ధర్మాగ్రహం

16
10

[box type=’note’ fontsize=’16’] “ఈ వృత్తినే నమ్ముకున్నవాళ్లని హాస్యాస్పదంగా చూపించడం సబబేనా? ఏ వృత్తి విలువ దాని కుంటుంది” అంటున్నారు జి.ఎస్. లక్ష్మిధర్మాగ్రహం” కథలోని పాత్ర. [/box]

అపరాహ్ణమయింది. సావిత్రి పూజ ముగించి, భగవంతునికి మహానైవేద్యం సమర్పించి, హారతిస్తోంది. అంతలో ఫోన్ మోగింది. హారతివ్వడం పూర్తిచేసి, అపరాధం చెప్పుకుని, లెంపలేసుకుంటూ హాల్లోకొచ్చి ఫోన్ తీసి “హలో..” అంది.

“సావిత్రమ్మొదినా, మన పిల్లల్ని పోలీసులు పట్టుకుపోయారు. ఇంత ఘోరం ఎప్పుడైనా చూసామా..” అవతల్నించి కామాక్షి మాటలు వినగానే స్థాణువయ్యింది. కాస్త తేరుకుని, “ఎందుకు? ఎప్పుడు?..” అనడిగింది.

“అయ్యో.. నువ్వు న్యూస్ చూట్టం లేదా.. ఏ న్యూస్‍చానల్ చూసినా అదే..” అనగానే ఫోన్ పెట్టేసి టీవీ ఆన్ చేసింది సావిత్రి. న్యూస్ చానల్ పెట్టగానే సావిత్రికి కనిపించిన దృశ్యంలో రెండువర్గాలుగా వున్న మనుషులు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. పోలీసులు వాళ్ళని కంట్రోల్ చెయ్యడానికి చూస్తున్నారు. ఆ కొట్టుకోవడంలో ఒకరిద్దరికి బాగా గాయాలు అయినట్లున్నాయి. వాళ్ళని ఆంబులెన్స్ లోకి ఎక్కించి హాస్పిటల్‍కి పంపుతున్నారు. ఇంకా కొట్టుకుంటున్నవాళ్లని పోలీస్ జీప్ ఎక్కిస్తున్నారు. అలా ఎక్కిస్తున్నవారిలో సావిత్రికి కొడుకు మురళీధరుడు కనపడ్డాడు. ఇంకా ఒకరిద్దరిని గుర్తు పట్టిందావిడ. వాళ్లలో కామాక్షి కొడుకు సదాశివం కూడా ఉన్నాడు. అదే వీడియో క్లిప్పింగ్‍ని చూపించిందే చూపిస్తున్నారు. సావిత్రికి కాళ్ళూచేతులూ ఆడలేదు. కాస్త కూడదీసుకుని భర్త పురుషోత్తం మొబైల్‍కి ఫోన్ చేసింది. కానీ అది స్విచ్ ఆఫ్ చేసి ఉంది. మొట్టమొదటిసారి సావిత్రికి భర్త మీద కోపం వచ్చింది. ఆయనంతే.. ఆ దయానిధిగారింట్లో రుద్రాభిషేకాలూ, హోమాలూ చేస్తూండి వుంటారు. ఎంతో ఏకాగ్రతతో చదవవల్సిన మంత్రాలనీ, శ్లోకాలనీ చదువుతున్నప్పుడు ఆయన మొబైల్ ఆఫ్ చేసేస్తారు. పూర్తి ఏకాగ్రతతో చెయ్యవలసినవి సక్రమంగా చేస్తున్నప్పుడు వచ్చే ప్రకంపనశక్తి (వైబ్రేషన్) కి తట్టుకోవాలంటే అవి చేసేవారిలో ఏకాగ్రత, నిష్ఠ చాలా అవసరం. గ్రహాల గమనాలలో వచ్చే అశుభాలకు గ్రహశాంతి చేస్తూ, దానిద్వారా వచ్చే ప్రకంపనలను అనుకూలంగా మార్చుకుని, ఆ పూజలు చేయించుకునేవారి నెత్తిమీద పిడుగులా పడవలసిన అపాయాన్ని, గొడుగు పట్టినట్టు అడ్డుకుని, చిన్న వర్షపుజల్లుగా దానిని పక్కకి తప్పించడమంటే అదేమంత చిన్న విషయం కాదు. చేసే మనిషిలో నమ్మకం, నిష్ఠ, ఏకాగ్రత, వాక్శుధ్ధి, పాండిత్యం వంటివి లేకపోతే విధాత రాసిన గ్రహగతులను సరళం చెయ్యడం అంత తేలికైన విషయం కాదు. పురుషోత్తంగారు అందులో నిష్ణాతులు. ఆయన అభిషేకాలూ, పూజలూ, శాంతులూ, హోమాలూ చేసి తీర్థమిచ్చి ఆశీర్వదిస్తే అదింక బ్రహ్మవాక్కేనని అంతా భావిస్తారు. పవిత్రమైన అగ్నిహోత్రంనుంచి వెలువడే ఆ ప్రకంపనలను పూజలు చేయించుకునేవారికి అనుకూలమైన ఆశీర్వచనంలా అందించడంలో ఆయన సిధ్ధహస్తులు. అందుకే ఆయన ఏ హోమానికైనా ఋత్విక్కుగా కూర్చున్నారంటే అది ఫలప్రదమైనట్టేనని అందరికీ తెలుసు. పెద్దవాళ్ళనబడే వాళ్ళిళ్ళలో ఇటువంటి కార్యక్రమం ఏమి చేయించాల్సివచ్చినా ఆయనకే పిలుపు వస్తుంది. ఇవాళ కూడా ఆయన దయానిధిగారింట్లో హోమం చేయించడానికి వెళ్ళారు. అది పూర్తయేదాకా బ్రహ్మ రుద్రాదులొచ్చినా కదలరు. ఆ సంగతి బాగా తెలిసిన సావిత్రి తన దృష్టిని మళ్ళీ టీవీవైపు తిప్పింది. అదే అదే క్లిప్పింగ్ చూపిస్తూ, యాంకరు అసలు ఆ రెండువర్గాలూ ఒక సినిమా విడుదల గురించి ఎందుకు దెబ్బలాడుకోవలసొచ్చిందో చెపుతోంది. సావిత్రికి రెండురోజుల్నించీ ఆ సినిమా మీద జరుగుతున్న గొడవంతా గుర్తొచ్చింది. అసలు తన కొడుకులాంటి మంచిపిల్లాడు ఎందుకిలాంటి గొడవల్లో తలదూర్చాడా అనుకుంది.

కొడుకు మురళీధరుడికి ఎనిమిదోయేట ఉపనయనం చేసాక, కాకినాడలో మాతామహుల ఇంట్లోనే వుంచి విద్యాభ్యాసం కొనసాగించారు సావిత్రీ, పురుషోత్తం దంపతులు. సావిత్రి తండ్రిగారు కాకినాడలో వేదపాఠశాల నడుపుతున్నారు. పదిహేనోయేడువరకూ అక్కడే వేదం చెప్పించి, తర్వాత హైద్రాబాదు తీసుకొచ్చి, పదోక్లాసు పరీక్ష ప్రైవేటుగా పాసు చేయించి, రెండేళ్ళలో ఇంటర్మీడియేట్ పూర్తి చేయించారు. బుధ్ధిగా చదువుకుంటూ కాలేజీలో బియెస్సి, ఆపైన ఎమ్మెస్సీ కంప్యూటర్స్ కూడా చేసాడు మురళీధరుడు. ఎందులో జేరినా అందులో ముందుండేవాడు. సంస్కృతం, ఇంగ్లీషు, తెలుగు ఆపైన హిందీ భాషలలో చెప్పుకోదగ్గ పాండిత్యం సంపాదించాడు. మనిషి పొడగరి. జ్ఞానాన్ని విరజిమ్ముతున్న విశాలమైన నేత్రాలు. పచ్చని పసిమి. శ్రీకారాల్లాంటి చెవులు. ఎప్పుడూ మృదుమథురంగా మాట్లాడే పెదవులు. నిండుకుండ తొణకదన్నట్టు వినయ విధేయలతో కూడిన ప్రవర్తన. ఎమ్మెస్సీఅవగానే ఆ డిగ్రీతో ఎక్కడైనా ఉద్యోగం చూసుకోమంది సావిత్రి. కానీ మురళీధరుడు మటుకు తండ్రి చేసే పౌరోహిత్యం వైపే మొగ్గు చూపాడు. ఆయన వెనకాలే అందరిళ్ళకీ వెళ్ళేవాడు. కొడుకు అభీష్టం గ్రహించిన పురుషోత్తంగారు కొన్ని కొన్ని పూజలు అతనికి అప్పజెప్పేవారు. అలా మురళీధరుడిచేత పూజలు చేయించుకున్నవారు ఎంతో సంతృప్తి చెంది, పురుషోత్తంగారి దగ్గర అతడిని పొగిడేవారు.

కానీ సావిత్రికి కొడుకు ఇలా పౌరోహిత్యం చెయ్యడం ఇష్టం లేదు. అందులోనూ ఈమధ్య చాలామంది అమ్మాయిలు పౌరోహిత్యం చేసేవాళ్ళని పెళ్ళి చేసుకుందుకు ఇష్టపడడం లేదనీ, చాలామంది పురోహితులకి పెళ్ళిళ్ళు కావడం ఇబ్బందిగా ఉందనీ వింది. అందుకే ఈ కాలానికి తగ్గట్టు ఏ సాఫ్ట్‍వేర్ కంపెనీలోనైనా ఉద్యోగం చూసుకోమని బోలెడుమందిని ఉదాహరణలుగా చూపించింది కొడుక్కి. అందరి మాటో యెందుకూ.. మురళీధరుడి చెల్లెలు ప్రసూనే అలా చేసింది. బి.టెక్ చేసి, కొన్ని కంప్యూటర్ కోర్సులు చేసి, ఒక మల్టీ నేషనల్ కంపెనీలో ప్రోగ్రామర్ గా చేస్తూ, సాఫ్ట్‍వేర్ ఇంజనీర్‍గా పనిచేస్తున్న అబ్బాయిని తల్లితండ్రులు పెళ్ళి కుదిరిస్తే చేసుకుని, హాయిగా బెంగుళూరులో కాపురం చేసుకుంటోంది. అందుకే కొడుక్కి ఎమ్మెస్సీ డిగ్రీతో ఏదో ఉద్యోగం తెచ్చుకోమని ఎంతగానో నచ్చచెప్పింది. మురళీధరుడు నవ్వేసాడు.

“అమ్మా, ఎమ్మెస్సీ డిగ్రీ చాలామందికుంటుంది. కానీ ఇలాంటి పూజలు చేయించే అర్హత కొంతమందికే ఉంటుంది. ఆ అర్హత నాకు జన్మతః రావడంతోపాటు నేను యేళ్ళతరబడి ఏకాగ్రతతో నేర్చుకున్న వేదవిద్య దానికి దోహదపడింది. దానిని నేను సద్వినియోగ పర్చుకుని ఎంత గొప్పవాడిని అవుతానో చూడు..” అంటూ తల్లిని మరిపించేసేడు. అంతేకాదు.. అప్పట్నించీ తన వృత్తిని ఎవరైనా హేళన చేసినా, విమర్శించినా ఊరుకోకుండా వాదన వేసుకునేవాడు.

తను చేసే పౌరోహిత్యాన్ని ఎవరైనా హేళన చేస్తే తను పడే బాధ అతనికి తెలుసు కనకే మురళీధరుడు మిగిలిన వృత్తులవారిని యేమీ అనడు సరికదా వారందరినీ కూడా ఒక్కలాగే గౌరవిస్తాడు. సమాజంలో మనుషులందరూ సమానమేననీ ఎవరికి యివ్వవలసిన గౌరవం, మర్యాద వారికి యివ్వాలనీ అందరికీ చెపుతుంటాడు. తల్లితండ్రులని, గురువులని, పెద్దలని పూజించడం, గౌరవించడంలాంటి సంస్కారం తగ్గిపోతున్న ఈ రోజుల్లో వాటిని నిలబెట్టడానికి ఎంతో తాపత్రయపడేవాడు.

విలువలు తగ్గిపోతున్న ఈ కాలపు పోకడలను చూసి చాలా బాధపడేవాడు మురళీధరుడు. సినిమాల్లో, పుస్తకాల్లో తల్లితండ్రుల్ని, గురువులని, పురోహితులని తిట్టినా, విమర్శించినా ఆగ్రహోదగృడయిపోయేవాడు. ముఖ్యంగా ఈ రోజుల్లో వచ్చే సినిమాల్లో హాస్యమంటే ఎదుటి మనిషిని చాచి కొట్టడం, కాలితో తన్నడం లాంటివి చూపించడమే కాకుండా ఆ తిట్లు, హేళనలు, దెబ్బలు తినేవారు అమ్మానాన్నలో, గురువులో, శాస్త్రం చదివిన పండితులో అయి వుండడం అతన్ని మరీ ఆగ్రహ పరిచేది. ఏ పని ప్రారంభించాలన్నా పురోహితులు వచ్చి, పూజ చేసి, కొబ్బరికాయ కొట్టనిదే మొదలుపెట్టరుకదా..అటువంటప్పుడు కోట్లమంది చూసే సినిమాల్లో పురోహితులను, తల్లితండ్రులను, గురువులను కొట్టడం, వారిచేత వెకిలి సంభాషణలు పలికించడం చూసి, ఆ సినిమాతీసేవారిలోవున్న ఈ ద్వంద్వ వైఖరికి ఎంతో బాధపడేవాడు.

సినిమా అన్నది చాలా శక్తివంతమైన ప్రసారసాధనం. చూపించిందే చూపిస్తుంటే పెద్దవాళ్ళే కొన్నాళ్ళకు దానికి అలవాటు పడిపోతారు. అలాంటిది ఎదిగే వయసులో వున్న పిల్లలు కనక చూస్తే, అమ్మానాన్నల్నీ, గురువులనీ యిలా తిట్టినా, కొట్టినా తప్పులేదనే భావన వారికి వచ్చేస్తుంది. అందుకే మురళీధరుడు మిడిమిడి జ్ఞానంతో కోట్లమంది పూజించే దేవుళ్ళను ఈసడించి, అవమానపరిచేవారితో వాదనకు దిగి వారి నోటివెంట సమాధానం రానీయకుండా ఉక్కిరిబిక్కిరి చేసేవాడు. అన్నింటికన్నా చెప్పుకోదగింది యేమిటంటే తనలాంటి యువకులని కొందరిని కూడగట్టి, పెద్దలు శాస్త్రాలద్వారా ఈ లోకానికందించిన జ్ఞానసంపదను అందరికీ అందించాలనే తపనలో వున్నాడు.

నలుగురూ నడిచే అలవాటయినదారిలో కాకుండా కొడుకు వేరేవిధంగా నడవబోతున్నాడని గ్రహించిన సావిత్రి మురళీధరుడికి ఎంతో నచ్చచెప్పింది. ఆవిడ నలుగురినోటా అప్పుడప్పుడూ వింటున్న మాటలు చెప్పి కొడుకు ధోరణి మార్చడానికి ప్రయత్నించింది.

“చూడు నాన్నా, సినిమాలో ఆ పాత్రని అలా కొడితేనో, కాలితో తంతేనో ఆ సినిమా కనకవర్షం కురుస్తుందని వాళ్ళ సెంటిమెంటుట. మరి అన్ని కోట్లుపెట్టి సినిమా తీసుకుంటున్నవాళ్ళూ డబ్బులు పోగొట్టుకోలేరుకదా! అందుకే అలా తీస్తున్నారేమో..మనం ఏమనగలం?”

“అంటే నోరుమూసుకుని వుండమంటావామ్మా. డబ్బుకోసం అమ్మనీ, అక్కనీ, గురువునీ ఇలా వెకిలి సంభాషణల్లోకి లాగుతారా? డబ్బు కేవలం గమ్యాన్ని చేరే సాధనం మాత్రమే. కానీ వీళ్ళంతా డబ్బే గమ్యమనుకుంటూ ఇలాంటి పెడధోరణులు పడుతున్నారు. అమ్మా, నీకింకో సంగతి చెప్పనా?” ఊరించాడు మురళీధరుడు సావిత్రిని. కుతూహలంగా ముందుకు వంగిందావిడ.

“వీళ్ళు సినిమాలు మొదలుపెట్టేటప్పుడు చేయించుకునే పూజలకి వెడుతుంటాముకదా.. అప్పుడు వీళ్ళే మమ్మల్నెంత గౌరవిస్తారో.. మా ఆశీర్వాదాలు తీసుకుందుకు తహతహలాడతారు. కానీ వీళ్ళే మళ్ళీ మమ్మల్ని ఇలా చిత్రీకరిస్తారు. ఈ ద్వంద్వ స్వభావమే పనికిరాదంటున్నాను. నువ్వు ఆచరించేదే చెప్పు.. చెప్పినదానిని ఆచరించు..వాళ్ళు అలా చెయ్యడానికే మా పోరాటం.”

ఏదో విప్లవవీరుడులా పోరాటం అన్నమాట కొడుకు అంటుంటే సావిత్రికి కొంచెం భయం వేసింది. భయంగా పెట్టిన తల్లి మొహం చూసి మురళీధరుడు నవ్వేస్తూ, “అమ్మా, మేమేమీ కత్తులూ, కొడవళ్ళూ పుచ్చుకుని పోరాడం. సమాజంలో మనుషులందరూ ఒక్కటే, పెద్దవారిని గౌరవించడం మన సంప్రదాయం. అటువంటి మంచి విలువలున్న మన సమాజాన్ని ఇలాంటి పిచ్చివేషాలు వేసే సమాజంగా చూపిస్తే అది అధర్మం. ఆ అధర్మానికి ఎదురునిలిచి పోరాడడమే ఇప్పుడు మేం చేస్తున్న పని. మాది ధర్మాగ్రహం మాత్రమే. అందుకే మాది ధర్మ పోరాటం.” అన్నాడు.

అలాంటి మురళీధరుడు ఈ రోజు పోలీస్‍స్టేషన్‍లో వున్నాడంటే కారణం అంత చిన్నదేమీ కాదు.

అప్పటికి రెండురోజులక్రితం ఒక పెద్దహీరో సినిమా విడుదలయింది. ఆ సినిమాలో పౌరోహిత్యం చేయించేవారిని అవమానకరంగా చిత్రించారుట. ఆ సినిమాని విడుదల చేయకూడదంటూ దానిని వృత్తిగా స్వీకరించిన కొంతమంది పురోహితులు కోర్టులో పిటీషన్ వేసారు. సెన్సార్ సర్టిఫికెట్ తీసుకున్నాక ఎందుకు విడుదల చెయ్యకుండా వుండాలని సినిమా తీసినవాళ్ళు ప్రశ్నించారు. అందుకు నిరసనగా పురోహితులందరూ సంఘటితులై ఆ సినిమా విడుదలను ఆపమంటూ గొడవలు మొదలుపెట్టారు. వారిలో మురళీధరుడు కూడా వున్నాడు. అప్పుడు తనకీ, కొడుకుకీ అయిన సంభాషణ గుర్తు వచ్చింది సావిత్రికి.

“ఎందుకు నాయనా అనవసరంగా పెద్దవాళ్లతో గొడవలు పెట్టుకుంటావూ? వాళ్ళు డబ్బూ, అధికారం వున్నవాళ్ళు. ఈ లోకంలో వాళ్ళు చేసినదే న్యాయమవుతుంది.” అని సావిత్రి అడిగినప్పుడు మురళీధరుడు “అదేంటమ్మా నువ్వు కూడా అలా మాట్లాడతావూ! ఆ సినిమాలో పురోహితులని ఎంత అసభ్యంగా చిత్రీకరించేరో తెలుసా? అది హాస్యమంటూ అందరూ దానిని చూసి నవ్వండంటూ చూపిస్తున్నారు. ఇంత నియమనిష్ఠలతో జీవితాన్ని గడుపుతూ జనాల కోరికలు ఆ భగవంతునికి చేరవేసి, ఆయన ఆశీర్వాదాలు వీరికి అందిస్తూ ఒక అగ్నిహోత్రంలా జీవిస్తూ ఈ వృత్తినే నమ్ముకున్నవాళ్లని ఇలా హాస్యాస్పదంగా చూపించడం సబబేనా? ఏ వృత్తి విలువ దాని కుంటుంది. ఒక నేతపనివాడు ఎంతో ప్రతిభావంతంగా ఒక చీరని నేస్తాడు. మరో శిల్పి అద్భుతంగా శిల్పాలు చెక్కుతాడు. ఒక చిత్రకారుడు మనోరంజకంగా చిత్రాలని చిత్రిస్తాడు. వాటిని చూసి అందరూ మెచ్చుకుంటారే.. అలాంటిది భక్తుల కోరికలను భగవంతునికి చేరవేసి, ఆ దేవుని ఆశీర్వాదాన్నిభక్తుల కందిస్తున్న పవిత్రమైన వృత్తమ్మా ఇదీ. మరి మనం ఏం చేసామని మనలని హేళన చెయ్యడం? ఇన్నాళ్ళు ఇలా ఊరుకున్నందువల్లే వాళ్ళు ఇంకా ఇంకా మితిమీరుతున్నారు. దీనిని ఎక్కడోక్కడ ఆపాల్సిందే..” అన్నాడు.

కొడుక్కి నచ్చచెప్పమని భర్తని అడిగింది. దానికాయన “వాడు చేస్తున్నపని అభిలషణీయమే. నేనెలా కాదనగలను?” అన్నారు. ఇంకేమీ చెయ్యలేక ఆ భగవంతుడిమీదే భారం వేసిందా యిల్లాలు. దాని పర్యవసానమే ఇప్పుడీ సంఘటన. మళ్ళీ టీవివైపు దృష్టి సారించిందావిడ. ఆ కొట్లాటలో పాపం ఎవరో అబ్బాయికి గాయాలు బాగా తగిలాయి. ఆ అబ్బాయి పరిస్థితి చాలా విషమంగా వుందని హాస్పిటల్ ముందు మైకు పుచ్చుకుని యాంకర్ చెపుతోంది. సావిత్రికి కడుపులోంచి దుఃఖం వచ్చేస్తోంది. తన కొడుకు పోలీస్‍స్టేషన్‍లో వున్నాడు, పోలీసులు పాపం వాడిని కొడుతున్నారేమో..

అక్కడ పోలీస్ స్టేషన్ లో దెబ్బలాడుకున్న రెండు వర్గాలనీ ఒక్కచోటే కూర్చోబెట్టారు. తమకి తగిలిన దెబ్బలని చూసుకుంటూ ఒకరి నొకరు కోరగా చూసుకుంటున్నారు. డ్యూటీలో ఉన్న ఇనస్పెక్టర్ అందరినీ ఉద్దేశించి “ఎందుకయ్యా నడిరోడ్డు మీద గొడవలూ!” అంటూ మురళీధరుడు, సదాశివం లాంటి వాళ్లని చూస్తూ, “అయినా బాపనోళ్ళు కదా, మీ మంత్రాలేవో మీరు చెప్పుకోక ఇలాంటి గొడవలెందుకయ్యా మీకు?” అన్నాడు.

“మేమేం గొడవ పెట్టుకోలేదు. వాళ్ళు మమ్మల్ని అవమానించారు. మాకందరూ సమానమే.” అన్నాడు సదాశివం.

ఆవేశం తగ్గని ఓ కుర్రాడు, “ఊ బాపనోళ్ళే. అందుకే అర్ధంకాని మంత్రాలు చదువుతూ, ఎవరికీ వాటి అర్ధం తెలీనివ్వటంలేదు. అందరూ సమానమైనప్పుడు అలా అర్ధంకాని యంత్రాలు, తంత్రాలు, మంత్రాల గురించి నలుగురికీ చెప్పకుండా వాళ్ళల్లో వాళ్ళే చెప్పుకోవడం ఎందుకు?” అనడిగాడు.

దానికి మురళీధరుడు నవ్వుతూ సమాధానమిచ్చాడు.

“ఎందుకా.. చెపుతా వినండి. ఇప్పుడు మనలో చాలామంది కంప్యూటర్ వాడుతున్నాం. అది ఒక యంత్రం. దానిని తెరవడానికి పాస్వర్డ్ వాడుతున్నాం. అది మంత్రం. నీకు కావలసిన విండోను ఓపెన్ చేసుకోవడం తంత్రం. ఆ యంత్రాలు, మంత్రాలు, తంత్రాలు కనిపెట్టే నిపుణులు చాలా గొప్పవారు. వారు పగలూరాత్రీ తేడా లేకుండా ఒక తపస్సులా ప్రయోగాలు చేసి వాటిని కనిపెడతారు. సరిగ్గా అలాంటివారే ఋషులు. వారు స్వసుఖాలను అపేక్షించకుండా, అడవులలో తపస్సు చేసుకుంటూ, ప్రకృతిలోని ప్రకంపనలను ఎలా మానవులు సుఖంగా జీవించడానికి వీలుగా మంత్రాలతో, తంత్రాలతో మార్చుకోవచ్చో కనిపెట్టారు. అది కనుక్కోవాలంటే ఋషులై వుండాలి. మేము కేవలం పురోహితులం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగులు సైంటిస్ట్ లు కనిపెట్టినవాటిని ఎలా ఆచరణలోకి తీసుకొచ్చి వాడుతూ, పనులు చేస్తున్నారో అలాంటివారం. మేము కేవలం పౌరోహిత్యాన్ని వృత్తిగా చేసుకున్నవాళ్లం. ప్రకృతిలోని శక్తులను ప్రజలకు అనుకూలంగా మార్చే పాస్వర్డ్ లే మేము నేర్చుకున్న ఈ మంత్రాలు. కంప్యూటర్ వాడే ప్రతివాడూ దానిని ఎలా తయారు చేస్తాడో నేర్చుకోవాలంటే సాధ్యమా.. అది అంత తేలికా? వాడుకోవడం మటుకే తెలిసున్నవాళ్లం మనం. అది తయారుచెయ్యడ మెలాగో చెప్పమనడం హాస్యాస్పదం. అంతేకాదు. ఆ వాడుకోవడం కూడా సరైన పాస్వర్డ్ వాడాలి. అది తెలీకపోతే యంత్రం నడవదు. మేమూ అంతే. ఏ పూజ చేస్తామో దానికి తగ్గ మంత్రం సరిగ్గా చదవడం తెలిసుండాలి. లేకపోతే ఆ పూజ ఫలించదు సరికదా వెళ్ళకూడని సైట్ కి వెడితే వైరస్ కంప్యూటర్ని పట్టుకున్నట్లు సరైన మంత్రం సరిగ్గా ఉఛ్ఛరించకపోతే దాని వల్ల వచ్చే ఫలితం పూజ చేసేవారినీ, చేయించుకున్నవారినీ కూడా బెడిసికొడుతుంది.”

మురళీధరుడి సమాధానం విన్న ఇనస్పెక్టర్ కి కానీ, అక్కడున్న వాళ్లకి కానీ నోటమ్మట మాట రాలేదు.

ఇంట్లో సావిత్రికి కాళ్ళూ చేతులూ ఆడడంలేదు. ఫోన్ తీసి మళ్ళీ కామాక్షికి కలిపింది. కామాక్షి పలకగానే, “కామాక్షీ, అసలు మా అబ్బాయి మాదాపూర్‍లో వ్రతం చేయించడానికి పొద్దున్న ఏడుగంటలకి వెళ్ళేడు. ఈ గొడవంతా ఎప్పుడు ఎలా జరిగిందో తెలుసా?” అనడిగింది.

“అదే వదినా, మా సదాశివుడూ, ఇంకొంతమందీ కలిసి నక్షత్రజపాలు చెయ్యడం కోసం మాదాపూరే బయల్దేరేరు. వీళ్ళంతా బస్‍స్టాప్‍లో బస్ కోసం చూస్తుంటే అక్కడ ఎవరో పేపర్ చదువుతున్నారుట. ఆ పేపర్‍లో ఇవాళ విడుదలయ్యే ఈ సినిమా గురించి వుందిట. దాని విడుదల వివాదాల గురించి బస్‍స్టాండ్‍లో కొంతమంది మాట్లాడుకుంటూ “ఈ పంతుళ్ళకి ఏం కావాలీ? నాలుగు డబ్బులు ఎక్కువ పడేస్తే వాళ్ళే గోచీలు సద్దుకుంటూ పరుగెత్తుకు వస్తారూ..” అన్నారుట ఎవరో. దానికి అక్కడే వున్న మన పద్మనాభంగారబ్బాయి ఆవేశంగా వాళ్లకి సమాధానం చెప్పేడుట. అలాగ మాటమీద మాట వచ్చి, చూస్తుండగానే అటూ ఇటూ రెండు గ్రూపులుగా అయిపోయి, ఒకరి నొకరు దూషించుకోడమే కాదు, ఒకరి నొకరు కొట్టుకునే స్థితికి వచ్చేరుట. నడిరోడ్డు మీద గొడవ జరుగుతుంటే అక్కడే వున్న పోలీస్ కానిస్టేబులు స్టేషన్‍కి ఫోన్ చేస్తే వాళ్ళొచ్చి, వీళ్ళందరినీ జీపెక్కించి స్టేషన్‍కి తీసికెళ్ళేరుట. ఇదంతా నాకు అక్కడే స్కూల్ బస్ కోసం చూస్తూ నించున్న మా రెండోవాడు ఫోన్ చేసి చెప్పేడు. నేను మీ అన్నయ్యగారిని స్టేషన్‍కి పంపుదామంటే ఆయన ఊళ్ళో లేరయ్యె. అన్నయ్యగారేమైనా వెడతారేమో కొంచెం కనుక్కుంటావా?” అంది కామాక్షి.

సావిత్రికి ఏం చెప్పాలో తోచలేదు. “మీ అన్నయ్యగారు దయానిధిగారింట్లో హోమం చేయించడానికి వెళ్ళారు. ఎప్పుడొస్తారో.. ఏంటో..ఆ భగవంతుడు ఎందుకిలా చేస్తున్నాడో..” అంటూ నీరసంగా ఫోన్ పెట్టేసింది.

ఇంతలో పురుషోత్తంగారు వచ్చారు. తేరుకుని టైమ్ చూసింది. మధ్యాహ్నం మూడుగంటలయింది. తెల్లారకట్ట అనగా వెళ్ళి ఈ సమయందాకా ఏకాగ్రతగా హోమగుండం ముందు మంత్రోఛ్ఛారణ చేసి, కార్యాన్ని సక్రమంగా పూర్తి చేసుకువచ్చిన సంతోషం ఆయన ముఖంలో కనిపిస్తోంది. ఆయనని చూడగానే సావిత్రికి దుఃఖం ఆగలేదు. “ఏమండీ, మన అబ్బాయి..” అంటూ భోరుమంది. సావిత్రిని సముదాయించి అసలు జరిగినదేమిటో కనుక్కున్నారు. ఆయన కూడా రెండు న్యూస్ చానల్స్ చాలా శ్రధ్ధగా చూసి, మురళీధరుడు వచ్చేస్తాడు ఖంగారు పడొద్దని సావిత్రికి చెప్పేరు. తర్వాత ఫోన్ తీసుకుని హాస్పిటల్‍లో తెలిసున్న డాక్టర్‍కి ఫోన్ చేసి, దెబ్బలు తగిలిన అబ్బాయి గురించి కనుక్కున్నారు. పరిస్థితి విషమంగా వుందని తెలియగానే, కాళ్ళూచేతులూ కడుక్కుని దేముడి ముందు కూర్చుని మృత్యుంజయ జపం చెయ్యడం మొదలుపెట్టారు. సావిత్రి మాటరాక అలా కూర్చుండిపోయింది. తెల్లవారుఝామున గాయత్రీ చేస్తూ ఉధ్ధరిణెడు నీళ్ళు గొంతులో పోసుకున్న ఆయన మధ్యాహ్నం నాలుగవుతున్నా మెతుకు ముట్టకుండా అలా జపం చేస్తుంటే కాస్త భయంగా అనిపించింది సావిత్రికి. గంటన్నర అయ్యాక ఆ ఏకాగ్రతనుండి బయటకొచ్చారు ఆయన. నెమ్మదిగా దేవుడిముందునుండి లేస్తూ, “ఫరవాలేదు, తేరుకున్నాడు..“ అన్నారు. “ఎవరండీ?” అడిగింది సావిత్రి. “ఆ హాస్పిటల్‍లో వున్న కుర్రాడే. ప్రమాదం తప్పింది.” అంటూ పడక్కుర్చీలో జారగిలబడ్దారు. “మనవాడూ?” అనబోయిన సావిత్రి బలవంతంగా ఆపుకుని, “భోజనానికి లేవండి..” అంది. “ఇంకేం భోజనం? వేళ దాటిపోయింది. ఏకంగా రాత్రికి తింటాలే..” అంటూ టీవీ వైపు దృష్టి సారించారు.

పోలీస్‍స్టేషన్‍లో ఏం జరిగిందో చూపించటంలేదు కానీ, ఇరువర్గాలవాళ్ళూ కూడా వారి వారి పలుకుబడులని ఉపయోగించుకుని, ఈ గొడవని ఇంతటితో ఆపేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వారు చెప్పిన మాటల్లో స్పష్టంగా కనిపించింది. అలా భార్యాభర్త లిద్దరూ వార్తలు వింటూ అక్కడే కూర్చుండిపోయారు. సంధ్యాసమయమైంది. పురుషోత్తంగారు సంధ్యవార్చుకుందుకు లేచారు. ఇంతలో గేటుతీసుకుని నవ్వుతూ ఇంట్లోకి వస్తూ కనిపించాడు మురళీధరుడు. సావిత్రి ఒక్క ఉదుటున వెళ్ళి కొడుకుని పట్టేసుకుంది “పోలీసులు నిన్ను కొట్టలేదుకదా” అంటూ. మురళీధరుడు నవ్వేసాడు. “కొట్టలేదమ్మా.. బైటకి డాంబికంగా కబుర్లు చెపుతారు కానీ మమ్మల్ని ఏమైనా చెయ్యాలంటే అందరికీ భయమే. “ అన్నాడు.

“అందుకే వదిలేసారా?” అనడిగింది. “లేదమ్మా..సంధ్యాసమయమైంది కదా.. మేం గాయత్రి చేసుకునే సమయమైందని వాళ్ళకి చెప్పాం. అప్పటికే అందరూ యింక ఈ గొడవ ఆపేద్దామనే నిర్ణయానికొచ్చుంటారు. అందుకని, మీమీద కేసులేమీ పెట్టలేదుకదా.. వట్టినే రోడ్డుమీద గొడవ ఆపడానికి తీసుకొచ్చామంతే..అంటూ మమ్మల్ని ఇంటికెళ్ళిపొమ్మన్నారు. వచ్చేశాం..” అంటూ పకపకా నవ్వేసాడు.

కొడుకు మాటలకి తేలికపడిన మనసుతో “పోనీలే నాయనా, ఆ దేవుడు మనయందున్నాడు. అయిపోయిందేదో అయిపోయింది. నువ్వింకీ గొడవలవైపు వెళ్ళకు..” అంది.

 “ఎక్కడ అయిపోయిందమ్మా.. ఇది ఇంతలో ఆగేదికాదు. అసలు నిజానికి మన సంస్కృతినీ, విలువలనీ దిగజారుస్తున్న వారిమీద మా ధర్మాగ్రహం మొదలయిందిప్పుడే కదా.. రాబోయే తరానికి మంచి సమాజాన్నివ్వడమే మా ధ్యేయం” అంటూ స్పష్టంగా చెపుతున్న మురళీధరుడివైపు నిశ్చేష్ఠురాలై చూసింది సావిత్రి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here