దేశ విభజన విషవృక్షం-20

0
9

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]మ[/dropcap]న భారతదేశ పాలకులు కానీ, చరిత్రకారులు కానీ.. వెయ్యేండ్ల ముస్లిం రాజుల పరిపాలనను.. ఆనాటి వ్యవస్థలను గురించిన చరిత్రను ఎందుకు మరుగున పెట్టారో అర్థం కాదు. వాళ్ల చరిత్రకు సంబంధించిన ఆధారాలు లభించకపోవడం వల్లనా? లేక దేశంలో మత సామరస్యాన్ని పరిఢవిల్లజేయడం కోసం వాళ్లను మంచివాళ్లుగా చూపించడం కోసమా? అన్నది తెలియదు. ఆయా రాజులు తాము చేసిన యుద్ధాలు, దాడుల గురించి విపులంగానే.. విశ్లేషణాత్మకంగానే.. అద్భుతమైన వివరణలతో బయోగ్రఫీలు రాసుకొన్నారు. కాబట్టి ఆధారాలు లేవు అన్న మాట సరికాదు. కానీ దేశాన్ని ‘సెక్యులర్‌’ గా ఉంచాలన్న ‘తపన’ వల్ల.. వారి రాజ్యము.. తీరుతెన్నుల గురించిన చర్చలు పక్కన పెట్టారు. వారి పరిపాలన ఆనుపానులను కూడా లేకుండా చేశారు. కుప్పు సామయ్యర్‌ మేడ్‌ ఇట్‌ డిఫికల్ట్‌ అని కన్యాశుల్కంలో గిరీశం అన్నట్టు.. చరిత్రను కలగాపులగం చేసి.. మసిపూసి మారేడుకాయ చేసి.. కాలుష్యంతో నింపేశారు. వాళ్లు రాసుకొన్న బయోగ్రఫీలన్నీ ఈ తరాలకు అందకుండా చేశారు. ఎంపిక చేసుకొన్న కొందరి చరిత్రను తిప్పి రాసి గొప్పగా చెప్పడం వికృతం. వెయ్యేండ్ల కాలంలో ఏలిన రాజులందరినీ మహానుభావులని అద్భుతంగా కీర్తించడం కోసం ఈ దేశ పాలకులు చరిత్రను ‘నివురు’ కింద దాచి ఉంచారు. ఇప్పుడీ నివురు తొలిగిపోతున్నది. నిప్పు రగిలిపోతున్నది.

వెయ్యేండ్ల పాలనలో ముస్లిం రాజుల వికృత, పాశవిక, ‘విషాద కామెడీ’లకు అంతే లేకుండా పోయింది. తమ వికృత చేష్టలకోసం.. పాశవికమైన ఆనందంకోసం మతాన్ని ఉన్మాదంగా మార్చిన చరిత్ర వీరిది. ఈ ఉన్మాదాన్ని గురించి ఈ తరానికి తెలియజేయడానికి మన చరిత్రకారులకు ఉన్న అభ్యంతరాలేమిటో తెలియదు. ఒక ఉదాహరణ ఈ ఎపిసోడ్‌‌లో తెలుసుకొందాం. కుత్బుద్దీన్‌ ఖిల్జీ అనే ఓ కుర్ర సుల్తాను ఢిల్లీని ఏలాడు. ఖిల్జీ వంశంలో ఆఖరివాడు. ఇతడి జుట్టు పొడవుగా (ఆడవాళ్ల మాదిరి) ఉండేది. దానిపైనే కిరీటాన్ని పెట్టుకొనేవాడు. మహిళల మాదిరిగా అలంకరించుకొనేవాడు. చీర కట్టిన సుల్తాన్‌ ఇతను. నిత్యం కొత్త పెండ్లి కూతురులా తయారయ్యేవాడు. ఒక్కోసారి రాజదర్బార్‌కు కూడా ఇదే విధంగా వచ్చేవాడు. ఇదంతా ఎంత అసహ్యంగా కనిపించినా.. సుల్తాన్‌ కాబట్టి ఏమీ అనేందుకు లేదు. ఎవరూ సాహసించనూ లేరు. ఇతని మెలోడ్రామా అంతా కూడా ఢిల్లీ సబర్బన్‌‌లో ఒక వెయ్యి స్తంభాల హిందూ భవనంలో కొనసాగేది. ఉదయాన్నే ఒకటి రెండు ప్రాథమిక పనులు పూర్తయిన వెంటనే రాజుగారు.. ఆయన గారి వికృతమైన ఫ్యాన్‌ఫేర్‌ అంతా కలిసి న్యూడిస్ట్‌ క్లబ్‌కు చేరుకొనేవారు. అక్కడ రకరకాల కథలు, డ్రామాలు చోటుచేసుకొనేవి. 20వ శతాబ్దంలో పాశ్యాత్య రీతులైన రాక్‌ అండ్‌ రోల్‌, బెల్లీ, స్ట్రిప్‌టీజ్‌, నైట్‌క్లబ్‌ లీలలు అన్నీ కలిసి ఒక మూసలో వేస్తే ఎంత వికారంగా ఉంటుందో.. ఈ కుత్బుద్దీన్‌ ఖిల్జీ న్యూడిస్ట్‌ క్లబ్‌లో ఆ వికారాలన్నీ సాకారంగా కనిపించేవి. ‘సెక్సువల్‌ ఫ్రీ ఫర్‌ ఆల్‌’ అన్నది అక్కడి సూత్రం. ఎవరు ఏమైనా చేయవచ్చు. తాగినవాళ్లకు తాగినంత.. తిన్న వాళ్లకు తిన్నంత. మందు, మాదక ద్రవ్యాలకు అంతే లేదు. హారెమ్‌ (స్త్రీ ఖజానా) లోకి కిడ్నాప్‌ చేసి తెచ్చి పడేసిన అందమైన హిందూ మహిళలను ఈ క్లబ్‌కు తీసుకొచ్చేవారు. ఇక అక్కడ వారి ఆటపాటలు, గానాబజానా మొదలయ్యేవి. ఆడవాళ్ల చిత్రహింసలకు పరాకాష్ట అంటే ఏమిటో అక్కడ కనిపించేది. అక్కడ వినిపించే సంగీతానికి అనుగుణంగా వారు ఆడాలి. రిథం ముఖ్యం. అది వేగంగా ఉంటే వేగంగా ఆడాలి. స్లోగా ఉంటే స్లోగా ఆడాలి. రాయల్‌ ఆర్కెస్ట్రా చిత్రవిచిత్రంగా సంగీతాన్ని మోగించడం.. దానికి అనుగుణంగా తప్పతాగి.. చిత్తం వచ్చినట్టు డాన్సులు చేయటం.. ఇలా చాలాసేపు జరిగేది. తరువాత సుల్తాన్‌ గారు పెండ్లికూతురులా అలంకరించుకొని.. సీన్‌లోకి ఎంటర్‌ అయ్యేవారు. అక్కడ వారిని ఎవరూ గుర్తుపట్టరాదు. వారు ఆడినంతవరకు ఆడుతారు. మందు తాగుతారు.. ఎదుటివాళ్లమీద పోస్తారు. స్త్రీల బట్టలు ఊడబెరుకుతారు. ముద్దుల పేరుతో రక్తం వచ్చేలా కొరుకుతారు. వారు ఏమైనా చేయవచ్చు. దేన్నీ హింస అని కానీ, చిత్రహింస అని కానీ అనరాదు. అదంతా జస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే. క్లైమాక్స్‌కు వచ్చిన తరువాత ఒంటి మించి ఒక్కో బట్టను విప్పి విసిరేస్తాడు. కాటుక పెట్టుకొన్న కండ్లను గుండ్రంగా తిప్పుతూ.. వికారంగా అరుస్తూ.. బట్టలు విప్పుతుంటాడు. సుల్తాన్‌ పూర్తి నగ్నంగా మారేంతవరకూ మేజువాణీ కొనసాగుతుంది. సుల్తాన్‌ ఆ విధంగానే కనిపించగానే.. న్యూడిస్ట్‌ క్లబ్‌‌లో ఉన్న మగవాళ్లందరూ వెళ్లిపోతారు. ఆ తరువాత విశృంఖల వీరవిహారం కొనసాగుతుంది. ‘తారీఖ్‌ ఇ ఫిరోజ్‌షాహీ’ అన్న బయోగ్రఫీలో జియావుద్దీన్‌ బర్నీ ఈ కుత్బుద్దీన్‌ ఖిల్జీ వ్యవహారాన్ని అంతా పూసగుచ్చినట్టు రికార్డు చేశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే.. ఇదంతా కాలగర్భంలో కలిసిపోయి.. ఇతను కూడా కుత్బుద్దీన్‌ ది గ్రేట్‌ అయ్యేవాడేమో. భారతదేశంలో ముస్లిం రాజుల ప్రవర్తనకు అచ్చమైన ఉదాహరణ ఈ కుత్బుద్దీన్‌ ఖిల్జీ. ఇంత అసహ్యకరమైన, జుగుప్సాకరమైన, పైశాచికమైన రీతిలో ప్రవర్తిల్లిన రాజుల గురించి చరిత్ర పుస్తకాల్లో దుర్భిణీ వేసినా కనిపించదు. వాళ్ల రాజ్యం అంతా సుభిక్షంగా, మతసామరస్యంతో పరిఢవిల్లిందనే రాస్తారు. ‘ఈ దేశంలో మనుషులకు బతకడం చేతకాకపోతే.. దేవుడు ఈ దేశ ప్రజలను ఉద్ధరించడానికి దేవ దూతలుగా ముస్లిం రాజులు ఈ దేశానికి వచ్చినట్టుగా చెప్తారు. ఈ దేశం చాలా పేదది. తినడానికి కూడా గింజలు లేని పరిస్థితిలో ఉన్నది.. సెంటిమెంటల్‌ నాన్సెన్స్‌ దేశమిది. రాజకీయంగా, మతపరమైన భావోద్వేగానికి గురైన దేశమిది’ అని చెప్పుకొస్తారు. వాస్తవంగా ఈ దేశంలో నాడూ నేడూ కూడా కొనసాగుతున్నది మత రాజకీయమే. సెక్యులర్‌ రాజకీయం ఎంతమాత్రం కాదు. ఈ మత రాజకీయమే దేశంలో అంతర్యుద్ధానికి కారణమవుతున్నది. ప్రజలను ఒకరితో ఒకరు ఇంటిగ్రేట్‌ కాకుండా అంతరాలను పెంచుతున్నది.

ఖిల్జీ వంశం నుంచి వచ్చిన ఇద్దరు సుల్తానులు.. ఈ దేశాన్ని సుదీర్ఘ కాలం పరిపాలించారు. అంతకుముందున్న సుల్తాన్‌ను చంపి జలాలుద్దీన్‌ ఖిల్జీ అధికారంలోకి వచ్చాడు. ఖిల్జీ వంశాన్ని కొనసాగించాడు. ఆ తరువాత కొద్దికాలానికి జలాలుద్దీన్‌ తానే వంచితుడయ్యాడు. తన మేనల్లుడు అల్లావుద్దీన్‌ ఖిల్జీ చేతిలో హతమయ్యాడు. అతడు రెండు దశాబ్దాల పాటు అత్యంత భయంకరమైన పరిపాలన సాగించాడు. ఈ అల్లావుద్దీన్‌ ఖిల్జీ సమయంలోనే దక్షిణాపథానికి ఇస్లాం పెద్ద ఎత్తున విస్తరించింది. కాకతీయ సామ్రాజ్యం సైతం ఇతని కాలంలోనే పతనమైంది. వందల ఏండ్లపాటు ఉత్తరాపథానికే పరిమితమైన ఇస్లాం రాజ్యాలు.. ఖిల్జీల సమయంలో దక్షిణ భారతం వైపు దృష్టి సారించాయి. చాలా సంవత్సరాల పాటు ఒక నిర్దిష్టమైన ప్రణాళికలు రూపొందించుకొన్న తరువాత అల్లావుద్దీన్‌ ఖిల్జీ 1296వ సంవత్సరంలో దేవగిరి రాజ్యంపై దాడి చేశాడు. అతడు యుద్ధానికి వచ్చేసమయానికి అక్కడి రాజు రామదేవరావు.. ప్రతి దాడికి సిద్ధంగా లేడు. ఎందుకంటే.. అప్పటివరకు మన రాజులకు దొంగ దెబ్బ అంటే ఏమిటో తెలియదు. యుద్ధం చేయాలంటే.. శత్రువుకు చెప్పి చేసేవారు. ఎవరైనా వస్తే.. ఎందుకు వస్తున్నారని ఆరా తీసే లక్షణం లేదు. వచ్చినవాడిని అనుమాన దృష్టితో చూడాలన్న ధ్యాస లేదు. భారతదేశంలో ఈ రకమైన పరిస్థితి, జనజీవనం ముస్లిం రాజులకు బాగా కలిసి వచ్చింది. అల్లావుద్దీన్‌ ఖిల్జీ ఇదే పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకొన్నాడు. ఢిల్లీ నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చేంతవరకూ అతడిని అడ్డుకొన్నవారే లేరు. ఒక్కసారిగా 1296లో దేవగిరి రాజ్యంపై దండెత్తాడు. యుద్ధానికి సిద్ధంగా లేని రాజు.. సహజంగానే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. దేవగిరి కోటలోని సంపదనంతా దోచుకొన్న ఖిల్జీ ఖాళీ కోటను వదిలేసి తిరుగుప్రయాణమయ్యాడు. అదే సంవత్సరం అక్టోబర్‌లో జలాలుద్దీన్‌ను హతమార్చి ఢిల్లీ సుల్తాన్‌గా ప్రకటించుకొన్నాడు. ఖిల్జీ సేనాని మాలిక్‌ కాఫర్‌ 1318 వ సంవత్సరంలో ఓరుగల్లు కోటపై దాడి చేసి ధ్వంసం చేశాడు. కాకతీయ సామ్రాజ్యం పతనమైపోయింది. అదృష్టం బాగుండి.. కాకతీయుల వారసులైన హరిహర రాయ బుక్కరాయ సోదరులు విజయనగర స్థాపకులయ్యారు. తురుష్కుల దండయాత్రలను దీటుగా ఎదుర్కొని దాదాపు రెండు శతాబ్దాల పాటు దక్షిణ భారతాన్ని కాపాడిన ఏకైక సామ్రాజ్యం విజయనగరం.

1316లో అల్లావుద్దీన్‌ చనిపోయిన తరువాత ఐదేండ్ల యువరాజు షాహబుద్దీన్‌ను సుల్తాన్‌గా మాలిక్‌ కాఫర్‌ ప్రకటించాడు. దీంతో అధికారం అంతా తన చేతుల్లోనే ఉంటుందని భావించాడు. షాహబుద్దీన్‌ను సంరక్షణ కోసం గ్వాలియర్‌కు పంపించాడు. కొద్ది రోజుల తరువాత ఖిజ్‌ ఖాన్‌ను గ్వాలియర్‌కు పంపించి ప్రిన్స్‌ కండ్లను ఎర్రగా కాల్చిన ఇనుప రాడ్లతో పొడిపించాడు. మధ్యయుగాలనాటి ముస్లిం రాజుల హత్యాకాండకు, పాశవిక మనస్తత్వానికి ఇవన్నీ ఉదాహరణలే. మరో తార్కాణం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. అల్లావుద్దీన్‌ ఖిల్జీ మరో సంతానం షాదీఖాన్‌ను ఒక హిందూ భవనంలో బంధించారు. అందులోని ఒక సెల్లార్‌లో అతడిని కాళ్లూ చేతులు కట్టి పడేసి ఒక రేజర్‌తో అతడి కనుగుడ్లను మాలిక్‌ కాఫర్‌ పెరికించాడు. అల్లావుద్దీన్‌ ఆస్తినంతా దోచుకొన్నాడు. ఒకరి తరువాత ఒకరుగా అల్లావుద్దీన్‌ బంధువులందరినీ హతమార్చడమే పనిగా పెట్టుకొని ముందుకు సాగాడు. ఎలాగైనా తానే ఢిల్లీ సుల్తాన్‌ కావాలన్న లక్ష్యంతో అల్లావుద్దీన్‌ కుటుంబ సభ్యులందరినీ చంపుకొంటూ వెళ్లాడు. కానీ.. అదే మాలిక్‌ కాఫర్‌కు శాపంగా మారింది. సుల్తాన్‌ కావాలన్న లక్ష్యం నెరవేరకుండానే.. అతడికి అల్లావుద్దీన్‌ బంధువు తల నరికి చంపారు.

మాలిక్‌ కాఫర్‌ తరువాత ముబారక్‌ ఖాన్‌ జైలు నుంచి విడుదలయ్యాడు. చిన్నవాడైన షాహబుద్దీన్‌ (మాలిక్‌ కాఫర్‌ కండ్లు పెరికించిన సుల్తాన్‌) సుల్తాన్‌ పేరుతోనే కొనసాగుతున్నాడు. నిజానికి గుడ్డివాళ్లను చేయాలన్న మాలిక్‌ కాఫర్‌ లిస్టులో ముబారక్‌ ఖాన్‌ కూడా ఉన్నప్పటికీ.. అదృష్టవశాత్తూ బయటపడిపోయాడు. షాహబుద్దీన్‌ అస్తిత్వాన్ని ముబారక్‌ ఖాన్‌ ఎక్కువకాలం సహించలేకపోయాడు. ఇంకేం.. ముస్లిం రాజరికంలో ఉన్న సంప్రదాయం ప్రకారమే షాహబుద్దీన్‌ తొలగించబడ్డాడు. ముబారక్‌ ఖాన్‌ కాస్తా.. సుల్తాన్‌ షహీద్‌ కుతుబుద్‌ దున్యా వాద్‌ దిన్‌ అన్న టైటిల్‌ పెట్టుకొన్నాడు. అప్పటికి అతడి వయస్సు 17 సంవత్సరాలు మాత్రమే. కుత్బుద్దీన్‌ సుల్తాన్‌ కావడం తోనే.. తనకు ముప్పు వాటిల్లబోతున్నదని గ్రహించాడు. చనిపోయిన మాలిక్‌ కాఫర్‌ గ్యాంగ్‌ తనను మర్డర్‌ చేయడానికి పన్నాగం పన్నుతున్నదని వాసన పసిగట్టాడు. ‘కుత్బుద్దీన్‌ ఆ గ్రూపులోని వారందరినీ.. వేరు చేశాడు.. వేర్వేరు ప్రాంతాలకు పంపించి.. అక్కడ వారిని చంపించాడు. (తారీఖ్‌ ఇ ఫిరోజ్‌షాహి పే.210, వాల్యూమ్‌ 3)

కుత్బుద్దీన్‌ పూర్తిగా అధికారాన్ని హస్తగతం చేసుకొన్న తరువాత ఏరికోరి హిందూ ఇండ్లల్లోకి చొరబడి యువకులను అపహరించుకొని వచ్చి మతం మార్పించి ఒక సైన్యంగా మార్చివేశాడు. కుత్బుద్దీన్‌ స్వీట్‌హర్ట్‌ ఎవరంటే ఒక హిందూ. ఇతడు బలవంతంగా మతం మార్చుకొన్నవాడు. ఇతడి పేరు హసన్‌.

»kutubuddin was so infatuated and so heedless of consequences that he placed the army of the late malik kafur under this youth, and gave to him the fiefs held by that malik. his passion and temerity carried him. so far that he raised the youth to the office of vazir and he was so doting that he could never endure his absence for a moment..

..when kutubuddin came to the throne he was much given to dissipation and pleasure. On the day of accession he gave orders that the prisoners and exiles of the late reigh amounting 17000 or 18000 be released. ..The sultan plunged in to sensual indulgence openly and publicly. By night and by day, and the people followed his example. Beauties were not to be obtained. The price of a boy or handsome eunuch or beautiful damsel, varied from 500, 1000, 2000 tankas..

(తారీఖ్‌ ఇ ఫిరోజ్‌షాహి పే.210, 211, 212 వాల్యూమ్‌ 3)

బాజాప్తా.. అంగట్లో సరుకులను కొన్నట్టుగా.. పిల్లలను.. మహిళలను అడ్డగోలుగా హారెమ్‌కు తరలించి అత్యంత పాశవికంగా చిత్రహింసలు పెట్టి పైశాచికానందం పొందిన భయంకరమైన సుల్తాన్‌ కుత్బుద్దీన్‌ ఒక్కడేనేమో. మనకు చరిత్రలో కలిగులా క్రూరుడు, ధూర్తుడు, లైంగిక పైశాచికుడు అన్నట్టు చెప్తారు. భారతదేశాన్ని పాలించిన ఒక్కొక్క సుల్తాన్ పొట్టవిప్పి  చూస్తే,  ఒక్కో సుల్తాన్  వేలవేల  కలిగులాల పెట్టు అన్నది  స్పష్టంగా తెలుస్తుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here