‘దేశభక్తి కథలు’ పుస్తకం ముందుమాట

0
10

[dropcap]తె[/dropcap]లుగు కథా ప్రపంచంలో పలు విభిన్నమైన సంకలనాలున్నాయి. ప్రాంతీయ సంకలనాలున్నాయి. వృత్తిపరమైన సంకలనాలున్నాయి. మైనారిటీ కథల సంకలనాలున్నాయి. దళిత కథల సంకలనాలున్నాయి. కానీ దేశభక్తి కథల సంకలనాలు లేవు. బాలల కోసం దేశభక్తుల గురించిన వివరాల సంకలనాలు, త్యాగధనుల కథల సంకలనాలు ఉన్నాయి కానీ ‘దేశభక్తి’ కథల సంకలనాలు లేవు. అందుకే, రైలు కథల సంకలనం తరువాత ఏ కథల సంకలనం తేవాలని ఆలోచిస్తుంటే ’దేశభక్తి కథల సంకలనం ఎందుకు తేకూడదు?’ అన్న భావన కలిగింది.

రైలు కథల సంకలనం అందరిలోనూ స్పందన కలిగించింది. ప్రతి ఒక్కరికీ రైలుతో సంబంధం, అనుబంధాలతో పాటూ పలు అనుభూతులు ఉండటంతో అందరూ ఆ సంకలనాన్ని ఆదరించారు. దాంతో తరువాత సంకలనం కూడా అందరి ఆదరణ పొందేదిగా, అందరినీ స్పందింపచేసేదిగా ఉండాలని ఆలోచిస్తుంటే దేశభక్తి కథల సంకలనం ఆలోచన వచ్చింది. ఆలోచన బలపడటానికి ప్రస్తుతం సమాజంలో నెలకొని ఉన్న పరిస్థితులు తోడ్పడ్డాయి.

‘దేశభక్తి’ అన్నపదం ఒక సంస్థతోటో, పార్టీతోటో ముడిపడటం స్పష్టంగా తెలుస్తోంది. ‘జాతీయభావం’ అన్నపదం ఒక దూషణ పదంగా చలామణీ అవుతోంది. ఏది దేశహితం, ఏది దేశానికి ప్రమాదకరం అన్న విషయంలో స్పష్టమైన అవగాహన లేక దేశద్రోహం, దేశభక్తి అన్నపదాల అర్థాలు మసకబారిపోవడం కనిపిస్తోంది. ‘దేశ్ కే టుక్డే కర్దేంగే, భారత్ కీ బర్బాదీ తక్ జంగ్ జారీ రహేంగే’ వంటి నినాదాలు విద్యార్థుల నడుమ నుండి వెలువడటం, దానికి సమాజంలో పలువర్గాల నుండి సమర్థన లభించడం ఆశ్చర్యంతో పాటు ఆలోచననూ కలిగించే అంశం. అలాగే, భారత జాతీయ జెండాను గౌరవించమని నేర్పించాల్సి రావడం, గౌరవించడం ఒక వివాదాస్పదమైన అంశం అవటం కూడా ‘దేశభక్తి’ అంటే ఏమిటో అన్న సందేహాన్ని లేవనెత్తుతోంది. ‘జాతీయ గీతాన్ని’ గౌరవించడమూ వాద ప్రతివాదాలమయం కావటం ‘దేశభక్తి’ అన్న పదం అర్ధాన్ని నిర్వచించుకోవాల్సిన అవసరం ఉందన్న భావనకు బలం ఇచ్చింది.

దీనికితోడు, అటు సాహిత్య ప్రపంచంలోనే కాక విద్యార్థినీ విద్యార్థులు, యువతీ యువకులతో కలసి ముచ్చటించిన సందర్భాలలో దేశం దేశభక్తి అన్నపదం గురించి కనిపించిన అజ్ఞానం, సందేహాలు దేశభక్తి అన్నపదం అర్థాన్ని నిర్ణయించి, నిర్వచించి, చర్చించాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేసింది. ఫలితంగా తెలుగు సాహిత్య ప్రపంచంలో కథా రచయితలు ‘దేశభక్తి’ అన్నదాన్ని ఏ రకంగా అర్థం చేసుకున్నారు? ఏ రీతిలో తమ కథలలో ప్రదర్శించారు? అన్న విషయం పరిశీలిస్తే, అలాంటి కథలను ఒక సంకలనంగా ప్రచురిస్తే, ఈ కథల ఆధారంగా జరిగే చర్చల వల్ల దేశభకి విషయంలో సందేహాలకు సమాధానం అందే దిశ లభిస్తుందనిపించింది. ఈ నెలకొని ఉన్న విషయంలో ఉన్న సందిగ్గం తొలగుతుందేమోననిపించింది. ఫలితంగా దేశభక్తి కథల సంకలనం ప్రచురించాలన్న ఆలోచన రూపు దిద్దుకుంది. ఈ ఆలోచన గట్టిపడేనాటికి జూన్ నెల చివరివారం అయింది. భారతదేశ స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు కావటంతో ఆగష్టు 15న పుస్తకం విడుదలయితే, స్వాతంత్ర్య దినోత్సవం నాడు ‘దేశభక్తి’ అన్న పదం అర్థంపై అవగాహన కలిగేందుకు అర్థవంతమైన చర్చకు నాందీ ప్రస్తావన జరిగినట్లుంటుందని, పుస్తకం విడుదల తేదీని ఆగష్టు 15గా నిర్ణయించాం. అంటే సరిగా నెలన్నరలోగా కథల సంకలనంలో కథల ఎంపిక పూర్తవ్వాలి. పుస్తకం ప్రచురణ పూర్తి కావాలి. దేవదూతలు అడుగు పెట్టేందుకు జంకే ప్రాంతాలలోకి కూడా మూర్ఖులు దూసుకువెళతారన్న సామెత ప్రకారం మేము నెలన్నరలో ఈ సంకలనాన్ని ప్రచురించాలని నిశ్చయించాం. అందుకు పని వెంటనే ప్రారంభించాం.

పాత పత్రికలలో కథలు వెతికాం. సంకలనాలు, సంపుటులలోని కథలు పరిశీలించాం. ఫేస్‌బుక్‌లో ప్రకటనకు స్పందించిన రచయితలు పంపిన కథలు పరిశీలించాం. కే.పీ. అశోక్ కుమార్ వంటి సహృదయులు తమ లైబ్రరీ తాళాలు తెరిచి తమ హృదయాన్ని పరచిన రీతిలో అందజేసిన పుస్తకాలలో కథలు వెతికాం. వారి సూచనలు, సలహాలను అనుసరించాం. ఫలితంగా అనుకున్న సమయంలో ఈ సంకలనం పూర్తయింది. సంకలనం సకాలంలో పూర్తవటంతో రచయితల నుంచి, వారి వారసుల దగ్గర నుంచి అనుమతి తీసుకోవటంలో సహాయపడిన సహృదయులు డి. రాజకిశోర్, అనిల్ అట్లూరి, కొంపెల్ల శర్మ, దేవరపల్లి రాజేంద్ర, రాజగోపాల్ వురుపుతురి, బలభద్రపాత్రుని రమణిల సహకారం కూడా సంకలనం సకాలంలో పూర్తవటానికి తోడ్పడిన అంశం. ముఖ్యంగా అడిగిన వెంటనే విశ్వనాథ సత్యన్నారాయణ గారి ఏ కథనయినా ప్రచురించుకోమని కోరకుండానే సంపూర్ణమైన వరాలిచ్చారు విశ్వనాథవారి మనవడు విశ్వనాధ సత్యన్నారాయణ. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే కథలను ఎంపిక చేయగానే వెంటనే డిటిపి తప్పులు లేకుండా వేగవంతంగా పూర్తిచేసిన జి.దీప్తీలీనా, అందంగా పేజిమేకప్ చేసి ముఖచిత్రాన్ని తీర్చిదిద్దిన సత్యానంద్, వీటన్నిటినీ కోఆర్డినేట్ చేస్తూ పుస్తకం సకాలంలో సక్రమంగా రావటంలో తోడ్పడిన ‘ఎమెస్కో లక్ష్మి’ గారికి బహుకృతజ్ఞతలు. నిజానికి ఈ పుస్తకాన్ని హరీబరీగా, కంగారుగా తయారుచేస్తున్నట్టు చూసేవారికి అనిపించినా ఎలాంటి ఉద్విగ్నతలు, కంగార్లు లేకుండా ఆడుతూ పాడుతూ పుస్తకం తయారుచేశాం. ఇందుకు ప్రధాన కారణం అడిగిన వెంటనే ఔట్ ఆఫ్ వే వెళ్ళి మరీ సహాయపడిన సహృదయులైన స్నేహితులు. పుస్తకం కోసం కథలను ఎంపిక చేసుకునే ముందే మేము కొన్ని ప్రామాణికాలను, పరిమితులను, పరిధులను నిర్ణయించుకున్నాము. దానిలో భాగంగా ముందుగా దేశభక్తి అంటే ఏమిటన్న ప్రశ్నకు మా పరిధిలో సమాధానాలు వెతికే ప్రయత్నాలు చేశాం.

దేశభక్తి అంటే దేశం పైన భక్తి అని సులభంగా తెలుస్తుంది. ఇక్కడ రెండు పదాలున్నాయి. దేశం, భక్తి. ‘భక్తి’ అన్నది సంపూర్ణంగా లొంగుబాటు, ఎంతగా అంటే వ్యక్తి తన అస్తిత్వాన్ని కోల్పోయేటంతగా. దేశమనే భావనలో తనని తాను సంపూర్ణంగా లయమొందించుకోవటం దేశభక్తి. మరి దేశం అంటే ఏమిటి?

‘దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్’ అన్నది అందరికీ తెలుసు. దేశమంటే మనుషులు అనటంలో అభ్యంతరం లేదు కానీ మట్టి కాదనటం ఆమోదయోగ్యం కాదు. మనిషికి మట్టితో విడదీయరాని సంబంధం ఉంటుంది. మట్టి లేందే మనిషి లేడు. మట్టిపై కాళ్ళు ఉంచనిదే నిలవలేని మనిషికి ప్రాధాన్యం ఇచ్చి మట్టిని విస్మరించటం అర్థం లేని విషయం. కాబట్టి దేశమంటే మనిషి మాత్రమే కాదు, మట్టి కూడా. ఈ మట్టి కోసమే యుద్ధాలు జరుగుతాయి. రక్తపాతాలు సంభవిస్తాయి. ద్వేషాలు, ఆవేశాలు పెరుగుతాయి. కాబట్టి దేశమంటే మట్టి, మనిషి కూడా. అయితే దేశమంటే మట్టి, మనిషి మాత్రమేనా? తరచి చూస్తే మట్టికీ, మనిషికీ ఆ మట్టిలో అభివృద్ధి చెందిన సంస్కృతి, సంప్రదాయాలు, ధర్మం, చరిత్రలతో విడదీయరాని అనుబంధం కలిగి ఉంటాయి. కాబట్టి దేశమంటే మనిషి, మట్టి, సంస్కృతి, సంప్రదాయాలు, ధర్మం, చరిత్రలు. దేశభక్తి అంటే వీటన్నిటిపై భక్తి. వీటన్నిటిలో వ్యక్తి తన అస్తిత్వాన్ని కోల్పోయి లయమైపోవటం. Webster’s dictionary కూడా Patriotism (దేశభక్తికి సమానార్థకం) అంటే ‘loving loyally or zealously supporting one’s own country’ అని నిర్వచిస్తోంది. loyally and zealously అన్న పదాలు గమనార్హం. loyally and zealously అన్నపదాలు ‘భక్తి’కి సమానార్థకాలు కావు. ‘భక్తి’ అన్నపదం భౌతికస్థాయిని దాటిన అర్థాన్నిస్తుంది. కాబట్టి ‘దేశభక్తి’ అన్నపదాన్ని ‘Patriotism’ అన్న పదానికి సమానార్థకంగా వాడుతున్నా ‘Patriotism’ అన్నపదం భౌతిక పరిధిని దాటదు. కానీ దేశభక్తి అన్నపదం భౌతిక పరిధిని దాటి ఆధ్యాత్మిక అర్థాన్నిస్తుంది. అందుకే Patriotism భౌగోళిక పరిధిలో ఒదిగిన అర్థాన్నిస్తే ‘దేశభక్తి’ అన్నపదం భౌగోళిక పరిధిని దాటిన భావనను స్ఫురింపచేస్తోంది. అయితే ఆధునిక సమాజంలో దేశభక్తిని Patriotism తో సమానం చేయటం వల్ల ‘భారతదేశం ఏనాడూ ఒక దేశంగా లేదు’ అన్న వాదన వినిపిస్తోంది. దీనికితోడు స్వాతంత్ర్యం తరువాత దేశవిభజన జరగటం, చారిత్రకంగా, సాంస్కృతికంగా భారతదేశ చరిత్రకు కీలకమైన ప్రదేశాలు పరాయి దేశం పరిధిలోకి రావటంతో ‘దేశభక్తి’ అంటే ఏమిటన్న ప్రశ్న జనించింది. కానీ ‘దేశభక్తి’ అన్న పదాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అలాంటి సందేహాలకు సంశయాలకు తావుండదు. భౌతికంగా ఆయా ప్రాంతాలు వేరే దేశంగా పరిగణనకు గురయినా మానసికంగా ‘దేశం’ అన్న పదానికి పరిధులు, పరిమి లేవు. ఎందుకంటే అవి కూడా ‘దేశభక్తి’ అన్న విశాలమైన పదానికి ఉన్న అనంతమైన అర్థంలో మిళితమై ఉంటాయి. అందుకే పాశ్చాత్య దేశాలలోలాగా భారతదేశంలో ఎప్పుడూ వ్యక్తికీ రాజ్యానికీ నడుమ తీవ్రమైన సంఘర్షణలు రాలేదు. కానీ మన దేశాన్ని, చరిత్రను, సంస్కృతిని, సాంప్రదాయాలను పాశ్చాత్య దృష్టితో విశ్లేషించడం వల్ల ఈనాడు ‘దేశభక్తి’ అన్న పదం విషయంలో ఇన్ని రకాల సందిగ్గాలు, సంఘర్షణలు నెలకొంటున్నాయి. క్రికెట్ మేచ్ నుంచి కార్గిల్ వరకూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ‘దేశభక్తి’ అన్న పదం సంకుచితార్థంలో ప్రచారమయి దేశభక్తి అన్నా జాతీయ భావమన్నా దుష్టార్థానిచ్చే పదంగా ప్రచారం అవుతోంది. కాబట్టి ‘దేశభక్తి’ అను పదాన్ని సంకుచితార్థంలో కాక విస్తృతార్థంకల పదంగా గుర్తించి ఆ భావనను ప్రదర్శించే కథల కోసం వెతకటం ప్రారంభించాం.

కథలను ఎంపిక చేయటంలో ప్రధానంగా ‘సంకుచితత్వానికి’ తావు ఉండకూడదని నిర్ణయించుకున్నాం. వీలైనంతవరకూ కథలలో వ్యక్తిగతానికి తావివ్వకూడదని నిర్ణయించుకున్నాం. ఒకవేళ కథలలో వ్యక్తిగతం ఉన్నా ఆ వ్యక్తిగతాన్ని సార్వజనీన భావనగా, సమస్త సమాజానికి అన్వయించే రీతిలో మలచిన కథలను ఎంపిక చేయాలని నిశ్చయించుకున్నాం. దేశభక్తి కథలనగానే సైనికుల యుద్ధం, ప్రాణత్యాగం మాత్రమే అన్న ఆలోచనను అనేక కథలు ప్రదర్శించడం చూసిన తరువాత అలాంటి కథలనూ పరిహరించాలని నిశ్చయించుకున్నాం. దేశభక్తి గురించిన ఉపన్యాసాలు, దేశం గొప్పతనాన్ని పేజీల కొద్దీ వివరించే కథలనూ వద్దనుకున్నాం. ‘దేశభక్తి’ గురించిన మీమాంస కల కథలను, చర్చించే కథలు, ఆలోచనలను కలిగించే కథలను, అవగాహన కలిగించే కథలను ఎన్నుకోవాలని ప్రయత్నించాము. అలా ఎన్నుకున్న 35 కథలను పరిశీలించిన తరువాత కథలను సంకలనంలో అమర్చే క్రమం దానంతట అదే రూపు దిద్దుకున్నది.

భారతీయ ధర్మం ఆద్యంతాలు లేనిదని మన నమ్మిక. ధర్మం ఉన్నదంటే మట్టి ఉండాలి. మనుషులుండాలి. అంటే భారతదేశం లేక జంబూద్వీపంగా భావించి ‘మనది’గా భావిస్తున్న ఈ దేశం కూడా ఆద్యంతాలు లేనిది. అలాంటప్పుడు దానిలో పరిధులు, పరిమితులు, ఎల్లలు ఎలా ఏర్పడ్డాయి? అనంతమైన భావన ఎలా సంకుచితమైపోయింది? అనంతము, ఆద్యంతాలు లేనిది అయిన మట్టిని మనిషి ఎలా కుచింపచేశాడు? పరిమితులు లేని కాలంలో ‘దేశభక్తి’ అంటే ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానం ‘ప్రాచీన భారతం’ వర్గీకరణ క్రింద ప్రచురించిన రెండు కథలు ‘నోరి నరసింహశాస్త్రి’ గారి ‘వధూసర’, విశ్వనాథ సత్యనారాయణ గారి ‘చామర గ్రాహిణి’లు వివరిస్తాయి. ఆ కాలంలో దేశం అంటే ‘ధర్మమే’ అనీ, దేశానికి ధర్మానికీ అభేద ప్రతిపత్తి అనీ స్పష్టమవుతుంది రెండు కథల వల్ల. ‘వధూసర’ ‘సింధు నదికి ఆవల ధర్మచ్యుతులు, ఈవల ‘ధర్మబద్ధులు’ అన్న విభజనతో సరిహద్దులు అన్న భావన జనించిందని స్పష్టం చేస్తుంది. ఈ కథ ప్రాధాన్యం ఏమిటంటే, ‘సింధు’ నదిని సరిగ్గా పలకనివారు ‘హిందు’ అనటం వల్ల భవిష్యత్తులో సింధునదికి ఈవలివారు హిందువులుగా ఆ భాగం ‘హిందుస్థానం’గా గుర్తింపు పొందింది. దేశంలో ధర్మం, దేశం వేర్వేరు కావనీ, పాశ్చాత్య దేశాలలోలా ఈ విభజన ఇక్కడ లేదని స్పష్టం చేస్తుందీ కథ. ‘వధూసర’ దేశభక్తి అంటే ధర్మభక్తి అని నిరూపిస్తుంది.

విశ్వనాథ వారి ‘చామర గ్రాహిణి’ భారతదేశంలో రాజు విష్ణువుతో సమానమనీ, విష్ణువు ధర్మబద్ధుడనీ ప్రదర్శిస్తుంది. భారతీయ రాజుల ఔన్నత్యం, వారి ధర్మపాలనలను స్పష్టంగా ప్రదర్శిస్తుందీ కథ. ఈ ధర్మభావన సరిహద్దులతో సంకుచితం కానిది. పాశ్చాత్య వ్యాఖ్యాతలు అక్కడి అధికారులు వికృతులన్నీ భారతీయ రాజులకు ఆపాదించి భారతీయ సమాజం తన గతాన్ని చూసి న్యూనతా భావానికి గురయ్యేట్టు చేస్తున్న తరుణంలో ‘భారతీయ సమాజం ధార్మిక సమాజం’ అని నిరూపిస్తూ ధర్మానికి పెద్దపీట వేస్తాయని పాలకులు అని నిరూపించి ఆత్మవిశ్వాసాన్ని పెంచే కథ ఇది.

‘ప్రాచీన భారతం’ విభాగంలోని ఈ కథలు సరిహద్దులు, ఎల్లలు దాటిన ధార్మిక భావనయే ‘దేశభక్తి’ భావన అని ప్రదర్శిస్తాయి. ‘సింధునది’ ఆవలివారంతా ధర్మబద్ధులు. వారిదంతా ఒక జాతి. ఒక దేశం. తాత్కాలిక సరిహద్దులు, ఎల్లలు, విభజనలు, వేర్వేరు రాజులతో సంబంధం లేని ధార్మిక దేశభక్తి భావన ఇది. ‘మధ్యభారతం’ విభాగానికి వచ్చేసరికి పరిస్థితి మారింది. విదేశీ దండయాత్రల ఫలితం, విదేశీ సంపర్కం ఫలితంగా పలు విచిత్రము, వికృతము అయిన భావనలు దేశంలో విశృంఖల విహారం ఆరంభించాయి. సామాజిక పరిస్థితి అల్లకల్లోమయింది. అలాంటి సమయంలో దేశభక్తి ఏ రూపంలో వ్యక్తమయింది, అప్పటికాలంలో దేశభక్తి ఏ రకంగా రూపొందింది అన్నది ఈ విభాగంలోని అయిదు కథలు ప్రదర్శిస్తాయి. గమనిస్తే సమాజంలో రాక్షసులలాంటి శత్రువులను ఎదుర్కొంటూ, అల్లకల్లోలమవుతున్న తరుణంలో కూడా ఈ దేశం అన్న భావన ధార్మిక భావనతో వేరుపడలేదు. మరింత గాఢంగా ముడిపడింది. పైగా ఆ అయోమయాంధకారాల అల్లకల్లోల సమయంలో వెలుగుదివ్వెలా నిలచి చుక్కానిలా దిశనిచ్చి నడిపించింది ధర్మం. ఈ నిజాన్ని నిరూపిస్తాయీ నాలుగు కథలు.

వేంపల్లె గంగాధర్ కథ ‘వానరాయుడు’ పాట అత్యంత ప్రతీకాత్మకంగా ధార్మిక అవగాహనలో దేశంలో వస్తున్న మార్పును ప్రదర్శిస్తుంది. అంతేకాదు భారతీయాత్మకు పట్టుకొమ్మ అయి సింధునదికీవల ఉన్నవారి అస్తిత్వానికి ‘గుర్తింపు’ అయిన ధర్మచ్యుతి జరిగితే కలిగే అనర్థాలను అతిగొప్పగా ప్రదర్శిస్తుంది. రాజు ధర్మాన్ని పాటిస్తే దేశం సుభిక్షంగా ఉంటుంది. ప్రకృతి ఆనందిస్తుంది. ఆశీర్వదిస్తుంది. మనిషి ఆనందంగా సుఖశాంతులతో విలసిల్లుతాడు. ఎప్పుడైతే రాజు ధర్మం తప్పుతాడో, అప్పుడు ఈ దుష్ఫలితాలు అనుభవించేది ప్రజలు, ప్రకృతి వెరసి దేశం. ఈ నిజాన్ని ఇంకా స్పష్టం చేస్తుంది కట్టా నర్సింహులు కైఫియతులు ఆధారంగా రచించిన ‘గొడుగు పాలుడు కథ’. రాయల పాలన కాలం స్వర్ణయుగం ఎందుకంటే రాజుమాత్రమే కాదు సామాన్య ప్రజలు సైతం ధర్మాన్ని పాటించేవారు. అధికారం ఒక రోజు కోసం అందినా ఇతరుల కోసం తప్ప తమను గురించి ఆలోచించని ప్రజలు ఉన్నకాలం ‘స్వర్ణయుగం’ కాకపోతే మరేమౌతుంది? ఈ కథలో కూడా దేశంకన్నా ధర్మభావన అధికంగా కనిపిసుంది. అంటే విదేశీ మూకలు సరిహద్దులు గీసి అనంతమైన భావనలను సంకుచితం చేస్తున్నా పోరాటం ‘ధర్మం’ ఆధారంగా జరుగుతోందన్నమాట. మన్నవ గిరిధర రావు చిన్న కథ ‘చూడావత్ సింగ్’, ‘హైందవి కథ’, ‘గురుదక్షిణ’ ధార్మికయుద్ధాన్ని ప్రదర్శిస్తాయి. ముఖ్యంగా గురుదక్షిణలో ఈ దేశంలో భారతీయ ధర్మం అస్తిత్వం నిలవాలంటే గతానికి భిన్నంగా రాజకీయ అధికారం, ధార్మిక జాగృతి అవసరమని మారిన కాలానికి అనుగుణంగా మారిన ఆలోచనలను ప్రదరిస్తుందీ కథ. ఈ కాలంలో కూడా పోరాటానికి ధర్మరక్షణ ఆధారం.

‘స్వతంత్ర పోరాట భారతం’ లోని అయిదు కథలూ స్వాతంత్ర్య యుద్ధం సమయంలోని దేశభక్తి భావనను ప్రదర్శిస్తాయి. గమనిస్తే ఈ అయిదు కథలూ సామాన్యులకు సంబంధించినవే. ఈ కథలలో ఎక్కడా గొప్ప గొప్ప నాయకుల ప్రసకి రాదు. అంటే, ఈ కథలు ఆ కాలంలో సామాన్యుడి దృష్టిలోని దేశభక్తి భావనను ప్రదర్శిస్తాయి.

ఐతా చంద్రయ్య కథ ‘యజ్ఞసమిధ’ కులమత జాతి వర్గ వర్గ భేదాలు విడిచి ఏకమైన సమాజం మాతృదేశ దాస్య శృంఖలాల చేదన కోసం ప్రాణాలు పణంగా పెట్టటాన్ని ప్రదర్శిస్తుంది. తాడి నాగమ్మ కథ ‘ఒకముద్దు’లో సామాన్య మహిళ, దేశ దాస్య విముక్తి కోసం నిలబడి పోరాడటం ప్రదర్శిస్తుంది. అట్లూరి పిచ్చేశ్వర్రావ్ కథ ‘చిరంజీవి’ దేశ స్వతంత్ర సాధనలో కీలకమైన నావికుల తిరుగుబాటు ఘట్టాన్ని ప్రదర్శిస్తుంది. ఈ కథ వ్యక్తిగతంగా నడిచినా చివరిలో సార్వజనీనమైన దేశభక్తి భావనను ప్రదర్శిస్తూ స్వతంత్ర భావనతో అట్టుడికిపోతున్న దేశప్రజల మానసిక స్థితిని ప్రతిబింబిస్తుంది. పీ.వీ. నరసింహారావు ‘గొల్ల రామవ్వ’ కథ భారతదేశం సమస్తం ఒక కుటుంబమై నిలిచిన పరిస్థితిని హృద్యంగా వర్ణిస్తుంది. ఏ పోరాటమైనా విజయం సాధించాలంటే సామాన్య ప్రజల అండ అవసరం. ఈ నాలుగు కథలూ దేశస్వాతంత్ర్య పోరాట సమయంలో సామాన్య ప్రజల ‘దేశభక్తి’ని ప్రదర్శిస్తాయి. గమనిస్తే, ధార్మిక భావనకన్నా మానసికంగా స్వేచ్చ కావాలన్న భావన ఈ కథలలో అధికంగా కనిపిస్తుంది. దాట్ల దేవదానందం రాజు కథ ‘దేశద్రోహి’ ఆధునిక సమాజంలో, భౌతిక పరిధులు, ఎల్లలు దేశాన్ని నిర్వచించే సమయంలో, సమాజాలలో నెలకొంటున్న ‘దేశభక్తి’ భావన పట్ల అయోమయాన్ని ద్వైదీ భావనలను చక్కగా ప్రదర్శిస్తుంది. ఈ కథలో రెండు ప్రధానపాత్రలూ ఒక కోణంలో దేశభక్తులు, మరో కోణంలో దేశద్రోహులు. ఏది దేశభక్తి? ఏది దేశద్రోహం? అన్న చర్చలు, వివాదాలు ఈనాటికీ సాగుతున్నాయి. ఈ సందిగ్ధం నుంచి ఇంకా సమాజాలు బయటపడలేకపోతున్నాయి. ఫలితంగా సరిహద్దులూ, అహంకారాలు, సైనిక పోరాటాలు అవసరమయ్యాయి. ఫలితం ‘సైనిక భారతం’.

‘సైనిక భారతం’లో కథల ఎంపికలో సైనికుల వీరగాథలు, మరణాలకన్నా సైనికుల దృష్టిలో ‘దేశభక్తి’ని పరిశీలించే కథల ఎంపికకు ప్రాధాన్యం ఇచ్చాము. డి. రామలింగం కథ ‘సిపాయి రాముడు’ స్వాతంత్రసాధన తరువాత దేశవ్యాప్తంగా వెల్లివిరిసిన దేశభక్తి భావనను ప్రదర్శిస్తుంది. ‘జెండా’ దేశానికి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎదగటం కనిపిస్తుంది. నిఖిలేశ్వర్ కథ ‘మనిషి మట్టి’ ఈనాటికీ తేలని ప్రశ్నను స్పృశించి పరిశోధిస్తుంది. మనుషులు మట్టిపై గీసిన గీతలు మనసుల నడుమ అడ్డుగోడలు నిర్మిస్తాయా? మతం, రాజకీయం మనిషికీ మట్టికీ ఉన్న అనుబంధాన్ని రూపుమాపుతుందా? ఇలాంటి ప్రశ్నలను పరిశీలిస్తుందీ కథ. డి.కామేశ్వరి కథ ‘తెలియని నిజాలు’ సియాచిన్ గ్లేషియర్ ప్రాంతంలోని సైనికులు ఎలాంటి పరిస్థితులలో సరిహద్దులను కాపాడుతున్నారో తెలిపే కథ. సరిహద్దుల రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టేందుకు అవసరమైన తీవ్ర ‘దేశభక్తి’ వారికి దేశం ఋణపడి ఉండాల్సిన స్థితిని వివరిస్తుంది. కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ కథ కార్గిల్ యుద్ధంలో ‘మేజర్ వాంగ్‌చుక్’ సాహసగాథను ప్రదర్శిస్తుంది. గంథం నాగేశ్వరరావు (మంజరి) కథ ‘సరిహద్దుకు ఆవల’ సైనికుల దేశభక్తిలోని ‘మానవీయ కోణాన్ని’ హృద్యంగా ప్రదర్శిస్తుంది. ఈ కథ కూడా ‘దేశభక్తి’లోని మానవత్వాన్ని ఎత్తి చూపిస్తుంది.

స్వాతంత్ర్యానంతరం దేశంలో సాంఘికంగా నెలకొన్న పరిస్థితుల ఆధారంగా ‘దేశభక్తి’ అంటే ఏమిటో ప్రదర్శించిన కథలు ‘సాంఘిక విభాగం’లో ఉన్నాయి. ‘మన బెబ్బులి’ కథ ప్రతీకాత్మకంగా ‘పులి’ ‘పిల్లి’ అయిన వైనాన్ని స్వధర్మాన్ని మరచి అస్తిత్వాన్ని విడచి పరాయీకరణం చెంది పౌరుషం, ఆత్మగౌరవం కోల్పోతున్న జాతి స్థితిని ప్రదర్శిస్తుంది. ఇదే ఆలోచనను, సాంఘిక స్థాయిలో వివరిస్తుంది బి.వి. రంగారెడ్డి కథ ‘పాశ్చాత్య వ్యామోహము’. ధర్మం, దేశం ఒకటిగా ఆరంభమయిన దేశభక్తి భావన, ధర్మం, దేశం వేర్వేరుగా అర్థమయ్యే పరిస్థితిని ప్రదర్శిస్తాయీ రెండు కథలు. స్వాతంత్ర్య పోరాట సమయంలో అన్ని మరచి కలిసి పోరాడిన వారు మతాల ఆధారంగా జరిగే రాజకీయాలకు గురై విభేదాలను, విద్వేషాలను పెంచుకుని విధ్వంసానికి పాల్పడటం ప్రదర్శిస్తుంది ‘కాలాన్ని తేవాలి’ కథ. ఈ కథ చివరలో అడిగిన ప్రశ్న ఈనాటికీ సమాజంలో ప్రతి ఒక్కరి మనస్సులలో మెదలుతున్నదే. దేశభక్తి భావనలో మిళితమైన మతాన్ని రాజకీయం చేయటం వల్ల జరిగే అనర్థాన్ని ప్రదర్శిస్తుంది. మానవ కంఠధ్వని అత్యంత ప్రతీకాత్మకంగా సామాన్య మానవుడి స్థాయిలో దేశభక్తి భావనను ప్రదర్శిస్తే, ప్రమాదంలో మాత్రమే కాక నిజజీవితంలో ప్రతిక్షణం ప్రజలు వర్గ, వర్ణ, కుల, మత, జాతి భావాలను మరచి ఏకమయ్యే రోజు ఎప్పుడొస్తుందోనని ప్రశ్నిస్తుంది పోలవరం కోటేశ్వరావు కథ. గమనిస్తే పై కథలలో దేశభక్తి భావన జాతి తనని తాను గుర్తించటం సామాజిక వైషమ్యాలను మరచి ఏకమవటంగా ప్రదర్శితమయింది. ఆదర్శాలకు ఆచరణకూ నడుమ ఉన్న తేడాను, ఫలితంగా వ్యక్తులలో కలిగే భావనను ప్రదర్శిస్తుంది బలివాడ కాంతారావు కథ ‘దేశభక్తి’. వ్యక్తి తన వారసత్వపు ఔన్నత్యాన్ని తెలుసుకుని ఆత్మగౌరవంతో నిజాయితీగా బ్రతకడం, కర్తవ్య నిర్వహణ చేయటం ఆధునిక సమాజంలో అసలైన దేశభక్తి అని నిరూపిస్తుంది. చింతా జగన్నధరావు కథ ‘జ్ఞానమొసగరాదా’ ఈ దేశానికి ఆత్మ పల్లెల అభివృద్ధి అని గ్రహించి, పల్లెల అభివృద్ధి దేశభక్తి అని మరోకోణంలో దేశభక్తిని చూపుతుంది. రెడ్డి ఓంప్రకాశ్ నారాయణ కథ ‘కోరిక’ విదేశీ భావజాలంతో ప్రభావితులై దేశవ్యవస్థను కూలద్రోయాలని తలచి హింసాత్మక ఆయుధ పోరాటాన్ని ఆశ్రయించటంలోని అనర్ధాన్ని అనౌచిత్వాన్ని చూపుతాయి. వేద ప్రభాస్ కథ ‘ఎర్రమేఘం’, బలభద్రపాత్రుని రమణి కథ ‘చీకటి నుంచి వెలుగువైపు’ హింస పోరాటాలలోని అనౌచిత్యాన్ని అసంబద్దతను ఎత్తిచూపిస్తూ.. అసలైన దేశభక్తి మానవత్వం అని ప్రదర్శిస్తాయి ఈ రెండు కథలు. భారతదేశ ప్రజలలోని సార్వజనీన భావనకు అద్దం పడుతుంది ‘యండమూరి వీరేంద్రనాధ్’ కథ ‘నవ్యే కన్నీళ్ళు’. ప్రాంతం, కులం, మతంతో సంబంధంలేని మానవ సంవేదనల స్వరూపాని ప్రదర్శిస్తుందీ కథ. పవని నిర్మల ప్రభావతి కథ ‘జననీ జన్మభూమి’ సమాజంలోని దేశభక్తి భావనలో పొంచి వున్న స్వార్థాన్ని మేడిపండు విప్పి చూపినట్టు ప్రదర్శిస్తుంది. ‘దేశభక్తి’ భావనను పలు విభిన్నమైన కోణాల్లో ప్రదర్శించిన కథ ఇది. భారతీయ వ్యవస్థకు ప్రాణం నిజానికి ప్రత్యేకమైన విద్యావ్యవస్థ. భావిపౌరులను తయారుచేసి దేశాన్ని పరిపుష్టం చేసే విద్యావ్యవస్థ పరాయీకరణం చెంది అస్తిత్వాన్ని కోల్పోయి మరమనుషులను ఆత్మవిశ్వాసరహిత పౌరులను తయారుచేస్తుంటే ఆ విద్యావ్యవస్థను సంస్కరించటం కూడా ‘దేశభక్తి’లో భాగమేనని నిరూపిస్తుంది కస్తూరి మురళీకృష్ణ కథ ‘స్వధర్మే నిధనం శ్రేయః’. సమాజంలో ఏ మార్పయినా ప్రేమతో అవగాహనతోనే సాధ్యం తప్ప న్యూనతాభావంతో, ద్వేషంతో కాదనీ ప్రదర్శిస్తుందీ కథ.

ప్రాచీన భారతం నుంచి సాంఘిక భారతం వరకూ దేశభక్తి భావన పరిణామ క్రమాన్ని ఆయా విభాగాలలోని కథలు స్పష్టంగా ప్రదర్శిస్తాయి. ఆ పరిణామ ఫలితంగా ఈనాడు సమాజంలో ‘దేశభక్తి’ భావన విషయంలో నెలకొని వున్న సందేహాల ఫలితాలను ఆధునిక విభాగం లోని కథలు ప్రదర్శిస్తాయి. ఒక నేత మరణానికి కారణమైన వ్యక్తుల మతం ఆధారంగా స్వదేశీయులనే ఊచకోత కోసే రాక్షసత్వం, ఆలోచనా రాహిత్యాలను ఆలోచనాత్మకంగా ప్రదర్శిస్తుంది గంటి భానుమతి కథ ‘దేశమంటే మతాలోయ్’. స్వార్థరాజకీయాలు దేశ ప్రయోజనాలను సైతం ‘దేశభక్తి’ ముసుగులో పణంగా పెట్టటం కనిపిస్తుందీ కథలో. ఇదే రాజకీయం మనుషులను మతాల వారీగా విడదీసి అభద్రతా భావాన్ని పెంచి అనర్థాలవైపు నెట్టటం కరీముల్లా కథ ‘మదర్సా’ ప్రదర్శిస్తుంది. ఆధునిక సమాజంలో జెండాను అవమానపరచటం, దేశవ్యతిరేక నినాదాలు చేయటం స్వేచ్ఛ, అభ్యుదయంగా చలామణీ అవుతూ అలాంటి చర్యలకు సమర్దన లభిస్తున్న తరుణంలో ఆ ‘జెండా’ స్వేచ్ఛగా, గర్వంగా రెపరెపలాడటం వెనుక ఉన్న త్యాగాలను ప్రదర్శిస్తూ ‘దేశభక్తి’ భావనను అతి సున్నితంగా ప్రదర్శిస్తుంది ఎం. వెంకటేశ్వరరావు కథ ‘జెండా’. చిట్టా దామోదరశాస్త్రి కథ ‘కపర్ది’ ఈ దేశానికి మనుగడ మళ్ళీ రాజకీయం, ధార్మికతలు ఏకమై సరిహద్దుల భావనను భౌగోళికంగా కాక మానసికంగా మంచిచెడుగా గుర్తించటంవల్లనే సాధ్యం అని ‘కబడ్డీ’ ఆటను ప్రతీకాత్మకంగా వాడుకుంటూ ప్రదర్శిస్తుంది.

ఈ సంకలనంలోని కథలన్నీ ‘దేశభక్తి’ భావనను అంతర్లీనంగా పలు విభిన్నమైన కోణాలలో ప్రదర్శిస్తాయి. ఈ కథలు దేశభక్తి భావన పరిణామ క్రమాన్ని ఆయా సమయాలలో దేశభక్తి భావన ఆధారంగా సమాజంలో నెలకొని ఉన్న పరిస్థితుల ఆధారంగా మారుతున్న దేశభక్తి భావనను ప్రదర్శిస్తాయి.

దేశభక్తి భావన అంటే ఇతర దేశాలలో లేని సందిగ్ధం భారతదేశంలో నెలకొని ఉంది. ఆ సందిగ్గాన్ని తొలగించి సమన్వయం సాధించేందుకు సాహిత్యం ద్వారా సమాధానాలు అన్వేషించేందుకు ఇదొక ప్రయత్నం, మేము ఇచ్చుకున్న నిర్వచనమే సరైనదనీ ఇవే దేశభక్తి కథలనీ మాకు ఎలాంటి అపోహాలు లేవు. మేము నిర్ణయించుకున్న పరిధిలో, మాకు ఉన్న సమయంలో, మా దృష్టికి వచ్చిన కథలలో ‘దేశభక్తి’ భావన గురించిన ఉత్సాహాన్ని రేకెత్తించి, చర్చకు ప్రేరణనిచ్చే కథలుగా భావించిన వాటిని ఈ సంకలనంలో చేర్చాము. ఇవికాక ఇంకా ఎన్నో కథలు అనేక కారణాల వల్ల సంకలనంలో చోటు చేసుకోలేకపోయాయి. ఈ సంకలనం విజయవంతం చేయటంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ శతకోటి ప్రణామాలు. ఈ సంకలనంలో ఏవైనా పొరపాట్లు, దోషాలు ఉంటే దానికి మాదే బాధ్యత.. వాటిని తెలియచేస్తే మరో ముద్రణలో సవరించుకుంటాము. రైలుకథలకన్నా విస్తృతమైన పరిధి గల ఈ దేశభక్తి కథల సంకలనాన్ని ఆదరించి, మీ ఆలోచనలను మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాము. అందరం కలిసి స్వర్ణభారత సాధన దిశలో ప్రయాణించేందుకీ సంకలనం ఏమాత్రం తోడ్పడినా కనీసం అలాంటి ఆలోచనకు కారణమైనా మా లక్ష్యం నెరవేరినట్టే.

ఈ సంకలనం ఆలోచన ఆవిర్భావం నుంచి ప్రచురణ వరకూ ఆ తరువాత కూడా వెన్నంటి ఉన్న సంచిక వెబ్ పత్రిక నిర్వాహకులు శ్రీ భానుగౌడ, శ్రీ కనక ప్రసాద్ బైరాజు, శ్రీ లంక నాగరాజులకు బహుకృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు.

కస్తూరి మురళీకృష్ణ

కోడీహళ్ళి మురళీమోహన్

***

దేశభక్తి కథలు
సంచిక – సాహితి ప్రచురణ
పేజీలు: 264
వెల: 150/-
ప్రతులకు:
సాహితి ప్రచురణలు, #33-22-2,
చంద్రం బిల్డింగ్స్, సి. ఆర్. రోడ్,
చుట్టుగుంట, విజయవాడ – 520 004. ఫోన్: 0866-2436643
ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here