[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘డెబిట్ క్రెడిట్’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]ఉ[/dropcap]త్సాహంగానో ఉదాసీనంగానో
గడిపిన కాలం కంటే
జ్ఞాపకాల బరువే ఎక్కువ
అప్రమేయంగానే అయినా
పెరిగిన వయసు కంటే
అనుభవాల దరువే ఎక్కువ
మెదడు హార్డ్ డిస్క్ నిండా
డాటా.. డాటా..
ఎన్నో గెలుపులు ఎన్నెన్నో ఓటములు
అందుకున్న అభినందనలు పొందిన అవమానాలు
అన్నీ జమా ఖర్చులు
లెక్క అంతా పక్కా
అయినా
స్నేహాలూ ప్రేమలూ మొక్కుబడి పలకరింపులూ
పుచ్చుకున్నవీ తిరిగి చెల్లించినవీ
డెబిట్ క్రెడిట్ సంతులనం కుదరడం లేదు
దశాబ్దాల గమనంలో ఎప్పటికప్పుడు
ఎన్నో అకౌంట్లు
కొత్తగా తెరిచినవీ, పాతవి మూసినవీ
లావాదేవీలు ఎన్ని జరిగితే ఏముంది
గాలి వీచినా తుఫాను తాకినా
ఆకులెన్ని రాలినా తిరిగి చిగురించే
ఈ చెట్టు
స్వీకరించిన దానికంటే
తిరిగి ఇచ్చిందే ఎక్కువ