దిగంతం!

16
14

[dropcap]పే[/dropcap]లాలతో పాటు ఉప్పుగళ్లేమైనా పడ్డాయా అన్నట్టు లాజహోమం చిటపటమంటోంది. కనిపించకుండా కమ్మిన పొగకి కాబోలు చప్పున చిప్పిల్లిన నా కళ్లకి దృశ్యం బూజరగా అయ్యింది. సప్తపదిలో వామభాగాన ఉన్న ఉత్సవవిరాట్టుని కుడివైపుకు మార్చుకుని, పెళ్లి అరుగుపై రతనాల పీట మీద కూర్చుంది తను. ప్రతిమ హస్తం మీద తన చేతిని సుతారంగా ఆన్చింది. ఆమె మరింత పరాయిగా అనిపించిన ఆ ఉత్తరక్షణంలో ఉక్రోషం ముంచుకొచ్చింది నాకు. నలక తీసేసుకుంటునట్టు కళ్లు తుడుచుకొని చూస్తే తన పాదాన్ని తానే పట్టుకొని సన్నెకల్లు తొక్కుతోంది. ఆశీర్వచనాల హోరు, మంగళహారతుల మోత మధ్య గుమ్మం దగ్గర పేర్లు చెప్పించే ముచ్చటకి ముత్తయిదువులు విరగబడుతుంటే మరిక వెనుతిరిగాను.

“అగరుధూపాల అగ్నిదేవుడు, మేనా కట్టిన మేఘుడు, కుచ్చుల జీను పీఠాన్ని పూన్చుకున్న గరుత్మంతుల సమేతంగా వేంచేసిన శ్రీరంగనాథస్వామి వారితో నేను- కొదైని వచ్చాను…”

– వినకూడదని ఎంత వేగాన వచ్చేసినా తన మాటలు చెవిన పడనేపడ్డాయి.

**        **        **

“నాయనా… విష్ణుచిత్తుల వారి ఇల్లు ఎటు?” రొప్పి… రొంజు కలగలపి అణగదొక్కి మరీ అడుతున్నాడొక పెద్దాయన.

బగ్గీలతో దౌడుతీస్తున్న గుర్రాల సకిలింపులు, గుంపులు కట్టి గుసగుసలాడుకుంటున్న అమ్మలక్కలు, పెరట్లోంచి వీధుల్లోకి చొరబడుతున్న రోకటి దంచుడు సువ్వీసువ్వాలు, ఒక పక్క కోలాటం చిందులు, మరో పక్క డప్పుల దండోరా, వడపెరుం కోవెల నుంచి వేదోచ్ఛాటన, వీధి అరుగుల మీద ‘పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు…’ దిష్టి దిగదుడుపు భట్టీయం…. ఇన్ని ధ్వనుల నడుమ కూడా చొచ్చుకొని చెవుల్లోకి చొరబడుతున్న పెళ్లి బజంత్రీలకి దూరంగా విసవిసా పారిపోతున్న నన్ను ఆపి మరీ అడగాలా- విష్ణుచిత్తుల వారి విలాసం! వీధిలోని ఇంతమందిలో నన్నే ఎందుకు అడగడం?

“ఇన్ని కుప్పాలు, పట్నాలు తిరిగినాను గానీ, రాజ్యానికి సేసబొట్టులా సెంగలించిన ఈ విల్లిబుత్తూరు ఊరునైతే చూడనే లేదంటే నమ్ము. ఏదో అమరాపురిలో అడుగెట్టినట్టు పైన కెంపు కలశాల నుంచి కింద అరుగుల మట్టిపట్టెల పసిడి దాకా, ఇంటికి కావలిలా గరుడపచ్చపూసలద్దిన చెక్కుడు ఏనుగులు, సింహాలు మోహరించిన వీధిమెట్ల వరకూ ధగధగలాడుతూ ప్రతి ఇల్లూ వైజయంతంలానే ఉందాయె. పుల్లంటురాళ్లు మెరుస్తుండబట్టి చెక్కిన రాతిచిలకలని పోల్చుకున్నాం గానీ, లేకపోతే ఇల్లిల్లూ పసరురెక్కల రాంచిలకలు వాలిన చెట్టు మాదిరే ఉంది. వీధులన్నీ ఏ వంకరటింకర లేకుండా ఉన్నాయి గానీ, రావణుడి కోటలా గహనంగా ఉంది ఊళ్లో. చూస్తుంటే అందరిలోనూ చురుకైనవాడిలా, సాక్షాత్తూ బలభద్రస్వామిలా పసిడికాంతుల స్ఫురద్రూపంతో ఉన్నావని నిన్నడిగాను,” నా ఆలోచనలు చదివేసినట్టు అన్నాడు. ఆయనతో బయిల్దేరిన గుంపు మాత్రం, అడుగడుగునా గొర్రెల్లా బహు విధేయంగా తననే అనుసరిస్తున్నట్టు అర్థమౌతోంది.

అటువంటి కలవర సందర్భం కాకపోయుంటే, మా ఊరి మీది మెచ్చుకోలుకి నాదైన వంతపాట జోడించేవాడ్ని. మాటలు పెగలనివ్వని మూగబాధ మనసంతా మూగి ఉంది కాబట్టి మేళతాళాలు మిన్నంటి వినబడుతున్న వీధి వైపు చేయి చూపించాను.

“ఆ సైగలేమిటయ్యా, ఏదో పరాయివాళ్లని చూస్తున్నట్టు ఆ వాలకం ఏమిటి? మేము కూడా పురశ్చూడ వైష్ణవులమే. వైంగై నదీతీరం నుంచి పడుతూ లేస్తూ వస్తున్నాము. భట్టనాథులు చాలా కావల్సిన వారు,” అని ఆయన నిష్టూరపోవడంతో నోరువిప్పక తప్పలేదు నాకు.

“ఆ పడమర వీధిలో పాతిక అడుగులు వేసారంటే కుడివైపున నందనవనం, దానికి మూలవాటుగా వడపెరుం కోవెల. దాన్ని దాటితే ఇక ఎవ్వరూ చెప్పనక్కర లేదు, మీకే తెలిసిపోతుంది,” అని చెప్పి, ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఇంటివైపు వెళ్లిపోయాను, ఎవరో తరుముతున్నట్టు.

అమ్మానాన్నా చెల్లెళ్లూ… అందరూ పెళ్లి సంబరాల్లోనే ఉన్నారు. ఎవ్వరూ లేక ఏకాకితనంలా బావురుమంటోంది ఇల్లు. నడవాలో నేలమీదే కూర్చుండిపోయాను. కన్నీళ్లతో కడిగేందుకు వీల్లేని విచారం నాది- అది కేవలం ఈ మ్లాన క్షణాలది మాత్రమేనా? కాలాంజనాన్ని నా గోటితో పెరికి చిన్నారి కోదై చిట్టిపొట్టి అరికాలి మీద దిష్టిచుక్కగా పెట్టిన కాలాల వెనక్కి పరుగులు తీసింది మనసు.

**        **        **

విష్ణుచిత్తుల వారి మాతృమూర్తి పద్మవల్లి, మా అమ్మమ్మ శ్రీవల్లీ తోబుట్టువులు. మా అమ్మ అమృతవల్లిని పద్మవల్లి అమ్మమ్మ ముద్దు చేస్తే, ఆవిడ కంటే ముకుందభట్టార్ తాత గారు మరి కాస్త ఎక్కువ గారాబంగా చూసేవారట. అబ్బురాల బిడ్డగా వారింటనే పెరిగింది అమ్మ. అందుకే విష్ణు మామయ్యకి ఆ చెల్లెలన్నా, ఆమె ఒక్కగానొక్క కొడుకునైన నేనన్నా వల్లమాలిన ప్రేమ. మామయ్య ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళ్లేవాడు. మేనమామ తోక అని వెక్కిరించేవారు నా నేస్తుగాళ్ళు. నేను మామయ్య తోకని కాదు, గరుత్మంతుడి వంటి ఆయన వల్ల రెక్కలు తొడిగినవాడిని. ఇల్లు- తోట- గుడి మధ్య మాత్రమే గిరిగీసుకున్న చిన్న ప్రపంచంలా తోచవచ్చు. పూలు సేకరించడం, మాలికలల్లడం, మహాదేవుడి మెడలో వైజయంతికి జతగా మరొకటి చేర్చడం – అంతే ఆయన లోకమని, సంతర్పణలా వచ్చీపోయే వారికి తన పెద్ద చేతితో వడ్డించడం – అంతకుమించి మరొకటి పట్టదనీ భావించడం సహజమే. కానీ, మామయ్య మనోలోకం అవధులు లేనిది, అది జ్ఞానచక్షువుకే తప్ప మామూలు కంటికి కనిపించదు.

అయితే, హనుమంతుడిలా ఆయన శక్తి ఆయనకి తెలియదు, ఎవరైనా తెలియజెప్పాలి కామోసు. ఎరుకపరిచే ఆ పని దేవదేవుడే స్వయంగా తీసుకున్నాడు కాబట్టే పాండ్య ప్రభువు వల్లభదేవుడి కొలువులో నారాయణపరత్వాన్ని సిద్ధాంతీకరించి, ప్రభువుల, పండితుల సంశయాలు తొలిగించి, విష్ణుపారమ్య స్థాపన చేయగలిగాడు.

“ఏదో గురుకులంలో నామమాత్రంగా చదువుకున్నవాడ్ని, పాదులు పెట్టి, చీడని తీసి, ఎరువులు వేసి మొక్కలు పెంచే తోటమాలిని, పూదండలు స్వామి కైంకర్యానికి సమర్పించుకునే పుష్పలావికుడ్ని, పండితుల సభలో సంవాదానికి వెళ్లే శక్తి నాకేముంది…” అని మా నాన్నగారి దగ్గర మామయ్య వాపోయారు. అదే రాత్రి ప్రహ్లాదవరదుడి స్వప్నదర్శనం అయ్యిందట, వెన్నంటి ఉంటా నీ తోడుగా అని అభయమిచ్చాడట స్వామి.

ఆపస్తంబ ప్రమాణ సూత్రం ‘ధర్మఙ్ఞ యసమయః ప్రమాణం వేదాశ్చ’ ఆధారంగా నిజమైన పరతత్త్వ నిరూపణ చేయవల్సిందిగా మహారాజు వల్లభదేవుడు విద్వాంసులని ఆహ్వానించడం నుంచి, నాటి సభలో వాదప్రతివాదాల గురించి మామయ్యకి తోడుగా వెళ్ళిన నాన్న పూసగుచ్చినట్టు చెప్పినా, పట్టుమని పదేళ్లు కూడా లేని నాకు ఏమాత్రం బోధపడలేదు. అయితే, పండిత సమేతంగా రాజు గారు మామయ్యకి సంపదలిచ్చి సత్కరించడం, బిరుదులివ్వడం, గజారోహణ పురస్కారాన్ని స్వయానా విష్ణుదేవుడే తిలకించడం వంటి విశేషాలు మాత్రం నా మనసులో దృశ్యాలుగా ముద్రించుకుపోయాయి.

తన శక్తి తనకి తెలియదన్నది ఎంత నిజమో, లేనిపోని పెద్దరికం భుజం మీద వేసుకునే అమాయకత్వం కూడా ఉంటుంది మామయ్యలో. పాండ్యరాజు సన్మాన సందర్భంగా బ్రహ్మాది దేవతలతో పాటు విచ్చేసిన విష్ణుదేవుడు పరమాత్ముడని, జగద్రక్షకుడనీ మర్చిపోయి, తిరణాలలో తప్పిపోయిన పసివాడ్ని చేరదీసి, వాడి సంరక్షణ చూడాల్సిన పెద్దదిక్కుగా తనని తాను ఊహించేసుకుంటాడు. గాలిసోకిందనో, దిష్టి తాకిందనో బిడ్డని కొంగుచాటున దాచిపెట్టి, ఆనక ఉప్పుగల్లు దిగదుడిచే అమ్మ అనురాగాల అమాయకత్వంతోనే ‘పల్లాండు పల్లాండు పల్లాయిరత్తాండు పలకోడి నూరాయిరమ్… మల్లాండ తిండోళ్ మణివణ్ణా!ఉన్ శేవడి శెవ్వి తిరుక్కాప్పు (పలుఏండ్లు పలుయేండ్లు పలువేన వేలేండ్ల పలుకోటి నూరేండ్లకున్ అరిమల్లురను గెల్చు మణివర్ణా! నీ అరుణచరణాల సిరికి తిరురక్ష!).. అంటూ పన్నెండు పాశురాల ‘తిరుపల్లాండు’ ఆశువుగా చెప్పేశాడట. కవితా రసాన్ని మించి తనలో పొంగులెత్తే అమ్మతనంతో, జగన్నాథుడిని తన చావిట్లో దోగాడే పసివాడిగా, తాను యశోదమ్మగా తలచి రచించాడు ‘తిరుమొళి’ కూడా. పాండ్యరాజు అప్పగించిన అపారమైన సంపదలో వీసమెత్తు కూడా సొంతానికి తీసుకోకుండా, మొత్తం వటపత్రశాయి కోవెలకే సమర్పించడంలో కూడా కన్నయ్యకి కొసరి కొసరి తినిపించే అదే తల్లి మనసు మామయ్యలో.

ఆ తర్వాత నేను మరింత మామకూచినయ్యాను. ఆయనతో పాటే బ్రాహ్మీ ముహూర్తానికి నిద్రలేచేవాడిని, చన్నీటి స్నానాలు చేసేవాడిని. పాశురగానానికి గొంతు కలిపేవాడిని. ఆయన చక్రాంకిత భుజాల మీద ఊసకాళ్ల ఉత్సవమూర్తిలా ఊరేగేవాడ్ని. నాతో అభ్యంజనం చేయించుకోవడం మామయ్యకి ముచ్చట. ఆయనతోనే ఊర్థ్వపుండ్రాలు దిద్దించుకోవడం నా సరదా.

ఆ పొద్దు నాకింకా గుర్తే, తోటలోకి వెళ్లాను మామయ్యతో పాటే. పండు బాదంకాయలు రాల్తుంటే ఉడతల ఉలికిపాటు. వాలిన చిలకల గుంపుకి సంపెంగ గుబురు సుగంధాలద్దుతుంది. చెంగల్వ చెక్కిళ్ల మీంచి రాలి తామరాకు దోనెలపై దొర్లుతున్న నీటిపూసలు. తెల్లారిందో లేదో తలంటు పోసుకున్న బారెడు జుట్టు అల్లరి గాలికొదిలేసి తోటలో చెంగుమంటున్న పుష్పలావికలు. కోసే పూల కంటే, వాళ్లు రాల్చేవే ఎక్కువ. పల్లెత్తు మాట అనడని మామయ్య అంటే మహా అలుసు ఆ ఆడపిల్లలకి. ఆషాఢం ఎడబాట్లూ- ఎకసెక్కాల ఎత్తిపొడుపులు. ఎదురుగా గుడి ధ్వజస్థంభం చిరుగంటల కంపనం, కొమ్మల ఊయల మీద పిట్టల కూనిరాగం, కొట్టాంలో బుజ్జాయిల కాలిమువ్వల గత్తర కలగలిసి, ఆడపిల్లల పకపకల దేశి సంగీతానికి కొసరు వాద్యాలౌతున్నాయి.

కొలనులో మోకాలు లోతులో నిల్చొని తెల్ల తామరల్ని తూడులతో పాటు తెంపుతున్నాను. కొలను పక్కన తులసి వనంలో పాదులు తీస్తున్నాడు మామయ్య. హఠాత్తుగా ‘కన్నా’ అని మామయ్య పిలిచేసరికి ఉలిక్కిపడ్డాను. నహుషాచార్యుడని పేరు పెట్టి, అన్నప్రాశన నాడు బియ్యంలో రాయించింది మామయ్యే అట గానీ, ఎన్నడూ ఆ పేరుతో పిలిచిందిలేదాయన, ‘కన్నా’ అంటాడు నోరారా.

కొలనులోంచి మామయ్య పిలిచిన వైపుకి పరుగులు తీశాను. పాలగచ్చు తిన్నె మీద పద్మంలా ఒత్తిగిల్లి నిద్దరోతున్న ఓ పాపని సంభ్రమాశ్చర్యాలతో చూస్తున్నాడు మామయ్య. పూర్వ పాల్గుణిలా సుఖదుఖాలు, పడుగుపేకలు రెంటికీ చెందిన నక్షత్రమొకటి ఈ మట్టినేల మీద తులసి వనాల పొత్తిళ్లలోకి జారినట్టనిపించింది. బిడ్డని భుజాన వేసుకొని ఇంటికి నడిచాడు మామయ్య. ఆయన వెంట నేను. సంతానం కోసం అలమటించే అత్తయ్యతో చెప్పాడు మామయ్య, ఆ బిడ్డ పెరుమాళ్ ప్రసాదమని.

నాళనామ సంవత్సరం ఆషాఢ శుద్ధ చతుర్దశి మంగళవారం పూర్వ ఫల్గుణి నక్షత్ర శుభసమయాన దొరికిన ఆ పూలచెండుని నేను ఎత్తుకున్నప్పుడే పెట్టాడు మామయ్య పేరు- కొదై!

ఆ క్షణం నుంచే నా లోకమైపోయింది కొదై. తనకి దూరమౌతానని గురుకులానికి వెళ్లనంటే వెళ్లనని మొండికేశాను. మామయ్య గారాబంతోనే మరీ నెత్తికెక్కుతున్నానని మండిపడ్డ నాన్నకి మామయ్యే నచ్చజెప్పి తన ఒడినే బడి చేశాడు కొదైకి, నాకూ. అయితే, అదప్పుడు ఆనందమనిపించినా, తర్వాత అనర్థాలకీ, కొదై నాకు పూర్తిగా దూరమైపోవడానికి కారణమయ్యిందనుకుంటా. ప్రాణాధికంగా ప్రేమించిన నాకే కాదు, వెలుగునీడల, సుఖదుఃఖాల, రేయింబవళ్ల, జరామరణాల ఐహికప్రపంచానికి కూడా కొదై కానిదయిపోయింది ఆ బడి వల్లే.

Image Credit: Sri Bapu

ఎప్పుడూ ఈడుకి తగ్గట్టు మెలిగిందే లేదు. తోటివాళ్లతో పొసగినట్టు నడుచుకున్నదే లేదు. ఎంతటి ఏకసంథాగ్రాహి అంటే, సుమారు ఐదువందల పాశురాల మామయ్య తిరుమొళి ఒక్కసారి విన్నంతనే పాడేయగలిగినంత. వైష్ణవవాఙ్మయం తనకి కరతలామలకం. మహా పండితులు, బ్రహ్మజ్ఞానుల్నే నివ్వెరపరిచే ధారణ. నలుగురితో కలవదు గానీ, ముచ్చులా ఉండేది కాదు; ఒక్కతే నలుగురిలో నగుబాటు పడుతున్నట్టు చెంగుమంటుండేది. అదేమిటే అంటే- ‘మేమంతా కన్నయ్యతో దాగుడుమూతలాడుతున్నాం కద బావా’ అనేది. తను ముద్దుగా ‘బావా’ అన్నప్పుడు లోకాలు మరిచి, మైమరచేవాడ్నే గానీ, కొదై లాగా కాలాలు కడచి నిన్నటి యుగాలకి వెళ్లగలిగే అలౌకికత్వం అందలేదు. మామయ్య చెప్పే కథల్లో, పాడే పాటల్లో, పంచుకునే ముచ్చట్లలో కదలాడే కాల్పానిక జగత్తుకి, ఆయన ముందు బాసీపట్టు వేసుకొని కూర్చొని ఆలకిస్తున్న ఆమె వసిస్తున్న వాస్తవిక ప్రపంచానికీ మధ్య ఉన్న మన్వంతరాల, యుగాంతరాల అగాధాన్ని అమాంతం దాటేసింది. అది నాకు తెలుస్తున్నా, దాన్ని గుర్తించి, గ్రహించి, అంగీకరించడానికి ఆనాడు, ఈనాడు కూడా సిద్ధంగా లేను నేను.

కొదై మీద అవధుల్లేని నా ఆపేక్ష ఎదిగే మా ప్రాయాలకి తగ్గ కొత్త అర్థాలు మార్చుకొని, మునుపు కనీవినీ ఎరగని వింత రంగులు పులుముకొని, నన్ను నాకే మళ్లీ పరిచయం చేసిన రోజుల్లో, ఆ అందాలకి నప్పని ‘అసహన’మనే శీఘ్రవ్యసనం అంటుకుంది నాకు. ఒకే చూపైన రెండుకళ్లనీ ప్రయత్నాన విడిదీసి చూస్తే గాని అంతుబట్టని యోగ- భోగాల సమ్మేళనంగా ఉండేది కొదై. కానీ, ఏకకాలంలో ఆమె భావ- భౌతిక రూపాలు చూడగలిగే సాధనకి ప్రధానమైన అడ్డంకి ఆమె మీద ప్రేమే. రక్తమాంసాల శరీర ధర్మాల్నీ, రుతుచక్ర భ్రమణాల తప్పనిసరితనాల్ని, రాగద్వేషాల ఆటుపోట్లనీ ఆమె ఎంత తీసుకుందో, అంతకంత నిరాకరించింది. ఆమె ఆల్చిప్ప కళ్లు అరమోడ్పులౌతాయి, ఊపిరి గాలులు నిట్టుర్పులై వేడెక్కుతాయి, చూచుకాలు ఉలిమొనలై సృష్టిని కొత్తగా శిల్పించబూనతాయి. కంటికి కనిపించే ఆమె ఐంద్రియ వికారాలకి భౌతిక ప్రేరణ ఎంతమాత్రమూ లేకపోవడమే నా పాలిట విషాదం.

అంతటి తీవ్ర అంతరంగ ఉత్పాతాల్ని ఆ లలితలావణ్య లతాంగి నిభాయించడం సాధ్యమయ్యేదే కాదు, మహారసార్ద్ర సాంద్రభావనల బలిమి ఆమెలో లేకపోయినట్టయితే. ఓ ధనుర్మాసంలో ‘సిరినోము’ నెపాన రోజుకొక పాశురం చొప్పున కొదై ఆలపించిన ముప్పై పాశురాలు తన కవిత్వ- ఋషిత్వానికి నిదర్శనంగా నిలిచాయని రాజ్యమంతా మార్మోగిపోయింది. చతుర్వేదాలు, అష్టశతోపనిషత్తులు, షట్దర్శనాల సారం ఆ పాశురాలలో ఇమిడ్చిందని ఆమెని ప్రశంసిస్తూ పండితులు పరవశించారు.

ఆ రోజుల్లోనే నన్ను చేష్టలుడిగేలా చేసిన ఓ దృశ్యం నా కంటబడింది. చెంగల్వలతో నిండైన విరిదండ అల్లి పూజామందిరంలోని సజ్జలో పెట్టమని నాకు పురమాయించాడు మామయ్య. తల్లి బిడ్డకి పాలు కుడిపినంత ప్రేమగా, తాపసి ధ్యానం చేసినంత తదేకతతో, కత్తివాదర మీద నడిచేంతటి ఏకాగ్రతతో మాలికలల్లుతాడు మామయ్య. అటువంటి పూమాలని కార్మేఘమంత తన కొప్పులో అలంకరించుకొని పెరటిబావిలో తన ప్రతిబింబాన్ని చూసుకొంటోంది కొదై. కాళ్లూ చేతులూ ఆడలేదు నాకు. కొదైని వారించలేను, మామయ్యకి చెప్పలేను.

కొన్నేళ్ల క్రితం కొదైని, నన్ను కూడా శ్రీరంగపట్నం తీసుకెళ్లాడు మామయ్య, ఓ పర్యాయం. అప్పటికింకా చిన్నవాళ్లం.

“నాన్నా చూడండి, తొలిపొద్దు సంజెకాంతులు శ్రీరంగ గోపురం చుట్టూ ఎలా వెలుగుతున్నాయో, ఉదయాన్నే మీరు కట్టే పట్టు శిరోవేష్టనంలా లేదూ…” అంది కొదై కావేరిలో మునిగిలేస్తూ.

మామయ్య కేమో గానీ, నాకయితే చెప్పరాని చోద్యమయ్యింది కొదై వాలకం. అంతటితో ఆగిందా, రంగనాథుడి కోవెలంతా తానే, ఇల్లు పీకి పందిరేసినంత ఆర్భాటం చేసింది, తను రావల్సిన చోటుకి వచ్చేసినట్టు ఒకటే సందడి.

“రంగ, ఓ రంగా… నన్ను పెళ్ళిచేసుకుంటే నీకు నూరు గిన్నెల తీయని చక్రపొంగలి, నూరు గిన్నెల వెన్నముద్దలూ తాయిలంగా పెడతాను…” అని పైకే మొక్కుకుంటుంటే, దాని ఆరింద మాటలకి మామయ్య ముసిముసినవ్వులతో ఊరుకున్నాడు గానీ, నేను మాత్రం అలా సరిపుచ్చుకోలేకపోయాను. ఉడుక్కున్నాను, ఒక మొట్టికాయ ఐనా వేయాలని తెగ గింజుకున్నాను.

స్వామికి వేసే పూలదండని ముందు తన కొప్పులో ముడుచుకుంటున్న బరితెగింపు చూశాక కూడా కొదై నాకు అందరాని దూరాలలో ఉందని ఒప్పుకోలేక పెనుగులాడాను.

ఇంతలో మలి రచన తిరుమొళి మొదలెట్టింది కొదై. ఒక్కొక్క పాశురాన్నీ ఆశువుగా ఆలపిస్తుంటే నాకు గంగవెర్రులెత్తిపోయింది. తొలి రచనలో అల్లరి, ఆటపాటలు, పిల్లచేష్టలు, చిలిపితనం, ముగ్ధత్వం, ముదినాపసానితనం ఉన్నాయి. అందులో వలెనే ఇందులో కూడా ఈమె ఓ గోపకాంత. కానీ, ఆద్యంతాలూ ఆమె రహోవేదనే. మేఘాలు, కోయిలలు, నెమళ్లు అన్నీ స్వామికి రాయబారులే, వార్తాహరులే, ప్రియదూతికలే. మనుషులు, దేవతలు, పశుపక్షాదులే కాదు, స్వామికి చేరువైన ప్రాణంలేని పాంచజన్యం కూడా ఆమె ఈసునసూయలకి గురికావల్సిందే. సాత్విక దేవతార్చన ముగిసిన నిన్నటి కథ. ఉమ్మెత్తలతో నేడు రాజస దేవతోపాసనకి ఆయత్తమయ్యిందామె. ఇప్పుడు మన్మథుడే రక్షకుడు, తాను దగ్ధమైపోయినా, ప్రేమని నిలిపి, గెలిపిస్తాడు. అదీ నమ్మకం. అతడికి తోడుగా అతడి తమ్ముడు సాంబుడ్ని కూడా బతిమాలుకుంది.

నేను ఎరిగిన కొదై యేనా ఇది రచిస్తుంది – అని నాకు అంతుబట్టలేదు. నా బుద్ధితో గ్రహించలేని ఉద్వేగ, ఉన్మత్త శక్తులేవో ఆవహించాయి ఆమెని. వివాహం- పాణిగ్రహణోత్సవం, శేషహోమం, సప్తపది, మంగళావభృధం – తనకీ స్వామికీ పెళ్లి జరిగినట్టు వచ్చిన కలని మరో పది ప్రత్యేకమైన పాశురాల్లో వర్ణించింది కొదై.

అందరి కలల్లోకీ వస్తున్నాడు గానీ, నా కలలోకి రాడేం స్వామి; వస్తే నా భంగపాటు గురించి, కొదై చుట్టూ గుదిగుచ్చి నేను అల్లుకున్న ఆశల పొగడమాలికల దండ నిష్ఫలం కావడం గురించి నిలదీద్దామనుకున్నాను.

స్వామికి కైంకర్యం చేయబోయే ముందు ఆ మాలలో చిక్కుకున్న వెంట్రుక చూసి అదిరిపడ్డ మామయ్య, జరుగుతున్నది తెలుసుకొని కొదైని గట్టిగానే మందలించాడు. అయితే, ఆ రాత్రి ఆయనకీ కలవచ్చిందట, కొదై కొప్పులో మాలే తనకి ప్రీతికరమని రంగనాథుడు చెప్పినట్టు. కొదైని తనకిచ్చి పెళ్లి చేయమని మరో కలలో, పెళ్లికి తనని విల్లిపుత్తూరు తీసుకువెళ్లమని శ్రీరంగ ఆలయాధికారికి కూడా ఇంకో కలలోనూ చెప్పాడట పెరుమాళ్.

భయాలో, భ్రమలో ఏదయితేనేం, నా కొదై బతుకు బండరాయి పాలవడం ఖాయమయ్యింది; కల-మెలకువలకి పీటముడి పడనుందని తేలిపోయింది. ఎవ్వరూ వినిపించుకునే స్థితిలో లేరు. ఏమైనా కొదైకి చెప్పగలిగే పరిస్థితులు ఎప్పుడో చెయిదాటిపోయాయన్నదే పచ్చినిజం. అందుకే, ఆ విషాదాన్ని లోకాతీత ప్రణయంగా నమ్మి, జనాల్ని కూడా మభ్యపెట్టే స్థితికి చేరుకున్నారు అయినవాళ్లంతా. ఇక అదొక వినోదంగా, వింతగా చెప్పుకుంటున్న ప్రజలు తండోపతండాలుగా విల్లిపుత్తూరు చేరుకొని, పెళ్లి తంతుని విరగబడి చూశారు.

**        **        **

“మా కొదైని పెళ్లికూతురుగా చూడటానికి రెండు కళ్లు చాల్లేదంటే నమ్మండి. కుంకుమపూవు పంకం, చల్లని చందనాలతో నలుగు పెట్టి పరిమళభరితమైన వసంతోదకంతో మంగళస్నానాలు అయ్యాక, తెల్ల పట్టు చీర కట్టించామా, నిరలంకారంగానే సాక్షాత్తూ భూదేవిలా ఉంది. ఇక కంకణాలు, భుజకీర్తులు, సరాలు, ఉంగరాలు, కమ్మలు, ముక్కెర, మెడలో తారహారాలు వేశాక అచ్చం వసుంధరే అనుకోండి…”

– అమ్మ గొంతు వసారాలోంచి వినబడుతుంది. మంచం పట్టి కదల్లేని పక్కింటి జేజికి గట్టిగా అరిచి చెబుతోంది.

అక్కడ నుంచి వచ్చేసినా, ఆలోచనలు తెంచేసుకోలేక నేను తన్నుకులాడుతుంటే, అమ్మ మాటల వల్ల పుండుని మరింత తొలిచినట్టవుతోంది. అమ్మనేమీ అనలేక, అక్కడ నుంచి వెళ్లిపోదామని ఉత్తరీయం భుజాన వేసుకొని తలవాకిటకి రాగానే నా కళ్లని నేనే నమ్మలేకపోయాను: కొత్త పెళ్లికూతురు కొదై, పసుపు బట్టల్లో లోనికొచ్చింది.

వచ్చేశావు ఏమిటని నిలదీసింది. తన జీవితోత్సవ ఘట్టంలో నేను లేనందుకు నిష్ఠూరమాడింది.

“నా మీద నీ ప్రేమ, నా జీవితం పట్ల నీ అక్కర, నా పెళ్లి గురించి నీ విముఖత నాకు తెలియనివా బావా. అసలు నేనెవరు? భావాన్నా, భవాన్నా? శాకుంతలాలు రెక్కలల్లార్చి కాపుకాసిన నెత్తురుపిండాన్నా, నాగేటి కర్రుకి నమస్కరించి కన్నుతెరిచిన అయోనిజనా? నా పుట్టుక భౌతికమా- ఆదిభౌతికమా? వాస్తవమా- అధివాస్తవికమా? పగటికి- రాత్రికీ చెందని సంధ్య లాంటి, భూమికి- ఆకాశానికి అందని దిగంతం వంటి దాన్ని నేను. అందుకే నా మీద నీ నిరుపమాన ప్రేమ నిష్ఫలం బావా. నా జీవితం ఎలా మొదలయ్యిందో, అలానే కొనసాగుతుంది, ముగుస్తుంది కూడా. నాకు ఉన్న ఏకైక లౌకిక బంధానివి, తోడుదొంగవి, ఈ ఆదిమధ్యాంతాలలోని నా స్థితి సుఖమా- దుఃఖ్ఖమా? ఐచ్ఛికమా- ప్రారబ్ధమా? ఆనందమా- విషాదమా? అనే విచికిత్స చేయకు, విచారపడకు,” అని తల మీద మొట్టి వెళ్లిపోయింది కొదై.

**        **        **

ఆ తర్వాత ఆమె ఏమయ్యిందో ఎవ్వరికీ తెలియదు. నేను మాత్రం ఆండాళ్లమ్మ ఆలయంలో తొట్టతొలి అర్చకుడ్ని!

**        **        **

(ఈ రచనకి – శ్రీకృష్ణదేవరాయలు- ‘ఆముక్తమాల్యద’, ‘నాలాయిర ప్రబంధం’, మరికొంత వైష్ణవ వాఙ్మయం బలహీనమైన ఆధారం, ఆండాళ్ పట్ల నా ఆరాధన బలమైన మూలం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here