దేశ విభజన విషవృక్షం-46

0
8

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]భా[/dropcap]రత దేశం తొలి చీలిక.. భారత్ నుంచి తొలి విభజన.. 1905లో బంగాల్‌తో మొదలైంది. భారత్‌ను దారుల్ ఇస్లాం (ఇస్లామ్ దేశం) చేయాలన్న బలమైన కోరికను పాక్షికంగానైనా బ్రిటిష్ వాళ్లు తీర్చారు. అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ మహాశయుడి పుణ్యమా అని భారతదేశంలో పాక్షికంగానైనా ఒక ప్రాంతం దారుల్ ఇస్లాంగా మారిపోయింది. 1905వ సంవత్సరం అప్పటికే మహమ్మడన్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ (ఎంఈసీ)తో అప్పటి వైస్రాయ్ కర్జన్ సత్సంబంధాలు నెరుపుతూ వచ్చారు. ఎంఈసీలో అప్పుడప్పుడే రాజకీయ పోకడలు మొదలవుతున్న కాలమది. భారత్‌ను తాము కలలు కన్న ఇస్లామిక్ దేశంగా పూర్తిగా మార్చలేకపోయామన్న బాధ తొలచివేస్తూనే ఉన్నది. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో తాము చేసిన సహాయానికి ప్రతిగా బ్రిటీష్ వారు పూర్తిగా అనుకూలంగా వ్యవహరిస్తున్న పరిస్థితులను అనుకూలంగా మలచుకోవాలనుకొన్నారు. బ్రిటీష్ అధికారులకు, తరువాతి కాలంలో ముస్లిం లీగ్‌గా మారిన ఎంఈసీ పూర్తి సహకారాన్ని అందించింది. దీంతో లార్డ్ కర్జన్ బెంగాల్‌ను విభజించాలని నిర్ణయించాడు. అప్పుడు బెంగాల్ ప్రెసిడెన్సీ చాలా విశాలంగా ఉండేది. దాదాపు 7.85 కోట్ల జనాభా నాటి బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉన్నది. బెంగాల్‌లో బీహార్, ఒరిస్సాతో పాటు.. ఛత్తీస్‌గఢ్ లోని కొన్ని ప్రాంతాలు కలిసే ఉన్నాయి. లార్డ్ కర్జన్ మాత్రం పరిపాలనా సౌలభ్యం కోసం తాను బెంగాల్‌ను విభజిస్తున్నట్టుగా ప్రకటించాడు. నిజంగా పరిపాలనా సౌలభ్యం కోసమే చేసేటట్లయితే.. భాషాపరంగా వేరుగా ఉన్న బీహార్, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా లను వేరు చేయవచ్చు. లేదా.. ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్ లాంటి దూరంగా ఉన్న ప్రాంతాలను వేరు చేయవచ్చు. కానీ.. కర్జన్ మాత్రం స్పష్టంగా రెండు మతాల మధ్య ఈ విభజన రేఖను గీశాడు. తూర్పున ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాన్ని తూర్పు బెంగాల్‌గా, పశ్చిమాన హిందువులు అధికంగా ఉన్న ప్రాంతాన్ని పశ్చిమ బెంగాల్‌గా గిరిగీసి క్రిస్టల్ క్లియర్‌గా మత విభజన చేశాడు. ఇది భావి దేశ విభజనకు బలమైన బీజం వేసింది. విభజన విషవృక్షం పరంపరలో బెంగాల్ విభజన గురించి వివరంగా చెప్పుకోవాలి. ఎందుకంటే.. ఇది ఎలా విభజన జరిగిందో అలాగే విఫలమైంది. బెంగాల్ విభజన రద్దు చేయగలిగినప్పుడు పాకిస్తాన్ విభజన ఎందుకు ఆపలేకపోయారన్నది అందరూ ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.

బెంగాల్ విభజన నిర్ణయాన్ని తీసుకొన్న లార్డ్ కర్జన్ ఎలాంటి వాడో తెలుసుకుంటే.. అతడి నిర్ణయాన్ని మనం అర్థం చేసుకోవడానికి కొంత అవకాశం ఏర్పడవచ్చు. లార్డ్ కర్జన్ అసలు పేరు జార్జ్ నాథనియల్ కర్జన్. ఇతనికి మార్క్విస్ కెడల్ స్టన్, బారన్ ఆఫ్ కెడల్ స్టన్ అన్న రాజకీయ హోదాలు కూడా ఉన్నాయి. ఇతను మొదట్నుంచీ కూడా భారతదేశంపై ఒక స్పష్టమైన అవగాహనతో ఉన్నాడు. బ్రిటీష్ వాళ్లు పరిపాలిస్తున్న వలస రాజ్యాలన్నింటిలో కూడా భారతదేశం అత్యంత ముఖ్యమైనది, సంపన్నమైనది, విలువైనదని గ్రహించినవాడు కర్జన్. భారతదేశంపై పట్టు ఉన్నంత కాలం బ్రిటీష్ రాజ్యం ప్రపంచంలో తిరుగులేని శక్తిగా ఉంటుందని.. భారతదేశాన్ని కోల్పోతే మాత్రం ఒక థర్డ్ రేట్ పవర్‌గా మారిపోతుందని 1901లోనే తేల్చి చెప్పాడు. “India has left a deeper mark upon the history the philosophy and the religion of mankind than any other terrestrial unit in the universe.. As long as we rule India we are the greatest power in the world. If we lose it, we shall drop straightaway to a third-rate power.”

చర్విత చరణమే అయినా మరోసారి ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఉన్నది. కర్జన్ చెప్పిన ఈ అంశాన్ని అంతకుముందు 1835లోనే లార్డ్ మెకాలే చెప్పాడు. ఆ తరువాతి నుంచి దేశంలో ఇంగ్లీష్ విద్యావిధానం సూపర్ ఇంపోజ్ అయింది. భారతదేశీయ జీవన విధానంలోని అన్ని రంగాలనూ లోపభూయిష్టంగా తిరస్కరించారు. వేల సంవత్సరాల నుంచి ఉన్న చరిత్రను చెత్త బుట్టలోకి పారేసి.. అలెగ్జాండర్ దండయాత్ర నుంచి భారతదేశ చరిత్రను కొత్తగా రచించారు. ప్రాచీన చరిత్ర గురించి ఎవరైనా మాట్లాడితే ఆర్య ద్రావిడ విభేదాలను సృష్టించి ఈ దేశం ఎవ్వరికీ సొంతం కాదనే ఒక సరికొత్త.. విచిత్ర.. విడ్డూరమైన సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చారు. ‘నిన్న వచ్చారింగిలీజులు మొన్న వచ్చార్ ముసిలిములు.. ఆ మొన్న వచ్చిన వేరు వాడ వీవని మరచి వేరులు పెట్టకోయి’ అంటూ గురజాడ అప్పారావు దేశభక్తి గీతంలోని అప్రకటిత భాగంలో పేర్కొన్న మాటలివి. మనమంతా వేరే చోటి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్లమేనని తేల్చివేశారు. క్రీస్తుకు పూర్వం 1400 సంవత్సరాల వరకే మన వాఙ్మయాన్నంతా చాప చుట్టినట్టు చుట్టి సర్ది పెట్టారు. హరప్పా మొహంజొదారో బయటపడ్డాక కానీ మరికొంత సర్దుబాటుకు అంగీకరించాల్సి వచ్చింది. విచిత్రమేమంటే మన వాఙ్మయమంతా బయటి నుంచి వచ్చిందేనని వాదించారు. నాట్యశాస్త్రం, జ్యోతిషం, అర్థ శాస్త్రం ఇవన్నీ కూడా గ్రీకుల నుంచి వలస వచ్చినవన్నారు. భారతదేశంలో భక్తి సిద్ధాంతానికి క్రైస్తవమే కారణమని కూడా వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. ఇతిహాస పురాణాలను ఆర్య ద్రావిడ ఘర్షణగా (యజమాని, బానిస అనే విధానంలో), వర్ణ వ్యవస్థలోని ఘర్షణగా సూత్రీకరించారు. చరిత్ర అంతా కట్టుకథ అన్నారు. చిత్రకళ అనాగరికమన్నారు. శిల్పం పైశాచికమని వ్యాఖ్యానించారు. ప్రజలను ఎన్ని విధాలుగా విభజించాలో అన్ని విధాలుగా విభజించేందుకు మెకాలే మొదలుగా కర్జన్ దాకా చేయని ప్రయత్నమంటూ లేదు. అందులో కర్జన్ చర్య ఏకంగా మతపరంగా దేశ విభజనకే దారి తీసింది.

1898లో కర్జన్ తన 40వ ఏట భారతదేశానికి వైస్రాయ్‌గా వచ్చాడు. యంగ్ టర్క్ కావడంతోపాటు అహంభావి కావడంతో అధికారం చేపట్టిందే తడవుగా విభజించి పాలించు అన్న బ్రిటిష్ పరిపాలనా సూత్రానికి పదునుపెట్టాడు. ముందుగా వాయవ్య భారత (ఇప్పటి పాకిస్తాన్) సరిహద్దులో అణచివేతలకు పూనుకున్నాడు. మహసూద్, వజీర్ అనే పష్తూన్ తెగలపై సాయుధ అణచివేతకు పాల్పడి వారిని లొంగదీసుకొన్నాడు. ఆ తరువాత స్థానిక గిరిజన తెగలు నివాసం ఉండే ప్రాంతాలను కలిపి 1898లో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ అన్న కొత్త ప్రావిన్సును ఏర్పాటు చేశాడు. బెంగాల్ విభజనకు ముందు జరిగిన మరో విభజన ఇది. ఇవాళ్టికీ పాకిస్తాన్‌లో నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ మనుగడలోనే ఉన్నది.. మన దగ్గర పశ్చిమ బెంగాల్ ఉన్నట్టుగా.. ఇంగ్లీష్ వాళ్లు, యురోపియన్లపై హంతక ముఠాల దాడులు ఎక్కువయ్యాయని.. వాటిని బలవంతంగా నియంత్రించడం కోసం అత్యంత క్రూరమైన శిక్షలను విధించాలని కూడా క్వెట్టా దర్బార్‌లో వాదించాడు. కర్జన్ ఆలోచనలు ఎలా సాగాయో ఆయన మాటల్లోనే చదవండి.. “Is it possible, under the law, to flog these horrible scoundrels before we execute them? Supposing we remove them for execution to another and distant jail, could we flog them in the first jail before removal? I believe that if we could postpone the execution for a few weeks and give the criminal a few good public floggings – or even one, were more not possible – it would act as a real deterrent. But I have a suspicion that British law does not smile upon anything so eminently practical.”

లార్డ్ కర్జన్ భారత దేశానికి రెండు సరిహద్దుల్లో.. దేశాన్ని ముక్కలు చేసినవాడు. ఒకటి వాయవ్య సరిహద్దు కాగా.. రెండవది తూర్పు బెంగాల్. ఒక చోట గిరిజన తెగలు.. మరొక చోట ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాలు. ఆ తరువాతి కాలంలో ఈ రెండూ కూడా పాకిస్తాన్‌లో భాగమయ్యాయి.

కర్జన్ ఆలోచనల ప్రకారం భారతదేశాన్ని ఎక్కువ కాలం పాలించాలంటే.. ఇక్కడి సమాజం ఎట్టి పరిస్థితుల్లోనూ ఐక్యంగా ఉండకూడదు. అందువల్లనే ముస్లిం సంతుష్టీకరణ అధికంగా మొదలు పెట్టాడు. ఇందులో భాగంగా అతను చేసిన మొదటి పని షాజహాన్ సమాధి మందిరం తాజ్‌ మహల్‌ను పునరుద్ధరించడం. తాజ్‌ మహల్‌లో పెద్ద ఎత్తున మరమ్మతులు చేయించాడు. తాజ్ మహల్ ముందు భాగంలో ఉన్న లాన్‌లు, పూల తోటల నిర్మాణం కర్జన్ చేపట్టినవే. ప్రసిద్ధ ప్యారడైజ్ గార్డెన్ లార్డ్ కర్జన్ చేయించిందే. ఇవాళ మనం చూస్తున్న తాజ్ మహల్ రూపు రేఖలు కర్జన్ హయాంలో కొత్తగా రూపుకట్టుకొన్నవే.

ఆ తరువాత కర్జన్ చేసిన మరో గొప్ప పని బెంగాల్ విభజన. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే.. బెంగాల్ విభజన నాటికి మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ జాతీయోద్యమ యవనికపై ప్రవేశించలేదు. గాంధీ, నెహ్రూ జాతీయోద్యమంలోకి ప్రవేశించేనాటికే బెంగాల్ విభజన జరగటం.. దాన్ని రద్దు చేయించగలగటం అయిపోయింది. బెంగాల్‌ను విభజించాలని కర్జన్ 1905 జూలై 19 న నిర్ణయించాడు. అక్టోబర్ 16 1905 నుంచి అమలులోకి తీసుకొన వచ్చాడు. తన నిర్ణయాన్ని సమర్థించుకోవడానికి కర్జన్ చాలా చాలా మాట్లాడాడు. ఏడున్నర కోట్ల జనాభా ఉన్న బెంగాల్‌ను పరిపాలనా సౌలభ్యం కోసమే విడదీసినట్టు గట్టిగా వాదించాడు. ఈ సందర్భంగా అతను ఆలోచించింది ఒకటే.. అటు వాయవ్య సరిహద్దులో విడదీసినట్టే.. ఇటు ముస్లిం డామినేషన్ ఉన్న ప్రాంతాన్ని విడదీయడం ద్వారా రెండు మతాల మధ్యన ప్రత్యేక అస్తిత్వ పోరాటాలు జరుగుతాయని.. దీని ద్వారా తమ సార్వభౌమత్వం కలకాలం మనుగడలో ఉంటుందని.. ఆశించాడు. రెండు పిల్లులు కొట్టుకుంటుంటే.. మధ్యలో తగువు చెప్పటానికి వెళ్లిన కుక్క లాభపడిన చందంగానే తామూ లాభపడవచ్చని ఆశించాడు. పైగా అప్పుడప్పుడే పుట్టిన కాంగ్రెస్ పార్టీకి బ్రిటీష్ వాళ్లను ఎదిరించి నిలిచే సత్తా లేదని గట్టిగా నమ్మాడు. “Curzon had hoped.. to bind India permanently to the Raj. Ironically, his partition of Bengal, and the bitter controversy that followed, did much to revitalize Congress. Curzon, typically, had dismissed the Congress in 1900 as ‘tottering to its fall’. But he left India with Congress more active and effective than at any time in its history.” (Lion and the Tiger: The Rise and Fall of the British Raj, 1600-1947’, by Denis Judd).

దేశంలో మత పరమైన విభజన అన్నది చాలా చాలా ప్రమాదకరమని.. దేశీయ నాయకులు గట్టిగా వాదించారు. తమ మాతృభూమిని విడదీయవద్దని ప్రాధేయపడ్డారు. పరిపాలనా సౌలభ్యం కోసమే అయితే.. బెంగాలీ మాట్లాడని ఇతర భాషా ప్రాంతాలను విడదీసి కొత్త ప్రావిన్సును ఏర్పాటు చేయవచ్చని కూడా కాంగ్రెస్ నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీ కర్జన్‌కు సూచించాడు. కానీ.. కర్జన్‌కు ఇవేవీ కూడా చెవికెక్కలేదు. మన చరిత్రకారులు మాత్రం బెంగాల్ విభజన కేవలం పరిపాలనా సౌలభ్యం కోసమే జరిగిందని పాఠ్య పుస్తకాల్లో చెప్తూ వచ్చారు. పైగా ఒకటి రెండు ఘటనలను చూపిస్తూ భారతీయులపై యురోపియన్లు చేసిన దాడులను కర్జన్ అడ్డుకొన్నారని కూడా చెప్తూ వచ్చారు. 1903లో ఢిల్లీలో పెద్ద దర్బారు నిర్వహించి భారతీయ నాయకులతో మొక్కించుకొన్న కర్జన్ భారత్‌కు అనుకూలంగా వ్యవహరించాడని అనుకొంటే.. అది ఆ అనుకొన్న వాళ్ల విజ్ఞత మాత్రమే. భారతీయ నాయకులను అవహేళన చేసి.. ఆనాడు భారతీయులకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ అభిప్రాయాన్ని తృణీకరించి నిరంకుశంగా పరిపాలన చేసిన వాడు కర్జన్. మనం స్థానికంగా పిలుచుకునే ‘దొర’ స్వభావానికి చక్కగా సరిపోయేవాడు. బెంగాల్‌ను విభజించిన వెంటనే రెండు రాష్ట్రాలకు ఇద్దరు లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించాడు. తూర్పు బెంగాల్‌కు సర్ ఛాంఫీల్డ్ పుల్లర్, పశ్చిమ బెంగాల్‌కు సర్ ఆండ్రూ ప్రేజర్‌ను ఎల్‌జీలుగా నియమించారు. జూలై 19 న బెంగాల్ విభజనను ప్రకటించిన కర్జన్.. ఆగస్టు 12 న రాజీనామా చేశాడు. లార్డ్ మింటోను కొత్త వైస్రాయ్‌గా నియమించారు కూడా. కానీ.. 1905లో వేల్స్ యువరాజు భార్యతోపాటు భారత పర్యటనకు రావడంతో మరి కొన్ని నెలలు కర్జన్ బాధ్యతలను నిర్వహించాడు. దీంతో అక్టోబర్‌లో విభజన వ్యవహారం సంపూర్ణమైంది.

కర్జన్ తీసుకొన్న ఈ నిర్ణయం భారతదేశంలో ముస్లిం వేర్పాటువాద కాంక్షను తీవ్రతరం చేసింది. అదే సమయంలో అప్పటివరకు దేశంలో నిద్రాణమైన జాతీయోద్యమానికి ఊపిరులూదింది. కాంగ్రెస్ పార్టీకి సరికొత్త చైతన్యాన్ని ఇచ్చింది. ఏ కాంగ్రెస్ పార్టీ వల్ల ఏమీ కాదని కర్జన్ అనుకొన్నాడో.. అదే కాంగ్రెస్ నాయకత్వంలో స్వదేశీ ఉద్యమం ఊపందుకొన్నది. వందేమాతరం ప్రణవనాదమై యావత్ దేశం ప్రజ్వరిల్లింది. దేశీయ నాయకులకు ఇంగ్లీష్ విద్య కారణంగా జరిగిన అనర్థాలు అర్థమయ్యాయి. పాశ్చాత్య నాగరికత, విలువలు, జీవన విధానాన్ని అనుసరించడం వల్ల కలిగిన నష్టమేమిటో అవగాహనకు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులలో ఒకరైన సురేంద్రనాథ్ బెనర్జీ ఇలా అన్నారు. ‘మన తండ్రులు ఇంగ్లీష్ విద్యావిధానం ఫలాలు. వాళ్లు ఆంగ్లేయులకు తీవ్రమైన అనుకూలురు. వాళ్లకు పాశ్చాత్య సంస్కృతి, సభ్యతల్లో ఏ దోషమూ కానవచ్చేది కాదు. సంప్రదాయపు ఆదేశం అనే కట్టుబాటు కంటే, వ్యక్తికి గల రాజ్యాధికారము యొక్క అభివ్యక్తి – సంప్రదాయపు ఆధిపత్యం స్థానంలో జీవనంలో వ్యక్తికి గల నైజ నిర్ణయం, పరంపరాగతమైన ఆచారాల స్థానంలో తన విద్యుక్త ధర్మము, ఈ ప్రాధాన్యతలు గల పాశ్చాత్య జీవనం ఆకస్మికంగా సాక్షాత్కరించింది. బ్రాందీ తాగటం దగ్గర నుంచి ఇంగ్లీష్ వారికి చెందిన ప్రతి అంశమూ ఉత్తమమైనదిగా.. ఇంగ్లీష్ వారికి చెందని ప్రతి అంశమూ అవిశ్వసనీయమైనదిగా గోచరించింది’ (ఇండియన్ రైటింగ్ ఇన్ ఇంగ్లిష్, పేజీలు 41, 42). దేశవ్యాప్తంగా బహు ముఖాలుగా విస్తరించిన పాశ్చాత్య సంస్కృతి కారణంగా ‘అర్ధ మానవ మృగ’ సమాజంగా మారిన దేశాన్ని సంస్కరించే దిశగా అడుగులు వేగంగా పడసాగాయి. ప్రత్యేక అస్తిత్వ వాదాలను తోసి రాజని జాతీయతా మతం ఆవిర్భవించింది. సామాన్యులంతా ఏకమై వందేమాతరాన్ని నినదించడం ప్రారంభించారు.., ఒక్క మహమ్మడన్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ నుంచి పుట్టుకొచ్చిన ముస్లిం మేధావులు మినహా.. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకిలించి వేసేందుకు అవసరమైన చైతన్యాన్ని ప్రజల్లో కలిగించే దీర్ఘ కాల వ్యూహానికి బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం నాంది పలికింది. ఇందులో భాగంగానే స్వదేశీ ఉద్యమం మొదలైంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి.. దేవేంద్రనాథ్ ఠాగూర్ ఇంటింటికీ తిరుగుతూ పిల్లలను మిషనరీ స్కూళ్లకు కాకుండా దేశీయ పాఠశాలలకు పంపించాలని కోరేవారు. ఆనాడు మిషనరీ పాఠశాలలన్నీ మత ప్రచారకుల చేత, క్రైస్తవ మత ప్రాతిపదికన, బైబిల్ ఒక బోధనాంశంగా కొనసాగేవి. వీటినుంచి విముక్తి పొందాలని దేవేంద్రనాథ్ ఠాగూర్ ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించేవారు. మరోవైపు లాలా లజపతిరాయ్, బిపిన్ చంద్రపాల్, బాల్ గంగాధర్ తిలక్ వంటి అతివాదులు, దాదాబాయ్ నౌరోజీ, గోపాల కృష్ణ గోఖలే వంటి మితవాదులు తమ తమ మార్గాల్లో జాతీయోద్యమాన్ని నిర్మించుకుంటూ వెళ్లారు. రవీంద్రనాథ్ ఠాగూర్ స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించారు. సురేంద్రనాథ్ బెనర్జీ స్వదేశీ నిధిని ప్రారంభించారు. బాల గంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మహక్కు అని నినదించాడు. స్వామి వివేకానంద, అరవిందఘోష్ ఇలా అందరూ తమదైన మార్గాల్లో రణన్నినాదం చేశారు. ముస్లిం నాయకులు మాత్రం ఇవేవీ పట్టకుండా బెంగాల్ విభజన ఆసరాగా చేసుకొని.. కాంగ్రెస్ నుంచి భిన్నంగా మహమ్మడన్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్సును అఖిల భారత ముస్లిం లీగ్ గా మార్చడంలో తలమునకలైపోయారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here