దేశ విభజన విషవృక్షం-31

0
9

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]మ[/dropcap]రాఠాల గురించి ముఖ్యంగా శివాజీ, శంభాజీల గురించి లోతుగా చర్చించడానికి ప్రధాన కారణం భారతదేశంలో వందల ఏండ్లు ప్రభంజనంలా సాగుతూ వచ్చిన బలవంతపు ఇస్లామీకరణను తమ ప్రాణాలను పణంగా పెట్టి అడ్డుకున్న వీరులు వీరు కాబట్టి. భారతదేశంలో వెయ్యేండ్లపాటు సాగిన ఇస్లాం రాచరికపు పునాదులను పెకిలించి.. మహా హిందూ సామ్రాజ్య స్థాపకులుగా నిలిచిన ఛత్రపతులు కాబట్టి. ఇది సామాన్యం కాదు.. అన్ని వైపులనుంచి కమ్ముకొని వచ్చిన విదేశీ మూకలను ఒక్కరై నిలిచి పోరాడిన యోధులు. కేవలం వీరిని తమ వైపు తిప్పుకోవడం కోసం.. ఇస్లాంకు విధేయంగా మార్చడం కోసం ఔరంగజేబు అనే వాడు పడని తిప్పలు లేవు. భారతదేశంలో చాలామంది రాజులు ధర్మం పేరుతోనే.. గుడ్డిగా నమ్మడం వల్లనో.. భయంతోనో ముస్లింల చొరబాటుకు కారణమయ్యారు. రాజ్‌పుత్‌లు, మరాఠాలు, విజయనగర రాజుల పుణ్యమా అని భారతీయ ధర్మం, మతం, సంస్కృతి కొద్దో గొప్పో సజీవంగా ఉన్నది. వాళ్ల వల్లనే ఈ మాత్రమైనా మనం, మన ధర్మాన్ని నిలబెట్టుకోగలిగాం. అందుకే విభజన విషబీజాల మధ్యన చెదరకుండా నిలబడిన తులసి మొక్కలను గురించి కొంచెమైనా చర్చించాల్సిన అవసరమున్నది.

భారతీయ ధర్మాన్ని కాపాడటానికి తన శరీరంలో కంటి నుంచి కాలు దాకా ప్రతి అంగాన్ని.. ప్రతి మాంసపు ముద్దను ముక్కలు ముక్కలుగా.. సమర్పించినవాడు శంభాజీ. శరీరంలోని చివరి రక్తపు బొట్టును సైతం తన ధర్మం కోసం అభిషేకం చేసిన మహా వీరుడు శంభాజీ. ఈ దేశంలో ముస్లిం రాజుల.. ముఖ్యంగా ఔరంగజేబు క్రూరత్వానికి పరాకాష్ట శంభాజీని హతమార్చడం. ఒక్కసారి ఊహించండి.. కనుగుడ్లు పెరికారు.. ఇస్లాం లోకి మారాలన్నారు.. చెయ్యి నరికారు.. ఇస్లాం లోకి మారాలన్నారు. కాలు నరికారు.. ఇస్లాంలోకి మారాలన్నారు. ప్రాణం తీయకుండా ఒక్కో అంగాన్ని నరుకుతున్నారు. తన ఎదుటే తన శరీర మాంస ఖండాలను కుక్కలు పీక్కొని తింటున్నాయి. రక్తం నంజుకుంటున్నాయి.. అయినా.. తాను తన ధర్మాన్ని వీడలేదు. శత్రు మూకల ముందు తల వంచలేదు. సామాన్యుడెవడికైనా సాధ్యమేనా..? శివాజీ, శంభాజీలు ఈ దేశపు నిజమైన ధర్మానికి ప్రతీకలు. ధర్మాన్ని నిలబెట్టిన వారు. వీరిద్దరే ఒక్క ఏడు వందల ఏండ్ల ముందు పుట్టి ఉంటే.. ఈ దేశంలో ఇస్లామీకరణ జరిగేదా? మన దురదృష్టం కాకపోతే..

శంభాజీని పట్టుకొన్నతరువాత ముకర్రబ్ ఖాన్ చాలా భయపడ్డాడు. ఔరంగజేబ్‌కు అప్పజెప్పేదాకా కూడా అతడికి పెద్ద టాస్కే. తన తండ్రి శివాజీ మాదిరిగా శంభాజీ కూడా పారిపోతాడేమోనని ఆందోళన చెందాడు. ఎందుకంటే గెరిల్లా యుద్ధంలో తండ్రిని మించిన వాడు తనయుడు. దీంతో అతి భారీ ఇనుప గొలుసులతో బంధించాడు. ఆ తరువాతే ఔరంగజేబ్ దగ్గరకు తరలించాడు.

అప్పటికే మరాఠాలను జయించాలని శతవిధాలా ప్రయత్నం చేస్తున్న ఔరంగజేబ్.. గెలుపుకు ఆమడ దూరంలోనే ఉండిపోయాడు. శివాజీ చనిపోయాడని తెలిసిన మరుక్షణమే.. జస్ట్ చిటికెలో శంభాజీని గెలిచి మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకొని తన కల నెరవేర్చుకొని వద్దామనుకొని 1681లోనే దక్కను మీదకు ఉరుకులు పరుగులు మీద వచ్చిన ఔరంగజేబ్ దాదాపు పాతికేండ్లపాటు అక్కడే యుద్ధాల్లో మగ్గిపోవాల్సి వచ్చింది. శివాజీ, శంభాజీ కాదు కదా.. ఆ తరువాత కూడా మరాఠాలు ఔరంగజేబ్ వశం కాలేదు.

శంభాజీని బంధించే సమయానికి ఔరంగజేబ్ అక్లజ్ గ్రామంలో క్యాంపు వేసి ఉన్నాడు. అక్లజ్ గ్రామాన్ని అసద్ నగర్‌గా మార్చివేశాడు. దేశంలో చాలా నగరాల పేర్లు ఇలా మారినవే.. ఢిల్లీలో వీధుల పేర్లు నిన్న మొన్నటి వరకూ వీళ్ల రెప్రజెంటేషన్‌ను పదే పదే గుర్తు చేసినవే. కానీ.. ఓటు బ్యాంకు ప్రజాస్వామ్యంలో మనం మన పేర్లను కూడా తిరిగి పెట్టుకోలేని దురవస్థలో ఉండిపోయాం. నాకు చాలా ఆశ్చర్యమేస్తుంది? ఎందుకంత భయం.. ఎలాగూ విడిపడ్డ ఈ దేశాన్ని సెక్యులర్ పేరుతో భ్రష్టు పట్టించారు కదా.. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసుకుంటే చేసుకోవచ్చు. ఆయా వర్గాలకు కావలసినన్ని ఇచ్చుకొండి. కానీ.. అదే సమయంలో ఈ దేశపు ఆత్మను నిలబెట్టాలి కదా.. దానివల్ల వీళ్లకు కలిగే నొప్పేమిటి? సెక్యులరిజం అనబడే మతోన్మాదానికి కలిగే నష్టమేమిటి? అదే అర్థం కాదు. అవును.. ఇవాళ సెక్యులరిజం అంటే ఈ దేశంలో మతోన్మాదమే. ఒక మతం పట్ల ఉన్మాదంతో ఔదార్యం ప్రదర్శించడం.. ఆ మతం కోసం మరో మతాన్ని పని గట్టుకొని విధ్వంసం చేసే కుట్ర చేయడం. ఇదే ఈ దేశంలో సెక్యులరిజం. ఇది వేరే సబ్జెక్ట్.. మరింత వివరంగా తరువాత చర్చించుకోవచ్చు.

శంభాజీ బందీ అయిన సమయంలో ఔరంగజేబ్ సొంత క్యాంపులో సైన్యం రెండు మైళ్ల మేర విస్తరించి ఉన్నది. తులాపూర్ నుంచి కోరేగావ  వరకు అప్టి, వాదు ఖుర్ద్ వరకు (పూనాకు కొద్ది మైళ్ల దూరం వరకు) వ్యాపించి ఉన్నది. 1689 ఫిబ్రవరి 15న శంభాజీని ఔరంగజేబ్ ముందు ప్రవేశపెట్టారు. ఔరంగజేబ్ తన క్యాంపు దర్బారులో సింహాసనంపై కూర్చొన్నాడు కానీ.. అతడిలో శంభాజీ దొరికాడన్న ఆనందం కూర్చోనివ్వడం లేదు. సింహాసనం మీంచి ఒక్కసారిగా కిందకు దిగి అల్లాకు దండం పెట్టుకున్నాడు. శంభాజీని పట్టించినందుకు విధేయత ప్రదర్శించాడు.  తరువాతి రోజున దేవుడికి ప్రత్యేక కృతజ్ఞతా దినంగా ప్రకటించాడు. మొఘల్ శిబిరం అంతటా పండుగ చేసుకోవాలని ఆదేశించాడు. ఫిబ్రవరి 16న ఏం జరిగిందో కాఫీ ఖాన్ ఇలా రాశాడు. ‘the emperor out of his devotion to Islam, ordered that Sambha be made to wear a wooden cap (the badge of a convict) and he with his fellow prisoners clad like buffoons be disgraced in various ways, taken round the camp mounted on donkeys to the beating of the drums and blaring of trumpets and produced in the durbar so that Muslims might be heartened and infidels terrorized by the sight’

శంభాజీ నెత్తిన నేరగాళ్లకు తొడిగే చెక్క టోపీని పెట్టి.. అతని తోటి ఖైదీలను బఫూన్లుగా తయారు చేసి నానా రకాలుగా అవమానించి.. గాడిదలపై ఎక్కించి డ్రమ్ములు వాయించుకుంటూ.. మొఘల్ శిబిరమంతటా ఊరేగించి ఆ తరువాత దర్బారుకు తీసుకొని రావాలని ఔరంగజేబ్ ఇచ్చిన ఆదేశమిది. ఈ చర్య వల్ల ముస్లింలు మహదానంద పడతారు. అదే సమయంలో అన్య మతస్థులు టెర్రరైజ్ అవుతారని ఔరంగజేబ్ ఉద్దేశం. ఇప్పుడు చెప్పండి. ఔరంగజేబ్ సూఫీయా.. శాంతి కాముకుడా?

వేషాలు వేసి, ఊరేగించడం ద్వారా శంభాజీని అతని అనుచరులను దారుణంగా అవమానించారు. సైనికుల మధ్యన తిప్పుకొంటూ వారిచేత ఇనుప చువ్వలతో దారుణంగా కొట్టించారు. ఒళ్లంతా రక్తం ఓడుతున్న పరిస్థితిలో దర్బారుకు తీసుకొచ్చిన బందీలను ఔరంగజేబు అడిగాడు.. తమను తాము ముస్లింలుగా చెప్పుకోవడానికి ఇష్టమేనా? అని. ఒక వేళ ముస్లింలుగా ఒప్పుకుంటే.. శంభాజీ, అతడి తోటి ఖైదీల పేర్లు మార్చి బతుకండి పొమ్మని వదిలేస్తానన్నాడు. ఇక్కడ ఇంతకంటే స్పష్టంగా చెప్పాల్సింది ఏమీ లేదు. కేవలం ఇస్లామైజేషన్ మాత్రమే ఔరంగజేబ్ లక్ష్యం తప్ప మరేమీ కనిపించడం లేదు. తనను మోసం చేశాడనో.. లేక రాజ్య విస్తరణ కాంక్షతోనో ఔరంగజేబ్ యుద్ధాలు, దాడులు చేయలేదనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? దీంతో శంభాజీ తీవ్రంగా కొదమసింహం లాగా గర్జించాడు. తన తండ్రి శివాజీకంటే తీవ్రంగా స్పందించాడు. అన్య మతాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని కుండ బద్దలు కొట్టాడు. అంతే కాదు.. ఇస్లాం మతం, దాన్ని అనుసరించేవారి బతుకులు ఎలా ఉంటాయో తనకు బాగా తెలుసని.. అనుభవమేనని కూడా చెప్పాడు. చివరకు నీ బిడ్డను నాకు లంచంగా ఇచ్చినా సరే వేరే మతానికి తల వంచేది లేదని తీవ్రంగా చెప్పాడు. ఔరంగజేబ్‌కు శంభాజీ మాటలు సహజంగానే రుచించలేదు. పైగా తీవ్రమైన ఆగ్రహానికి ఆయన మాటలు కారణమయ్యాయి. కండ్లు ఎర్రబడ్డాయి. కోపంతో ఊగిపోయిన ఔరంగజేబ్ అతడి కండ్లను ఎర్రగా కాలిన ఇనుప చువ్వలతో పొడవాలని ఆదేశించాడు. కండ్లను పొడిచేముందు మరోసారి అడిగాడు.. ముస్లింగా మారతావా అని.. శంభాజీ ససేమిరా అన్నాడు. ఈ ధిక్కారాన్ని ఔరంగజేబ్ అస్సలు సహించలేకపోయాడు. దీంతో శంభాజీ శరీరాన్ని చిత్రహింసలు పెట్టాడు.

‘that very night his eyes were blinded and next day the tongue of kavi kalash was cut out. The muhammadan theologians pronounced a decree that Shambhaji should be put to death on account of his having slain captured and dishonoured muslims and plundered the cities of Islam. They were put to a cruel and painful death on 11th March, their limbs being hacked off one by one and their flesh thrown to the dogs. Their severed heads were stuffed with straw and exhibited in all the chief cities of the Deccan to the accompaniment of drum, trumpet’

జాదూనాథ్ సర్కార్ రచించిన హిస్టరీ ఆఫ్ ఔరంగజేబ్ బృహద్గ్రంథ సముదాయంలోని నాలుగో వాల్యూమ్‌లో 480వ పేజీలో పేర్కొన్న మాటలివి.

ఎంత భయంకరమైన హత్య ఇది. ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తున్నది కదా.. శంభాజీపై డెత్ వారంట్ జారీ చేయించాడు. ఆ వారెంట్‌లో కూడా ఏమున్నదో చూడండి.. ‘ముస్లింలను గౌరవించకపోయినందుకు, ముస్లిం నగరాలను దోచుకున్నందుకు శంభాజీకి మరణ దండన విధిస్తున్నాం’ అని. ఇక్కడ ఇక వేరే చర్చకు ఆస్కారం ఏమున్నది. భయంకరమైన మత ఉన్మాదం బీభత్సంగా తలకెక్కిన ఒక నికృష్టుడు చేసిన మృత్యు నాట్యమిది. సొంత అన్న తలనే తెగనరికి పళ్లెంలో పెట్టి చుట్టూ అలంకరించి తండ్రికి బహుమానంగా పంపిన నీచుడు ఇతరుల పట్ల మరెంత భయంకరంగా వ్యవహరిస్తాడో వేరే చెప్పాలా?

శంభాజీ కనుగుడ్లు పొడిపించాడు. అతడి అనుచరుడు కవి కలశ్ నాలుక తెగ్గోశారు. శంభాజీ.. అతడి అనుచరుల కాళ్లూ, చేతులూ.. గోళ్లూ, వేళ్లూ నరికారు. శరీరంలోని మాంస ఖండాలను వేరు చేశారు. ఎముకలను వేరు చేశారు. ముద్దలు ముద్దలుగా.. ముక్కలు ముక్కలుగా చేసి కుక్కలకు ఆహారంగా పడేశారు. వీళ్ల మాంస ఖండాలను మొత్తం కుక్కలు మూడు వారాల పాటు తింటూనే ఉన్నాయి. తలలను నరికేసి.. ఆ తలల్లో గడ్డీ గాదం నింపి ఆ తలలను దక్కను లోని అన్ని ప్రధాన నగరాల్లో తిప్పారు. ఇస్లాంకు వ్యతిరేకంగా ఎవరు వ్యవహరించినా ఇంతకంటే భయంకరమైన గతి పడుతుందని తీవ్రంగా హెచ్చరించారు. 1689 మార్చి 11న ఈ ఘటన జరిగింది. తన ప్రియమైన కొడుకు యువరాజు అక్బర్‌కు ఆశ్రయం ఇచ్చి ఉదారంగా వ్యవహరించిన వాడు శంభాజీ అయితే.. అందుకు ప్రతిఫలం అన్నట్టుగా కోవర్ట్ ఆపరేషన్‌తో పక్కన ఉన్నవాడితోనే బల్లెంతో పొడిపించినట్టుగా దొంగచాటుగా పట్టుకొని మునుపెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో భయంకరమైన చావు చూపించిన సదరు అక్బర్ తండ్రి ఔరంగజేబ్.

ఇంత భయంకరంగా మృత్యు తాండవం జరుగుతుంటే.. సామాన్య జన సమాజంలో ఏ రకమైన పరిస్థితి ఉంటుంది.. బతకాలంటే ముస్లింగా మారక తప్పని పరిస్థితి. ఎవరైనా ఏం చేయగలరు. ఈ దేశంలో ఇస్లాం అనే మతం విస్తరించింది పూర్తిగా ఈ విధంగా మాత్రమే. ఇందులో ఏ ఒక్కరికీ ఎలాంటి అనుమానం ఉండాల్సిన అవసరమే లేదు. సింధ్‌పై మొదటి విజయవంతమైన దాడి చేసి రాజా దాహిర్ సేన్ తల నరికి తన ఖలీఫాకు పంపించిన మహమ్మద్ బిన్ ఖాసిం నుంచి ఔరంగజేబ్ దాకా అనుసరించిన విధానమే ఇది. ఇవాళ ఇస్లాంలోని శాంతి కాముకతను గుర్తించి.. భారతీయ ధర్మంలోని అరాచకాలను తట్టుకోలేక ఆ మతంలోకి మారారని చెప్పే ప్రవక్తలను, రాసే చరిత్రకారులను ఏం చేయాలి?

తమ ఛత్రపతిని అత్యంత దారుణంగా హతమార్చిన తరువాత కూడా మరాఠాలు తల వంచనే లేదు. ఇస్లాం ముందు మోకరిల్లనే లేదు. జాదూనాథ్ సర్కారు రాసిన ఔరంగజేబ్ చరిత్రలోనే ఒక్కో ఘట్టం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. శివాజీ, శంభాజీ దగ్గర బ్రహ్మాండంగా శిక్షణ పొందిన శాంతాజీ ఘోర్పడే, ధనాజీ జాదవ్ ఔరంగజేబ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేశారు. కేవలం కోటను స్వాధీనం చేసుకోవడంతోనే తాను విజయం సాధించినట్టవుతుందన్న ఔరంగజేబ్ భ్రమ పటాపంచలైంది. మరాఠాలు ఎప్పుడు ఎక్కడి నుంచి విరుచుకు పడతారో తెలియక క్షణక్షణం గండంగా గడపాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఔరంగజేబ్ చివరి రోజులన్నీ మరాఠాల భయంతోనే గడిచిపోయాయి. ఔరంగజేబ్ సైన్యానికి కూడా శాంతాజీ, ధనాజీ పేర్లు చెప్తేనే వణుకు పుట్టే పరిస్థితి. మరాఠాల చైతన్యం చుట్టుపక్కల హిందూ చైతన్యాన్ని మరింత రగుల్కొల్పింది. చివరకు ఔరంగజేబ్ వరుస పరాజయాలు ఎదుర్కోవలసి వచ్చింది. ఏదో ఒకటి రెండు రోజుల్లో మరాఠాలను జయించేసి ఇస్లాం పతాకాన్ని ఎగురేసి వెళ్దామనుకొన్న మొఘలు నియంత.. చిట్ట చివరకు 1707 మార్చి 3వ తేదీన అహ్మద్ నగర్లో చనిపోయాడు.

భారతదేశాన్ని పాలించిన ముస్లిం రాజుల్లో మిగతా రాజులందరూ ఒక ఎత్తైతే.. మొఘలులు ఒక ఎత్తు. అందులో ఔరంగజేబ్ అనేవాడు మరో ఎత్తు. మధ్యలో ఇతడి ముత్తాత అక్బర్ సొంత మతాన్ని స్థాపించాలని ట్రై చేశాడు కానీ.. ఔరంగజేబ్ మళ్లీ మొదటికి వచ్చి సర్హిండి ప్రతిపాదించిన షరియాను తిరిగి పూర్తి స్థాయిలో అమలులోకి తీసుకొని వచ్చాడు. ఈతడి హయాంలో ఇస్లామీకరణ అనేది అత్యంత భయంకరంగా ఈ దేశంలో విస్తరించింది. మరి చరిత్రకారులు ఏ ప్రాతిపదికన ఈతడిని మహానుభావుడని పొగిడారో.. అనేక తరాలకు తప్పుడు కథనాలను ఎందుకు వినిపించారో చెప్పి తీరాలి. సమాజాన్ని తప్పుదోవ పట్టించి చరిత్రను మసిపూసి మారేడుకాయ చేసి, ఒక మతం మీద అదే పనిగా కక్షతో ధ్వంస రచన చేసిన వాళ్లందరూ కచ్చితంగా శిక్షార్హులే.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here