దేవానాం మనుష్య రూపేణ

0
3

[dropcap]హా[/dropcap]స్పిటల్‌ రోగులతో కిక్కిరిసి ఉంది.

విషణ్ణ వదనంతో సోమిదేవమ్మ, పక్కన లీల ఉన్నారు. ఏనుగులా ఉండే మనిషి పీనుగులా అయిపోయేసరికి సర్వం కోల్పోయినట్లు అయిపోయింది సోమిదేవమ్మకు.

“అమ్మగోరూ పంతులుగోరికి ఏం కాదు, ఏడవకండి” అని ధైర్యం చెప్పింది లీల వయసులో చిన్నదైనా.

ఇంతలో కాంపౌండరు వచ్చి “పంతులుగారికి తెలివి వచ్చింది రండి” అని లోపలికి తీసుకు వెళ్ళాడు.

అప్పుడే తెలివి వచ్చిందేమో భార్యని, పక్కని ఉన్న లీలని చూడగానే కంపరమెత్తిపోయాడు సోమయాజులు.

లీలని చూడగానే మనసంతా కకావికలమైంది సోమయాజులకి.

దగ్గరగా వచ్చి తల నిమరబోయింది సోమిదేవమ్మ.

“వద్దు వద్దు దాన్ని ముట్టుకున్నావు నన్ను ముట్టుకోకు” అంటూ జరగబోయాడు. భర్త మూడత్వానికి చింతిస్తూ ఇలా అడిగింది.

“లీల చేసిన తప్పేమిటి?”

“దానికి శుచి శుభ్రం లేదు. దానిని ముట్టుకుంటే మన మడి ఆచారం మంటగలసిపోతాయి” అన్నాడు సోమయాజులు.

“శుచి శుభ్రం ఏ ఒక్క కులానికో మతానికో చెందినది కాదు. చెప్తే అందరూ నేర్చుకుంటారు. అంతమాత్రం చేత వీరిని దూరం చెయ్యడం అమానుషమండీ” అంది సోమిదేవమ్మ.

“మనకి వాళ్ళకి తేడా ఏమిటి?” అని కళ్ళెగరేస్తూ అడిగాడు సోమయాజులు.

“భగవంతుని దృష్టిలో అదరూ సమానమే కదండీ. లీల లేకుంటే ఈరోజు మీరు బతికి బట్టకట్టేవారు కాదు” అంది సోమిదేవమ్మ.

“ఏమైంది నాకు, హాస్పిటల్‌ లో చేర్చారు” అని నీరసంగా అడిగాడు సోమయాజులు.

“మిట్ట మధ్యాహ్నం ఇంటికి వస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు మీరు. లీల చూసి చుట్టుపక్కలున్నవారి సాయంతో ఇక్కడకు తీసుకు వచ్చింది. తర్వాత నాకు కబురు పెట్టింది. సకాలంలో రాబట్టి ప్రాణాపాయం తప్పిందని డాక్టరు చెప్పారు” అన్నభార్య మాటలు సోమయాజులకి బాణాల్లా గుచ్చుకున్నాయి. లీల పట్ల తాను అమానుషంగా ప్రవర్తించినా నా ప్రాణాలు కాపాడింది అనుకుంటూ గతం గుర్తుకు తెచ్చుకున్నాడు.

***

వీరాపురం అగ్రహారంలో ప్రసిద్ధ శివాలయం ఉండేది. నిత్యం భక్తుల తాకిడితో ధూపదీప నైవేద్యాలతో నిత్యకల్యాణం పచ్చతోరణంలా ఉండేది శివయ్య వైభోగం.

గుడి ముందర కొన్ని కుటుంబాల వాళ్ళు యాచన చేస్తూ జీవనం సాగించేవారు. వారిలో సోములమ్మ దాని కూతురు లీల ఉన్నారు.

లీలకి చిన్నప్పటి నుండీ దైవభక్తి మెండు. లీల ప్రతీ రోజూ శివుని కోసం పువ్వులు పట్టుకు వచ్చేది.

లీల రాకను గమనించిన సోమయాజులు పరుగు పరుగున గర్భగుడినుంచి బయటకి వచ్చి

“నీకు రోజూ చెప్పలేక చస్తున్నాను. ఎన్ని సార్లు చెప్పాలి నువ్వు తెచ్చిన పూలు ఫూజకి పనికి రావని. నేను మడిగా పువ్వులు తెచ్చుకుంటాలే వెళ్ళు వెళ్ళు” అదిగో ఆ చెట్టు దగ్గర రాయి ఉంది పోయి పూజ చేసుకో” అంటూ కసురుకునేవాడు.

అతని చీదరింపును భరించలేక ఏవగింపును చూడలేక తల్లిదగ్గర మొరపెట్టుకునేది లీల.

కన్నీటి పర్యంతమైన కూతురిని చూడలేక, కోర్కెను తీర్చలేక “పంతులుగోరు సెప్పినట్లు ఆ రాయికి పూజ సేసుకో దేవుడు కాపాడతాడు. ఏం పాపం సేసుకున్నామో ఈజనమకి ఇంతే” అని సముదాయించేది తల్లి.

తల్లి చెప్పినట్లే వేపచెట్టు దగ్గర ఉన్న రాయిని శివుడిగా భావించి రోజూ పూజ చేసేది లీల. గర్భ గుడిలో ఉన్న శివయ్యకు అభిషేకం చేసే రోజుకోసం ఎదురుచూసేది లీల …..

***

కన్నీటి పొరల ఆవల దేదీప్యమానమైన వెలుగు ప్రసరిస్తోంది. కోటి కాంతులతో అమ్మవారి రూపం స్పష్టంగా కనిపిస్తోంది.

సోమయాజులు తదేకంగా ఆమె రూపాన్ని చూస్తూ…”అమ్మా అమ్మా నన్ను క్షమించమ్మా నిరాకారుడైన శివయ్యని రాయిలో చూసుకున్నాను కాని నడయాడే దేవత నా కళ్ళముందున్నా గుర్తించలేని గుడ్డివాడినయ్యాను” అంటూ లీలకి దండం పెట్టాడు .

భర్తలోని ఈ విచిత్ర ప్రవర్తనకి ఆశ్చర్యపోయింది సోమిదేవమ్మ. తనకి బుద్ధి చెప్పడానికి అమ్మవారే లీల రూపంలో వచ్చిందని గ్రహించాడు సోమయాజులు.

ఆరోగ్యం కుదుట పడ్డాక ఆలయానికి వెళ్ళాడు. ఎప్పటిలాగే పువ్వులు తెచ్చి ఇచ్చింది లీల. లీల ఇప్పుడు రోజూ శివునికి అభిషేకం చేస్తోంది. అయితే బయట రాయికి కాదు గర్భగుడిలో శివలింగానికి.

సోమయాజులు పరుగున బయటకి రావడం లేదు. లీలలో అమ్మవారిని చూస్తున్నాడు.

దేవానాం మనుష్య రూపేణ అన్న ఆర్యోక్తిని గ్రహించి. సద్భావంతో యాచకులందరికి చేతనైన సాయం చేస్తున్నాడు. అందరి పట్ల సమభావాన్ని ప్రదర్శిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here