ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 17 – నయా దౌర్

1
9

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్‌కు నాలుగవ ఫిలింఫేర్ అవార్డు, మూడు వరుస ఫిలింఫేర్లతో హాట్రిక్ సాధించి పెట్టిన నయా దౌర్

[dropcap]ది[/dropcap]లీప్ కుమార్‌కి నాలుగవ సారి ఫిలింఫేర్ అవార్డు తీసుకువచ్చిన సినిమా నయాదౌర్. బీ ఆర్ చోప్రా నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమా హింది సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తరువాత వైజయంతి మాల స్టార్ నటిగా ఎదిగిపోయింది. సాహిర్ లుధియాన్వి పాటలు, ఓ.పీ నయ్యర్ సంగీతం, దిలీప్ కుమార్ వైజయంతి మాల జోడి, అజిత్ నటన దీన్ని ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్‌గా నిలిపాయి. ముఘల్ ఏ ఆజమ్‌తో పాటు పూర్తి కలర్ చేయబడిన రెండవ బ్లాక్ అండ్ వైట్ సినిమా నయా దౌర్. ఆధునీకరణ పేరుతో మషీన్లను మనిషి బాగు కోసం కాకుండా కొందరిని ధనవంతులను చేయడానికి ఉపయోగించుకుంటే మానవ శ్రమ నిరుపయోగమయి నిరుద్యోగం పెరిగితే ఎంతటి భయంకరమైన పరిణామాలు ఎదుర్కోవాలో ఇప్పుడు చూస్తున్నాం. గాంధీ గారు కూడా మషీన్లు మనిషికి సహాయపడాలి కాని మనిషికి ప్రత్యామ్నాయాలు కాకూడదు అని ఆ రోజుల్లోనే చెప్పారు. రోబోలతో పని చేయించుకుంటున్న ఈ తరానికి ఇందులో మనిషికి జరుగుతున్న అన్యాయం అర్థం కాకపోవచ్చు కాక హృదయంతో మేదస్సుతో కలిపి ఆలోచించే విజ్ఞత ఉన్న వారందరికీ గాంధీ గారు చెప్పిన మాటలలోని సత్యం అవగతం అవుతుంది. ఆ మాటల ఆధారంగానే తీసిన సినిమా ఇది.

టాంగా నడిపే శంకర్, అడవిలో కట్టెలు కొట్టే కృష్ణ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఇద్దరూ బీదవారే కాని ప్రేమ ఆప్యాయతల నడుమ జీవిస్తున్న అందమైన యువకులు. కష్టపడి పని చేసుకోవడం అరమరికలు లేకుండా జీవించడం ఇవే వారు నేర్చుకున్న విద్యలు. ఆ ఊరిలో రెండు రకాల పనివారు మాత్రమే ఉంటారు. అడవి ప్రాంతం కాబట్టి కట్టెలు కొట్టేవారు లేదా టాంగా నడిపేవారు. మరో పనికి ఆస్కారం లేని చిన్న ఊరు అది. ఆ ఊరిలో కట్టెల మిల్లు నడిపే ఒక ధనికుడు ఉంటాడు. చాలా మంచి వ్యక్తి. పేదల అవసరాలు చూసుకుంటూ అందరికీ పని కల్పించుతూ అందరి బాగు కోసం నిరంతరం తాపత్రయపడే వ్యక్తి అతను. యాత్రల కోసం అతను వెళ్తూ తన పని భాద్యతలు కొడుకు కుందన్‌కు అప్పగిస్తాడు. కుందన్ ఆధునిక భావాలున్న యువకుడు. మనుషులు చేసే పని యంత్రాలతో చాలా త్వరగా పద్దతిగా జరిగిపోతుందని, తాము త్వరగా ఇంకా ధనం సంపాదించవచ్చని ఆలోచిస్తాడు. ఆ పద్దతిలోనే ముసలివారిని, తనకు అవసరం లేని వారిని పని నుండి తొలగించి మిల్లుకు యంత్రాలను రప్పించుకుంటాడు. అప్పటి దాకా ఆనందంగా ఉన్న ఊరి జనం ఉపాధి పోయి వీధిన పడతారు.

చాలా రోజుల క్రితం ఊరు విడిచి వెళ్ళిన ఆ ఊరి ఆడపడుచు తన కూతురు రజని, చిన్న కొడుకుతో మళ్ళీ ఆ ఊరికి వస్తుంది. రజని చాలా అందమైనది. ఆమెను శంకర్, కృష్ణ ఇద్దరూ ప్రేమిస్తారు. కాని రజని మాత్రం శంకర్‌ని ప్రేమిస్తుంది. శంకర్ చెల్లెలుకి పక్క ఊరిలో పెళ్ళి సంబంధం నిశ్చయమవుతుంది. కాని ఆమె కృష్ణను ప్రేమిస్తుంది. డబ్బు అహంకారంతో ఆమెతో సంబంధం కుదుర్చుకున్న వారు మరో సంబంధం చూచుకుంటే అలా మాట మీద నిలబడని వారికి తాను తన చెల్లెలిని ఇవ్వనని ఊరి పెద్దల ముందు చెప్పి శంకర్ కృష్ణను చెల్లెలిని చేసుకొమ్మని అడుగుదామనుకుంటాడు. అప్పుడే అతను కూడా రజనిని ప్రేమిస్తున్నాడని తెలుస్తుంది. ఇద్దరిలో రజనిని ఎవరు చేసుకోవాలి అన్నదాని మీద చర్చ జరుగుతుంది. స్నేహితులు ఇద్దరు కూడా త్యాగానికి సిద్దపడతారు. కాని శంకర్ మాత్రం నిర్ణయం భగవంతునికి వదిలేద్దామని, రాబోయే జాతరలో అమ్మవారికి పూజ కోసం పసుపు పచ్చ పూలు రజని తీసుకెళితే ఆమెని కృష్ణ వివాహం చేసుకోవాలని, మల్లె పూలు తీసుకెళితే ఆమెను శంకర్‌ను వివాహం చేసుకోవాలని నిర్ణయం అవుతుంది. ఈ మాటలు విన్న శంకర్ చెల్లెలు కృష్ణను తాను వివాహం చెసుకోవాలనే కోరికతో అమ్మవారి గుడిలో పూల పళ్ళేలు మారుస్తుంది. అందువలన పసుపు పచ్చ పూలు తీసుకెళ్ళిన రజని అమ్మవారి ముందు మల్లె పూలు జల్లుతుంది. శంకర్‌కు ఇది తెలియదు కాని కృష్ణ మాత్రం ఇది చూసి శంకర్ తనను మోసం చేసాడని అతనిపై కక్ష పెట్టుకుంటాడు.

ఈ లోపు కుందన్ మిల్లుకి యంత్రాలు తెప్పిస్తాడు. మెల్లిగా బస్సు కూడా తెప్పించమని కృష్ణ, కుందన్‌కు సలహా ఇస్తాడు. బస్సు రాకతో టాంగా వాళ్ళ గిరాకి పోతుంది. అందరూ పనులు లేక వీధిన పడతారు. శంకర్ కుందన్‌తో ఈ విషయం మాట్లాడడానికి వెళతాడు. ఊరిని నమ్ముకుని జీవిస్తున్న జనం జీవితాలను కాలరాసే యంత్రాలు తేవడం అన్యాయమని మనిషి శక్తి కన్నా ఆరోగ్యకరమైనది మరేది ఉండదని చెబుతాడు. కుక్క కూడా తన వీధి వదిలి వెళ్ళదని, మనిషిని ఊరు వదిలి జీవనోపాధి కోసం మరో చోటకి వెళ్ళమనడం అన్యాయమని వాదిస్తాడు. ఇక్కడ వీరిద్దరి మధ్య ఒక పందెం ఖరారు అవుతుంది. బస్సుతో పాటు గుడి వద్దకు తాను జట్కా తోలతానని, ఎవరు ముందు వస్తే వారు గెలిచినట్లు అని, బస్సు గెలిస్తే, ఊరిలో టాంగాలు ఉండవని కాని టాంగా గెలిస్తే మాత్రం బస్సు ఊరి నుండి వెళ్ళిపోవాలని దీనికి మూడు నెలల సమయం కావాలని అడుగుతాడు శంకర్.

మెల్లిగా కొండల బాటలో ఒక రోడ్డు వేస్తే ఆరు కిలోమీటర్ల దూరం తగ్గించుకోవచ్చని రోడ్డు వేద్దామని ఊరి వారిని అడుగుతాడు. కాని వారెవ్వరూ ఈ ప్రస్తావనకు అంగీకరించరు.  రజని, చెల్లెలు సహాయంతో రోడ్డు తవ్వడం మొదలు పెట్టిన తరువాత, అతని ప్రయత్నంలో ఊరి శ్రేయస్సు ఉందని అర్థం చేసుకుని, ఒకొక్కరుగా ఊరి వారంతా ఏకం అవుతారు. తమ శక్తి చూపించుకోవాలని అందరూ కష్టపడతారు. ఈ వార్త పేపర్లకు కూడా ఎక్కుతుంది. చివరగా పోటీలో టాంగా గెలవడం, అందరికి పని దొరకడం, సినిమా ముగింపు. కృష్ణ కూడా నిజం తెలుసుకుని శంకర్‌కు సహాయంగా రావడంతో అంతా సుఖం అవుతుంది.

సినిమా కథ చాలా సింపుల్‌గా ఉంటుంది. దిలీప్ కుమార్ గ్రామీణ యువకుడిగా, స్నేహితుడితో ఒకే కంచం ఒకే మంచంలా గడుపుతున్న సీన్లు, కార్మికుడిగా పని చేస్తున్న సీన్లు అత్యంత సహజంగా ఉంటాయి. అసలు ఈయన గ్రామాలలోనే పెరిగి పెద్దవాడయ్యాడేమో అనిపిస్తుంది సినిమా చూస్తున్నంత సేపు. ఇక సినిమా పాటలు మర్చిపోలేనివి. “మాంగ్ కె సాథ్ తుమ్హారా, “ఉడి జబ్ జబ్ జుల్ఫే తేరి” “యే దేశ్ హై వీర్ జవానో కా” జానపద బాణిలో సాగుతాయి. సహజంగా కురుల గురించి వర్ణణ స్త్రీ పక్షంలో జరుగుతుంది. కాని సాహిర్ చమత్కారం ఏంటంటే.. హీరోయిన్ హీరోని చూస్తూ ఉడి జబ్ జబ్ జుల్ఫే తేరి అని అతని అందమైన కురులను వర్ణించి పాడుతుంది. అప్పటి దాకా వస్తున్న ట్రెండ్‌కు పూర్తి విరుద్దమైన బాణీ ఇది. ఈ పాటలో వైజయంతి మాల, దిలీప్ కుమార్లను మర్చిపోలేం. ఇక సినిమాలో సహాయనటుడిగా నటించిన అజిత్ హైదరాబాదీ. నిజామ్ ప్రభుత్వంలో ఇతని తండ్రి పని చేసారు. తెలుగు ఉర్దు, హిందీ సులువుగా మాట్లాడేవారు. తరువాతి సినిమాలలో విలన్ పాత్రలకు విశిష్టత తీసుకొచ్చిన నటుడీయన. ఇక జర్నలిస్ట్ పాత్రలో జానీ వాకర్ అలరిస్తారు.

నయా దౌర్ సినిమా అమీర్ ఖాన్ లగాన్‌కు ఇన్‌స్పిరేషన్ అయ్యింది. నయా దౌర్ సినిమాతో వరుసగా మూడు సంవత్సరాలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకుని హాట్రిక్ సాధించిన మొదటి నటుడుగా పేరు తెచ్చుకున్నారు దిలీప్ కుమార్. 1954లో మొదటి సారి దాగ్ సినిమాతో ఫిలింఫేర్ అందుకున్నాక మళ్ళీ 1956లో ఆజాద్ సినిమాకు, 1957లో దేవదాస్ సినిమాకు, 1958లో నయాదౌర్‌కు వరుసగా మూడు ఫిలింఫేర్లు అందుకునారు దిలీప్.

నయా దౌర్ సినిమా కొన్ని కాంట్రవర్సరీలలో కూడా చుట్టుకుంది. ముందుగా దిలీప్ కుమార్‌తో మధుబాలను తీసుకున్నారు. పది రీళ్ళ షూటింగ్ కూడా అయ్యాక సినిమా కొసం బీహార్‌కు లొకేషన్ మార్చారు బీ. ఆర్. చోప్రా. మదుబాల తండ్రి కూతురుని వేరే రాష్ట్రానికి పంపడానికి ఇష్టపడలేదు. అందుకని హీరోయిన్‌ను మార్చాల్సి వచ్చింది. మధుబాల కిచ్చిన రెమ్యునిరేషన్ కోసం కోర్టుకు వెళ్లారు చోప్రా. కోర్టులో మధుబాలకు విరుద్ధంగా బీ. ఆర్. చోప్రాకు అనుకూలంగా సాక్షం చెప్పారు దిలీప్. దీనితో అప్పటి దాకా వారి మధ్య నడిచిన ప్రేమ సమాధి అయ్యింది. ఈ సినిమాలో మధుబాల బదులుగా నటించిన వైజయంతి మాల దిలీప్‌తో ఆ తరువాత అత్యధిక సినిమాలు చేసింది. దిలీప్ కుమార్ నర్గిస్‌తో ఏడు, వైజయంతి మాలతో ఏడు సినిమాలు చేసారు. అన్ని సినిమాలు మరే హీరోయిన్‌తో ఆయన చేయలేదు. ఇదే సినిమాను తరువాత తమిళ్‌లో పత్తాలియన్ సబతమ్ పేరుతో డబ్ చేసారు. ఈ సినిమా తరువాత సాహిర్ లుధియాన్వి, ఓ.పీ నయ్యర్‌లు మళ్ళీ కలిసి పని చేయలేదు. సంగీత దర్శకులతో పాటు గేయ రచయితల పేరు కూడా పోస్టర్‌లో ఉండాలని వాదించి సాధించుకున్నారు సాహిర్. ఓపీ నయ్యర్ అత్యంత ఆత్మాభిమానం కలవాడు. సాహిర్, ఆత్మగౌరవం ఒకోసారి అహంకారపుటంచులను తాకుతూంటుంది.  దీనికి తోడు,నయదౌర్ పాటలు సూపర్ హిట్ అయినతరువాత అందుకుకారణం ఎవరన్న విషయంలో వారిద్దరి నడుమ బేధాభిప్రాయాలు వచ్చాయి. పాటలు హిట్ అయ్యేందుకు నా బాణీలు కారణమని ఓపీ నయ్యర్ అంటే, బాణీల్లో పదాలెవరివని, ఆ పదాలు లేకుంటే బాణీలు వ్యర్ధమని సాహిర్ అభిప్రాయం. ఇందుకు ఉదాహరణగా ఆనా హై తో ఆ..పాటను చూపుతారు. సాథీ హాథ్ బఢానా పాటను చూపుతారు. సార్వజనీనమయిన భావాలను సందర్భ పరిథిలో ఒదిగించి, పాటను సార్వజనీనం చేసి, సినీ పరిథి దాటించి ప్రతి మనిషి స్పందించే రీతిలో రచించిన సాహిర్ పదాలులేకపోతే ఈ పాటలకంత విలువవుండేది కాదు, ముఖ్యంగా, సాథి హాథ్ బఢనా పాట చైనా మార్చింగ్ పాట బాణీని పోలివుంటుంది. ఇదే లయతో దో భీగా జమీన్ చిత్రంలో సలిల్ చౌధరి, మౌసం బీతా జాయ్ పాటను సృజించాడు. ఆ పాట కూడా ఉత్తమ స్థాయిలో వున్నా, సాథి హాథ్ బఢానాలా సూపెర్ హిట్ అయి, ఓ జాతీయగీతం స్థాయికి ఎదగక పోవటం గమనిస్తే, అహంకారంలా అనిపించే సాహిర్ ఆత్మవిశ్వాసం అసలురూపు తెలుస్తుంది. అనేక పాటలేకాదు, సినిమాలను సైతం తమ పాటలతో హిట్‌లు గా నిలిపిన ఏకైక గేయరచయిత సాహిర్!

కాని బీ. ఆర్. చోప్రాకు మాత్రం అంతరంగిక గేయ రచయితగా సాహిర్ మారారు. బీ ఆర్ చోప్రా నయాదౌర్ నుంచీ తాను నిర్మించిన ప్రతి సినిమాకూ గేయ రచయితగా సాహిర్ నే ఎంచుకున్నాడు. బీ ఆర్ చోప్రా సోదరుడు యష్ చోప్రా సినిమాలు నిర్మించేందుకు ప్రేరణ సాహిర్. అందుకని చోప్రా  సోదరులు సాహిర్ బ్రతికివున్నంత కాలం మరే గేయ రచయితతో పనిచేయలేదు. తమ సినిమా నిర్మాణంలో స్క్రిప్ట్ స్థాయినుంచి ప్రతి విషయంలో సాహిర్ సలహానే తీసుకునేవారు. ఆయన ఎలా చెప్తే అలా చేసేవారు.

అలాగే నయా దౌర్ షూట్‌లో ఉన్న కారణంగానే ప్యాసా సినిమాకు దిలీప్ కుమార్ ముందు హీరోగా చేస్తానని అని కూడా షూటింగ్‌కు సమయానికి రాలేకపోయారట. అన్నీ పద్ధతిగా జరగాలి అని పట్టుబట్టే గురుదత్ అదే రోజు తానే ఆ సినిమాను చేస్తానని నిర్ణయించుకుని సినిమాను పూర్తి చేసారు. ప్యాసాలో దిలీప్ కుమార్ పని చేస్తే ఎలా ఉండేదో కాని గురుదత్ లేని ప్యాసాని ఇప్పుడు ఊహించుకోలేం. ప్యాసా, నయాదౌర్ రెండు సినిమాలకు పాటలు సాహిర్ రాసారు. రెంటి మధ్య ఎంత వైరుధ్యం ఉందో గమనించవచ్చు, రెండు సినిమాలకు ఒకేసారి రాస్తూ అంత భిన్నమైన రెండు పాత్రల ఆత్మను తన కలంతో పలికించగలగడం సాహిర్ గొప్పతనం. ఈ రెండు సినిమాలు ఒకే సంవత్సరం విడుదల అయ్యాయి. ప్యాసా 19 ఫిభ్రవరి 1957 లో రిలీజ్ అయితే.. నయా దౌర్ సినిమా 15 అగస్టు 1957న రిలీజ్ అయ్యింది. వీటితో పాటు శాంతారాం దో ఆంఖే బారహ్ హాథ్, మెహబూబ్ ఖాన్ మదర్ ఇండియా కూడా అదే సంవత్సరం రిలీజ్ అయ్యాయి. నాలుగు ఆణిముత్యాల లాంటి సినిమాలు అవి. ఆ రోజులలో హిందీ సినిమాల స్థాయి ఎలా ఉండేదో తెలుసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.

ఇన్ని గొప్ప సినిమాల మధ్య నయా దౌర్ ఆ సంవత్సరం అత్యధిక వసూళ్ళు సాధించిన రెండవ సినిమాగా నిలిచిపోయింది. ఎంతటి స్వర్ణ యుగం అది. ప్రేక్షకులు ఒక పక్క మదర్ ఇండియా, మరో పక్క నయా దౌర్, మరో ధియేటర్‌లో ప్యాసా, దో ఆంఖే బారహ్ హాత్, పేయింగ్ గెస్ట్, తుమ సా నహీ దెఖా లాంటి సినిమాలన్నీ ఒకే క్రమంలో చూసారట. ఎంత అదృష్టమో. ఆ రోజులు, అలాంటి సినిమాలు అంతటి అద్భుతమైన పోటీ సినిమా ప్రపంచంలో మళ్ళీ చూడగలమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here