దేశ విభజన విషవృక్షం-3

2
12

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]భా[/dropcap]రతదేశ విభజన గురించి అర్థం చేసుకోవడానికి ముందు మనం మరికొంత వెనక్కి వెళ్లి చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. భారతదేశ విభజన 1947 ఆగస్టు 15న జరిగిందని చాలామంది అనుకొంటారు. 1938 స్థానిక ఎన్నికలు.. ముస్లింలీగ్‌.. బ్రిటిష్‌ వారి వత్తాసు.. పరిణామ క్రమంలో జరిగిన విభజన ప్రక్రియ గురించి కొంత మందికి మాత్రం తెలుసు. కానీ.. అంతకుముందు దాదాపు ఏడు వందల సంవత్సరాల నుంచి ఈ దేశంపై జరిగిన దాడులు.. కుట్రలు.. దాని పరిణామ విపరిణామాల ప్రభావం మన దేశాన్ని ఎలా ముక్కలు చేసిందన్న దానిపై చాలామందికి అవగాహన కూడా లేదు. ప్రస్తుత కాలమానం ప్రకారం 6వ శతాబ్దం నుంచే మన దేశంపై ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక దాడులు మొదలయ్యాయి. ఇవి చాలా తీవ్రమైనవి. భారతదేశంలో సనాతనంగా ఉన్న ధర్మాన్ని మూలచ్ఛేదం చేసి.. ఇస్లామీకరణ కోసం అతి తీవ్రంగా ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుత శకం 632లో గజ్వా ఏ హింద్‌ పేరుతో సింధు ప్రాంతంపై ఆక్రమణ చేయడంతోనే భారత్‌ను పూర్తిగా ఆక్రమించే తొలి ప్రయత్నం జరిగింది. బ్రిటిష్‌ వాళ్లు విభజించి పాలించు అన్న సూత్రం ప్రకారం ఈ విభజన చేశారని చాలామంది ప్రజలు భ్రమల్లో ఉంటారు. కానీ.. విభజనకు మరో ముఖాన్ని మనమెవరమూ ఇప్పటికీ చూడనే లేదు.

పవిత్ర దేవదూత మహమ్మద్‌ ప్రవక్త తన దైవ సందేశాలను 610 సంవత్సరం నుంచి ఇవ్వడం ప్రారంభించారు. 622లో ప్రవక్త సైన్యం గజ్వా ఏ బదర్‌ పేరుతో అరేబియాలోని మక్కాను స్వాధీనం చేసుకొన్నది. అప్పటినుంచి అరేబియా ఇస్లామీకరణ జరిగిపోయింది. ఎంతగా అంటే.. ఇస్లాం రావడానికి ముందు అరేబియాలో ఏ రకమైన సంప్రదాయ భావనలు ఉన్నాయి? ఏ రకమైన జీవన విధానం ఉన్నది.. అన్న విషయాలన్నీ మరచిపోయేంతగా.. ఒక రకంగా చెప్పాలంటే ఏ రకమైన ఆనవాళ్లు లేకుండా మాయమైపోయాయి. ఇప్పుడు అరేబియన్ల చరిత్ర అంటే.. 610 సంవత్సరం నుంచే అని చెప్పుకొనే పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు తమ పూర్వీకులు ఎవరన్నది.. ఏం చేసేవారన్నది పెద్దగా తెలియదు. అరేబియాలో అంతకుముందు పురావస్తు అన్వేషణ పూర్తిస్థాయిలో జరుగనే లేదు. దక్షిణ అరేబియాలో మాత్రం కొన్ని శాసనాలు, నాణేలు లభించాయి. ఇస్లామీకరణకు ముందు అరేబియాలో ప్రబలంగా విగ్రహారాధన ఉండేదని ఈ ఆనవాళ్ల ద్వారా తెలుస్తున్నది. మన దేశంలో మాదిరిగానే బహు దేవతరాధన ఇక్కడ కొనసాగింది. అప్పటి రాజ్యాల్లో అన్ని రకాల దేవీదేవతలను సమాదరించారు. గిరిజన తెగల నుంచి గ్రామాలు, పట్టణాల్లో దేవతారాధన కొనసాగింది. దక్షిణ అరేబియాలోని పలు ప్రాంతాల్లో లభించిన శిథిల దేవతా విగ్రహాలు, నాణేలు ఆనాటి సమాజ స్వరూపాన్ని స్పష్టంగానే వెల్లడిస్తున్నాయి. బయటి దేశాలనుంచి అరేబియాకు సాగిన వ్యాపార వాణిజ్యాలు సైతం అక్కడ సాంస్కృతిక జీవనంపై ప్రభావం చూపించాయి. చాలా మంది దేవతలకు ఎలాంటి పేర్లు ఉన్నాయో.. ఆనాటి ప్రజలు ఎలా ఉచ్చరించేవారో తెలియదు. పర్షియన్లు, గ్రీకులు, రోమన్లు, ఈజిప్షియన్ల చారిత్రక గ్రంథాల్లో పూర్వపు అరేబియా సమాచారం కొంత దొరుకుతున్నది. తరువాతి తరంలో ఇస్లామిక్‌ పండితులు రికార్డు చేసిన మౌఖిక సంప్రదాయాల గురించిన సమాచారం మరికొంత లభ్యమవుతున్నది. హిందూ మహా సముద్రం, ఎర్ర సముద్రం మీదుగా అరేబియాకు కొనసాగిన వాణిజ్యం వల్ల కొత్త రాజ్యాలు ఏర్పడటానికి కొత్త సంస్కృతులు కలబోత కావడానికి ఆస్కారం ఏర్పడింది. సాబాయేన్‌, ఆసాన్‌, హిమ్యార్‌, నబాటేన్స్‌ రాజ్యాలు ఈ విధంగా వచ్చినవే.

అరేబియా ఇస్లాంలోకి మారడానికి ముందు అక్కడ పలు రకాల ధార్మిక సంప్రదాయాలు ఉండేవని తెలుస్తున్నది. అనటోలియా, అరేబియా, కనాన్‌, ఈజిప్ట్‌, ఇరాన్‌, మెసపటోమియా, సిరియా సంప్రదాయాలు కొనసాగాయి. తరువాతి కాలంలో ఇవే పేర్లతో దేశాలు ఏర్పడినాయి. వీటిలో హిట్టెటీలు అనటోలియన్‌ ప్రజలు. 1650 బీసీలో కుస్సారా రాజ్య ఏర్పాటులో వీరి పాత్ర కీలకమైంది. ఆ తరువాత వీరి రాజ్యం బహుముఖాలుగా విస్తరించింది. 1600 నుంచి 1100 బీసీ మధ్య కాలంలో మహా సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఇవాళ మనం పిలిచే టర్కీ ఇదే. ఈ టర్కీ ఖలీఫా కోసమే మన దేశంలో ఖిలాఫత్‌ ఉద్యమం జరిగింది. మోప్లా తిరుగుబాటు దీని వైపరీత్యమే. దీన్నే మన దేశ నాయకులు సమర్థించారు. దీనికోసం స్వరాజ్‌ మూమెంట్‌ను కూడా వాయిదా వేశారు. అది వేరే సంగతి. దీని గురించి తరువాత చెప్పుకోవచ్చు. హిట్టెటీ భాష.. లూవియన్‌ భాషకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇండో యూరోపియన్‌ భాషా కుటుంబంలో ఇది కూడా ఒకటిగా ఉన్నది. వీరు కూడా బహు దేవతారాధకులుగా ఉన్నారు.

8వ శతాబ్దం బీసీ నాటి శాసనంలో హథ్రామౌట్‌ రాజ్యం శాసనం ఒకటి లభించింది. క్రీస్తుపూర్వం 7వ శతాబ్ది నాటి కరాబిల్‌ వాటర్‌ శాసనంలో పూర్వపు అరేబియా నాగరికతకు సంబంధించిన సమాచారం కొంత అవగాహనకు వస్తున్నట్టు ఇస్లామిక్‌ పండితులు కొంత రికార్డు చేశారు. ఈ శాసనం ప్రకారం హథ్రామౌట్‌ రాజ్యానికి యదా ఇల్‌ మిత్రదేశమని పేర్కొన్నారు.

అరేబియాలోనే ఉరుక్‌ నగరంలో 4వ శతాబ్ది నాటి శాసనంలో గొడ్డలి బొమ్మ కనిపిస్తుంది. ఇది నరకడానికి, ప్రత్యేక అధికారికి గుర్తుగా చెప్తారు. సబాయెన్లు పాత దక్షిణ అరేబియా భాష మాట్లాడే ప్రజలు. వీళ్లంతా నైరుతి అరేబియా ద్వీపకల్పం.. అంటే ఇవాళ్టి యెమెన్‌లో జీవించేవారు. 2000 బీసీ నుంచి 8వ శతాబ్దం బీసీ వరకు వీరు ఇరెత్రియా, ఇథియోపియా ప్రాంతాల్లో కూడా ఉన్నారు. ఒకటో శతాబ్దం బీసీలో హిమ్యారైట్లు వీళ్లను జయించారు. వాడీ బేహాన్‌కు దక్షిణాన హగర్‌యహిర్‌లో ప్రాచీన ఆవ్సాన్‌ రాజ్యాన్ని చరిత్రకారులు గుర్తించారు. ఇది ఒక మట్టిదిబ్బలా కనిపిస్తున్నది. ఒకటో శతాబ్దిలో అరేబియాలో ఆర్థిక ఆధిపత్య రాజ్యంగా హిమ్యార్‌ కొనసాగింది. బహు దేవతలను ఆరాధించడం, అగ్నిని ఆరాధించడం, ప్రత్యేక ప్రార్థనా పద్ధతులను అవలంబించడం జరిగింది. వీరు ఇతర దేశాలతో సముద్ర వాణిజ్యాన్ని కొనసాగించారు. ముఖ్యంగా సుగంధ ద్రవ్యాల ఎగుమతి ఎక్కువగా జరిగింది. తూర్పు ఆఫ్రికా నుంచి మధ్యధరా ప్రపంచానికి హిమ్యార్‌ ఒక వారధిగా నిలిచింది. రోమన్‌ సామ్రాజ్యానికి ఆఫ్రికానుంచి ఏనుగు దంతాలు హిమ్యార్‌ మీదుగానే ఎగుమతి అయ్యేవి. రోజూ పదుల కొద్దీ ఓడలు హిమ్యార్‌ మీదుగా ప్రయాణించేవి. ఈ సముద్ర వాణిజ్యం అరేబియా సాంస్కృతిక, రాజకీయ, సామాజిక జీవన విధానాలపై తీవ్రంగా ప్రభావం చూపింది. అనేక మంది దేవీ దేవతలు వీరి పూజలను స్వీకరించారు. వీరికి సంతాన దేవతలున్నారు. సిరులిచ్చే దేవతలున్నారు. అమ్‌, ఆబ్గల్‌, అల్‌ కుట్‌బే, అర్సు, అసిరా, అల్లా, బాల్షామిన్‌, బాసామమ్‌, డాటిన్‌, దషరా, హౌబస్‌, మనాఫా, నఖ్రా, రుడా, సాద్‌, వాడ్‌, యథా వంటి చాలా దేవతలు ఇక్కడ కనిపిస్తారు. ప్రత్యేక ప్రార్థనా పద్ధతుల ద్వారా వీరిని పూజించేవారు. ఇండో యురోపియన్‌ లాంగ్వేజి కుటుంబంలోని భాషలు ఈ ప్రాంతంలో చలామణిలో ఉండేవి. వీటికి ఒక విధంగా మూలం ఇతర భాషల మాదిరిగానే సంస్కృతమే కావొచ్చు. పండితులు అధ్యయనం చేసి చెప్పాలి. నబాటియన్లు, పెట్రా, లఖ్మిడ్‌ వంటి రాజ్యాలు కూడా ఈ కోవలో సాంస్కృతిక జీవనాన్ని కొనసాగించినవే. లఖ్మిడ్‌ రాజ్యం దక్షిణ ఇరాక్‌ నుంచి వచ్చిన క్రిస్టియన్ల సమూహం ద్వారా ఏర్పాటైంది.

తన అనుచరులను పెంచుకోవడం కోసం.. తన ప్రబోధాలను విస్తరించడం కోసం పవిత్ర మహమ్మద్‌ ప్రవక్త ప్రయత్నించారు. ముందుగా మక్కాకు చేరుకొని.. అక్కడ తన ధర్మాన్ని సుస్థాపితం చేసుకొన్నారు. అక్కడి నుంచే ఇస్లాం విస్తరణ మొదలైంది. మహమ్మద్‌ ప్రవక్త అనంతరం అబు బకర్‌ ఖలీఫాగా అవతరించాడు. అక్కడినుంచి ప్రపంచమంతటా ఇస్లామీకరణ అనే వాదం ప్రబలింది. ఇందుకోసం అబు బకర్‌ ఆదేశాలతో ఇస్లాం అనుచరులు భారీ ఎత్తున దాడులకు ఉపక్రమించారు. గజ్వా అంటే దాడి అని అర్థం. పవిత్ర లక్ష్యం కోసం అని దాని ఇంటర్‌ప్రెటేషన్‌. ముందుగా అరబ్బులపై దాడి చేసి వారిని పూర్తిగా ఇస్లామైజేషన్‌ చేసేశారు. ఆ తరువాత పొరుగునే ఉన్న పర్షియన్ల పైనా యుద్ధం కొనసాగింది. వారు కూడా ఇస్లామీకరణ చెందారు. తొలిరోజు నుంచి కూడా వారి లక్ష్యం స్పష్టంగా ఒక్కటే. మతమార్పిడి చేయించడం.. రాజ్యాలను స్వాధీనం చేసుకోవడం.. ప్రపంచమంతటా ఒకే మత రాజ్యంగా మార్చడం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here