దేవ గురువు బృహస్పతి

0
10

[dropcap]తె[/dropcap]లివితేటలలో ఎవరినైనా పోల్చి చెప్పవలసి వస్తే బుద్ధిలో బృహస్పతి అంటారు. దేవతలకు గురువు బృహస్పతి. బృహస్పతి బ్రహ్మ మానస పుత్రులలో ఒకడైన అంగీరస మహర్షి కొడుకు. తల్లి శ్రద్ధ. ఉతద్యుడు సంవర్తనుడు సోదరులు. ఇద్దరు కూడా జ్ఞాన సంపన్నులు, గొప్ప ఋషులు. బృహస్పతి పుడుతూనే గొప్ప బుద్ధి వైభవాన్ని సంపాదించుకున్నాడు. విష్ణుమూర్తి ఆదేశానుసారం సప్త మహర్షులు వచ్చి బృహస్పతికి అన్ని ధర్మ శాస్త్రాల రహస్యాలను భోధించి వెళ్లారు. అందుచేతనే అయన అందరికన్నా గొప్ప బుద్ధిమంతుడైనాడు. కొన్ని పురాణాలలో బృహస్పతిని అగ్ని పుత్రుడిగా పేర్కొంటారు. మొదట బృహస్పతి మానవ మాత్రుడైనప్పటికీ శివుని ఆజ్ఞచే దైవత్వాన్ని పొందాడు. బుద్ధిమంతుడిగా పేరు పొందటం వలన వాచస్పతి అనే మరో పేరు కూడా కలదు. మానవుల ప్రవర్తనను నిర్ధారించే నవగ్రహాలలో బృహస్పతి (గురుడు) ఒకడు. అందుచేతనే బృహస్పతిని స్మరిస్తూ వారములో ఒకరోజుకు గురువారంగా నామకరణము చేయబడింది.

దేవతలు తాము ఎంత శక్తివంతులు, ప్రజ్ఞావంతులు అయినా వారికి గురువు లేకపోతే తమ శక్తి పాటవాలు రాణించవని తమకు గురువుగా ఉండమని బృహస్పతిని అర్థించారు. బృహస్పతి తన కన్నా శుక్రాచార్యుడు లేదా తన సోదరుడు సంవర్తనుడు లేదా ఇతర పెద్దలు ఎందరో ఉన్నారు వారు ఆ పదవికి తగినవారు అని సవినయముగా చెపుతాడు. కానీ దేవతలు ముక్త కంఠముతో తామే మాకు గురువుగా ఉండాలి అని తీర్మానించి ఇంద్రుడు ఐరావతము మీద బృహస్పతిని తన సరసన కూర్చుండబెట్టుకొని అప్సరసలు నాట్యము చేస్తుండగా దేవతలందరు స్వాగత సత్కారాలు చేయగా దేవేంద్రుడు బృహస్పతిని గురు పీఠముపై కూర్చుండబెట్టి దేవ గురువుగా పట్టాభిషేకము చేశారు.

అప్పటినుండి బృహస్పతి దేవతలకు శిక్షణ, రక్షణ అందిస్తూ వారు చేసే యజ్ఞ యాగాదులకు అసురల నుండి రక్షణ కల్పిస్తూ ఉన్నాడు. అందుచేతనే బృహస్పతి దేవతలకు గురువు పురోహితుడుగా వ్యవహరించేవాడు. దేవతలు తన యందు ఉంచిన గౌరవానికి ప్రతిగా బృహస్పతి వారిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండేవాడు. శుక్రాచార్యుడు తనకు దేవ గురువు పదవి దక్కలేదు అన్న ఉక్రోషముతో ఉన్నప్పుడు రాక్షసులు శుక్రాచార్యుని చేరి తమకు గురుత్వము వహించమని కోరటంతో శుక్రాచార్యుడు దేవతల మీద ఉన్న అక్కసుతో వెంటనే అంగీకరించాడు.

బృహస్పతి స్వర్ణమకుటం, సుందరమైన పూమాల ధరించి ఉంటాడు. పసుపుపచ్చని వస్త్రాలు ధరించి పద్మాసనములో ఆసీనుడై ఉంటాడు. ఇతనికి నాలుగు చేతులు ఉండును. వాటిలో స్వర్ణముచే చేయబడిన దండము, రుద్రాక్ష జప మాల, పాత్ర, వరదముద్ర ఉండును. బృహస్పతి అత్యంత సౌందర్యవంతుడని ప్రాచీన ఋగ్వేదములో తెలుపబడినది. స్వర్ణముచే నిర్మించబడిన గృహములో నివసిస్తాడు. ఇతని రథము కూడా స్వర్ణము చేతనే నిర్మించబడి ఉంటుంది. అది సూర్యునికి సమానంగా కాంతిని విరజిమ్ముతుంది. అందులో అన్ని రకాల సౌకర్యాలు కలిగి ఉంటుంది. అది వాయువేగంతో పరుగులు పెట్టగలిగే 8 గుర్రాలచే నడపుబడుతుంది. ఇదే కాక ఏనుగు కూడా బృహస్పతి వాహనమే.

గొప్ప విష్ణుభక్తుడైన ఉపరిచరవసువు అనే రాజు ఇంద్రుడికి స్నేహితుడు. అయన బృహస్పతికి శిష్యుడై ధర్మశాస్త్రాలు నేర్చుకొని సుపరిపాలన చేస్తూ గురువుగారి అనుమతితో అశ్వమేధయాగము చేసాడు. ఇంద్రుడు కూడా బృహస్పతి ద్వారా సర్వ ధర్మాలు నేర్చుకున్నాడు. వసుమనుడనే రాజు బృహస్పతిని అడిగి రాజా ధర్మాలు తెలుసుకున్నాడు. రాజుకు ప్రజలే శరీరమని ప్రజలకు రాజే ఆత్మ అని రాజు లేకపోతే ఏమి లేనట్లే అని బృహస్పతి బోధిస్తాడు. రక్షించటములోను, అర్పించటంలోనూ రాజు ప్రజలు ఇద్దరు ఒకరినొకరు సహకరించుకుంటేనే రాజ్యము శోభిస్తుంది, అలా చేయనప్పుడు శోకిస్తుంది అని బృహస్పతి చెపుతాడు.

బృహస్పతి ద్వారా మాంధాత గోదాన ఫలితాన్ని తెలుసుకుంటాడు. మాంధాతకు బృహస్పతి గోదానాన్ని ఎలా చేయాలో చెపుతాడు.  ఒకరోజు ఉపవాసము ఉండి గోవులున్న ప్రదేశానికి చేరి ఒక రాత్రి ఒక పగలు అక్కడ గడిపి మరునాడు ఉదయమే గోవును పేరు పెట్టి పిలిచి తన పాపాలన్నీ పోయేటట్లు బ్రాహ్మణుని చేతిలో ఉదకాన్ని వదిలి గోదానాన్ని ఇవ్వాలి. కోపము లేనివాడే ఈ దానానికి అర్హుడని చెపుతాడు. మాంధాత బ్రహస్పతి చెప్పినట్లు చేసి మోక్షాన్ని పొందుతాడు.

మంచి పనులు చేయటము, నిష్టగా ఉండటం, జ్ఞానయోగము అనిపించుకుంటుందని బృహస్పతి మనువుకు చెప్తాడు. మనస్సు ప్రశాంతముగా ఉన్నప్పుడు మాత్రమే భగవంతుని చూడగలము, అలాగని మనస్సుకు పట్టుబడనంత మాత్రాన భగవంతుడు లేనట్టు కాదు అని బృహస్పతి అనేక విధాలుగా జ్ఞానయోగము గురించి మనువుకు బోధిస్తాడు. ఇంద్రాది దేవతలకు కష్టనష్టాలు వచ్చినపుడు వారికి సరి అయిన సలహాలు ఇచ్చి వారి కష్టాలను బృహస్పతి తీర్చేవాడు.

వింధ్యపర్వతము పెరుగుతూ ఉపద్రవాన్ని సృష్టిస్తుంటే అగస్త్యునికి సలహా ఇచ్చి వింధ్యపర్వతము గర్వాన్ని అణచడానికి సహాయము చేసాడు. శుక్రాచార్యుడు శివుని కోసము తపస్సు చేయటానికి వెళ్లినప్పుడు బృహస్పతి శుక్రాచార్యుని రూపములో రాక్షసుల చెంతకు చేరి వారు ధర్మ విరుద్ధముగా ప్రవర్తించేటట్లు చేసాడు. తిరిగివచ్చిన శుక్రాచార్యుడు ఈ విషయము తెలుసుకొని మాతృసమానురాలితో పాపపు పని చేసి అవమానాల పాలు అవుతావని బృహస్పతిని శపిస్తాడు.

ఒకరోజున బృహస్పతి తన అన్నగారైన ఉతద్యుడి ఇంటికి వచ్చినప్పుడు ఉతద్యుడు లేకపోవటంతో శాప ప్రభావము వలన వదిన గారైన మమతను అప్పటికే గర్భవతి అయినా, బలాత్కారము చేస్తాడు. ఉతద్యుడు వచ్చి జరిగిన విషయము తెలుసుకొని శుక్రాచార్యుని శాపము వలన ఇది జరిగినది అని భార్యను ఓదారుస్తాడు. కానీ బృహస్పతి భార్యకు కూడ తన భార్యకు జరిగిన విధముగానే జరుగుతుంది అని శపిస్తాడు. బృహస్పతి మొదటి భార్య శుభ. శుభ ద్వారా ఏడుగురు కుమార్తెలు పుడతారు. బృహస్పతి తారను పెళ్లి చేసుకుంటాడు శశాంకుడు (చంద్రుడు) బృహస్పతి దగ్గర శిష్యుడుగా చేరి తార మనస్సును చూరగొంటాడు. తార శశాంకుని ప్రేమలో పడి బృహస్పతిని ఇంద్రుని కోసము యజ్ఞము చేయటానికి వెళ్లిన సమయములో శశాంకునితో వెళ్ళిపోతుంది. బృహస్పతి శశాంకుల మధ్య తార కోసము యుద్ధము కూడా జరుగుతుంది. బ్రహ్మ దేవుని జోక్యంతో శశాంకుడు తారను బృహస్పతితో పంపుతాడు. ఇదంతా శుక్రాచార్యుని శాప ప్రభావమని అర్థము చేసుకుంటాడు. తార బృహస్పతిని సేవిస్తూ ఉండిపోతుంది. వీరికి బుధుడు జన్మిస్తాడు. బృహస్పతి మూడవ భార్య మమత ఈమె ద్వారా భరద్వాజుడు, కచుడు జన్మిస్తారు.

కచుడిని దేవతలు శుక్రాచార్యుని వద్దకు వెళ్లి మృత సంజీవిని (చనిపోయినవారిని బ్రతికించే విద్య)నేర్చుకు రమ్మని పంపిస్తారు. శుక్రాచార్యుని కుమార్తె దేవయాని కచుడిని ప్రేమించటం వలన శుక్రాచార్యుడు ఒప్పుకొని కచుడికి విద్య నేర్పిస్తాడు. దేవయాని తనను వివాహమాడని అంటే గురు పుత్రిక సోదరితో సమానము వివాహమాడను అని దేవయాని శాపానికి గురవుతాడు. బృహస్పతి నర్మదానదీ తీరాన వాచస్పతి అనే పేరుతో గురుకులాన్నిప్రారంభించి ఎంతో మంది శిష్యులకు జ్ఞానోపదేశము చేసేవాడు.

ఛాయా సూర్యుల కుమారుడైన శని తనకు విద్యాబుద్ధులు నేర్పమని సూర్యుడిని అడిగితే దానికి బృహస్పతియే సరియైనవాడు, ఆయనను ఆరాధించి విద్యాబుద్ధులు నేర్చుకో అని చెపుతాడు. శని బ్రాహ్మణ బాలుని రూపములో బృహస్పతి దగ్గర శిష్యుడిగా జేరి ఆనతి కాలములోనే అన్ని నేర్చుకుంటాడు. అప్పుడు అనుమానము వచ్చిన బృహస్పతి దివ్యదృష్టితో ఆ బాలుడు శని అని తెలుసుకొని అసత్యమాడి విద్య నేర్చుకున్నావు కాబట్టి నీ దృష్టి క్రూరముగాను, నీవు జనాన్ని పీడించేవాడివిగాను ఉంటావని శపిస్తాడు. “నన్ను శపించావు కాబట్టి నా పీడ నీకు కూడా తప్పడు, గురుదేవుడివి కాబట్టి అంత ప్రమాదం కాదు” అని ప్రతి శాపము ఇచ్చి శని వెళ్ళిపోతాడు. శాప ప్రభావము వలన బృహస్పతి రాజకుమారుడిని చంపినట్లు అపనింద వస్తుంది కానీ అశరీరవాణి చెప్పటం వలన ఆ అపనింద తొలగిపోతుంది. అప్పుడు శని గురువుగారిని క్షమించమని అడుగుతాడు. బృహస్పతి మంచివాళ్లను భాధించవద్దని శనికి హితవు చెప్పి పంపిస్తాడు. బృహస్పతి చెప్పిన ధర్మాలు, ఇంద్రునికి బోధించిన ధర్మ శాస్త్రాలు బృహస్పతి స్మృతి అనే గ్రంథరూపములో ఉన్నాయి. ఆ విధముగా ఎన్నో తెలివితేటలూ ఉన్నప్పటికీ దేవతలకు మేలు చేద్దామనే ఆలోచనతో శుక్రాచార్యుని రూపములో రాక్షసులను ధర్మ విరుద్ధముగా ప్రవర్తించేటట్లు చేయటము వలన శుక్రాచార్యునితో వైరము తెచ్చుకొని తానూ ఇబ్బందులు పడ్డాడు. అలాగే శని ప్రభావానికి లోనయినాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here