ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 13 – ఆజాద్

0
9

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్, మీనా కుమారితో కలిసి నటించిన రొమాంటిక్ కామెడి – ఆజాద్

[dropcap]ట్రా[/dropcap]జెడీ కింగ్ అని పిలవబడే దిలీప్ కుమార్ ట్రాజెడీ క్వీన్ మీనా కుమారి.. వీరిద్దరు కలిసి నటించిన రొమాంటిక్ కామెడి “ఆజాద్”. ఈ సినిమాలో ఈ ఇద్దరు నటులు చాలా హాయిగా సంతోషంగా ఆడుతూ పాడుతూ కనిపిస్తారు. ఇద్దరిని ఇలా చూడడం బావుంటుంది. “ఆజాద్” సినిమా దిలీప్ కుమార్‌కు రెండో ఫిలింఫేర్ అవార్డు తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు కోయంబత్తూర్ ఫిలిం ముఘల్ అని పిలవబడే శ్రీరాములు నాయుడు నిర్మాతగా దర్శకుడిగా వ్యవహిరించారు. పక్షిరాజా స్టూడియోస్‌ని నిర్మించిన కోయంబత్తూర్‌కు చెందిన పెద్ద వ్యాపారస్థుడు ఈయన. తరువాత ఒక మర్డర్ కేసులో ఇరుక్కుని బైటపడ్డారు. కాని అన్ని దక్షిణ భాషల్లో భారీ సినిమాలు తీసారీయన. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించింది సి. రామచంద్ర. ఇందులో పాటలు కొన్ని సూపర్ హిట్లు. అపలం చపలం, అనే పాట, “కితనా హసీన్  హై మౌసం” అనే డ్యూయెట్ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి.

ఆజాద్ సినిమా తమిళ సినిమా “మళైక్కలన్”కు రీమేక్. తమిళంలో భానుమతి, ఎమ్.జీ.ఆర్‌లు కలిసి నటించిన ఈ సినిమానే దర్శకులు శ్రీరాములు నాయుడి మళ్ళీ హిందీలో నిర్మించి దర్శకత్వం వహించారు. రాష్ట్రపతి వెండి పతకం సాధించిన మొదటి తమిళ సినిమా “మళైక్కలన్”. అంతే కాదు ఐదు భాషల్లోకి రీమేక్ చేయబడిన మొదటి భారతీయ సినిమా కూడా. రామలింగం పిళ్ళై అనే తమిళ రచయిత రాసిన మళ్ళైక్కలన్ కథ తమిళనాడులో చాలా పాపులర్ అయింది. 1950లలో తమిళనాడు హై స్కూల్ పిల్లలకు నాన్ డీటేల్డ్‌గా ఈ కథ పెట్టడం జరిగింది. అంతగా ప్రాచుర్యం పొందిన కథ కాబట్టి 1954లో వచ్చిన ఈ సినిమా తమిళనాడులో పెద్ద హిట్ అవ్వగలిగింది. కాని అదే కథను “ఆజాద్” అనే సినిమాగా హిందీలో 1955లో దిలీప్ మీనా కుమారిలతో తీసి ఆ సంవత్సరం హిందీలో అత్యధిక వసూళ్ళూ తెచ్చిపెట్టిన పెద్ద హిట్‌గా మలచ గలిగారు శ్రీరాములు నాయుడు. తెలుగులో ఇదే కథ “అగ్గిరాముడు” పేరుతో ఎన్.టి.ఆర్.తో పునర్నిర్మించారు. తెలుగు, తమిళం, మళయాళం, కన్నడ, హిందీ భాషలతో పాటు సింహళ భాషలో కూడా ఈ సినిమా తీసి శ్రీలంకలో రిలీజ్ చేసారు. ఒక్క హిందీలో మాత్రమే ఈ కథకు సంగీత దర్శకత్వం సి. రామచంద్ర గారు చేసారు. కాని మిగతా ఐదు భాషలో మాత్రం ఎస్. ఎమ్. సుబ్బయ్య నాయుడు సంగీత దర్శకులుగా పని చేసారు.

“ఆజాద్” సినిమా కూడా అందుకే ఉత్తర దక్షిణ ప్రాంతాల మిశ్రమ సంస్కృతులతో కనిపిస్తుంది. ఈ సినిమాలో అప్పట్లో నాట్య సోదరిలుగా పిలవబడిన సాయీ, సుబ్బులక్ష్మిలు రెండు నృత్యాలతో మైమరిపిస్తారు. దక్షిణ భారత నృత్య రీతుల పట్ల పెద్దగా ఆసక్తి లేని వారు కూడా వారి నృత్యాన్ని చూస్తున్నప్పుడూ కళ్ళు విప్పార్చుకుని చూసి తీరతారు. “అపలం చపలం” అనే పాటలో వీరి నాట్యం కనువిందు చేస్తుంది. వారి ఇద్దరి మధ్య సింక్రనైజేషన్ అత్యద్బుతంగా ఉంటుంది. అలా నృత్యం చేయగల నాట్యకళాకారిణులు ఇప్పుడు కనిపించరు. ఆ పాటను లత మంగేష్కర్, ఉషా మంగేష్కర్లు కలిసి పాడారు. నాయుడు గారు ఈ సినిమా సంగీత బాధ్యతను నౌషాద్‌కి ఇవ్వాలనుకున్నారు. కాని ఒక నెలలో పది పాటలకు ట్యూన్లు కట్టమని ఆయన అడిగిన విధానం నౌషద్‌కు నచ్చక చాలా డబ్బు వస్తుందని తెలిసినా ఈ సినిమా చేయనన్నారు. చివరకు సి. రామచంద్ర గారు ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించడమే కాక, “కితనా హసీ హై మౌసం” అన్న పాటకు లతాతో కలిసి గొంతు కలిపారు కూడా. ఈ పాట వింటే అది తలత్ మహమూద్ పాడారని మనం అనుకునే అవకాశం ఉంది. చాలామంది హింది సినీ ప్రేమికులు కూడా ఇది తలత్ పాటే అనుకుంటారు. నిజానికి ఈ పాట తలత్ మహమూదే పాడాల్సింది. కానీ, తలత్ రికార్డింగ్ సమయానికి రాలేదు. రికార్డింగ్ జరగదేమో అని భయపడుతున్న నిర్మాతకు, తలత్ ఎఫెక్ట్ తోనే పాడతానని అభయమిచ్చి మరీ తలత్ లా పాడేడీపాట సీ రామచంద్ర. అందుకే తెలియనివారు తలత్ పాడేడని అనుకుంటారు . సంగీత దర్శకులు సి. రామచంద్ర ఈ పాట పాడారని తక్కువ మందికి తెలుసు. అల్బేలా సినిమాలో షోలా జో భడ్కే అన్న పాట కూడా వీరే పాడారు. చితాల్కర్ అనే పేరుతో వీరు కొన్ని మరాఠీ సినిమాలలో కూడా పాటలు పాడారు. లత పాడిన “నా బోలే నా బోలే” పాట కూడా “ఆజాద్” పాపులర్ పాటలలోకి వస్తుంది. “ఆజాద్” సినిమాకు పాటలన్నీ రాజేంద్ర కిషన్ రాసారు.

అప్పటి దాకా ట్రాజెడీ పాత్రలకే పరిమితమైన దిలీప్ కుమార్ మానసికంగా కొంత డిప్రెషన్‌కి లోనయ్యి, డబ్లు.డి. నిఖోల్స్ అనే సైకియాట్రిస్ట్‌ని కలిసారట. దిలీప్ కుమార్ చేస్తున్న ట్రాజెడి పాత్రలు అతని మనసుపై ప్రభావం చూపిస్తున్నయని అది మంచిది కాదని, బాణీ మార్చి కొన్ని కామెడీ సినిమాలు దిలీప్ కుమార్‌ను చెయ్యమని ఆయన సూచించారట. ఎస్. ముఖర్జీ, కే. ఆసిఫ్‌ల సలహా కూడా తీసుకుని తన కెరియర్‌కు నష్టం జరగకుండానే, ట్రాజెడి రోల్స్ నుంఛి కొంత కాలం ఉపశమనం తీసుకోవడం తనకు మంచిదని నిశ్చయింఛుకున్నాకే దిలీప్ కుమార్ ఈ పాత్రను ఒప్పుకున్నారు. ఆజాద్ అతనిలోఒక కొత్త ఉత్సాహాన్ని తనపై పూర్తి నమ్మకాన్ని తీసుకొచ్చిందని దిలీప్ కుమార్ తన ఆత్మ కథలో చెప్పుకున్నారు.

ఆజాద్ కథకు వస్తే, శోభ తల్లి తండ్రి చనిపోయిన తరువాత తండ్రి స్నేహితుడు చరణ్‌దాస్ ఇంట పెరుగుతుంది. చరణ్‌దాస్ ఆని భార్య శాంత శోభను గారాబంగా పెంచుతారు. వారి కొడుకు కుమార్ చిన్నప్పుడే తప్పిపోతాడు. ఈ బాధను దిగమింగి శోభలోనే అన్ని ఆనందాలను వెతుక్కుంటూ ఆ దంపతులు జీవిస్తుంటారు. శోభ తండ్రి బ్రతికి ఉన్నప్పుడు తమ బిడ్డ కుమార్‌కు శోభను ఇచ్చి వివాహం చేస్తానని చరణ్‌దాస్ మాట ఇస్తాడు. కాని కుమార్ లేకపోవడం వలన ఆమెకు యుక్త వయసు వచ్చాక, పెళ్ళి సంబంధాలు వెతకడం మొదలెడతాడు. ఆ ఊర్లో ఆజాద్ అనే ఒక బందిపోటు దొపిడీలు చేస్తున్నాడని పోలీసులు అతన్ని పట్టుకోవాలని ప్రయత్నిస్తారు. పాత ఇన్‌స్పెక్టర్ ఆజాద్‌ను బంధించలేక పోవడం వలన ప్రభుత్వం అతన్ని బదిలీ చేసి మరో కొత్త ఇన్‌స్పెక్టర్‌ను నియమిస్తుంది. ఆజాద్‌తో పాటు మరో దొంగ చందర్ కూడా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. వీరిద్దరు మిత్రులా లేదా ప్రత్యర్థులా అన్నది పోలీసులకి కూడా అర్థం కాదు.

సుందర్ అనే ఒక శ్రీమంతుడు శోభను పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. కాని చరణ్‌దాస్‌కు ఈ సంబంధం ఇష్టం లేదు. సుందర్ వ్యసనపరుడు అని అందరికీ తెలుసు. అతని చేతిలో జానకి అనే ఒక అమ్మాయి మోసపోయి సహాయం చేయమని శోభ ఇంటికి వస్తుంది. ఈ లోపు చందర్ మనుషులు శోభను కిడ్నాప్ చేస్తారు. ఆమెను మారు వేషంలో వచ్చి ఆజాద్ అతని మనుషులు కాపాడి తమ స్థావరానికి తీసుకువెళతారు. అక్కడ శోభకు ఆజాద్ దొంగ కాదని పేదలకు సహాయం చేసే మంచివాడని, అతని పేరు మీద చందర్ దొంగతనాలు చేస్తున్నాడని తెలుసుకుంటుంది. ఆజాద్‌ను ఆమె ప్రేమిస్తుంది. ఆజాద్ శోభను తాను పెళ్ళి చేసుకోదలచానని చరణ్‌దాస్‌కు లేఖ రాస్తాడు. చరణ్‌దాస్ ఇది చదివి భయపడతాడు. దొంగ తన అల్లుడు అవడానికి వీలు లేదని, శోభను కాపాడమని పోలీసుల సహాయం తీసుకుంటాడు.

అదే ఊరిలో అబ్దుల్ రహీం ఖాన్ అనే ఒక ధనవంతుడు ఉంటాడు. అందరికీ సహయం చేస్తూ ఉంటాడని అతనంటే ఊరందరికీ గౌరవం. అతను ఆజాద్ స్నేహితుడని పోలీసులు తెలుసుకుని ఆజాద్ నిరపరాధి అయితే అది నిరూపించుకునే అవకాశం ఇస్తామని పోలీసు ఆఫీసర్ రహీం ఖాన్‌కు చెప్పి దానికి అతని సహాయం కోరతారు. అబ్దుల్ రహీం ఖాన్ ఆజాద్ నిర్దోషి అని నిరూపించి చందర్ నిజానికి సుందర్ మనిషి అని, మరో జమిందారుతో కలిసి వీరు ముగ్గురు దోపిడీలు చేస్తున్నారని నిరూపించి వారిని చట్టానికి అప్పగిస్తాడు. చివరకు అబ్దుల్ రషీద్ ఖాన్ మారువేషంలో ఉన్న ఆజాద్ అని అతనే చిన్నప్పుడు తప్పి పోయిన కుమార్ అని తెలిసి శోభ ఆజాద్‌ల వివాహానికి అందరూ సమ్మతించడం సినిమా ముగింపు.

సినిమా కాస్త సాగతీత గానే అనిపిస్తుంది. సినిమాలో సగం సేపు దిలీప్ మారు వేషంలోనే కనిపిస్తారు. అబ్దుల్ రహీం ఖాన్‌లా, అలాగే చందర్ మనుషుల నుండి శోభను రక్షించే ముసలివానిగా కొంత సేపు మొత్తానికి సగం సినిమా పైగా దిలీప్ కుమార్ మారు వేషంలోనే ఉంటారు. సినిమాలో సంభాషణలన్ని హాస్యంగా ఉంటాయి. పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా రాజ్ మెహ్రా, కానిస్టేబుల్‌గా ఓంప్రకాష్‌ల మధ్య చాలా హాస్య సన్నివేశాలు చిత్రించారు. సుందర్‌గా ప్రాణ్‌కి పెద్దగా పాత్ర లేకపోయినా, హిందీ సినిమాలలో విలన్‌గా ఈ సినిమాతో అతని కెరియర్ ఊపందుకుంది. అబ్దుల్ రహీం ఖాన్‌గా నవ్వులు పండింఛగలిగారు దిలీప్ కుమార్. ట్రాజెడి కింగ్ బాణీ మార్చి దిలీప్ కుమార్ ప్రజలను మెప్పించారు. ఈ సినిమా బాగా ఆడడమే కాక దిలీప్ కుమార్‌కు రెండవసారి ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు తీసుకొచ్చింది. ఈ సినిమాలో ఉన్నట్లు మనకు దిలీప్ కుమార్, మీనా కుమారిలు మరే సినిమాలోనూ కనిపించరు. వారి లోని ఆ ఆనందాన్ని ప్రజలు బాగా రిసీవ్ చేసుకున్నారు. అందుకే ఈ సినిమా అప్పట్లో అంత పెద్ద హిట్ అవ్వగలిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here