ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 12 – అనోఖా మిలన్

2
9

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్ మొదటిసారి అతిథి పాత్రలో కనిపించిన సినిమా బెంగాలీలో పారి… హిందీలో అనోఖా మిలన్

[dropcap]ఒ[/dropcap]క నటుడి కమిట్మెంట్ తెలుసుకోవాలంటే పరభాషా చిత్రాలను అతను చేస్తున్నప్పుడు అతను చేసే హోమ్ వర్క్‌ను గమనించాలి. దిలీప్ కుమార్ 1966లో ‘పారి” అనే ఒక బెంగాలీ సినిమాలో అతిథి పాత్రను పోషించారు. ఈ పాత్ర కేవలం సినిమా ఆఖరున ఒక ఇరవై నిముషాలు కనిపిస్తుంది. కాని ఈ సినిమాకు అతను భాష నేర్చుకుని యాసను స్టడీ చేసి ఒక బెంగాలి వ్యక్తి మాట్లాడినట్లే తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్నారు. తరువాత అదే సినిమాను హిందీలో 1972లో “అనోఖా మిలన్” అనే పేరుతో మళ్ళీ నిర్మించారు. తన కెరీర్ మొత్తంలో దిలీప్ రెండు బెంగాలీ సినిమాలలో మాత్రమే నటించారు. ఒకటి “పారి”.. “అనోఖా మిలన్’ అనే పేరుతో బెంగాలీలో చేసిన ప్రధాన పాత్రలతోనే దీన్నిమళ్ళీ రీమేక్ చేసారు. రెండో చిత్రం “సగీనా మహాతో”… దీన్ని హిందీలో సగీనా అనే పేరుతో మళ్ళీ తీసారు. “అనోఖా మిలన్” లో ధర్మేంద్ర, ప్రొణోతి ఘోష్ నాయికా నాయికలు. అండమాన్ జైలు వార్డన్‌గా దిలీప్ కుమార్ సినిమాలో చివరి ఘట్టంలో కనిపిస్తారు. ఇది హిందీలో దిలీప్ అతిథి పాత్ర పోషించిన మొదటి సినిమాగా గుర్తుండిపోతుంది. తరువాత సంజీవ్ కుమార్ జయభాదురి నటించిన కోషిష్ సినిమాలో ఒక రెండు నిముషాలు ఫోన్ దగ్గర కనిపిస్తారు. మళ్ళీ “ఫిర్ కభీ మిలోగి” అనే హృషికేశ్ ముఖర్జీ సినిమాలో ఒక అతిథి పాత్ర పోషించారు. ఒక అతిధి పాత్రతో అంత చార్మ్ సంపాదించుకోవడం దిలీప్ కుమార్‌కే సాధ్యమయింది. అదీ ఒక పరభాషా సినిమాలో. “పారి”లో అతని పాత్ర చూసి “సగీనా మహతో”లో అతనికి పూర్తి నిడవి పాత్ర ఇచ్చారంటే అతని ప్రతిభ అర్థం చెసుకోవచ్చు.

  

అనోఖా మిలన్ ధర్మేంద్ర దిలీప్ కుమార్‌లు కలిసి నటించిన ఒకే ఒక హిందీ చిత్రం. మొదట మాతృక పారిలో నటించాక, హిందీ రీమేక్‌లో కూడా ఇద్దరూ అవే పాత్రలను పోషించారు. ఈ సినిమాతో కలిసిన వీరి స్నేహం దిలీప్ కుమార్ చివరి శ్వాస దాకా నిలిచింది. ఇక కథకు వస్తే, ఇది బెంగాలీ రచయిత జరాసంధ రాసిన కథ ఆధారంగా తీసిన సినిమా. తారా సేన్ ఒక పల్లెటూరిలో నివసించే అమ్మాయి. ఆమె తల్లి తండ్రులు, చెల్లెలు ఒక చిన్న తమ్ముడు పల్లెలో ఉంటే ఒక అన్న కలకత్తాలో ఉంటాడు. తారా భేషజాలు లేని అమ్మాయి, స్వతంత్ర భావాలు ఎక్కువ. స్వేచ్చ ను కోరుకుంటుది. ఆడపిల్ల అని ఆమె తల్లి తారను ఇంట్లోనే ఉంచేయాలని చూసినా తల్లి మాట పెడచెవిన పెట్టి నది ఒడ్డున ప్రకృతి ఒడిలో గడపడం తారకు అలవాటు. ఆమె తండ్రి తార మనసు అర్థం చేసుకుంటాడు. అందుకే ఆ రోజుల్లో ఆడపిల్లలకు తండ్రులు స్వేచ్ఛ ఇవ్వని సందర్భంలో కూడా తన కూతురికి మాత్రం సంపూర్ణమైన స్వేచ్ఛను ఇస్తాడు. తార దానికి దుర్వినియోగం చేయదు. కాని స్వేచ్ఛాపూరిత వాతావరణంలో పెరిగిన ఆమె వ్యక్తిత్వం అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అనవసరమైన సిగ్గు బిడియాలకు దూరంగా జీవిస్తూ ఆమెకో ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. ఊరి స్త్రీలకు ఆమె మొండిదిగా, భయం భక్తి లేని వ్యక్తిగా సాంప్రదాయాన్ని గౌరవించని వ్యక్తిగా కనిపిస్తుంది. ఆమె ప్రశ్నించే తత్వం వల్ల అందరూ ఆమెను తప్పుగానే అర్థం చేసుకున్నా తార మాత్రం ఎవరినీ లెక్క చేయదు. తనకు ఆనందం ఇచ్చే దారిలో జీవిస్తూ ఉంటుంది.

ఆ ఇంట పని చేసే వ్యక్తి కొడుకు ఘనశ్యాం. అందరూ అతన్ని ఘనా అని పిలుస్తారు. చిన్నప్పటీ నుండి పారోకి ఘనాకు మంచి స్నేహం. కాని చిన్నతనంలో ఎప్పుడు ఆటపాటలతో చదువు కోవట్లేదని, బాధ్యత ఎరిగి ప్రవర్తించట్లేదని ఘనశ్యాంను మరో ఊరు పంపించేస్తారు అతని తల్లి తండ్రులు. ఘనా పెద్దవాడయి తిరిగి వచ్చాక అతని తండ్రి తారా తండ్రి వద్దే పనికి ఘానాను పెడతాడు. ఇక ఘనా తారాల మధ్య స్నేహం పెరుగుతుంది. ఘనాకు తారా అంటే చాలా ఇష్టం. ఆమెను ఒక దేవతగా చూసుకుంటూ ఉంటాడు. ఇద్దరి మధ్య చనువు ఎక్కువవుతుందని తార తల్లి ఒక రోజు ఘనా తారతో మాట్లాడడానికి వస్తే తారకు ఒంట్లో బావుండలేదని చెబుతుంది. అందులోని ఉద్దేశం అర్థం చేసుకోలేని ఘనా హాస్పటల్‌కు వెళ్ళి డాక్టరును తార ఇంటికి పట్టుకొస్తాడు. చివరకు తారకు బానే వుందని తనతో ఆమె కలిసి తిరగడం ఆమె తల్లికి ఇష్టం లేదని తెలుసుకుని తన స్నేహితురాలిని కలుసుకోలేక పోతున్నందుకు బాధ పడతాడు.

ఒక రోజు తార అన్నయ్య తన స్నేహితుడ్ని వెంట బెట్టుకుని ఇంటికి వస్తాడు. ఊరు చూపించడానికి స్నేహితుడిని బైటకి తీసుకెళుతూ ప్రతి చోటకు తారను కూడా ఆమె అన్న తోడు రమ్మంటాడు. పర పురుషుడుకు స్త్రీ దూరం ఉండాలి లాంటి పద్ధతుల గురించి తెలియని ఆమె స్వేచ్ఛగా తనకు తెలిసిన ఊరంతా ఇద్దరికీ చూపిస్తుంది. అన్న స్నేహితుడని అతన్ని గౌరవిస్తుంది అతనితో సమయం గడుపుతుంది. కాని తార పట్ల ఆకర్షణ పెంచుకున్న ఆ స్నేహితుడు ఒక రోజు తన గదిలోకి వచ్చిన తారపై అత్యాచారం చేయబోతాడు. ఇంటి నిండా నౌకర్లతో హడావిడిగా ఉన్న సమయంలోనే ఈ పని జరుగుతుంది. అతన్ని ఎదిరించి తార గట్టిగా అరుస్తుంది. ఆమె అన్న వెళ్ళి తారను తీసుకువస్తాడు. కాని గదిలో ఆ స్నేహితుడు ఏం చేద్దామనుకున్నాడో అందరికీ అర్థం అవుతుంది. ఇలాంటి విషయాలు ప్రచారం చేసే వ్యక్తులు చాలా మందే ఉంటారు. తారపై జరిగిన ఈ అత్యాచార యత్నం గురించి ఊరంతా తెలుసుకుంటుంది. తార స్వేచ్ఛాప్రియత్వాన్ని ఎరిగిన ఊరి స్త్రీలు ఆమెదే తప్పని, అత్యాచారం జరిగే ఉంటుందని మాట్లాడుకుంటారు. ఆ రాత్రి పారిపోతున్న ఆ స్నేహితున్ని ఘనా పట్టుకుని తార తండ్రి వద్దకు తీసుకువస్తాడు. తార తండ్రి అతన్నిఇల్లు వదిలి వెళ్ళిపొమ్మంటాడు.

తార తండ్రి ఆ ఊరికి పెద్ద. ఎక్కడ అన్యాయం జరుగుతున్నా పెద్ద మనిషిలా నిలబడి న్యాయం చేసే వ్యక్తి. అతనిపై కోపం ఉన్న పత్యర్థులు తారపై అత్యాచారం జరిగిందని, నిజాన్ని ఆ కుటుంబం కప్పి పెడుతుందని పుకార్లు పుట్టిస్తారు. దసరా పూజలలో ఇంటికి వచ్చిన స్త్రీలు అక్కడ తార లేక పోవడం చూసి ఆమె తల్లి ముందే తార గర్బవతి అయి ఉండవచ్చని అందుకే దాక్కుని ఉంటుందని మాట్లాడుకుంటూ అడ్డు వచ్చిన తార తల్లిని అవమానిస్తారు. అది భరించలేని తార అక్కడకు నడిచి వచ్చి అలా మాట్లాడిన స్త్రీలకు గట్టిగా బుద్ది చెబుతుంది. కాని తార లోని ధైర్యం భరించలేని ఆ స్త్రీలు తమ భర్తల సాయంతో ఆమె పై తప్పుడు ప్రచారాలను ముమ్మరం చేస్తారు. తార ఒంటరిదవుతుంది. ఆమె పరిస్థితి చూస్తూ ఘనా కూడా బాధపడతాడు. విషం తెచ్చివ్వమని ఘనాను తార అడిగినపుడు ఆమెకు పూలు తీసుకువచ్చి ఆమెను తానెంత గౌరవిస్తున్నాడో ఘనా తెలియజేస్తాడు. తారకు తండ్రి పెళ్ళి చేయాలనుకున్నా ఆమెపై ఉన్న దుష్ప్రచారం కారణంగా సంబంధాలు తప్పిపోతుంటాయి.

ఉత్సవాల మధ్యనే ఊరిలో కొందరు తార తండ్రి వద్ద తార గురించి అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు అక్కడే ఉన్న ఘనా కోపంతో వారిపై విరుచుకు పడతాడు. ఒకతను తల పగిలి మరణిస్తాడు. హత్యానేరంపై అరెస్టు అయిన ఘనాను రక్షించాలని తార తండ్రి ఎంత అనుకున్నా కుదరదు. అతనికి యావజ్జీవ శిక్ష పడుతుంది. ఘనాను అండమాన్ పంపిస్తుంది ప్రభుత్వం.

తారను పెళ్ళి చేసుకోవడాని ఒక పోలీసతను ముందుకు వస్తాడు. తార తండ్రి ఈ సంబంధానికి ఒప్పుకోడు. కారణం అతనో తాగుబోతు, తిరుగుబోతు. కాని తార ఆ పోలీసుని తాను అతన్ని పెళ్ళీ చేసుకుంటే అతను ఘనా విడుదలకు సహాయం చేయాలని షరతు పెడుతుంది. అతను షరతుకి ఒప్పుకుంటాడు. తార తండ్రిని ఒప్పించి ఆ పోలీసుని పెళ్ళి చేసుకుంటుంది.. పెళ్ళి తరువాత ఆ పోలీసు ఘనా సంగతి పట్టించుకోడు. అతని వ్యసనాలు ఎక్కువ అవుతాయి. తార స్నేహితురాలిని లోబర్చుకోవాలని అతను ప్రయత్నిస్తున్నప్పుడు అతన్ని ఆపే ప్రయత్నంలో తార అతన్ని గాయపరుస్తుంది. ఆమె జైలు పాలవుతుంది. తార భర్త స్పృహలోకి వచ్చాక తారపై నేరం మోపడు. ఆమెని పిలిచి తాను ప్రమాదంలో గాయపడ్డాని పోలీసులకు చెప్పమని తానూ అలానే చెప్తానని అంటాడు. తారను కాపాడాలని అతను ప్రయత్నిస్తున్నట్లు మనకు అనిపించినా, అతనే తారతో భార్య చేతిలో దెబ్బలు తిని మరణించిన చేతకాని వాడిలా తాను మిగిలిపోదల్చుకోలేదని, తన అహంకారాన్ని ఆ ఆఖరి క్షణాలలో కూడా ప్రదర్శిస్తాడు. తార తాను అబద్ధం చెప్పనని అతనికి చెపుతుంది. ఆ పోలీసు మరణించాక ఆమెకు కూడా జైలు శిక్ష పడుతుంది.

అయితే జైలులో తనను అండమాన్ పంపమని ఆమె తిండి తినకుండా ఉద్యమిస్తుంది. కారణం అడిగిన అధికారులకు తన కథ చెబుతుంది. ఘనాను కలవడమే తన ధ్యేయం అని ఆమె ప్రాణాలను పణంగా పెడుతున్నప్పుడు ఆమె పట్ల సానుభూతి చూపి అండమాన్‌కు ప్రభుత్వం తరలిస్తుంది. అండమాన్ జైలు వార్డెన్‌గా ఇక్కడ దిలీప్ కుమార్ కనిపిస్తారు.

చాలా భాగం దిలీప్ ఇంగ్లీషులో మాట్లాడతారు ఈ సినిమాలో. ఈ మేనరిజం మరే సినిమాలో కనిపించదు. వార్డెన్ కూడా  తార ఘనాను కలవడం రూల్స్‌కు వ్యతిరీకం అనే చెబుతాడు. కాని చివరకు ఆమె పట్టుదల ఆమె కథ తెలిసి అతనే ఘనాను పిలిపిస్తాడు. అండమాన్‌లో ఒక స్త్రీ పురుషుడు కలిసి జైలు జీవితం అనుభవించాలంటే వారు భార్యాభర్తలయి ఉండాలి. అందుకని ఘనా తారను పెళ్ళి చేసుకోవడం వల్లే వారిద్దరూ కలిసి జీవించడం సాధ్యపడుతుంది అని చెబుతాడు వార్డెన్. తార పెళ్ళి గురించి ఆలోచించదు. తాను వితంతువునని మళ్ళీ వివాహం పాపమని కేవలం ఘనాకి దగ్గరగా జీవించాలని మాత్రమే కోరుతున్నానని చెబుతుంది. అండమాన్ మరో దేశం అని ఇక్కడ ఘనా తార కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చని వార్డెన్ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. తార భయపడుతుంది. పెళ్ళి తప్ప మరో మార్గం లేదని ఆమెను ఒప్పించినా తారను పెళ్ళి చేసుకోవడానికి ఘనా ఒప్పుకోడు. తాను నౌకరునని, ఆమెతో కలిసి జీవించడం పాపమని అది తన వల్ల కాదని చెబుతాడు. సమాజంలోని నమ్మకాల మధ్య పెరిగిన వారు తమ మనసులనే అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటే వారిని చూస్తూ నిస్సహాయుడవుతాడు వార్డెన్. ఇక తానేం చేయలేనని చేతులెత్తేస్తాడు. తార తిరిగి తన దేశం వెళ్ళిపోవాలని చెబుతాడు. తార ఒక రోజు కనిపించకుండా పోతుంది. అందరూ ఆమె గురించి వెతుక్కుంటున్న సమయంలో ఆమె ఘనా ఇంట్లో కనిపిస్తుంది. అండమాన్‌లో యావజ్జీవ ఖైదీలందరికి ఒక స్థలంలో చిన్న గుడిసెలు విడిగా కేటాయిస్తుంది ప్రభుత్వం. అతని గుడిసె వెతుక్కుని వచ్చి స్పృహ తప్పి పడిపోయిన తారను ఘనా స్వీకరించడం సినిమా ముగింపు.

ఆర్థిక, లైంగిక అసమానతల మధ్య సమాజంలో పెరిగిన ఒక నౌకరు, యజమాని కూతురు తమ ప్రేమను కూడా గుర్తించలేని స్థితిలో జీవించడం, తాము కలిసి ఉండాలని, కాని అది సమాజ నియమాలను అతిక్రమించకుండా ఉండాలని కోరుకోవడం, ఒక పేద నౌకరు యజమాని కూతురితో జీవితం పంచుకోకూడదని, ఒక వితంతువు మారు మనువు చేసుకోరాదని, ఇలాంటి నియమాల మధ్య ఒకరి సుఖం కోసం మరొకరు తాపత్రయపడుతూ, అనునిత్యం ఒకరినొకరు తలచుకుంటూ కూడా ఆ బంధాన్ని పెళ్ళితో బలోపేతం చేయడం మాత్రం తప్పు అనే భయంతో జీవిస్తున్న ఆ జంటలో సమాజ నియమాలు మనసులోని భావలు రేపిన సంఘర్షణ ఈ సినిమా అంతా కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆఖరున మెరిసినా దిలీప్ కుమార్ నటన చాలా బావుంటుంది. బెంగాలీ సినిమా “పారి”లో కూడా అంతే కాన్పిడెన్స్‌తో కనిపిస్తారు దిలీప్. అది అందరికీ సాధ్యం కాదు. రెండు భాషలలో కూడా ఈ సినిమాకు జగన్నాథ చటర్జీ దర్శకత్వం వహించారు. సలిల్ చౌదరి సంగీతం అలరిస్తుంది. ఎటువంటి హంగులు లేకుండా తీసిన సినిమా ఇది. బెంగాలీ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే చిత్రీకరణ. తారగా ప్రొణోతీ ఘోష్, ఘనాగా ధర్మేంద్ర నటించారు. దిలీప్ కుమార్ మొదటి బెంగాలీ చిత్రం గా “పారి”, మొదటి సారి అతిథి పాత్రలో నటించిన “అనోఖా మిలన్” మంచి సినిమాలుగా గుర్తుండిపోతాయి.

తాను దిలీప్ కుమార్ తో కలసి మరో సినిమా చేయలేదన్న బాధ ధర్మేంద్రను జీవితాతంతం పట్టి పీడిస్తోందన్నదానికి నిదర్శనంగా దిలీప్ కుమార్ 97వ జన్మదినం రోజున ధర్మేంద్ర ట్వీట్ నిలుస్తుంది.” మిలాప్ చంద్ లమ్హోంకా ఫిర్ జిందగీ భర్ కిసి ఫిల్మ్ మే మౌకా న మిలా”  అని అనోఖా మిలన్ సినిమా బొమ్మను షేర్ చేశాడు ధర్మేంద్ర.

ధర్మేంద్ర సినిమాల్లో నిలదొక్కుకోకముందు దిలీప్ కుమార్ ఇంటి ముందు నుంచునేవాడు. అతదిని చూడాలని తహ తహ లాడేవాడు. చివరికి టైంస్ ఆఫ్ ఇండియాలో పనిచేసే దిలీప్ సోదరి ఫరీదా సహాయంతో దిలీప్ కుమార్ ను కలిశాడు. అప్పటి నుంచె వారిద్దరి నడుమ గాఢమైన మైత్రి ఏర్పడింది. ఎంతగా అంటే, మేమిద్దరు ఏక గర్భజనితులం కాలేదెందుకు? అని ధర్మేంద్ర వాపోయేంతగా. దిలీప్ కుమార్ పేరిస్ నుంచి రండు స్వెట్టర్లు తెచ్చి, ఒకటి సోదరుడు నసీర్ ఖాన్ కు రెండోది ధర్మేంద్రకు ఇచ్చాడు. ధర్మేంద్ర ఇప్పటికీ ఆ స్వేట్టర్ ను భద్రంగా దాచుకున్నాడు. ఏదో ఒక రోజు దిలీప్ కుమార్ గురించి ఒక పుస్తకం రాయాలన్నది ధర్మేంద్ర కోరిక. అందుకే, అనోఖా మిలన్ సినిమా ధర్మేంద్రకే కాదు సినీ ప్రేమికులకు కూడా ఒక అనోఖా సినిమాగా మిగిలిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here