దేశ విభజన విషవృక్షం-66

0
12

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]బ్రి[/dropcap]టన్ ప్రభుత్వం పంపించిన త్రిసభ్య కమిటీ ఎప్పుడైతే విఫలమైందో.. ఇక ప్రధాని క్లెమెంట్ అట్లీ ఇక తన సొంత ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించింది. అట్లీ తన ఆలోచనకు పదును పెట్టారు. 1946 జూన్ 16న అట్లీ తన ప్రణాళికను భారత ప్రతినిధుల ముందుంచారు. హిందువులు అత్యధికంగా ఉన్న భారతదేశం, ముస్లింలు అధికంగా ఉన్న భారతదేశంగా ఈ రెండుగా విడగొట్టాలని అట్లీ ప్రణాళిక సారాంశం. ఇంకేం.. మహమ్మద్ అలీ జిన్నా వెంటనే దీనికి అంగీకరించారు. మొదట కాంగ్రెస్ ఈ విషయాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అట్లీ పంపించిన క్యాబినెట్ మిషన్ మాత్రం కాంగ్రెస్‌కు అనుకూలమైన అంశాలు కాంగ్రెస్ ప్రతినిధులకు.. అంటే నెహ్రూ అండ్ కో కు.. ముస్లింలీగ్‌కు అనుకూలమైన అంశాలు జిన్నాకు.. అంటే జిన్నా అండ్ కో కు చెప్తూ.. వేరు వేరుగా చర్చలు జరుపుతూ క్యాబినెట్‌లో ఇరు పక్షాల వారు చేరడానికి ఒప్పించింది. మొత్తం మీద 1946 జూలై 10 న జవహర్ లాల్ నెహ్రూ బొంబాయిలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి రాజ్యాంగ సభలో చేరడానికి కాంగ్రెస్ అంగీకరించినట్టు ప్రకటించారు. అయితే అట్లీ ప్రతిపాదించిన ప్రణాళికలోని పాకిస్తాన్ ఏర్పాటుకు అనుకూలమైన అంశాలను మాత్రం అంగీకరించలేదని ఆ అంశాన్ని తొలగిస్తూ సవరణలు చేయడానికి సిద్ధమని పేర్కొన్నాడు. బ్రిటన్ ప్రణాళికలో మార్పులు చేస్తామని నెహ్రూ ప్రకటించడంపై  జిన్నాపై మళ్లీ అనుమానపు నీలినీడలు కమ్ముకున్నాయి. రాజ్యాంగ సభలో హిందూ మెజార్టీ ఉంటుంది కాబట్టి.. పాకిస్తాన్ కావాలన్న తమ డిమాండ్ నెరవేరదని సందేహించాడు. రాజ్యాంగ సభలో తాము చేరడం లేదని జిన్నా ప్రకటించడమే కాకుండా అట్లీ క్యాబినెట్ మిషన్ తీరును తీవ్రంగా విమర్శించాడు. బొంబాయిలోని తన ఇంట్లో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి పాకిస్తాన్ ఏర్పాటు మాత్రమే తన ఏకైక లక్ష్యమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్, ముస్లిం లీగ్‌లతో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదననూ ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ముస్లింలకు పాకిస్తాన్ ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటానికి శ్రీకారం చుడతామని అదే విలేఖరుల సమావేశంలో హెచ్చరించాడు. తాను సమస్యలు సృష్టించడానికే సిద్ధపడుతున్నానని బహిరంగంగానే చెప్పుకొచ్చాడు. ‘‘Go to the Congress and ask them their plans. When they take you into their confidence I will take you into mine. Why do you expect me alone to sit with folded hands? I also am going to make trouble’’. ఇంత స్పష్టంగా తాను ఏం చేయబోతున్నాడో చెప్పుకొచ్చాడు. అంతే కాదు. 1946, ఆగస్టు 16న జిన్నా ‘డైరెక్ట్ యాక్షన్ డే’ ప్రకటించాడు. అంతే కాదు కాంగ్రెస్‌ను తీవ్రంగా హెచ్చరించాడు.

మిషన్ విఫలమైనప్పటికీ.. రాజ్యాంగ సభ నిర్మాణం, తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు (ప్రధానమంత్రిగా జవహర్ లాల్ నెహ్రూ) జరిగిపోయాయి. ఈ పరిణామాలు ముస్లిం లీగ్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. ఫలితం.. ‘డైరెక్ట్ యాక్షన్ డే’. మహమ్మద్ అలీ జిన్నా ఇచ్చిన డైరెక్ట్ యాక్షన్ డే పిలుపు భారతదేశ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని హింసాకాండకు కారణమైంది. “We do not want war. If you want war we accept your offer unhesitatingly. We will either have a divided India or a destroyed India.” [Bourke-White, Margaret (1949). Halfway to Freedom: A Report on the New India in the Words and Photographs of Margaret Bourke-White. Simon and Schuster. p.15] మేం యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ, యుద్ధమే కావాలని మీరు కోరుకొంటే.. నిరభ్యంతరంగా యుద్ధానికే సిద్ధం. దేశాన్ని విభజించనైనా విభజించాలి. లేదా.. భారతదేశాన్ని వినాశనమైనా చేయాలి.. ఇదీ జిన్నా ప్రకటించిన జిహాద్. ఇక్కడ ఒక్క విషయం చెప్పుకోవాలి. ఈ డైరెక్ట్ యాక్షన్ డే అన్న మాట వినడానికి సాధారణంగానే కనిపిస్తుంది. కానీ.. దీని వెనుక పెద్ద కథే ఉన్నది. డైరెక్ట్ యాక్షన్ అంటే.. తమ లక్ష్యాలను సాధించుకోవడానికి రాజకీయంగా, ఆర్థికంగా, భౌతికంగా తీవ్రమైన చర్యలకు పాల్పడటం అని అర్థం. హింసాత్మకంగా ప్రజలను, గుంపులను, సంస్థలను, ఆస్తులను లక్ష్యం చేసుకొని ప్రత్యక్ష కార్యాచరణకు దిగటం అని అర్థం. అది రాజకీయ హింస కూడా కావచ్చు. దాడులు చేయడం, అవసరమైతే మారణకాండకు పాల్పడటం.. ఆస్తుల విధ్వంసానికి పాల్పడటం వంటివి ఈ కార్యాచరణలో భాగం. ఈ డైరెక్ట్ యాక్షన్ అన్న పదం ముందుగా ఎవరు కనుక్కొన్నారో కానీ, స్పానిష్ తత్త్వవేత్త జోస్ ఆర్టేగా వై గాసెట్.. ముందుగా ఈ పదాన్ని వినియోగించాడు. ఫ్రాన్స్‌లో ఈ పదాన్ని ముందుగా వాడారని పేర్కొన్నాడు. 1910లో జరిగిన చికాగో సమ్మె సందర్భంగా ప్రపంచ కార్మిక సంఘం ఈ ‘ప్రత్యక్ష కార్యాచరణ’ను ప్రకటించింది. 1912లో అమెరికన్ అనార్కిస్ట్ వోల్టరైన్ డీ క్లేరే.. డైరెక్ట్ యాక్షన్ గురించి ఒక వ్యాసాన్ని రాశాడు. బోస్టన్ టీ పార్టీ, అమెరికన్ బానిస వ్యతిరేక ఉద్యమాల సందర్భంగా డైరెక్ట్ యాక్షన్‌కు పాల్పడినట్టు పేర్కొన్నారు. కార్మికుడికి, యజమానికి మధ్యన జరిగే యుద్ధంగా విలియమ్ మెల్లర్ 1920 లో రాసిన విలియం మెల్లర్ నిర్వచించాడు. 20వ శతాబ్దం లో ఈ పదం వాడకం బాగా పెరిగింది. ప్రజలు వాళ్లకోసం యుద్ధం చేయడం.. తమ కోసం ప్రతినిధిత్వం వహించేవారిని తిరస్కరించడంగా మారిపోయిందని కెనెడియన్ అనార్కిస్ట్ యాన్ హాన్సెన్ పేర్కొన్నాడు. 1946లో జిన్నా ప్రకటించిన ప్రత్యక్ష కార్యాచరణ అలియాస్ డైరెక్ట్ యాక్షన్ డే.. కూడా ఈ నేపథ్యం నుంచి పుట్టుకొచ్చిందే. దీనికి జిన్నా మతం రంగు బాగా పూశాడు. ప్రత్యక్ష కార్యాచరణ దినం అంటే. డైరెక్ట్ యాక్షన్ డే అనేది పవిత్ర రంజాన్ మాసంలో వచ్చిందని (1946 ఆగస్టు) పేర్కొన్నాడు. విగ్రహారాధకులతో (హిథెనిజం) మహమ్మద్ ప్రవక్త యుద్ధం చేయడం.. వారిని హతమార్చి మక్కాపై విజయాన్ని సాధించడంతో పాటు.. అరేబియాలో స్వర్గ రాజ్యాన్ని నెలకొల్పాడని వెల్లడించాడు. ప్రత్యక్ష కార్యాచరణకు ఖురాన్ ఆశీస్సులు దండిగా ఉన్నాయని కూడా పేర్కొన్నాడు. ఇస్లాం గురించి శాంతిపన్నాలు పలికేవారు దీన్ని ఎలాగైనా సమర్థిస్తారు. కానీ.. ఇస్లాం పుట్టిన నాటి నుంచి కూడా ఏ దశలోనూ శాంతి సామరస్యంగా విస్తరించలేదని చరిత్రలో రక్తంతో తడిసిన ప్రతి పేజీ చెప్తుంది.

జిన్నా పిలుపు ఇవ్వడమే ఆలస్యం.. భారతదేశమంతటా ఇస్లాం మూకలు రెచ్చిపోయాయి. రంజాన్ రోజున కలకత్తాలో ఏకంగా లక్ష మంది ముస్లింలు ఒక చోట చేరారు. హుస్సేన్ షహీద్ సుహ్రావర్దీ ఈ భారీ జన సమీకరణకు నాయకత్వం వహించాడు. ఇక్కడ ప్రతి ఒక్కరికీ కూడా తుపాకులు, పెట్రోల్ బాంబులు, ఇతర బాంబులు, ఆయుధాలు పెద్ద ఎత్తున పంచి పెట్టారు. కలకత్తాలోని హిందువులపై దాడులు చేయాలని ఆదేశించారు. వీరందరికీ నెల రోజులకు సరిపడా ఆహార పదార్థాలను కూడా ఆయుధాలతోపాటుగానే సరఫరా చేశారు. ముస్లిం ఇండియా ఏర్పాటు చేయాలన్న ఒకే ఒక లక్ష్యంతోనే తెగబడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కలకత్తా మేయర్ షరీఫ్ ఖాన్ ఆందోళనకారులకు మార్గదర్శకత్వం వహించారు. హౌరాలోని మొత్తం 24 పోలీస్ స్టేషన్లలోని 22 పోలీస్ స్టేషన్ల నుంచి హిందూ అధికారులను బదిలీ చేసి ముస్లిం అధికారులను వారి స్థానంలోకి తీసుకొచ్చారు. గవర్నర్ ఫ్రెడ్రిక్ బరోస్ ఆగస్టు 16న సెలవు దినంగా ప్రకటించాడు. అంతా వాళ్లు అనుకొన్నది అనుకొన్నట్టుగా అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకొన్నాకే కార్యాచరణలోకి దిగారు.  ఆగస్టు 16 నుంచి రెండు రోజుల పాటు ముస్లింల స్వైర విహారానికి అడ్డూ ఆపూ లేకుండా పోయింది. ఇంక ఏం జరిగి ఉంటుందో ఒక్కసారి ఊహించుకొండి..  అచ్చంగా సినిమాల్లో చూపించినట్టే.. పోలీసులెవరూ కన్ను పొడుచుకొని చూసినా కనిపించరు. కొద్ది సంవత్సరాల క్రితం నిజామాబాద్‌లో అనుకుంటా.. ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ.. ‘మీరు 100కోట్ల మంది ఉన్నారు.. మేము కేవలం పాతిక కోట్ల మందే ఉన్నాం. అయినా సరే.. ఓ 15 నిమిషాలు మాకు అప్పగించండి. ఎవరు ఎక్కువో.. ఎవరు తక్కువో చూపిస్తాం’ అని  అన్నాడు. ఇదిగో 1946 ఆగస్టులో కలకత్తాలో జరిగింది అక్షరాలా అలాంటిదే. అక్బరుద్దీన్ కూడా దీన్ని దృష్టిలో ఉంచుకొనే అన్నాడు. రెండు రోజుల పాటు..  కలకత్తా మహానగరంలో మృత్యువు మహా విలయాన్ని సృష్టించింది. మహానగరం కాస్తా.. మహా స్మశానంగా మారిపోయింది. అత్యంత పైశాచికంగా, అరాచకం కలకత్తా వీధుల్లో నగ్నంగా నర్తించింది. రెండే రెండు రోజుల్లో ఒక్క కలకత్తా నగరంలోనే దాదాపు పది వేల మంది.. అత్యంత దారుణంగా, అత్యంత హేయమైన పరిస్థితుల్లో హతమయ్యారు. దాదాపు లక్ష మంది ఇల్లూ వాకిళ్లూ వదిలి పారిపోవాల్సి వచ్చింది. 15 వేల మంది క్షతగాత్రులయ్యారు. హిందువుల రోదనలను వినిపించుకునే ఇంగ్లిష్ చెవులు లేకుండా పోయాయి. గవర్నర్ బరోస్ రాజ్ భవన్‌లో ఫిడేల్ వాయించుకుంటూ ఉండిపోయాడు. ఈ పరిణామాలన్నింటినీ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉండిపోయిందే తప్ప నిరోధించడానికి బ్రిటన్ ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి చేయకపోవడం దారుణం. ముస్లిం పత్రికలు భావోద్వేగాలను రెచ్చగొట్టే కథనాలను రాయడమే కాకుండా ఏరోజు ఏ కార్యక్రమం చేపట్టాలో కూడా ప్రచురించాయి. స్టార్ ఆఫ్ ఇండియా అనే వార్తా పత్రికలో అత్యవసర సేవలు తప్పిస్తే కలకత్తా, హౌరా, హుగ్లీ, మెటిబ్రుజ్ తదితర ప్రాంతాల్లో ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టడం జరుగుతుందని ప్రచురించింది. అటు రాజస్థానీ మార్వాడీలు బ్లాక్‌స్మిత్‌ల సహాయంతో ఆయుధాలు తయారు చేయించుకున్నారు. అమెరికన్ సైనికుల నుంచి ఆయుధాలు కొని తెచ్చి పెట్టుకొని.. ముస్లింలపై ప్రత్యక్ష యుద్ధానికి దిగారు. గోపాల్ ముఖోపాధ్యాయ అనే మల్ల యోధుడు బీహార్ నుంచి వచ్చిన హిందువులు, దళితులతో కలిసి ముస్లిం ఆందోళనకారులను ఎదుర్కొన్నాడు.  మరోవైపు నోవాఖలీలో హిందూ జనాభాను ముస్లింలు పూర్తిగా తుడిచిపెట్టారు. అక్టోబర్ 10 దీపావళి లక్ష్మీపూజ రోజున భయంకరమైన దాడులు జరిగాయి, అత్యాచారాలు, దోపిడీలు.. ఇష్టం వచ్చినట్టు సాగాయి. వారం రోజుల పాటు చిత్తం వచ్చినట్టు విశృంఖలంగా మహా మానవ మారణ హోమం సాగింది. దాదాపు 5 వేల మంది హిందువులను హతమార్చారు. 75 వేల మంది పారిపోయి కొమిల్లా, చాంద్‌పూర్, అగర్తలా ప్రాంతాల్లోని పునరావాస శిబిరాలకు చేరుకొని తలదాచుకున్నారు. హిందూ జనాభా సున్నాకు చేరుకొన్నది.

అక్టోబర్ 11న హిందూ మహా సభ అధ్యక్షుడు రాజేందర్ లాల్ రాయ్ చౌదరి ఇంటిని ముస్లింలు చుట్టు ముట్టారు. అతడిని హతమార్చడానికి ప్రయత్నించారు. రెండు రోజుల పాటు ఆయన ఈ మూకలను అడ్డుకోగలిగాడు. చివరకు ఆయన ఇంటిని ధ్వంసం చేసి తగులబెట్టారు. ఆయన తలను నరికేసి ఒక వెండి పళ్లెంలో ఉంచి ఆయన ఇద్దరు మైనర్ కూతుళ్లు (15,16 సంవత్సరాల వయసు కలిగిన అమ్మాయిలు) సహా మేయర్ గులాం సర్వర్‌కు బహుమానంగా పంపించారు. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొండి. ఈ విభజన విషవృక్షపు మూలాన్ని.. సింధులో మొదటి అమరుడు రాజా దాహిర్ సేన్ తలను నరికి.. తలను వెండి పళ్లంలో ఉంచి దానితోపాటు అతడి ఇద్దరు కూతుళ్లను ఖలీఫాకు బహుమానంగా పంపించిన ఘటనను (ఏడో శతాబ్దపు నాటి ఘటన). ఏ మాత్రమైనా మారిందా? అదే సన్నివేశం మరలా మరలా రిపీట్.. ఏమీ మారలేదు. వాళ్ల వైఖరిలో, పోకడలో, ధ్వంసరచనలో, చిత్రహింసల రచనలోనూ..

నోవాఖలీ లోని రామ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి ఇంటినీ దోచుకొని తగులబెట్టారు. ప్రతి ఒక్కరినీ ఇస్లాంలోకి బలవంతంగా మార్చారు. ఇదంతా 1946 అక్టోబర్‌లో.. మనకు పూర్తిగా తెలిసిన కాలంలో జరిగిన ఘటనలే.. సాండ్విప్ అనే గ్రామంలో మోటర్ కార్లు లేకపోతే.. బయటి నుంచి పెట్రోలు తెప్పించి మరీ ఆ గ్రామంలోని ప్రతి ఇంటినీ కాల్చివేశారు. 1947 మార్చి 5 న రావల్పిండిలో హిందూ విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తుంటే.. వారిపై ముస్లింలీగ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున దాడి చేసి చిత్రహింసలు పెట్టారు. లాహోర్, అమృత్ సర్, జైసల్మేర్, ముల్తాన్, కమల్పూర్ ఇలా అన్ని ప్రాంతాల నుంచి నాన్ స్టాప్ దాడులు కొనసాగాయి. ఒక్కపూట.. ఒక్క గంట.. ఒక్క నిమిషం కూడా విరామం లేని భయంకరమైన దాడులు కొనసాగుతూ వచ్చాయి. గ్రామం తరువాత గ్రామం.. పట్టణం తరువాత పట్టణం, నగరం తరువాత నగరం.. ఇలా ఒకదాని వెంట ఒకటిగా దాడులు కొనసాగాయి. ఒకదాని వెంట ఒకటిగా పరంపరగా రక్తపాత ఇస్లామీకరణ జరుగుతూ వచ్చింది. వారందరిదీ ఒక్కటే నినాదం.. మతం మారు.. లేదా పారిపో.. లేదా చచ్చిపో.. ఇంతే! మార్చి నెలాఖరుకల్లా ఆయా జిల్లాల్లో హిందువు అనే వాడే లేకుండా పోయాడు. బతికిన వాళ్లు పంజాబ్, ఝీలం ప్రాంతాలకు వెళ్లి శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్నారు. హిందూ అంటే కేవలం హిందువులే కాదు.. హిందువులతో పాటు సిక్కులు కూడా అని అర్థం. ఎందుకంటే.. రెండు ఒకే బాటలో నడిచేవి.. కథువా అనే గ్రామంలో బకెట్‌లో పెట్రోల్ తీసుకొని వెళ్లి అక్కడ మనుషులను సజీవంగా దహనం చేశారు.

ఇంత పెద్ద ఎత్తున హింస జరుగుతున్నా.. జవహర్ లాల్ నెహ్రూ మాత్రం 1946 సెప్టెంబర్‌లో సమైక్య భారతదేశ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో భయంకరంగా సాగుతున్న హింసాకాండకు ముగింపు పలకడం నెహ్రూ వల్ల కాలేదు. ఏ కాంగ్రెస్ నాయకుడి వల్ల కూడా కాలేదు. చివరకు విభజన మాత్రమే పరిష్కారమని.. ఇక తప్పదని గ్రహించిన వాడు పటేల్. ఈ హింసకు ముగింపు విభజన మాత్రమేనని పటేల్ అంగీకరించారు. హింసాత్మక పరిస్థితులను ఆపడానికి ఇక తొందర పడాల్సిందేనని పటేల్ నిర్ణయాత్మక వ్యూహంతో ముందుకు వెళ్లారు. 1946 డిసెంబర్, 1947 జనవరి నెలల్లో పటేల్, బ్రిటన్ అధికారి వీపీ మీనన్‌తో కలిసి తక్కువ నష్టంతో ఒక పరిష్కారాన్ని కనుగొనాలని ప్రయత్నించారు. 1947 జనవరి, మార్చి మధ్య కాలంలో ముస్లింల ఆందోళన ఎక్కువగా పంజాబ్, బెంగాల్ లోనే జరిగాయి. బెంగాల్, పంజాబ్ లలో మెజార్టీ హిందూ ప్రాంతాలు పాకిస్తాన్‌లో చేరే అవకాశం లేకుండా చేసి.. పాకిస్తాన్ ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. 1947 జూన్ 3 న వైస్రాయ్ గా వచ్చిన మౌంట్‌బాటన్ ఈ ప్రతిపాదనను వెంటనే ఆమోదించారు. ఈ ప్రతిపాదనపై ఆవేదన చెందుతున్న గాంధీకి పటేల్ నచ్చజెప్పారు. హిందూ ముస్లిం అంటే.. కాంగ్రెస్-లీగ్ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలా సాధ్యపడదో ఆయనకు వివరించి చెప్పారు.

‘I fully appreciate the fears of our brothers from [the Muslim-majority areas]. Nobody likes the division of India, and my heart is heavy. But the choice is between one division and many divisions. We must face facts. We cannot give way to emotionalism and sentimentality. The Working Committee has not acted out of fear. But I am afraid of one thing, that all our toil and hard work of these many years might go waste or prove unfruitful. My nine months in office have completely disillusioned me regarding the supposed merits of the Cabinet Mission Plan. Except for a few honourable exceptions, Muslim officials from the top down to the chaprasis (peons or servants) are working for the League. The communal veto given to the League in the Mission Plan would have blocked India’s progress at every stage. Whether we like it or not, de facto Pakistan already exists in the Punjab and Bengal. Under the circumstances, I would prefer a de jure Pakistan, which may make the League more responsible. Freedom is coming. We have 75 to 80 percent of India, which we can make strong with our genius. The League can develop the rest of the country.’

అని పటేల్ ఒక ప్రకటన చేశారు. ఆ తరువాత బ్రిటన్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్ర్యం ఇస్తున్నట్టు ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధంతో విసిగిపోయి ఉన్న బ్రిటన్.. భారత్‌ను వదిలించుకోవడమే ముఖ్యమన్న ధోరణితో ముందుకు సాగింది. ముందుగా 1948 జూన్ నుంచి స్వాతంత్ర్యం అమలులోకి వస్తుందని ముందుగా చెప్పినప్పటికీ.. పరిస్థితులు విషమించడంతో 1947 ఆగస్టు 15నే స్వాతంత్ర్యం అమలు చేశారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here