దేవునితో కాంట్రాక్ట్

0
10

[శ్రీ రాజేష్ కుమార్ పొన్నాడ రాసిన ‘దేవునితో కాంట్రాక్ట్’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఉ[/dropcap]దయాన్నే అయిదింటికి సెల్ ఫోన్లో అలారం మ్రోగడంతో బద్ధకంగా నిద్ర లేచాడు మూర్తి. కాలకృత్యాలు తీర్చుకుని మార్నింగ్ వాకింగ్‌కి బయలుదేరాడు. మూర్తి వరంగల్‌లో ఒక బ్యాంకులో ఆఫీసరుగా పనిచేస్తున్నాడు. గుణవతి అయిన భార్య, మంచి జీతం, మంచి జీవితం. ఒక్కగానొక్క కూతురు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. మార్నింగ్ వాక్‌కి తన ఇంటికి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హైస్కూల్ గ్రౌండుకి వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు. అలా ఆ రోజు కూడా మూర్తి హైస్కూల్ గ్రౌండుకి చేరాడు. మూర్తితో పాటు బ్యాంకులో పనిచేసే రమణ కూడా అదే గ్రౌండ్‌లో మార్నింగ్ వాకింగ్‌కి వస్తుంటాడు. ఇద్దరూ కలిసి రోజులాగే ఆ రోజు కూడా గ్రౌండ్ మొత్తం అయిదు రౌండ్లు నడిచారు. రాగి జావ కొనుక్కుని తాగుతూ ఇద్దరూ రిలాక్స్ అవసాగారు. ఇంతలో రమణ “సార్! ఈ సారి మీకు ప్రమోషన్ తప్పకుండా వస్తుంది” అంటూ అభినందన పూర్వకంగా చూసాడు. మూర్తి నవ్వుతూ “ఏదో మీ అభిమానం రమణ గారు. అయినా ఇదే నాకు చివరి అవకాశం. ఇంతకుముందు నేను అప్లై చేసిన ప్రతిసారీ మీలాంటి సాటి ఉద్యోగ మిత్రులు కూడా ఇలానే అనేవారు. కానీ ప్రతిసారి ఇంటర్వూలో ఫెయిల్ అయ్యాను” అని నిట్టూర్చాడు. రమణ ఆలోచిస్తూ “సార్! మీరు ఏమీ అనుకోనంటే ఒక మార్గం చెప్తాను. మీరు దేవుడిని నమ్ముతారని తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీరు ఈసారి ఇంటర్వూలో పాస్ అయ్యి, ప్రమోషన్ పొంది మేనేజర్ అయితే వచ్చే ముక్కోటి ఏకాదశి పండుగ రోజున తిరుపతికి వెళ్లి వేంకటేశ్వర స్వామికి తలనీలాలు సమర్పించి ఆ స్వామి దర్శనం చేసుకొని హుండీలో డబ్బు వేస్తానని మొక్కుకోండి. ఆయన ఆపదమొక్కులవాడు కదా! ఆ కలియుగ దైవం మీ కోర్కెను తప్పకుండా తీరుస్తాడు”  అని చెప్పి రమణ, మూర్తి దగ్గర సెలవు తీసుకున్నాడు. మూర్తి మహా పిసినారి. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయడానికి పలు విధాలుగా ఆలోచించే రకం. ‘పిల్లికి బిచ్చం వేస్తే నాకేమి లాభం వస్తుంది?’ అని అనుకునే టైపు. అలాంటి వ్యక్తి రమణ మాటలకు ఆలోచనలో పడ్డాడు. అదే ఆలోచనతో ఇంటికి చేరాడు. మార్నింగ్ వాక్ తరువాత రమణతో జరిగిన సంభాషణ అంతా మూర్తి తన భార్యతో పంచుకున్నాడు. ఆమె పరమ దైవ భక్తురాలు. దాంతో రమణ మాటలకు వత్తాసు పలికింది. అలా చివరకు భార్య మాటలకు మూర్తికి తలొగ్గక తప్పింది కాదు. స్నానం చేసి వేంకటేశ్వర స్వామి పటానికి నమస్కరించి “భగవంతుడా! ఇక్కడే ఎక్కడో ఉండే ఉంటావు. నన్ను చూస్తూనే ఉండుంటావు. నేను చెప్పేది వింటూనే ఉండుంటావు. నువ్వు అంతటా ఉండే సర్వాంతర్యామివి కదా. నీకు కూడా తెలుసు. నేను ప్రమోషన్ కోసం అప్లై చేసాను. ఇదే నాకు ఆఖరి అవకాశం. ఈసారి నాకు ఆఫీసర్ నుంచి మేనేజరుగా ప్రమోషన్ వస్తే నేను వచ్చే ముక్కోటి ఏకాదశి పర్వదినాన తిరుపతికి వచ్చి, నా తలనీలాలు సమర్పించి, నీ దర్శనం చేసుకొని పదివేల రూపాయలు నీ హుండీలో వేస్తాను. స్వామీ! కరుణించు. నువ్వే దిక్కు” అని మూర్తి భక్తి శ్రద్ధలతో దేవుడితో కాంట్రాక్ట్ మొక్కు మొక్కుకున్నాడు. ఆ మొక్కిన విధానం చూసి మూర్తి భార్య చాలా సంతోషించింది. ఆ తర్వాత బ్యాంకుకు వెళ్ళిన మూర్తి రమణకు తన మొక్కు గురించి చెప్పి ఎంతో సంతృప్తి పడ్డాడు. ఆ విషయం విన్న రమణ నవ్వుతూ “మీరు ఏనాడూ ఒక టీ కూడా ఎవరికీ ఇప్పించలేదు, కానీ ప్రమోషన్ కోసం పదివేల రూపాయలు దేవుడి హుండీలో వేస్తానని మొక్కుకున్నారు అంటే, మీరు సూపర్ సార్! ఇక అంతా దేవుని దయ” అని మూర్తికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.

***

రోజులు ఒకదాని తర్వాత ఒకటి వేగంగా గడిచిపోయాయి. మూర్తి ఇంటర్వూ డేట్ వచ్చేసింది. మూర్తి మరోసారి దేవుడికి దండం పెట్టి తన పదివేల రూపాయల కాంట్రాక్ట్ మొక్కును దేవుడికి గుర్తు చేసి ఇంటర్వూకి బయలుదేరాడు. ఇంటర్వూలో అధికారులు అడిగిన ప్రశ్నలకు ఏ మాత్రం తడుముకోకుండా బదులు చెప్పాడు. అలా ఆ రోజు ఇంటర్వూ విజయవంతంగా ముగించి ఇంటికి చేరాడు. ఇంట్లో భార్య మూర్తిని ఇంటర్వూ గురించి వాకబు చేసింది. మూర్తి సంతోషంతో “చాలా బాగా చేసాను. ఈసారైనా దేవుడి దయ వల్ల నాకు ప్రమోషన్ వస్తే బాగుండు” అని ఆశగా భార్య వైపు చూసాడు. ఆమె ‘ఆల్ ది బెస్ట్’ అన్నట్లు థమ్స్అప్ వేలు చూపించింది. వారం రోజులకు మూర్తి ఇంటర్వూ రిజల్ట్స్ వచ్చాయి. రమణ సంతోషంతో “మూర్తి గారు! మీకు ప్రమోషన్ వచ్చింది. మీరు ఆఫీసర్ నుంచి మేనేజరుగా ప్రమోట్ అయ్యారు. కంగ్రాట్స్” అంటూ మూర్తిని అభినందించాడు. మూర్తికి రమణ మాటల మీద నమ్మకం లేక రిజల్ట్స్ కోసం కంప్యూటర్లో చూసాడు‌. అందులో తన పేరు మేనేజరుగా ప్రమోషన్ పొందిన వారి జాబితాలో ఉండడంతో ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైయ్యాడు. రమణ కూసింత గర్వంతో “చూసారా! నేను చెప్పానుగా, మీరు మొక్కుకుంటే తప్పకుండా ఈసారి ప్రమోషన్ వస్తుందని. వచ్చే ముక్కోటి ఏకాదశి రోజున తిరుపతికి వెళ్ళి మీరు మొక్కిన మొక్కు తీర్చుకోండి” అని మొక్కు గురించి గుర్తు చేసాడు. మొక్కు విషయం గుర్తుకు రావడంతో మూర్తి నీరుగారిపోయాడు. ఎంత ప్రమోషన్ వచ్చినా, ఇప్పుడు సడెన్‌గా పదివేల రూపాయలకు కాళ్ళు వచ్చాయే అని బాధపడసాగాడు. ఇంటికి చేరాక తనకు ప్రమోషన్ వచ్చిన సంగతి తన శ్రీమతికి చెప్పాడు. ఆమె కూడా మొక్కు గురించి గుర్తు చేసింది. దాంతో మూర్తి చిరాగ్గా “ముక్కోటి రోజుకి ట్రైన్ టిక్కెట్టు బుక్ చేసుకుని తిరుపతికి వెళ్తానులే” అని ముక్తసరిగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. అలా ప్రమోషన్ పొందిన మూర్తికి విజయవాడకు బదిలీ అయింది.

ఆ రోజు శనివారం. మూర్తి రిలీవ్ అయ్యే రోజు. బ్యాంకులో స్టాఫ్ అందరూ పార్టీ అడిగారు. మూర్తి నవ్వుతూ “నాకు పార్టీలు, ట్రీట్లు ఇచ్చే అలవాటు, పుచ్చుకునే అలవాటు లేదు. మీకు కూడా నా గురించి తెలుసు కదా” అని పార్టీ ఇవ్వకుండా ఎగ్గొట్టాలని చూసాడు. మూర్తి మనస్తత్వం గురించి అందరికీ ముందే తెలవడంతో ఎవరూ బలవంత పెట్టలేదు. సాయంత్రం అయిదు గంటలకు రమణతో సహా అందరు స్టాఫ్ మూర్తికి వీడ్కోలు పలికారు. మరుసటి పనిదినం సోమవారం కావడంతో ఆదివారం రాత్రికి వరంగల్ నుంచి విజయవాడకు బయలుదేరాడు. విజయవాడ బ్యాంకు స్టాఫ్ సహాయంతో హోటల్స్ గురించి ముందుగానే వాకబు చేసి మంచి హోటల్లో దిగాడు. ఎన్నడూ లేనిది ఇన్‌షర్ట్ చేసి, బూట్లు వేసుకుని విజయగర్వంతో మేనేజర్‌గా బదిలీ అయిన కొత్త బ్రాంచ్ లోకి అడుగుపెట్టాడు. అప్పటికే ఉన్న పాత మేనేజర్ రాఘవకు తనను తాను పరిచయం చేసుకున్నాడు. రాఘవ స్టాఫ్ అందరినీ మూర్తికి పరిచయం చేసాడు. అలా పరిచయం అయిన వారిలో ఇరవై ఏడు సంవత్సరాల ఆనంద్ మూర్తిని బాగా ఆకర్షించాడు. ఆనంద్ మాటకారితనం, పనిచేసే విధానం మూర్తికి బాగా నచ్చాయి‌. చివరగా రాఘవ బ్యాంకులో పనిచేసే స్వీపర్ మరియమ్మను మూర్తికి పరిచయం చేసాడు‌. మరియమ్మ “నమస్కారం సార్! నేను మన బ్యాంకులో స్వీపర్‌ని. మీకేమైనా పని కావాలంటే నాకు చెప్పండి” అని అంటూ నమస్కరించింది. ‘నేను మేనేజర్‌ని’ అనే కించిత్తు గర్వంతో ఆమెను చూసాడు మూర్తి. అది గమనించిన రాఘవ “సార్! ఈమె ఈ బ్రాంచ్‌లో చాలా ‌సంవత్సరాలుగా పనిచేస్తోంది. చాలా మంచి వ్యక్తి. పర్మినెంట్ పార్ట్ టైం స్వీపర్. మంచి వర్కర్ కూడాను” అని ఆమె గురించి అభినందన పూర్వకంగా చెప్పాడు. మూర్తి మారుమాట్లాడలేదు. మద్యాహ్న సమయం కావడంతో మూర్తి రాఘవతో “ఇక్కడ దగ్గరలో ఏదైనా మంచి భోజన హోటల్ ఉందా?” అని వాకబు చేసాడు. రాఘవ “సార్! మన స్వీపర్ మరియమ్మ కొత్తగా వచ్చిన మీలాంటి స్టాఫ్ కోసం భోజనం తెచ్చిస్తుంటుంది. నేను కొత్తగా ఈ బ్రాంచ్‌లో జాయిన్ అయినప్పుడు కూడా తానే తెచ్చింది. చాలా బాగా వంట చేస్తుంది” అని అన్నాడు. ఆ మాటలకు మూర్తి ఆలోచనల్లో పడ్డాడు‌. “ఏమీ ఆలోచించకండి సార్. ఇవాళ ఒక్క రోజు ఆమె భోజనం ట్రై చేయండి. ఆమె డబ్బులు కూడా తీసుకోదు‌.” అని అన్నాడు రాఘవ. ‘డబ్బులు తీసుకోదు’ అనే మాట అనడంతో మూర్తి డబ్బులు మిగులుతాయన్న ఆలోచనతో “సరే సార్. తెప్పించండి” అని రాఘవతో అన్నాడు. అలా ఆ రోజు మధ్యాహ్న భోజనం మూర్తికి మరియమ్మ ఇంటి నుంచి వచ్చింది. భోజనం చేస్తూ మూర్తి మరియమ్మతో “భోజనం చాలా బాగుంది. మీ ఆయన ఏమి చేస్తుంటాడు? మీకెంత మంది పిల్లలు?” అని ఆరా తీసాడు. మరియమ్మ నవ్వుతూ “భోజనం మీకు నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మా ఆయన ఆటో నడుపుతాడు. నాకు ఒక కూతురు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది” అని సమాధానం చెప్పింది. ఒక పూట భోజనం ఖర్చు మిగలడంతో మూర్తి మనసులో సంతోషపడసాగాడు‌. రాఘవ సహాయంతో మూర్తి అదే రోజున ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఆ రోజే రాఘవ రిలీవ్ అయ్యాడు. హోటల్ డబ్బు ఖర్చు ఎందుకులే అని మూర్తి అద్దె ఇంట్లో ఆ రోజే చేరిపోయాడు. వారం రోజుల తరువాత మూర్తి కుటుంబం అన్ని సామాన్లతో సహా అద్దె ఇంటికి చేరింది. ఆ వారం రోజులూ పొద్దున, మధ్యాహ్నం, రాత్రి మూర్తికి టిఫిన్లు, భోజనాలు అన్నీ మరియమ్మ ఇంటి నుంచే వచ్చాయి. వారం తర్వాత ముక్తసరిగా మూర్తి డబ్బులు తీసుకోమన్నా మరియమ్మ నవ్వుతూ “వద్దు సార్” అని అంది. మూర్తి, తన కూతురుని మంచి కార్పొరేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేర్చాడు.

***

అలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు మామూలుగానే మూర్తి బ్యాంకుకు వచ్చాడు. ఒక అమ్మాయి బ్యాంకులో స్వీపింగ్ పని చేస్తుండడం చూసాడు. మూర్తి ఆనంద్‌ను పిలిచి ఆ అమ్మాయి గురించి ఎంక్వయిరీ చేసాడు. ఆనంద్ “ఆ అమ్మాయి మన‌ మరియమ్మ కూతురు సార్. మరియమ్మకు ఆరోగ్యం సరిగా లేదని సెలవు పెట్టింది. అందుకని పని ఆగకూడదని తన కూతురుని పంపించింది. మరీ స్వీపింగ్ పనులు మనం చేయలేం కదా సార్. మరియమ్మ సాధారణంగా సెలవు పెట్టదు. ఎప్పుడైనా సెలవు పెడితే ఈ అమ్మాయి వస్తుంది. కంప్యూటర్లో కూడా మరియమ్మకు లీవ్ మార్క్ చేస్తాం” అని ‌చెప్పాడు. మూర్తి ఆ అమ్మాయిని పిలిచి “నీ పేరేంటి” అని అడిగాడు. ఆ అమ్మాయి “నమస్కారం సార్! నా పేరు అమృత. మరియమ్మ గారు మా అమ్మగారు. ఇవాళ మా అమ్మకు ఒంట్లో బాగాలేదు. అందుకే పనిచేయడానికి నేను వచ్చాను. పని మంచిగా చేస్తాను. రేపు మా అమ్మ వస్తుంది” అని నమస్కరించి చెప్పింది. మూర్తి నవ్వుతూ “నీ గురించి మీ అమ్మ చెప్పింది. బాగా చదువుతున్నావా?” అని ప్రశ్నించాడు. అమృత “చదువుతున్నాను సార్” అని బదులు చెప్పింది. ఆ మరునాడు మరియమ్మ యథావిధిగా పనికి వచ్చింది‌. మూర్తితో ఆమె “సార్! నిన్న నా కూతురు పనికి వచ్చింది‌ కదా. బాగా పని చేసిందా?” అని అడిగింది‌‌. “బాగా పనిచేసింది. మా అమ్మాయి కూడా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరమే. మీ అమ్మాయి ఏ కాలేజిలో చదువుతోంది?” అని ప్రశ్నించాడు. దానికి మరియమ్మ “గవర్నమెంట్ కాలేజీలో సార్‌. ప్రకాశం మాష్టారు దగ్గరకు ట్యూషన్‌కు వెళ్తోంది.” అని చెప్పింది. మూర్తి కొత్త ప్రాంతంలో, కొత్త బ్రాంచ్‌లో కాలక్రమేణా అలవాటు పడసాగాడు. ఒకరోజు ఆనంద్ బ్యాంకులో పని చేసుకుంటున్న మూర్తి దగ్గరకు వచ్చి “ఎక్స్‌క్యూజ్ మీ మేనేజర్ సార్! ప్రసాదం తీసుకోండి” అని ప్రసాదం ఇవ్వబోయాడు. మూర్తి ఆశ్చర్యంగా “ఏ ప్రసాదం? ఏ ఊరు వెళ్ళావు?” అని ప్రశ్నించాడు. “మొన్న, నిన్న సెలవులు కదా సార్. అందుకే తిరుపతికి వెళ్ళాను. దర్శనం చాలా బాగా జరిగింది” అని సంతృప్తిగా సమాధానం చెప్పాడు ఆనంద్. అప్పుడు గానీ మూర్తికి తన మొక్కు గురించి గుర్తుకు రాలేదు. అయినా అదేమీ బయట కనపడకుండా “నువ్వు తలనీలాలు అదే నీ జుట్టు ఇవ్వలేదా?” అని అడిగాడు. ఆనంద్ నవ్వుతూ “లేదు సార్. కళ్యాణ కట్ట దగ్గర క్యూ చాలా పెద్దగా ఉంది. నాకు తిరుపతిలో వేరే పని కూడా ఉంది. టైం లేక జుట్టు ఇవ్వలేదు. దర్శనం వరకు చేసుకుని వచ్చాను.” అని అన్నాడు. మూర్తి చిరుకోపంతో “మీ లాంటి కుర్రాళ్ళు అందరూ ఇంతే. తిరుపతికి వెళ్ళి ఎవరైనా జుట్టు ఇవ్వకుండా వస్తారా? ఎంత పెద్ద పాపం అది?” అని అన్నాడు. ఆనంద్ సూటిగా “సార్! మీరు ఏమనుకోనంటే నేను ఒక విషయం చెప్తాను. ఏ దేవుడు చెప్పాడు? తనను పూజించమని, దర్శించమని లేకపోతే శపిస్తానని. ఏ దేవుడు లేక దేవత చెప్పారు తమకు తలనీలాలు ఇవ్వకపోతే మీకు, అంటే భక్తులకు పాపం తగులుతుందని? మనం భక్తితో పూజలు చేయాలి కాని, భయంతో కాదు. ఫలం, పుష్పం, తోయం అన్నారు. అంటే దేవుడిని ఎలాగైనా పూజించవచ్చు. ఉదాహరణకు దేవుడికి అభిషేకం ఎంత భక్తితో చేసామా అనేది ముఖ్యం కానీ, నీళ్ళతో చేసామా లేక పాలతో చేసామా అన్నది కాదు” అని అన్నాడు.‌ మూర్తి ఆ మాటలకు ఆలోచనలో పడ్డాడు. ఇంటికి వెళ్ళి భార్యతో ఆనంద్‌తో జరిగిన ఈ దేవుడి చర్చ అంతా వివరించి చెప్పాడు. కానీ ఆమె మాత్రం “చూడండి. అతను ఏదో అన్నాడని మీరు మొక్కు తీర్చుకోవడం మర్చిపోకండే. అసలే మీకు జుట్టు బాగా పెరుగుతోంది” అని పెరుగుతున్న జుట్టు గురించి కూడా గుర్తు చేసింది. దాంతో మూర్తి త్వరలో వచ్చే ముక్కోటి ఏకాదశికి తిరుపతికి వెళ్ళి తలనీలాలు తప్పకుండా సమర్పించి తను హుండీలో వేద్దామనుకున్న పదివేల రూపాయలు హుండీలో వేయాలని మరోసారి అనుకున్నాడు. అలా చూస్తుండగానే నెల ఆఖరి రోజు వచ్చేసింది. ఆ రోజే జీతాలు కూడా వచ్చాయి. ఆనంద్, అతని పర్సనల్ నెట్ బ్యాంకింగ్ నుంచి ఎవరికో డబ్బు పంపడం గమనించాడు మూర్తి. దాంతో ఎగతాళిగా నవ్వుతూ “ఏం ఆనంద్? జీతం ఇవాళేగా వచ్చింది. అప్పుడే అప్పుల వాళ్ళకి పంపిస్తున్నావా?” అని అన్నాడు. “అయ్యో! నేను ఎవరికీ అప్పులు ఇవ్వను. అప్పులు తీసుకోను. నాకు తెలిసిన ఒక అనాథ వృద్ధాశ్రమం మా ఊరిలో ఉంది. ఆ ఆశ్రమానికి నెల నెలా జీతం నుంచి పదిహేను వందల రూపాయలు పంపుతుంటాను. అదే మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను సార్” అని అన్నాడు. మూర్తి అది విన్నాక లెక్కలు వేయడం మొదలుపెట్టాడు. ‘నెలకు పదిహేను వందల రూపాయలు అంటే, సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు‌. అంటే ఆనంద్ సంవత్సరానికి ఇంత డబ్బు వృథా చేస్తున్నాడా?’ అని అనుకుని చిరుకోపంతో “ఎందుకు ఆనంద్ ఇంత డబ్బు వృథా చేస్తావు? అయినా ఇవ్వదలుచుకుంటే ఏం గుడికో డొనేట్ చేస్తే సరిపోతుంది కదా! కాస్త పుణ్యంతో పాటు గోడ మీద నీ పేరు కూడా వస్తుంది” అని అన్నాడు. దానికి ఆనంద్ “సార్! మనుషలందరికీ దేవుడు సాయం చేయలేక తనలోని దైవత్వాన్ని మనుషులకు కూడా ఇచ్చాడు. తమలోని ఆ దైవత్వాన్ని మేల్కొలుపుతూ సాటి మనిషికి తాము చేయగలిగిన సాయం చేయడం ప్రతి మనిషి బాధ్యత. అలా సాయం చేసే ప్రతి మనిషీ దేవుడే. నేను కూడా నా బాధ్యతను నిర్వహిస్తున్నాను. దేవుడికి దగ్గరగా ఉండటానికి చేయగలిగిన దానమో, సాయమో ఒక సులభమైన మార్గం‌.” అని అన్నాడు. ఆ సమాధానానికి మూర్తికి ఎవరో తనను చెప్పు లేకుండా చెప్పుతో చెంప దెబ్బ కొట్టిన ఫీలింగ్ కలిగింది.

***

అలా నెల రోజులు గడిచాయి. ఒక రోజు మూర్తి ఒంటరిగా తన క్యాబిన్‌లో ఉన్నప్పుడు మరియమ్మ “సార్! మీకో చిన్న విషయం చెప్పాలి. నాకు ఒక ఇరవై వేల రూపాయల లోన్ కావాలి. మా అమ్మాయి కాలేజి ఫీజులు, ట్యూషన్ ఫీజులు, పుస్తకాలు కొనడానికి, ఇతరత్రా చదువు ఖర్చుల కోసం” అని భయపడుతూ వినయంగా అడిగింది. మూర్తి “ఎందుకమ్మా లోన్? వడ్డీ కట్టడానికి నీ జీతం కూడా తక్కువే కదా. ఇప్పటికే చాలా లోన్లు తీసుకున్నావ్. వచ్చే జీతం వడ్డీలకే పోతే నువ్వెలా బతుకుతావ్?” అని ప్రశ్నించాడు. మరియమ్మ నీరసంగా “ఏం చేస్తాం సార్? ఉన్న ఒక్కగానొక్క కూతురుని బాగా చదివించి, దానికి ఒక మంచి దారి చూపిస్తే, దాని కాళ్ళ మీద అది నిలబడుతూ, దాని బతుకు అది బతుకుతుంది కదా! అని ఆశ” అని బాధపడుతూ చెప్పింది. దానికి మూర్తి “సరేలే. వచ్చే నెలలో ఇస్తాను” అని చెప్పి ఆమెను సంతోషపరిచాడు. ఒకరోజు ఆనంద్ బ్యాంకులో తన పనిలో నిమగ్నమై ఉండగా ఒక వ్యక్తి అయ్యప్ప మాల ధరించి, మరో వ్యక్తి భవాని మాల వేసుకుని బ్యాంకుకు వచ్చారు. ఆనంద్ వారిని చూడగానే ‘స్వామియే శరణం అయ్యప్ప’ అని, ‘జై భవాని కాపాడు తల్లి’ అని తనలో తాను అనుకున్నాడు. ఇదంతా గమనించిన మూర్తి “ఆనంద్! నువ్వేమి మాల ధరించలేదు కదా. ఎందుకు వారిని చూడగానే దేవుడిని, దేవతని స్మరించుకున్నావ్?” అని ప్రశ్నించాడు. ఆనంద్ నవ్వుతూ “సార్! నేను మాల ధరించి, ఆ నియమాలను పాటించలేను. ఎవరైనా ఏదైనా మాల ధరిస్తే వారు పాటించే కఠిన నియమాలను నేను మనసులో మెచ్చుకుంటాను. అందుకే నేను మాల వేసుకున్న వారు ఎవరిని చూసినా, వారు ఏ మాల ధరించారో ఆ దేవుడిని కానీ, లేక ఆ దేవతను కానీ తలుచుకుంటాను. అలా దైవ స్మరణ చేస్తూ ఉంటాను” అని చెప్పాడు. అది విన్న మూర్తి ఆశ్చర్యపోయి “అయినా నీ పిచ్చి గానీ, మాల వేసుకున్న ప్రతి వారూ పవిత్రంగా ఉంటారా?” అని వ్యంగ్యంగా అన్నాడు. దానికి ఆనంద్ “వారెలా ఉన్నా, నేను వారి ద్వారా దేవుడిని మరోసారి గుర్తుకు తెచ్చుకున్నట్లే. అలా అని నేను దేవుడిని మర్చిపోయినట్టు కాదు. దేవుని స్మరణ చేయడానికి నేను ఎంచుకున్న మరో మార్గం. అంతే సార్” అని వివరించి చెప్పాడు. అంతా విన్న మూర్తి, ఆనంద్ చెప్పిన దేవుడి గురించిన విషయాలు విని మరోసారి ఆశ్చర్యపోయాడు. అదే ఆశ్చర్యంతో “ఆనంద్ ఇవాళ రాత్రి భోజనానికి నువ్వు మా ఇంటికి రావాలోయ్. కాదనకు” అని చేతులు పట్టుకుని మరీ ఆహ్వానించాడు. దాంతో ఆనంద్ ఒప్పుకోక తప్పలేదు.

***

అలా ఆ రోజు రాత్రి ఆనంద్, మూర్తి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. మూర్తి భార్య ఆనంద్‌ను ఆహ్వానించింది. “మీ గురించి మా ఆయన చాలా గొప్పగా చెప్పారు” అని అంటూ ఫ్రిజ్ వాటర్ చేతికిచ్చింది. ఆనంద్ వాటర్ తాగుతూ “వాటర్ చాలా చల్లగా ఉన్నాయి మేడం. నాకు ఫ్రిజ్ వాటర్ అంటే ఇష్టం. నా గురించి గొప్పగా చెప్పడం, సార్ గొప్పదనం. నా గొప్పదనం కాదు” అని అన్నాడు. అలా మూర్తి, ఆనంద్ ఇద్దరూ కలిసి మూర్తి ఇంట్లో రాత్రి భోజనం ముగించారు. భోజనం చేసిన తరువాత మూర్తి ఆనంద్‌ను తన ఇంటి టెర్రస్ పైకి తీసుకెళ్ళాడు. టెర్రస్ మీది మొక్కలు చూస్తూ ఆనంద్ టెర్రస్ మీది గాలిని ఆస్వాదించసాగాడు. మూర్తి కలుగజేసుకుని “ఆనంద్! నీ పర్సనల్ క్యారెక్టర్, నీ జాబ్ వర్కింగ్ విధానం, నాకు చాలా బాగా నచ్చాయి. తద్వారా నువ్వు కూడా నాకు బాగా నచ్చావు. అలాంటి నిన్ను ఒక ప్రశ్న అడగదలిచాను. నీ దృష్టిలో దేవుడి నిర్వచనం ఏమిటి?” అని ప్రశ్నించాడు. ఆనంద్ చిన్నగా నవ్వుతూ “సార్! మీకు నేను నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ఒక చిన్న కథ చెప్తాను. నా రియల్ లైఫ్‌లో నాకు జరిగిందే. నేను బ్యాంకు టెస్టులకు ప్రిపేర్ అవుతున్న రోజులవి. బ్యాంకు పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్ వచ్చింది. నాకు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు విజయవాడలో పరీక్ష. మా ఊరికి విజయవాడ చాలా దూరం కావడంతో నేను ముందు జాగ్రత్తగా పొద్దున్నే ఎనిమిది గంటలకే పరీక్షా సెంటర్ దగ్గరకు వెళ్ళాను. అక్కడ అంతా చూసుకున్నాక ఒక ఇంటి ముందున్న సిమెంట్ బల్లపై కూర్చుని పరీక్షకు సంబంధించినవి చదువుతున్నాను. అప్పుడు ఆ ఇంటి నుంచి ఒక పెద్దాయన బయటకు వచ్చారు. “బాబు ఎవరు నువ్వు?” అని నన్ను ప్రశ్నించారు. అప్పుడు నేను నా గురించి, నా పరీక్ష గురించి ఆయనకు చెప్పాను. అది విన్న తరువాత ఆయన “ఇక్కడ ఎండగా ఉంది. మా ఇంట్లోకి వచ్చి కూర్చొని చదువుకో” అని అన్నారు. నాకు కొంచెం భయం వేసి వారించాను. కానీ ఆయన మరోసారి మళ్ళీ మళ్ళీ బలవంతం చేసి నన్ను లోపలికి తీసుకెళ్ళారు. హాల్ గదిలో కూర్చోబెట్టి చదువుకోమన్నారు. ఆయన మాత్రం పెరటి వైపు వెళ్ళారు. అక్కడ నేను చదువుకోసాగాను. ఇంతలో ఒక మహిళ లోపలి నుంచి వచ్చి “బూస్ట్ తాగు బాబు” అని ఒక కప్పు చేతికి ఇచ్చింది. నాకు కొంత సేపు ఏమీ అర్థం కాలేదు. ముఖపరిచయమే లేని ఒక వ్యక్తికి ఇలా కూడా ఇంట్లోకి పిలిచి మరీ మర్యాదలు చేస్తారా? అని మనసులో ఆశ్చర్యపడసాగాను. అలా సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలు అయింది. ఇంతలో ఆమె “బాబు! భోజనం చేద్దువుగాని, రా నాయనా” అని పిలిచింది. కడుపులో పేగులు ఆకలికి మాడిపోతున్నాయి. అయినా నేను లేవలేదు. బలవంతంగా నన్ను భోజనానికి రమ్మని మళ్ళీ మళ్ళీ పిలిచింది. దాంతో వెళ్ళక తప్పింది కాదు. మొదట నన్ను లోపలికి పిలిచిన పెద్దాయన, ఆమె, నేను కలిసి భోజనం చేసాం. భోజనం తర్వాత నేను పరీక్ష టైం అవుతోందని వారికి ధన్యవాదాలు చెప్పి నేను మళ్ళీ పరీక్షా కేంద్రానికి వెళ్ళాను. ఆ పరీక్ష విజయవంతంగా పాస్ అయ్యి, తద్వారా మన బ్యాంకులో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాను. అప్పుడే నేను ఉద్యోగం వచ్చాక ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక నుంచి నేను సంపాదించే ప్రతి రూపాయిలో కనీసం పావలా వాటా అయినా పక్కవారికి సహాయం చేయాలి అని. అంటే అవసరార్థులకో, పేదవారికో, ఆకలితో ఉన్నవారికో సహాయం చేయాలి అని. నాలోని దైవత్వాన్ని మేల్కొలపాలి అని. అందుకే సాధారణంగా దేవుడి హుండీలో నేను వేయాలనుకునే డబ్బు, ఆ డబ్బు అవసరాల్లో ఉన్నవారికి వినియోగిస్తాను. అలా నాకు బ్యాంకు పరీక్ష రోజున అన్నం పెట్టిన వారి రుణం ఇన్‌డైరెక్ట్‌గా తీర్చుకున్నట్టుగా భావిస్తాను.

నా దానాల వలన,నా సహాయాల వలన నాకేమైనా పుణ్యం లభిస్తే, ఆ పుణ్యంలో నాకు బ్యాంకు పరీక్ష రోజున భోజనం పెట్టిన ఆ పుణ్య దంపతులకు, దేవుడికి కూడా వాటా ఉంటుంది” అని తన సంభాషణను ముగించాడు. అంతా విన్న మూర్తి ఆనంద్ భుజం తట్టి, కరచాలనం చేసి, ప్రేమపూర్వకంగా కౌగిలించుకున్నాడు. అలా ఆనంద్ మూర్తి దగ్గర నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. ఆ మరునాడు శుక్రవారం. యథావిధిగా పూజ కార్యక్రమాలు చేసిన తరువాత ఎప్పటిలాగే బ్యాంకుకు వెళ్ళాడు మూర్తి. మరియమ్మ బ్యాంకును శుభ్రపరిచి వాటర్ బాటిల్స్లో నీళ్ళు నింపుతుంటే, మూర్తి ఆమెను తన గదికి పిలిచాడు. “ఏంటి సార్?” అని వచ్చిన ఆమెకు మూర్తి ఇరవై వేల రూపాయలు ఇచ్చాడు. అన్నీ అయిదు వందల కాగితాల నోట్లే. ఏం జరుగుతుందో అర్థంకాక ఆలోచిస్తున్న మరియమ్మతో మూర్తి “మీ అమ్మాయి చదువు కోసం ఈ ఇరవై వేల రూపాయలు ఉపయోగించు. మీ అమ్మాయిని రేపు మా ఇంటికి తీసుకురా. మా అమ్మాయిని మీ అమ్మాయికి పరిచయం చేస్తాను. ఇద్దరూ కలిసి చదువుకుంటారు. ఒకరికి ఒకరు చదువులో సహాయం చేసుకుంటారు.ఇంకెప్పుడైనా డబ్బు కావాలంటే నన్ను అడుగు, అంతే కానీ అప్పు చేయకు.” అని మనసులో ఒక రకమైన తృప్తితో సంభాషణను ముగించాడు. మరియమ్మ “థాంక్స్ సార్!” అని చెప్పింది. ఆ మరునాడు నెలలో నాలుగో శనివారం. బ్యాంకుకు సెలవు కావడంతో మూర్తి లేటుగా నిద్ర లేచాడు. ఇంటికి దగ్గరలో ఒక సెలూన్ షాపు ఉండటంతో వెళ్ళాడు. క్యూ ఎక్కువగా ఉండేసరికి కూర్చుని తన వంతు కోసం ఎదురు చూడసాగాడు. తన వంతు రాగానే వెళ్ళి సెలూన్ కుర్చీలో కూర్చున్నాడు. బార్బర్ “సార్! క్రాఫ్ చిన్నగా చేయమంటారా?” అని ప్రశ్నించాడు. మూర్తి నవ్వుతూ “లేదు. గుండు చెయ్యండి” అని అన్నాడు. బార్బర్ చిన్నబోయి ఆశ్చర్యంగా “సరే సార్” అన్నాడు. బార్బర్ తలపై కత్తి పెట్టే ముందు మూర్తి ‘దైవార్పణం’ అని తనలో తాను అనుకున్నాడు. తన ద్వారా ఆ బార్బర్‌కు కొంత డబ్బు వచ్చినందుకు మూర్తి సంతోషపడ్డాడు. అలా మూర్తి గుండు చేయించుకుని ఇంటికి చేరాడు. మూర్తి భార్య మూర్తిని చూసి ఆశ్చర్యపోయి “ఈ గుండు ఏమిటండీ? మీ జుట్టు ఏమైంది? మీ మొక్కును వదిలేసారా? మర్చిపోయారా?” అని కంగారుగా ప్రశ్నించింది. మూర్తి నవ్వి ఊరుకున్నాడు. తలస్నానం చేసిన మూర్తి కాఫీ తాగుతూ టీవీ చూస్తుండగా మొబైల్ ఫోన్‌కు ఏదో వాట్సాప్ మెసేజ్ రావడంతో ఫోన్ చెక్ చేసుకోసాగాడు. ఆ మెసేజ్ ‘ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు’ ఆని. ఆ మెసేజ్ చూసి, గోడకు తగిలించిన తెలుగు క్యాలెండర్ చూస్తూ ఆశ్చర్యపోవడం మూర్తి వంతైంది.

బాటమ్ లైన్: దైవం మానుష రూపేణ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here