ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 10 – ఇన్సానియత్

1
12

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దక్షిణాది సినీ మొఘల్ ఎస్.ఎస్. వాసన్ దిలీప్ కుమార్, దేవానంద్‌లతో తీసిన భారీ సినిమా ‘ఇన్సానియత్’

[dropcap]యా[/dropcap]భైవ దశకం నుండే దక్షిణాది నుండి ఎన్నో సినిమాలు హిందీలో రీమేక్ అయ్యేవి. తెలుగులో తీసిన మూగమనసులు, కలిసి ఉంటే కలదు సుఖం, అర్ధాంగి, సుమంగళి, తాతా మనవడు ఇలా చాలా సినిమాలు హిందీలో తీసారు. 1950లో బి. ఏ. సుబ్బారావు గారు దర్శకత్వంలో వచ్చిన “పల్లెటూరి పిల్ల” సినిమాను 1955లో ఇన్సానియత్ పేరుతో రీమేక్ చేసారు. రిచర్డ్ బ్రిన్సలే షెరెడెన్ ఇంగ్లీష్ నాటకం “పిజారో” ఆధారంగా పల్లెటూరి పిల్ల తీసారట. ఇందులో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి గార్లు నటించారు. తెలుగులో ఇది చాలా పెద్ద హిట్. ఈ సినిమాకు పాటలన్నీ తాపీ ధర్మారావు గారు రాసారు. ఆదినారాయణరావు గారు సంగీతం అందించారు. ఎన్.టి.ఆర్, ఏ.ఎన్ ఆర్.లు కలిసి నటించిన మొదటి చిత్రం ఇది. ఇందులో ఒక ఆంబోతులో తలపడే సన్నివేశంలో ఎన్.టి.ఆర్ డూప్ లేకుండా నటించి చెయ్యి విరగ్గొట్టుకున్నారు కూడా. ఈ సినిమా రైట్లు కొనుక్కుని జెమిని స్టూడియోస్ అధినేత ఎస్.ఎస్. వాసన్ దీన్ని హిందీలో దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్‌లతో ఇన్సానియత్ పేరుతో ఐదు సంవత్సరాల తరువాత తనదైన బాణీలో మళ్ళీ తీసారు. ఇందులో ఏ.ఎన్.ఆర్ పాత్రకు దిలీప్ కుమార్‌ను, ఎన్.టి.ఆర్. పాత్రకు దేవానంద్‌ను తీసుకున్నారు. అంజలీదేవి పాత్ర బీనా రాయ్ పోషించారు.

జంగూరా అనే ఒక రాజు చాలా క్రూరుడు. ప్రజలనుండి సుంకం వసూలు చేయడానికి అంతే క్రూరమైన సేనాధిపతులను నియమించుకుంటాడు. అతని సైన్యానికి ఒక అధ్యక్షుడు భాను. ఒక గ్రామంలో భాను ఇళ్ళు దోచుకుంటున్నప్పుడు అదే ఊరిలో ఉండే గౌరి అతన్ని ఎదిరిస్తుంది. చెంప చెళ్ళు మనిపించి, అతని పని ఎంత క్రూరమైనదో అసహ్యమైనదో ఆమె చెప్పినప్పుడు ఆమె కళ్ళలోని అసహ్యాన్ని చూసి తనెంత అన్యాయమైన పని చేస్తున్నాడో తెలుసుకుంటాడు భాను. అతను జంగూరాని వదిలి పెట్టీ ఇక ఆ గ్రామంలోనే ఉండిపోతాడు. గ్రామస్థులకు జంగూరా సైన్యాన్ని ఎదిరించే విద్యలు నేర్పిస్తుంటాడు. తమ స్వతంత్రం కోసం పోరాడడానికి గ్రామ సైన్యాన్ని తయారు చేస్తాడు. అతనిలోని మార్పు గౌరిని ఆకర్షిస్తుంది. ఒక ఆంబోతు నుంఛి ఆమెను కాపాడి ఆమె ప్రేమ కూడా చూరగొంటాడు భాను.

గౌరీ, మంగళ్ ఇద్దరూ చిన్నప్పటి నుండి కలిసి పెరుగుతారు. మంగళ్ చిన్నప్పటి నుండి గౌరిని ప్రేమిస్తాడు. అతని తల్లికి ఈ సంగతి తెలుసు. అందుకే ఇద్దరికీ పెళ్ళి జరగాలని కోరుకుంటుంది. గౌరి మాత్రం మంగళ్‌ను స్నేహితునిగానే చూస్తుంది. గౌరి, భానుతో చనువుగా ఉంటుందని తెలిసి భానుని ఎదిరించిన మంగళ్‌కు గౌరీ భానుని ప్రేమిస్తుందని తెలుస్తుంది. తల్లిని ఒప్పించి వారిద్దరి వివాహం జరిపిస్తాడు. వివాహం రోజే జంగూరా సైన్యం ఊరి మీద దండెత్తితే వివాహం మానుకుని భాను ఊరి వారి పక్షాన నిలబడి జంగూరా సైన్యాన్ని ఎదిరించి ఊరి వారికి విజయం తెచ్చి పెడతాడు. ఇలా అతను ఊరి వారందరికీ దగ్గర అవుతాడు.

భాను గౌరీలకు ఒక కొడుకు పుట్టడం, జంగురా చాలా సార్లు యుద్దానికి రావడం చివరకు భానుని అతని కొడుకుని కాపాడే ప్రయత్నంలో మంగళ్ చనిపోవడం కథ. ఈ సినిమా తీసేటప్పటికి దిలీప్ కుమార్, దేవ్ ఆనంద్‌లు హిందీలో సినీ ప్రపంచంలో, ఒకరు ట్రాజెడీ కింగ్‌గా మరొకరు రొమాంటీక్ హీరోలుగా ఏలుతున్నారు. వీరి పాత్రలలోని ఈ రోటీన్ షేడ్స్‌ని బట్టి వారి పాత్రలను రూపొందించినా ట్రాజెడీనీ రొమాన్స్‌కి పూర్తిగా లొంగకుండా, పక్కా యాక్షన్ సినిమాగా ఇన్సానియత్‌ను మలిచారు వాసన్. భారీ సెట్లతో పెద్ద బడ్జెట్‌తో నిర్మించిన చిత్రం ఇది. ఒక్క “ఆన్” సినిమా తప్ప ఆ రోజులో యాక్షన్ డ్రామాలన్నీ బీ గ్రేడ్ సినిమాలుగా ఎంచబడేవి. అలాంటి వాతావరణంలో పేద్ద పేరున్న తారలతో అప్పట్లో ఏ గ్రేడ్ సినిమాగా ఒక యాక్షన్ సినిమాను తీయడం వాసన్ హిందీ సినిమాలలో చేసిన సాహసం.

1948లో వాసన్ తీసిన చంద్రలేఖ సినిమా భారీ సెట్టింగులకు శ్రీకారం చుట్టింది. అదే స్థాయిలో ఈ సినిమాను తీయాలని సంకల్పించారు వాసన్. కొన్ని క్రూర జంతువులను, కత్తి యుద్దాలను సినిమా కథలో చొప్పించారు. ఈ సినిమాలోని యుద్ధ సన్నివేశాలు తరువాత ఎన్నో సినిమాలలో కాపీ చేసారు. దిలీప్ మాటి మాటికి పలికే జయ్ భవానీ డైలాగ్ తరువాత చాలా మంది కాపీ కొట్టిందే. ఈ సినిమా నుండే హీరోకి లేదా విలన్‌కి ఒక ప్రత్యేకమైన ఊత పదం లేదా వాక్యం ఉండే ట్రెండ్ మొదలయ్యింది. దేవ్ ఆనంద్‌ను రాజు చెర నుండి విడిపించడానికి ఆఘా, దిలీప్ కుమార్‌లు మారువేషం వేసుకుని పాట పాడి సిపాయిలను ఏమారుస్తారు. ఇది కొన్ని వేల సినిమాలో తరువాత రకరకాల పద్దతిలో కాపీ అయిన సీన్. ఇందులో ఎన్నో డైలాగులు చాలా సినిమాలలో కాపీ కొట్టబడి కనిపిస్తాయి.

భాను పాత్రకు దేవానంద్ మొదటి సారి మీసాలతో కనిపిస్తారు. కాని ఒక చోట ఈ పాత్ర తనకు చాలా ఇబ్బంది కలిగించిందని, అంత కంఫర్టబుల్‌గా తాను ఈ పాత్రను చేయలేకపోయానని ఆయన చెప్పుకున్నారు. చాలా చోట్ల దిలీప్ కుమార్ డామినేషన్ కనిపిస్తుంది. దిలీప్ కుమార్ చనిపోయే సీన్‌ను కూడా తరువాత కొన్ని సినిమాలలో వాడుకోవడం జరిగింది. దేవ్ ఆనంద్ ఒడిలో తల పెట్టుకుని పక్కన తాను ప్రేమించిన బీనా రాయ్ ఏడుస్తుంటే తల్లిని గుర్తు చేసుకుంటూ అతను మరణించే సీన్ కొన్ని సినిమాలలో తరువాత వచ్చిన పెద్ద హీరోలు చాలా సార్లు రిపీట్ చేసారు.

భారీ సెట్టింగులతో దక్షిణాది సాంప్రదాయాలతో ఈ సినిమా చాలా ఖర్చుతో తీసారు. అయితే ఈ సినిమాలో గొప్ప హీరోలతో పాటు దర్శకుడు ఒక కోతికి కూడా ప్రధాన పాత్రను ఇచ్చారు. ఒక జంతువు ప్రధాన పాత్రలో చూపబడిన మొదటి సినిమా కూడా “ఇన్సానియత్” వాసన్ స్క్రిప్ట్‌కి అస్సలు కట్టుబడి ఉండేవారు కాదు. తానేం చేయాలనుకునేవారో అదే చేసేవారు. సహాయకులు తనకు సహకరించపోతే వారికి ఆయన విధించే శిక్ష దారుణంగా ఉండేది. ఐదు సంవత్సరాల కాంట్రాక్టు ఇచ్చినట్టే ఇచ్చి కాంచనమాలతో ఒక్క సినిమా కూడా తీయకుండా ఆమె మతిస్థిమితం తప్పడానికి ఆయనే కారణం అన్న విషయం అప్పట్లో చాలా మంది చెప్పుకున్నారు. ఇంత శిక్ష ఆమెకు అతను వేయడానికి కారణం ఆమె తనకు ఎదురు పలికిందని.

వాసన్ హిందీ వారితో సినిమాలు తీసినా, అందరినీ మద్రాస్ పిలిపించుకునేవారు. ఇన్సానియత్ సినిమాలో ఒక చింపాంజి ఉంటే బావుంటుందని అయనకి ఎవరో చెబితే ఆ ఆలోచన నచ్చి చాలా సర్వే చేసారు. అప్పుడు అమెరికాలో నటిస్తున్న జిప్పి అనే చింపాంజి గురించి తెలుసుకున్నారు. జిప్పి స్కేటింగ్ చేసేది, పియానో వాయించేది, టైపు కూడా చేసేదట. అమెరికాలో టీవీ షీలలో జిప్పికి చాలా గిరాకి ఉండేది. అప్పట్లోనే నెలకి 55,000 డాలర్లు జిప్పి సంపాదించేది. డబ్బుకి అసలు వెనుకాడని వాసన్ అమెరికా నుండి జిప్పిని ఇండియా పిలిపించుకున్నారు. జిప్పితో పాటు దాని యజమాని, ట్రైనర్లు కూడా మద్రాసుకు రప్పింఛబడ్డారు. మీనంబాకం విమానాశ్రయంలో జిప్పికి గొప్ప స్వాగతం లభించింది. దీన్ని వాసన్ రికార్డు చేసారు కూడా. పద్దెనిమిది ఇంచులు మాత్రమే పొడుగున్న ఈ జీవికి లభించిన పబ్లిసిటీ అంతా ఇంతా కాదు, వాసన్ ఖర్చు పెట్టింది కూడా ఊహకందదు. దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్లు ఈ పబ్లిసిటీకీ ఖంగయ్యారట. చిన్నపిల్లలతో, జంతువులతో నటించకూడన్న డబ్ల్యూ.సీ.ఫీల్డ్స్ సలహాలోని నిజాన్ని అనుభవపూర్వకంగా గ్రహించారు.

సినిమాగా “ఇన్సానియత్”, మాతృక పల్లెటూరి పిల్ల స్థాయిలో లేదు. దేవ్ ఆనంద్ జానపద వీరుడిగా సూట్ అవలేదు. దేవానంద్‌ను పట్టుబట్టి వాసన్ తీసుకొచ్చారు కాని, ఆయన ఈ సినిమాపై పెద్దగా ఆసక్తిగా లేరని తెలిసిపోతుంది. అన్ని సీన్లలో బిగుసుకుపోయి కనిపిస్తారు ఆయన. దిలీప్ కుమార్ డామినేషన్ కూడా దేవానంద్‌ని బాధించి ఉండవచ్చు. స్క్రీన్ ప్లే చాలా అతుకులుగా కనిపిస్తుంది.

దిలీప్ కుమార్ మాత్రం ఈ ఆకర్షణలన్నిటికీ దూరంగా తనదైన పద్ధతిలో మెరిపిస్తారు. ప్రేమ, త్యాగం, బాధ ఈ భావాలన్నీ కళ్ళతో పలికించడం అతనికి వెన్నతో వచ్చిన విద్య. అయితే వాసన్ ఒక్క నటుల ప్రతిభ మీద కాక భారీ సినిమా తీయాలనే ప్రయత్నంలో ఉన్నట్లు ప్రతి చోట కనపడుతుంది. జానపద సినిమాలకు దక్షిణాన ఉన్న క్రేజ్ ఆ రోజుల్లో ఉత్తర భారతంలో లేదు. సినిమాలో దక్షిణాది వాసన కొంచెం ఎక్కువగానే కనిపించడం వలన అనుకున్నట్టుగా ఇది అక్కడ ఆడలేదు. గౌరి పాత్రలో బీనా రాయ్ బావుంటుంది. కాని ఆమె పాత్ర కూడా ఇంత భారీతనంతో పెద్దగా ఎలివేట్ కాలేదు. అంత త్యాగం చేసిన మంగళ్‌ను అనుమానించి అతన్ని దూషించడం, రామాయణంలో సీత లక్ష్మణుని దూషించడంతో పోలి ఉంటుంది. స్త్రీలు కొన్ని సార్లు ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తారో అని మరోసారి అనిపించేటట్లు ఉంటుంది ఆ సీన్. అక్కడ దిలీప్ కుమార్‌పై సానుభూతిని దర్శకులు పెంచే ప్రయత్నం చేసారని చెప్పవచ్చు.

జంగూరా పాత్రలో జయంత్ బావుంటారు. అప్పట్లో పాపులర్ విలన్‌గా చాలా సినిమాలు చేసారాయన. తెలుగువారిగా మనం గుర్తు పెట్టుకోవసింది మార్తాండ్ పాత్ర. పైడి జయరాజ్ గారు జంగూరా సైనాధ్యక్షుడిగా కనిపిస్తారు. వారి శరీరాకృతి, హిందీ డిక్షన్ చాలా గొప్పగా ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం జయరాజ్‌ను మొదటి తెలంగాణ నటుడిగా ఇప్పుడు గుర్తించింది. ఈ సినిమాలో వారు ప్రధాన పాత్రలతో పోటీ పడి తన నటనా ప్రతిభను చాటుకున్నారు. మంగళ్ తల్లిగా కూడా అలనాటి మేటి నటి, నూతన్ తనూజల తల్లి శోభనా సమర్థ్ కనిపిస్తారు. ఈ సినిమాలో మొత్తం 15 పాటలున్నాయి. రఫీ, లత, తలత్, ఆశ, హేమంత్ కుమార్‌లు గానం చేసిన ఈ పాటలు కూడా భారీ వ్యయంతో చిత్రించారు. జిప్పి, హాస్య నటుడు ఆఘాకు కలిపి ఒక పాట ఉంటుంది. జంతువును పాటలో పాత్రగా తీసుకున్న మొదటి చిత్రం కూడా ఇదే. అన్ని పాటలు రాసింది రాజేంద్ర కిషణ్, సంగీతం అందించింది సి. రామచంద్ర. భారీ యాక్షన్ చిత్రంగా చాలా సినీ కథలకు స్ఫూర్తి అందించిన ఈ సినిమా ఇప్పుడు అతి ఓపిగ్గా చూడాలి. కాని దిలీప్ కెరీర్‌లో ఒక వినూత్నమైన ప్రయోగంగా మిగిలిపోతుంది ఈ చిత్రం. కమర్షియల్ హిట్ కాకపోయినా ఒక ట్రెండ్ సెటర్ సినిమాగా విశ్లేషకులు దీన్ని గుర్తు చేసుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here