప్రేమికుడు వాడు. బర్డ్ స్యాంక్చురీకి దగ్గరగా ఔట్‌స్కర్స్‌లో తక్కువ రేటుకి రెండెకరాల స్థలం బేరమొస్తే కొని ఇల్లు కట్టుకున్నాడు. ‘లవ్‌నెస్ట్’ అని ఇంటికి ఇష్టంగా పేరుపెట్టుకున్నాడు. ‘ఇకో హౌజ్’ అట అది వాడికి. తీరా కట్టుకున్న తర్వాత అబ్రాడ్ వెళ్ళాల్సొచ్చింది.. అదేమో ఖాళీగా పడుంది..” సిగరెట్ వెలిగిస్తూ మిర్రర్ సగం క్రిందికి దించాడు.. పొగబైటకు వదలటానికి.

“ఆ ఖాళీని మనమెళ్లి నింపుదాంలే సార్..” అంటూ ముఖాన్ని పూర్తిగా అతని వైపుకి తిప్పి మాగన్నుగా నవ్వింది.

అభిసారి నవ్వినపుడు ఆమె పై పలువరసలోని పన్నుమీద పన్ను ఒకటి తళుక్కున మెరుస్తుంది. ఆమె కురుల్లోంచి కూడా అలాంటి తళుకే ఒకటి సూక్ష్మతరంగాల్లా మెరుస్తుంటుంది.

నగరం ఆనవాళ్ళను పూర్తిగా వదిలిపెట్టిన కారు అక్కడి ఘాటు కార్బన్ వాసనలకు పూర్తి భిన్నంగా గుభాళిస్తున్న బాటవెంట తడిసిన చెలకమట్టి యొక్క గమ్మతైన సువాసనను, వైల్డ్ ఫ్లవర్స్ యొక్క కమ్మని పరిమళాన్ని పీల్చుకుంటూ పులకరించిపోయి పరిగెడుతుందా అన్నట్టు వేగంగా వాళ్లను గమ్యం చేర్చింది.

నాగరికత హోరు అసలు వినపడని చోట ఆ యిల్లు సృష్టాదిలో దేవుడు ఆదాము-అవ్వలకోసం నిర్మించిపెట్టిన ప్యారడైస్‍లా, గుబురు పొదల్లో లతల మధ్య నిండుగా రేకులు విచ్చుకున్న ఒకే ఒక పెద్ద పూవులా అది మెరుస్తూ అభిసారిని, గిరిధర్ ను ఆహ్వానిస్తున్నట్లుంది. ఆ ఇంటి మెయిన్ డోర్ మాత్రం ఆవులిస్తున్న పులినోరులా ఉంది. మిణుగురుల్లా మెరుస్తూ లోపలికి ప్రవేశించారు ఆ ఇరువురూ.

అతడు.. ఆమె.. మధ్యలో మోహం!

“అభిసారీ.. రెడ్‍వైన్‍లో అలా లిచీస్, స్ట్రాబెరీస్ వేసుకుని..?”.

“మా ఆయన నేర్పాడ్లే..”

“స్పెషలేంటి?”

“రెడ్‍వైన్‍లో ఫ్రెష్ బెరీస్ నానించి తాగితే సూపర్ యాంటీ ఆక్సిడెంట్‍గా పని చేస్తుందట. వెబ్‌సైట్లలో ఉన్నవన్నీ ఫాలో అవుతాడు.. నే మాత్రం నమ్మను! కానీ ఈ టేస్ట్ అలవాటైంది.. అంతేగాదు.. నా పెదాలు ఎప్పుడూ ఫ్రెష్‍గా, తేమగా ఉంటున్నాయి..” అంటూ చూపుడు వేలుని తన పెదవుల చుట్టూ తిప్పుతూ కళ్ళతోనే నవ్వుతూ చూపించింది.

“అందుకేనేమో మేడమ్ గారి వయసు నలభైల్లో ఉన్నా లిప్స్ మాత్రం ఇంకా టీనేజ్ లోనే ఉన్నాయి” అంటూ గిరిధర్ పైకి లేచి ఆమె కూర్చున్న ట్యూలిప్ ఆర్మ్‌చైర్ వెనుకగా వచ్చి తల బారుగా ముందుకు వంచి వెనుక నుండే ఆమె పెదవులనందుకున్నాడు.

“ఏ బ్రాండ్ పర్‍ప్యూమ్..?” మైకంగా అడిగిందామె.

“ఇటర్నటీ.”

గిరిధర్ ఆమెని  పట్టుకొని సోఫావైపుకు తీసుకెళుతున్నాడు. అత్యంత పారదర్శకంగా ఉన్న ఆ ఖరీదైన మార్బుల్ ఫ్లోర్‍పై వాళ్ళిద్దరి ప్రతిబింబాలు స్పష్టంగా మెరుస్తున్నాయి. ఒక పిల్లవాడు తనకిష్టమైన పెద్ద రబ్బరు బొమ్మను అపురూపంగా హత్తుకొని మోసుకెళ్ళినట్లుగా ఆమెను పైకి తీసుకుని సోఫాపై మెల్లగా పడుకోబెట్టాడు.

‘..టట్టటమ్.. టట్టంట టటటమ్.. టట్టటమ్.. టట్టంట టటటమ్’ బిగ్గరగా మొత్తుకుంటుంది జైలోఫోన్ రింగ్‍టోన్. ఉలిక్కిపడ్డారిద్దరూ.. అతను భయంగా డోర్ బెల్ వైపు చూసాడు. ఆమె అతడి నుండి పక్కకి జరిగి పైకిలేచింది. విలవిల్లాడిపోయాడతను! పక్కనే టీపాయ్‍పై ఉన్న తన హ్యాండ్ బ్యాగ్‍లో మోగుతున్న ఫోన్‌ను చేతుల్లోకి తీసుకుంటూ.. “ఓహ్ ఊప్స్! సారీ గిరిధర్! ఐ ఫర్గాట్ టు స్విచ్ఛాఫ్ మై ఫోన్!” అంటూ స్క్రీన్ వైపు చూసింది.

‘రియాస్ ప్రిన్స్‌పల్ కాలింగ్..’ వైబ్రేషన్‍తో బ్లింక్ అవుతూ స్క్రీన్ డిస్‍ప్లే అవుతుంది.

“ఈ టైంలోనే ఈమెకు కుదిరిందా!” విసుగ్గా వద్దనుకుంటూనే కాల్ అటెండ్ చేసింది.

“హలో మ్యామ్.. హ్యాపీవ్యాలీ స్కూల్ ప్రిన్స్‌పల్ హియర్..”

“హలో.. నెంబరుంది.. చెప్పండి మేమ్”

“మాట్లాడేది టెన్త్ బీ రియా మదరే కదా?”

“యస్ మ్యామ్ చెప్పండి.. ఏమయ్యింది?” అభిసారిలో కంగారు మొదలైంది.

“సారీ అమ్మా.. ఫోన్‍లో చెప్పలేను. మీరెక్కడున్నా అర్జెంటుగా స్కూల్‍కి రండి”

అభిసారిలో ఆదుర్దా హెచ్చింది.

“ఎనీథింగ్ సీరియస్ మ్యామ్?సాయంత్రం రావచ్చా?”

“లేదండీ.. మాకు సాయంత్రం మేనేజ్‍మెంట్ మీటింగ్ ఉంది.. చాలా ఇంపార్టెంట్.. వియ్ కాంట్ స్కిప్ ఇట్.. మీరు వెంటనే బయల్దేరి రండి.. ఇష్యూ ఈజ్ అ బిట్ సీరియస్”

అభిసారి శరీరం ఒక్కసారిగా చల్లబడింది. ఒక అవ్యక్త వ్యాకులతతో ముఖం వివర్ణమైంది. క్రిందపడివున్న దుపట్టా తీసుకుని వేసుకుంటుంటే వెనుకనుండి మళ్లీ ఆమెను పెనవేసుకున్నాడు గిరిధర్. మెన్ ఆర్ ఫ్రం మార్స్! “ఏమైంది అభిసారి?” అంటూ మెడ వెనుకగా అతని పెదాలు చేర్చబోతుండగా అభిసారి ఒక్క ఉదుటన ముందకు జరిగి బ్యాగ్ తీసుకుని బయలుదేరింది.

“గిరిధర్.. రియా ప్రిన్స్‌పల్ ఫోన్ చేసింది. ఏదో అర్జెంట్ అట. పాప  గురించి. తనకేమైందో ఏమో.. సారీ డియర్.. ఇంకోసారి ప్లాన్ చేసుకుందా.. వెళాం పద.. ప్లీజ్” అంటూ బయటకు అడుగులు వేయసాగింది.

ఉస్సురుమన్నాడు అతడు. ఆమె కూడా!

నిప్పులస్నానం చేద్దాం అనుకున్నారు.. ఎవరో వచ్చి మీద మంచుకళ్ళాపి చల్లినట్లుంది!

***

గిరిధర్ లానే అతని కారుకూడా ఆ పచ్చని కంట్రీసైడ్‍ని వదిలిపెట్టి వెళ్ళటం ఇష్టం లేదన్నట్లుగా ఉస్సురుమంటూ ముందుకు సాగుతూ నగరం చేరుకుంది. స్కూలు గేటు పక్కన యిరువైపులా రాలిపడివున్న బౌగోనియా పూలపై సందె కిరాణాలు వాలుగా పడుతూ, వాడిపోతున్న వాటికి కడసారి మెరుపుల్ని కనికరిస్తున్నాయి.

“నువ్వూ లోపలికి రా గిరిధర్.. నాకేదో భయంగా ఉంది,” బతిమాలుతున్నట్లుగా అడిగింది అభిసారి.

“నథింగ్ టు వరీ అభిసారి.. ఈ స్కూల్ మేనేజ్‍మెంట్ వాళ్ళు చాలా కేరింగ్‌గా ఉంటారు. భయపడకు.. పదా నేనూ వస్తా.. మా వాడూ ఇక్కడే ప్లస్ టూ చదువుతున్నాడు” అంటూ కారు పార్క్ చేసి వచ్చాడు.

***

హ్యాపీవ్యాలీ స్కూలు ప్రిన్స్‌పల్ చాంబర్. విశాలమైన నుదిటి మధ్య పెద్ద గంధ సిందూరపు బొట్టు ధరించి ఉంది ప్రిన్సిపల్. ఆమె తలకి పైగా వెనుక గోడపై రాధాకృష్ణన్, మదర్ థెరీసాల చిత్రపటాలున్నాయి.

ఆమె ఎదురుగా అభిసారి చాలా ఆందోళనగా కూర్చొని ఉంది. కొంచెం దూరంగా ఉన్న సోఫాచైర్లో గిరిధర్ కూర్చొని ఉన్నాడు. తమ రొమాంటిక్ షెడ్యూలంతా ఖరాబయినందుకు అతను చాలా డిప్రెస్ అయ్యాడు. ఐతే అభిసారి కూతురుకి ఏమై ఉంటుందా అనే ఆలోచన కూడా అతన్ని కొంచెం నెర్వస్‌గా చేస్తుంది.

ప్రిన్స్‌పల్‍కు కుడివైపున అభిసారి కూతురు ‘రియా’ తలదించుకుని నిలబడి ఉంది. తల్లిని చూడగానే బిగ్గరగా వెక్కివెక్కి ఏడుస్తుంది. ఆ అమ్మాయి ముఖం ఎండకు వడలిపోయిన రెడ్ డ్రాగన్ ఫ్రూట‌లా ఉంది. కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయి బ్లడ్ మూన్‌లా ఉన్నాయి. చాలా సేపటి నుండి ఏడుస్తున్నట్లుంది. యూనిఫాం బ్లేజర్ ముందు భాగం మొత్తం తడిసిపోయి ఉంది.

“ఎందుకు రియా ఇప్పుడేడుస్తావ్.. హౌ మెనీ టైమ్స్ డిడ్ ఐ వార్న్ యూ? వియ్ కాంట్ హెల్ప్ కాలింగ్ యువర్ పేరెంట్.. ఫస్ట్ ఆ ఏడవటం ఆపమ్మా”.. ప్రిన్స్‌పల్ గదమాయిస్తుంటే రియా ఇంకా తలదించుకొంది.

ఏమయ్యింది తన కూతురికి? ఏం చేసి ఉంటుంది? నిలువెల్లా వణుకుతూ గొంతునిండా కఫం అడ్డుపడితే ఎంత కష్టంగా మాట్లాడతారో అంత కష్టంగా అడగలేక అడిగింది అభిసారి.

“ప్రిన్స్‌పల్ మేమ్.. ప్లీజ్ తొందరగా చెప్పండి.. ప్లీజ్.. ఏం జరిగింది?”

ప్రిన్స్‌పల్ గిరిధర్ వైపు చూస్తూ “ఈ సర్..?” అంటూ ఒక డౌట్‌పుల్ ఎక్స్‌ప్రెషనిచ్చింది.

“ఇట్స్ ఓకే.. సర్ నా ఫ్రెండ్.. ఒకే కాలేజ్లో చదివాం.. ఇప్పుడు మా కాలేజ్ ప్రిన్స్‌పల్.. పర్లేదు చెప్పండి మ్యామ్.. ప్లీజ్ త్వరగా.. ఏం చేసింది మా రియా?.. ఎందుకలా ఏడుస్తుంది? కొట్టారా మీరు!” ఉద్వేగం తట్టుకోలేక కీచుమని రోదించింది ఒక్కసారిగా అభిసారి.

గిరిధర్ అష్యూరింగ్‍గా మాట్లాడాడు.

“మేడమ్.. చెప్పండి పర్లేదు.. మా బాబు కూడా యిక్కడే ప్లస్ టూ చదువుతున్నాడు. నాలుగైదు సార్లు వచ్చాను. మీరు మర్చిపోయినట్లున్నారు.”

“ఓహ్ సారీ సర్.. వందలమంది పేరెంట్స్‌ను కలుస్తుంటాం కదా..”

ఈసారి అభిసారి గట్టిగా అరిచింది.

“మ్యామ్.. ప్లీజ్ డోంట్ ప్రొలాంగ్.. చెప్పండి.. ఏం జరిగింది?”

ప్రిన్స్‌పల్ తన ఐ గ్లాసెస్‌ని పైకి జరుపుకుని ఒక నిమిషం గట్టిగా ఊపిరి తీసుకుంది. రియావైపు జాలిగా చూస్తూ ఆ చెప్పబోయే విషయం చెబితే అక్కడ ఏ అగ్నిపర్వతపు జ్వాలాబిలం నుండి లావాగ్ని చిమ్ముతుందో ఏమో అన్నట్లు తటపటాయిస్తూ నోరు విప్పింది.

“అమ్మా అభిసారీ.. మై గాడ్.. ఎలా చెప్పాలి? రియల్లీ సారీ టు అట్టర్ దిస్.. యువర్ డాటర్ ఈజ్ ఆన్ ఎ హాట్ డేట్ విత్ ఏ బోయ్..”

విచలితురాలైంది అభిసారి. తన కాళ్ళు, తను కూర్చున్న కుర్చీ కాళ్ళు విరిగిపోయి, కూలిపోయి, నేలపై తూలిపోతున్నట్లుయింది ఆమెకు.

గిరిధర్ స్థాణువై ఆమె వైపు, ప్రిన్స్‌పల్ వైపు, ఏడుస్తున్న రియావైపు మార్చి మార్చి చూడసాగాడు. అతడు ఆ అమ్మాయిని చూడటం అదే మొదటిసారి.

రియా ఓపిక లేక కీచుగా రోదిస్తుంది. తల్లి తన కూతురువైపు కొయ్యబారిపోయి చూస్తుంది. ఆ క్షణంలో తలలో టర్బైన్లు తిరుగుతున్నట్లుగా అన్పించింది ఆమెకు. గుండెకు తగిలిన ఆ శోకఘాతంతో విలవిలలాడింది.

“సారీ అభిసారి గారు.. మీకు చెప్పొద్దనే అనుకున్నాం.. కానీ రియా.. ఆ అబ్బాయి.. దే హ్యావ్ క్రాస్డ్ ఆల్ ద బౌండరీస్.. ఆల్మోస్ట్ హాఫ్ నేకెడ్‍గా ‘లేక్ పార్క్’లో మా పీడీ సర్ కంటబడ్డారు. ఇద్దరూ ఉదయం వ్యాన్ ఎక్కారట. ఎలా ఎస్కేప్ అయ్యారో అర్థం కావటం లేదు.. సారీ అమ్మా.. ఇందులో మా లోపం ఏదన్నా కన్పిస్తే.. ప్లీజ్ ఎక్స్‌క్యూజ్.. రియాను ఒక మంచి కౌన్సిలర్ దగ్గరకు..” మార్దవంగా చెప్పుకుపోయింది ప్రిన్స్‌పల్.

ఆమె మాటలు పూర్తవ్వకుండానే మాటకు అడ్డు తగుల్తూ దుఃఖం, ఆవేశం కలగలిసిన స్వరంతో అడిగింది అభిసారి. “ఇంతకూ వాడెవడు?”

“ఆ అబ్బాయి పేరెంటుకూ ఇన్ఫామ్ చేయాలని కాల్స్ చేసాం. బట్ అన్అవైలబుల్ వస్తుంది” అని అంటూ ప్రిన్స్‌పల్ బజర్ ప్రెస్ చేయగానే ఆఫీస్ అటెండెంట్ లోపలికి వచ్చాడు. “సత్యంజీ.. అక్కడ టీటీ రూములో ఒక్కడే అబ్బాయి కూర్చొని ఉంటాడు. వాణ్ణి ఇక్కడికి పంపించమని పీడీ సర్‍కు చెప్పండి.”

“అలాగేనమ్మా”, అంటూ ఓ సగంనవ్వుతో బయటకు వెళ్ళాడు ఆ అటెండర్. ఇదంతా చూస్తున్న రియా ఒక్కసారిగా బరబరమని పదునుకత్తితో మెడకోస్తుంటే అరిచే మేకపిల్లలా ఘోరంగా రోదించసాగింది. ప్రిన్స్‌పల్ వైపుకు, తల్లివైపుకు కదులుతూ ప్రాధేయపడసాగింది. “వద్దు మేమ్.. ప్లీజ్.. ప్లీజ్.. అతడ్ని పిలవొద్దు.. ఐ యామ్ సో సారీ మేమ్.. ఈ ఒక్కసారికి వదిలేయండి మేమ్.. మమ్మీ.. మమ్మీ.. ప్లీజ్ మమ్మీ.. ప్లీజ్.. ఇంకెప్పుడిలా చేయను మేమ్.. ప్లీజ్ మేమ్..” గొంతు చించుకుని ఏడుస్తున్న ఆ అమ్మాయిని ఆ గదిలో ఎవరూ పట్టించుకోనట్లు మౌనంగా కూర్చుని ఉన్నారు.

ఐదు నిముషాల తర్వాత ప్రిన్స్‌పల్ చాంబరుకున్న ఫ్రంట్ డోర్ కాకుండా పక్కనున్న వేరే డోర్ కిర్రుమంటూ కొంచెంకొంచెంగా తెరుచుకుంది. హైబ్రిడ్ పొట్లకాయలా బారుగా, తనలోకి అతీంద్రీయ శక్తులు ప్రవేశించే ముందు బేలగా, అమాయకంగా ఉండే ‘స్పైడర్‍మాన్’ సినిమాలోని పీటర్ పార్కర్‍లా ఉన్న ఒక అబ్బాయి అడుగులో అడుగేసుకుంటూ భయంతో బెదురు చూపులు చూస్తూ లోపలికి వచ్చి తలదించుకొని నిలబడ్డాడు. అభిసారి ఆ అబ్బాయిని అదే మొదటిసారి చూడటం.

మిగతా అందరూ కూడా అతనివైపే చూసారు.. రియా తప్ప..

ఆ అబ్బాయిని చూడగానే అప్పటి వరకూ ఎవరో తన కాళ్ళకు, చేతులకు బారు మేకులు కొట్టినట్లుగా స్థాణువై కూర్చొన్న గిరిధర్ ఆ మేకులు అన్నీ ఒక్కసారిగా ఊడిపోయినట్లుగా కదిలాడు. అతని దేహంపై ప్రతి రోమమూ నిక్కబొడుచుకుంది. ఒక్కసారిగా నుదురు చెమటతో తడిసింది. రెండు పడికిళ్ళూ బిగబట్టాడు. విసురుగా పైకి లేచి ఒకే ఒక్క అంగలో ఆ అబ్బాయి వైపుకు దూకినట్లుగా వేగంగా కదులుతూ ఆవేశంగా కేక పెట్టాడు-

“యూ.. డర్టీ క్రాప్ రేహాన్..” అంటూ!

అభిసారి పైకి లేచి కూతురువైపుకు వేగంగా, ఉగ్రంగా అడుగులేయ సాగింది. ప్రిన్స్‌పల్ హఠాత్తుగా ఏదో స్ఫురించిన దానిలా నిల్చొని చేతులాడిస్తూ వాళ్ళని వారిస్తొంది..

“ఓహ్ మై గాడ్.. ఇట్స్ రియాస్ మామ్ అండ్ రేహాన్స్ డాడ్‌నా.. కూల్.. ప్లీజ్.. ప్లీజ్.. కామ్ డౌన్.. బోత్ ఆఫ్ యూ.. కూల్ అండీ కూల్.. ప్లీజ్ కామ్ డౌన్.. ప్లీజ్.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here