దిగ్భ్రమ

0
12

[శ్రీ షేక్‌ మస్తాన్‌ వలి రచించిన ‘దిగ్భ్రమ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“హాఁ[/dropcap].. జీఁ!” ప్రక్కింటి నుండి వినిపిస్తోన్న వదిన జాన్‌ బీ పిలుపుకు ఆమె జవాబిచ్చింది.

“అదే.. అమీనా! పనులు.. జల్దీ కానియ్యి! పొత్తూరు పేటకు పోదాం!”

“దేనికి.. భాభీ?”

“అరే.. అల్లా ప్రొద్దునన్నది.. అప్పుడే మరిచావా..?”

“నిజంగా.. గుర్తు లేదు భాభీ!”

“అరే.. పగిలీ! ఈయాల.. అక్కడ మీలాద్‌! ఖురాన్‌ పఠనం! గుంటూరు మౌల్వీలందరొస్తారట! పెద్ద జమాత్‌! (సభ)”

“ఆఁ.. గుర్తొచ్చింది! అయినా.. భాభీ! అంత దూరం.. రాత్రి.. మనమిద్దరమే.. వెళ్ళగ..ల..మా?” ఆమె నసిగింది.

“అదేం ఫికర్‌ చేయకు! మా అమ్మాయి ఫాతిమా కూడా వస్తుంది!”

“అదొస్తే.. భయం లేదులే! ఏమైనా.. నాకింకో గంట పడ్తుంది! ఈలోగా మీ తమ్ముడు ఖానా-పీనా ముగించి రాత్రి డ్యూటీ కెళ్తాడు! ఆ తర్వాత బయల్దేరుదాం!”

“ఏంటీ? హమీద్‌ యింకా వెళ్ళలేదా? మీ అన్న అన్నీ ముగించి డ్యూటీ కెళ్ళాడు! అయినా.. త్వరగా తెములు! లేకుంటే.. బాగా రాత్రయిద్ది!”

“అలాగే.. భాభీ!”

ఈ సంభాషణా కాలం దాదాపు వందేళ్ళ నాటిది. ప్రదేశం గుంటూరు. అప్పటికది చిన్న పట్టణం. పౌర సౌకర్యాలు అంతంత మాత్రమే.. మట్టి రోడ్లు, కాలి బాటలు వుండేవి. రాకపోకలు ఎక్కువగా నడకనే సాగేవి. అక్కడక్కడా ఒంటెద్దు లేక రెండెద్దుల బండ్లున్నా; వాటి వాడకం జబ్బు లేక డబ్బు గల వారికే పరిమితం. కిరోసిన్‌ బుడ్లే వీధి దీపాలు. అవీ.. దూర దూరం గుండేవి.

ఇక మన పాత్రల నివాసం నగరం పాలెం. అక్కడ్నుంచి పొత్తూరు పేట మైలు దూరం. గతుకుల రోడ్డు. దాని కిరుప్రక్కల ఇళ్ళున్నా మధ్య మధ్యలో ఖాళీ స్థలాలే. వాటిలో పెరిగిన ముళ్ళపొదలపై పిచ్చి తీగలు అల్లిబిల్లిగా అల్లుకొని వుండేవి. కొన్నిచోట్ల గుబురుగా పెరిగున్న చెట్లు రకరకాల పక్షులకు ఆవాసంగుండేవి.

జాన్‌ బీ తమ్ముడు హమీద్‌. అతని భార్య అమీనా. అలాగే అమీనా అన్న ఖాశీ. అతని భార్య జాన్‌ బీ. బావా, బావమరుదులిద్దరు ప్రైవేట్‌ లారీ డ్రయివర్లు. ఆ రాత్రి వాళ్ళు డ్యూటికెళ్ళగానే ఆడవాళ్ళు మీలాద్‌కు బయల్దేరారు.

పొడవుగా, సన్నగా, ఎర్రగా, చీరెకట్టులో వున్న జాన్‌ బీ వయస్సు నలభై. ఇక పొట్టిగా, లావుగా, ఛామన ఛాయతో పచ్చ పంజాబీ డ్రెస్‌లో వున్న అమీనా వయస్సు ముప్పై. వదినా మరదళ్ళు బురఖాల్లో వున్నారు. వాళ్ళు భర్తల కనుకూలవతులైన ఇల్లాళ్ళు. మతపరంగా నమ్మకం గలవాళ్ళు.

వారితోపాటు వున్న మూడో వ్యక్తి జాన్‌ బీ ఏకైక సంతానమైన ఫాతిమా. ఆమె వయస్సు పదిహేను. ఎత్తుగా, ఎర్రగా, కోలముఖం, రెండు జడలతో, పసుపు పంజాబీ డ్రెస్‌లో వున్న ఆమె తన బ్లూ ఓణినే తలపై ముసుగ్గా వేసుకుంది. ఆమె ఐదువరకు చదివి, ఇంటి పట్టునే వుంటుంది. ఛాందసాలకు వ్యతిరేకి.

ఇళ్ళల్లో గడియారాలు లేనందున వాళ్ళకు టైమెంతైందో తెలిసి రాలేదు. కాకుంటే అప్పటికి రోడ్లపై జనసంచారం పలుచగుంది. వీధి దీపాలు మిణుకు మిణుకుమంటున్నాయి. ఊర కుక్కలు ఆదమరిచి నిద్రిస్తోన్నాయి. పొదల్లో కీచురాళ్ళు రొద చేస్తోన్నాయి. అవిగాక రాజ్యమేలుతున్న నిశ్శబ్దంలో వారి అడుగుల సవ్వడి వారికే వినపడుతుంది.

“భాభీ! బాగా పొద్దు పోయినట్లుందే!” పరిసరాలు గమనించిన అమీనా అంది.

“మరి.. మీలాదెప్పుడు ఆలశ్యంగానే జరిగిద్దీ!” జాన్‌ బీ సర్ది చెప్పింది.

“పుప్పూ! (అత్తా) మాటలాపి జల్దీ నడవండీ! మనం చాలా దూరమెళ్ళాలి!” ఫాతిమా తొందర పెట్టింది.

“అది కాదులే.. బచ్చీ! చాలా రాత్రయితే మన పాత మజీద్‌ దగ్గర జిన్నాతులు తిరుగుతాయట!” అమీనా బెదురగంది.

“భలే దానివే.. పప్పూ! ఆ పరిసరాల్లో మేం చిన్నప్పట్నుండి ఆడుకుంటున్నాం! మాకలాంటి వెప్పుడు కనబడ్లేదు!”

“అవి పగటిపూట తిరుగవమ్మా! అర్ధరాత్రి వస్తాయట! ఒకవేళ.. వాటిని చూట్టం జరిగితే ఏ పరిస్థితుల్లోను వీపు.. చూపకూడదట!”

“అట్టా చేస్తే.. ఏమైద్దంట అమీనా?” జాన్‌ బీ కళ్ళు చిట్లించింది.

“అయ్యో! ఇంకేముంది.. భాభీ.. వెంటనే వీపుపై ఒక్క దెబ్బ వేస్తాయంట! దాంతో.. ఎవరైనా.. మటాషే!”

“యాఁ అల్లా!” జాన్‌ బీ నోరు తెరచి చూస్తోంది.

“ఇక చాల్లే పప్పూ! ఇవన్నీ పుక్కిటి కథలు! అసలు వాటిని చూసిన వాళ్ళెవరన్నా వున్నారా?” ఫాతిమా నిలదీసింది.

“అట్లనకు బచ్చీ! మా నానీ (అమ్మమ్మ) వాళ్ళ కాలంలో జరిగిన సంగతొకటి ఆమె బ్రతికున్నన్నాళ్ళు చెబుతుండేది!”

“అదేంటో చెప్పు అమీనా!” జాన్‌ బీ అడిగింది. ఫాతిమా చెవులు రిక్కించింది.

“మా నానా (అమ్మ తండ్రి) గోనె సంచుల ఫ్యాక్టరీలో డ్యూటీ చేసి అర్ధరాత్రి ఇల్లు చేరాడట! అప్పటిదాక మా నానీ ఖురాన్‌-ఏ- షరీఫ్‌ చదువుతూ కూర్చుందట!”

“అంతేనా!” జాన్‌ బీ పెదవి విరిచింది.

“భలే దానివే భాభీ! అసలు సంగతి కొస్తున్నా!” అమీనా తలపై ముసుగు సర్దుకుంది.

“ఊరించక.. జల్దీ చెప్పు పప్పూ!” ఫాతిమా వేగిర పెట్టింది.

“అలా ఖురాన్‌ పఠనం జరుగుతుండగా ఓ జిన్నాత్‌ వారగా తెరచివున్న గుమ్మం ఆవల నుంచోని రాగయుక్తంగా చదవబడే వాక్యాలను తన్మయత్వంగా వింటుందట! ఆ పరిస్థితుల్లో చదవటం ఆపితే చదివే వ్యక్తికి ప్రమాదమని తెలిసిన మా నాని లేని ఓపికను తెచ్చుకొని కంగారుపడ్తూ చదవటం కొనసాగించిందట!”

“చివరి కేమైందో?”

“ఏముంది.. రాత్రి ఏ రెండింటికో మా నానా ఆలశ్యంగా యిల్లు చేరటంతో, ఆ అలికిడికి జిన్నాత్‌ గోడ ప్రక్కకు తప్పుకుందట! ఆ పై ఆయన లోనికెళ్ళి.. నడి జాము దాటాక చదువుతున్నావేంటి? ఆ చెమటలేంటి? ఆ.. హైరానా ఏంటి?.. అని నానీని అడిగారట! అప్పటికే దిగ్భ్రమలో వున్న ఆమె పఠనమాపి, వణుకుతూ ఆయన్ను పెనవేసుకొని విషయాన్ని వివరించిందట! ఆ పై యిద్దరు బైటికెళ్ళి చూస్తే అక్కడేమీ కనిపించలేదట!”

“అలా అయితే రాత్రులు ఖురాన్‌ చదవకూడదా ఏంటీ?” నడక వేగం తగ్గించిన జాన్‌ బీ అనుమానం వ్యక్తం చేసింది.

“అదేం లేదు భాభీ! కాని రాత్రి పన్నెండైతే కాసేపు పుస్తక పఠనం ఆపివేయాలట!”

“అలా అని ఎక్కడుంది?”

“అది.. మా నానానే చెప్పాడట!”

“ఓహోఁ! చాలానే వుందే!”

“ఏమో పప్పూ.. ఇవన్నీ నే నమ్మను! బహుశా.. అవి పిరికివాళ్ళ భ్రమలేమో!” ఫాతిమా పెద్దవాళ్ళ సంభాషణలో తల దూర్చింది.

“అలా కొట్టెయ్యకు బేటీ! అల్లా మనుష్యుల కంటే ముందు, జిన్నాతులనే సృష్టించాడట! అలాగని మతగ్రంథాలు చెపుతున్నాయి!” జాన్‌ బీ కూతురికి నచ్చ చెప్పింది.

ఈలోగా వారి నడక మూడు రోడ్ల కూడలికి చేరింది.

ఆ ప్రదేశానికి సమీపంలోనే పాత మజీద్‌ వుంది. పిడుగుపాటున కూలిన ఆ కట్టడం పునరుద్ధరించబడలేదు. ఒకరిద్దరు పూనుకున్నా మిగిలిన వారది మంచిది కాదని వారించారు. ఫలితంగా అది శిథిలంగానే మిగిలిపోయింది.

ఇక ఎదురుగున్న రెండుదార్లు పొత్తూరు పేట లోని వేర్వేరు ప్రాంతాలకు వెళ్తాయి. అందుకే ఫాతిమా “అమ్మీ! మీలాద్‌ దగ్గరకు ఎలా వెళ్ళాలో.. తెలుసా?” అని అడిగింది.

“అరే.. అల్లా! నాకు తెలియదు భేటీ! ఇప్పుడేం చేద్దాం?” జాన్‌ బీ అయోమయంగా దారుల వైపు చూడసాగింది.

“ఫికర్‌ చేయకు భాభీ! ఎవర్నన్నా అడుగుదాం!” అమీనా చుట్టూ కలయ చూసింది. అమ్మా కూతుళ్ళూ అటుగా తిరిగారు.

అదృష్టం!

వారి వెనుక దూరంగా మసక వెలుగులో ఓ వ్యక్తి రావటం కనిపించింది. దగ్గరికొచ్చాక అతని ఆకారం స్పష్టమైంది.

ఎత్తుగా, సన్నగా, కాస్త వంగి నడుస్తున్నతను పొడవాటి తెల్ల జుబ్బా, లుంగీల్లో వున్నాడు. పెరిగున్న గెడ్డం గాలి కూగుతుంది. నెత్తిపై కుచ్చుటోపి వుంది. కళ్లు మెరుస్తోన్నాయి. అతని చేతిలోని లాంతరు వెలుగు చిమ్ముతుంది. అతను వేగంగా ముందు కొచ్చాడు.

అప్పటిదాక జిన్నాత్‌ విషయం మాట్లాడుకొని వుండటం, అంతలోనే ఓ అజ్ఞాత వ్యక్తిని చూడటంతో అమీనా, జాన్‌ బీ లలో తెలియని జంకు చోటు చేసుకోసాగింది.

ఫాతిమా మాత్రం ఆయన కూడా మీలాద్‌కే వెళ్తున్నాడనుకొని, “సలామలేకుం హజరత్‌! పొత్తూరు పేట మిలాద్‌కు ఎటుగా వెళ్ళాలి?” అని అడిగింది. మిగిలిన వాళ్ళిద్దరు గుడ్లప్పగించి అటే చూస్తున్నారు.

“బేవ కూఫ్‌.. లోగ్‌! ఆధీ రాత్‌ మే క్యా మిలాద్‌? బహుత్‌.. హు వాఁ! బస్‌!.. బస్‌.. అబ్‌ ఘరోం కు చలే జావ్‌! (బుద్ధి లేనోళ్ళారా! సగం రాత్రిలో మీలాదేంటి? చాలానే అయింది! చాలు! చాలు! ఇక యిళ్ళకు వెళ్ళండి!)” ఒక్కసారిగా ఆగి తీక్షణంగా చూపులు విసిరిన అతని మాటలు తుపాకి తూటాల్లా పేలాయి.

ఆ అరుపులకు సమీపపు చెట్లపై నున్న పకక్షులు గట్టిగా అరుస్తూ గాల్లో కెగిరాయి. వాటి రెక్కల శబ్దాలు టపటప లాడాయి. అప్పటి వరకు ఏకధాటిగా వినిపిస్తున్న కీచురాళ్ళ రొద క్షణ కాలమాగింది. నిద్రిస్తున్న కుక్కలు గభాలున లేచి ‘గయ్‌!’ మనటం మొదలెట్టాయి.

మొత్తనికా అలజడి అసామాన్యంగుంది. దాంతో మదిలోని అనుమానం బలపడుతుంటే అమీనా ఎదుటి వ్యక్తిని నిశితంగా చూసింది.

అంతే! క్షణాల్లో ఆమెకు విషయం అర్థమై ఒళ్ళు జలదరించింది. అందుకే ఆమె వణుకుతున్న స్వరంతో “భాభీ!.. ఫాతిమా! నే చెప్పేది జాగ్రత్తగా వినండీ!” అంది.

ఆమె కంఠంలోని భయాన్ని గమనించిన జాన్‌ బీ విషయాన్ని ఊపిరి బిగపట్టి వినసాగింది. ఫాతీమా మాత్రం సాలోచనగా పరిసరాలు గమనిస్తోంది.

“ఇప్పుడు టైం పన్నెండైనట్లుంది. ఇక.. మన ఎదురుగా వున్న అతన్ని జాగ్రత్తగా గమనించండీ! అతని పాదాలు భూమిపై కనపించటం లేదు. గాలిలో తేలుతున్నట్లున్నాడు! కళ్ళు బల్బుల్లా వున్నాయి.. సందేహం లేదు.. అతను జిన్నాతే! నడిజాము కదలికలకు అడ్డుగున్నామని కోపంగున్నాడు! పొరపాటున వీపులు చూపామా.. అంతే సంగతులు! అందుకని మెల్ల మెల్లగా వెనుకకు నడుస్తూ పక్కనున్న పొదమాటుకు తప్పుకోండీ! ఊఁ.. జల్దీఁ!” ఆమె మాటలు అక్కడున్న వారికే వినిపిస్తోన్నాయి.

“క్యా.. బక్‌ రహీఁ? నికల్‌ జావ్‌! జల్దీఁ! (ఏం కూస్తున్నారు? బయల్దేరి వెళ్లండీ త్వరగా వెళ్ళండి!)” ఆ ఆకారం మరోసారి వురిమి వారి వైపుకు వడి వడిగా అడుగులు వేయసాగింది.

“ఐసా.. హీ.. హజరత్‌! ఐసా.. హీ! (అలాగే.. హజరత్‌! అలాగే!)” జాన్‌ బీ, అమీనాలు వెనుకకు వేస్తున్న అడుగులు తడబడ్డాయి. శరీరాల్లో వణుకు మొదలైంది. జారిపోతున్న ధైర్యాన్ని కూడగట్టుకొని వారిద్దరు పొదలంచుకు చేరారు. అయితే ఫాతిమా నిర్భయంగా నుంచొని ఆ ఆకారం వైపే తీక్షణంగా చూస్తోంది. “అరే.. పగిలీ! (పిచ్చిదానా) త్వరగా మా వెనుకకు రా!” అమీనా మేనకోడల్ని అదిలించింది.

“ఠీక్‌ హై.. పప్పూ! ఆఁ.. రహీఁ! (సరే అత్తా! వస్తున్నా!)” ఎందుకైన మంచిదని ఫాతిమా కూడా వాళ్ల వద్దకు చేరింది.

అప్పటికీ ఆ ఆకారం వాళ్ల పై పైకి వస్తూ కనిపించింది.

అంతే! శక్తినంతా కూడగట్టుకొని ఒక్కుదుటన పెద్దవాళ్ళు, ఆ వెనుకనే తాపీగా ఫాతిమా పొద మాటుకు తప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఆ ఆకారం దృష్టినుంచి మరుగున పడ్డారు. అలా స్థిమిత పడ్డాక, వాళ్ళు పొదమాటు నుండి ఓసారి తొంగి చూశారు.

వస్తూ వస్తూ ఆకస్మాత్తుగ ఆగిన అతను (ఆ ఆకారం) చుట్టూ కలయ చూసి కళ్ళు ఉరిమి, ఏవో ఛీత్కారాలు చేస్తూ, గాలిలో కుడి చేయి విచిత్రంగా తిప్పుకుంటూ పాత మజీద్‌ వైపు వడి వడిగా అడుగులు వేయసాగాడు. అతని ఎడమ చేతిలోని లాంతరు వెలుగు క్రమంగా దూరమై.. చివరకు మొత్తంగా కనుమరుగైంది.

“అల్లా కో మెహార్బానీ! హమ్‌ జిన్నాత్‌ కే గజబ్‌ సే బచ్‌ గయే! (అల్లా.. దయ! జిన్నాత్‌ కోపం నుండి తప్పించుకున్నాం!)”

“భాభీ! ఇక మీలాదొద్దు.. గీలాదొద్దు! జల్దీ.. యిళ్ళకు పోదాం పదండీ! ఇక్కడే వుంటే.. ఇంకేమైనా జరగొచ్చు!” జారిపోతున్న బురఖాను పదే పదే సర్దుకుంటూ అమీనా వడి వడిగా అడుగులేస్తూ యింటి ముఖం పట్టింది.

జాన్‌ భీ వంటికి పట్టిన చెమట తుడుచుకుంటూ అమీనా నడక వేగాన్ని అందుకోలేక అవస్థ పడసాగింది.

“వచ్చింది జిన్నాతో? లేక మనిషో?.. తెలుసుకోనివ్వకుండా వీళ్ళ హైరానా.. ఏంటబ్బా? అయినా.. ఈ పిచ్చోళ్ళకు వాళ్ళ ఆలోచనే తప్ప.. వేరే వాళ్ళది పట్టదు!” గొణుక్కుంటూ ఫాతిమా పెద్దవాళ్ళ ననుసరించింది.

“భాభీ! నాకెందుకో జిన్నాత్‌ మళ్ళా వస్తాడేమోనని భయంగుంది! అలా గాని జరిగిందా.. యిక.. మ..న. ప..ని మటాషే!” అమీనా వదినతో తడబడుతూ అంది.

“అవును.. అమీనా! నాకు అదే ఫికర్‌ (భయం) గుంది! అందుకే గ..బ..గ..బ.. వెళ్దాం!” జాన్‌ బీ గొంతు కూడ వణికింది.

పరిస్థితి గమనించిన ఫాతీమా “అమ్మీ!.. పప్పూ! మీరనవసరంగా భయపడ్తున్నారు! ఆ జిన్నాత్‌ పాత మజీద్‌ వైపెప్పుడో వెళ్ళిపోయాడు. ఇక రాడు! కంగారు పడకండీ!” అని పెద్దవాళ్ళకు ధైర్యం చెప్పింది.

ఊఁ! హుఁ!.. వాళ్ళు వినేలా లేరు.

ఆపై వాళ్ళు కూడపలుక్కున్నట్లు బురఖా లెగబట్టి ఒకే పరుగు లంకించుకున్నారు. ఇక చేసేది లేక ఫాతీమా కూడా వేగం పెంచింది.

అలా ముగ్గురు ఓ అరగంటలో ఇళ్ళకొచ్చి పడ్డారు.

అప్పటికీ అమీనాకు దడ తగ్గలేదు. అందుకే ఆమె జాన్‌ బీ వాళ్ళ ఇంట్లోనే పడుకుంది. అదీ ముగ్గురు ఒకే గదికి పరిమితమయ్యారు.

అయితే జరిగిన సంఘటన వలన దిగ్భ్రమ వాళ్ళను పూర్తిగా చుట్టి వేసింది.

‘ఇంతకు.. ఆ ఆకారమేంటి? జిన్నాతా! లేక దయ్యమా! పోనీ.. మామూలు మనిషనుకుందామనుకుంటే మరి అతని కాళ్ళెందుకు కనిపించలా? అతని అరుపులకు పరిసరాలెందుకు కల్లోల మయ్యాయి? పక్షులెందు కెగిరాయి? కుక్కలెందుకు అరిచాయి? లేదు!.. లేదు!… అతను ముమ్మాటికి.. జిన్నాతే! అలాంటపుడు మేం వీపులు చూపి వుంటే.. ఖతమయ్యే వాళ్ళమే! ఏమైనా లేచిన వేళ.. మంచిది! అల్లా.. బచాయా! (రక్షించాడు!)’ అనే ఆలోచనలు అమీనాను పిప్పి చేశాయి.

‘యా.. అల్లా… దైవ గ్రంథాలలో చెప్పిన జిన్నాత్‌ మాకు నిజంగానే కనిపించాడు! కాకుంటే.. దేవుని దయవల్ల మేమతని కోపానికి గురి కాలేదు!’ ఈ రకమైన ఆలోచనలు జాన్‌ బీని కలచి వేశాయి.

“మా అమీనా పప్పుకు పిచ్చి నమ్మకాలెక్కువ! అమ్మీ కూడా ఆమెకే వంత పాడిద్దీ! అనుమానం లేదు.. కనిపించింది పిచ్చోడే! వీళ్ల మూర్ఖత్వం కాకుంటే.. చీకట్లో ఎవరికైనా కాళ్ళు కనిపిస్తాయా! పోనీ.. ఏది నిర్ధారించుకోవటానికైనా.. కాస్తంటే కాస్త టైమిస్తేనా! అదిగో జిన్నాత్‌.. ఇదిగో జిన్నాత్‌.. అంటూ ఒకటే హడావిడి! వీళ్లతో పరుగెత్తి.. పరుగెత్తి.. కాళ్ళు నొచ్చాయ్‌!” ఫాతిమా పెద్దవాళ్ళను నిందించుకుంటూ కాలం వెళ్ళదీసింది.

మొత్తానికా రాత్రి ముగ్గురికీ జాగారమే అయ్యింది.

తెల్లవారేసరికి పెద్దవాళ్ళిద్దరూ జ్వరం పాలయ్యారు. ఆపై ఓ వారం వాళ్లకు రాత్రులు టెంపరేచర్‌ వస్తూనే వుంది. దాంతో వారి స్వస్థతకు మందులతోపాటు దర్గా దర్శనాలు, తావీదు ధారణలు అవసరమయ్యాయి. ఇక ఫాతిమా అటు అమ్మకు, ఇటు మేనత్తకు సేవలు చేయలేక నానా అవస్థలు పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here