దృతరాష్ట్ర కౌగిలి

0
6

[box type=’note’ fontsize=’16’] ఆయుర్వేదమును మన ఋషులు ఆత్మలో సాక్షాత్కరించుకొని అందులోని సృష్టి సూత్రాల నవగతము చేసుకొని తదనుగుణంగా భౌతిక, మానసికాధ్యాత్మిక త్రిగుణ సూత్రాలు కనిపెట్టి ప్రజలకు భోదించారనీ, దాన్నిని నిర్లక్ష్యం చేయకుండా విస్తృతంగా అధ్యయనం చేయాలని అంటున్నారు డా. గౌడ జనార్ధన్దృతరాష్ట్ర కౌగిలి” అనే వ్యాసంలో. [/box]

[dropcap]మ[/dropcap]హాభారత యుద్ధం ముగిసింది. వీగిన వారు, విజయులు అందరు ఒకే స్థాయి విషాదంలో ఉన్నారు. యుధిష్టరుడు, విషాద సాగర విహారం చేస్తున్నాడు. కౌరవ నిహతులైన కౌరవ కుటుంబీకులు విషాదాగ్నిలో దహించుకుపోతున్నారు. పరిస్థితిని కొంత తేలిక పరుచుదామని యోచించి శ్రీకృష్ణుడు పాండు పుత్రులను పాషాణ హృదయుడు, అంబిక నందనుడగు దృతరాష్ట్రుడుని దగ్గరకు తీసుకొని వెళ్ళాడు – ఆ వృద్ధునికి కొంతైన స్వాంతన చేకూర్చాలని. దృతరాష్ట్రుడు – గాంధారి, సంజయ, విదుర కణిక సమైతుడై కొలువు తీరి ఉన్నాడు. భయంకర నిశ్శబ్దం. శ్రీ కృష్ణ ధర్మజుల ఆగమనాన్ని సంజయుడు దృతరాష్ట్రుడుని కెరిగించెను. శ్రీకృష్ణుని పై గల గౌరవం, భయం వల్ల గాంధారి సమేతంగా అందరు నిలిచారు. శ్రీ కృష్ణుడు అందరికి నమస్కరిస్తూ సమీపించి కూర్చోపెట్టాడు. విదుర సంజయులు, పరమానంద భరితులయ్యారు. భక్తి పూర్వక ప్రణామాలు తెలిపారు. శ్రీకృష్ణుడు “మామగారు మీ తమ్ముని తనయులు తమ ఆశీర్వాదములు పొందుటకై వచ్చియున్నారు. వారిని సంపూర్ణ ప్రేమతో మీ తనయుల వలెనే ఆశ్వీరదించండి” అంటూ ధర్మరాజుని ముందుకు నడిపించాడు. దర్మరాజు పెదనాన్నకు పాదాభివందనము చేసి నిలిచి నంతనే దృతరాష్ట్రుడు ప్రేమపూర్వకంగా కౌగిలించుకొని శుభాకాంక్షలు తెలిపాడు. అర్జున, నకుల, సహదేవులను, ఆశ్వీరదించి పట్టలేని ఆతృతతో “కృష్ణా నా భీముడు ఎక్కడ” అని ప్రశ్నించాడు! శ్రీకృష్ణుడు “మామగారు మీ ప్రియాతి ప్రియుడైన భీముడు ఇక్కడే ఉన్నాడు మీ ప్రత్యేక ఆశీసులకై” అంటూ జీవకళ ఉట్టి పడుతున్న భీముని కంచు విగ్రహంను ముందుకు జరిపాడు.

దృతరాష్ట్రుడు “నీ కొరకే ఎదురు చూస్తున్నాను భీమా ” అంటూ కసి తీరా బిగి కౌగిలిలో నా విగ్రహాన్ని నొక్కగా ఆ విగ్రహం తునాతునకలు అయ్యింది. కృష్ణునికి తప్ప తక్కిన వారికంతా అయోమయం. ఏమి జరిగిందో తోచలేదు. “కృష్ణా ఈ మోసం నీదే! విగ్రహన్ని కౌగిలికిస్తావా? ఎంత కుటిలుడివో ఇప్పుడు తెలిసింది ధూర్తుడా” అంటూ గర్జించాడు దృతరాష్ట్రుడు. ముసి ముసి నవ్వులతో శ్రీ కృష్ణుడు “మామా, భీముడంటే నీ కెంత ప్రేమో తెలిసే ఈ నాటకమాడాను. నీ అంతరంగంలోని భీమ ద్వేషం నాకు కొత్త కాదు కదా” అనగానే విదుర, సంజయులు కలుగచేసుకొని దృతరాష్ట్రుడిని శాంతింపచేసి అంతపురంలోకి తోడ్కొని వెళ్ళారు. ఆ విధంగా భీముడు దృతరాష్ట్రుడు కౌగిలి నుండి రక్షింపపడ్డాడు. అలా కంచును కూడా నుజ్జు నుజ్జు చేయగల అంధరాజు శక్తి అపారము.

***

ఈ నాడు మనదేశమే కాక యావత్ ప్రపంచం వైద్య మనబడే దృతరాష్ట్రుని కౌగిలిలో బందింపబడి బయట పడలేకపోతున్నది. ఆ దుష్ట వైద్య వ్యాపారం తన కౌగిలిలోని విశ్వ మానవులను అటు చావకుండా ఇటు ఆరోగ్యంగా ఉండకుండా తన కౌగిలిలో ఉంచుచున్నది. ఒత్తిడి కలిగిస్తున్నది.

దృతరాష్ట్రుడునికి క్రోధమే తప్ప కుటిలత్వము లేదు. ఇక్కడ వైద్యవాణిజ్యంకి మనవాళి పై క్రోధం లేదు కానీ కుటిల నీతి కొండల కొద్ది కలదు. ఈ కుటిల నీతే తమకు తరగని రక్ష అను భ్రమలో ఉన్నది. ఈ రాక్షస కౌగలిలో ప్రజలు ఎంత దీర్గాయువుతో ఉంటే ఆ వాణిజ్యాని కంత సుభిక్ష. ఇదేదో పరిశీలిద్దాం -పామరభాషలో “ఇంగ్లీష్ వైద్యం”. ఇది మొఘల్ రాజు జహంగీర్ ఏలుబడిలో ఈ నేలపై పాదు నెలకొల్పుకున్నది. దాని తెర చాటు చరిత్ర ఇది.

జహంగీరు దర్బారు లోకి ఒక రోజు ఈస్టిండియా కంపెనీ దూతలు వచ్చి సలాములు చేసి చివరి స్థానంలో కూర్చునేవారు. వ్యసనపరుడైన జహంగీర్ తన వీలు చూసుకొని సైగ చేయగా ఆకొన్న కూనల్లగా బిరా బిరా వచ్చి, మళ్ళీ వంగి వంగి సలాములు చేసి చేతిలో ఒక వినతి పత్రము పట్టుకొని నిలబడ్డారు. అక్కడి పరిచారకుడా పత్రమును గైకొని పాదుషా కప్పగించగా, వానికది చదివే ఓర్మి లేక ఏమిటిది అన్నట్లు చూసాడు. జవాబుగా తాము ఈస్ట్ఇండియా కంపెనీ వ్యాపార సంస్థ నిర్వాహకులమని, తాము వ్యాపారం చేసుకోడానికి అనుమతి మరియు తమ సరుకులు నిల్వ ఉంచుకొనుటకై స్థలం కొరకు ప్రార్థిస్తున్నామని చెప్పుక్కున్నారు. ఏది తెలుసుకోకుండా తెల్ల దయ్యాలను దయ తల్చరాదని అనుమతి ఇవ్వలేదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత జహంగీర్ యొక్క పెద్ద కూతురు జహానరా బేగం సాహిబా (క్రీ.శ. 23-3-1614 – క్రీ.శ. 16-9-1681) కు ఒళ్ళు కాలింది. రాజ వైద్యులు చికిత్స చేసారు. ఒళ్ళు కాలడం చికిత్స ఒకటి రెండు వారాలు సమయం తీసుకుంటుంది. గాయాలు మానుకొచ్చే సమయానికి జహంగీర్‌కు సహనం నశించి రాజ వైద్యుడుని తిరస్కార పూర్వకంగా తూలనాడాడు. ఇదే అదునుగా తీసుకుని దర్బారులో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్వాహకులు వంగి వంగి సలాములు కొట్టగా “మళ్ళీ ఏమిటి మీ ఆర్జీ” అని ప్రశ్నించాడు. “జహాపనా! మా దగ్గర బహు సమర్థుడు అయిన హాకీం ఉన్నాడు! అతడు నాలుగైదు రోజులలో పూర్తిగా నయం చేయగలడు” అని విన్నవించుకున్నారు. జీవితానుభవం లేని జల్సారాయుడు జహంగీర్. ఈ మాటలు చాలా ఆహ్లాదం కలిగించాయి. వెంటనే ఆ హకీంను ప్రవేశ పెట్టమని హుకుం ఇచ్చాడు. తెల్ల హాకీం వచ్చి జహానారా బేగంను పరీక్షించి తనలో తాను నవ్వుకున్నాడు పాదుషా అజ్ఞానానికి. ఎలాగు నాలుగైదు రోజులలో పూర్తిగా నయం అవుతుంది. ఇప్పటికే పుళ్ళు మాని కండ పట్టుకోస్తున్నవి. క్రింది నుంచి ఆ నవ్వు జహంగీర్‌కు తన ప్రియ తనయ పట్ల వెకిలి నవ్వుగా తోచింది. కామెర్ల వ్యాధిలో ప్రపంచం అంత పసుపు పచ్చగా ప్రకాశిస్తుంది గదా! “ఎందుకు నవ్వుచున్నావు” అని హుంకరించాడు. ఆ తెల్ల హకీం “క్షమించాలి జహాపనా! ఇది చాల తేలికగా మానుకొచ్చే కాలిన పుళ్ళు. నాలుగు రోజులలో నయం చేస్తాను. మీ హాకీం అసమర్థతకు నవ్వొచ్చింది!!” అన్నాడు. పాదుషా పరమానంద భరితుడు అయ్యాడు. తన ముద్దుల బిడ్డకు మేలైన హాకీం దొరికాడు!

“పురానా హాకీం బరఖాస్ కరో నయ హాకీంకో షామిల్ కరో”అని మంత్రి గారికి హుకుం ఇచ్చాడు. అంటే పాత వైద్యుని వెళ్ళగొట్టి కొత్త వైద్యున్ని నియమించు అని అర్థం. అక్కడ ప్రవేశం లభించింది ఈ నడ మంత్రపు నకిలీ వైద్యానికి. ఆధునిక వైద్యం, మోడరన్ మెడిసిన్, ఇంకా ఏమైనా ఆడంబర నామావళి ఉంటే పెట్టవచ్చు. నకిలీ వైద్యం అని నేనటం కాదు. ఆధునిక నేత్ర వైద్య పితామహుడు పేరు పొందిన సర్ స్టీవర్ట్ డ్యూక్ ఎల్డర్ అను మహాత్ముడు “System of Ophthalmology” అని నేత్ర వైద్యాన్ని 7 సంపుటాలలో రచించారు. ప్రపంచ దేశాలలో తనకు నేత్ర వైద్యం గురించి లభించిన సమాచార మంతటిని సేకరించి క్రమబద్దీకరించి ప్రచురించారు.

అందులో ఒక సంపుటము “Lens, Vitreous, Glaucome” అనే మూడింటికి కేటాయిoచాడు.ఆ సంపుటంలో కంటి శుక్లం శస్త్ర చికిత్స గూర్చి వ్రాస్తూ “నేత్ర శస్త్ర చికిత్స చరిత్ర లోకి వెళ్ళాలంటే ప్రాచీన భారత దేశంలోని శుశృతుడు శస్త్ర చికిత్సకుని లక్షణాలు, ధర్మాలు స్పష్టంగా తెలిపాడు.శస్త్రచికిత్స గది, సిబ్బంది విధి నిషేధాలు తెలిపాడు. శస్త్రచికిత్స ముందు మత్తు మందు వాడేవాడు. శుక్ల (cataract) శస్త్రచికిత్స చాలా నైపుణ్యంగా చేసి చాలా చక్కటి ఫలితాలు పొందాడు. అతణ్ణి అనుకరించిన అలెగ్జాండ్రియన్లు ఇతర పాశ్చాత్యులు ఆ నైపుణ్యాన్ని సాధించలేకపోయారు!” అంటూ మెచ్చుకున్నాడు. శుశృతుడు ప్లాస్టిక్ సర్జరీ చేసాడు. శరీర నిర్మాణ శాస్త్రాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి తన శిష్యులకు భోదించాడు. అంత వైభవంగా వృద్ధి చెందినా ఆయుర్వేదం అధః పాతాళానికి తోక్కివేయబడింది. ప్రజలకు కూడా “కొత్త ఒక వింత పాత ఒక రోత” అన్నట్లు టిక్కు టక్కు డాబుసరి వైద్యం ఢంకా మ్రోగించడం మొదలుపెట్టింది. ఈ వైద్యం “అల్లోపతీ” అను పేరున ప్రచారం అయింది. ఈ అల్లోపతీ ‘Alloy’, ‘pathy’ అను రెండు పదాల సంధితో ఏర్పడింది. ‘Alloy’ అంటే ఒకటి కంటే ఎక్కువ (బహుళము), ‘pathy’ అంటే బాధలు. క్రీ.పూ. జేమ్స్ గ్రెగర్ అను అత్యుత్సహ గ్రీకు చికిత్సకుడి వలన ప్రజా వాక్కులోనికి వచ్చింది. అతని చికిత్స విధానాలు వింతగా ఉండేవి. మనం “ఉష్ణం ఉష్ణేన శీతలం” అన్నట్లు అతను జలుబు చికిత్సకు వచ్చిన రోగికి జలుబు ఎక్కువయే ఓషధాలు, విరేచనాలు ఎక్కువయే విధంగా, ఏ బాధతో వెళ్ళితే ఆ బాధ ఎక్కువయే విధంగా ఔషదాలు లిచ్చేవాడు. ఇదీ చూచి ప్రజలు ఈయన దగ్గరకు చికిత్సకి పోతే ఒక బాధతో పోతే రెండు, మూడు బాధలను అంట గట్టిస్తాడని హేళనతో “he is an allopath” అనేవారట. అదే పేరు స్థిరమైంది. తరువాత 20 శతాబ్దంలో అలా పేరు ఉండటం తమ శాస్త్రీయ సంస్కృతికే మచ్చ అని తలచి “modern medicine” అని పేరు పెట్టారు. మన దేశంలో జహంగీరు నుండి జవహర్‌లాల్ నెహ్రు, జవహర్ లాల్ నెహ్రు బిడ్డ , ఆ బిడ్డ కొడుకు, ఆ కొడుకు భార్య, ఆ భార్య యొక్క పెంపున నాయకుల ప్రాపకంతో ప్రతి భారతీయుని కణకణంలోని జన్యువులలో జీర్ణించుకు పోయింది డాబుసరి డొల్ల ఆధునిక వైద్యము.

ఇప్పుడిప్పుడు సృహ లోకి వస్తున్నది భారత జాతి. పిల్లిని పిల్లి బల్లిని బల్లి అనగలుగుచున్నది. ఐనా ఇంకా పిల్లిని, బల్లి అనే పిచ్చి కుక్కలు చాలానే ఉన్నాయి నేటికిని. జ్ఞాన కాంతి ఆవిర్భవించింది. మొగలాయి మూర్ఖ భావాలూ మాడ్చివేస్తుంది. ఆయుర్వేదమును మన ఋషులు ఆత్మలో సాక్షాత్కరించుకొని అందులోని సృష్టి సూత్రాల నవగతము చేసుకొని తదనుగుణంగా భౌతిక, మానసికాధ్యాత్మిక త్రిగుణ సూత్రాలు కనిపెట్టి ప్రజలకు భోదించారు. సుశ్రుత, చరకాది మహనీయుల అడుగుజాడల్లో నడుద్దాం! ఆధునిక శాస్త్ర దృతరాష్ట్ర కౌగిలి నుండి ముక్తి పొందుదాము. ఆయుర్వేదం మానవ పరిణామ క్రమం నుండి వికసించింది. మానవ, వృక్ష, జంతువుల శరీర నిర్మాణ, శరీర ధర్మ, మానసిక సంతులనాలను పరిగణన లోకి తీసుకొని, ఈ మూడు రాశులకున్న వాత, పిత్త, కఫా దోషాలను,రస రక్త మాంస మజ్జి, మేధా, అస్థి, శుక్ర ధాతుల అధ్యయనం చేస్తుంది. ఒక హృదయ స్పందనను తెలిపే నాడీ పరీక్షలో ఆధునిక వైద్యులు Rate, Rhythm, Volume లను నిర్ధారిస్తే ఆయుర్వేద వైద్యులు నాడీ పరీక్షలో 35 రకాల అంశాలను అధ్యయనం చేస్తారట!

ఆధునిక వైద్యంలోని వివిధ విభాగాలు న్యురాలాజీ, నేఫ్రాలాజీ, ఆస్థియాలాజీ, గయనకాలాజీ, పీడియాట్రీకిస్ మొదలగునవి ఆయుర్వేదంలో గూడా రస రక్త మాంస మజ్జి,మేధా,అస్థి,శుక్ర ధాతువు గాను, త్రిదోషాలుగాను, కౌమారా, శల్య, శాలాక్య నేత్ర మొదలగు విభాగాలుగాను కొన్ని వేల సంవత్సరాల క్రితమే విభజించబడినవి. శస్త్ర చికిత్సలు, వాజీకరణ, రసాయన, ఔషధాలు, పంచకర్మ విశేషాలు, ప్రాణాయ, యోగ, ధ్యాన, సాధనలు, ప్రకృతి వైద్యం మొదలుగునవి పరిపూర్ణంగా పరిణితి చెందినవి. మనకు తెలిసింది గోరంత తెలియంది కొండంత. ఆ కొండను త్రవ్వి ప్రాచీన వైజ్ఞానిక సంపదను పరిశోధిద్దాం. ప్రపంచాన్ని రుగ్మత రహితంగా తీర్చిదిద్దుదాం. ఆయుర్వేదంలో వ్యక్తి వ్యక్తికి మద్యన ఉన్న అలౌకిక శక్తీ, భావాలూ, పరస్పర మార్పిడి, చికిత్స శాస్త్రము నుండి విడదీయు లేని ప్రక్రియ. ఇది పూర్తిగా వికసించి యుండెను, ఆయుర్వేద స్వర్ణయుగంలో కళాఖండంలో నూటికి ఒకరిద్దరు రోగులు ఉండడివారు, ఆధునిక వైద్య పుణ్యమా అని అదంతా నశించింది. అంటే ప్రాణం పోయింది కాష్టం మిగిలింది. ఆ కాష్టాలే ఇప్పుడు చికిత్స ప్రవీణులుగా చలామణి అవుతున్నారు. కాని విచారక విషయం ఏమిటంటే ఆయుర్వేద వైద్యులు ” ఠావుల్ దప్పి,  ధైర్యము విలోలంబయి” ఎంసెట్‌లో మంచి ర్యాంక్ రాక చివరి ఆశగా BAMS ఎంపిక చేసుకుంటున్నారు. ఈ పరిస్టితి మారాలి. మొదటి ర్యాంక్ సాధించిన వారు ఆయుర్వేద మూలాలకు వెళ్ళండి. ఆయుర్వేద కళాశాలలు నిర్ణయించిన అధ్యయనం సరిపోదనుకొంటే ఇంకా విస్తృతాద్యయనం చేయండి. ఆయుర్వేద జ్ఞానార్జనకు ఏకోన్ముఖులు కండి. అనంతమైన జ్ఞాన ఖని ఉంది.

వ్యాసకర్త — డా || గౌడ జనార్ధన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here