ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 14 – దీదార్

1
10

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్‌ను ట్రాజెడీ కింగ్‌గా నిలిపిన చిత్రం దీదార్

[dropcap]దే[/dropcap]వికారాణి గురించి భారత దేశపు సినిమా చరిత్ర తెలిసిన వారందరూ వినే ఉంటారు. భారతీయ సినిమా మొదటి మహిళగా ఆమెను సినీప్రపంచం గౌరవిస్తుంది. హిందీ సినీ నిర్మాత హిమాన్షు రాయ్‌ని ఆమె వివాహం చేసుకున్నారు. ఇద్దరు అప్పట్లోనే జర్మనీ వెళ్ళి సినీ నిర్మాణ రంగంలో ట్రైనింగ్ తీసుకుని వచ్చారు. హిందీ ఇంగ్లీషు భాషలలో ఒకేసారి సినిమాలు నిర్మించారు కూడా. 1934లో ఈ దంపతులు బాంబే టాకీస్ అనే నిర్మాణ సంస్థను మొదలు పెట్టారు. బాంబే టాకీస్ పరిచయం చేసిన ఇద్దరు గొప్ప నటులు అశోక్ కుమార్, దిలీప్ కుమార్‌లు. వీరిద్దరు కలిసి నటించిన ఒకే ఒక సినిమా దీదార్. లీలా చిట్నిస్, రాజ్ కపూర్, మధుబాల కూడా బాంబే టాకీస్ తోనే సినీ రంగానికి పరిచయం అయ్యారు. దిలీప్ కుమార్‌ను నెలకు 1250/ రూపాయల జీతంతో సినిమాలలోకి తీసుకున్న వ్యక్తి దేవికా రాణి. అప్పట్లో అది చాలా పెద్ద జీతం. ముందు దిలీప్ కుమార్ అది తన సంవత్సర జీతం అనుకుని సంతోషించారట. అయితే అది నెల జీతం అని తెలిసి మరో ఆలోచన లేకుండా సినీ రంగంలోకి కాలు పెట్టారు. పళ్ళ వ్యాపారం చేసే అతని తండ్రి దిలీప్ నాలుగవ సినిమా జుగ్ను పోస్టరును తన పళ్ళ దుకాణం ముందు చూసి తన కొడుకు సినిమా రంగంలోకి వెళ్ళాడని తెలుసుకున్నారట. తండ్రికి తాను సినిమాలలోకి వచ్చానని తెలియకూడదనే తన అసలు పేరు యూసఫ్ ఖాన్‌ను మార్చమని దిలీప్ కుమార్ దేవికా రాణిని అడిగినప్పుడు ఆవిడే అతన్ని దిలీప్ కుమార్ అనే స్క్రీన్ పేరుతో జ్వార్ భాటా సినిమాతో మొదటి సారి తెర పైకి తీసుకువచ్చారు.

హిమాన్షు రాయ్‌ని పెళ్ళి చేసుకుని దేవికా రాణి నజ్మ్ ఉల్ హసన్ అనే మరో నటుడి ప్రేమలో పడితే అతన్ని తప్పించి అతను చేయవలసిన సినిమాలలో అశోక్ కుమార్‌ను బుక్ చేసారు హిమాన్షు రాయ్. అలా కుమిద్లాల్ గంగూలి, అశోక్ కుమార్‌గా మారి యాభై సంవత్సరాలు సినీ ప్రపంచాన్ని ఏలారు. దేవికా రాణీ అశోక్ కుమార్లది అప్పట్లో హిట్ జోడి. ఇలా దిలీప్ అశోక్ కుమార్ల సినీ జీవితంలో ఎన్నో పోలికలున్నాయి. దిలీప్ కుమార్ అశోక్ కుమార్ కన్నా పది సంవర్సరాలు చిన్నవాడు. విడిగా ఎన్నో సినిమాలలో వీరు నటించినా ఇద్దరికి ఒకే స్క్రీన్ స్పేస్ ఇచ్చిన దర్శకులు నితిన్ బోస్ అదీ “దీదార్” సినిమాతో. భారతీయ సినిమాలో మొదట ప్లే బాక్ సింగింగ్ ప్రక్రియను పరిచయం చేసింది నితిన్ బోస్. చాలా సినిమాలకి దర్శకత్వం వహించినా సినిమోటోగ్రోఫర్‌గా పని చేయడానికే నితిన్ బోస్ ఇష్టపడేవారు. దీదార్ సినిమాకు నితిన్ బోస్ దర్శకత్వం వహించారు.

ఇక ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహించింది నౌషాద్. క్లాసికల్ బాణిని, జానపద బాణిని కలిపి సినీ రంగానికి పరిచయం చేసిన మొదటి వ్యక్తి నౌషాద్. సౌండ్ మిక్సింగ్ ప్రక్రియను, ప్లేబ్లాక్ సంగీతంలో విడిగా గాయకుల గొంతును తరువాత వాద్యసంగీతాన్ని రికార్డు చేసి అవి కలిపి పాటలుగా రూపొందించిన మొదటి సంగీత దర్శకుడు కూడా నౌషాదే. అలాగే ఆ రోజుల్లో స్టూడీయోలలో సౌండ్ ప్రూఫ్ ప్రక్రియ లేకపోతే ఆర్ధరాత్రి పార్కులలో తన టీంతో పాటలను రికార్డు చేసిన వ్యక్తి ఆయన. అకార్డిన్‌ను అలాగే ఎన్నో ప్రాశ్చాత్య బాణీలను, వాధ్యాలను భారతీయ సినీ సంగీతానికి పరిచయం చేసిన వ్యక్తి నౌషాద్. అందుకే భారతదేశంలోని గొప్ప సంగీత దర్శకులలో ప్రధమ స్థానంలో వీరి పేరు ఊంటుంది., ఇక సినిమాలో మొత్తం 12 పాటలుంటాయి. ఐదు పాటలు లతా మంగేష్కర్ గొంతుతో అలరిస్తాయి. అశోక్ కుమార్, దిలీప్ కుమార్, నితిన్ బోస్, నౌషాద్, లతా… ఈ ఐదుగురికి భారత ప్రభుత్వం దాదా సాహెబ్ పురస్కారంతో సత్కరించింది. దాదా సాహెబ్ లభించిన ఐదుగురు హిందీ సినిమా మహామహులు కలిసి పని చేసిన అలనాటి సినిమా “దీదార్”. ఇంతటి నేపథ్యం సంపాదించుకున్న మరో సినిమా దొరకడం కష్టం. ఈ ఇద్దరు హీరోలను తెరకు పరిచయం చేసిన దేవికా రాణీ భారత దేశంలో మొదటి దాదా సాహెబ్ పురస్కారాన్ని పొందిన వ్యక్తి.

దీదార్ సినిమా దిలీప్ కుమార్‌ను ట్రాజేడికి ప్రత్యామ్నాయంగా మార్చింది. ఈ సినిమా కథ ఆధారంగా తరువాత మనోజ్ కుమార్ రాజ్ ఖోస్లాలు కలిసి “దో బదన్” అనే మరో మ్యూజికల్ హిట్‌ను హిందీ సినీ రంగానికి ఇచ్చారు. 1951లో వచ్చిన ఈ సినిమా ఆ రోజుల్లో పెద్ద హిట్. శ్యాము తల్లి కోటీశ్వరుడైన రాయ్ వద్ద పని చేస్తూ ఉంటుంది. రాయ్ కూతురు మాలకి శ్యాముకి మధ్య మంచి స్నేహం, ఒకరిని విడిచి ఒకరు ఉండలేని విధంగా కలిసి తిరుగుతారు. ఆ చిన్న పిల్లల స్నేహం రాయ్ తండ్రికి నచ్చదు. తన కూతురు పని వాడితో స్నేహంగా మెలగడం అతనికి మింగుడు పడదు. మాల గుర్రపు స్వారీని ఇష్టపడుతుంది. ఒక రోజు ఆమె వెనుక కూర్చుని శ్యాము కూడా గుర్రం పై స్వారీ చేస్తూ ఉంటాడు. ఒక చిన్న ప్రమాదం జరిగి మాల క్రింద పడిపోతుంది. ఆమె నుదుటిపై గాయం అవుతుంది. ఇదే అదనుగా తీసుకుని శ్యాము తన బిడ్డను తోసేసాడని ఇక ఇద్దరు కలిసి తిరగడం తాను సహించనని చెప్పి రాయ్ శ్యాము తల్లిని పనిలోనుండి తీసేస్తాడు.

ఆ ఊరు వదిలి వెళ్తుంటే మార్గంలోనే శ్యాము తల్లి మరణిస్తుంది. అనాథ అయిన శ్యాముని ఒక పేద గ్రామస్థుడు చేరదీస్తాడు. అతనికి ఇద్దరు పిల్లలు. చంపా, భల్లా. కాని ఒక తుఫాను రాత్రి ప్రమాదానికి గురి అయి శ్యాము చూపు పోగొట్టుకుంటాడు. అలా ఆ ఇంట్లోనే చంపా భాలాలతో పాటు కలిసి పెరుగుతాడు శ్యాం. చంపా శ్మాముని చిన్నప్పటి నుండే ఇష్టపడుతుంది. కాని శ్యాము మాలాని మర్చిపోలేకపోతాడు. ఆమెను ఒక్కసారి తిరిగి చూడాలని అతని బలమైన కోరిక. శ్యాము గొంతులో శ్రావ్యత, అతని పాటను నలుగురు వద్దకు చేరుస్తుంది. కాని అందులో అంతులేని విషాదం ఉంటుంది. చంపా తండ్రి మరణించాక ఇంటి పరిస్థితి పాడవుతుంది. ముగ్గురు యుక్తవయస్కులవుతారు. అప్పుల వాళ్ళూ ఇంటిని చుట్టు ముట్టినప్పుడు శ్యాము భల్లా సహాయంతో వీధిలో పాటలు పాడి డబ్బు సంపాదించడం మొదలెడతాడు. ఒక రోజు అలా పాడుతున్నప్పుడే పరిచయం అవుతాడు డాక్టర్ కిషోర్.

మాల పెరిగి పెద్దదయిన తరువాత క్రమంగా శ్యాముని మర్చిపోతుంది. ఆమె పెళ్ళి డాక్టర్ కిషోర్‌తో నిర్ణయిస్తారు పెద్దలు. మాల కూడా కిషోర్‌ను ప్రేమిస్తుంది. కిషోర్ కంటి డాక్టరు. శ్యాము గానం పట్ల ప్రేమ పెంచుకున్న అతను శ్యాము పుట్టుకతో అంధుడు కాడని తలుసుకుంటాడు. తాను ఆపరేషన్ చేసి అతనికి చూపు తెప్పించగలనని చెబుతాడు. మాల కూడా శ్యామును పరిచయం చేసుకుంటుంది, అతని పాటను ఇష్టపడుతుంది. చదువు ఇంకా పూర్తి కాని కిషోర్ డిగ్రీ చేతికి వచ్చాక శ్యాముని తన ఇంటికి పిలిపించుకుని కళ్ళు బాగు చేస్త్గాడు. చూపు వచ్చిన తరువాత తాను రాయ్ కూతురు మాలను చిన్నప్పటినుండి ప్రేమిస్తున్నానని ఆమె కోసమే ప్రపంచాన్ని మళ్ళీ చూడాలనుకున్నానని శ్యాము చెప్పినప్పుడు తను ప్రేమిస్తున్న మాలే శ్యాము చిన్నప్పటి మాల అని తెలుసుకుని ఆశ్చర్య పోతాడు కిషోర్.

మనసులో బాధపడుతూనే శ్యాముని మళ్ళీ మాల వధ్ధకు తీసుకువస్తాడు. కాని మాల తన చిన్ననాటి స్నేహితుడిని ఎప్పుడో మర్చిపోయింది. ఇది శ్యాము తెలుసుకుని ఆమెకు గతం గుర్తు చేయాలని చాలా ప్రయత్నిస్తాడు. తమ చిన్నప్పటి పాటను విని ఆమె కలవరపడుతుంది కాని గతం ఆమెకు గుర్తుకు రాదు. రాయ్ శ్యాము తన ఇంట్లో పని మనిషి కొడుకని మాల కోసమే ఇంటికి వచ్చాడని తెలుసుకుని మాల కిషోర్ కాబోయే భార్య అని ఆమె భవిష్యత్తుని అర్ధం లేని మూర్ఖత్వంతో బలి చేస్తే తాను ఊరుకోనని, మాల కూడా గతాన్ని పూర్తిగా మర్చిపోయిందని, చూపు వచ్చినా శ్యాము ఎప్పటికీ కిషోర్‌తో సమం కాడని గుర్తు చేస్తాడు. వాస్తవాన్ని అంగీకరించి శ్యాము తన కళ్లను తానే పొడుచుకుని తిరిగి గుడ్డి వాడవుతాడు. తనను గుడ్డివానిగానే ప్రేమించిన చంపా దగ్గరకి వెళ్ళిపోతాడు. శ్యాము ఎందుకు మళ్ళీ తన చేతులతో తానే కంటి చూపు పోగొట్టుకున్నాడో అర్ధం కాక మాల మౌనంగా ఉండిపోతుంది. డాక్టర్ కిషోర్‌తో ఆమె వివాహం జరుగుతుంది. ఇప్పుడు శ్యాము గురించి చెప్పినా ఎవరికీ లాభం ఉండదని గ్రహించి డాక్టర్ కిషోర్ మౌనంగా ఉండిపోతాడు. కేవలం తాను ప్రేమించిన మాలను ఒక్క సారి చూడడం తప్ప తన చూపుతో శ్యాం మరికేం కోరుకోడు. ఎవరి కోసం అయితే చూపు కావాలనుకున్నాడో ఆమె తనది అవ్వదని తెలుసుకుని చివరిసారి ఆమెను తృప్తిగా చూసి దృష్టి పోగొట్టుకుని మళ్ళీ గుడ్డివాడిగా పాటగాడిగా మిగిలిపోతాడు శ్యాం.

సినిమా మొత్తంలో శ్యాము, డాక్టర్ కిషోర్ల మధ్య మాల గురించి నడిచే సంభాషణ వచ్చే ఒక సీన్ చాలా బావుంటుంది. మాలకు చిన్నప్పటి పాట గుర్తు చేయాలని శ్యాము ప్రయత్నిస్తే.. ఆమె చాలా డిస్టర్బ్ అవుతుంది. డాక్టర్ శ్యాముని అతను ఎన్నుకున్న మార్గం కష్టమైనదని. జీవితం చాలా అందమైనదని దాన్ని నిర్వీర్యం చేసుకోవద్దని చెప్పే ప్రయత్నం చేస్తాడు. దానికి బదులుగా శ్యాము “మీరు మాలని చూసి ఉండరు ఆమె నా జీవితం కన్నా అందమైనది” అని జవాబు ఇస్తాడు. కోపంతో అతన్ని కోట్టడానికి చేయు లేపుతాడు కిషోర్. కాని అతలోని ప్రేమికుడు ఆ పని చేయనివ్వడు. శ్యాముకి డాక్టర్ కు తనపై ఎందుకు కోపం వచ్చిందో అర్థం కాదు. తాను ప్రేమిస్తున్నమాల అందాన్ని వర్ణిస్తున్న మరొక వ్యక్తిని ఏం చేయలేక, అతన్ని మాల ప్రేమికుడిగా అంగీకరించలేక, ప్రేమని గౌరవించే వ్యక్తిగా నలిగిపోతున్న కిషోర్, తన ప్రేమను అమాయకంగా బయటపెట్టి దాని వల్ల డాక్టర్‌కు ఎందుకు కోపం వచ్చిందో తెలీయక అయోమయంగా చూసే శ్యాము ఇద్దరి కళ్ళలో భావాలు గొప్పగా పలుకుతాయి.

శ్యాంగా దిలీప్ కుమార్, మాలగా నర్గీస్, డాక్టర్ కిషోర్‌గా అశోక్ కుమార్లు నటించారు. కాస్త ఎక్కువ మెలోడ్రామా కనిపిస్తుంది ఇందులో, నర్గీస్, అశోక్ కుమార్ల నటన మొనోటోనస్‌గా ఉంటుంది. నిమ్మి కూడా అంతగా ఆకట్టుకోదు. సినిమా అంతా దిలీప్ విషాదంతో నడుస్తుంది. రఫీ పాడిన “హుయె హమ్ జిన్కె లియె బర్బాద్”, “బచపన్ కే దిన్ భులా నా దేనా”, నసీబ్ దర్ పె తెరా”, ‘మేరీ కహాని భూల్నే వాలీ’ పాటలలోని విషాదం ఇప్పటికీ మనసు మెలి పెడితూనే ఉంటుంది. కాస్త నిశితంగా పరిశీలిస్తే హీరోయిన్ నర్గిస్‌కు అన్ని పాటలు శంషాద్ బేగం పాడారు. రెండవ హీరోయిన్ నిమ్మికు లతతో పాడించారు నౌషాద్. అప్పట్లో శంషాద్ బేగం పాపులారిటి అంతలా ఉండేడి. ఇందులో “చమన్ మే రాహ్ కే  వీరానా” శంషాద్ గొంతులో వినాల్సిన గీతం. అశోక్ కుమార్‌కు ఉన్న ఒకే డ్యూయెట్‌ను శంషాద్‌తో కలిసి జి.ఎమ్. దుర్రాని పాడారు. అప్పట్లో ఆయన ఒక పెద్ద రేడియో ఆర్టిస్ట్, నటుడు, గాయకుడు, సంగీత దర్శకుడు కూడా. మహమ్మద్ రఫీ చాలా ఇష్టపడిన గాయకుడు ఆయన. ఇక ఈ సినిమాలో పాటలన్నీ షకీల్ బదాయినీ రాసారు. ‘దీదార్’ సినిమా భారతదేశంలోనే హిట్ సినిమాగా పేరు తెచ్చుకుంది. తరువాత ఈ కథనే 1963 లో “నీన్గాధా నిన్నైవు” అనే పేరుతో తమిళంలో తీసారు. దిలీప్‌ని ట్రాజెడీ కింగ్‌గా పిలవడం మొదలయింది ‘దీదార్” తరువాతే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here