దేవుడి దయ

41
11

[dropcap]ఉ[/dropcap]దయం 8 గంటలయింది. హాల్లో సోఫాలో కూర్చుని దినపత్రికను తిరగేస్తున్నాడు సుబ్బరామయ్య. వంటగదిలో అల్పాహారం తయారు చేస్తుంది సీతారావమ్మ. ఆ దంపతులిద్దరూ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులుగా ఉద్యోగ విరమణ చేసిన తరువాత హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు. పిల్లలిద్దరూ బాగా చదువుకుని, మంచి ఉద్యోగాలు సంపాదించి, పెండ్లిళ్లు చేసుకుని, పిల్లాపాపలతో, ప్రస్తుతం బెంగుళూరులో ఒకరు, చెన్నైలో మరొకరు ఉంటున్నారు.

“ఈ వృద్ధాప్యంలో మీరిద్దరే ఇక్కడెందుకు ఉండటం… మా దగ్గరికొచ్చి వుండొచ్చుకదా!”… అంటుంటారు పిల్లలు.

“అవసాన దశలో ఎటూ మీ దగ్గర వుండాల్సిన వాళ్లమేకదా! ఇప్పటి నుంచే మీకెందుకులే మా భారం!” అంటుంది సీతారావమ్మ.

“మీ అమ్మ చెప్పింది నిజమే కదా! అయినా ఇప్పటికిప్పుడు మీ దగ్గరికొచ్చి, మీ స్వేచ్ఛను హరించడం, అలాగే మా స్వేచ్ఛను కోల్పోవడం మాకిష్టం లేదు. మరి కొంత కాలం ఇలానే వుండనివ్వండి!”… అంటాడు సుబ్బరామయ్య.

అప్పుడే కాలింగ్ బెల్ మోగింది.

“ఏవండీ! చెయ్యి ఖాళీగా లేదు. కనకమ్మ వచ్చినట్లుంది. కాస్త తలుపు తీయండి!”.. అంది సీతారావమ్మ. సుబ్బరామయ్య తలుపు తీయగానే, ఇంట్లోకి వచ్చిన కనకమ్మ, చీపురు తీసుకుని, ఇల్లు ఊడవడం మొదలెట్టింది.

దగ్గరలోని బస్తీలో ఉండే కనకమ్మ, ప్రతిరోజూ ఉదయం ఓ గంటన్నర సేపు ఈ ఇంట్లో పని చేస్తుంది. కనకమ్మతో పాటు భర్త, ఇద్దరు పిల్లలు, అత్త వుంటారు.

“కనకమ్మ! ఏంటి అదోలావున్నావ్? నువ్వు ఇంట్లోకి వచ్చేప్పుడు ఏడుస్తూ కళ్ళనీళ్ళు తుడుచుకోవడం, నేను గమనించాన్లే! అసలేమయింది? ఎందుకలా బాధపడుతున్నావ్?”… అడిగింది సీతారావమ్మ.

“అబ్బే! ఏం లేదమ్మా! ఏం లేదు!”

“అది కాదులే! నీ గురించి నేనెప్పుడూ ఏమీ అడగలేదు! ఇప్పుడడుగుతున్నాను చెప్పు!”

“ఎందుకు లేమ్మా! నా కష్టాలు, బాధలు మీకు చెప్పి మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టడం నాకిష్టం లేదమ్మా!”

“చూడు కనకమ్మా! మీ అమ్మలాంటిదాన్ని, నేనడిగినా చెప్పవా?”

ఆ మాటలు విన్న కనకమ్మకు, ఎప్పుడో తన చిన్నతనాన తనువు చాలించిన తల్లి గుర్తుకొచ్చి, భావోద్వేగానికి లోనై కంటతడిపెట్టింది. కాసేపట్లో తమాయించుకుని పనులు చేసుకుంటూనే చెప్పడం మొదలు పెట్టింది.

“అమ్మా అలాగే చెప్తానమ్మా!… మా ఇంటి విషయానికొస్తే… ముందుగా మా అత్త! మా మామ కాలం చేసినప్పటి నుంచి మాతోనే వుంటుంది. ప్రొద్దున లేచిన దగ్గర నుంచి, నన్ను ఆడిపోసుకుంటూ వేధిస్తూనే వుంటుంది. ఏదో పెద్దమనిషి కదా అని అన్నిటికి నేనే సర్దుకుంటాను!

ఇక నా ఇద్దరు పిల్లలు… అల్లరల్లరి చేస్తుంటారు! వాళ్లని అదుపులో పెట్టడానికి నానా తంటాలు పడుతుంటాను! ఎంతైనా నా కన్న బిడ్డలు కదమ్మా! సరిపెట్టుకుంటాను.

“ఇక నా మొగుడు! అదేదో కంపినీలో పని చేస్తున్నాడు! ఏ రోజుకారోజు ఐదువందల రూపాయలు జీతంగా ఇస్తారు! మొదట్లో బాగానే వుండేవాడు… తరవాత తరవాత, చెడు స్నేహాలు మరిగి, దుర్వ్యసనాలకు లోనయ్యాడు! జీతంలో రోజూ మూడు నాలుగొందలు ఖర్చు చేస్తూ, ఇంటికో వందో రెండొందలు ఇవ్వడం మొదలెట్టాడు!
రోజు రోజుకీ ఇల్లు గడవడం కనాకష్టమైపోయింది!

అప్పుడే నేనన్నాను… ‘నాలుగిళ్ళలో పాచి పని చేసి కొద్దోగొప్పో డబ్బు సంపాదించి ఇల్లు నడిపిస్తాను’ అని. అందుకు వాడేమన్నాడో తెలుసా అమ్మా! ‘నా భార్య ఇంకొకళ్లింట్లో పని చేయడమా? నేను ఒప్పుకోనే ఒప్పుకోను!’  అన్నాడు. అంత ప్రేమమ్మా వాడికి నా మీద.

రోజులు గడిచే కొద్దీ, వాడిలో చాలా మార్పు వచ్చింది. నన్ను తిట్టడం, కొట్టడం మొదలు పెట్టాడు. అయినా, పల్లెత్తు మాట కూడా అనకుండా పడుండేదాన్ని… ఎంతైనా వాడు నా భర్త కదమ్మా! వాడికి నా మీద సర్వహక్కులూ వుంటాయి! అయినా, వాడు తప్ప నన్నెవరైనా తిడతారా, కొడతారా! ఎవరైనా నన్ను ఓ మాట అంటే కస్సున లేస్తాడు. ఇక నన్నెవరైనా కొడితేనా… చంపేస్తాడంతే!… అంత ప్రేమమ్మ వాడికి నా మీద…” అంటూ ముసి ముసిగా నవ్వుకుంది కనకమ్మ.

“మరి ఇంత జరుగుతుంటే, ఇది తప్పని చెప్పి కొడుకుని వారించదా… మీ అత్త!”

“ఇంకా నయం… మండే పొయ్యిలో కట్టెలు ఎగదోసినట్లు, లేనిపోని మాటలు కలేసి చెప్తుంది! దాంతో, వాడింకా రెచ్చిపోతాడు! ఇదమ్మా… నా కుటుంబ పరిస్థితి!” అంటూ కళ్లొత్తుకుంది కనకమ్మ.

“వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది! ఎలా తట్టుకోగలుగుతున్నావ్! కనకమ్మా!”

“ఏం చెప్పనమ్మా! మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు, ఇప్పటి పరిస్థితి మరీ గడ్డుగా తయారైంది. నా మొగుడు ఆనారోగ్యం పాలై మంచాన పడ్డాడు! పని కెళ్ళలేకపోతున్నాడు! ఇక కుటుంబ పోషణ భారమంతా నాపై బడింది… నాలుగిళ్ళలో పాచి పని చేయడం నాకు తప్పలేదు! కాని వాడు మాత్రం నేనలా పనులుకెళ్తుంటే, చూస్తూ ఏమి చేయలేక వాడిలో వాడే కుమిలి పోతాడమ్మా! అంత ప్రేమమ్మా వాడికి నామీద!”

“ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా, వాడికి నీ పై వున్న ప్రేమ మీద నీకెంత నమ్మకం కనకమ్మా! ఇదే స్త్రీమూర్తికే స్వంతమైన ప్రేమతత్వం అంటే!” అంటూ కనకమ్మను మెచ్చుకుంది సీతారావమ్మ.

“ఇప్పుడు మరో చిక్కొచ్చిపడిందిమ్మా!”

“మరో చిక్కా! అదేంటి కనకమ్మా!”

“ఇప్పుడు నా పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లైంది! నిజానికి బీదవారింట్లో పుట్టాలని, పనిమనుషులుగా బ్రతకాలని ఎవరైనా కోరుకుంటారా… అమ్మా! మా పూర్వ జన్మల పాపకర్మలను బట్టి, ఆ దేవుడు మా తలరాతలను ఇలా రాస్తాడు ! నలుగురూ అనుకుంటుంటారు… మేమేదో నాలుగు డబ్బులు వెనకేసుకోడానికి, నాలుగిళ్ళలో పని చేస్తామని… కాని మేము పని చేసేది మా ఆకలిదప్పులు తీర్చుకోడానికి మాత్రమే కదమ్మా!

వాస్తవానికి చాలా మందికి తెలియని మరో విషయం ఉందమ్మా!”

“ఏంటా విషయం కనకమ్మా?”

“కష్టమైనా, శ్రమైనా నాలుగిళ్ళలో పనులు చేసుకుంటూ, మా ఇంట్లో వుండే భయంకర వాతావరణాన్ని మరిచిపోయి, కొంతలో కొంతైనా ప్రశాంతత దొరుకుతుందనే ఆశ పడి పనులు చేస్తుంటాము! కాని, ఆ కాస్తంత ప్రశాంతతను కూడా మాకు దక్కనివ్వరమ్మా కొంతమంది తల్లులు!

ఎప్పుడైనా పనికి కొంచెం ఆలస్యంగా వెళితే, ‘ఏంటి ఆలస్యంగా వచ్చావ్? ఇలాగైతే మా ఇంట్లో పని మానెయ్!’ అని భయపెడుతుంది ఒకమ్మ.

‘ఏంటా వూడవడం? ఎక్కడ కసువు అక్కడే వుంటుంది!’ అని కసురుకుంటుంది ఇంకో అమ్మ.

‘ఏంటి… అంట్లు తోవడం ఇలాగేనా? పాచి వదలట్లేదు… కాస్త చూసుకుంటూ తోము!’ అని ఈసడించుకుంటుంది మరో అమ్మ.

ఇంట్లోవి చాలదన్నట్లు, ఇక్కడ కూడా ఛీత్కారాలు, చీదరింపులు! కాస్తంత ప్రశాంతత కోరుకునే, నా ఆశలు అడియాశలుగా మిగిలిపోతున్నాయ్!… అంతా నా ఖర్మ!” అంటూ తలబాదుకుంటూ బావురుమంది కనకమ్మ.

“చూడు కనకమ్మా! రాత్రి తరువాత పగలు వస్తుంది… చీకటి తరువాత వెలుతురు వస్తుంది. అలాగే నీ కష్టాలు కలకాలం వుండవులే! నీ ఓర్పే నీకు ధైర్యం! నీ సహనమే నీకు శ్రీరామరక్ష! తర్వరలో నీకూ మంచి రోజులు వస్తాయిలే!” అంటూ కనకమ్మను ఓదార్చింది సీతారావమ్మ.

“ఏమోనమ్మా! మీ నోటి మాటల చలవ వల్ల, ఆ దేవుడి దయ వల్ల నా మొగుడి సుస్తీలన్నీనయమై, వాడు మళ్ళా పనిలోకి వెళ్తే, నా కష్టాలు తప్పుతాయమ్మా!”

“అలా జరగాలని ఆ దేవుడ్ని ప్రార్థించు… నేనూ నా తరుపున నీ కోసం ఆ దేవుడ్ని ప్రార్థిస్తాను! సరేనా! ధైర్యంగా వుండు!”

“అలాగేనమ్మా! వెళ్లొస్తానమ్మా!”

“వెళ్ళిరా!”

***

కాలచక్రం గిర్రున తిరిగింది

***

ఆరోజు ఉదయం, సంతోషంగా పనిలోకి వచ్చిన కనకమ్మను చూసి…

“ఏంటి కనకమ్మా? ఈ రోజు చాలా సంతోషంగా వున్నావు! ఏంటి విషయం!”… కుతూహలంగా అడిగింది సీతారావమ్మ.

“అవునమ్మా! సంతోషమే! మీరూ నేనూ చేసిన ప్రార్థనలను ఆ దేవుడు విన్నాడమ్మా! విని కరుణించాడమ్మా!” ఆనందంతో చెప్పింది కనకమ్మ.

“పోనీలే! నీ కష్టాలు గట్టెక్కాయ్! అంతే చాలు!” తన సంతోషాన్ని వెలిబుచ్చింది సీతారావమ్మ.

“మీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేనమ్మా!” కృతజ్ఞతా పూర్వకంగా చెప్పింది కనకమ్మ.

“నాదేముందిలే కనకమ్మ! అంతా ఆ ‘దేవుడి దయ!’ ” అంది సీతారావమ్మ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here