డిజిటల్ హస్బండ్

8
6

[శ్రీమతి కల్పనా కులశ్రేష్ఠ రచించిన హిందీ కథని అనువదించి అందిస్తున్నారు కొల్లూరి సోమ శంకర్. మూలకథ ‘భయానక్ ఖేల్’ అనే పేరుతో 6 అక్టోబర్ 2014 నాటి ‘దైనిక్ జాగరణ్’ దినపత్రికలో ప్రచురితం. ఈ కథ ‘సదా సుహాగన్’ పేరుతో రచయిత్రి మార్చి 2023లో వెలువరించిన ‘సమయ్ కే ఉస్ పార్’ అనే సైన్స్ ఫిక్షన్ కథాసంపుటిలో చోటు చేసుకుంది.]

[dropcap]జూ[/dropcap]న్ నెల. బాగా ఎండగా ఉన్న ఆ మధ్యాహ్నం పూట నల్ల కోటు ధరించి, ఆఫీసులో నా కుర్చీలో కూర్చుని ఉన్నాను. చేతిలో చల్లని మేంగో షేక్ గ్లాసుతో నా ఎదురుగా శ్రీమతి సత్యా తివారీ కూర్చున్నారు. మా మధ్య ఉన్న అద్దం బిగించిన బల్లపై కంప్యూటర్, ఫోన్ ఉన్నాయి, ఇంకా కొన్ని ఫైల్స్ అస్తవ్యస్తంగా ఉన్నాయి. సౌరశక్తితో నడిచే ఎ.సి. గదిని తగినంత చల్లగా ఉంచుతోంది.

శ్రీమతి తివారీ అందమైన ముఖంలో దుఃఖం వ్యక్తమవుతోంది. ఆమె తెల్ల చీర, శూన్య లలాటం, సిందూరం లేని పాపిట – నన్ను విచలితుడిని చేస్తున్నాయి.

“ఇది సహజ మరణం కాదు, లాయర్ గారూ” చెప్పారామె.

“కానీ మేడమ్, మీవారు ప్రొఫెసర్ అభిషేక్ తివారీ గారు హార్ట్ ఎటాక్‍తో చనిపోయారని పోస్ట్ మార్టమ్ నివేదికలో స్పష్టంగా ఉంది” నేను ఆవిడకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాను.

“నెల రోజుల క్రితమే ఆయన అన్ని పరీక్షలు చేయించుకున్నారు. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. కానీ చనిపోవడానికి కొద్ది రోజుల ముందు చాలా ఆందోళనతో ఉండేవారు. ఏదో జరగరానిది జరబోతున్నట్టు భావించేవారు. మిస్టర్ అలోక్‍నాథ్, మీరీ ఊర్లో బాగా పేరున్న లాయర్. ఈ విషయంలో మీరు ఎంక్వయిరీ చేయించాలని కోరుకుంటున్నాను” శ్రీమతి తివారీ రుద్ధకంఠంతో అన్నారు.

“సరే మేడమ్, ఈ కేసు విషయంలో ఏం చేయగలనో చూస్తాను” అన్నాను. మనసులో కొద్దిగా గర్వం తొంగిచూస్తుండగా, అంగీకారంగా తల ఊపాను. ఆవిడ నా బంధువు ఒకరి సూచనతో నా దగ్గరికి వచ్చారు. అందుకని ఆవిడకి కుదరదు అని చెప్పలేకపోయాను.

ఆమె వెళ్ళిపోయిన తరువాత నేను టై వదులు చేసుకుని, కుర్చీలో విశ్రాంతిగా వెనక్కి జారాను. నా పి.ఎ. రూబీ కోల్డ్ కాఫీ చేయడంలో నిమగ్నమై ఉంది. నిజానికి ఆమె ఓ హ్యూమన్ ఆండ్రాయిడ్ (రోబో). నా ప్రత్యేక కోరిక ప్రకారం ఆ కంపెనీ ఈమెని అలనాటి ప్రసిద్ధ హీరోయిన్‍లా కనిపించేలా తయారు చేసింది.

“ప్రపంచంలో ఎవ్వరూ నీ అంతా బాగా కోల్డ్ కాఫీ చేయలేరు రూబీ” అని అంటూ, “నీ చేతిని ముద్దుపెట్టుకోవాలనిపిస్తోంది” అన్నాను కొంటెగా.

“తప్పుకుండా లాయర్ గారూ” అంటూ రూబీ తన చేతిని ముందుకు చాపింది. ఆమె చేతిని తాకగానే షాక్ కొట్టినట్టియై, నా మనసు తుప్పు వదిలింది. ఆ కంపెనీ వాళ్ళు అలా ఆమెనలా ప్రోగ్రామ్ చేశారు.

“నా లోపల ఉన్న మైక్రోఫోన్ కనెక్షన్ – మీ ఆవిడ స్మార్ట్‌ఫోన్‌కి కనెక్ట్ అయి ఉంది సర్” రూబీ నవ్వు ముఖంతో చెప్పింది. ఓహ్.. ఇదంతా మా ఆవిడ పనన్న మాట. యంత్రాలన్నా అసూయే. ఓ దీర్ఘ శ్వాస తీసుకున్నాను.

కాఫీ తాగి రిఫ్రెష్ అయి పనిలో లీనమయ్యాను. ఈ కేసుకి ‘ఆపరేషన్ డెత్’ అని పేరు పెట్టాను. ఇది ఒక హై ప్రొఫైల్ కేస్. ప్రొఫెసర్ అభిషేక్ తివారీ పని చేసిన ‘యూనివర్సల్ బయోఇన్‍ఫర్మాటిక్స్ కంపెనీ’ చిన్నా- చితకా కంపెనీ కాదు. చాలా మంది పెద్ద పెద్దవాళ్ళకి ఆ కంపెనీలో షేర్లు ఉన్నాయి. నేను చాలా జాగ్రత్తగా పరిశోధించాలి.

ఓ పది రోజులు గడిచిపోయాయి. ఈలోపు నా దృష్టికి వచ్చిన విషయాలు, నాకెన్నో అనుమానాలను కలిగించాయి. కొన్ని సంవత్సరాల క్రితం స్థాపించబడిన ప్రఖ్యాత ‘యూనివర్సల్ బయోఇన్‍ఫర్మాటిక్స్ కంపెనీ’ లేదా ‘యుబిసి’కి సంబంధిన కొన్ని విచిత్రాలు జరుగుతున్నాయి. అధిక జీతభత్యాలతో కంప్యూటర్ శాస్త్రవేత్తలు, జీవశాస్త్రవేత్తలను ఈ కంపెనీ నియమించుకుంటోంది. కానీ కొంత కాలం గడిచాకా చాలామంది ఉద్యోగులు సహజంగా మరణించడమో లేదా ప్రమాదంలో చనిపోవడమో జరుగుతోంది. ఈ విషయంలో కొందరు యుబిసికి ఏదో శాపం తగిలింది అని అన్నారు, మరికొందరు ప్రత్యర్థి కంపెనీల కుట్ర అన్నారు. ఈ మరణాల విచారణలో ఎటువంటి అనుమానాలు కలగలేదు.

ఇంతలో ఆఫీసు కిటికీ దగ్గర ఓ పావురం వచ్చి వాలింది, రెక్కలను టపటపలాడించింది. నేటి ఈ డిజిటల్ యుగంలో ఏ విషయాన్నైనా రహస్యంగా ఉంచడం దాదాపు అసంభవం. అందుకే నేనీ కేసుకు సంబంధించిన సందేశాలు పంపడానికి/స్వీకరించడానికి పురాతన నాన్-ఎలెక్ట్రానిక్ పద్ధతి పాటించాను. పావురాలని ఈ పనికి ఉపయోగించుకున్నాను. పావురాన్ని పట్టుకుని, దాని కాలికి ఉన్న ఉత్తరాన్ని తీసుకున్నాను.
“కంపెనీ పనంతా త్రీ.డి. పద్ధతిలో జరుగుతోందని చెప్తున్నారు. కానీ తప్పకుండా ఏదో  గడబిడ ఉంది. రేపు యుబిసి సిటీలో కలవండి. మిళింద్” అని రాసుంది ఆ ఉత్తరంలో.

నేను ఆలోచనల్లో లీనమైపోయాను. ఉత్తరం చదివాకా, నా క్లయింట్ శ్రీమతి సత్యా తివారీ గారి అనుమానాలు నిజమనిపించాయి. ఈ ఉత్తరం నా అసిస్టెంట్ మిళింద్ పంపాడు. కొన్ని రోజుల క్రితం అతన్ని నేను యుబిసిలో ఆఫీస్ బోయ్‍గా ‘ప్లాంట్’ చేశాను. నాకున్న పరిచయాలన్నీ ఉపయోగించి అతి కష్టం మీద అతన్ని అక్కడ నియమించగలిగాను. ఖచ్చితంగా అతనికి ఏదో ముఖ్యమైన క్లూ దొరికి ఉంటుంది.

కొన్ని గంటల తరువాత నా హై స్పీడ్ ఎయిర్ కార్, యుబిసి సిటీ ఎయిర్ పార్కింగ్‍లో దిగింది. లిఫ్ట్‌లో కిందకి వచ్చి యుబిసి రిసెప్షన్ హాల్‍లో కూర్చుని రిసెప్షనిస్ట్ కంగానాని చూడసాగాను. ఎప్పుడూ నవ్వుముఖంతోనే ఉండే తను కూడా రూబీ లాగే ఓ హ్యుమన్ ఆండ్రాయిడ్ అని తెలిసిపోతోంది. నాలుగు వైపులా పెద్ద పెద్ద అద్దాల షోకేస్‍లు ఉన్నాయి. వాటిల్లో కంపెనీ ఉత్పాదనలు ప్రదర్శనకు ఉన్నాయి. అవి బయో-ఎలెక్ట్రానిక్ జంతువులు.. ఎలుక, ముంగీస, పిల్లి, సీతాకోకచిలుక వంటివి ఉన్నాయి, వాటిలో న్యూరో చిప్ ఇంప్లాంట్ చేశారు. వీటిని రిమోట్ ద్వారా, స్మార్ట్ ఫోన్ ద్వారా నియంత్రించవచ్చు, వాటితో కోరిన పనులు చేయించవచ్చు. జనాలు తమ పెంపుడు జంతువులకు శిక్షణ ఇప్పించడం కన్నా వీటిని ఉపయోగించడం ఇష్టపడతున్నారు. వాటిని తమ సైగలతో ఆడించవచ్చు. అక్కడున్న ఓ రిమోట్ బటన్ నొక్కాను. ముంగీస గుండ్రంగా తిరగసాగింది.

నాకు కాఫీ ఇవ్వడానికి వచ్చిన ఒక వ్యక్తి, ఎవరూ గమనించకుండా, నా చేతిలో ఓ కాగితం ఉంచి వెళ్ళిపోయాడు. అతను మిళింద్. నేను అప్రమత్తమయ్యాను. యుబిసి రిసెప్షన్‍లో కంపెనీ గురించి ఏవో చిన్న చిన్న ప్రశ్నలడిగి వెనుదిరిగాను. కారులో కూర్చుని తీరిగ్గా ఆ కాగితంలో ఏముందో చదవసాగాను. “తెలిసిన సమాచారం అత్యంత భయానకం. నమ్మలేకపోతున్నాను. ..వీళ్ళని రెడ్ హ్యాండెడ్‍గా పట్టుకోవాలంటే సైబర్ క్రెమ్ సెల్ వాళ్ళతో కలిసి యుబిసి వాళ్ళ రహస్య ప్రయోగశాల మీద దాడి చేయాలి” అని ఉంది. ఒక మ్యాప్ ఉంది.

వెంటనే రంగంలోకి దిగాను. ఉన్నతాధికారులకు పరిస్థితి తీవ్ర్రతని వివరించాను. వాళ్ళు అప్రమత్తమయ్యారు. వెంటనే రంగంలోకి దిగారు. సరైన సమయం, సరైన చోటు ఎంపిక, తగిన వ్యూహం చాలా కీలకం. ఈ మొత్తం వ్యవహారానికి ‘ఆపరేషన్ డెత్’ అని పేరు పెట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుని సిద్ధమయ్యారు.

ఐదు రోజుల తరువాత, ..ప్రింట్, ఎలెక్ట్రానిక్ ఇంకా సోషల్ మీడియాలలో హఠాత్తుగా ‘సూపర్ సర్జికల్ స్ట్రైక్’ వార్తలు వ్యాపించాయి. ‘ఆపరేషన్ డెత్’ విజయవంతమైంది. న్యూఢిల్లీలో రహస్య ప్రదేశంలో నిర్వహించిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఎంపిక చేసిన విలేఖరులు, పోలీసులు, ఉన్నతాధికారుల సమక్షంలో అపరాధులు తలలు వంచుకుని కూర్చున్నారు.

“అసలు మీ ప్లాన్ ఏంటి? ఏం చేస్తున్నారో, ఎలా చేస్తున్నారో వివరంగా చెప్పండి” అడిగాడో విలేఖరి.

“సాధారణ ప్రాణులని బయో-ఎలెక్ట్రానిక్ జంతువుల్లా మార్చడంలో మేం గొప్ప నైపుణ్యం సాధించాం. అప్పుడు మా టెక్నికల్ టీం ఈ ప్రయోగాన్ని మనుషుల మీద కూడా చేయడం మొదలుపెట్టింది. ఈ ప్రయోగాలలో భాగంగా, మనిషి మెదడుని ఎందుకు డిజిటైజ్ చేయకూడదనే ఆలోచన వచ్చింది. మస్తిష్కం లోని న్యూరాన్‍లను, వాటిని కనెక్షన్స్‌ని జ్ఞాపకాలతో సహా స్కాన్ చేశాం. తరువాత వాటి ‘ఎగ్జాక్ట్ డిజిటల్ కాపీ’ని మా కంపెనీ అభివృద్ధి చేసిన క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా తయారుచేశాం. ప్రతిభావంతులైన మా ఉద్యోగుల సమర్థత కారణంగా మేము ఇందులో సఫలమయ్యాం.”

అక్కడంతా నిశ్శబ్దం వ్యాపించింది. జనాలు వెన్నులో వణుకుపుడుతోంది.

“తరువాత మేము ఒక సాఫ్ట్‌వేర్ రూపొందించాం. దాని ద్వారా డిజిటల్ బ్రెయిన్ – పూర్తిగా అసలైన మెదడులానే పనిచేయటం మొదలుపెట్టింది. అది చాలా హైటెక్ కావడం వల్ల సుఖదుఃఖాలు, సంవేదనలు, ఇతర భావనలకు స్పందించసాగింది. దాన్ని మనకి ఇష్టం వచ్చినట్టు నియంత్రించవచ్చు, నిర్దేశించవచ్చు. అంతే కాదు, దీనికి స్మృతులను జోడించవచ్చు, తొలగించవచ్చు” యుబిసి కంపెనీ టెక్నికల్ హెడ్ మిస్టర్ రజత్ గర్వంగా చెప్పాడు. అందరూ అవాక్కయ్యారు.

“ఒక రకంగా చెప్పాలంటే, మనిషి మెదడుని బానిసలా చేసుకోడంలో మేం విజయం సాధించాం. తరువాత ఈ సఫలతని మా కంపెనీ ప్రయోజనాల కోసం వాడుకోడం మొదలుపెట్టాం. కోట్ల రూపాయల ప్యాకేజ్‍తో స్పెషలిస్టులని నియమించుకోడంలో ఔచిత్యం ఏముంది, అదే పనిని వాళ్ళతో ఉచితంగా చేయించుకోగలిగినప్పుడు! ప్రపంచం దృష్టిలో వారంతా ఎప్పుడో చనిపోయారు. కానీ మా కంప్యూటర్లలో బ్రతికే ఉన్నారు, నిరంతరం పరిశోధన, అభివృద్ధి, కొత్త ఉత్పాదనల రూపకల్పనలో పాలుపంచుకుంటున్నారు. ప్రస్తుతం మా ఉత్పాదనలలో ఎక్కువ భాగం ఈ ‘డిజిటల్ డెడ్ డూయర్స్’ అంటే మరణించిన డిజిటల్ కార్మికులు రూపొందించినవే” చెప్పాడు యుబిసి వ్యవస్థాపకుడు మిస్టర్ శామ్యూల్ దయాళ్ భావహీన స్వరంతో.

“అయితే త్రీ డీ పద్ధతి ఇదేనన్నమాట. కానీ వీటికి వాళ్ళ మరణాలకి ఏమిటి సంబంధం? మీరు వాళ్ళ మస్తిష్కాలని కాపీ చేసుకున్నాకా, వాళ్ళని ఉద్యోగం లోంచి తీసేయచ్చుగా?” అడిగారు విలేఖరులు.

“విషయం ఏంటంటే ఒక టెక్నికల్ హిచ్ (సాంకేతిక అవరోధం) ఉంది. రక్తం, ఆక్సీజన్ సరఫరా అవుతుండగా మానవ మస్తిష్కం యొక్క డిజిటల్ కాపీని రూపొందించడం సాధ్యం కాదు. అందుకని కొన్ని ప్రత్యేక ఉపాయాల ద్వారా సహజ మరణంలా అనిపించేలా వాళ్ళని చంపించాము. ఇప్పుడు మీకు మా పనితీరు డెమో చూపిస్తాము” అంటూ మిస్టర్ శామ్యూల్ తన ముందున్న లాప్‍టాప్ ఆన్ చేశాడు. తెర మీద చిరునవ్వుతో ఉన్న ప్రొఫెసర్ అభిషేక్ తివారీ ముఖం కనబడింది.

“గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు?” అడిగాడు మిస్టర్ శామ్యూల్.

“బానే ఉన్నాను. రాత్రి ఆలస్యంగా నిద్రపోయాను. బయో కంప్యూటర్ల డిజైన్స్ చూస్తూ ఉండిపోయాను. మీతో చాలా మంది ఉన్నట్టున్నారు. కంపెనీ మీటింగా? మరి నాకేమీ సమాచారం లేదే?” ప్రొఫెసర్ అభిషేక్ తివారీ స్వరం ఫిర్యాదు చేస్తున్నట్లుగా ఉంది.

“ఇక్కడి దృశ్యాలను స్కాన్ చేసి మా సాఫ్ట్‌వేర్ ఆయన మెదడుకు సంకేతాలు పంపుతోంది. అందుకే ఆయన స్వయంగా ఇక్కడున్నట్లు భావిస్తున్నారు. తాను చనిపోయినట్లు ఆయనకి తెలియదు, ఎందుకంటే ఆయన మరణ స్మృతులను తొలగించాము. పైగా శరీరం యొక్క అనుభవం మస్తిష్కం ద్వారానే పొందుతాము. చేతన, భావన, సంవేదన మొదలైనవన్నీ మస్తిష్కం యొక్క మాయలే” అంటూ మిస్టర్ శామ్యూల్ కంప్యూటర్‍లో ఏదో కమాండ్ నొక్కాడు. వెంటనే ప్రొఫెసర్ అభిషేక్ తివారీ తల దించుకున్నారు. “క్షమించండి. ఉన్నట్టుండి బాగా తలనొప్పిగా ఉంది. ఇంటికి వెళ్ళి, మాత్ర వేసుకుని కాస్త విశ్రాంతి తీసుకుంటాను” అన్నారు. నొప్పి ఎంత తీవ్రంగా ఉందో ఆయన కళ్ళలోని నీరు చెబుతోంది.

ఏం భ్రమ ఇది? ఎంతటి మాయాజాలం? దీని రూపకర్తలు ఎలాంటివారు, మానవుల జీవనమరణాల మధ్య ఉండే తేడా మర్చిపోయారు! విష్ణుమూర్తి నారదమునిని మాయలో ముంచిన ఒక కథ నాకు గుర్తొచ్చింది.

యుబిసి వారి ఈ భయానక క్రీడకి తెరపడింది. దోషుల్ని అరెస్టు చేశారు, కంపెనీకి సీల్ వేశారు.

మూడు రోజుల తరువాత.. మా ఆఫీసులో కూర్చుని రూబీ ఇచ్చిన కోల్డ్ కాఫీ త్రాగుతూ ఈ  కేసు పూర్తి కథ ఆమెకి వినిపిస్తుండగా, హఠాత్తుగా శ్రీమతి సత్యా తివారీ లోపలికి ప్రవేశించారు. నుదుటి మీద ఎర్రటి పెద్ద బొట్టు, పాపిట సిందూరం, రంగుల బెనారస్‍ చీర ధరించి, చేతులకి గాజులతో వచ్చిన ఆవిడని చూసి నేను విస్తుపోయాను. వికసిత వదనంతో, పెదాలపై చిరునవ్వుతో ఆమె నా ఎదురుగా కూర్చున్నారు.

“మీ అనుమానం కారణంగా ఎందరి ప్రాణాలో కాపాడబడ్డాయి. లేదంటే ఈ భయానక క్రీడ ఇంకెన్నాళ్ళు కొనసాగేదో” అన్నాను నేను ఆమెకి కాఫీ కలుపుతూ.

“మీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను లాయర్ గారూ.. మీ వల్ల మావారిని తిరిగి పొందగలిగాను..” ఆమె కళ్ళల్లో తడి.

“ఏమంటున్నారు.. ఆయన ఎప్పుడో మరణిం..” నేను మాటలు పూర్చి చేయలేకపోయాను.

“కాదు. అది మీ దృష్టి కోణం. నేనలా అనుకోవడం లేదు. శరీరం నశించేదే, అది ఏదైనా రోగం వల్లో, లేదా ప్రమాదం వల్లో పాడయిపోవచ్చు. నిన్న నేను ఆయనని కలిశాను. ఆయనకి అన్నీ గుర్తున్నాయి. మా ఇన్నేళ్ళ సహచర్యం, ఒకరితో ఒకరం గడిపిన ప్రతి క్షణం, మధుర స్మృతులు.. అన్నీ గుర్తున్నాయి” నీరు నిండిన ఆమె కళ్ళల్లో గతపు ఛాయలు గోచరిస్తున్నాయి.

“ఎవరిదైనా ‘బ్రెయిన్ డెడ్’ అయితే.. అంటే మస్తిష్కం చనిపోతే.. చట్టపరంగా, వైద్యపరంగా వారిని మృతులుగానే పరిగణిస్తారు. కానీ మావారి మస్తిష్కం – పూర్తిగా మామూలుగానే పని చేస్తోంది. మరి ఈ పరిభాష ప్రకారం ఆయన జీవించి ఉన్నట్లేగా? ఆయనే స్వయంగా తాను సజీవంగా ఉన్నట్లు భావిస్తుంటే.. ఆయన చనిపోయినట్లు నేనెలా అనుకుంటాను?” అన్నారామె.

ఆమె స్వరం రుద్ధమయింది. కళ్ళ నుండి నీరు కారసాగింది.

“నాకు తెలిసినంత వరకూ మేడమ్, యుబిసి వాళ్ళ అన్ని కంప్యూటర్లను నాశనం చేశారు. కంప్యూటర్లలో ఉన్న ఆ జీవనం వాస్తవం కాదు, వర్చువల్! ఓ భ్రమ అంతే” నెమ్మదిగా చెప్పాను.

“అలా కాదు. శరీరంతో లేకపోయినా, ఆయన నా భర్తే. తన డిజిటల్ రూపంలో ఆయన అమరత్వం పొందారు. నేను నిత్య సుమంగళిని. సతీ సావిత్రి యముడితో పోరాడి తన భర్తను తిరిగి తెచ్చుకుంది. నేను కూడా ఆయన్ని తిరిగి పొందేందుకు నా చివరి శ్వాస వరకు న్యాయపోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ విషయంలో మీరు నాకు సాయం చెయ్యాలి, చేస్తారు కదూ? ప్లీజ్..” అంటూ శ్రీమతి సత్యా తివారీ చేతులు జోడించారు.

ఏమిటిదంతా? మానవ మనస్సు ఎంత విచిత్రమైనది? ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఆమె కేసి శ్రద్ధగా చూశాను. ఏదో తెలియని ఒక తేజస్సు ఆమె వదనంలో దీపశిఖలా ప్రకాశిస్తోంది. అన్ని సంశయాలనూ దూరం చేసుకోవాలనే ఆత్రుత! నేనేం చేయాలో నాకు అర్థమైంది.

హిందీ మూలం: కల్పనా కులశ్రేష్ఠ

అనువాదం: కొల్లూరి సోమ శంకర్


ప్రసిద్ధ హిందీ రచయిత్రి శ్రీమతి కల్పనా కులశ్రేష్ఠ 11 మే 1966 నాడు ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో జన్మించారు.

పలు పత్రికలలో సైన్స్ ఫిక్షన్ కథలు మరియు వ్యాసాలు రాశారు. అనేక సైన్స్ ఫిక్షన్ పుస్తకాలను ప్రచురించారు. వీరి సైన్స్ కథలు బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ, తెలుగు భాషల్లోకి అనువదించబడ్డాయి. అనేక సైన్స్ ఫిక్షన్ కథలకు బహుమతులు లభించాయి. కొన్ని కథలు పాఠ్యపుస్తకాలలో, ఇతర కథా సంకలనాల్లో కూడా చేర్చబడ్డాయి.

కల్పన ప్రతిష్ఠాత్మకమైన ‘సైంటిఫిక్ టెంపర్ జర్నల్’లో బాలల సైన్స్ ఫిక్షన్‌పై పరిశోధనా వ్యాసాలను ప్రచురించారు. బీహార్ బాల్ భవన్ కిల్కారీ ఆన్‌లైన్ వర్క్‌షాప్‌లో పిల్లలకు సైన్స్ ఫిక్షన్ రైటింగ్‍ అనే అంశంపై శిక్షణనిచ్చారు.

AISECT భోపాల్ నుంచి సి.వి. రామన్ టెక్నికల్ రైటింగ్ అవార్డు, ఆల్ ఇండియా సైన్స్ ఫిక్షన్ రైటర్స్ కమిటీ నుంచి విజ్ఞాన్ కథాశ్రీ అవార్డు, ఉత్తరప్రదేశ్ హిందీ ఇన్‌స్టిట్యూట్ ద్వారా జగపతి చతుర్వేది చైల్డ్ సైన్స్ రైటింగ్ అవార్డు పొందారు.

ప్రస్తుతం బోధన, వైజ్ఞానిక రచనలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here