కాజాల్లాంటి బాజాలు-32: ‘దేవుడా! రక్షించు నా దేశాన్ని..’

0
9

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]మా[/dropcap] ఊరు నుంచి పరీక్షలు రాయడానికి మా యింటికి తెలిసున్న వాళ్లబ్బాయి వచ్చాడు. ఓ పదిరోజులుండాలి కదా, అందులోనూ పరీక్షలు కూడా రాయాలీ పాపం అనుకుంటూ అతనికోసం ఒక రూమ్ సెపరేట్‌గా చదువుకుందుకు టేబులూ, కుర్చీతో సహా యేర్పాటు చేసేను.

కానీ అదేమిటో ఆ కుర్రాడు కుదురుగా ఒక్క గంట కూడా కూర్చుని చదవటంలేదు. మాతోపాటు కూర్చుని కబుర్లు, కథలూ చెప్తున్నాడు. అతనికి పరీక్షలు కదా అని మేము టీవీలో న్యూస్ కూడా పెట్టుకోకుండా కూర్చుంటే స్వతంత్రంగా అతనే టీవీ ఆన్ చేసి చూసేస్తున్నాడు. నాకేమీ అర్ధం కాలేదు. ఇలాంటి పరీక్షల టైమ్‌లో స్టూడెంట్స్ యెంత టెన్షన్ పడతారూ? యేమీ లేదే ఈ అబ్బాయికీ అనుకుంటూ.. “బాబూ, ఎగ్జామ్స్‌కి బాగా ప్రిపేర్ అయ్యేవా?” అనడిగాను.

“అయ్యేనాంటీ..” అన్నాడు.

“సిలబస్ మొత్తం కవర్ చేసేవా?” ఏదో పెద్ద బాధ్యత నామీదున్నట్టు అడిగాను.

“సిలబస్సెందుకాంటీ?” అనడిగేడు.

నాకు మతిపోయింది. సిలబస్సు యెందుకంటాడేమిటీ.. నన్ను నేను సద్దుకుని, “నువ్వు మొత్తం ప్రిపేర్ అయ్యేవా?” అనడిగేను.

“అయ్యేనాంటీ. అయిదు ఆన్సర్లూ బాగా బట్టీ పట్టేసేను” అన్నాడు.

“అయిదు ఆన్సర్లేవిటీ?” నాకు అర్ధం కాలేదు.

నా అమాయకత్వానికి పాపం ఆ కుర్రాడు జాలిపడి ”ఎగ్జామ్‌లో అయిదు ఆన్సర్లే రాయాలాంటీ.. అంతకన్న అక్కర్లేదు” అన్నాడు.

అవున్నిజమే.. కానీ వాళ్ళు యే అయిదు ప్రశ్నలిస్తారో తెలీదు కదా! అందుకని సిలబస్ యేవిటో చూసుకుని చదవాలి కదా! అ మాటే ఆ అబ్బాయిని అడిగితే “అక్కర్లేదాంటీ.. వాళ్ళేమడిగినా నేను యివే రాసేస్తాను. అక్కడ ఆన్సర్లుంటే చాలు..” అన్నాడు.

కాసేపటికి కానీ నాకు అర్ధం కాలేదు. పరీక్ష పేపర్లో యే ప్రశ్న వున్నా సరే ఈ కుర్రాడి జవాబులు మటుకు ఈ అయిదే అని. అంటే పరీక్షలో మన రాజ్యాంగం యెప్పుడు, యెవరు, యెలా చేసేరు అనడిగితే ఈ కుర్రాడు “అశోకుడు రోడ్డు కిరుప్రక్కలా చెట్లు నాటించెను..” అని యితను బట్టీ పట్టిన జవాబే రాస్తాడన్న మాట.

తెల్లబోతున్న నన్ను చూసి ఆ అబ్బాయి ‘నేనీ అయిదేనా చదివేనాంటీ, మా ఫ్రెండొకడు ఆ అయిదు ప్రశ్నలూ మటుకు ఎందుకు చదవడం అనుకుని అయిదు ప్రశ్నలకీ జవాబులుగా ఒక్కోదానికీ రామాయణం, భారతం, లేకపోతే వాడికి తెలిసిన చందమామ కథలూ రాసేస్తాడు’ అన్నాడు.

ఈసారి అవాక్కయ్యేను. నా రియాక్షన్ చూసి ఆ అబ్బాయి ఇంకా ఉత్సాహపడిపోయి, ‘ఆంటీ, మీకు తెలుసా! కొంతమంది అలా కష్టపడి కథలు రాయడం కూడా ఎందుకని క్వశ్చన్ పేపర్‌నే మొత్తం పేజీలకి పేజీలు కాపీ చేసేస్తారు’ అన్నాడు. ఈ మాటలు విని కుర్చీలో కూలబడిపోయేను.

నా భంగిమలు చూసి ఖంగారు పడ్దాడో యేమో కానీ ఆ అబ్బాయి  నన్ను సమాధానపరచడానికా అన్నట్టు నాకు తెలీని ఇంకో విషయం చెప్పి నన్ను కాపాడేడు.

‘మీకు తెలీదా ఆంటీ, ఈ పేపర్లు దిద్దేవాళ్ళు కూడా స్టూడెంట్స్ ఏం రాసారో చూస్తారనుకుంటున్నారా.. అబ్బే, పేజీల్లెక్కెట్టి మార్కులేసేస్తారు. అందుకే క్వశ్చన్ పేపరే పేజీలకి పేజీలు కాపీ చేసేస్తుంటారు’ అన్నాడు.

మరింక భంగిమలు మార్చలేక ‘దేవుడా! రక్షించు నా దేశాన్ని..’ అనుకుంటూ కళ్ళు మూసుకున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here