ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 25 – పైగామ్

0
8

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్‌కు ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ నామినేషన్ సంపాదించి పెట్టిన ఎస్.ఎస్. వాసన్ సినిమా పైగామ్

[dropcap]1[/dropcap]959లో దిలీప్ కుమార్ వైజయంతి మాలతో ఎస్.ఎస్. వాసన్ తీసిన సినిమా పైగామ్. ఈ సినిమాలో దిలీప్ కుమార్ రాజ్ కుమార్‌తో నటించారు. తరువాత ముప్పై సంవత్సరాలకు మాత్రమే మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సుభాష్ ఘాయ్ ‘సౌదాగర్’ అనే సినిమా తీసారు. ఇదే కథను దిలీప్ కుమార్ బదులు శివాజీ గణేశన్‌ను పెట్టి వాసన్ ‘ఇరుంబు తిరై’ అనే తమిళ సినిమాగా 1960లో రీమేక్ చేసారు. హిందీలో వైజయంతి మాల, బీ సరోజా దేవిల పాత్రలు తమిళంలో కూడా వారే చేసారు.

సినిమా కథ ఇద్దరు అన్నదమ్ములు నమ్మిన ఆదర్శాల మధ్య జరిగే సంఘర్షణ గురించి సాగుతుంది. రామ్ లాల్ ఒక మిల్లులో కార్మికుడు. చాలా నిజాయితీగా పని చేస్తూ ఉంటాడు. సంపాదించిన దాంట్లోనే అన్ని ఖర్చులు పొదుపుగా నడుపుకుంటాడు. అతని చిన్న తమ్ముడు రతన్ లాల్. పట్నంలో ఇంజనీరింగ్ చదువుకుంటూ రాత్రి పూట రిక్షా నడుపుకుంటూ డబ్బు సంపాదించుకుంటాడు. అక్కడే అతనికి మంజు పరిచయం అవుతుంది. మంజు తల్లి ఆరోగ్యం బాలేనప్పుడు ఆమెను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళవలసి రిక్షా కోసం బైటకు వచ్చిన మంజుకు మహాత్మాగాంధీ ఆత్మకథ చదువుతున్న రతన్ కనిపిస్తాడు. అతనే రిక్షా తీసుకువచ్చి డాక్టర్ రాత్రి పూట రానంటే అతన్నిఒప్పించి తన డబ్బుతో మంజు తల్లికి ఆ రోజు వైద్యం అందేలా చూస్తాడు. మంజు బీ.ఏ. పాస్ అయి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఆమెతో పాటు చదువుకుంటున్న మాలతి రంగపూర్ లోని మిల్లు ఓనరు కూతురు. తన తండ్రి వద్ద మంజుకు ఉద్యోగం చూపిస్తానని ఆమె చెబుతుంది. అన్నట్లుగానే తన తండ్రి ఫాక్టరీ ఆఫీసులో టైపిస్ట్‌గా ఉద్యోగం ఇప్పిస్తుంది.

చదువు అయిపోయి చెల్లెలి పెళ్ళి కోసం రతన్ ఇంటికి వస్తాడు. చెల్లెలి నిశ్చితార్థం తరువాత అతనికి రామ్ తన మిల్లులోనే ఉద్యోగం ఇప్పిస్తాడు. మిల్లులో మిషిన్ పాడయి విదేశాలకు పంపి దాన్ని రిపేర్ చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు రతన్ ఆ మిషన్‌ను రిపేరు చేసి మిల్లు ఎక్కువ రోజులు మూతపడకుండా చూస్తాడు. మిల్లు ఓనర్ సేవక్రామ్ చాలా సంతోషిస్తాడు. రతన్ పట్ల సేవక్రామ్ కూతురు మాలతి ఆకర్షణ పెంచుకుంటుంది. అదే మిల్లులో పని చేస్తున్న మంజుని ప్రేమిస్తాడు రతన్. ఈ సంగతి తెలిసి మాలతి మంజుని ద్వేషించడం మొదలెడుతుంది. ఆమె ఎంత ప్రయత్నించినా రతన్ ఆమె వైపు కన్నెత్తి చూడడు. తనను కాదని ఒక పేదరాలి పట్ల అతను ఆకర్షితుడవడం ఆమె అహాన్ని దెబ్బతీస్తుంది.

మిల్లులో బోనస్‌లు ఇచ్చే సమయంలో అక్కడ చీఫ్ మెకానిక్‌గా పని చేస్తున్న రతన్‌కు మిల్లులో జరుగుతున్న అవకతవకలు దృష్టికి వస్తాయి. సంతకం పెట్టించుకున్నంత డబ్బు జీతంగా కార్మికులకు ముట్టడం లేదని అతనికి అర్థం అవుతుంది. జీతాల పెంపు కోసం, మిల్లు కార్మికుల హక్కుల కోసం యూనియన్ పెడతాడు రతన్. రామ్‌కి ఇది ఇష్టం ఉండదు. తమకు ఉద్యోగం ఇచ్చే యజమాని దేవుడని అతని పట్ల విశ్వాసం చూపించాలని అతని అభిప్రాయం. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఈ విషయంలో గొడవలు మొదలవుతాయి. మిల్లు కార్మికులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేవారు లేకపోతే వారు ఆజన్మాంతం దోచుకోబడుతూనే ఉంటారని రతన్ చెప్పే విషయం రామ్‌కు అర్థం కాదు. అతను తమ్ముడి మాటల లోని లోతు అర్థం చేసుకోలేక పోతాడు. అప్పటి దాకా ఒక్కటిగా ఉన్న ఆ అన్నదమ్ముల మధ్య వైరం మొదలవుతుంది. పైగా మంజుని వివాహం చేసుకుంటానన్న రతన్ మాట రామ్‌కి ఇంకా కోపం తెప్పిస్తుంది. తండ్రి ఎవరో తెలియని ఆమె ఆ ఇంటికి కోడలు కాజాలదని అతని వాదన. ఈ లోపు చెల్లెలి అత్తగారి తరుపు వారు ఈ సంబంధం వదులుకుంటామని కబురు పంపిస్తారు. మిల్లు యజమానితో రతన్ చేస్తున్న యుద్దం సరైనది కాదని అనైతికమని వారు వాదిస్తారు. రతన్ తప్పని పరిస్థితులలో ఇల్లు వదిలి దూరంగా ఉండవలసి వస్తుంది.

మంజు మీద కోపంతో మాలతి ఆమెను ఉద్యోగం నుండి తీసివేస్తుంది. ఆ సమయంలోనే మంజు తల్లి తనను ప్రేమించి మోసం చేసిన వ్యక్తి సేవక్రామ్ అని, అతనే మంజు తండ్రి అన్న నిజం చెప్పి మరణిస్తుంది. సేవక్రామ్ తన తల్లి జీవితాన్ని అంధకార మయం చేసిన వ్యక్తి అని తెలిసి మంజు అతన్ని ఇంట్లో కలిసి నిలదీస్తుంది. కాని సేవక్రామ్ ఆమె తన కూతురు అన్న విషయం ఒప్పుకోడు. అప్పుడు ఆమె కోపంతో సేవక్రామ్ ఫాక్టరీ లోని పత్తి కాల్చేస్తుంది. ఆమెను ఆపే ప్రయత్నంలో రతన్ ఈ కేసులో అరెస్ట్ అవుతాడు. రామ్ తమ్ముడు ఎన్ని తప్పులు చేసినా కార్మికుల కడుపుకు కొట్టే పని చేయడని ఫాక్టరీని కాల్చడం తన తమ్ముడు నైజం కాదని, అన్ని సంవత్సరాలుగా నిజాయితీగా అ ఫాక్టరీలో పని చేసినందుకు తన తమ్ముడిని జైలు నుండి తప్పించమని సేవక్రామ్‌ని అడుగుతాడు. కాని సేవక్రామ్ చలించడు, అప్పుడు మొదటి సారి యజమానిలోని బూర్జువాని చూస్తాడు రామ్. అతను తిరగబడతాడు. మంజు తల్లితో సేవక్రామ్ దిగిన ఫోటోని చూసిన మాలతి తండ్రి చేసిన అన్యాయాన్ని అర్థం చేసుకుని అతన్ని ఎదిరిస్తుంది. చివరకు సేవక్రామ్ తాను చేసిన తప్పులను ఒప్పుకోవడం, ఫాక్టరీని కార్మికుల పరం చేయడంతో కథ సుఖాంతమవుతుంది.

ఈ సినిమాను బి.నాగిరెడ్డి గారు నిర్మించారు. రామానంద్ సాగర్ అందించిన కథకు దర్శకత్వం ఎస్.ఎస్. వాసన్ చేస్తే, మంజుగా వైజయంతి మాల, మాలతిగా బి. సరోజా దేవి, రామ్ లాల్ భార్య పార్వతిగా పండరీ బాయి నటించారు. ఈ సినిమాలో మంజు తల్లిగా నటించిన వసుంధరా దేవి నిజ జీవితంలో కూడా వైజయంతిమాల తల్లి. హాస్య పాత్రల్లో జానీ వాకర్, మిన్నూ ముంతాజ్‌లు కనిపిస్తారు. ఈ సినిమాకు సంగీతం అందించింది సి. రామచంద్ర. కవి ప్రదీప్ ఈ సినిమాకు అన్నీ పాటలు రాసారు. “ఓ అమీరో కే పరమేశ్వర్” అనే పాట రెండు సార్లు వస్తుంది సినిమాలో. ఇది ఆశా భోంస్లే పాడారు. కవి ప్రదీప్ బాణిలో ఉండే ఈ పాట చాలా బావుంటుంది. పేదవారిపై కరుణ చూపని భవవంతునిపై ఎన్నో ప్రశ్నలు సంధించే పాట ఇది.

“జవాని మే అకేలేపన్ కీ ఘడియా” అనే ఒక డ్యూయెట్, దిలీప్ కుమర్ వైజయంతిమాల లపై చిత్రించారు. కవి ప్రదీప్ రాసిన ఈ గీతంలో “ఇజాజత్ హో తో హమ్ ఆయే” అన్న వాక్యం చాలా అద్భుతంగా పలుకుతారు ఆశా రఫీలు కూడా. ఈ పాటలో దిలీప్ కుమార్, వైజయంతి మాలల నటన చూడాలి, కంటి చూపుతో, పెదవి విరుపుతో ప్రేమను వ్యక్తీకరించే అద్భుతమైన భావ ప్రకటన ఈ పాటలో చూస్తాం. ఒకరి పట్ల ఒకరికున్న పరస్పర గౌరవాన్ని చాలా చక్కగా చూపిస్తారు ఈ పాటలో ఆ ఇద్దరు కూడా. ప్రేమికులకు ముఖ్యంగా ఒకరి పట్ల మరొకరికి గౌరవం ఉండాలనే భావన ప్రదీప్ కవిత్వంలో వ్యక్తపరుస్తారు. ఆ భావాన్ని చాలా గొప్పగా పలికిస్తారు ఈ ఇద్దరు నటులు కూడా. “హామారీ భీ యె హసరత్ హై కిసీకా ప్యార్ హం పాయే” అన్న వాక్యం దగ్గర దిలీప్ కుమార్ చేతులు జోడించి తన ప్రేమను వ్యక్తపరుస్తున్నప్పుడూ, “కిసీకే పాస్ హై హమ్ తో మగర్ హై అబ్ తలక్ దూరి” అన్నప్పుడు సున్నితంగా హీరోయిన్‌ని ముట్టుకుంటూ తన మనసు విప్పి చెబుతున్నప్పుడు, “అగర్ తుమ్సా మిలే కోయీ తొ హమ్ జన్నత్ ఠుకరాయే” అంటూ తన చేయి  వైజయింతిమాలకు అందించి నడవడం, ఈ చిన్ని కదలికలను ఈ పాటలో అతను చేయడం చూస్తే అసలు దిలీప్ కుమార్ రొమాంటిక్ కింగ్ అవ్వాలి కాని ట్రాజెడి కింగ్ కాదేమో అనిపిస్తుంది. కవి రాసిన వాక్యాలను తన శరీర భాష ద్వారా సున్నితంగా ప్రేమను వ్యక్తీకరించిన అతని నటనకు హాట్సాఫ్. హిందీ సినీ డ్యూయెట్లలో నాకు బాగా నచ్చిన పాట ఇది. దిలీప్ కుమార్ సున్నితమైన భావ వ్యక్తీకరణను స్టడి చేయాలంటే తప్పకుండా చూడవలసిన పాట కూడా ఇది. ప్రేమ ఇంత అందంగా ఇంత గొప్పగా ఉంటుందా అనిపిస్తుంది ఈ పాట చూస్తున్నంతసేపు. మరి “నీ అనుమతి ఉంటేనే సుమా” అంటూ “ఇజాజత్ హో తో హమ్ ఆయే” అన్న వాక్యంలో ఆయన చూపించే ఆ గౌరవం చూస్తే ఒక్క సారి ఈ తరం వారు ఈ పాట చూడాలి అనిపిస్తుంది నాకు. దూరంగా ఉంటూ వారిరువురూ ప్రేమను ఆస్వాదించడం, అనుభవించడం చూస్తే, ఇప్పటి ప్రేమ పాటలు ఎంత పలుచన అయిపోయాయో అర్థం అవదు మరి. ఈ సినిమాలో ఒక దృశ్యంలో దిలీప్ కుమార్ , వైజయంతి మాల పాత్రను ఏడిపిస్తాడు. తాను మరో అమ్మాయితో మాట్లాడుతూంటే అసూయతో మండుతోందని ఆమెతో ఒప్పిస్తాడు. ఈ దృశ్యంలో ఇద్దరి నటన ఎంత గొప్పగా వుంటుందంటే నిజజీవితంలో కూడా వారిద్దరూ ప్రేయసీ ప్రియులు అని నమ్మేంతగా!!!

సోషలిస్ట్ భావాలున్న ప్రదీప్ రాసిన “దౌలత్ నె పసీనె కో” అన్న పాట చాలా గొప్పగా ఉంటుంది. కార్మికుల హక్కుల పోరాటం వెనుక వారి వేదనను ప్రతిఫలించే పాట ఇది. రాజకుమార్‌పై చిత్రించిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ సి. రామచంద్ర గారే పాడారు. జానీ వాకర్ పాత్ర కొన్ని సార్లు అప్రస్తుతం అనిపించినా అతని మీద చిత్రించిన మూడు పాటలు కూడా ప్రజా ఉద్యమాలు, సామాజిక నేపద్యంలో రాసినవే. జానీ వాకర్ కనబడితే చికాకు కలుగుతుందీ సినిమాలో అతను పాడిన పాటలు కూడా గొప్పగా వుండవు.  ఈ సినిమాకు సంభాషణలు రాసిన రామానంద్ సాగర్‌కు ఫిలింఫేర్ అవార్డు లభించింది. అది వారి జీవితంలో వారికి లభించిన మొదటి ఫిలింఫేర్ కూడా. ఈ సినిమాలో నటనకు దిలీప్ కుమార్‌కు ఉత్తమ నటుడు కేటగిరిలో ఫిలింఫేర్ నామినేషన్ లభించింది కాని ఆ అవార్డు వీరికి రాలేదు. ఆ సంవత్సరం ‘అనారి’ సినిమాకు రాజ్ కపూర్ ఆ అవార్డు గెలుచుకున్నారు. రాజ్ కుమార్‌కు కూడా సహాయక నటుడి కేటగిరీలో నామినేషన్ లభించినా ఆ సంవత్సరం ‘ధూల్ కా ఫూల్’ సినిమాకు మన్మోహన్ కృష్ణ ఆ అవార్డు గెలుచుకున్నారు.

 నిజానికి ఈ సినిమా సంగీతం కూడా గొప్పగా వుండదు. ఇందుకు ప్రధాన కారణం, ఆ సమయంలో సి. రామచంద్ర సినిమాలకు లతా పాడకూడదని నిర్ణయించుకోవటం. సి. రామచంద్ర లత కోసమే ప్రత్యేకంగా బాణీలు సృజించేవాడు. అతని బాణీ సృజనలో లతా స్వరం ప్రధాన పాత్ర పోషించింది. కానీ, అతను పెళ్ళి ప్రసక్తి తీసుకువచ్చాడని, లత తిరస్కరించి అతనితో పనిచేయ నిరాకరించిందని అంటారు. దాంతో, సి. రామచంద్ర సృజన దెబ్బతిన్నది. లతా కు సృజించిన బాణీల్లోని ఆత్మ, ఇతరులకోసం సృజించిన బాణీల్లో లేదు.  రామచంద్రకు కూడా సంగీత సృజనపై ఆసక్తి తగ్గింది.  దాంతో అతని కెరీర్ కూడా దెబ్బతిన్నది. దాదాపుగా ఒకటిన్నర దశాబ్దంపాటూ తన బాణీలతో ప్రజలను ఉర్రూతలూగించిన రామచంద్ర చివరికి తెరమరుగై పోవాల్సి వచ్చింది. ఈ విషయాలను మరాఠిలో రచించిన జీవనీచ్ సర్గం (The Symphony of My Life)  లో వెల్లడించాడు సి. రామచంద్ర.

ఈ సినిమా చేస్తున్నప్పుడు రాజ్ కుమార్ కొత్త నటుడు, దిలీప్ కుమార్ చాలా సీనియర్. అయితే ఇద్దరూ పోటీ పడి నటించే సమయంలో ఒక సీన్‌లో రాజ్ కుమార్ దిలీప్‌ను ఎంత బలంగా చెంప దెబ్బ కొట్టాడంటే దిలీప్ కుమార్ షాక్‌తో షూటింగ్ చేయలేక పోయారట. అందుకే వారిద్దరు చాలా సంవత్సరాల దాకా కలిసి నటించలేదంటారు అప్పటి తరం వారు. ఇది దిలీప్ కుమార్ వైజయంతి మాలలు సినీ రంగానికి వరుసగా ఇచ్చిన నాలుగో హిట్. మన్నాడే పాడిన “ఇంసాన్ కా ఇన్సాన్ సె హై భాయీ చారా” పాట ఈ సినిమా ఉద్దేశాన్ని ప్రస్తుతించే గీతం.

జూన్16 న దిలీప్ కుమార్ పైగాం సినిమాలో సేవక్‌రాం, రతన్ లాల్‌ల నడుమ ఒక దృశ్యాన్ని ట్వీట్ చేశాడు. ఆ దృశ్యంలో యజమానితో ధనం గురించిన చర్చ వుంటుంది. ఫాక్టరీ కార్మికుల హక్కుల కోసం చర్చ సాగుతుంది. దేశం ప్రైవేటీకరణ దిశగా అరుగులిడుతున్న సమయంలో ఈ సినిమా రిలవెన్స్ మరింత పెరుగుతుంది. నిన్ను నువ్వు మహాత్మ గాంధీ అనుకుంటున్నావా? అన్న యజమాని అడిగిన  ప్రశ్నకు, దిలీప్ కుమార్ ఇచ్చిన సమాధానం గొప్పగా వుంటుంది. ఇది ఈ కాలానికీ వర్తిస్తుంది. 1959లో నిర్మించినా ఈనాటికీ ఈ సినిమా వర్తిస్తుందన్న దిలీప్ కుమార్ అభిప్రాయంతో అందరూ ఏకీభవిస్తారు.

‘పైగామ్’ గొప్ప సినిమా అనలేం కాని నటన పరంగా దిలీప్ కుమార్ అభిమానులను అలరిస్తుంది. అప్పట్లోని సోషలిస్ట్ భావజాలాన్ని, మారుతున్న మానవ హక్కుల పట్ల దృక్పథాన్ని చూపించిన సినిమా ఇది. యజమానులను దేవుళ్ళగా కొలిచే బానిస భావజాలం నుండి కార్మికులను బయటకు తీసుకువచ్చి వారి జీవితాలను మెరుగుపరుచుకోవడానికి వారు అధ్యయనం చేయవలసిన విషయాలపై స్పష్టత తీసుకురావడానికి ఉపయోగపడే సినిమా ‘పైగామ్’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here