దేశ విభజన విషవృక్షం-7

1
7

(భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గత సంవత్సరం ఆగస్ట్ 14ను దేశ విభజన భయానక జ్ఞాపకాల సంస్మరణ దినంగా ప్రకటించారు. ఆ పిలుపు ఆధారంగా సంచిక తెలుగు పాఠకుల కోసం అందిస్తున్న విశేష వ్యాస పరంపర ఇది. దేశ విభజనకు దారితీసిన కారణాలను మూలాలనుంచి పరిశోధించి, విశ్లేషిస్తూ కోవెల సంతోష్ కుమార్ రచిస్తున్న వ్యాస పరంపర ఇది.)

[dropcap]1[/dropcap]896-97 సంవత్సరం.. స్కాట్లాండ్‌కు చెందిన పురాతత్వ శాస్త్రవేత్త హెన్రీ కసిన్స్‌ అప్పటి బ్రిటిష్‌ ఇండియాకు వచ్చి ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాలో చేరాడు. వివిధ ప్రాంతాల్లో తవ్వకాలు జరుపుతున్న ఏఎస్‌ఐ పశ్చిమభారత విభాగంలో ఇతనికి ఉద్యోగం లభించింది. పశ్చిమభారతంలోని అనేక ప్రాంతాల్లో తవ్వకాలు జరిపిన బృందాల్లో ఇతను భాగస్వామిగా ఉన్నాడు. ఇందులో భాగంగానే ప్రస్తుతం పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌ జిల్లాలో హెన్రీ బృందం పరిశోధన మొదలుపెట్టింది. ఎడారిగా ఉన్న ఒక ప్రాంతంలో ఒక పెద్ద కందకం లాంటి గుంత బయటపడింది. హెన్రీ బృందం అందులోకి దిగి చూసినప్పుడు ఒక ఇటుక కట్టడం కనిపించింది. దాన్ని మరింత లోతుల్లోకి తవ్వి చూసినప్పుడు ఎత్తైన ఇటుక గోడలు కనిపించాయి. ఈ ఇటుక గోడలన్నీ కూడా పదిహేను నుంచి ఇరవై అడుగుల ఎత్తువరకు ఉన్నాయి. ఇవన్నీ మట్టి ఇటుకలు. ఇవాళ మనం చూస్తున్న ఇటుక సైజుల కంటే పెద్దవి. గమ్మత్తేమిటంటే.. ఈ గోడలన్నీ కూడా భూమి లోపల ఎక్కువ లోతులోకి వెళ్లకుండానే నిర్మాణమైనాయి.

భూగర్భంలో కూడా ప్రాచీన భారతదేశం తవ్వకాల్లో లభించిన రీతిలోనే పెద్ద సైజులో ఇటుకలు.. వాటి మధ్యన మట్టి కూరారు. పునాదుల నిర్మాణం జరిగింది. సాధారణంగా ఇరవై అడుగుల ఎత్తైన గోడ నిర్మించాలంటే.. భూగర్భంలో మనం ఎంత ఫుటింగ్‌ వేస్తారో తెలియని విషయమేం కాదు. ఈ గోడలు ఉపరితలంపైనే ఎక్కువ ఆధారపడ్డాయి. అన్నేండ్లపాటు నిలిచి ఉన్నాయి. ఈ గోడల మధ్యన ఇటుకకూ ఇటుకకూ గ్యాప్‌ వచ్చిన చోట కుండ పెంకులు, ఎముకలు, బొగ్గు, బూడిద, చిన్న చిన్న ఇటుక ముక్కలు.. మట్టి కలగలిసిన మిశ్రమం ఉన్నది. చాలా విశాలంగా.. ఎత్తుగా, పొడవుగా ఉన్న ఈ గోడలను చూసినప్పుడు అక్కడ చాలా చాలా పెద్ద పెద్ద భవనాలు ఉన్నట్టు సులభంగానే అర్థమవుతుంది.

హెన్రీ బృందం ఆ ప్రాంతంలోనే మరింత విస్తృతంగా పరిశోధనలు జరిపింది. ఈ పరిశోధనల్లో ఇక్కడ ఒక బావిలాంటి కట్టడం ఒకటి బయటపడింది. సిలిండర్‌ ఆకారంలో రెండు అడుగుల వ్యాసంతో ఈ బావి ఉన్నది. ఇవాళ మనం ట్యాంకుల నిర్మాణానికి రింగులు ఎలాగైతే వాడుతామో.. అలాంటివే.. మట్టి.. ఇతర మెటీరియల్‌తో తయారుచేసిన రింగులతో నిర్మించిన బావి కనిపించింది. ఇందులో రింగుల చుట్టూ ఒక పైపు మాదిరి కూడా ఒక ఏర్పాటు ఉన్నది. ఈ బావి పక్కన భారతీయ వ్యక్తి నిలుచొని ఉన్నాడు.

ఆ ప్రాంతంలో తవ్విన కొద్దీ అనేక వెండి, రాగి నాణాలు, పాత్రలు, పళ్లాలు, పాత భారతీయ శంఖాలు, మట్టి పెంకులు.. రాతి పనిముట్లు అనేకం లభించాయి. ఇక్కడ చేతి కంకణాలు కూడా లభించాయి. ఇవి రెండు మూడు భాగాలుగా విడగొట్టి ఉన్నాయి. ఈ భాగాలను ఒక వైర్‌ ద్వారా అనుసంధానం చేసి చేతికి ధరిస్తారు. మన దేశంలో ఇలాంటి కంకణాలు లేదా గాజులను ఇవాళ్టికీ ధరిస్తారు. ముఖ్యంగా బంజారా తెగకు చెందిన మహిళలు మణికట్టు నుంచి మోచేతి వరకు వీటిని ధరిస్తారు.

సింధ్‌ ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా 1903-04 వార్షిక నివేదికలో ఈ అంశం గురించి మరింత వివరించింది. “Both here and at Depar Gangro we found abundance of shells of sorts. They are scattered about, some of them very tiny; and in some places large areas are quite white from the quantities crushed and pulverised on the surface. From some of the excavations I got several old hindu conch shells, some quite decayed, and great quantities of fragments of shell bangles made from these, the shell being cut across in sections and joined together with wire…Such bangles are still worn, especially by the Brinjara tribe, the arms of whose women are covered with them from wrist to elbow. In many cases patterns were incised upon them; and, as they have somewhat the appearance of ivory, Mr Bellasis mistook them for such. I have several large fragments of these shells, some completely cut away down to the spiral core. Ivory I did find in lumps in a room, which must have been that of an ivory turner, since the pieces are partly turned; but the ivory is more or less disintegrated, whereas the shell seems to have suffered no harm whatever from long years of exposure or burial.”

పాకిస్తాన్‌ ఆర్కియలాజికల్‌ సర్వే వెబ్‌సైట్‌లో ఈ తవ్వకాలు.. అందులో బయటపడిన తవ్వకాల గురించి మరింత సవివరంగా పేర్కొన్నది. సింధ్‌ ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా 1903-04 వార్షిక నివేదికలో దీని గురించి చెప్తూ..‘ Close to the large mound, in the north-west corner of the city…is a curious deep narrow well. It is about two feet in diameter, and is formed of deep earthenware rings or cylinders, placed one above another, to form, as it were, a great vertical pipe. Each section is provided with flanges so as to prevent the one telescoping into the other….’ అని వివరించింది.

హెన్రీ కజిన్స్‌ నేతృత్వంలో బయటపడిన ఈ మహత్తర నగరం పేరు బ్రాహ్మణాబాద్‌. దీని గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నదంటే.. భారతీయ మహానగరాల్లో మహాద్భుతమైన, సుసంపన్నమైన నగరం ఒకటి ఉండేదన్న కనీస సమాచారం కూడా మనకు లేకుండా పోయింది. మహమ్మద్‌ బీన్‌ ఖాసిం దేబాల్‌ పోర్ట్‌తోపాటు ఈ నగరాన్ని నామరూపాలు లేకుండా చేసి భారతదేశంలో తొట్టతొలి ముస్లిం రాజ్యాన్ని స్థాపించాడు కాబట్టి. విభజన విషబీజం ఇక్కడే మొక్కై వెలిసింది కాబట్టి.

అంతకుముందు బ్రాహ్మణాబాద్‌ ఏమిటో మనకు తెలియాలి. ఇది లోహానా వంశానికి చెందిన రాజధాని. ఆఘం లోహానా ఈ నగరాన్ని కేంద్రంగా చేసుకొని రాజ్యాన్ని పరిపాలించాడు. ఇక్కడి నుంచి సంపన్నమైన వ్యాపారం పర్షియా, నేటి ఐరోపా దేశాల దాకా విస్తారంగా సాగింది. వీరు క్రీస్తుకు పూర్వం 300 బీసీ ప్రాంతంలోనే బ్రాహ్మణాబాద్‌ ప్రాంతాన్ని పరిపాలించారు. వీళ్ల సామ్రాజ్యం నేటి పాకిస్థాన్‌ లోని సింధ్‌ ప్రాంతం నుంచి గుజరాత్‌లోని కచ్‌ వరకూ కూడా విస్తరించింది. వీళ్లు తమను తాము అయోధ్య రామచంద్రుడి కుమారుడైన లవుడి వారసులమని చెప్పుకొన్నారు. లవుడి పేరుమీదుగానే తమకు లోహానా పేరు వచ్చిందని కూడా చెప్తారు. పాశ్చాత్య చరిత్రకారుడైన రిచర్డ్‌ బర్టన్‌ లోహానా వంశం గురించి కొంత సమాచారమిచ్చాడు. వీళ్ల పేర్లు, ఆచారాలు, ఆహార్యాలు, మర్యాదలు, వేడుకలు అన్నీ కూడా పంజాబీలతో దగ్గరగా పోలి ఉంటాయి. జురెన్‌ కాఫ్లెనర్‌, రోవ్‌ అనే మరో చరిత్రకారులు కూడా లోహానా వంశం గురించి కొంత పరిశోధన చేశాడు. లోహానాలు.. పంజాబ్‌లో ఖత్రీలకు మధ్యన సారూప్యతలు ఉన్నాయని పేర్కొన్నాడు. బలూచిస్తాన్‌లో ఉండే సరస్వత్‌ బ్రాహ్మణులను వీరు పూజారులుగా నియమించుకొంటారని పేర్కొన్నాడు. లోహానాలు ఇప్పటికీ పంజాబ్‌, సింధ్‌ ప్రాంతాల్లో కనిపిస్తారు. వీళ్ల మధ్యన సాధారణ వివాహాలు, సంబంధాలు కూడా కొనసాగుతాయి. పురాణ కథనం ప్రకారం వరుణ దేవుడు బ్రాహ్మణాబాద్‌ ప్రాంతంలోని రాథోడ్‌ రాజ్‌పుత్‌లను శత్రువుల నుంచి రక్షించడానికి ఇనుపకోటను నిర్మించాడట. 21 రోజుల తరువాత ఆ కోట మాయమైపోయిందిట. ఆ విధంగా వీరికి లోహానా అనే పేరు వచ్చిందని చెప్తారు. వీరు ప్రధానంగా వ్యాపార సమాజం కాబట్టి వీళ్లు  తమను తాము వైశ్యులుగా చెప్పుకొంటారు. లవుడి వంశం కాబట్టి క్షత్రియులమనీ చెప్పుకొంటారు. లోహానా సామ్రాజ్యం అత్యంత బలమైన, శక్తిమంతమైంది. గొప్ప సంపద కలిగిన రాజ్యమని అక్కడ శిథిలాల్లో దొరికిన అమూల్యమైన నాణాలే చెప్తున్నాయి. ఈ లోహానా రాజ్యాన్ని అరోర్‌ వంశస్థులు యుద్ధం చేసి ఆక్రమించుకొన్నారు. ఈ అరోర్‌ వంశానికి చెందిన రాజే రాజా దాహిర్‌. వీరి వంశంలో మనకు మహాభారతంలో కనిపించే సౌవీర వంశానికి చెందిన మూలాలు ఉన్నాయి.

మహమ్మద్‌ బీన్‌ ఖాసింకు ముందు ఈ ప్రాంతంలో దాడులు చేసిన ముస్లింలు బ్రాహ్మణాబాద్‌ను స్వాధీనం చేసుకోలేకపోయారు. క్రీస్తు శకం 711లో మక్రానా నుంచి దేబాల్‌ పోర్టు సిటీదాకా దురాక్రమణ చేసిన మహమ్మద్‌ బీన్‌ ఖాసిం బ్రాహ్మణాబాద్‌ నగరాన్ని సమూలంగా ధ్వంసంచేశాడు.

8 వ శతాబ్దంలో సింధ్‌ రాజ్యం అంతర్గత కలహాలతో అల్లాడిపోయింది. కొందరు రాజ్‌పుత్‌లు, ముఖ్యంగా బౌద్ధులు రాజుకు సహకరించలేదు. ఈ ఐకమత్య రాహిత్యాన్ని  మహమ్మద్‌ బీన్‌ ఖాసిం అవకాశంగా మలచుకొన్నాడు. ఖాసింతో పాటు అతని మేనల్లుడు అల్‌ హజాజ్‌ బీన్‌ యూసుఫ్‌, ఖురాసన్‌లు కలిసి.. పెద్ద సైన్యంతో విరుచుకుపడి ఈ రాజ్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. నగరంలో ఒక్క భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి లేకుండా చేశారు. అయితే మతం మారండి.. లేకుంటే చచ్చిపోండి.. లేదా పారిపోండి.. ఇదే సూత్రాన్ని పాటించారు. దారుణంగా అమలుచేశారు. కశ్మీర్‌లో పండిట్ల విషయంలోనూ ఇదే సూత్రం అమలైందన్న విషయాన్ని ఇక్కడ గుర్తుకు తెచ్చుకోవడం అవసరం. వేలమందిని ఊచకోత కోశారు. మారణ కాండ అంటే మామూలుగా చంపడం కాదు.. చూసేవాళ్లు తీవ్రంగా భయపడేలా తలలు నరికేసి విసిరేయడం.. తమ ఖలీఫాకు బహుమతులుగా పంపడం వంటి అత్యంత క్రూరమైన చర్యలకు పాల్పడ్డారు. రాజుల భార్యలను, కూతుళ్లను కుటుంబ సభ్యులను బానిసలుగా మార్చి.. వేశ్యలుగా చేసి తమ ఖలీఫాకు తోఫాలుగా పంపించారు. ఈ రక్తపుటేరులపైనే అరబ్బుల సామ్రాజ్యం ఏర్పడింది. ముందుగా చెప్పుకొన్నట్టు భారత భూభాగంపై ఏర్పడిన మొట్టమొదటి ముస్లిం రాజ్యం ఇదే. బ్రాహ్మణాబాద్‌ నగరంపైన అరబ్బులు మరో నగరాన్ని నిర్మించారు. విచిత్రమేమంటే ఈ నగర నిర్మాణానికి బ్రాహ్మణాబాద్‌ శిథిలాల నుంచి తీసుకొన్న ముడిసరుకునే వినియోగించారు. అప్పటిదాకా అక్కడ ఉన్న భారతీయ నిర్మాణ శైలి అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఇస్లామిక్‌ కట్టడాల నిర్మాణ శైలి బ్రాహ్మణాబాద్‌కు పూర్తిగా ఇంపోర్ట్‌ అయింది. భారతదేశంలో ఇస్లామిక్‌ సాంస్కృతిక బీజాలు బ్రాహ్మణాబాద్‌లో పడ్డాయి. భారతదేశంలో ఇస్లాం విస్తరణలో ఇది కీలకమైన మలుపుగా మారింది. నగరం పేరు అల్‌ మన్సూర్‌గా నామకరణం జరిగింది. భారత్‌లో ముస్లిం చరిత్రలో ఈ నగర నిర్మాణం అత్యంత ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం.

అబ్బాసిద్‌ ఖలీఫాగా ఉన్న సమయం (705-782)లో బ్రాహ్మణాబాద్‌ పునాదులపై నిర్మించిన మన్సూరా నగరాన్ని పట్టణ ప్రణాళిక ప్రకారం అభివృద్ధి చేశాడు. ఖలీఫా ఉమయ్యద్‌ సమయంలో సింధ్‌ గవర్నర్‌గా ఉన్న మన్సూర్‌బీన్‌ జమూర్‌ పేరుతో ఈ నగరానికి పునాది పడింది. సింధ్‌ ప్రాంతంలోనే బాను హబర్‌ అనే తెగకు చెందిన ఉమర్‌ బీన్‌ అల్‌ అబద్‌ అల్‌ అజీజ్‌ ఈ మన్సూరా నగరానికి తొలి గవర్నర్‌గా నియమించారు. అల్‌ మన్సూర్‌ ఖలీఫా అయిన తరువాత ఈ నగరానికి గవర్నర్‌గా ఖలీద్‌ అయ్యాడు. మన్సూరా నగరం అద్భుతమైన పండ్ల తోటలతో ఉండేదని చరిత్రకారులు చెప్తారు. కానీ.. ఇందుకు సంపూర్ణమైన ఆధారాలు లభించడంలేదు. ఈ బ్రాహ్మణాబాద్‌ అలియాస్‌ మన్సూరా నగరం నుంచి మన దేశంలోకి ముస్లిం రాజ్యవిస్తరణ ప్రారంభమైంది. మహమ్మద్‌ బీన్‌ ఖాసిం వారసులు సింధ్‌ నుంచి పంజాబ్‌ తదితర ప్రాంతాలకు విస్తరించాలని ప్రయత్నించారు. మన దేశంలోనికి ఇస్లాం విస్తరణ కాండలో ఇది అత్యంత కీలకమైన సందర్భం.  ఆనాటి నుంచి , 1947 నాటి భారత దేశ విభజనకు, ఆతరువాతనుంచి ఈనాటి  2022 నాటి విభజన రాజకీయాలకూ, భవిశ్యత్తులో జరగబోయే అనేక విశ్వంసకర రాజకీయాలకూ  ఇదే మూలం !!!!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here