దిక్కుతోచని వేళ

0
13

[తాతా కామేశ్వరి గారు రచించిన ‘దిక్కుతోచని వేళ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]అ[/dropcap]ది 1959 ఏప్రిల్ నెలే, కానీ సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సుమారు అరవై ఏళ్ళ వయసున్న లక్ష్మమ్మ నెరిసిన జుత్తు, నలిగిన తెల్లచీర, చేతిలో ఓ గుడ్డ సంచీ తీసుకుని స్టేషన్‌కి బయలుదేరారు. ఆమె చేతికి గాజులు, నుదుట బొట్టు లేకపోయినా ఆమె ముఖం చాలా కళగా, కాంతివంతంగా ఉంది. ఆమె తన మెడలో ఉన్న 4 కాసుల బంగారు గొలుసు ఏ దొంగవాడో తెంపుకోపోతాడేమో అన్న భయంతో మాటి మాటికి కొంగుతో మెడ కప్పుకుంటున్నారు. ఆమె చెమటలు కక్కుతూ విజయనగరం రైల్వే స్టేషన్ చేరి టికెట్ తీసుకుని డొంకనవలస పోయే ప్యాసింజర్ కోసం ప్లాట్‌ఫారం బెంచి మీద చాలా అలసటగా కూర్చున్నారు.

అప్పుడే ఆమె పక్క మరో ఆమె వచ్చి కూర్చొని ఆమెతో మాట కలిపింది “అమ్మగోరూ, ఏ ఊరు? యెందాకా పోతారు?” అని అడిగింది. ఆవిడ అయిష్టంగానే చెప్పింది “నాది ఈ వూరే అమ్మా. కొంచం పని మీద డొంకనవలస వెళ్ళి అక్కడ నుండీ కోటిపల్లి పోవాలి.”

“ఓ, కోటిపల్లి ఆ? సిన్న పల్లెటూరు, శానా బాగుంటది అమ్మ” అంటూ మళ్ళీ “జాగ్రత్తమ్మా, వెళ్ళేసరికి పొద్దు ఎక్కుతాది, ఒంటరి ఆడమనిషి కూడా” అన్నది హెచ్చరిస్తున్నట్టు.

ఆమె అలా అంటూ ఉండగానే రైలు పెద్దగా చప్పుడు చేస్తూ రావడంతో లక్ష్మమ్మ రైలు ఎక్కి ఆమెకి దొరికిన కిటికీ పక్క సీటులో కూర్చుని, సంచీని సీట్ క్రింద పెట్టారు. బాగా వేడిగా ఉన్న రైలు నడవడంతో చల్లగాలి వీస్తూ మనసుని ఆహ్లాదపరుస్తొంది. ఆమె గాలికి రేగిపోతున్న జుట్టు సర్దుకుంటూ కిటికీ బయటకి చూస్తున్నారే కానీ ఆమె మనసు భర్త శాస్త్రిగారి జ్ఞాపకాలలో మునిగిపోయింది.

శాస్త్రి గారు మరియు లక్ష్మమ్మ దంపతులకి ముగ్గురూ కుమార్తెలే, కానీ ఏనాడు మొగపిల్లల లేమి లోటు వాళ్ళకి ఉండేదికాదు. శాస్త్రి గారు రైల్వే ఉద్యోగి, ముప్పై ఏళ్ల అతని ఉద్యోగంలో చాలా ప్రదేశాలలో పనిచేసి చివరికి విశాఖపట్నంలో రిటైర్మెంట్ తీసుకొని విశాఖలో కాక, ఆయన స్వస్థలం అయిన విజయనగరంలో అద్దె ఇల్లు చూసుకొని స్థిరపడ్డారు. ఆయన విజయనగరం రాకతో ముగ్గురు కుమార్తెలు అక్కడ చదువులు బాగుంటాయని తమ పిల్లలని శాస్త్రిగారి వద్దకి పంపించేశారు. పిల్లలు బాబు, వేణు, శ్రీను రాకతో వారి ఇల్లు కళకళలాడుతూ ఉండేది. వారిని స్కూల్‌లో చేర్చి వారి బాగోగులు అన్నీ శాస్త్రిగారే చూసేవారు. బాబు చాలా తెలివిగల పిల్లాడు, చదువులోనే కాక తాతగారి ప్రతి పనిలో సాయపడేవాడు. బాబుకి అమ్మమ్మ అంటే పంచప్రాణాలు, అలాగే లక్షమ్మకి కూడా పెద్ద మనవడు అవడం చేత వాడు అంటే చాలా ఇష్టం. శాస్త్రి గారికి కోటిపల్లిలో ఓ ఎకరం పొలంతో పాటు ఓ ఇల్లు ఉండేది. ఆయన పొలం కౌలుకు ఇచ్చి మధ్య మధ్యలో ఆక్కడకి వెళ్ళి ఇల్లు పొలం చూసుకునేవారు. ఆయన ఎప్పుడు కోటిపల్లి వెళ్ళినా బాబు తప్పక ఆయన వెంట వెళ్ళేవాడు. బాబుకి ఆ పల్లెటూరు, ఆ ఇల్లు, పెరటిలో ఉన్న మామిడి, బాదాము, పనస, జామ చెట్లు అంటే చాలా ఇష్టం. తాతగారితో ఆక్కడ రెండు మూడు రోజులు ఉండి సరదాగా పొలం గట్టున తిరిగి వచ్చేవాడు.

పిల్లలు ముగ్గురు విజయనగరం మహారాజ కాలేజీలో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టారు. బాబుకి తాతా అమ్మమ్మని వదిలి దూరం వెళ్ళడం ఇష్టం లేకపోయినా కలకత్తాలో ఒక మంచి కంపెనీలో ఉద్యోగం రావడంతో తాతగారి బలవంతాన అక్కడికి వెళ్ళక తప్పలేదు. వేణు, శ్రీను లకి కూడా హైదరాబాద్‍లో ఉద్యోగాలు రావడంతో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. దంపతులు ఇద్దరు ఒంటరి పక్షులు అయ్యారు. ఇంట్లో పిల్లలతో మునుపు వుండే సందడి కరువై ఇల్లు కళావిహీనం అయింది. మనవలు వెళ్ళిపోవడంతో శాస్త్రి గారు మానసికంగా చాలా క్రుంగిపోయారు.

ఒకనాడు పొద్దునే శాస్త్రిగారు కోటిపల్లి వెళ్ళుతూ దారిలోనే గుండెపోటుతో మరణించారు. సుమారు మూడు గంటలకి లక్ష్మమ్మకి ఈ విషాదమైన వార్త చేరవేశారు. ఈ వార్త తెలిసిన అమె స్పృహ కోల్పోయారు. ఊరిలో ఉన్న చుట్టాలు, ఇరుగు పొరుగు కూతుర్లకి వార్త చేరవేసారు. మనవళ్ళతో పాటు కుటుంబ సభ్యులు వచ్చి అంత్యక్రియలు జరిపించారు. కానీ లక్ష్మమ్మ తీరని దుఃఖంలో మునిగిపోయారు. కుమార్తెలు ఆమెను తమతో పాటు తీసుకొని వెళతాము అన్నా ఆమె శాస్త్రిగారు ఉన్న ఆ ఇల్లు వదిలి రావడానికి ఒప్పుకోలేదు. ఒంటరిని అయిపోయాను అన్న బాధ ఆమెను కృంగదీయసాగింది, కుదుటపడడానికి ఆరు నెలలు పట్టింది. శాస్త్రిగారి లేమితో ఇంటి బాధ్యతలు ఆమె పైన పడ్డాయి. వాళ్ళ పొలం చూసే రైతు రామయ్యకి ఎన్ని మాట్లు కబురు పంపినా రాలేదు సరి కదా సొమ్ము కూడా పంపలేదు. తప్పక ఏనాడు ఇంట్లోంచి బయటకు కాలు పెట్టని ఆమె ఇలా సొమ్ము వసూలు చేసుకోవడానికి బయలుదేరవలసి వచ్చింది.

ఇలా ఆమె ఆలోచనలో ఉండగానే డొంకనవలస స్టేషన్ రావడంతో ఆమె మెల్లగా తన సంచి తీసుకొని దిగారు. స్టేషన్ బయటకు రాగానే ‘ఆకుల కట్ట, ఆకుల కట్ట’ అంటూ బస్సులోంచి కండక్టర్ కేక విని లక్ష్మమ్మ ఆ బస్సు ఎక్కి కూర్చున్నారు. ఆమె మనసు చాలా ఆందోళన చెంది ఉంది, ఆమె ఏనాడూ ఇలాంటి పనులు చేసి ఎరగరు, రావలసిన మొత్తం ఎలా అడగాలో ఆమెకు అర్థం కావడం లేదు. కొంత సేపటికి కండక్టర్ బస్సును ఆపి ‘కోటిపల్లి రోడ్డు, ఎవరైనా దిగాలా’ అనగానే ఆమె బస్సు దిగి, ఏదైనా ఎడ్లబండి కనిపిస్తుందేమో అని కాసేపు ఎదురు చూసి ఏమీ కనబడక పోవడంతో మెల్లిగా నడక మొదలు పెట్టి 40 నిమిషాలలో కోటిపల్లిలో తన ఇంటికి చేరి, తాళంచెవి కోసం పక్కింటి అబ్బాయి చేత రామయ్యకి కబురు చేశారు.

రామయ్య పరుగున వచ్చి ఆమెకు దండం పెట్టి “అయ్యో అమ్మగోరు, మీరు ఇంత కష్టపడి ఎందుకు వచ్చారు” అంటూ ఆయన వద్ద పని చేసే పాలేరు సూరీడు చేత ఉరుకుల పరుగులతో ఇల్లు శుభ్రం చేయించి, మంచినీళ్లు ఏర్పాటు చేసి, కాఫీ మరియు వంటకి సరుకులు తెప్పించాడు. రామయ్య సూరీడుని ఆమెకు సాయంగా ఉంచి, పొలం విషయాలు రేపు పొద్దున్న వచ్చి మాట్లాడుతాను అని చెప్పి సెలవు తీసుకున్నాడు. సూరీడు కుంపటి వెలిగించి కావలసినవన్నీ సమకూర్చేడు. ఆమె మొహం, చేతులు కడుక్కొని కాఫీ కాచి తాగి, కొద్దిగా పులగం వండుకొని ఆ పూట భోజనం అయ్యింది అనిపించారు.

సాయంత్రం లక్ష్మమ్మ వద్దకు తెలిసిన వాళ్ళు వచ్చి పలకరించి, ఆమెకు ధైర్యం చెప్పి వెళ్లారు. సూరీడు రాత్రి ఆమెకు సాయంగా బయటే పడుకున్నాడు. అంతా వెళ్ళేక లక్ష్మమ్మ ఇంటి గోడలని ప్రేమగా నిమురుతూండగా ఆమెకు గతం కళ్ల ముందు నిలిచింది. అత్త మామల ప్రోద్బలంతో తాను స్వంతంగా పాత ఇల్లు పడగొట్టి రాత్రి – పలనకా చాలా కష్టపడి ఈ ఇల్లు కట్టించేరు. రక రకాల చెట్లు జామ, మామిడి, పనసతో పాటూ మందార, గన్నేరు లాంటి పూల చెట్లు కూడా ఇంటి చుట్టూ వేశారు. వేసవి సెలవులలో కూతుర్లు, మనవలతో ఈ ఇంటిలో గడిపిన ఆ మధురక్షణాలు గుర్తుకి వచ్చాయి. ఇప్పుడు ఈ ఇంటి నిశ్శబ్దత ఆమెకు ఓ శ్మశానాన్ని తలపిచింది. మెల్లగా సూరీడు తెచ్చి వేసిన చాపపై పడుకున్న కొద్ది సేపటికే బడలిక వల్ల ఆమెకు నిద్ర పట్టింది.

ఆమె తెల్లవారుతూనే లేచి మొహం కడుక్కుంటూ ఉండగానే సూరీడు చెంబు నిండా ఆవు పాలు, అరటిపళ్లు, కూరగాయలు తెచ్చి “అమ్మగోరు, కాఫీ తాగి ఈ అరటి పండ్లు తినండి” అంటూ ఇచ్చాడు. ఆమె సరే అన్నట్టు తల ఊపి “సూరీ, రామయ్య ఎప్పుడు వస్తాడు?” అని అడగ్గా “అమ్మా, మీరు స్నానం చేసి తయారు అయ్యేసరికి వస్తాడు” అన్నాడు సూరీడు.

ఆమె ఎక్కువసేపు ఎదురు చూడకుండానే రామయ్య వచ్చి దండం పెట్టి “అమ్మా, నిన్న మీతో అనలేదు కానీ, మీరు ఇంత శ్రమ పడి రావడం నాకు బాధ అనిపించింది” అన్నాడు. దానికి ఆమె “మరి మీ అయ్యగారు నన్ను ఇలా ఒంటరిని చేసిపోయారు, నీకు ఎన్ని మాట్లు కబురు చేసినా రాలేదు. మరి నాకు తప్పదు కదా,” అన్నారు బాధతో, బొంగురుబోతున్న గొంతుతో.

ఆ మాటలు విన్న రామయ్య “అమ్మా ఈ ఏడాది వర్షాలు లేక పంట సరిగ్గా చేతికి రాలేదు. ఒక వెయ్యి రూపాయలు రొక్కం తెచ్చాను, ఏమీ అనుకోకండమ్మా.” అంటూ డబ్బులు, కొన్ని అరటిపండ్లు, వేరుశెనగ కాయలు, లేత వంకాయలు, చెరుకుముక్కలు ఇచ్చాడు. ఆ డబ్బులు చూసిన ఆమె “ఏం రామయ్య, ఇంత తక్కువ డబ్బు ఇస్తే నాకు ఎలా గడుస్తుంది? నేను ఇంత కష్టపడి రావడం ఎందుకు చెప్పు?” అన్నారు కొంచం అసహనంగా. దానికి రామయ్య “ఏం చేయను అమ్మగోరు, పిల్లల వాడిని. మీరే కరుణించాలి” అన్నాడు జాలిగా. ఆ మాటలు విన్న ఆమె ఇక ఏమి అనలేకపోయారు.

ఆ సాయంత్రం ఆమె పక్కనే వున్న రామాలయానికి వెళ్ళి ఆ లోకాభిరాముడిని దర్శించుకొని, తనకి ఈ కష్టాలు ఎదురుకునే మనోధైర్యం ఇవ్వమని కోరుకుని వచ్చారు. ఆ రాత్రికి పడుకున్నారే కానీ ఆమెకు నిద్ర రాలేదు. ఆమె మనసులో జవాబు లేని ప్రశ్నలు సముద్రపు అలల్లా వస్తూ పోతున్నాయి. ఇలా ఆమె ఎన్ని రోజులు ఈ వూరు వచ్చి డబ్బులు వసూలుచేసుకోగలదు? వచ్చే ఈ ఆదాయంతో ఎలా గడుస్తుంది? ఆమెకు ఆలోచనలతో రాత్రి అంతా కంటి మీద కునుకు అన్నది లేదు. తెల్లవారుతూ ఉండగా ఆమె లేచి స్నానం చేసి, సంచీలో అన్నీ సర్దుకొని తయారు అయి సూరీడుని ఎడ్లబండి తెమ్మని చెప్పి ఆ ఇంటిని కళ్ళారా చూసుకొని, పొంగి వస్తున్న కన్నీటిని చీరకొంగుతో తుడుచుకుంటూ తిరుగు ప్రయాణం అయ్యారు. ఆమె ఇంటికి వెళ్ళేసరికి బాబు వీది అరుగుమీద కూర్చొని వున్నాడు. ఆమెను చూస్తూనే నవ్వుతూ వచ్చి గట్టిగా కౌగిలించుకోడం చూసి ఆమె ఆశ్చర్యంతో “ఏమి రా బాబు, ఉత్తరం అయినా రాయకుండా ఇలా వచ్చావు. ఎప్పుడు వచ్చావు? నువ్వు వస్తున్నట్టు తెలుస్తే ఇంటి వద్దనే ఉందును కదా” అని ప్రేమగా అడిగారు. దానికి బాబు “అమ్మమ్మా నువ్వు చాలా గుర్తొచ్చావు, వెంటనే ఆఫీస్‌కి సెలవు పెట్టి వచ్చేసా. పొద్దున హౌరా మెయిల్‌లో వచ్చి చూస్తే ఇంటికి తాళం. పక్కనున్న పిన్నిగారు నువ్వు కోటిపల్లి వెళ్ళావని చెప్పారు. ఆమె కాఫీ, టిఫిన్, భోజనం అన్నీ పెట్టారు. అంత కష్టపడి ఎందుకెళ్ళావు అమ్మమ్మా.” అన్నాడు. ఆ మాటలు విన్న లక్ష్మమ్మ బాధగా “మరి వెళ్లకపోతే ఎలా రా? ఇపుడు మీ తాతగారు లేరు కదా చూసుకోడానికి.” అన్నారు. ఆ మాటలు విన్న బాబు అమ్మమ్మను చేయిపట్టుకొని లోపలికి తీసుకొని వెళ్ళి కూర్చోపెట్టి, తాగడానికి నీళ్ళు ఇచ్చి “ఇంక నువ్వు ఒంటరిగా ఉండద్దు అమ్మమ్మా. నాకు కంపెనీ వాళ్ళు ఇల్లు ఇచ్చారు. నిన్ను నాతో పాటు తీసుకొని వెళ్లిపోతా. నాకూ ఒంటరిగా అక్కడ బాగులేదు, నువ్వు ఇక్కడ ఒంటరిగా బాధపడుతున్నావు. నువ్వు ఎన్నాళ్ళు ఆ పొలం చూసుకుంటావు. ఆ పొలం అమ్మేసి డబ్బులు నీ పేరున బ్యాంక్‌లో వేసుకొని నాతో పాటు వచ్చేయి” అన్నాడు ప్రేమగా. ఆ మాటలు విని ఏడుస్తున్న లక్ష్మమ్మని బాబు ఓదార్చి కళ్ళనీళ్లు తుడిచాడు. ఆమెకు దిక్కు తోచని సమయంలో ఒక కొత్త దోవ చూపి, దానిపై నడిచేందుకు ధైర్యం కూడా అందించాడు బాబు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here