ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 15 – దేవదాస్

2
9

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్‌కు మూడవ ఫిలింఫేర్ అవార్డు తెచ్చిపెట్టిన దేవదాస్

[dropcap]“దే[/dropcap]వదాసు” శరత్ చంద్ర చటర్జీ నవల. ఈ నవల రాసేటప్పుడు కూడా అయన ఇది ఇంత పెద్ద హిట్ అవుతుందని అనుకుని ఉండడు. ఇప్పటి దాకా శరత్ దేవదాసు పదహారు సార్లు సినిమాగా వచ్చింది అని తెలుసుకుంటే ఈ కథకు ఉన్న క్రేజ్ అర్థం అవుతుంది. పద్నాలుగు సార్లు దేవదాసు అనే పేరుతో అదే కథను సినిమాగా మార్చారు. మొదట 1928లో నరేష్ మిత్రా ఈ కథను తెరకెక్కించారు. ఇది మూకీ సినిమా. తరువాత 1935లో ప్రమతేష్ బారువా బెంగాలీ భాషలో దీన్ని సినిమాగా నటించి దర్శకత్వం వహిస్తే, 1936లో ఆయనే కె.ఎల్. సైగల్‌తో హిందీలో ఈ సినిమాను తీసారు. తరువాత 1937లో అసామీ భాషలో, 1953లో తెలుగులో అక్కినేనితో, 1955లో దిలీప్ కుమార్‌తో మళ్ళీ హిందీలో, 1965లో పాకిస్తాన్‌లో ఉర్దూ భాషలో, 1974లో తెలుగులో మళ్ళీ కృష్ణతో, 1979లో సొమిత్ర చట్రర్జీతో బెంగాలీలో, 1982లో బంగ్లాదేశ్‌లో బెంగాలీలో, 1989లో మళయాళంలో, 2002లో ప్రొసొన్జిత్ చటర్జీతో మళ్ళీ బెంగాలీలో, 2002లోనే షారుఖ్ ఖాన్‌తో హిందీ లో, 2013లో బంగ్లాదేశ్‌లో బెంగాలీలో ఇలా పద్నాలుగు సార్లు సినిమాగా జనం మధ్యలోకి వచ్చిన కథ ఇది. అంతటితో ఊరుకోకుండా, 2009లో ఈ కథనే ఆధారంగా తీసుకుని ఆధునిక దేవదాసుగా అనురాగ్ కష్యప్ “దేవ్ డీ” అనే సినిమాను తీసారు. 2018లో దేవదాస్ కథనే ఆధారం చేసుకుని సుధీర్ మిశ్రా “దాస్ దేవ్” అనే మరో హిందీ సినిమాను తీసారు. ఇంకా అనేకానేక్ రూపాలు, రూపాంతరాలలో దేవదాసు మళ్ళీ  మళ్ళీ పుడుతూనేవున్నాడు.  అంటే ఈ కథ మన సంస్కృతిలో ఒక భాగం అయిపోయిందని ఒప్పుకోక తప్పదు.

పైన చెప్పిన లిస్ట్‌లో ఆరు దేవదాసులను నేను చూడడం జరిగింది. కాని నాకు వ్యక్తిగతంగా ఇష్టమైనది తెలుగు దేవదాసు. ఇది తెలుగు భాషీయురాలిగా కాకుండా నిష్పక్షపాతంగానే చెప్తున్నమాట. తరువాత నచ్చింది దిలీప్ కుమార్ దేవదాసు. దిలీప్ కుమార్ ఈ పాత్రను చాలా గొప్పగా చేసారు. పార్వతిగా నటించిన సుచిత్రా సేన్‌కు ఇది మొదటి హిందీ సినిమా. ఇక అప్పట్లో తారలందరూ పార్వతి రోలే చేస్తామని చంద్రముఖి పాత్ర వద్దని రిజెక్ట్ చేస్తే ఈ పాత్రను ఒప్పుకుని ఇష్టపడి చేసింది వైజయంతిమాల. సినిమాకు స్క్రీన్ ప్లే చేసిన నబెందు ఘోష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఇది. ఎవరూ రాక ఆ పాత్రకి వైజయంతి మాలను తీసుకున్నారట. కాని ఈ పాత్రకే ఆమె సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నారు. చాలా అద్భుతంగా నటించారావిడ. కాని తెలుగు దేవదాసులో దేవదాసు కోసం పెట్టిన పాటలు, ఘంటసాల గారి గానం దానికి పోటీ మరేది లేదు. ఒక మాటలో చెప్పాలంటే దేవదాసుగా దిలీప్ కుమార్ ది బెస్ట్ అనిపిస్తే సినిమాగా మాత్రం తెలుగు దేవదాసు బావుంటుంది. హిందీలో ఘంటశాల గొంతులో వేదాంతాన్ని, ఆ అధ్బుతమైన విషాద రాగాలను దిలీప్ కుమార్ కేవలం హావభావాల్తో తన ఎమోషన్స్‌తో చూపించారు. అయితే తెలుగులోకి వచ్చేసరికి అక్కినేనికి ఘంటశాల, సుబ్బురామన్లు ఆ పాత్ర పండడానికి చాలా సహాయం చేసారు. కాని అలాంటి సహకరం బిమల్ రాయ్ తన దర్శకత్వంలో దిలీప్‌కి ఇవ్వదలచుకోలేదు. అందుకే అతనొక్కడే దేవదాసు కారెక్టరును పూర్తిగా నడిపించవలసి వచ్చింది. హిందీ దేవదాసులో ఒక్క పాట తప్ప మరేవి దేవదాసు విషాదాన్ని ఎలివేట్ చేయవు. దిలీప్ కుమార్ ఒక్కరే కేవలం తన నటనతో ఆ పాత్రను ఏ లెవల్‌లో ఎలివేట్ చేసారంటే, ఎంత సానుభూతి సంపాదించారంటే, తరువాత తీసిన దేవదాసు సినిమాలన్నీ కూడా చాలా పేలవంగా అనిపిస్తాయి. అంతేకాదు, శరత్ నవలకు అతి దగ్గరగా వున్న సినిమా అంటే బిమల్ రాయ్ దేవదాసే.

దేవదాసు కథ కేవలం భగ్న ప్రేమికుల కథ కాదు, అప్పట్లోని ఫ్యూడల్ వ్యవస్థలో నలిగిపోయిన మనసుల కథ. శరత్ సృష్టించిన స్త్రీ పాత్రలలో ఒక నైతిక, మానసిక బలం కనిపిస్తుంది. దేవదాసుని కలిసి పార్వతి తన మనసు తెలుపు కుంటుంది. కాని తల్లి తండ్రుల జమిందారీ అహంకారం, కుల వివక్ష తెలిసి దేవదాసు ఆమె ప్రేమను అంగీకరించడు. అతను ఆమెను తిరస్కరిస్తూ ఒక లేఖ రాసి మళ్ళీ తనలో తాను మథనపడి ఆమెను చేరే సరికే ఆమె వివాహం మరొకరితో నిశ్చయం అయిపోతుంది. దేవదాసుకు తల్లి తండ్రుల గౌరవం ఎంత ముఖ్యమో తన తల్లి తండ్రుల గౌరవం తనకు అంతే ముఖ్యం అని ఆమె తన కన్నా వయసులో పెద్దవాడయిన వ్యక్తిని పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతుంది. తాను చేతులారా చేజార్చుకున్న జీవితాన్ని తలచుకుని, ఊరిలోని జమిందారీ వ్యవస్థలో ఉండలేక దేవదాసు పట్నం వెళ్ళిపోతాడు. పార్వతి పల్లకి ఎక్కి మెట్టినిల్లు చేరితే, దేవదాసు వేశ్యావాటికకు చేరతాడు. అక్కడ అతన్ని చూసి ప్రేమించిన చంద్రముఖి దేవదాసు కోసం వృత్తి మానేసి అతనికి సేవలు చేసుకుందామనుకుంటుంది.

ఇక్కడ కూడా దేవదాసు మనసులో ఉన్న నియమాలు సూత్రాలు అతన్ని చంద్రముఖికి చేరువ కానివ్వవు. రెంఢు చోట్ల కూడా స్త్రీ మనసే దేవదాసు కోసం తపిస్తుంది. అతన్నినిస్వార్థంగా ప్రేమిస్తుంది. పార్వతి, చంద్రముఖి ఇద్దరు కూడా దేవదాసు కోసం తమ జీవిత పంథాను మార్చుకుంటారు. నిర్ణయాలు తీసుకుంటారు. కాని వారిలోని ధైర్యం, నిర్ణయించుకునే తత్వం దేవదాసులో కనిపించవు. అతనిలోని ఈ బలహీనతే అతని జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. ఎవరికీ కాక ఎవరూ లేక, ఏ దరి చేరక నాశనమవుతాడు దేవదాసు.

ఈ పాత్రలోని ఆ సెల్ఫ్ డిస్ట్రక్షన్‌ను చూపడానికి దేవదాసు పాత్ర పైనే బిమల్ రాయ్ ఫోకస్ చేసారు. వినాశనాన్ని కోరుకుని వరించిన వ్యక్తి ప్రతి నిముషం ఎలా జీవితానికి దూరం అవుతుంటాడో దిలీప్ కుమార్ దేవదాస్‌గా జీవించి చూపించారు. తన జీవితంలో వచ్చిన ఇద్దరు స్త్రీలను దేవదాసు పోల్చుకుంటూ వారి సామాజిక స్థానాలు వేరైనా స్త్రీ ప్రేమగా మాత్రం వారు ఒకటే అని చెప్పే సీన్‌లో అతని డైలాగ్ మాడ్యులేషన్ చూడాలి. ఒక ఇంట్రోవర్ట్, తనకేం కావాలో చెప్పలేని ఒక వ్యక్తి, అనునిత్యం ప్రేమించిన వారిపై ఆధారపడే వ్యక్తి, తనకు కావలసింది మరొకరి ద్వారా వస్తుందని ఎదురు చూడడం తప్ప, తనకు తానుగా సాధించుకోలేని ఒక పసి మనసు శారీరికంగా యువకుడిగా మారినా అతనిలోని ఆ పసిపిల్లవాని తత్వమే ఇద్దరు స్త్రీలు అతని కోసం అహర్నిశలు తాపత్రయపడేలా చేస్తుంది. కాని సమాజం విధించే బంధాల నడుమ దేవదాసు లాంటి వ్యక్తులు తన మనసుకు ఏం కావాలో వారికే అర్థం కాని సమయంలో ఉండిపోయే సందిగ్ధ స్థితి అనునిత్యం దిలీప్ కుమార్‌లో చూస్తాం. పార్వతి వివాహం చేసుకున్నాక పరాయిది అయిపోతుంది. కాని ఆమె పరాయిది అని ఒప్పుకోలేక పోతాడు దేవదాసు. చంద్రముఖి అతనితో ప్రయాణించడానికి సిద్దపడుతుంది. కాని ఆమె వృత్తి కారణంగా ఆమె తనతో వస్తే ఆమెకి వేరే ఇబ్బందులు ఎదురవుతాయని ఆమెను విడిచి ఒంటరిగా ప్రయాణం చేస్తాడు దేవదాసు. రెండు చోట్ల కూడా అతని నిర్ణయాలను నియంత్రించేది వ్యవస్థే. చివరకు పార్వతి ఇంటి ముందుకు వచ్చి మరణించాక కూడా అతన్ని చూడడానికి పరుగెత్తుకు వస్తున్న పార్వతిని ఆ సామాజిక బంధాలే ఆఖరి చూపు కూడా దక్కకుండా చేస్తాయి. జమిందారిణిగా సాధారణ వ్యక్తుల మధ్యకు రానివ్వని సాంప్రదాయం ఆమెను తలుపు వెనకాల ఉంచుతుంది. దేవదాసు పార్వతిల కలయికను నివారించిన ఈ తలుపులే సినిమాలో ప్రతి చోట సమాజం విధించిన నియమాలుగా చూస్తాం.

జమిందారులుగా తాము పెద్ద బ్రాహ్మణులమని, పార్వతి తల్లి తండ్రులు తక్కువ బ్రాహ్మణులని అందుకని తమ మధ్య సంబంధం కుదరదని జమిందారు గారు శాసిస్తారు. వీటన్నిటికన్నా ఆలోచించవలసింది ఈ నియమాలను ఎదిరించాలనే ఆలోచనే రాని దేవదాసు లాంటి యువకుల గురించి. ఆ రోజుల్లో వారి ఆలోచనా ధోరణిలో తమ కోరికలు తీరడానికి సమాజ ఆమోదం తప్పదనే భావన ఎక్కువగా ఉండేది.

సినిమాలో అన్ని పాటలు జానపద బాణిలలో ఉంటాయి. సాహిర్ లుధియాన్వి రాసిన పాటలకు ఎస్.డి బర్మన్ సంగీతం అందించారు. అన్ని పాటలు కూడ కథలోని విషాదాన్ని మెయింటెయిన్ చేస్తాయి తప్ప తెలుగు సినిమాలోలా దేవదాసు పాత్రను ఎలివేట్ చేసే ప్రయత్నం చేయవు. అక్కినేని పాత్రకు ఘంటశాల గారిచ్చిన సహాయం దిలీప్ కుమార్‌కు ఇందులో లేదు. అందుకే తెలుగు దేవదాసులో కంబైన్డ్ ఎఫర్ట్ కనిపిస్తే , హిందీలో దిలీప్ ఒంటరిగా పోరాడి పాత్రకు న్యాయం చేసారు. వైజయంతి మాల మీద చిత్రించిన “జిసె తూ కబూల్ కర్లే” అన్న పాట మర్చిపోలేం.

తుఝె ఔర్ కీ తమన్నా
ముఝె తేరీ అర్జూ హై
తెరె దిల్ మే గం హీ గం హై
మెరె దిల్ మే తూహీ తూ హై

ఈ నాలుగు పాదాల్లో సాహిర్ మొత్తం దేవదాసు సినిమా సారాన్ని, చంద్రముఖి వేదనను ఇమిడ్చి అత్యద్భుతంగా ఈ పాటను రాశాడు.  ఈ సినిమాలో “ఆన్ మిలొ ఆన్ మిలొ “( తరువాత ఈ బాణీని ఆర్ డీ బర్మన్ 1942 ఎ లవ్ స్టోరీలో కుచ్ నా కహో పాట ప్రిల్యూడ్ సంగీతంగా వాడుకున్నాడు)అన్న పాటను వైష్ణవ భక్తి గీతం పంథాలో రూపొందించి రాధాకృష్ణుల ప్రేమలోని భక్తి భావాన్ని ఆధ్యాత్మికతను దేవదాసు పార్వతి లో ప్రేమకు పరతీకగా చూపటం ఒక అద్భుతమయిన సృజన. అలాగే తలత్ స్వరంలో మిత్వా లాగేనా..అంటూ చెరువుగట్టున ఒంటరిగా కూచుని దేవదాసు పార్వతి కోసం తపిస్తూ పాడేపాట విషాద గీతాలకే తలమానికంలాంటిది. ఈ కవితను తలత్ పాడిన అత్యద్బుతమయిన పాటకు, ప్రత్యక్షంగా గొంతులో ఏడుపు ధ్వనించకుండా విషాదాన్ని అతి సాంద్రంగా ధ్వనింపచేసే అత్యుత్తమ గాన శైలికి ఈ కవితను నిదర్శనంగా చూపుతారు. తలత్ స్వరంలోని ఈ చిక్కనిదనం ఆ కాలంలో పలువురు సంగీత దర్శకులను, రఫీ స్వరాన్ని మెచ్చుకోవటంలో అడ్డుపడింది. మిగతా పాటలు చాలా వరకు బాక్‌గ్రౌండ్‌లో బెంగాల్ జానపద బాణీలలో ఆ సంస్కృతికి అతి దగ్గరగా కనిపిస్తాయి. అక్కినేని దేవదాసు దిలీప్ కుమార్ దేవదాసు కన్నా ముందు వచ్చింది. ఈ రెండు చూస్తే శరత్ ఒరిజినల్ సంభాషణలకు పూర్తి న్యాయం రెండు సినిమాలలో కనిపిస్తుంది. “పాప పుణ్యాలను విచారించే భగవంతుడు నీకే శిక్ష విధిస్తాడో గాని మళ్ళీ జన్మలో నిన్ను కలుసుకోవడం ఉంటే నిన్ను విడిచి పెట్టి ఉండను అమ్మి” ఈ తెలుగు డైలాగ్ హిందీలో ఇలా వస్తుంది. “నా జానె పాప్ ఔర్ పుణ్య కీ బాతె కర్నే వాలె తుమ్హారే బారె మే క్యా ఫైసలా కరెంగే లెకిన్ అగర్ మర్నే కె బాద్ కహీ మేల్ హోతా హైతో మై తుమ్సె కభీ దూర్ నహీ రహ్ పావూంగా”… రెండు సినిమాలను చూస్తే చాలా వరకు సంభాషణలు అనువాదాలుగా కనిపిస్తాయి. కాని ఎవరి స్టైల్ వారిది.

దిలీప్ కుమార్ నటనలో, అక్కినేని గారి నటనలో కూడా మూర్తిభవించిన విషాదం కనిపిస్తుంది. నవలను ఎక్కడా సొంత పైత్యాలు అంటకుండా వేదాంతం రాఘవయ్యలు, బిమల్ రాయ్‌లు సినిమాగా అధ్బుతంగా తీయగలిగారు. కాని ఎంత ఆలోచించినా, తెలుగు దేవదాసుని ఘంటశాల గాత్రం లేకుండా ఊహించలేం. తెలుగు దేవదాసులో పాటలు పాత్రను చాలా ఎలివేట్ చేసాయి. ఆ అవకాశం లేకుండా ఆ పాత్రను అంత గొప్పగా పలికించినందుకు దేవదాసుగా మాత్రం దిలీప్ కుమార్‌ను కొనియాడాలి. “కౌన్ కంబక్త్ బర్ధాష్ కర్నే కే లియె పీతా హై.. మై తో పీతా హూ కి సాంస్ లే సకూ” ఈ డైలాగ్ దిలీప్ గొంతులో విన్నాక మళ్ళీ మర్చిపోలేం.

దిలీప్ కుమార్ ఈ పాత్రను ఓన్ చేసుకుని నటించారు. అందుకే వారికి మూడో ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ నటుడిగా ఈ సినిమాకు లభించింది. వైజయింతిమాల తన పాత్రకు వచ్చిన అవార్డు  స్వీకరించలేదు. తాను సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా అవార్డు స్వీకరించనని, సుచిత్ర సేన్ పాత్రతో సమానంగా తన పాత్ర ఉంటుందని ఆమె వాదించారు. సుచిత్రా సేన్ నటన గురించి కూడా చెప్పుకోవాలి. చాలా బాలెన్స్‌డ్‌గా నటించారామె, దేవదాసు చేతిలో దెబ్బ తిన్నప్పుడు అందులో అతని నిస్సహాయ ప్రేమను చూసే ప్రేమికురాలిగా ఆమె అద్భుతమైన హావభావాలు చూపించారు. అలాగే దేవదాసుని తాగుడు మానమని అర్థించే సన్నివేశం, తన దగ్గరకు వచ్చి ఉండమని అడిగేటప్పుడు ఆమె చాలా పరిపక్వమైన నటనను చూపారు. బెంగాలీలో గొప్ప నటీమణులలో ఒక్కరైన సుచిత్రా సేన్ నటనా స్థాయి గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. ఆవిడ ప్రతిభను గమనించాలంటే, సాదా సీదాగా ఉండే పార్వతి లోని ఆ సింప్లిసిటీనే మార్చి వేసిన ఆధునిక సినిమాలలోని హంగులను చూసి తరువాత సుచిత్ర సేన్‌ను పార్వతిగా గమనించండి. శరత్ కలల పార్వతి ఆమెలో కనిపిస్తుంది. ఫోర్బ్ మాగజిన్ దేవదాసు లోని దిలీప్ కుమార్ నటనను భారతీయ సినిమాలలో గొప్ప పర్ఫార్మెన్సుల శ్రేణిలో చేర్చింది. చాలా మందికి దిలీప్ కుమార్ దేవదాసుగా మాత్రం గుర్తుండి పోతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here