ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 11 – దాగ్

1
9

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్‌కు మొదటి ఫిలింఫేర్ అవార్టు తెచ్చిపెట్టిన సినిమా ‘దాగ్’

[dropcap]ది[/dropcap]లీప్ కుమార్‌కు అతని కెరీర్‌లో మొత్తం ఎనిమిది ఫిలింఫేర్ అవార్డులు లభించాయి. ఇప్పుడు షారుఖ్ ఖాన్ కూడా ఎనిమిది ఫిలింఫేర్‌లు సాధించి దిలీప్ రికార్డును చేరుకున్నారు కాని ఆ రికార్డు ఇంకా బ్రేక్ కాలేదు. 1954లో ఫిలింఫేర్ అవార్డులు మొదలయ్యాయి. మొట్టమొదటి సారి ఫిలింఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకుంది దిలీప్ కుమార్ .   ఉత్తమ నటిగా మీనా కుమారి బైజు బావరా సినిమాకి ఎంపికయ్యారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా నౌషద్, బైజు బావరా సినిమాకి, ఉత్తమ చిత్రంగా దో భీఘా జమీన్, ఉత్తమ దర్శకుడిగా బిమల్ రాయ్  దో బీఘా జమీన్ కు ఎన్నికయ్యారు. దిలీప్ కుమార్ కు ఉత్తమ నటుడు ఫిలింఫేర్ అవార్డు లభించింది దాగ్ సినిమాకు. దాగ్ సినిమాకు దర్శకత్వం వహించింది అమియా చక్రవర్తి. దిలీప్ కుమార్‌ను సినిమా రంగానికి పరిచయం చేసింది దేవికా రాణి,  అమియా చక్రవర్తిలు. దిలీప్ సాబ్ మొదటి సినిమా జ్వార్ భాట  కు దర్శకత్వం వహించింది అమియా చక్రవర్తి. దాగ్ సినిమాను ఆయన సమర్పించి, దర్శకత్వం కూడా వహించారు. 44 ఏళ్ళకే మరంణించిన ఈయన మంచి సినిమాలను భారతీయ సినిమాకు అందించారు. పతిత, సీమ లాంటి ఆలోచింపజేసే సినిమాలను ఆయన హిందీ ప్రపంచానికి ఇచ్చారు.

దాగ్ సినిమా ఇతివృత్తం మద్యవ్యసనం. శంకర్ మంచి కళాకారుడు. అందమైన బొమ్మలు చేస్తూ వాటిని అమ్ముకుని జీవిస్తుంటాడు. డబ్బున్నవాడు కాదు కాని మంచి పనితనం ఉన్న వ్యక్తి. అతని పనితనం గమనించి ఎక్కడెక్కడి నుండో వచ్చి అతని వద్ద బొమ్మలు కొనుక్కునే వారుంటారు. ముసలి తల్లితో ఒక చిన్న ఇంట్లో జీవిస్తుంటాడు అతను. పొరుగున ఉండే పార్వతి అతన్ని ప్రేమిస్తుంది. పార్వతి అన్న కూతురు పుష్ప ఆమె ఈడుదే. అన్న వదినలతో పార్వతి జీవిస్తుంటుంది. పార్వతి వదిన ఆమెను ఇష్టపడకపోయినా ఆమె అన్న, పుష్ప ఇద్దరూ ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. పార్వతిని శంకర్ ఇష్టపడతాడు కాని అతనికున్న పెద్ద వ్యసనం తాగుడు. దాని ముందు అతనికి ఎవ్వరూ అవసరం అనిపించరు. శంకర్ తల్లి అతన్ని ఎంతో ప్రేమిస్తుంది. కాని ఈ వ్యసనం నుండి తప్పించలేకపోతుంది. శంకర్ మంచి గుణవంతుడు. ఊరిలో ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా అతను ఎన్నో కష్టాలనైనా ఓర్చుకుని సహయం చేసి తీరతాడు. కాని మందుకు పూర్తిగా బానిస. అతని మంచితనం తెలిసిన స్నేహితుడు తాను మందు అమ్ముతూ జీవిస్తున్నా, ప్రతిసారి మందు కొనుక్కోవడానికి వచ్చే శంకర్‌ను ఈ అలవాటు మానుకొమ్మని చెబుతూ ఉంటాడు. కాని శంకర్ మాత్రం సీసా చూస్తే తనను తాను నియంత్రించుకోలేడు. ఈ ఒక్క అలవాటు వలన ఊరంతా అతన్ని అసహ్యించుకుంటారు. ఎన్ని మంచి పనులు చేసినా అతన్ని మనిషిగా లెక్కించరు. తనకు ఊరిలో గౌరవం లేదన్న సంగతి శంకర్‌కు తెలుసు. ఇది అతన్ని ఇంకా బాధిస్తుంది. ఆ బాధ తాగుడితో దూరం అవుతుందని ఇంకా ఎక్కువ తాగుతుంటాడు. కొడుకును బలహీనతలతో పాటు ప్రేమించే అతని తల్లి అతనిపై చూపే ప్రేమ ఒక్కటే శంకర్‌కి శక్తి ఇస్తూ ఉంటుంది

పార్వతి అన్నకు చనిపోయిన ఒక దూరపు చుట్టం నుండి చాలా ఆస్తి కలిసి వస్తుంది. వారు తమ పాత ఇల్లు వదిలిపెట్టి ఓ పెద్ద ఇల్లు కట్టుకుని ఆర్భాటంగా జీవిస్తూ ఉంటారు. అయినా పార్వతి శంకర్ కోసం అతని ఇంటికి వస్తూ ఉంటుంది. పేద వాడయిన శంకర్ తోనే తన భవిష్యత్తును ఊహించుకుంటుంది.

శంకర్ తల్లి జబ్బు మనిషి. ఆమెకు మందు తెస్తానని ప్రతిసారి శంకర్ డబ్బు తీసుకుని వెళ్ళడం, సారా దుకాణం దగ్గర ఆగి కొంత తాగడం, తరువాత అపస్మారక స్థితిలో పడి ఉండి ఎప్పుడో ఇల్లు చేరడం, ఇవి చూసి పార్వతి శంకర్‌ని మార్చాలనుకుటుంది. ఒకసారి తాను కూడా తాగినట్లు నటిస్తూ అతని వద్దకు వస్తుంది. ఆమె స్థితి చూసి శంకర్‌కు విపరీతమైన కోపం వస్తుంది. తాగినందుకు పార్వతిని బాగా కొడతాడు. అన్ని దెబ్బలు తిన్న తరువాత కూడా పార్వతి అతను ఇక తాగుడు మానతాడని సంతోషిస్తుంది కాని తన శరీరంపై పడిన దెబ్బలను పట్టించుకోదు. సంతోషంగా శంకర్ తల్లి దగ్గరకు వచ్చి ఇక శంకర్ మారిపోతాడని చెబుతుంది. కాని శంకర్‌కి కోపం అయినా బాధ అయినా తాగుడే ఆధారం. అతను పార్వతిని కొట్టి ఆ బాధతో మళ్ళీ సారా కొట్టుకు వెళ్ళి ఫుల్‌గా తాగి తూలుకుంటూ వస్తాడు. ప్రశ్నించిన తల్లికి పార్వతి తనను చాలా బాధపెట్టిందని చెబుతాడు. తల్లి మొదటిసారి శంకర్‌పై చేయి చేసుకుంటుంది. పార్వతి శంకర్‌ను ఎంతో ప్రేమిస్తుందని, ఆ ప్రేమలో శంకర్‌ను మార్చడానికి అలా నటించిందని, మత్తు తప్ప మరేం తెలియని అతను అంతటి స్త్రీ ప్రేమను గుర్తుంచక చాలా పోగొట్టుకుంటున్నాడని తల్లి వేదన పడుతూ చెప్పడం విన్న శంకర్ మొదటిసారి తన గురించి ఆలోచించుకుంటాడు. చివరకు నగరానికి వెళ్ళడమే తనను ఈ వ్యసనం నుండి దూరం చేయగలదని, తనకు స్థల మార్పు అవసరం అని ఊరు వదికి పట్నానికి వెళతాడు. ఆక్కడ కష్టపడి పని చేసి కొంత డబ్బు కూడబెడతాడు.

శంకర్ తాగుడు కోసం ఇంట్లో ప్రతి వస్తువును అమ్మేసాడు. ఆఖరికి ఇల్లు కూడా కుదవ పెట్టబడి ఉంటుంది. అతను పని కోసం పట్నం వెళ్ళిన తరువాత ఇదే అదననుకుని అప్పులవాళ్ళు ఇంటిని జప్తు చేసుకుని శంకర్ తల్లిని బైటకు పంపిస్తారు. కాని తిరిగి వచ్చిన శంకర్ డబ్బు తిరిగి ఇచ్చి ఇల్లు విడిపిస్తాడు. తాను చాలా మారానని ఇన్ని రోజులు మందు ముట్టలేదని, కష్టపడి తమ భవిష్యత్తుకు డబ్బు కూడబెట్టానని శంకర్ తల్లికి చెబుతాడు. పార్వతిని వివాహం చేసుకుంటానని ఆమె ఆన్న వద్దకు వెళ్ళి అడుగుతాడు శంకర్. కాని అన్ని సంవత్సరాలు తాగుబోతుగా అతన్ని చూసిన పార్వతి అన్న, ఊరి జనం కూడా అతను మారాడంటే నమ్మరు. తన చెల్లెలిని ఒక తాగుబోతుకిచ్చేది లేదని అతన్ని ఇంటి నుండి గెంటేస్తాడు పార్వతి అన్న. ఈ అవమానం భరించలేక, ఊరి మీద కోపంతో శంకర్ మళ్ళీ తాగడం మొదలెడతాడు.

పార్వతి అన్నతో తాను శంకర్‌ని ప్రెమిస్తున్నానని, అతన్నే వివాహం చేసుకుంటానని చెబుతుంది. శంకర్ వ్యక్తిగా మంచివాడని, తాగుడు ఒక బలహీనత అని అది ఒక జబ్బు, అని ఈ జబ్బుకు వైద్యం చెయ్యాలి తప్ప రోగిని దూరం పెట్టకూడదని అన్నతో చెబుతుంది. కాని అన్న ఆమె భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆమె వివాహం మరొకరితో నిర్ణయిస్తాడు.

శంకర్ తల్లి విపరీతంగా జబ్బు పడుతుంది. ఆమె మందుల కోసం వెళ్ళి శంకర్ తల్లి జబ్బు పడిందన్న బాధతో కొంత మందు తీసుకోవాలని సారా కొట్టుకు వెళతాడు. మిత్రుడు ఎంత చెప్పినా కొంచెం అంటూ మొదలెట్టి పూర్తిగా స్పృహ కోల్పోయేటంత తాగుతాడు. తల్లి మందు కోసం దాచుకున్న డబ్బు మరో తాగుబోతు కొట్టేస్తాడు. చివరకు మత్తు దిగి ఇంటికి వచ్చేసరికి తల్లి ఆఖరి ఘడియల్లో ఉంటుంది. బిడ్డను బాధగా చూస్తూ అతని చేతుల్లో మరణిస్తుంది ఆమె. తల్లి చావు శంకర్‌ని ఇంకా అపరాధ భావంలోకి నెట్టెస్తుంది. దీని నుండి తప్పించుకోవడానికి కూడా అతనికి తాగుడే ఆధారం అవుతుంది. చివరకు కొన్ని సంఘటనల తరువాత పార్వతి పెళ్ళి అతను చెడిపేయడం, ఆమె అతన్నే వివాహం చేసుకోవడం చివర్లో జరుగుతాయి. పెళ్ళి తరువాత ఇక మందు సీసా చూసి కూడా దాన్ని దూరం పెట్టడంతో అతనిలో మార్పు మొదలవుతుంది.

మంచివాని వ్యక్తిత్వానికి వ్యసనం ఒక మచ్చ. వ్యసనం మనిషిలోని మంచిని కూడా కప్పేస్తుంది. వ్యసనపరుడిని సమాజం చులకనగా చూస్తుంది. దాగ్ అంటే మచ్చ. చాలా మంది కన్నా ఎన్నో రెట్లు మంచితనం, దయాగుణం ఉన్న శంకర్ ఈ తాగుడు అనే బలహీనత కారణంగా ఊరందరికి చులకన అవుతాడు. తల్లిపై ఎంత ప్రేమ ఉన్నా ఆమె బాధకు, పరోక్షంగా ఆమె చావుకు కారణం అవుతాడు. అమితంగా అతన్ని ప్రేమించే పార్వతిని అందుకోవడం కూడా దాదాపుగా దుస్సాధ్యం అవుతుంది. ఇన్ని కష్టాలకు కారణం తనలోని ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోలేక, ప్రతి దానికి సమాధానం తాగుడులో, మత్తులో వెతుక్కునే శంకర్ ప్రయత్నం మాత్రమే. వ్యసనం మంచివాడిని కూడా ఎలాంటి పతనానికి దగ్గర చేస్తుందో చెప్పిన సినిమా ఇది. ఇందులో ఒక బలహీన మనస్కుడిగా, వ్యసనపరుడిగా, దిలీప్ నటన చాలా బావుంటుంది. అతని తల్లిగా చేసిన లలితా  పవార్ నటన అమోఘం. చాలా గొప్ప ఫర్మార్మెన్స్ ఇచ్చింది ఈవిడ. తల్లి కొడుకులిద్దరు నటించే సీన్‌లో కొన్ని సార్లు దిలీప్ నటనను మించిపోతుంది లలితా పవార్ నటన. సినీ ప్రపంచం గర్వించవలసిన గొప్ప నటి ఆవిడ. ఆవారా, అనారి, మిస్టర్ అండ్ మిసెస్ 55 సినిమాలలో ఈవిడ నటనను చూసిన నాకు ఆవిడ అంటే ఎంతో గౌరవం. కాని దాగ్ సినిమాలో ఆమె నటన పతాక స్థాయిలో ఉంటుంది. అసలు ఇలాంటి నటులతో పని చేసిన అనుభవమే దిలీప్ కుమార్‌ను ఒక గొప్ప నటుడిగా మలిచాయని నా కనిపిస్తూ ఉంటుంది. తెలుగు సినిమాకు ఒక గుండమ్మ(సూర్యకాంతం) మళ్ళీ రానట్లే, హిందీ సినిమాకు మరో లలితా పవార్ ఎప్పటికీ రాదు. అత్యద్భుతమైన నటి ఆమె. ఆమె కోసం ఈ సినిమా మళ్ళీ చూడాలనిపిస్తుంది.

పార్వతిగా నిమ్మి బావుంటుంది. ఆమె మేనకోడలు పుష్పాగా ఉషాకిరణ్ నటించారు. ఈవిడ పాత్ర కథకు పెద్దగా పనికి రాదు. చదువు చెప్పడానికి వచ్చిన మాస్టార్ని ఆమె ప్రేమిస్తుంది. ఆమె కోరిక మన్నించి తండ్రి అతనితో వివాహం జరిపిస్తాడు. ఈ మేస్టర్ పాత్ర ద్వారా సమాజంలో చదువు మర్యాద ఉన్న వారికి దొరికే మన్నన ఎలా ఉంటుందో, వారికి కోరిన జీవితం ఎంత సులువుగా దొరుకుతుందో చెప్పే ప్రయత్నం చేసారు దర్శకులు. మరో పక్క గొప్ప పనితనం ఉండి మంచితనం ఉండి కూడా శంకర్ వివాహానికి ఎవరూ ఒప్పుకోవడం చూపిస్తూ మనిషి తనను తాను సమాజం ముందు ప్రెజెంట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం అని, బలహీనతలకు లొంగిన మనిషి ఎంత గొప్పవాడయినా సమాజం అతన్ని చిన్న చూపు చూస్తుందని చెప్పే ప్రయత్నం దర్శకులు చేసారు. ఇక పార్వతి అన్నగా కన్హైయాలాల్ చాలా బాలెన్స్‌డ్‌గా నటించారు. నాచురల్ యాక్టర్ అతను. మెహబూబ్ ఖాన్ ఔరత్ సినిమాలో లాలాగా మెప్పించిన వ్యక్తి. ఇతను చేసిన పాత్రలను పరీక్షిస్తే అతని వర్సటాలిటి అర్థం అవుతుంది. హింది సినిమాలో సహజ నటనకు ఈయన పెట్టింది పేరు. స్టేజీ యాక్టర్‌గా అతని కెరీర్ మొదలయి, సినీ నటుడిగా ఊపందుకున్నా, ఎప్పటికీ సినిమా కన్నా నటనారంగాన్నే ప్రేమించిన వ్యక్తి. చెల్లెలి భవిష్యత్తు కొసం మథనపడుతూ, శంకర్‌ని అల్లుడిగా స్వీకరించలేక నలిగిపోయే సీన్లలో కన్హైయాలాల్ చాలా బాగా నటించారు ఈ సినిమాలో.

సినిమాలో శంకర్ చుట్టూ ఉన్న వ్యక్తులు అందరూ మంచివారే. కేవలం అతనిలోని వ్యసనం అతన్ని వారి నుండి దూరం చేస్తుంది. ఈ పాయింట్‌ను దర్శకులు ప్రతి సీన్‌లో చూపించే ప్రయత్నం చేసారు. అప్పట్లో హీరో అంటే పర్ఫెక్ట్ జంటిల్మెన్‌గా చూపేవారు. ఆ సమయంలో ఒక బలహీన మనస్కుడు, వ్యసనపరుడిగా దిలీప్ కుమార్ ఈ పాత్ర చేయడమే గొప్ప. ఇందులో అతను చూపిన ప్రతిభ అతనికి మొదటి ఫిలింఫేర్ అవార్డును తెచ్చిపెట్టింది. భారతీయ సినీ చరిత్రలో మొదటి ఫిలింఫేర్ అవార్డు పొందిన నటుడుగా అతని కీర్తి సజీవంగా నిలిచిపోయింది.

దాగ్ సినిమాకు సంగీతం అందించింది శంకర్ జైకిషన్‌లు. శంకర్ మన తెలుగు వారు అన్న సంగతి అందరికి తెలుసు. ఆయనకు తెలుగు అంటే ఎంత అభిమానమో రామయ్యా వస్తావయ్యా పాట చెబుతుంది. దాగ్‌లో మొదట్లో శంకర్ దగ్గర బొమ్మలు కొనుక్కోవడానికి ఇద్దరు వ్యక్తులు వస్తారు. వాళ్ళు తమలో తాము తెలుగులో మాట్లాడుకుంటూ కనిపిస్తారు. తెలుగువారు గమనించవలసిన సీన్ ఇది. సినిమాలో మొత్తం 10 పాటలున్నాయి. శైలేంద్ర, హస్రత్ జైపురిలు రాసిన పాటలు అవి. తలత్ మహమూద్ పాడిన ‘ఐ మెరే దిల్ కహీ ఔర్ చల్’ ఇప్పటికీ రేడియోలో వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాట దిలీప్ మీద మూడు సార్లు, లతా మంగేష్కర్ గొంతులో నిమ్మి పైన మరోసారి చిత్రించారు. లతా కన్నా మనకు తలత్ గొంతులో ఈ పాట ఆకట్టుకొంటుంది. తలత్ గొంతులో ఈ పాట వినడం అలవాటు పడినందువలన కుడా కావచ్చు ఈ పాటకు వారిదే పర్ఫెక్ట్ వాయిస్ అనిపిస్తుంది. “హమ్ దర్ద్ కె మారో కా”, “కొయీ నహీ మెరా ఇస్ దునియా మే” అనే పాటలలో తలత్ పలికించిన విషాదం మనసును కదిలిస్తుంది.

దాగ్ సినిమా సంగీత దర్శకులు శంకర్ జైకిషన్ జీవితంలోనూ ప్రధాన మలుపు. ఈ సినిమాతో సెబాస్టియన్ వారి వద్ద అరేంజర్ గా చేరాడు. అతనిరాకతో శంకర్ జైకిషన్ సంగీతానికి ఊపు పెరిగింది. ముఖ్యంగా వేగంగా పాడిన ఏయ్ మెరే దిల్ కహీన్ ఔర్ చల్ పాట ఆర్కెస్త్రేషన్ లో ఇది తెలుస్తుంది. కౌంటెర్ మెలోడీ అత్యద్భుతంగా హిందీ సినిమాపాటల్లో వినిపించిన పాట ఇది.  హిందీ సినీపాటలలో పదాల వాడకాన్నీ మార్చిన సినిమా ఇది. ఒకవైపు శైలేంద్ర అలతి అలతి పదాలతో లోతైన భావాన్ని ప్రదర్శిస్తూంటే మరోవైపు హస్రత్ జైపురి ఉర్దూ షేర్ షాయరీని, గజల్ రచననూ పాటల్లో ప్రదర్శిస్తూ పాటల పదాలకు సాహిత్య గౌరవాన్ని ఆపాదించటం వేగవంతం చేశారు.  వ్యక్తిగతంగా దర్శకుడు, నిర్మాత అమియ చక్రవర్తి జీవితంలో కూడా దాగ్ సినిమా ప్రాధాన్యం వహిస్తుంది. ఎ సినిమాలో ఒక ప్రధాన పాత్ర పోషించిన ఉషా కిరణ్‌తో అతనికి అనుబంధం ఏర్పడింది. తరువాత నిర్మించిన పతిత సినిమా ఆమెనే నాయిక.

దిలీప్ కుమార్ సినిమాలలో నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన పాత్ర శంకర్. బలహీన మనస్కుడిగా చేసి ప్రేక్షకుల సానుభూతి సంపాదించడం అంత సులువు కాదు. దిలీప్ కుమార్ ఈ సినిమాలో తన పాత్రను అంత చక్కగా ప్రజలకు చేరువ చేయగలిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here