దెయ్యం వదిలింది

0
11

[dropcap]”ఏ[/dropcap]టి సంగతి? అప్పయ్యమ్మ ఇంటి కాడినుంచి తెగ జనం వత్తాన్నారు” అని అడిగింది సింహాచలం ఏటికెళ్ళి వస్తున్న ఎల్లమ్మని.

“నిన్న రేతిరి నడుపూరి ఎంకడి కూతురు అప్పల్నర్సకి దెయ్యం పట్టినాదట సూసి వత్తాన్నారు సిమ్మాచలమా.” అంది ఎల్లమ్మ.

“ఇంతకీ ఆ దెయ్యం ఎవురంటావ్‌” అని ఆసక్తిగా అడిగింది సింహాచలం.

“ఏమో నాకూ తెలవదు! ఓ పాలి ఎల్లి సూసొద్దాం వత్తావేటి?” అంది ఎల్లమ్మ.

“పద బేగి ఎల్లొద్దాం అటినుంచి వొచ్చి నూ మొక్కలకి గొప్పు ఆడించాలి” అనుకుంటూ ఇద్దరూ వెంకడి ఇంటికి బయలు దేరారు.

“ఇదివరకులా అడుగుతీసి అడుగెయ్యనేకపోతన్నానే మునుకులు పట్లు ఒగ్గేసినాయి” అంది ఎల్లమ్మ నడవలేక బాధపడుతూ.

“అందరిదీ అదే కత. వయసైపోయాక అంతే” అంది సింహాచలం మూల్గుతూ.

ఇద్దరూ వెంకడి ఇంటికి చేరుకున్నారు. వెంకడి భార్య అప్పయ్యమ్మ కూతురిదగ్గర కూర్చుని బోరు బోరున విలపిస్తోంది. వీరిద్దరిని చూసి..

“నర్సా నేయే సిమ్మంచలం బాప్ప ఒచ్చినాది” అని లేపినా ఉలుకూ లేక పలుకూ లేక శవంలా పడివుంది అప్పల నర్స.

“ఎల్లమ్మ సెప్పినాది నర్సకి బాగో నేదని అసలేటైనాదేటి?” అని అడిగింది సింహాచలం తెలుసుకోవాలనే ఆసక్తితో.

“నిన్న ఏకావలే లేసి ఇంటికాడ పనులన్నీ సేసి, ఆ యెనక సల్దన్నం తిని ఈకడి నూ మొక్కలకి గొప్పు తవ్వడానికెల్లింది. మద్యాన్నాలు తిన్నాక, మెరక మూలకి పశువులు తోలుకెల్లింది. సాయంత్రం పంతులుగోరింటికాడ పనిసేసొచ్చి, ఆనక ఏటికెల్లి కడవతో నీల్లు తెచ్చినాది. ఆ తరువాత ఏటైనాదో పిచ్చి పిచ్చిగా అరవడం మొదలెట్టినాది. గిరగిరా తిరగేసి, గుడ్లు మిటకరించి సూసి, ఈరంగం ఎత్తిపోనాది. పెంటీది గోరీది ఈదులన్నీ పరుగులు తీసినాదట. ఎందరు అడ్డుకున్నా ఆగనేదట. ముగ్గురు మగోల్లని ఏమికాకుండా తోసేసినాదట” అంది అప్పయ్యమ్మ.

“దెయ్యానికి సానా బలముంటాది” అంది ఎల్లమ్మ తెలిసినదానిలా.

“ఇంతకీ ఏదెయ్యం వోలిందో తెలిసినాదేటి” అని అడిగింది సింహాచలం.

“ఏటి సెప్పమంతావు నాను, మీ అన్న ఎల్లనేక ఇంటికాడే ఉన్నాము. జనాలు దాని ఎనకాల పరుగెత్తినారు. ఇంతలో కల్లం కాడినుంచి పెద అప్పలనాయుడు బావొచ్చినాడు ఆడికి దెయ్యాన్ని వొదల గొట్టడం బాగా తెలుసట. ఆడితోపాటు బుల్లడు, ఈకడు, డబ్బాలుగోడు, మంచం దండిగోడు అందరు కలిసి అమ్మిని పట్టుకున్నారట.”

“నాను సెప్పినట్టు ఏప మండలతో సిదగొట్టండి దెయ్యం దెబ్బకి దిగొత్తది” అని అప్పలనాయుడు బావ సెప్పగానే గొడ్డుని బాదినట్లు బాదీనారు.

ఒళ్ళు ఊనం సేసీనారు. అలా కొట్టుకుంటూ మా ఇంటికాడికి ఈడ్సుకొచ్చినారు. దానిని సూసి నాగుండె బద్దలైపోనాది.

ఆ మాయదారి దెయ్యం దీనిమీదే వాలాలా! ఎంత కట్టమొచ్చినాదో నాతల్లికి అని అనుకుంతూ ఉండగానే ఆరతి బిల్లలు కావాలని అప్పలనాయుడు బావ కేకేసినాడు. ఆరతి బిల్లలు ఇంట్లోనేక పొట్టి సావుకారి కొట్టుకాడ తెప్పించి యిచ్చినాను.

ఏటి సేత్తారా అని సూడబోతే ఇంకేటుంది

కాల్లని ఇద్దరు సేతుల్ని ఇద్దరూ గట్టిగా అదిమి పట్టుకుని అమ్మి అరసేతుల్లో ఆరతి బిల్లలు ఎలిగించినారు. సేతులు కాలి మంటెడుతుంటే కొండ ఇరిగిపడినట్లు గగ్గోలెట్టినాది.

కాసేపటి తర్వాత దెయ్యం వొగ్గేసినాదని మాయదారి మంద ఎవులిల్లకి ఆల్లు ఎల్లిపోనారు.

రేతిరంతా కంటిమీద కునుకు నేదు. మంట మంటని ఏడుస్తూనే ఉంది.

ఈ యాల ఆలయ్య భూతాల సంకరయ్యని తీసుకొత్తానంటన్నాడు. ఆడికి నల్ల కోడి పెట్ట, ముంతకల్లు, నల్లజేకట్టుముక్క, నూట పదార్లు, ఇత్తే దెయ్యాన్ని వొదలగొడతాడట. నాకేటీ తోచనేదు. పిల్ల సూత్తే పచ్చినాగ పడిపోనాది”.. అంది అప్పయ్యమ్మ దుఃఖంతో ….

ఆ మర్నాడు గ్రామానికి ఎ.ఎన్‌.ఎం. వచ్చింది అప్పలనర్స పరిస్థితి చూసి నిర్ఘాంతపోయింది.

నర్స తల్లిని మందలించింది.

“మీ మూర్ఖత్వంతో దెయ్యమని భూతమని నరకహింసలు పెట్టారు. ఆడకూతురని కూడా ఆలోచించలేదు..

ఆడపిల్ల కూలీనాలీ చేసి సంపాదించి మిమ్మల్ని పోషిస్తూఉంటే కష్టపడాల్సిన కొడుకు తిని ఊరు మీద తిరుగుతున్నాడు. ఈడొచ్చిన పిల్లకి పెళ్ళిచెయ్యాలని తలంపులేదు మీకు. కూతురు సుఖసంతోషాల గురించి తల్లిదండ్రులుగా మీరెప్పుడూ ఆలోచించలేదు. అందుకే అది అలా తయారయ్యింది. త్వరగా పట్నంలో డాక్టరుకి చూపించండి నయమౌతుంది” అంటూ కొన్ని మాత్రలను వాడమని ఇచ్చింది.

కొద్దిరోజుల తరువాత నర్సని పట్నంలో డాక్టరుకి చూపించారు అప్పయ్యమ్మ దంపతులు.

డాక్టరుగారు నర్సని అడిగి అన్ని విషయాలు తెలుసుకుని నర్సని గది బయట కూర్చోమన్నారు.

తల్లి దండ్రులిద్దరికీ ఇలా చెప్పసాగారు.

“దీనిని హిస్టీరియా అంటారు. ఇది ఎక్కువగా పెళ్ళికాని ఆడపిల్లల్లోను, పెళ్ళి అయి ఆశించిన సుఖాన్ని భర్త నుంచి పొందని ఆడవాళ్ళలోని, ఒంటరి తనంతో బాధపడేవారిలో ఎక్కువగా ఈ లక్షణాలు కనపడతాయి.

ఇది ఒక మానసిక సమస్య. మందులువాడటంతో పాటు తల్లిదండులుగా మీ బాధ్యతని తెలుసుకుంటే సమస్య పరిష్కారమౌతుంది.” అని మందులు రాసిచ్చి పదిహేను రోజుల తర్వాత రమ్మన్నారు డాక్టరుగారు.

మందులు క్రమం తప్పకుండా వాడి డాక్టరుకి చూపించుకుంది. ఇప్పుడు అప్పల నర్స ఆరోగ్యంగానే కాదు మనసిచ్చిన వాడిని మనువాడటంతో ఆనందంగా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here