దేశ విభజన విషవృక్షం-44

0
11

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]1[/dropcap]857.. ఇది బ్రిటీష్ వారి కాలం. 1857 ఈ సంవత్సరం పేరు చెప్పగానే.. మ్యూటినీ అని మనకు చెప్పుకొంటూ వచ్చారు. అంటే సిపాయిల తిరుగుబాటు అని పాఠాల్లో కూడా చదువుకున్నాం. వీరుడైన మంగళ్ పాండే.. సైనికులు గోమాంసం పూసిన తూటాలను నోటిలో పెట్టుకోవాలన్న ఆదేశాలను తిరస్కరించడంతో సిపాయిల తిరుగుబాటు జరిగిందని.. బ్రిటిష్ వాళ్లు సక్సెస్‌ఫుల్‌గా ఆ తిరుగుబాటును అణచి వేశారని మనకు తెలిసిన చరిత్ర. నిజంగా అంతేనా అంటే.. సోకాల్డ్ మార్స్కిస్టు చరిత్రకారులు రాసింది ఇదే మరి. 1857 తొలి స్వాతంత్ర్య సంగ్రామం బ్రిటిష్ వాళ్లపై జరిగింది. దాదాపు సంవత్సరంపాటు బ్రిటిష్ వాళ్లపై జరిగిన మహా సంగ్రామం ఇది. ఈస్ట్ ఇండియా కంపెనీకి భారత్‌లో ఎదురైన మొదటి తిరుగుబాటు. మొదట బ్రిటిష్ సైన్యంలో మొదలైనప్పటికీ.. అది క్రమంగా ప్రజల్లోకి విస్తరించింది. అప్పటివరకు కేవలం వ్యాపార సంస్థగా మాత్రమే ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ.. క్రమంగా తన పరిపాలనా విధానాలను అమలు చేయడం మొదలు పెట్టడం ఈ సంగ్రామానికి ప్రధాన కారణం. ఈ విషయాన్ని గురించి చెప్పకుండా.. కేవలం సిపాయిల తిరుగుబాటుకే 1857ను పరిమితం చేసే ప్రయత్నం జరిగింది. కొందరు సిపాయిల పితూరీ అన్నారు. మరికొందరు దేశభక్తి లోపించిన కొందరు సైనికుల పోరాటం అన్నారు. బ్రిటిష్ చరిత్రకారులు.. టీఆర్ హోల్నెస్ లాంటివారయితే.. ఇంకాస్త ముందుకు పోయి.. నాగరికతకు.. అనాగరికతకు మధ్య జరిగిన ఘర్షణగా దీన్ని అభివర్ణించాడు. ఆ మాటలను ఇలా అన్నాడు అని మనం ఇంకా చరిత్ర పుస్తకాల్లో రాసుకొంటున్నామే తప్ప.. వాటిని పూర్తిగా తొలగించి వాస్తవంగా ఏం జరిగిందో మాత్రం చెప్పుకోవడానికి నామోషీ ఫీలవుతున్నాం. ఇంత కంటే మనకు దౌర్భాగ్యం ఏమున్నది.

ఈస్ట్ ఇండియా కంపెనీ తరఫున ఈ దేశానికి పీడలా దాపురించిన లార్డ్ డల్‌హౌసీ డాక్ట్రిన్ ఆఫ్ లాప్స్ (రాజ్యాన్ని సంక్రమింపజేసుకోవడం) ఈ మహా సంగ్రామానికి మూల కారణమని చెప్పవచ్చు. ఝాన్సీని పాలించిన రాణీ లక్ష్మీబాయి తన దత్త పుత్రుడిని అధికారం కట్టబెట్టడాన్ని బ్రిటిష్ వాళ్లు వ్యతిరేకించడంతోనే వాళ్ల విధానాలు మనపై జబర్దస్తీగా ఇంపోజ్ కావడం మొదలైంది. సతారా, నాగ్‌పూర్, ఝాన్సీ, జైత్‌పూర్, సంబల్‌పూర్, ఉదయ్‌పూర్, అవధ్ తదితర ప్రాంతాలన్నీ కూడా సలసల కాగిపోయాయి. సహజ వారసుడు కాకుండా దత్తత తీసుకోవడం ద్వారా వారసత్వాన్ని కట్టబెట్టడాన్ని తిరస్కరించడం ద్వారా ఆ రాజ్యానికి రాజు లేకుండా చేసి.. దాన్ని కంపెనీ చేతుల్లోకి తీసుకోవడం డల్హౌసీ చేసిన పని. ఈ యుద్ధం మహా మారణహోమాన్ని సృష్టించింది. వీటి విషయం చరిత్ర పుటల్లో నామమాత్రంగా కనిపిస్తుంది. మనకు ప్రధానంగా కనిపించేది మాత్రం సిపాయిల తిరుగుబాటు గానే. కానీ దీని వెనుక మరి కొన్ని కీలకమైన కారణాలను మన చరిత్రకారులు కన్వీనియంట్‌గా మర్చిపోయారు. వీటిలో ముఖ్యమైనవి తప్పనిసరిగా చర్చించుకోదగిన అంశాలు ఉన్నాయి.

వీటిలో మొదటిది.. అప్పుడే స్థిరపడిన బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రజలను క్రైస్తవంలోకి మతమార్పిడి చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. 1835లోనే మెకాలే తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాడు. 1850 నుంచి పెద్ద ఎత్తున పాశ్చాత్య నాగరికతను భారత దేశంలోకి పంపింగ్ చేయడం మొదలు పెట్టారు. 1850లో డల్‌హౌసీ వారసత్వ చట్టాన్ని తీసుకొని వచ్చాడు. క్రైస్తవంలోకి మారిన హిందువు తన పూర్వీకుల ఆస్తులను వారసత్వంగా పొందేలా చట్టాన్ని తెచ్చాడు. సతీ సహగమనాన్ని నిషేధించాడు. మెకాలే నివేదికను అనుసరించి పాశ్చాత్య విద్యా పద్ధతులను పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టాడు. రైల్వేలు, టెలిగ్రాఫ్ లను ప్రవేశ పెట్టడం ద్వారా.. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో భారతదేశంలోని సంపద తరలింపు పెద్ద ఎత్తున కొనసాగింది. ఆధునికవాదులు రైల్వే వ్యవస్థను అభివృద్ధికి సూచికగా చూశారు కానీ. దాని వెనుక జరిగిన దోపిడీ గురించి ఎవరూ కూడా గ్రహించలేదు. బ్రిటీషర్లు భారత దేశ సైనిక సహాయంతో రాజ్యం స్థాపించి.. బారతదేశ సొమ్ముతోనే దేశాన్ని పరిపాలించారని 1853లో కార్ల్ మార్క్స్ అన్నాడు.  దీనికి ఉదాహరణ.. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, జమీందారులు, భూమిపైన భారీ ఎత్తున.. భరించలేని స్థాయిలో పన్నుల విధింపు జరిగింది. అనేక గ్రామాల్లో సమాజాలకు సమాజాలే.. ఈ పన్నులను చెల్లించలేక.. తరతరాలుగా అనుభవిస్తున్న భూములను అమానవీయంగా కోల్పోవాల్సి వచ్చింది. బ్రిటీష్ సైన్యంలో పెద్ద సంఖ్యలో సిపాయీలు గ్రామాల నుంచి వచ్చినవారు కావడంతో గ్రామాల్లో తమ కుటుంబాల పరిస్థితి వారిని తీవ్రంగా ప్రభావితం చేసింది. మన దౌర్భాగ్యం ఏమిటంటే.. పెనం నుంచి పొయ్యిలో పడ్డాం. అప్పటిదాకా ముస్లింల దాష్టీకంలో వేగిపోయాం.. ఆ తరువాత క్రైస్తవ అరాచకం పెల్లుబికింది. బ్రిటన్‌లో వచ్చిన పారిశ్రామిక విప్లవం.. భారతదేశంపై అతి తీవ్రంగా ప్రతికూల ప్రభావం చూపింది. ముఖ్యంగా భారతీయ వస్త్ర పరిశ్రమ దారుణంగా నాశనమైంది. మన దేశంలో లభించే మేలురకం పత్తి.. బ్రిటిష్ వాడు వేసుకొన్న రైళ్ల ద్వారా ఓడ రేవులకు చేరి.. అక్కడి నుంచి బ్రిటన్‌కు చేరి.. అక్కడ వస్త్రాలు తయారై.. అవే తిరిగి మన దేశానికి దిగుమతి అయి.. మన వాళ్లే కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. చేతి వృత్తులు ఇవాళ మనవాళ్లు ప్రచారం చేస్తున్నట్టు.. కులాల కుంపట్ల వల్ల నాశనం కాలేదు. చక్కగా సాగుతున్న వస్తు వినిమయ పద్ధతి సర్వనాశనమైంది. చేతి వృత్తులు నాశనమయ్యాయంటే దానికి కారణం బ్రిటీష్ వాడే. ఇవన్నీ ప్రజల్లో తీవ్రమైన ఆగ్రహానికి, ఆందోళనకు కారణమయ్యాయి. దీనికి తోడు లార్డ్ కన్నింగ్ 1856లో జనరల్ సర్వీసెస్ ఎన్లిస్ట్‌మెంట్ యాక్ట్‌ను తీసుకొని వచ్చాడు. దీని ప్రకారం.. భారత్‌లో పనిచేసే సైనికులు అంతా.. సముద్రం అవతల కూడా అవసరమైన మేర ప్రపంచంలో ఎక్కడైనా బ్రిటిష్ వారి కోసం పోరాడాలి. ఇదే చట్టం.. ప్రపంచ యుద్ధం సమయంలో మనవాళ్లు బ్రిటిష్ వాళ్ల కోసం పోయి పోరాడేలా చేసింది. పైగా సైన్యంలో ఒకే ర్యాంకులో ఉన్న బ్రిటిష్ వాడికి ఇచ్చే జీతం కంటే భారతీయుడికి ఇచ్చే జీతం చాలా తక్కువ కావడం మరో దారుణమైన అంశం. దీంతో బ్రిటిష్ సైన్యంలో 87 శాతం మంది సైనికులు తిరగబడ్డారు. 1857 మే నెలలో తూటాలకు గో మాంసాన్ని గ్రీసుగా రాసి.. వాడాలని ఆదేశించడంతో సైనికులు అందుకు నిరాకరించారు. మార్చి నెలలో మంగల్ పాండే (బారక్ పోర్).. మొట్టమొదటగా తిరగబడ్డాడు. ఏప్రిల్ 8న ఆయన్ను ఉరితీశారు. ఆ తరువాత మరో 85 మందికి పదేళ్ల జైలు శిక్ష విధించారు. ఇది నాందిగా రాజస్థాన్ కాన్పూర్, లక్నో, బరేలీ, ఝాన్సీ, గ్వాలియర్, ఆరా వంటి ప్రాంతాలు పోరాటాలు మొదలయ్యాయి. లక్నోలో బేగమ్ హజ్రత్ మహల్, కాన్పూర్‌లో నానా సాహెబ్ పేష్వా (బాజీరావు -2 దత్త కుమారుడు)  ఆయన కమాండర్ తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి వంటి వారు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. కాకపోతే.. దక్షిణ భారత ప్రాంతాల నుంచి వచ్చిన స్పందన తక్కువ. ముఖ్యంగా హైదరాబాద్, మైసూర్, కాశ్మీర్ సంస్థానాలు పూర్తిగా బ్రిటీష్ వారికి సహకరించాయి. యుద్ధంలో తిరుగుబాటుదారులకు ఏమాత్రం సహకరించలేదు. హైదరాబాద్, కాశ్మీర్ సంస్థానాలు ముస్లింల చేతుల్లో ఉన్నాయి. మైసూర్.. అంతకు ముందు కొద్ది సంవత్సరాలకు ముందే మూడు ముక్కలైంది. టిప్పు చనిపోయిన తరువాత ట్రావెన్‌కోర్, నిజాం పంచుకోగా మిగిలిన కొద్ది ముక్కను వడయార్ కుటుంబీకులు పాలించుకోవడం మొదలుపెట్టారు. వారు కూడా పూర్తిగా బ్రిటీష్ వారి స్వాధీనంలో ఉండటం వల్ల సంగ్రామంలో పాల్గొనడం సాధ్య పడలేదు. 1858 జూన్ నాటికి కానీ ఈ సంగ్రామాన్ని అణచివేయడం బ్రిటిష్ వాళ్లకు సాధ్యపడలేదు.

ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం మరో ఆరు మాసాలు దిగ్విజయంగా కొనసాగి ఉంటే.. బ్రిటిష్ వాడు అప్పుడే పారిపోయేవాడు. భారత పునరుత్థానం జరిగేది. కానీ ముందుగానే చెప్పుకున్నట్టు.. హైదరాబాద్, కాశ్మీర్ వంటి ముస్లిం సంస్థానాలు పోరాట యోధులతో కలిసి రాలేదు. యుద్ధం విఫలం కావడం వల్లనే ఈస్ట్ ఇండియా కంపెనీ తన పట్టును పూర్తిగా భారత్‌పై సంపాదించింది. మొఘల్ చివరి రాజు బహదూర్ షా జఫర్ కవిత్వం రాసుకుంటూ కూచున్నాడు. విక్టోరియా రాణి తన రాజ్యాధికారాన్ని భారత్ పై ప్రకటించింది. తొలి వైస్రాయ్‌గా వచ్చిన లార్డ్ కన్నింగ్.. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో తనతో కలిసి వచ్చిన వారందరినీ.. తుఫానులో నిలబడ్డ బ్రేక్ వాటర్స్‌గా అభివర్ణించాడు. ఆ తరువాత పన్నుల రూపంలో.. మరో రూపంలో హిందువుల దగ్గర నుంచి లాక్కున్న భూములన్నింటినీ ముస్లింలకు గిఫ్ట్‌గా ఇవ్వటం మొదలుపెట్టారు. నిజానికి ఈ మతపరమైన భూ పంపిణీ మొఘలుల కాలం నుంచే విస్తారమైంది. భూమిపై హక్కులు లేకుండా చేయగలిగితే.. ప్రజలపై అన్ని విధాల పట్టు సాధించవచ్చన ఆలోచనను బ్రిటీషర్లు మొఘలుల నుంచి వారసత్వంగా అందిపుచ్చుకున్నారు. అంతకుమించి మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకోబోమని హామీ ఇచ్చారు. ఇవాళ భారత రాజ్యాంగంలో 25 నుంచి 30వ అధికరణం దాకా ఉన్న మతపరమైన స్వేచ్ఛ అన్న అంశాలు.. ఈ హామీకి విస్తరణ రూపాలే. ఎక్కడైనా మసీదుల నిర్మాణం చేసుకోవచ్చు. మతపరమైన సంస్థలు స్థాపించుకోవచ్చు. భూములు సంపాదించుకోవచ్చు. ఆస్తులు కూడబెట్టుకోవచ్చు. తద్వారా ఎలాంటి పన్నులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు.. ఇలా మరింత స్వేచ్ఛను ముస్లింలకు బ్రిటీషర్లు ప్రసాదించారు. దీంతో క్రమంగా ఒక పక్క మొఘలుల పాలన అంతం కావడంతో ముస్లింలు తాజా పాలక వర్గం వైపు మొగ్గు చూపడం మొదలుపెట్టారు.

ఇక్కడి నుంచి ముస్లిం జాతి విస్తరణ వాదం మొదలైంది. ఈ విస్తరణ బ్రిటీష్ వారి పూర్తి అండదండలతో.. వారిచ్చే డబ్బులతో విశృంఖలంగా కొనసాగింది. చివరకు దేశ విభజనకు దారి తీసింది. భారతదేశంలో ఈ ఆదునిక విభజనకు బీజం వేసిన వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి ఒకరున్నారు. అతడు గొప్పవాడు అయినా కాకపోయినా మహా గొప్పవాడిని చేశారు. అతని పేరు సయ్యద్ అహ్మద్ ఖాన్. ఇతను 1947 దేశ విభజనకు మూల కారకుడు ఇతనే. ఇస్లాం సంప్రదాయికతను, ఖురాన్‌ను పూర్తిగా ఏకపక్షంగా అనుసరించాలని ఉద్బోధించినవాడు. ఇవాళ్టికీ పాకిస్తాన్‌లో ఇతనికి ఉన్న పలుకుబడి అంతా ఇంతా కాదు. జిన్నా తరువాత అంతటి స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించినవాడు. పాకిస్తాన్ లోని అనేక విశ్వవిద్యాలయాలకు, అనేక సంస్థలకు ఇతని పేరే పెట్టుకొన్నారు.

ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం సందర్భంగా సయ్యద్ అహ్మద్ ఖాన్ బ్రిటీష్ వారికి విధేయుడిగా ఉండటం అతనికి, ఆ తరువాత ముస్లిం ఛాందసవాదులకు బాగా కలిసివచ్చింది. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో ఇతను బ్రిటీష్ సైనికులకు, అధికారులకు అందించిన సహాయం అంతా ఇంతా కాదు. సంగ్రామంలో ఎంతోమంది యురోపియన్‌ల జీవితాలను కాపాడాడు. ఆ తరువాత కాజెస్ ఆఫ్ ది రెబెలియన్ అన్న పుస్తకాన్ని కూడా రచించాడు. బ్రిటీష్ వాళ్లు అనుసరించిన వివిధ రకాలైన విధానాల వల్లనే తిరుగుబాటు జరిగిందని.. ఎలాంటి విధానాలు అనుసరించాలో.. ఏది అనుసరించకూడదో కూడా వివరించారు. భారతీయ ముస్లింలు అందరూ కూడా బ్రిటీష్ రాజ్యానికి పూర్తి విధేయులై ఉండాలని పెద్ద ఎత్తున ప్రమోట్ చేశాడు. లార్డ్ కన్నింగ్‌కు సయ్యద్ అహ్మద్ ఖాన్ తెగ నచ్చేశాడు. వెంటనే ఆయనకు ‘సర్’ అన్న ట్యాగ్‌లైన్‌ను తగిలించేశాడు. తద్వారా అతడికి ఎక్కడలేని ప్రాముఖ్యం వచ్చింది. ఈ రకంగా అత్యధిక ముస్లింలు తొలి నాళ్ల నుంచే బ్రిటిషర్లకు విధేయులుగా ఉంటూ వచ్చారు. భారతదేశంపై పట్టు సాధించడానికి బ్రిటీషర్లకు ముస్లింలు అనుసరించిన విధానం బాగా దోహద పడింది. ముస్లింల మత పరమైన అంశాల్లో జోక్యం చేసుకోబోమని ఇచ్చిన వాగ్దానంతోపాటు.. సయ్యద్ అహ్మద్ ఖాన్‌ను అవసరమైనన్ని నిధులు సమకూర్చి పెట్టారు. బ్రిటీష్ వాళ్ల పూర్తి సహాయ సహకారాలతో 1859లో మురాదాబాద్‌లో సయ్యద్ అహ్మద్ ఖాన్ గుల్షన్ స్కూల్‌ను ప్రారంభించాడు. 1863లో ఘాజీపూర్‌లో ప్రత్యేకంగా విక్టోరియా మహారాణి 44వ పుట్టిన రోజు కానుకగా ఆమె పేరుతో విక్టోరియా స్కూల్, సైంటిఫిక్ సొసైటీని సయ్యద్ ప్రారంభించాడు. ఇవన్నీ కూడా ముస్లింలకు ప్రత్యేకించినవే. బ్రిటీష్ వారి పట్ల ఈయన విధేయత ఎంత గొప్పదంటే.. 1875లో సైతం మహారాణికి కానుక సమర్పించినట్టుగా మదరసాత్ ఉల్ ఉలూమ్ లేదా మహమ్మడన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజీని ప్రారంభించాడు. దక్షిణాసియాలో మొట్టమొదటి ముస్లిం యూనివర్సిటీ ఇది. 1920లో ఇది అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా రూపాంతరం చెందింది. అంతేకాదు.. భారతదేశ ముస్లింల కోసం బ్రిటీష్ రాజ్యం లింగ్వా ఫ్రాంకా (భాషా వారధి) గా ఉర్దూను అధికారికంగా ప్రమోట్ చేసింది. మరే ఇతర భాషలనూ బ్రిటీషర్లు పట్టించుకోలేదు. ఇస్లామిక్ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించారు. భారతదేశంలో ముస్లింలను ఒక ప్రత్యేక వర్గంగా ట్రీట్ చేయడం అప్పటి నుంచే మొదలైంది.

సయ్యద్ అహ్మద్ ఖాన్.. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కు బద్ధ వ్యతిరేకి. కాంగ్రెస్ పార్టీ విధానాలను తీవ్రంగా నిరసించినవాడు. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే.. తరువాతి కాలంలో దేశ విభజనపై ఇవి తీవ్రంగా ప్రభావం చూపించాయి కాబట్టి. సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రభావం మహమ్మద్ అలీ జిన్నాపై తీవ్రస్థాయిలో ఉన్నది. అలాగే అల్లామా మహమ్మద్ ఇక్బాల్ పైనా ఈయన ప్రభావం చాలా చాలా ఉన్నది. ఈ ఇక్బాలే 1904లో సారే జహాసె అచ్చా హిందూసితాన్ హమారా అన్న గజల్ రాశాడు. 1904 లాహోర్ గవర్నమెంట్ కాలేజీలో మొట్టమొదటి సారి ఈ గేయాన్ని ఆలపించాడు. కానీ.. 1910 నాటికి ఆయనలో మార్పు వచ్చింది. మొదటి గేయంలో ‘మజ్ హబ్ నహీ సిఖాతా ఆపస్ మే బెయిర్ రఖ్ నా. హిందీ హై హమ్ వతన్ కీ.. హిందూసితాన్ హమారా’ అని రాసిన ఇక్బాల్ 1910లో ఈ పాదాలను మార్చాడు. ‘చీనో అరబ్ హమారా, హిందుస్తాన్ హమారా.. ముస్లిం హై హమ్ వతన్ హై సారా జహాన్ హమారా .. ఖంజర్ హలాల్ కా హై ఖ్వామీ నిషాన్ హమారా, హఘ్రిబ్ కీ వాదియోమే గూంజీ అజాన్ హమారీ..’ అని మార్పు చేశాడు. హిందుస్తాన్ మన మాతృభూమి అన్నవాడే.. మొత్తం ప్రపంచం ముస్లింలది మాత్రమే అని రాశాడు. ఈ ఇక్బాలే.. 1930లో ముస్లిం లీగ్ వార్షిక సదస్సులో అధ్యక్షోపన్యాసం చేస్తూ.. ముస్లిం మెజార్టీ ప్రాంతాలన్నింటినీ కలుపుతూ ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలన్న ప్రతిపాదనను పూర్తిగా సమర్థిస్తున్నట్టు ప్రకటించాడు. ఈ ఐడియానే ఆ తరువాత పాకిస్తాన్ ఏర్పాటుకు ప్రేరణగా మారిందనడంలో సందేహం అక్కరలేదు. ఈ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీయే ఆ తరువాత దేశ విభజన వ్యూహాలకు కేంద్ర స్థానంగా నిలిచింది. మౌలానా మహమ్మద్ జోహర్ అలీ ఖిలాఫత్, ముస్లిం లీగ్ నాయకులు, వీరందరితో పాటు.. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్, పాకిస్తాన్ గవర్నర్ జనరల్‌గా పనిచేసిన సర్ గులామ్ మహమ్మద్.. వీరందరూ కూడా సయ్యద్ అహ్మద్ ఖాన్ ప్రభావితులే. అందరూ కూడా దేశ విభజన కార్యాచరణలో కీలక భూమిక పోషించిన వారే. ఈ సయ్యద్ అహ్మద్ ఖాన్ ద్వారానే ముస్లిం లీగ్ ప్రారంభమైంది. దాని వివరాలు తరువాతి వ్యాసంలో చదువుకుందాం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here