దేశ విభజన విషవృక్షం-41

0
11

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]సూ[/dropcap]ఫీలను అత్యంత సాత్త్వికులుగా, సాధుపురుషులుగా, కవులుగా, గాయకులుగా అత్యద్భుతంగా చిత్రీకరించారు. సినిమాల్లో కవితలు పెట్టారు. పుస్తకాలు అచ్చేశారు. కూడళ్లకు పేర్లు పెట్టారు. వారికి కీర్తి కిరీటాలు తొడిగారు. వారి సమాధులున్న ప్రాంతాలను పుణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దారు. అత్యద్భుతంగా ప్రమోట్ చేశారు. చివరకు ముస్లిమేతరులు కూడా వాటిని పవిత్ర ప్రాంతాలుగా భావించి అక్కడికి వెళ్లి చాదర్లు కప్పేంత పరిస్థితులు కల్పించారు. ఇంత దారుణంగా చరిత్రను పూర్తిగా తిప్పి తిప్పి రాయడం మన దేశంలో మాత్రమే సాధ్యమైంది. చరిత్రను చరిత్రగా చెప్పకుండా ఇంత ఓపెన్‌గా బరితెగించి రాసి, దాన్ని మనచేత చదివించి.. దాన్ని నమ్మాలని చెప్తుంటే.. మనం పిచ్చివాళ్లలా అనుసరిస్తున్నాం. కనీసం స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ప్రశ్నించలేని అగత్యం ఏర్పడింది. ఈ సూఫీలు.. మామూలు మనుషులు కారు. శ్వేత వస్త్రాలు ధరించిన రాక్షసులు. ఎట్లాంటి వారంటే.. ఎక్కడైనా ఎవరైనా అధికారి పొరపాటున మత సామరస్యం పాటించాలని ప్రయత్నిస్తే చాలు.. ఢిల్లీ సుల్తానుల చేత ఫర్మానాలు జారీ చేయించి మరీ.. ఆ అధికారిని ఎలిమినేట్ చేసి మరీ తమ ఉన్మాదాన్ని అమలు చేయించేవారు. ఉత్తర భారతదేశంలో దాదాపు అన్ని చోట్లా సూఫీల దురాగతాలు కండ్లముందు కనిపిస్తాయి.

ఇప్పటి గుజరాత్.. 1351-1388 సంవత్సరాల మధ్య కాలం. ఢిల్లీలో ఫిరోజ్ షా తుగ్లక్ అనంతరం అతడి కొడుకు నసీరుద్దీన్ మహమ్మద్ షా తుగ్లక్ పరిపాలిస్తున్న కాలం అది. గుజరాత్ ప్రావిన్స్‌కు గవర్నర్‌గా ఫర్హాత్ ఉల్ ముల్క్ అనే అధికారిని ఫిరోజ్ షా నియమించాడు. గవర్నర్‌ను అప్పుడు సుబేదార్ అని పిలిచేవారు. ఈ సుబేదార్ అయిన ఫర్హాత్.. పాపం అనుకొన్నాడో.. పుణ్యం అనుకొన్నాడో కానీ.. హిందువుల పట్ల కాస్త సానుకూలంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఆలయాల విధ్వంసాన్నీ ఆపాడు. కొంతలో కొంత పరిస్థితి శాంతియుతంగా నెలకొల్పాలని ప్రయత్నించాడు. ఈ ప్రయత్నమే అతని పాలిట శాపంగా మారింది. అక్కడి సూఫీలు, ఉలేమాలకు ఇదెంత మాత్రం రుచించలేదు. ఫర్హాత్‌ను కలిసి చెప్పాలని ప్రయత్నించారు. కానీ అతడు వాళ్ల మాటలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. వాళ్లు అసహనంతో ఊగిపోయారు. నేరుగా ఫిరోజ్ షా దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేశారు. సుబేదార్ ఫర్హాత్ వల్ల గుజరాత్‌లో ఇస్లాం ప్రమాదకరంగా మారిందని, హిందువులు సుఖంగా, శాంతియుతంగా ఉండటం జరిగితే.. అది గుజరాత్ లోనే కాదు.. భారత్ లోనే ఇస్లాంకు ముప్పు వస్తుందని తెగ ఆందోళన వ్యక్తం చేశారు. ఫర్హాత్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఇంకేం ఫిరోజ్ షా తుగ్లక్ వెంటనే ప్రముఖ ఉలేమాలు, సూఫీలతో కూడిన ఉన్నతస్థాయి మండలిని సమావేశపరచి గుజరాత్‌లో పరిణామాలపై కీలకమైన సమావేశాన్ని నిర్వహించాడు. ఎవడైనా రాజైన వాడో.. ప్రధాని అయిన వాడో.. ప్రజల మధ్య సామరస్యం ఎలా ఉండాలో.. కార్యాచరణ కోసం సమావేశాలు నిర్వహిస్తాడు కానీ, నెలకొంటున్న సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి సమావేశం పెట్టడం ఇదిగో ముస్లిం రాజుల కాలంలో మాత్రమే జరిగింది. అది కూడా సూఫీలు, ఉలేమాల వల్ల. ఈ సమావేశంలో సుదీర్ఘమైన చర్చల అనంతరం సూఫీలు, ఉలేమాలు అనేక సిఫారసులు చేశారు. అందులో ముఖ్యమైనది ఫర్హాత్‌ను తొలగించడం. రెండవది ఇస్లాం ఆధిపత్యాన్ని తిరిగి స్థాపించడం.. వాళ్ల సిపారసులను ఫిరోజ్ షా వెంటనే అమలుచేశాడు. ఫర్హాత్ ఉద్యోగం పీకేశాడు. జఫర్ ఖాన్ అనే అతడిని కొత్త సుబేదార్‌గా గుజరాత్ పంపించాడు. ఇతడికి ముజఫర్ ఖాన్ అనే బిరుదు ఇచ్చారు. ముజఫర్ ఖాన్ గుజరాత్ కు వెళ్లీ వెళ్లంగానే శరవేగంగా విధ్వంస రచన మొదలుపెట్టాడు. వచ్చీ రాగానే హిందూ రాజులపై విశృంఖలంగా దాడులు చేయడం మొదలుపెట్టారు. ఇద్దరు రాజులు మినహా మిగతా వారినందరినీ మట్టుపెట్టి.. స్వాధీనం చేసుకొన్నాడు. జునాగడ్ రాజు రావ్, రాజ్ పిప్లా రాజు మాత్రం స్వతంత్రంగా తమ అధికారాన్ని కాపాడుకోగలిగారు. ఆ తరువాత 1395లో ముజఫర్ ఖాన్ సోమ్‌నాథ్ దేవాలయంపై విరుచుకుపడ్డాడు. ఆలయాన్ని ధ్వంసం చేశాడు. అక్కడ జుమ్మా మసీదును నిర్మించాడు. అక్కడ పలువురు న్యాయాధికారులను అక్కడ నియమించాడు. సోమ్‌నాథ్‌ను ఇస్లామీకరించాడు. అక్కడ ఠానాను కూడా ఏర్పాటుచేశాడు. అక్కడి నుంచి క్రమంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్ లకు విస్తరించుకొంటూ వెళ్లాడు. మధ్యప్రదేశ్ లోని మందు లేదా మాండవ్ గడ్ పై దాడి చేశాడు. ఆ తరువాత రాజ్‌పుత్‌ల వైపు వెళ్లాడు. అజ్మీర్‌లో మొయినుద్దీన్ చిస్తీ దర్గాకు తీర్థయాత్రగా వెళ్లి మొక్కులు చెల్లించుకొని వచ్చాడు. సంభార్, ధండ్వానా, ఝలవాడా, దేల్వాడా తదితర ప్రాంతాలపై దాడి చేశాడు. ఒకపక్క ముజఫర్ ఖాన్ దాడులు చేస్తుంటే సూఫీలు, ఉలేమాలు.. మత మార్పిళ్లను యథేచ్ఛగా కొనసాగించారు.

బెంగాల్‌లో సూఫీలు ఏం చేశారో కూడా తెలుసుకోవాల్సి ఉన్నది.

గుజరాత్ కంటే కాస్త ముందు కాలమిది. 1205వ సంవత్సరం. భక్తియార్ ఖిల్జీ చేతిలో రాజా లక్ష్మణ్ సేన్ ఓడిపోయాడు. ఇక్కడ కూడా ఒక సూఫీ ఉన్నాడు. అతడి పేరు షేక్ జలాలుద్దీన్ తబ్రీజీ.. లక్ష్మణ్ సేన్ నుంచి బెంగాల్ లాక్కోగానే.. తబ్రీజీ ఇక్కడ రెచ్చిపోయాడు. అందరు సూఫీల మాదిరిగానే మతమార్పిళ్లు.. ఇతర ఆలయాల విధ్వంసం యథాతథంగా కొనసాగింది. ఈ తబ్రీజీ మొదట ఢిల్లీకి వలస వచ్చాడు. అక్కడ అల్త్‌మష్ కాలంలో అతడికి మంచి పేరు ప్రతిష్ఠలు లభించాయి. కాకపోతే.. ఒక సామాన్య మహిళతో ఇతడు లైంగిక సంబంధాలు నెరపడంతో అతడి ఇమేజీపై మసకబారింది. దీంతో ఢిల్లీలో జీవించడం కష్టమైంది. ఇంకేం.. అక్కడినుంచి బెంగాల్‌కు వలస వచ్చాడు. భక్తియార్ ఖిల్జీ సైన్యంతో పాటు బెంగాల్‌కు చేరిన అతడికి అసలు అడ్డూ ఆపూ లేకుండా పోయింది. మన చరిత్రకారులు తబ్రీజీ గురించి రాస్తూ.. ‘ఆయన ఎంతోమంది స్థానికులను ఇస్లాంలోకి ఆహ్వానించాడు’ అని చాలా అందంగా రాసుకొచ్చారు. ముస్లిమేతరులను చిత్రవధ చేసి మతమార్పిళ్లు చేయించడాన్ని కూడా ఇంత అందంగా రాయవచ్చని మన చరిత్రకారుల నుంచే తెలుసుకోవచ్చు. బెంగాల్‌లో ఇతడికి తోడుగా షేక్ అత్తార్ అబ్బాస్ రిజ్వీ అనే మరో సూఫీ చేరాడు. ఈ ఇద్దరూ కలిసి బెంగాల్‌లో హిందూ దేవాలయాలే కాదు.. బౌద్ధ ఆరామాలను కూడా ధ్వంసం చేశారు. బౌద్ధ సన్యాసులను వీధుల్లో నిలబెట్టి మెడ మీద కత్తి పెట్టి మరీ మత మార్పిళ్లకు పాల్పడ్డారు. కాషాయం తొలగించి శ్వేత వస్త్ర ధారణలు యథేచ్ఛగా సాగిపోయాయి.

మరో సూఫీ సాధువు ఉన్నాడు. (వీళ్లను సాధువు అని ఎలా అన్నారో అర్థమే కాదు.) ఈ సూఫీ పేరు షేక్ షా జలాల్.. ఇతడు బెంగాల్ లోని సిల్హెట్ ప్రాంతంలో ఉండేవాడు. ఈ ప్రాంతాన్ని రాజా గౌడ్ గోవింద్ పరిపాలించాడు. ఢిల్లీ సుల్తాన్ షంషుద్దీన్ ఫిరోజ్ షా.. తన మేనల్లుడు సికందర్ ఖాన్ ఘాజీ నేతృత్వంలో రెండు సార్లు దాడులు చేయించాడు. ఈ రెండు దాడుల్లో కూడా సికిందర్ ఖాన్ ఘాజీ.. రాజా గోవింద్ చేతిలో ఓటమిపాలయ్యాడు. మూడోసారి ఈ ప్రాంతంపై నసీరుద్దీన్ అనే సైన్యాధికారి నేతృత్వంలో మరోసారి దాడి చేయించాడు. ఈసారి సూఫీ సాధువు నిజాముద్దీన్ ఔల్యా వ్యూహరచన చేశాడు. తన శిష్యుడు షా జలాల్ ను 700 మంది అనుచరులను తోడునిచ్చి నసీరుద్దీన్ సైన్యం వెంట పంపించాడు. నసీరుద్దీన్ ఒక పక్క యుద్ధం చేస్తుంటే.. షా జలాల్ అనుచరవర్గం ఇస్లామీ జిహాద్‌కు తెరతీశారు. మూడోసారి యుద్ధంలో రాజా గౌడ్ గోవింద్ ఓడిపోయాడు. సూఫీలు రెచ్చిపోయారు. రక్తం ఏరులై పారింది. బెంగాల్ అంతటా మృత్యువు విలయతాండవం చేసింది. మహా మారణహోమం విచ్చల విడిగా సాగింది. గంగానదిలో శవాలు తేలాయి. బెంగాల్‌లో ప్రవహిస్తున్న గంగ లోతుల్లోకి వెళ్లి చూస్తే లక్షల కొద్దీ అస్థికలు బయటపడతాయని స్థానికులు చెప్తారు. అసంఖ్యాకంగా హిందువులు, బౌద్ధులు ప్రచండ ఇస్లామీకరణలో కొట్టుకుపోయారు. వాళ్ల అస్తిత్వమే లేకుండా పోయింది. ఈ దారుణాలకు అంతే లేకుండా పోయింది. ఇవాళ మనం ఏదైతే ఈస్ట్ బెంగాల్ అనుకొంటున్నామో.. ఏ ఈస్ట్ బెంగాల్.. బంగ్లాదేశ్‌గా మారిపోయిందో.. అక్కడ భారత అస్తిత్వమే లేకుండా పోయింది. దీన్ని చరిత్రకారులు ఏమని నిర్వచిస్తారు. ఎలా నిర్వచిస్తారు. సూఫీలు శాంతి కాముకులని ఏం ముఖంతో చెప్తారు?

1414లో హిందూ రాజు గణేశ్ తిరుగుబాటు చేసి తన రాజ్యాన్ని తాను తిరిగి సంపాదించుకొన్నాడు. ఈ పరిణామం సూఫీలు, ఉలేమాలకు ఎంతమాత్రం నచ్చలేదు. తీవ్రంగా ఆగ్రహానికి, అసహనానికి గురయ్యారు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయవద్దని నిర్ణయించుకొన్నారు. బెంగాల్ పైన దాడి చేయాలని ఇబ్రహిం షా షర్ఖిని పనిగట్టుకొని ఆహ్వానించారు. అతడు పెద్ద సైన్యాన్ని వెంటబెట్టుకొని వచ్చి బెంగాల్‌పై విరుచుకుపడ్డాడు. సూఫీ అనుచరగణం అతడి వెంట నడిచింది. రాజా గణేశ్‌ను ఓడించాడు. అతడికి పన్నెండేండ్ల కుమారుడు ఉన్నాడు. ఇబ్రహిం షాను బెంగాల్ పై దాడికి ఆహ్వానించిన సూఫీ నూర్ ఖుత్ బి ఆలమ్.. రాజా గణేశ్ కొడుకును ఇస్లామీగా మార్చేశాడు. అతడికి సుల్తాన్ జలాలుద్దీన్ మహమ్మద్ అని కొత్త పేరు పెట్టారు. కొంతకాలం అతడిని ఎత్తుకొనిపోయారు. బ్రెయిన్ వాష్ చేశారు. తిరిగి వచ్చిన జలాలుద్దీన్ సునామీలా విరుచుకుపడ్డాడు. ఈ కన్వర్షన్ గురించి మరో కథనం కూడా ప్రచారంలో ఉన్నది. చరిత్రకారులైన గోరోన్, గోయెంకా కథనం ప్రకారం.. 1414లో సుల్తాన్ బయాజిద్ చనిపోయిన తరువాత రాజా గణేశ్ తిరుగుబాటు చేసి అధికారం సంపాదించాడు. దీంతో సూఫీ సాధువు నూర్ ఖుత్ బీ ఆలమ్ గణేశ్‌ను చంపుతానని బెదిరించాడు. దీంతో రాజా గణేశ్ అతడితో రాయబారం నెరపి.. తన కొడుకు జాదూను ఇస్లాంలోకి మార్చడానికి అంగీకరించే షరతుపై సంధి కుదుర్చుకొన్నాడు. ఆ తరువాత ఖుత్బుద్దీన్ ఆలమ్ చనిపోయిన తరువాత తన కొడుకును ధనుజమర్దన దేవ గా పేరు మార్చి తిరిగి హిందువుగా మార్చాడు. రాజా గణేశ్ చనిపోయిన తరువాత సదరు కొడుకు తిరిగి రెండోసారి ఇస్లాం స్వీకరించాడు. ఇదీ గోయెంకా, గోరన్‌లు చెప్పిన చరిత్ర. ఈ రెండు కథల్లో ప్రధానమైంది సుల్తాన్ జలాలుద్దీన్ మహమ్మద్‌గా రాజా గణేశ్ కొడుకు మతం మారడం. మతం మారిన తరువాత ఇతడు తీవ్రస్థాయిలో హిందువులపై విరుచుకుపడ్డాడు. డాక్టర్ జేమ్స్ వైస్ ఈ సుల్తాన్ గురించి వివరంగా రాశాడు. సుల్తాన్ జలాలుద్దీన్ హిందువులందరికీ ఒక్కటే ఆప్షన్ ఇచ్చాడు. అయితే ఖురాన్‌ను అంగీకరించాలి.. లేదా ఖూనీ చేయబడటానికి సిద్ధపడాలి. బెంగాల్‌లో అతి తీవ్రమైన పరిస్థితులు. విదేశీ ముస్లిం రాజుల కంటే కూడా ఒక మతం మార్చుకొన్న హిందువు ఎంత కరడుగట్టిన ఇస్లామిస్టుగా మారాడో రాజా గణేశ్ కొడుకు చర్యలు భారతదేశ చరిత్రలో ఎప్పటికీ చెరగని గుర్తులుగా మిగిలిపోతాయి. ప్రస్తుతం బెంగాల్ లో ఉన్న సునమ్ గని (ఆ కాలంలో మౌజామాబాద్ అని పిలిచారు) దీంతో పాటు ఆగ్నేయ బెంగాల్ (ఇప్పటి బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్), ఫతాబాద్ (ఇప్పటి ఫరీద్ పూర్), దక్షిణ బెంగాల్ లోని ఫిరోజాబాద్ పాండువా ప్రాంతాలు అన్నీ కూడా నూటికి నూరు శాతం ఇస్లామీకరణ జరిగాయి. ఈ నగరాలు అద్భుతమైన ఇస్లాం నగరాలుగా విలసిల్లాయని చైనా యాత్రికుడు మింగ్ షి రాశాడు. ఇతడు 1421, 1431 లో రెండు సార్లు ఈ ప్రాంతాలను సందర్శించాడు. పాండువా నుంచి గౌర్‌కు తన రాజధానిని మార్చిన తరువాత పెద్ద ఎత్తున నిర్మాణాలు సాగించాడు. భారీ స్థాయిలో మసీదుల నిర్మాణం, మరమ్మతులు చేయించాడు. రోడ్డు పక్కన విశ్రాంతి గృహాలు నిర్మించాడు. ఇక్కడ ముస్లింలకు మొట్టమొదటి ప్రాధాన్యం ఇవ్వాలని తీర్మానించాడు. ఒకవేళ హిందువులు ముందుగా వచ్చినప్పటికీ.. ముస్లింలు వెస్తే వెంటనే ఖాళీ చేసి ఇవ్వాలి.. ఇవన్నీ అతడు ఏర్పాటు చేసిన నియమాలు. రోజు రోజుకూ దారుణాలు పెరిగిపోతుండటంతో వేలాది హిందువులు అస్సాంలోని కామరూప్ అడవుల్లోకి పారిపోయారు. ఇల్లూ వాకిలి లేకుండా అడవుల్లోనే తలదాచుకొన్నారు. 1414 నుంచి 31 మధ్య కాలంలో అంటే దాదాపు 17 సంవత్సరాల కాలంలో బెంగాల్ లోకి చేరిన ముస్లింల సంఖ్య ఆ తరువాత 300 ఏండ్లలో చేరిన ముస్లింలతో సమానం. జలాలుద్దీన్ హయాంలో సూఫీలు, ఉలేమాలు, షేక్‌ల హవా బీభత్సంగా కొనసాగింది.

జలాలుద్దీన్ తనకు తానుగా.. తానే నిజమైన ముస్లింగా ప్రమోట్ చేసుకొన్నాడు. ఇస్లాం ప్రాచీనమైన సంప్రదాయాల్లో ఒకటైన హనాఫీ న్యాయ సిద్ధాంతాలను తన రాజ్యంలో అమలుచేశాడు. సున్నీ లకు చెందిన నాలుగు న్యాయ విధానాల్లో హనాఫీ కూడా ఒకటి. హనాఫీ కోడ్‌లో భాగంగానే ఫత్వా ఆలంగిరి వచ్చింది. తరువాతి కాలంలో ఔరంగజేబ్ ఈ ఇస్లామిక్ లా ను అమలుచేశాడు. హనాఫీ కోడ్ నుంచే ఖానూన్ (Qanun) అనే మరో చట్టం వచ్చింది. ఇది ఫత్వా ఆలంగిరికి వ్యతిరేకమైందేమీ కాదు. భిన్నమైనదీ కాదు. ఒట్టమాన్ సామ్రాజ్యం హనాఫీ నుంచి తన సొంత చట్టంగా ఖానూన్ ను ఏర్పాటు చేసుకొన్నది. సులేమాన్ మ్యాగ్నిఫిసెంట్ దీన్ని తొలిసారి అమలులోకి తీసుకొని వచ్చాడు. అచేహ్ సుల్తానేట్ పై కూడా ప్రభావం చూపింది. అప్పటికే అక్కడ రాజ్మ్ చట్టం (రాళ్లతో కొట్టి చంపడం) అమలులో ఉన్నది. ఆధునిక కాలంలో ఇండోనేషియా, మలేషియాలు ఈ ఖానూన్ చట్టానికి గుర్తింపునిచ్చాయి. ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు ఇదే ఖానూన్ చట్టానికి తమ సొంత సవరణలు చేసి ఒక కొత్త వేరియంట్‌ను సృష్టించి అమలుచేస్తున్నారు. షరియా లా కూడా ఖానూన్ ఆధారితంగానే రూపొందిందని అంటారు. ఈ హనాఫీయిజాన్ని ముస్లింగా మారిన హిందువు జలాలుద్దీన్ 15వ శతాబ్దంలోనే అమలు చేశాడు. దురదృష్టమేమిటంటే.. రాళ్లతో కొట్టే సంప్రదాయానికి ప్రతీక అయిన ఖానూన్ ను ఇవాళ్టికీ మనం వినియోగించడం. చట్టం అంటే కానూన్ అని పిలుచుకొంటున్నామంటే.. ఇంతకంటే మన దౌర్భాగ్యమేముంటుంది చెప్పండి? ఈ జలాలుద్దీన్ మక్కా, మదీనాలలో ఇస్లామిక్ సంస్థలను స్థాపించాడు. ఇవి ఇవాళ్టికీ బెంగాలియా మదారిస్‌లుగా పిలువబడుతున్నాయి. మక్కా షరీఫ్ బరాకత్బీన్ హసన్‌కు లెక్కలేనన్ని బహుమతులు సమర్పించుకొని అతడితో సత్సంబంధాలు నెరిపాడు. 1427లో జలాలుద్దీన్ తనకు తానుగా అల్ సుల్తాన్ ఆజమ్ అల్ ముజామిన్ ఖలీఫా అల్లా అలీ మకూనిన్ జలాలుద్దునియా వా అల్ దిన్ (ఈ ప్రపంచాన్ని ఏలిన గొప్ప సుల్తానులలో గొప్పవాడు.. విశ్వంలో అల్లా పంపిన ఖలీఫా) అని ఒక శాసనంలో రాసుకొన్నాడు. ఇతడి తరువాత అతడి కొడుకు షంషుద్దీన్ అహ్మద్ షా తండ్రి బాటలోనే ముందుకు నడిచాడు. బెంగాల్‌లో భారతీయ సర్వ నాశనానికి, బెంగాల్ శాశ్వత విభజనకు బలమైన బీజం పడింది జలాలుద్దీన్ సమయంలోనే అనడం నిస్సందేహం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here