ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు (shikast) -2

1
11

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

విభిన్నమైన ప్రేమ కథా చిత్రం – షికస్త్

[dropcap]స్త్రీ[/dropcap]ని సున్నితమైన మనస్కురాలిగా, చూడడం మన సమాజంలో అలవాటు. కొంచెం కఠినమైన మనస్తత్వాన్ని స్త్రీ ప్రదర్శిస్తే ఆమెలో స్త్రీత్వం లేదని అనుకోవడం పరిపాటి. పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న ప్రపంచంలో ఉన్నతమైన పదవులలో కఠినమైన మనస్తత్వాన్ని ప్రదర్శించిన స్త్రీలు మనకు తెలుసు. వారిని అసాధారణమైన మహిళలుగా చూస్తాం తప్ప సాధారణ స్త్రీలుగా ఎన్నటీకీ పరిగణించం. కాని ఒక స్త్రీ కఠినత్వం వెనుక ఆమె మనసులోకి ప్రయాణించి చూడగలిగితే ఎన్నో ఆర్ద్రత నిండిన కోణాలు కనిపిస్తాయి. వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఒక సాధారణ స్త్రీ, జీవితంలో తాను కోరుకున్నది దొరకనప్పుడు జీవితాంతం మోడులా జీవచ్ఛవంలా బ్రతకవలసి వచ్చినప్పుడు కొంత కఠినత్వాన్ని తన వ్యక్తిత్వంలో భాగం చేసుకుంటుంది. ఆమెను ఆ స్థితికి నెట్టిన పరిస్థితులను మర్చిపోయి ఆమె కఠినమైన మనస్తత్వాన్ని క్రూరత్వంగా చూపి, ఆమె స్త్రీ సహజమైన లక్షణాలు లేని మహిళ అని చెప్పుకోవడం లోకానికి అలవాటు. కాని ఆమెను కఠినంగా మార్చడంలో లోకం వహించే పాత్ర ప్రస్తావన మాత్రం ఎక్కడా తీసుకురాం. అలాంటి షేడ్స్ ఉన్న స్త్రీ పాత్రలు భారతీయ సినిమాలో చాలా తక్కువే అని చెప్పాలి. తమకు అన్యాయం జరిగిందని ప్రతీకారం కోరుతూ ప్రత్యర్థులపై దాడి చేసే స్త్రీ పాత్రల గురించి కాదు ఇక్కడ ప్రస్తావిస్తుంది. జీవితం అనే యుద్ధంలో తనకే తెలియకుండా కఠినంగా మారిపోయి ప్రేమ కోసం వెంపర్లాడే స్త్రీలు మనకు జీవితంలో కనిపిస్తారు. అటువంటి లక్షణాలున్న పాత్రలను భారతీయ సినిమాలలో ప్రధాన పాత్రలుగా చూడలేం. కాని 1953లో షికస్త్ అనే సినిమా లో సుష్మ అనే బలమైన స్త్రీ పాత్రను ఆ రోజులలోనే హీరోయిన్‌గా మలిచారు దర్శకులు రమేష్ సైగల్. మన దేశ సినిమాల్లో అద్భుతమైన స్త్రీ పాత్రలలో ఇది ఒకటి అని నిస్సంకోచంగా చెప్పవచ్చు.

షికస్త్ సినిమాలో నళినీ జయవంత్, దిలీప్ కుమార్లు ప్రధాన తారాగణం. సినిమా రామ్ సింగ్ తన ఊరికి రావడంతో మొదలవుతుంది. అదో చిన్న పల్లెటూరు. ఒక డబ్బున్న కుటుంబంలో రెండవ సంతానం రామ్ సింగ్. అయితే ఆ ఊరికి సంబంధించి విషాదమైన జ్ఞాపకాలు అతన్ని వేధిస్తుంటాయి. సుష్మ అనే అమ్మాయిని అతను ప్రేమిస్తాడు. సుష్మ అన్న జమీందారు. ఈ రెండు కుటుంబాల మధ్య తరాల నుంచి వైరం నడుస్తుంది. అందుకని వీరి వివాహానికి పెద్దలు అంగీకరించరు. సుష్మ వివాహం వేరొకరితో జరిగిపోతుంది. ఒక కొడుకు పుట్టిన తరువాత ఆమె భర్త చనిపోతాడు. వితంతువుగా అన్న పంచన జీవిస్తుంటుంది సుష్మ. జమీందారిపై ఆమెకు కూడా వారసత్వపరంగా హక్కు ఉంది కాబట్టి తన పొలాలను, పంటను కూలీలను చూసుకుంటూ జీవిస్తుంటుంది. రామ్ సింగ్ పట్నం వెళ్ళి డాక్టరుగా స్థిరపడి ఎనిమిది సంవత్సరాల తరువాత ఊరికి వస్తాడు. అతను సుష్మను మరిచిపోలేడు. సుష్మ, ప్రేమించిన రామ్ సింగ్‌కు దూరమయి, పెళ్ళి చేసుకున్న భర్త అకాల మరణంతో జీవితంలో అన్ని ఆనందాలకు దూరం అయి తెల్ల చీరతో, జీవితం పట్ల విరక్తితో జీవిస్తుంటుంది. ఆమెలోని కోపం, బాధ, అసహాయత ఆమెను కఠినమైన స్త్రీగా మార్చేస్తాయి. తన క్రింద పని చేసే వారిపై క్రూరంగా అధికారం చెలాయిస్తూ ఉంటుంది. జాలి దయ అన్నవి ఆమెలో లేనట్లుగా ఆమె ప్రవర్తిస్తుంటుంది. ఊరంతా ఆమెకు భయపడతారు.

రామ్ సింగ్ తన పొలాలను అమ్మి శాశ్వతంగా పట్నం వెళ్ళిపోవాలనుకుంటాడు. ఊరిలో సుష్మ, ఆమె అన్నల క్రూరత్వం గమనిస్తాడు. పేద రైతులని పీడించి బ్రతుకుతున్న సుష్మను చూస్తే అతనికి ఆశ్చర్యం. ఆమెను అలా ఎప్పుడు చూడలేదు అతను. రామ్ సింగ్ పొలాలను సుష్మ అన్న తక్కువ డబ్బుకు సొంతం చేసుకుందాం అనుకుంటాడు. సుష్మ అప్పు కట్టలేదని తన క్రింద పని చేసే పేద రైతును కొట్టించి అతని కూతురుని ఇంట్లో పనిమనిషిగా పెట్టుకుంటుంది. ఈ అన్యాయాన్ని ప్రశ్నించడానికి రామ్ సుష్మ ఇంటికి వస్తాడు. ప్రేమించిన రామ్‌ని చూసి ఆమెకు గతం గుర్తుకువస్తుంది. వితంతువుగా అతనితో కనీసం మాట్లాడే అవకాశం ఆమెకు ఉండదు. రామ్‌ను చూసిన ప్రతి సారి ఆమెకు జీవితం పట్ల ప్రేమ కలుగుతుంది. అతనితో మాట్లాడాలి అంటే జమీందారి, లేదా రైతుల విషయాలు తప్ప మరొకటి మాట్లాడరాదు. రామ్ ఆ ఊరిలో ఉంటే అతని సమక్షంలో ఉన్నానన్న తృప్తినన్నా ఆస్వాదించాలని ఆమె కోరిక. కాని రామ్ శాశ్వతంగా ఊరితో సంబంధాలు తెంచుకుందామని వస్తాడు. అతన్ని ఊరు దాటకుండా ఆపాలంటే రైతుల సమస్యలు అతని దగ్గరకు వెళ్ళడం ఒక్కటే అవకాశం. అందుకోసం రైతుల పట్ల ఇంకా నిర్ధాక్షణ్యంగా ప్రవర్తిస్తుంది సుష్మ. పొలం అమ్మాలనుకున్న రామ్ పత్రాలపై సంతకం పెడుతున్నప్పుడు పనిపిల్లని విపరీతంగా కొడుతుంది సుష్మ. తాను పొలం అమ్మేస్తే తన క్రింది రైతులపై సుష్మ ఆమె అన్నల పెత్తనం ఎంత భయంకరంగా ఉండబోతుందో రామ్‌కు ప్రత్యక్షంగా చూపిస్తుంది. కలాన్ని విసిరి కొట్టి తాను పొలాన్ని అమ్మనని రామ్ సింగ్ చెబుతాడు. అతను విసిరిన కలం సుష్మ నుదిటి పై గాయాన్ని చేస్తుంది. అతని నుంచి తానేం కోరుకుంటుందో ఆ గాయం తనకు చెప్పినట్లు అనిపిస్తుంది సుష్మకు. అది గాయమే అయినా అందులోనించి స్రవించే నెత్తురే అతను దిద్దిన కుంకుమ అనుకుని అతన్ని తన మనసులో నిలుపుకుంటుంది సుష్మ.

తాను కలిసినప్పుడు ప్రేమగా అర్తితో తనను చూసే సుష్మ పనివారివద్దకు వచ్చే సరికి ఎందుకంత నిర్ధాక్ష్యణ్యంగా ప్రవర్తిస్తుందో రామ్‌కు అర్థం కాదు. రామ్ డాక్టర్‌గా ఆ ఊరిలో స్కూల్, హాస్పిటల్ నడుపుతుంటాడు. సుష్మ కొడుకుని కూడా స్కూల్‌లో చేర్చుకుంటాడు. సుష్మ అన్న ఆ బిడ్డను స్కూల్‌లో చేర్చనన్నప్పుడు అన్న ముందే బిడ్డని విపరీతంగా కొట్టి అన్న చివరకు స్కూల్‌కి వెళ్ళడానికి అనుమతి ఇవ్వడం తప్పని పరిస్థితి కల్పిస్తుంది సుష్మ. మనసులో రామ్‌పై ప్రేమ, ఎవరూ లేని తన జీవితంలో రామ్ దూరంగా అయినా కాని తమ మధ్య ఉంటే చాలనుకునే కోరిక, అతని గురించి తెలుసుకోవాలనే ఆరాటం, తన ప్రేమను వ్యక్తపరచలేని అసహాయ స్థితి, కనీసం మాట్లాడుకుందామన్నా, పర పురుషున్ని వితంతువు చూడరాదన్న నియమం వీటన్నిటి మధ్య సుష్మ నలిగిపోతుంటుంది.

సుష్మపై ఉన్న ప్రేమతో రామ్ ఆమె కొడుక్కి దగ్గరయ్యి ఆనందిస్తుంటాడు. రామ్ సుష్మను మర్చిపోలేడు. ఆమె లోని ప్రస్తుత క్రౌర్యాన్ని  అర్థం చేసుకోలేడు. తాను ప్రేమించిన సుష్మ ఇలా ఎందుకు మారిందో అర్థం కాదు. సుష్మకు మాత్రం తన వంతుగా ఏదో చేయాలని అతని కోరిక. క్రూరంగా ప్రవర్తించి ఇంట్లో పనిపిల్ల చావుకు పరోక్షంగా కారణం అవుతుంది సుష్మ. ఊరంతా ప్లేగు వ్యాపిస్తుంది. మూఢ నమ్మకాలతో ఆమె కొడుకుకి కూడా వైద్యం చేయనివ్వడు ఆమె అన్న. రామ్ చొరవగా ఇంట్లోకి జొరబడి పిల్లవాన్ని హాస్పిటల్‌కు తీసుకువచ్చి అతన్ని బ్రతికిస్తాడు. తాను ప్రేమించిన సుష్మ భర్త పోయి మోడులా మారిపోయిందని, కొడుకు మీదే ప్రాణాలు నిలుపుకుని జీవిస్తుందని అతనికి తెలుసు. ఆమెకు ఆ కొడుకు కూడా లేకుండాపోతే ఆమె జీవించదని అతనికి తెలుసు. అందుకే అందర్నీ ఎదిరించి ఆ బిడ్డను కాపాడతాడు.

అసహాయిరాలయిన తనకు రామ్ అందించిన అండ సుష్మలో మళ్ళీ జీవితం పట్ల ఆశను రగిలిస్తుంది. ఆమెలోని దయ, జాలి, ప్రేమ మనసులోనుండి చొచ్చుకువస్తాయి. కాని ఈ లోపు మళ్ళీ రామ్ ఊరు విడిచి వెళ్ళాలనుకుంటాడు. సుష్మ మళ్ళీ తన క్రూరత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఆమెలో ఈ నిరంతరం వచ్చి పోయే మార్పులను అర్థం చేసుకోలేక తల్లడిల్లిపోతాడు రామ్. ఆమెను ఒంటరిగా కలిసి మాట్లాడాలనుకుంటాడు. అతని కాళ్ళపై పడి తన ప్రేమను ప్రదర్శించి సుష్మ అంతే హడావిడిగా వెళ్ళిపోతుంది. అయోమయంలో పడ్డ రామ్ తమ ఇద్దరిని ఊరివాళ్ళు గమనించారని తెలుసుకోడు. సుష్మను దెబ్బతీయాలని ఆమె అన్న ఈ విషయం తెలిసి ఇద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందనే నిందను ప్రచారం చేస్తాడు. ఈ విషయం పై జరిగిన గొడవలో ఒక వ్యక్తిని రామ్ కొడతాడు. ఊరి పంచాయితీలో అతను దోషి అని తప్పని పరిస్థితులలో సుష్మ చెబుతుంది. రామ్ వదిన అందరికీ నిజం తెలిపి శిక్ష పడకుండా మరిదిని కాపాడుకుంటుంది. తన వితంతువు స్థితికి, రామ్‌పై ప్రేమ మధ్య నలిగిపోయిన సుష్మ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది. కాని అన్న ఆనకట్టను కూల్చేసి ఊరంతా ముంచేయాలని చూస్తుంటే ప్రాణాలు పణంగా పెట్టి ఊరిని కాపాడుతుంది. చివరకి తన కొడుకును రామ్‌కు అప్పజెప్పి అతని చేతుల్లో మరణిస్తుంది.

సుష్మగా నళినీ జయవంత్ నటన చాలా బావుంటుంది. రామ్‌గా దిలీప్ ఎంత బాలెన్డ్స్‌గా నటించారంటే ఆ పాత్రను మరొకరు అలా చేయలేరు. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర సుష్మ, రామ్‌కు పెద్దగా నటనకు ఆస్కారం లేదు కాని అవకాశం లేకపోయినా దిలీప్ కుమార్ తన ఉనికితో ఈ సినిమాకు జీవం పోసారు. ప్రేమికురాలిని మర్చిపోలేని ప్రేమికుడు, అన్యాయాన్ని ఎదిరించాలనుకునే మనిషి, అన్యాయం చేస్తుంది తన ప్రేయసి అయితే ఆమెను ఎలా మార్చాలో తెలియని అయోమయం ఈ షేడ్స్ అన్నీ ఒకే షాట్‌లో చూపిస్తారు దిలీప్. నీకేం కావాలి అని సుష్మను ప్రతిసారి అతను అడుతుతున్నప్పుడు ఆమెపై ప్రేమ, ఆమె లోని క్రూరత్వంపై కోపం, ఎలా ఈమెను పాత సుష్మగా మార్చాలి అన్న బాధ, ఇన్ని భావాలు అతని నోటి మాటతో వ్యక్తమవుతాయి. ఒక వితంతువుగా ఆమెను చూసి బాధపడాలో, నిర్దయురాలిగా ఆమెని చూసి కోప్పడాలో తెలీయని స్థితిలో అతని కళ్ళు సుష్మలో తన పాత ప్రేయసిని చూడాలని వెతుక్కోవడం వారిద్దరు కలిసిన ప్రతి సారి దిలీప్ ముఖంలో చూస్తాం. అసహాయ స్థితిలో కూడా హుందాగా, కనిపించడం దిలీప్ స్టైల్. ప్రేమికురాలి సాంగత్యాన్ని ఆస్వాదిస్తూనే ఆమెను మందలించే సీను, అలాగే మొదటి సారి సుష్మ కొడుకుని చూసి ఆ అబ్బాయి ఎవరో తెలుసుకుని అతన్ని దగ్గరికి తీసుకుంటున్నప్పుడు దిలీప్ ప్రదర్శించే ఎమోషన్స్, ప్రతి చిన్న ఫ్రేంలో కూడా ఆయన మొహం పలికించే భావాలు సుష్మ పాత్రలోని నెగిటివిటీ పట్ల జాలి కలిగిస్తాయి. రామ్‌లో మంచితనం చూసిన ప్రతిసారీ, తాను పోగొట్టుకున్నదెంత విలువైనదో అర్థం అయి ఆ బాధను కోపంగా మార్చి చూపే సుష్మ, ఇద్దరిలోనూ ఒకరిపై మరొకరికి ప్రేమ, కాని ఇప్పుడు ఇద్దరి మధ్య వారికే అర్థం కాని స్థితి, ప్రేమికులుగా ఒకరినొకరు గుర్తిస్తూ కూడా శత్రువులుగా ప్రవర్తించవలసి రావడం, శత్రుత్వాన్నే ఎరగా వేసి రామ్‌ని ఊరిలో ఉండిపోయేలా పరిస్థితులు కల్పించి అతను తనను ద్వేషించినా తన కంటి ముందు ఉంటే చాలని సుష్మ పడే ఆరాటం, ఆమెను ఎలా అర్థం చేసుకోవాలో తెలియక నలిగిపోయే రామ్. ఈ రెండు పాత్రలలో అ ఇద్దరు నటులు జీవించారు. ఎన్నో ప్రేమ కథలు చూసి ఉంటాం కాని ఇలాంటి కథ మరొకటి రాలేదు మన భారతీయ సినిమాలో. ప్రేమ, క్రూరత్వం కలిసిపోయిన పాత్రలో నళినీ జయవంత్, ఆమెను అన్ని స్థితులలో ప్రేమిస్తూ, ఆమె మంచి కోరుతూ ఆమెలోని ఆ క్రూరత్వంతో తలపడే దిలీప్ నటన ఇప్పుటికి కూడా నటులు అవ్వాలనుకునే వారందరూ స్టడీ చేయవలసిన పాత్రలు. ముఖ్యంగా నళినీ జయవంత్ పాత్ర నటనను అధ్యయనం చేయాల్సివుంటుంది. తాను వూరు వదలివెళ్ళనని రాం అన్నప్పుడు, ఆమె వదనంలో ప్రతిఫలించే భావాలు, అత్యంత్ర క్రౌర్యం ముసుగు వెనుక దాగిన మృదువయిన మనస్సును చూపిస్తాయి. అత్యద్భుతమయిన నటన ఇది. అందుకే దిలీప్ కుమార్ నళినీ జయవంత్ ను అత్యున్నతమయిన నటిగా భావిస్తాడు. ఆయన నటించీ సినిమాల్లో షికస్త్ ను అత్యుత్తమమయిన సినిమాగా మాత్రమే కాదు, తాను నటించిన సినిమాల్లో తనకు నచ్చిన సినిమాగా పేర్కొన్నాడు.

తలత్, రఫీ, హేమంత్ కుమార్ ముగ్గురూ దిలీప్‌కి పాడిన సినిమా ఇది. సినిమాకు సంగీతం శంకర్ జైకిషన్లు అందించారు. ఈ సినిమా కథకు శరత్ రచన పల్లీ సమాజ్ గా భావిస్తారు. కానీ, వాజాహత్ మిర్జా ఇది తన కథే అంటాడు.  వాజహాత్ మిర్జా ఈ సినిమాకు సంభాషణలు రాసారు. ముఘల్ – ఎ – ఆజమ్, గంగా- జమున సినిమాలకు సంభాషణలు రాసింది కూడా ఆయనే. మదర్ ఇండియా సినిమాకు ఈయన రాసిన సంభాషణలకు ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు కూడా. భారతదేశం నుండి ఆస్కార్‌కు నామినేట్ అయిన మొదటి భారతీయుడు కూడా ఆయనే. సినిమాలో పది పాటలుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే అన్ని రంగాలలోనూ ముందుకు సాగుతున్న ఈ తరంలో వస్తున్న సినీ పాత్రలకన్నా గొప్పవి, వ్యక్తిత్వం ఉన్నవి, ఆలోచనలను రేకెత్తించే పాత్రలు ఆ పాత సినిమాలలోనే కనిపిస్తాయి. ఇప్పుడు సుష్మ లాంటి పాత్రను ఊహించలేం. నరసింహ సినిమాలో రమ్యకృష్ణలా పూర్తి పొజెసివ్ షేడ్స్ ఉన్న పాత్ర లేదా ఖూన్ భరీ మాంగ్‌లో రేఖ లాగా మోసపోయి ప్రతికారం తీర్చుకునే పాత్ర… ఇలాంటివి చూస్తాం తప్ప ఒకేసారి ప్రేమ క్రౌర్యం, చూపిస్తూ ప్రేమను ఆస్వాదించాలని తన అసహాయతను ప్రేమికుని సమక్షంలో మర్చిపోవాలని తపించిపోయే కాంప్లికేటెడ్ కారెక్టర్ మనకు ఎక్కడా కనపడదు.  సుష్మ ప్రేమ అత్యంత స్వార్ధ ప్రేమ.  ఆమెకు  ఎవరెటుపోయినా ఫరవాలేదు. రాం ఊళ్ళో వుంటే చాలు. అందుకోసం ఆమె ఏమయినా చేస్తుంది. కానీ, రాం ఊళ్ళో ఎదురుగా వున్నా వారి ప్రేమ ఫలవంతం కాదు. అయినా రాం ఆమెకు జీవితంపై ఆశను కల్పిస్తాడు. ఇది చాలు ఆమెకు.

ఇక దిలీప్ ఎంత హుందాగా ఉంటాడంటే అతన్ని చూస్తున్న ప్రతిసారి ఆడియన్స్‌కి కూడా అతని కోసం సుష్మ ప్రదర్శించే క్రౌర్యంలో తప్పు కనిపించదు. అంత గొప్ప వ్యక్తిగా, ఆరాధించవలసిన వ్యక్తిగా ఏ మాత్రం నాటకీయత చూపకుండా అనవసర హీరోయిజం ప్రదర్శించకుండా హుందాగా హీరోయిక్‌గా కనిపించడమే దిలీప్ సాబ్ గొప్పతనం. అది మరో నటుడికి సులువుగా అబ్బే విద్య కాదు.  ప్రస్తుతం  కరోనా పరిస్థితుల్లో ఈ సినిమా అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది. అంటువ్యాధి కేంద్రంగా వున్న అరుదయిన సినిమా ఇది. ఇది కాక,  డాక్టర్ కోట్నీస్ కీ అమర్ కహానీ (1946), నీచా నగర్ (1946) సినిమాలలోనే అంటువ్యాధి కనిపిస్తుంది. ఫూల్ ఔర్ పత్థర్ (1966) సినిమాలో అంటువ్యాధి నాయికా నాయకులను దగ్గరచేసేందుకే పనికివస్తుంది తప్ప సామాజిక సమస్యగా, మానవమనస్తత్వ పరిశీలనకూ పనికిరాదు. ఈ కోణంలో చూస్తే జమీందారుల కాలంలో మహమ్మారుల వల్ల పల్లెల్లో నెలకొన్న పరిస్థితులను ప్రదర్శించిన ఏకైక సినిమాగా షికస్త్ నిలుస్తుంది.

షికస్త్ గురించి మరో చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే దిలీప్ కుమార్ నటించిన సినిమాల్లో ట్రాజెడీ కింగ్ గా పేరు రావటానికి, ప్రేమించిన ప్రేయసిని పొందలేక మిగిలిపోయిన విషాదాంత నాయకుడిగా మిగిలిపోయిన సినిమాల్లో షికస్త్ కూడా వుంటుంది.  దిలీప్ కుమార్ విషాద నాయకుడిగా నటించిన ఇతర సినిమాలు:  జుగ్ను(1947), మేలా(1948), అందాజ్(1949), బాబుల్(1950), జోగన్(1950), దీదార్(1951), షికస్త్(1951), దేవదాస్(1955) ముఘల్-ఎ-ఆజం(1960)..దీదార్,  షికస్త్ లలో నటించిన తరువాత ఈ సినిమాల్లోని విషాదం దిలీప్ మానసిక వ్యవస్థపై ప్రభావం చూపించింది. అందుకే అతను కామెడీ సినిమాల్లో నటించి ట్రాజెడీ కింగ్ ఇమేజీని మార్చుకోవాలని ప్రయత్నించాడు.

గమ్మత్తయిన విషయమేమిటంటే, షికస్త్ దిలీప్ కుమార్ కు ఇష్టమయిన సినిమా అయినా, ఈ సినిమా గురించి ఎక్కువమందికి తెలియదు. ఎక్కడా ఈ సినిమా ప్రస్తావన రాదు. చివరికి దిలీప్ జీవిత చరిత్ర  Dileep Kumar: The substance and the Shadow  లో ఈ సినిమా ప్రసక్తి రాదు. దిలీప్ కుమార్ గొప్ప సినిమాల జాబితాలో ఎక్కడా షికస్త్ పేరు వుండదు. ఈ సినిమా యూట్యూబ్‌లో ఉంది. కాని చాలా కట్ల మధ్య అతుకులతుకులుగా కనిపిస్తుంది. కథ అర్థం అయినా కొన్ని ఎమోషన్స్ మిస్ అవుతాం. అయినా ఈ సినిమా చూడడం ఒక మంచి అనుభవం.ఈ ఫిల్మ్ పరిస్థితి కూడా బాలేదు కాబట్టి చూడాలనుకున్నవారు ఇప్పుడే చూడాలి. కొన్నాళ్ళకి ఇది మరుగునపడిపోవడం ఖాయం. ఇలాంటి సినిమాలను రక్షించుకునే ఓపిక, తీరిక ప్రస్తుత తరాలకు ఉండదు. అవకాశం ఉన్నప్పుడే ఈ ఆణిముత్యాన్ని ఆస్వాదించండి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here