దేవుని సొంత దేశం కేరళ యాత్రానుభవాలు-4

1
8

[2022 సెప్టెంబరు నెలలో కేరళ రాష్ట్రంలో పర్యటించి, ఆ అనుభూతులను పాఠకులతో పంచుకుంటున్నారు శ్రీ పాణ్యం దత్తశర్మ.]

[dropcap]ఉ[/dropcap]దయాన ఆరు గంటలకే పెరియార్ డ్యాం సైట్‍కి చేరుకున్నాము. కార్లకు లోపలికి అనుమతి లేదు. కెటిడిసి (కేరళ టూరిజం డెవలప్‍మెంట్ కార్పోరేషన్) వారి బస్సులున్నాయి. రానుపోను ఒక్కో వ్యక్తికి 65 రూపాయలు మాత్రమే. బస్సులు చాలా అందంగా ఉన్నాయి. ప్రయివేటు జీపులు కూడా ఉన్నాయి. వాడు మూడువేలు అడిగాడు! గవర్నమెంటుకు, ప్రయివేటుకు ఎంత తేడా చూడండి! ప్రయివేటైజేషన్‍కే మొగ్గు చూపుతాయి. సేవ కంటే లాభం ముద్దు మరి!

దట్టమైన అడవిలో దాదాపు పదిహేను నిమిషాలు ప్రయాణించి, బస్సు మమ్మల్ని డ్యాం సైట్‍కు చేర్చింది. పెరియార్ లేక్ కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. చుట్టూ పచ్చటి కొండలు, చెట్లు. మధ్యలో ‘forest stay’ కోసం గెస్ట్ హౌస్‌లు! సరస్సులో బోటింగ్ కోసం టికెట్లు తీసుకున్నాం. ఒక్కొక్కరికి 250/-. పెద్ద పెద్ద పడవలున్నాయి తీరంలో లంగరు వేసుకుని. మాకు ‘జలజ్యోతి’ అనే పడవలో సీట్లు వచ్చాయి. లోయర్, అప్పర్ డెక్‍లు ఉన్నాయి. మాకు అప్పర్ డెక్‍లో ముందు బాగానే సీట్లు వచ్చాయి. రెండు డెక్ లలో కలిపి దాదాపు వందమంది టూరిస్టులకి పైగానే ఉన్నారు.

ఆ బోటింగ్ ఎక్స్‌పీరియన్స్ అపూర్వం. ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది వరకు గంటన్నర సరస్సులో విహరించాము. చల్లని గాలి మేనిని తాకుతూ పరవశింపజేస్తూంది. సూర్యుడు తన నులి వెచ్చని కిరణాలతో మమ్మల్ని పరామర్శిస్తున్నాడు. సరస్సు లోతు 72 అడుగుల వరకు ఉంటుందని, మధ్యలో పాతిన ఇండికేటర్స్ సూచిస్తున్నాయి. నీరు స్వచ్ఛంగా, లేత నీలం రంగులో ఉంది. చిన్న చిన్న అలలు బోటు వేగానికి ఏర్పడి, నీలం చీరను సరస్సు అనే స్త్రీ కట్టుకుంటే, దాని మీద ఏర్పడిన డిజైనర్ చారల్లా ఉన్నాయి అలలు.

చుట్టూ ఉన్న అడవిని ఫొటోలు తీశాము. అనంతమైన ఆ జలరాశిని వీడియో తీశాము. సరస్సు ఏకాండంగా లేదు. మలుపులు తిరుగుతూ ఉంది. ప్రతి మలుపూ ఒక కులుకుగా బోట్ ప్రయాణిస్తూంది. కేరళ టూర్ అంతటికీ ఈ పెరియార్ లేక్ లోని బోటింగ్ అనుభవం తలమానికంగా నిలిచింది.

తొమ్మిదిన్నరకు రిసార్టు వారి రెస్టారెంటుకు చేరుకున్నాము. ఆకలి కరకరలాడుతూంది! మొదట ‘ఇడియాప్పం’ అనే కేరళ వంటకం తెచ్చిపెట్టాడు. అది తెల్లని సేమ్యా లేక నూడుల్స్ పోగులను, జంతికల కుప్పగా పిండి, ఆవిరిలో ఉడికించినట్లుంది. దానికే రుచీ లేదు! పోనీ ‘పచి’ ఉందా అంటే అదీ లేదు! కొంచెం తిని ముఖాలు చిట్లించాము. తర్వాత నేతితో వేసిన దోసె తెప్పించాము. అది అద్భుతంగా ఉంది. తర్వాత పొంగల్ తిన్నాము. అది ఓకే. ఏదైనా ఫ్రీగా వచ్చేది అంత రుచిగా ఉండదేమో!

రూమ్‍కి వెళ్ళి, 11 గంటలకు చెక్ అవుట్ చేశాము. అక్కడి నుంచి మా కారు అలెప్పీ వైపుకు ప్రయాణం సాగించింది. మర్నాడే మా తిరుగు ప్రయాణం. అలెప్పీని ‘అలప్పూజా’ అని పేరు మార్చినట్లున్నారు. ‘గుల్బర్గా’ను ‘కలబురగి’ అనీ, ‘అలహాబాద్’ను ‘ప్రయాగ్‍రాజ్’ అనీ, మద్రాసును ‘చెన్నై’ అనీ – ఇలా పేర్లు మారుస్తారు ఎందుకో! ‘What is in a name?’ అన్నాడు విలియమ్ షేక్‍స్పియర్. దానిని గురజాడ వారు ‘పేరులోన నేమి పెన్నిధి యున్నది?’ అని గిరీశం చేత తెలుగులో చెప్పించారు. ‘అవ్వ పేరే ముసలమ్మ’!

అలప్పూజా దాదాపు 170 కిలోమీటర్లు ఉంటుందని చెప్పాడు మా సురేష్. దారిలో ‘సెయింట్ ఫ్రాన్సిస్ క్యాథడ్రల్’ అనే పెద్ద చర్చిని చూశాము.

లోపల ప్రార్థన చేసే హాలు, దాని పై కప్పు, దేవుడు నిలబడిన వేదిక (altar) అత్యంత కళాత్మకంగా, అందమైన డోమ్ లతో నిర్మించారు.

చర్చి భవనం పూర్తిగా రాతి కట్టడం. చాల గ్రాండ్‌గా, గోపురాలతో, సమున్నతంగా నిలబడింది. అక్కడా ఫొటోలు తీశాము. ఈ సందర్భంలో నాకు ‘Art has no religion!’ అని అనిపించింది. ఆ మాటే మా యోగాతో అంటే, “అంతే రా” అన్నాడు వాడు.

దారిలో ‘వలంజగనం’ అన్న చోట రోడ్డుని ఆనుకొనే, పెద్ద జలపాతం, ఎత్తయిన కొండల నుండి దుముకుతూంది. అక్కడ విశేషం ఏమిటంటే, క్రిందకి, అంటే జలపాతం క్రింద పడే చోటు వరకు మెట్లున్నాయి. మనం వెళ్ళి ఉధృతంగా పడుతున్న నీటిధారకు కేవలం మూడడుగుల దూరంలో నిలబడి చూడవచ్చు. కాని అక్కడంతా నేల నాచు పట్టి ఉంది. రెయిలింగ్ పట్టుకొని, జాగ్రత్తగా నిలబడాలి. నిమిషం నిలబడేసరికి జలపాతం తుంపరలు మమ్మల్ని సుమారుగా తడిపేశాయి, సాయంత్రం 4.30కి అలెప్పీ, అదే అలప్పూజా చేరుకున్నాము.

***

అలెప్పీకి 50 కిలోమీటర్ల నుంచి రోడ్డు ఘోరంగా ఉంది. చాలా పొడవైన ఫ్లై ఓవర్లు నిర్మాణంలో ఉండి, సైడ్‍కు చిన్న రోడ్డు. వేలాది వాహనాలు. ఒళ్ళు హూనమయింది.

అలెప్పీలో ప్రత్యేక ఆకర్షణ హౌస్ బోట్స్ అని ఊదరగొట్టారు. వాటిలోనే డైనింగ్ రూమ్, బెడ్ రూమ్, బాత్ రూమ్ వసతులు ఉంటాయనీ, అవి సముద్రపు బ్యాక్ వాటర్స్ లో ప్రయాణిస్తూ ఉంటాయనీ, తిండీ తిప్పలూ దాంట్లోనేననీ, భారతదేశంలో, కాశ్మీరు తర్వాత హౌస్ బోట్స్ ఉండేది ఇక్కడేనని..

మేము బ్యాక్ వాటర్స్ దగ్గరకి వెళ్ళి కొన్ని హౌస్ బోట్లను చూశాము. ఒక దాంట్లో ఎక్కి లోపల కూడా చూశాము. వాటి బోర్డింగ్ పాయింట్ అంతా చెత్తగా, గలీజుగా ఉంది. అవి కూడా పాత కాలంవి. పైన కప్పుకు వెదురు తడకలు వేసి బిగించారు. బోటు ముందున్న స్థలంలో డైనింగ్ టేబుల్, నాలుగు కుర్చీలు వేశారు. బ్యాక్ వాటర్స్ నిలవ ఉండి, అపరిశుభ్రంగా, నల్లగా ఉన్నాయి. ఆ ప్రాంతమంతా నీచు వాసన. ఇంకా అలెప్పీ సిటీలో అయితే మెయిన్ రోడ్ పక్కనే కనీసం 30 అడుగులైనా వెడల్పు లేని బ్యాక్ వాటర్స్, ఒక పెద్ద కాలువలా ఉండి, దాంట్లో డజన్ల కొద్దీ చిన్నా పెద్దా ఇళ్ళ పడవలు (అదేనందీ హౌస్ బోట్స్) తిరుగుతున్నాయి. అక్కడా నీచు వాసనే.

దాంట్లో బస చేయడానికి పన్నెండు గంటలకు ఎనిమిది వేల వరకూ ఛార్జ్ చేస్తారని, అది ప్యాకేజ్‌కు అదనమని మొదట్లో టూర్ మేనేజర్ ‘జిజో’ చెప్పగా, అనవసరం, వద్దు, మామూలుగా రిసార్టు బుక్ చేయమని చెప్పాను. మనసులో ఏ మూలో హౌస్ బోటులో బస చేయలేకపోయామే అని ఉన్న మథనం, వాటి పరిస్థితిని ప్రత్యక్షంగా చూసిన తర్వాత, పోయింది!

అక్కడ నుంచి అలప్పూజా బీచ్‍కు వెళ్ళాము. అక్కడ, అలలకు సమీపంగా కొంత మేర తప్ప, అసలు ఇసుకే లేదు. అంత గొప్ప బీచ్ ఏమీ కాదది. లైట్ హౌస్ మాత్రం బావుంది. సమున్నతంగా! దానికీ ఎర్ర రంగు వేశారు. కమ్యూనిస్టు అమరవీరుల స్థూపానికి వేసినట్లు! దాని ఫొటో తీశాము. కొంతమంది దాని మీదకి ఎక్కి, రెయిలింగ్ పట్టుకుని నిలబడి ఉన్నారు. దాదాపు మూడు వందల అడుగులకు పైగా ఎత్తు ఉంది. కౌంటర్‍లో ఉన్న అతన్ని ఇంగ్లీషులో అడిగాను – “లైట్ హౌస్ లోపల లిఫ్ట్ ఉందా?” అని. ఉంటే మేమూ పైకి వెళ్ళచ్చు కదా అని! అతడు విచిత్రంగా చూశాడు. అంటే లేదని. అంత పైకి మెట్లెక్కి పోయేంత స్టామినా మాకెక్కడిది?

7 గంటలకు ‘లేక్ గార్డెన్ రిసార్ట్’ చేరుకొన్నాము. ఊరికి దూరంగా ప్రశాంతంగా ఉంది. బిల్డింగ్ మధ్యలో స్విమ్మింగ్ పూల్ ఉంది. నీళ్ళు లేత నీలం రంగులో స్వచ్ఛంగా ఉన్నాయి. ఒక చివర ఫిల్టర్ పని చేస్తోంది. స్విమ్మింగ్ పూల్ స్నానాలు చేశాము. బీచ్ ఉన్న ఊళ్ళల్లో విపరీతమైన ఉక్కపోత ఉంటుంది. Humidity ఎక్కువ. ఒళ్ళంతా చిరచిరలాడుతుంటే వేడి నీళ్ళతో హాయిగా స్నానాలు చేసి సేద తీరాము. తొమ్మిది గంటలకు మా పార్థసారథి వచ్చాడు.

మెయిన్ రోడ్‍లో బ్యాక్ వాటర్స్ దగ్గరే ఒక వెజ్ రెస్టారెంట్ ఉందనీ, డిన్నర్ అక్కడ చేయండనీ చెబితే, అక్కడ నీచు వాసన బాబూ, మరెక్కడికైనా తీసుకువెళ్ళమని అన్నాము. “అయితే రాజస్థాన్ వారి రెస్టారెంట్ మంచిది ఉంది, పదండి” అన్నాడు. దాని పేరు ‘జైసల్మేర్ రాజస్థానీ ఖానా’.

థాలీ (భోజనం) ఆర్డరిచ్చాము. అది 240/- రూపాయలు. రెండు మెత్తని రోటీలు, దాల్ తడ్కా, క్యాప్సికం మసాలా, నిప్పుల మీద కాల్చిన అప్పడం, రసానికీ సాంబార్‍కీ చెందని ఒక ద్రవ పదార్థం, ఒక కప్పు అన్నం. పెరుగు మాత్రం ఒక మట్టి కప్పుతో బాగానే యిచ్చాడు. నిమ్మకాయ ఊరగాయ. మొత్తానికి బాగానే అనిపించింది. మర్చిపోయాను రాజ్‍మా మసాలా కూడా.

మర్నాడే మా తిరుగు ప్రయాణం. ఎర్నాకుళం నుంచి. అదే కొచ్చి, కొచ్చిన్. అలెప్పీ నుంఛి 67 కిలోమీటర్లు ఉంటుంది. అది ఫోర్ లేన్స్ హైవే. గంటంపావులో వెళ్ళిపోవచ్చట. కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఎనిమిదిన్నర తర్వాతేనట. మా ట్రెయిన్ 11.20కి. ఏడు గంటల కల్లా చెక్ అవుట్ చేసి, బయలుదేరాం. నా సలహా ఏమంటే అలెప్పీ టూర్‍లో స్కిప్ చేయడం మంచిది. దాని బదులు కొచ్చిన్‍లో ఫుల్‍ డే ఉండటం మేలు. అది పెద్ద సిటీ.

దారిలో ‘ఆర్యాస్’ అన్న పెద్ద హైవే రెస్టారెంట్ దగ్గర ఆపాడు. కిటకిటలాడుతోంది టూరిస్టులతో. మెనూ చూశాము.

“ఇడ్లీ వేడిగా ఉందా?” అని అడిగితే, “లేదు చల్లగా ఉంది” అని చెప్పాడు. అతని నిజాయితీకి మాకు ముచ్చటేసింది. “వేడిగా పూరీ, ఉప్మా ఉన్నాయి. దోసెలన్నీ  వేడివే” అన్నాడు. పూరీ ఉప్మా తెప్పించుకున్నాము. పూరీ ఉప్మా కాంబినేషన్ ఉత్తరాంధ్రలో ఫేమస్. వాళ్ళు ఉప్మా లేకుండా అసలు పూరీ తినరు. పెసరట్టు ఉప్మా కాంబినేషన్ కూడా గోదావరి జిల్లాల వారిదే. మన హైదరాబాదులో అన్నీ దొరుకుతాయి. కాని పెద్ద రెస్టారెంట్లలో బాగుండవు. ధరలు కూడా ఎక్కువ. రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లలోనే వాటి మజా వస్తుంది. ఏమిటో మా తరం వారివన్నీ ఇలాంటి బుద్దులే. ఫిల్టర్ కాఫీ తాగాము. అద్భుతంగా ఉంది.

తొమ్మిదిన్నర లోపే కొచ్చి చేరుకున్నాము. అక్కడ రెండు రైల్వే స్టేషన్లు. ఎర్నాకుళం జంక్షన్, ఎర్నాకుళం టౌన్. “మీరు ఎక్కడ ఎక్కుతారు?” అని అడిగాడు సురేష్. ఫోన్‍లో టికెట్ చూసి “టౌన్” అని చెప్పాం.

“టైముంది సార్, మిమ్మల్ని ఒక గొప్ప మ్యూజియంకు తీసుకెళ్ళమంటారా?” అన్నాడు.

“అవశ్యం చిరంజీవీ!”

‘కేరళ కల్చరల్ మ్యూజియం’ అది. అద్భుతంగా ఉంది. ఎన్నో కళాఖండాలు, విగ్రహాలు, పురాతన పాత్రలు, ఆయుధాలు – మూడంతస్తులలో ఉన్నాయి. టికెట్ వంద. టైం లేదు. గబగబా తిరుగుతూ, వీడియో తీస్తూ అన్నీ చూశాము. మన సాలార్‍జంగ్ మ్యూజియంతో పోలిస్తే ఇదెంత? కానీ మనం వెళ్ళం కదా! ‘పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు!’.

పదింబావు. కొంచెం షాపింగ్ చేద్దాం అనిపించింది. కేరళలో ఫేమస్ అరటికాయ చిప్స్. రకరకాల ఫ్లేవర్స్‌లో రాశులు పోసి అమ్ముతున్నారు – ప్లెయిన్, కాలీమిర్చీ, రెడ్ చిల్లీ.. ఇలా. కిలో పాకెట్లు తలా మూడు కొన్నాము. కేరళ హ్యాండ్‌లూమ్స్ కూడా ఫేమస్సే. వెయ్యి నుండి 25వేల వరకూ.. భార్యలకు (అపార్థం చేసుకోకండి, ఇద్దరం కదా), కోడళ్ళకు, కూతుళ్ళకు చీరలు, డ్రెస్ మెటీరియల్స్; కొడుకులకు, అల్లుళ్ళకు కుర్తా పైజామాలు (కేరళ స్టైల్); మనుమలకు, మనుమరాళ్ళకు కేరళ సంప్రదాయ డ్రెస్‍లు కొన్నాము. చాకొలెట్ ఫ్యాక్టరీ ఔట్‍లెట్‌లో ఫ్రెష్ చాకొలెట్లు తీసుకున్నాము. మేమీమీ తీసుకోలేదు! కుటుంబాల కోసం కొవ్వొత్తుల్లా కాలిపోవడం మాకిష్టం (ఏమిటీ? ఓవరాక్షన్ చాలు, అంటున్నారా? సరే సరే!).

డ్రైవర్‍కు రెండేళ్ళ పాప ఉందట. తన పేరు నందిని కుట్టి. తనకి ఒక డ్రెస్ కొని ఇచ్చాము. చాలా సంతోషించాడు. స్టేషన్ దగ్గర దింపి, లగేజ్ ప్లాట్‌ఫారమ్ మీద పెట్టాడు. తన సర్వీస్ గురించి రెండు నిమిషాలు వీడియో ఇవ్వమని ఇంగ్లీషులో అడిగాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పడానికేం? బంగారం లాంటి కుర్రాడు. అదే చెపాను. ఐదు వందలు చేతిలో పెట్టాను. వంగి, మా ఇద్దరికీ కాళ్ళకు దండం పెట్టాడు. అతన్ని గుండెలకు హత్తుకున్నాము. అతను వెళ్ళిపోతుంటే ఎందుకో దిగులుగా అనిపించింది.

‘జననాంతర సౌహృదాని’ అన్నాడు కదా కాళిదాస మహాకవి!

త్రివేండ్రం-సికింద్రాబాద్ శబరి ఎక్స్‌ప్రెస్ పది నిమిషాలు లేటుగా 11.30కి వచ్చింది. మా కంపార్టుమెంటులోకి ఎక్కి, బ్యాగులన్నీ సీట్ల క్రిమ్ద సర్దుకొని, విశ్రాంతిగా కూర్చున్నాము. ఇంటికి వెళుతున్నామన్న భావన! భగవంతుని దయ వల్ల ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా ట్రిప్ సజావుగా జరిగిపోయిందన్న నిశ్చింత! దేవుని సొంత దేశమా మరొకటా?

మర్నాడు మధ్యాహ్నం 12.40కి సికింద్రాబాద్ చేరింది. రైట్ టైం. ఊబర్ క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళాము. మా యోగానంద్ రాత్రి బస్సుకే వాడుండే ‘ఆదోని’కి వెళ్ళిపోయాడు. హ్యాపీస్!

(అయిపోయింది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here