ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 20 – ఆన్

2
11

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

భారతదేశపు మొదటి టెక్నీ కలర్ సినిమా ‘ఆన్’

[dropcap]భా[/dropcap]రతదేశంలో మొదటి టెక్నీకలర్ సినిమాగా వచ్చింది మహబూబ్ ఖాన్ ‘ఆన్’. దీన్ని 16 ఎమ్.ఎమ్ జీవా కలర్‌తో తీసి, తరువాత టెక్నీ కలర్ లోకి మార్చారట. THE SAVAGE PRINCESS అనే పేరుతో ఇదే సినిమాని యు కె., యు. ఎస్. లో కూడా రిలీజ్ చేసారు. అప్పట్లో చాలా ఖర్చుతో తీసిన సినిమాగా దీన్ని చెప్పుకున్నారు. ఇరవై ఎనిమిది దేశాలలో పదిహేడు భాషల సబ్ టైటిల్స్‌తో ఓవర్ సీస్‌లో రిలీజ్ అయిన మొదటి హిందీ సినిమా ఆన్. మహబూబ్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని విదేశీ సినీ జనం కూడా ఆసక్తిగా చూసారట. దిలీప్  కుమార్, నిమ్మి, ప్రేమ్ నాధ్ కలిసి నటించిన సినిమా ఇది. నాదిరాకు హీరోయిన్‌గా ఇది మొదటి సినిమా. అంతకు ముందు కేవలం పన్నేండు ఏళ్ళ వయసులో “మౌజ్” అనే ఒక సినిమాలో కనిపిస్తారామె.

“ఆన్” సినిమాని తమిళంలోకి కూడా డబ్ చేసారు. తమిళంలోకి డబ్ అయిన మొదటి హిందీ సినిమా కూడా “ఆన్” అనే చెప్తారు. 1952లో తీసిన ఈ సినిమాలో నిమ్మి పాత్ర విదేశీయులకు చాలా నచ్చిందట. ప్రెంచ్ భాషలో ఈ సినిమాను డబ్ చేసినప్పుడు “మంగళ భారత దేశపు రాజకుమారి” అనే పేరుతో దాన్ని రిలీజ్ చేసారట. కొంత మందికి నిమ్మి పాత్ర త్వరగా చనిపోవడం నచ్చలేదట. అందుకని మెహమూబ్ ఖాన్ ఒక డ్రీమ్ సన్నివేశాన్ని తరువాత ఈ సినిమాకు జోడించారు.

జపాన్‌లో రిలీజ్ అయిన మొదటి భారతీయ సినిమా కూడా “ఆన్”. సినిమాలో మొత్తం పది పాటలుంటాయి. షకీల్ బదాయిని ఈ పాటలు రాస్తే నౌషాద్ సంగీతం అందించారు. లత, రఫీ, షంషాద్ బేగంలు ఈ పాటలు పాడారు. “మాన్ మెరా ఎహసాన్ అరే నాదాన్”, “దిల్ మె చుపాకె ప్యార్ కా తూఫాన్ లే చలే” అనే రఫీ పాటలు, ‘తుఝె ఖొ దియా హమ్నే” అనే లత పాట ఇప్పటికీ పాపులర్ పాటలలో వినిపిస్తూ ఉంటాయి.  ఆన్ సినిమాలో మొహబ్బత్ చూమే జిన్‌కీ హాథ్  అన్న పాట చిత్రీకరణ అత్యద్భుతంగా వుంటుంది. ఇలాంటి పాట చిత్రీకరణను ఎవ్వరూ అనుకరించలేకపోయారు. ముఖ్యంగా పాట పలు దశలలో ఆగి ఆగి రావటం శంషాద్ బేగం గొంతు అత్యద్భుతంగా ధ్వనించటం, దిలీప్ కుమార్ కళ్ళల్లోని చిలిపితనం రఫీ స్వరంలో తొణికిసలాడటం వంటి అంశాలు ఈ పాటను చూడటం ఒక అపూర్వమైన అనుభవంలా నిలుపుతాయి. కేమేరా కదలికలు కూడా పాట లయకు తగ్గట్టు, దిలీప్ కుమార్ నటనను అనుసరించి, కాస్త బద్ధకంగా, కాస్త నిర్లక్ష్యంగా, మరికాస్త ఏడిపిస్తున్నట్టు వుండి పాట ప్రభావాన్ని ఇనుమడింపచేస్తుంది. రఫీ స్వరం ఈ పాటలో మిగతా పాటలకు భిన్నంగా ధ్వనిస్తుంది. ముఖ్యంగా ఆలాపన అత్యంత తీయగా అనిపిస్తుంది. ఏక్ తొ సుందర్ ముఖ్‌డా అనేసమయంలోని చిలిపి తనం, హం దిల్ కొ కహాన్ లేజాయే అన్నప్పటి నిజాయితీ, అకేలా దూర్ ఖడే లల్‌చాయే అనేటప్పటి తీయని వేదన..కేవలం తన స్వరంతో దిలీప్ కుమార్ వదనంలో కనిపించే భావాలను ప్రతిధ్వనింపచేస్తాడు రఫి.
ఈ సినిమాలోనిదే మరో రఫీ పాట టక్రాగయ తుంసే దిల్ హి తో హై…అత్యద్భుతమయిన చిత్రీకరణ , నటన. నిజానికి ఈ పాటలో కెమేరా కదలికలు తక్కువవుంటాయి. అవి కూడా దిలీప్ కుమార్ హావ భావాలను క్లోస్ అప్ లో చూపిసంచేందుకే.. ఈ పాట  బాణీ ఇది విషాద గీతం అనిపిస్తుంది. విడిగా రఫీ స్వరంలో వేదన, బాధలు తెలుస్తాయి. పాటలో పదాలు కూడా ఆమెను ప్రేమించి, ఆమెవల్ల నిర్లక్ష్యమూ, ప్రేమ రాహిత్యంవల్ల ఎంత బాధపడీ ఏం లాభం అన్న ఒక నిర్లిప్తతను ధ్వనిస్తాయి. కానీ, దిలీప్ కుమార్ నటన , భవిష్యత్తులో దిలీప్ కుమార్ ఆమెను ఎత్తుకుపోయి ఆమె అహంకారాన్ని అణచేందుకు ప్రేరణను, ప్రాతిపదికను ఏర్పాటు చేస్తుంది. టక్రాగయ తుంసే అన్నప్పుడు కళ్ళల్లో కనిపించిన వేదన, రెండో పాదం  దగ్గరికి వచ్చేసరికి దిలీప్ కుమార్ పెదవులపై నవ్వుగా మారుతుంది. పాట పాడుతూ ఆమె కోసం తొంగి చూడటం, అప్పుడప్పుడూ వేదన కనిపించినా వెంటనే నిర్లక్ష్యంగా నవ్వటం, పైకి చిలిపితనం కనిపిస్తున్నా, కళ్ళల్లో పట్టుదల, ఒక రకమైన మొండితనం లీల మాత్రంగా కనిపించి మాయమైపోవటం, ఈ ఒక్క పాటలో, ప్రతి పదం అర్ధాన్ని దృశ్యపరంగా ప్రదర్శిస్తూ, పాట ధ్వనికి విరిద్ధమైన భావనలను కలిగిస్తాడు దిలీప్ కుమార్. అంటే మామూలుగా విషాదంగా ధ్వనించే పాట తెరపై చూస్తూంటే పాత్ర వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ, దెబ్బ తిని మౌనంగా వుండక, ప్రతీకారం తీర్చుకునే నాయకుడి వ్యక్తిత్వాన్నికి దర్పణంగా నిలిచే అద్భుతాన్ని ఈ పాటలో మనం చూడవచ్చు.
ఈ రెండు పాటలతో పాటూ మాన్ మెరా ఎహెసాన్ అరే నాదాన్ పాట చిత్రీకరణనూ గమనిస్తే, ఆ కాలంలో పాటలు ఎంతగా పాత్రల అంతరంగాలనూ, వ్యక్తిత్వాన్నీ ప్రతిబింబించేవో తెలుస్తుంది. అంతే కాదు, చిత్రీకరణలో ప్రధానంగా వాడే క్లోస్ అప్ లు నటుడి  హావభావాలను, మనసులోని సంఘర్షణలను ప్రేక్షకుడికి చేరువ చేయటమే కాదు, ఆ నటుడిపై, ఆ గాయకుడి గాత్రాన్ని స్థిరపరచి, ప్రేక్షకులకూ, నటుడికీ, గాయకుడికీ నడుమ విడదీయరాని అనుబంధాన్ని ఏర్పాటు చేసేది. ఈ పాటలను  పాడుతున్నది రఫీ అని తెలిసినా, క్లోస్ అప్‌లూ, దిలీప్ కుమార్ వదనంలో ప్రతిఫలిస్తున్న భావాలతో దిలీప్ కుమార్ పాడుతున్నాడన్న భ్రమ కలుగుతుంది. ఇది ఆ కాలంలో నటులకూ, గాయకులకూ నడుమ సంబంధం ఏర్పరచి, సినిమాలూ, పాటలూ, నటీనటుల వ్యాపార విలువనూ పెంచేది. ఇప్పటి గ్రూప్ డాన్సులూ, లాంగ్ షాట్‌లూ, క్విక్ కట్లూ…ఆ సన్నిత సంబంధాన్ని దెబ్బ తీశాయి.
చాలా రోజుల దాకా ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు చేసే మరో సినిమా రాలేదు. అన్ని రికార్డులు సాధించిన “ఆన్” సినిమా ఇప్పుడు చాలా సాగతీతగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవలసింది దిలీప్  కుమార్ నటన. ట్రాజెడి కింగ్‌గా, ప్రేమ పాత్రలతో అలరించిన దిలీప్ కొంచెం వీరోచితంగా కొంత అహంకారంతో, ఈ సినిమాలో కనిపిస్తారు. ఫక్తు జానపద సినిమా అయినా చాలా గాప్స్ కనిపిస్తాయి కథ పరంగా ఇప్పుడు పరీక్షగా చూస్తే.

కథకు వస్తే, సంగనేరా ప్రాంతపు సర్దార్ జయ్. హాదా జాతీయులకు సర్దారు అతను. ఇతని రాజ్యం కూడా తంబా రాజు క్రిందకు వస్తుంది. మహరాజుకు శంషేర్ అనే తమ్ముడు రాజశ్రీ అనే చెల్లెలు ఉంటారు. మారుతున్న కాలంతో పాటు రాజు రాచరికాన్ని వదిలి ప్రజలకు రాజ్యాన్ని ఇవ్వాలనే తలంపుతో ఉంటాడు. ఈ సినిమా దర్శకుడు మహబూబ్ ఖాన్ సోషలిస్ట్ భావాలున్న వ్యక్తి. అతని సినిమాలలో ఏదో ఒక చోట ఈ భావజాలం కనిపిస్తూ ఉంటుంది. రష్యన్ సాహిత్య ప్రభావం కూడా వీరి మీద కనిపిస్తుంది. జానపద రాచరికపు సినిమాగా తీసినా ఈ సినిమాలో రెండు సీన్లలో తన సోషలిస్టు ఆదర్శాలను ప్రకటిస్తారు దర్శకుడు. పెద్ద రాజు రాజ్యాన్ని ప్రజల పరం చేయాలనుకోవడం అందులో ఒక సీన్. దానికి ముందు ఒక పెద్ద పోటీ ఉత్సవం రాజ్యంలో జరుగుతుంది. ఈ ఉత్సవానికి ఖడ్గంతో వెళ్ళాలని జయ్ కోరిక. కాని అతని తల్లి మాత్రం దీనికి ఒప్పుకోదు. రాజు క్షేమం కోసం మాత్రమే ఖడ్గం ధరించే అలవాటు వారి ఇంట ఉందని, పోటీలలో ప్రతిభ చూపడానికి కాదని ఆమె కొడుకుని ఖడ్గం లేకుండా సభాస్థలానికి వెళ్లాలని సూచిస్తుంది. అక్కడ శంషేర్ తనతో పోటికి ఎవరినన్నా రమ్మని పిలిచినప్పుడు జయ్ మౌనంగా ఉండిపోతాడు. రాజకుమారి రాజశ్రీ గుర్రపు స్వారీలో దిట్ట. ఆమె ప్రత్యేక గుర్రాన్ని అధిరోహించగల వాడి కోసం ఆమె పోటీ పెడుతుంది. జయ్ ఆ పోటీలో విజయం సాధిస్తాడు. నూరు వరహాల బహుమతి వచ్చినా రాజకుమారి లోని అసూయను చూసి అతను ఆ బహుమానాన్ని తిరస్కరించి ఆమె గుర్రాన్ని మాత్రం తనతో తీసుకుని వెళతాడు. కాని శంషేర్‌తో ఖడ్గపోటీ తప్పదు. తల్లి అనుమతితో అతన్ని ఓడించే అవకాశం వచ్చినా జయ్ ఆ పని చేయడు. మహరాజు కూడా ఇది గమనిస్తాడు. అతనిలోని వీరత్వానికి నీతికి అసూయ పడతారు శంషేర్, రాజశ్రీలు.

జయ్ మొదటి చూపులోనే రాజశ్రీని ప్రేమిస్తాడు. అతన్ని మంగళ చిన్నతనం నుండే ప్రేమిస్తుంది. జయ్ తల్లి కూడా మంగళను తన కోడలిగా చేసుకోవాలనుకుంటుంది. కాని జయ్ మాత్రం ఆమెను స్నేహితురాలిగా మాత్రమే చూస్తాడు. రాజశ్రీని తన దానిగా చేసుకోవాలన్నది అతని కోరిక. రాజశ్రీ మాత్రం ఒక మామూలు సర్దార్ తనను ప్రేమిస్తున్నానని చెప్పడం సహించలేకపోతుంది. అతన్ని అహంకారంతో తిరస్కరిస్తుంది. ఆమె లోని ఆ రాచరికపు అహంకరాన్ని అణిచి ఒక మామూలు స్త్రీలా ఆమెను మార్చాలని కంకణం కట్టుకుంటాడు జయ్. పెద్ద రాజు ఇంగ్లండు వెళ్ళవలసి వస్తుంది. అతనికి అక్కడ ఒక ఆపరేషన్ జరగాల్సి ఉంది. అయితే రాచరికాన్ని వదిలి ప్రజాస్వామ్యం వైపు ప్రయాణించాలన్న రాజు మాట నచ్చక రాజ్యాన్ని తానే హస్తగతం చేసుకోవాలని అతన్ని హత్య చేయిస్తాడు శంషేర్. కాని రాజు స్థానంలో అతని అనుచరుడు ప్రాణాలు త్యాగం చేస్తాడు. ఆ అనుచరుడి రూపంలో మారువేషంలోకి రాజు మారతాడు. రాజ్యంలోని పరిస్థితులను గమనిస్తూ ఉంటాడు.

రాజశ్రీ అహం అణచడానికి ప్రయత్నాలు మొదలెడతాడు జయ్. రాజశ్రీ ప్రధాన చెలికత్తె కూడా అతనికి ఈ విషయంలో సహాయపడుతూ ఉంటుంది. ఒక సారి రాజమందిరంలో దూరిన అతన్ని ఆమె బంధించి కొరడా దెబ్బల శిక్ష కూడా వేయిస్తుంది. కాని ఆమెకే తెలియని అలజడి మనసులో మొదలవుతుంది. ఒక రాకుమారిగా సామాన్యునికి తాను లొంగిపోవడం ఆమెకు ఇష్టం లేదు. ఈలోగా శంషేర్ మంగళను లోబర్చుకోవాలని చాలా ప్రయత్నిస్తాడు. ఆమెను అపహరించి బంధిస్తాడు. అక్కడ ఉన్నప్పుడు మరో ఖైదీ ఆమెకు విషం అందించి, శంషేర్ నుండి కాపాడుకోలేని పరిస్థితులలో అది తాగి తన మానాన్ని కాపాడుకొమ్మని సలహా ఇస్తుంది. అక్కడ బందీగా ఉన్నప్పుడే మంగళ జయ్ తనను కాక రాకుమారిని ప్రేమిస్తున్నాడని తెలుసుకుంటుంది. జయ్‌ని కాపాడాలనే ప్రయత్నంలో తనను తాను శంషేర్ నుండి కాపాడుకునే క్రమంలో విషం తాగి మరణిస్తుంది. ఆమె చనిపోయిన తరువాత జరిగే దాడిలో జయ్ శంషేరును హతమారుస్తాడు.

అన్నమరణానికి బదులు తీర్చుకోవాలని రాజశ్రీ జయ్‌ని వెంబడిస్తుంది. కాని జయ్ ఆమెను అపహరించి తన ఊరికి తీసుకొని వస్తాడు. ఇక్కడ యుద్ధానికి సంసిద్ధం అవమని ప్రజలను అతను అడుగుతున్నప్పుడు,  ఇది అతని వ్యక్తిగత యుద్ధం అని ప్రజలను ఇందులో చేర్చరాదని అతని తల్లి అతని నొక్కడినే యుద్ధానికి పంపడం వచ్చే సీన్‌లో మరో సారి మహబూబ్ ఖాన్ తన భావజాలాన్ని ప్రదర్శించారు.

రాజశ్రీ సామాన్య గ్రామీణ యువతిలా అన్ని పనులు చేయవలసి వస్తుంది. ఆ క్రమంలో ఆమె తనకు తెలియకుండానే జయ్ పట్ల ఆకర్షితురాలవుతుంది. శంషేర్ బ్రతికి ఉన్నాడని తెలుస్తుంది. కాని రాజశ్రీ జయ్‌ని ప్రేమిస్తుందని తెలిసి అతను ఆమెను శత్రువుగానే చూసి బంధిస్తాడు. కాని బ్రతికి ఉన్న పెద్దరాజు, జయ్ మిగతా సైనికులు శంషేర్‌కు బుద్ది చెప్పి చివరకు రాజ్యాధికారాన్ని ప్రభుత్వ పరం చేస్తూ, ప్రజాస్వామ్యం వైపుకు దేశాన్ని నడిపించడానికి రాజ కుటుంబం సిద్ధపడడం, రాజశ్రీ, జయ్‌ల వివాహం జరగడం సినిమా ముగింపు.

స్వాతంత్ర్యం అనంతరం దేశంలోకి విలీనమవ్వవలసిన వివిధ రాజ వంశాలు ఒప్పుకోని పరిస్థితులకు సమాధానంగా ఈ సినిమా తీసారా అనిపిస్తుంది. సినిమాకు కథ ఎస్. అలి. రాజా అందించారు. నిమ్మి, నాదిరా ఇద్దరి నటనలో మెలోడ్రామా హెచ్చు స్థాయిలో ఉంటుంది. ఒక్క దిలీప్ కుమార్ మాత్రమే బాలెన్స్‌డ్‌గా కనిపిస్తారు. నదిరా కొచ్చే కల సన్నివేశం అంతా కూడా కవిత్వపు భాషలో నడుస్తుంది. ఇక్కడ దిలీప్  కుమార్ వాడిన కవితా పంక్తులు చాలా బావుంటాయి. ఇందులో  పెద్ద రాజుగా నటించిన నటుడు మురాద్. ఇతని కుమారుడే రాజా మురాద్‌గా తరువాతి తరానికి పరిచయం. శంషేర్‌గా ప్రేమ్ నాధ్ నటించారు. నటి బీనా రాయ్ భర్త, రాజ్ కపూర్ బావమరిది ఈయన. నాదీరా యాదు వంశస్తురాలు. ఆమె అసలు పేరు ఫ్లోరెన్స్ ఎజెకెల్. ఆమె బాగ్దాద్‌లో పుట్టారు. వ్యాపారం కోసం వీరి చిన్నప్పుడే కుటుంబం ముంబాయి వచ్చింది. చాలా సినిమాలలో తరువాత కారెక్టర్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకున్నారు నదీరా. అప్పట్లో రోల్స్ రాయిస్ కారున్న నటిమణులలో ఈమె ఒకరు. “జూలి” సినిమాలో ఆంగ్లో ఇండియన్ స్త్రీగా చేసిన పాత్రకు ఆమెకు ఫిలింఫేర్ అవార్డు, సహాయక నటి కేటగిరిలో లభించింది. కుటుంబం లోని సభ్యులందరూ ఇస్రాయిల్, యు.ఎస్.కు వెళ్ళిపోయినా ఒంటరిగా భారతదేశంలోనే ఉండి ఇక్కడే మరణించారీమే. ఆమె వివాహం చేసుకోలేదు. ముంబయ్‌ని చాలా ప్రేమించి ఆ నగరంలోనే తుది శ్వాస విడిచారు.

నవాబ్ బానోగా జన్మించిన నిమ్మిని హిందీ సినిమాకు రాజ్ కపూర్ పరిచయం చేసారు. బర్సాత్ సినిమాలో ఒక అమాయక పల్లెటూరి పిల్లగా అలరించారీమె. “ఆన్” సినిమా తరువాత ఆమెకు కొన్ని హాలీవుడ్ ఆఫర్లు కూడా వచ్చాయట. కాని ఆమె వాటిని తిరస్కరించారు. చాలా మంచి సినిమాలలో నటించి వివాహం తరువాత రిటైర్ అయ్యారు. “ఆన్”కు సినిమాట్రోగ్రాఫర్‌గా పని చేసిన వారు ఫరీదూన్ ఎ ఇరానీ. మహబూబ్ ఖాన్ అన్ని సినిమాలకు ఈయన సినిమాటోగ్రాఫర్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. “అన్మోల్ ఘడి” నుంచి “మదర్ ఇండియా” దాకా తన అన్ని సినిమాలకు మెహబూబ్ ఖాన్ వీరినే సినిమాటోగ్రాఫర్ గా ఎంచుకున్నారంటే వీరి ప్రతిభపై ఆయన నమ్మకం అర్థం అవుతుంది. మదర్ ఇండియా సినిమాకి వీరికి ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది.

ఇంత మంది హేమాహేమీలున్న సినిమా అయినా “ఆన్” ఇప్పుడు చూడాలంటే చాలా ఓపిక కావాలి. నిశితంగా భారతీయ సినీ ప్రస్థానాన్ని స్టడి చేసే క్రమంలో మాత్రం ఇది మిస్ అవకుండా చూడవలసిన సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here