‘ధిక్కార’ కవితా సంకలన ఆవిష్కరణ సభ – ప్రెస్ నోట్

0
12

[dropcap]పా[/dropcap]లమూరు సాహితి ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లుంబిని పాఠశాలలో జూలై 14 న జరిగిన ‘ధిక్కార’ కవితా సంకలన ఆవిష్కరణ సభ జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు జూలూరు గౌరీశంకర్ విచ్చేసారు.

బీసీలు తమ అస్తిత్వాన్ని తాము వెతుక్కుంటూ తమ హక్కుల సాధన కోసం తండ్లాడుతున్న సందర్భంలో వారికి అండగా బీసీ విద్యావంతులు, ఆలోచనాపరులు, బీసీ కవులు, రచయితలు బహుజన ఉద్యమ రూపకల్పన చేయవలసిన సందర్భం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి స్వీయ రాజకీయ అస్తిత్వమనే భావజాల ఆయుధం అందించినట్లుగానే ఇప్పుడు బడుగుల సాధికారిక ఉద్యమానికి భావజాల వేదికను రూపొందించాల్సిన బాధ్యత బీసీ మేధావులు తీసుకోవాలన్నారు. బీసీల ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయ పోరాటానికి, ఉత్పత్తి కులాలన్నింటిని ఏకం చేసే పనిలో బీసీ కార్మిక, కర్షక, విద్యార్థి, మేధావులు ఒక్కటిగా నిలిచి కదలాలన్నారు. బీసీలను ఓటు యంత్రాలుగా మార్చి 77 ఏళ్ళుగా పాలనను కొనసాగిస్తున్న పాలకుల నైజాన్ని తెలియజేస్తూ ఊరువాడలను ఏకం చేయాల్సిన పనిని బీసీ ఉద్యమకారులు చేపట్టాలన్నారు. స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అందుకు సిద్ధం కాకపోతే బీసీల నుంచి నిరసనను ఎదురుకోవాల్సి వస్తుందన్నారు. బీసీ కులగణనకు సంబంధించిన పనిని ఇప్పటివరకు ఆచరణరూపం తీసుకోలేదని బీసీలు ఆవేదనతో ఉన్నారన్నారు. బీసీల హక్కుల సాధనకు ఎవరు ఎంతవరకు నిలుస్తారన్న విషయాన్ని బీసీలు గమనిస్తున్నారని జూలూరు తెలిపారు.

‘ధిక్కార’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రముఖ రచయిత, జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెక్కెం జనార్దన్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే అణగారిన వర్గాల కోసం అహర్నిశలు కృషిసల్పిన గొప్ప మేధావన్నారు. జ్ఞాన సముపార్జన ద్వారానే రాజ్యాధికారం లభిస్తుందన్న పూలే వాక్కులు నేటికీ ఆచరణీయమన్నారు. దేశంలో కులవివక్షను తొలిసారిగా ఎలుగెత్తి చాటడమే కాకుండా దాని నిర్మూలన కోసం జీవితాంతం కృషి చేసిన సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని కొనియాడారు.

సభకు అధ్యక్షత వహించిన లుంబిని పాఠశాల డైరెక్టర్ కె. లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ ఆధునిక సామాజిక భారత నిర్మాత మహాత్మా జ్యోతిరావు పూలే సమాజానికి అక్షరజ్ఞానాన్ని అందించి బాల్యవివాహాలను నిర్మూలన చేసిన సంఘ సంస్కర్త అని కొనియాడారు. సావిత్రి బాయి పూలేకు చదువు చెప్పించి ఆమెతోనే పాఠశాలలను నెలకొల్పిన సామాజికవేత్త అని అన్నారు.

పాలమూరు సాహితి అధ్యక్షులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ పుస్తక సమీక్ష చేస్తూ ‘ధిక్కార’ కవితా సంకలనంలోని 156 కవితలు మహాత్మా జ్యోతిరావు పూలే వ్యక్తిత్వాన్ని, సామాజిక ఉద్యమ స్వరూపాన్ని చక్కగా ఆవిష్కరించాయన్నారు. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కవులున్నారన్నారు. సాంఘీక, సాంస్కృతిక సమానత్వం కోసం పోరాడిన మహానీయుడని కవులు పూలేను అభివర్ణించారన్నారు. ఒక్కొక్క కవిత ఒక్కో రీతిలో ఆలోచింపజేస్తుందన్నారు.

పుస్తక సంపాదకులు వనపట్ల సుబ్బయ్య, కవులు నాగవరం బాలరాం, వహీద్ ఖాన్, కందికొండ మోహన్, బోల యాదయ్య, కొప్పోలు యాదయ్య, ఖాజామైనోద్దీన్, గన్నోజు శ్రీనివాసాచారి, విఠలాపురం పుష్పలత, కర్నాటి రఘురాములుగౌడ్, అంబటి భానుప్రకాష్ తదితరులు కవితాగానం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here