డెప్యూటేషన్

3
10

[డి. నాగజ్యోతి శేఖర్ గారు రాసిన ‘డెప్యూటేషన్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]‘ఇ[/dropcap]చ్చిన కాఫీ అలానే ఉంది.. విచ్చిన కళ్ళు ఎటో చూస్తున్నాయి.. ఏమైంది ఈయనకు’ అనుకుంటూ

“ఏమండోయ్” భుజం తట్టి పిలిచింది రమ భర్త సుదర్శనాన్ని.

“హా.. ఏమిటోయ్” అన్నాడు ఉలికిపాటుగా అప్పుడే ఈ లోకంలోకి వచ్చి.

“ఏమిటీ పరధ్యానం అంటున్నా”

“అదా, అదేం లేదోయ్. మన టీచర్స్ జంట విరించి, సువర్చల గూర్చి..”

“మీరు చేసిన పదో పెళ్లి. చిలకా గోరింకల్లా ఉంటారు. ఏమిటీ విశేషం అంత దీర్ఘంగా వారి గూర్చి ఆలోచించేది” అంది రమ.

“వాళ్ళకి నిన్న బాబు పుట్టాడు. నిన్న విరించి నా దగ్గరకు వచ్చి ఒకటే కన్నీరు పెట్టుకున్నాడు”

“అదేమీ. కొడుకు పుడితే ఏడ్చే వాళ్ళున్నారా” బుగ్గలు నొక్కుకుంది రమ.

“సాంతం వినవోయ్. కొడుకు పుట్టిన వార్తతో పాటు సువర్చల పంపిన విడాకుల నోటీసు కూడా అందింది. అందుకని”

తెల్లబోయి చూస్తున్న రమతో “నీకు చెప్పనే లేదు కదూ. గత కొన్ని నెలలుగా వాళ్ళు కలిసి లేరు. కారణం వారి కాపురంలో  సువర్చల అమ్మ గారి అతి జోక్యం. సువర్చల పట్ల ఆమె అతి ప్రేమ. చివరికి అల్లుడిని కూడా ఓర్వలేనంత పోసిసివ్‌నెస్. చిన్న వయస్సులోనే భర్తని కోల్పోయిన ఆమె ఎన్నో కష్టాలకు అవమానాలకు ఓర్చుకుని సువర్చలను ప్రయోజకురాల్ని చేసింది. కానీ ఈనాడు ఆ ప్రేమే సువర్చల జీవితంలో అలజడికి కారణం అయ్యింది. తల్లిదండ్రులు లేని విరించికి, తండ్రి లేని సువర్చలకి పెళ్లి చేస్తే చక్కగా ఉంటారని, సువర్చల తల్లిని తన తల్లిలా ఆదరిస్తాడని ఆలోచించి నేను వారిద్దరికీ జత కుదిర్చాను. విరించి నేను ఊహించినట్టే ఉన్నా.. సువర్చల తల్లి మాత్రం ఎవరూ ఊహించనట్టు ఉంది. ఏమీ అనలేని కూతుర్ని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తూ వారిద్దరి మధ్యా దూరాన్ని పెంచింది. సువర్చల తల్లి కాబోతుందన్న సంతోషాన్ని ఎన్నాళ్ళో మిగల్చకుండానే కూతుర్ని తీసుకొని వాళ్ల ఊరు వెళ్ళిపోయింది. అక్కడకు వెళ్ళాక విరించి ఎంత ప్రయత్నించినా సువర్చలను కలవనివ్వలేదు. ఫోన్‌పై కూడా నిఘా పెట్టి వాళ్ళని నానా హింస పెడుతుంది. కని పెంచిన తల్లి వైపే ఆలోచిస్తూ సువర్చల చేజేతులా తన కాపురాన్ని కూలదోసుకుంటున్నది. నిన్న విరించి తన బిడ్డను చూడడానికి కూడా అనుమతించలేదు అంట. అంత మనిషి భోరున ఏడుస్తుంటే చూడలేకపోయాను రమా. రాత్రంతా నిద్ర లేదు. పరిష్కారం ఏంటో ఎంత ఆలోచిస్తున్నా తెలియడం లేదు.” అంతా చెప్పి నిట్టూర్చాడు.

అంతా విని సాలోచనగా “మన వయస్సు ఉన్న ఆవిడ అలా ప్రవర్తిస్తుంటే ఆవిడకేం చెబుతాం మనం. ఆ అమ్మాయితో మాట్లాడక పోయారా” అంది.

“ఎలా రమా. వారి మధ్య ఇతరుల జోక్యం వల్లే కదా ఇలా జరిగింది. చూస్తూ ఉండడమే తప్ప ఏమీ చెయ్యలేక పోతున్నాను. వాళ్ల పెళ్లి కుదిర్చిన వాడిగానే కాదు. వారి అధికారిగా కూడా”

“నిజమే సుమండీ. అయితే మీరు కల్పించుకోవద్దు. కానీ కల్పించుకోండి. అదెలానో నేను చెబుతాను. ఇదేం కొత్త ఆలోచన కాదు పాతదే. కానీ పనిచేస్తుంది. లేవండి విద్యాశాఖాధికారి గారు, ఇలా దిగాలుగా ఉంటే వ్యవస్థ కుంటుబడి పోదూ..” అంటూ ఏం చెయ్యాలో చెప్పింది రమ. విన్న సుదర్శనం సంతోషంగా వెళ్ళాడు డ్యూటీ కి.

సువర్చల మెటర్నిటీ లీవ్ పూర్తి కాగానే టీచింగ్ సెక్షన్ నుండి తన ఆఫీస్‌కి డిప్యూటేషన్ వేయించాడు సుదర్శనం. అదే చేత్తో ఆఫీస్ ఎదురుగ్గానే ఉన్న స్కూల్‌కి విరించిని కూడా డిప్యూట్ చేసి వినోదం చూడసాగాడు.

ఫలితం కొద్దిరోజుల్లోనే కనబడింది. రోజూ సువర్చల, విరించి ఎదురెదురు పడాల్సిన పరిస్థితి. మెల్లగా ఇద్దరి మధ్యా గోడలు కరిగి పోయాయి. ఇది వరకు ప్రేమ నవ్వులు వారి మధ్య మరలా విరబూసాయి. తిరిగి ప్రేమలో పడ్డ వాళ్ళని విడదీసే వీలులేక కాలం రాజీ పడింది.

వారు అతి వైభవంగా జరుపుతున్న వారి బిడ్డ మొదటి పుట్టిన రోజు విందుని ఆరగిస్తూ..

“నా అధికార జీవితంలో నేను అత్యంత సక్సెస్‌ఫుల్‌గా చేసిన డెప్యూటేషన్ ఇదేనోయ్ రమా. అంతా నువ్వు చెప్పిన సలహా వల్లే. అయితే నా కర్థం కానిది ఒకటే మనం వీళ్లిద్దరికే ప్రేమ ట్రీట్‌మెంట్ ఇచ్చాము. మరి సువర్చల తల్లి గారి సమస్య ఎలా తీరిందా అని” సందేహంగా అన్నాడు సుదర్శనం.

“అలా చూడండి” అని రమ చూపించిన వైపు చూసాడు. బిడ్డని ఒళ్ళో పెట్టుకొని జాగ్రత్తగా చూస్తూ అస్సలు సువర్చలకు కూడా ఇవ్వకుండా గుండెలకు హత్తుకుంటున్న ఆమె తల్లి కనిపించింది.

“ఓహో ఇప్పుడు అతి ప్రేమ, జాగ్రత్త మనవడి మీదికి మళ్లింది అన్న మాట. బావుంది” అని నవ్వాడు.

నవ్వుతూ, తుళ్ళుతూ అతిథులతో మాట్లాడుతున్న విరించి దంపతుల్ని చూపిస్తూ..

“చూడండి, భార్యాభర్తలండీ వాళ్ళు. మనమైనా, ఆమె తల్లైనా ఎవరం చెప్పండి వాళ్ళ మధ్య! ఎవ్వరైనా వాళ్ళ నుండి దూరంగా డెప్యూటేషన్ వెళ్ళవల్సిందే” అంటూ విస్తరి ముందు నుండి లేచింది రమ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here