ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు-3 – తరానా

3
11

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

అందమైన ప్రేమ కావ్యం – తరానా

[dropcap]ప్రే[/dropcap]మ కథా సినిమాలు మనకు కొత్త కాదు. ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి, వస్తూ ఉంటాయి. ప్రేమ కొన్ని సార్లు over rated అనిపిస్తుంటుంది కూడా నాకు. కాని మనసుకు నచ్చే భావం అదే కదా. నన్ను హిందీ సినిమాలలో కొన్ని మంచి రొమాంటిక్ సినిమాలు చెప్పమన్నప్పుడు నేనిచ్చే లిస్ట్‌లో మొదట ఉండేది తరానా. 1951లో వచ్చిన ఈ సినిమాలో మధుబాలా దిలీప్ కుమార్ల జోడీ వారిద్దరి మధ్య ఉండే ఆ మౌన భాష అత్యద్భుతం. ట్రాజెడీ కింగ్ దిలీప్ ఇందులో రొమాంటీక్ కింగ్‌లా కనిపిస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్న షారుక్ చాలా వరకు దిలీప్‌ని కాపీ కొట్టే ప్రయత్నం చేస్తాడన్నది అంగీకరించడానికి కష్టంగా ఉంటుందేమో. కాని ఎంత ప్రయత్నించినా, షారుక్ దిలీప్ కుమార్ కాలేడు. కారణం దిలీప్‌కు ఉర్దూ, హిందీ భాషల మీదున్న పట్టు. భాషను ఎలా పలకాలో అతనికి తెలుసినట్లు మరొకరికి తెలీదు. అందుకే ఆయనకు రాసిన డైలాగులన్నీ గొప్పగా అనిపిస్తాయి. తరానా సినిమా తోనే మధుబాల దిలీప్ కుమార్‌ల మధ్య ప్రేమ మొదలయిందని అంటారు. అది నిజమో కాదో కాని ఈ సినిమాలో వారిద్దరి శారీరిక భాషలో ఒక మెరుపు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. దాన్నే On screen chemistry అంటారేమో. అది నటనలా మాత్రం అనిపించదు. మధుబాలను చూస్తున్న ప్రతి సారి దిలీప్ కుమార్ కళ్ళల్లో ఆ మెరుపు ఎలా వచ్చి చేరుతుందో మరి.

తరానా కథ మామూలు ప్రేమ కధే కాని సినిమా చూస్తున్నంత సేపు ఆ ప్రేమికుల బాధ మన బాధ అవుతుంది. అది ఈ సినిమా ప్రత్యేకత. డాక్టర్ అయిన మోతిలాల్ ఒక విమాన ప్రమాదంలో దూర ప్రాంతంలో ఇరుక్కుపోతాడు. ఒక చిన్న మారుమూల గ్రామంలో తనతో ప్రయాణీస్తున్న ఒక పెద్ద వయసు ఆవిడతో పాటు కొన్ని రోజులు ఉండిపోవలసి వస్తుంది. మోతి ఉండే ఇంటి పెద్ద గుడ్డివాడు. అతని కూతురు తరానా. తరానా పట్ల ఆకర్షితుడవుతాడు మోతి. మోతి తండ్రి అతన్ని నగరానికి పిలిపించుకునే ప్రయత్నాలు చేస్తున్నా కూడా అతను ఆ ఊరు, ముఖ్యంగా తరానాని వదిలి వెళ్ళలేని స్థితికి చేరుకుంటాడు. ఆపరేషన్ చేసి తరానా తండ్రికి చూపు తెప్పిస్తాడు మోతి. దీని తర్వాత వారిద్దరి మధ్య చనువు పెరుగుతుంది. తరానాని పెళ్ళి చేసుకోవాలనుకున్న వ్యక్తి వీరిద్దరి మధ్య చనువు చూసి భరించలేకపోతాడు. ఒక సారి అనుకోకుండా ఇద్దరు ఒంటరిగా ఒక చోట గడపవలసి వస్తుంది. ఇదే అదునుగా తీసుకుని అతను వారిద్దరి మధ్య శారీరిక సంబంధం ఉందని ఊరి వారి ముందు నిలదీసి తరానాని వెలి వేయిస్తాడు. మోతిని ఊరి వారు విపరీతంగా కొడతారు.

మోతి తండ్రి వచ్చి అతన్ని ఊరు తీసుకువెళతాడు. అక్కడే మరో స్నేహితుని కూతురు షీలాతో అతని వివాహం నిర్ణయిస్తారు. మోతి రాసిన ఉత్తరాలు తరానాకు చేరనివ్వరు. ఈ లోపే తరానా గర్భవతి అనే పుకారు పుట్టిస్తాడు ఆమెను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి. తరానా తండ్రి కోపంతో అది నిజం అని నమ్మి తరానా ఉండగానే ఇల్లు తగలబెడతాడు. తరానా చనిపోయిందని అందరితోపాటు మోతీ అనుకుంటాడు. తరానాను మర్చిపోలేక పోతున్న మోతికి సపర్యలు చేసి మామూలు మనిషిని చేస్తుంది షీలా. తప్పని పరిస్థితులలో షీలాను పెళ్ళీ చేసుకోవడానికి ఒప్పుకుంటాడు మోతి. కాని చివర్లో తరానా బ్రతికి ఉందని తెలుసుకుని ఆమెను మోతి కలవడంతో కథ సుఖాంతమవుతుంది.

సినిమా కథ కన్నా కథ నడిచిన తీరు బావుంటుంది. ఈ సినిమాకు సంగీతం అదనపు ఆకర్షణ. తొమ్మిది పాటలుంటాయి సినిమాలో. ప్రతి పాత ఒక ఆణిముత్యం. తలత్ లతలు గాత్రం, అనీల్ బిస్వాస్ సంగీతం, ప్రేమ్ ధవన్, డి.ఎన్. మాధోక్ పాటలు సినిమాకు ప్రాణం పోసాయి. అసలు తలత్ గొంతు దిలీప్‌కి సరిపోయినట్లు మరెవరికి సరిపోదన్నది నా అభిప్రాయం. ఈ సినిమాలోని పాటలు ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు కాని వాటిని ఒక్కసారి అస్వాదిస్తే మరచిపోలేం. ఆ పాటలలో దిలీప్ మధుబాలల హావభావాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే అసలు ప్రేమ అంటే ఇలా ఉంటుందేమో అన్న ఫీల్ కలుగుతుంది. ‘నైన్ మిలె నైన్ హుయె బావరే’ అన్న పాటలో వారిద్దరిలోని ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. మధుబాలను స్పృశించేటప్పుడు దిలీప్ చేతులు ఎంత సున్నితంగా పని చేస్తాయంటే ఆ పాటలకి అతని చేతుల కదలికకు ఒక సూపర్ కాంబినేషన్ కనిపిస్తుంది. నైన్ మిలె పాటలో, అలాగే “బెయీమాన్ తోరే నైనవా” అన్న పాటలో దిలీప్ మధుబాలను సున్నితంగా ముట్టుకోవడం చూడడానికి చాల అందంగా ఉంటుంది.

తరానా చాలా అమాయమైన యువతి. ఆమెలోని ఆ ఆమాయకత్వాన్ని ప్రేమిస్తాడు మోతి. ఆమెను అంతే సున్నితంగా చూసుకుంటాడు. తనకు జ్వరం ఉన్నా ఆమె కోసం విహార యాత్రకు వెళ్ళడం అక్కడ అతను జబ్బు పడడం, ఆమె ఆనందం కోసం ఏమైనా చెస్తానన్నట్లు అతను ప్రదర్శించే నటన చాలా బావుంటుంది. ఆ రెండు పాటలలో కూడా తరానా పట్ల మోతి ప్రేమ నటనా లేక దిలీప్‌కి మధుబాల పట్ల ఉన్న నిజమైన ప్రేమా అన్నది అర్థం కాదు. దిలీప్ కుమార్ అభిమానులయితే ఈ సినిమాలో వారిద్దరి మధ్య కనిపించే కెమెస్ట్రీ ఖచ్చితంగా నటన కాదు అనే చెప్తారు. బేయీమాన్ తోరే నైనవా పాటలో లత గొంతు అమృతాన్ని చిలుకుతుంది. ఈ రెండు పాటలు దిలీప్ సినిమాలలో ఎంచుకోదగ్గ రొమాంటిక్ పాటలు.

“మొసె రూఠ్ గయో మొరా సావరియా కిస్ కి లగి జుల్మి నజరియా” అనే పాట సినిమాలో రెండు సందర్భాలలో వస్తుంది. లత గొంతు మన దేశానికి గొప్ప వరం అని ఒప్పుకుంటాం ఈ పాటలు విన్నాక. ఇక నా కత్యంత ఇష్టమైన పాట “సీనే మే సులగతే హై అర్మాన్” ఈ పాట చరణాలు ఎంత గొప్పగా పలుకుతాయో లతా, తలత్ గొంతులలోంచి. మంచం మీద నిస్సహాయంగా పడుకుని దిలీప్ కళ్ళతో పలికించే దుఃఖం రాళ్లను సైతం కరిగిస్తుంది. మంచి సాహిత్యం, సంగీతం అభినయానికి పెద్ద హంగులు, టెక్నికల్ జిమ్మిక్కులు అవసరం లేదని ఇలాంటి పాటలు చూస్తే అర్థం అవుతుంది.

నా తుఝ్సె గిలా కోయీ హమకో నా కోయీ షికాయత్ దునియా సె

దొ చార్ కదమ్ జబ్ మంజిల్ థీ కిస్మత్ నె ఠొకర్ ఖాయీ హై

సీనే మే సులగతే హై అర్మాన్మ్ ఆంఖో మే ఉదాసీ ఛాయీ హై…..

ఈ చరణంలో దిలీప్ కుమార్‌పై కెమెరా ఫోకస్ ఉంటుంది, కెమెరా వైపు కాకుండా పక్కకు చూస్తుంటాడు దిలీప్. ఆఖరి లైన్ దగ్గరకు వచ్చేసరికి అతని కంటినుండి కారుతున్న కన్నీటి బొట్టూ మెరుస్తుంది. దిలీప్ ఈ పాటతో అమర ప్రేమికుడిగా మన మనసులో గుర్తుండిపోతాడు. నటన అంటే అది. కైఫి ఇరానీ రాసిన మరో పాట “ఎక్ మై హూ ఎక్ మెరీ బేకసి” కూడా తలత్ పాడిన పాట. పాటకి ముందు వచ్చే సాకి ఇలా ఉంటుంది. “జలి జొ షాఖ్-ఎ-చమన్, సాథ్ బాఘ్బన్ భి జలా, జలాకె మెరె నషెమన్, వొ ఆసమాన్ భీ జలా, ఎక్ మై హు ఎక్ మెరి బేఖషి కీ షామ్ హై”, ఇలా మొదలయిన పాట, ఆఖరి చరణం దగ్గరకు వచ్చే సరికి “ఆంసు ముఝ్ పర్ హసొ మెరె ముక్కద్దర్ పర్ హసో, అబ్ కహా వో జిందగి జిస్కా ముహబ్బత్ నామ్ హై” అంటూ ముగుస్తుంది. ఈ పాటలో దిలీప్ సాబ్ ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే ఆ కళ్ళలో బాధను చూస్తే అతనిలోని మెథడ్ ఆక్టర్‌కి సలామ్ కొడతాం. “వో దిన్ కహా గయె బతా” అనే లతా పాట గురించి చెప్పడానికి మాటలు చాలవు. వినాల్సిందే.

సినిమాలో తరానా ప్రేమ కోసం తపించి పోయే మోతిలో బాధ, దైన్యం దిలీప్ అత్యద్బుతంగా ప్రదర్శిస్తారు. సినిమా చివర్లో గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, తామిద్దరు కలిసి గడిపిన ఆ షెడ్ దగ్గరకు మోతి వెళ్ళినప్పుడు అక్కడ తరానాని చూస్తాడు. ఆమె బ్రతికే ఉందని అర్థం అయి ఆమెకు తన మనసు విప్పి బాధను చెప్పుకోవాలనుకున్నప్పుడు, మోతికి వివాహం జరిగిందని అనుకున్న తరానా అతన్ని దగ్గరకు రానివ్వదు. నన్ను ముట్టుకోవద్దు అని అతన్ని దూరం పెడుతుంది. అప్పుడు మోతి ఆమెపై చేయి చేసుకుంటాడు. అన్నాళ్ళ తన బాధ, ఒంటరితనం తాను అనుభవిస్తున్న దుఃఖాన్ని మరోలా అర్థం చేసుకుంటున్న ఆమె అమాయకత్వానికి కోపం వస్తుంది అతనికి. మోతి అంటే తనకు అసహ్యం అని తరానా చెబుతున్నప్పుడు, తన మాట వినిపించుకోనప్పుడు మోతి విసురుగా ఆమెను కొడతాడు. అతను కొట్టే ఆ చెంపదెబ్బలో కూడా ప్రేమను డైరెక్టర్ ఎలా చూపించగలిగాడు అన్నది అర్థం కాని విషయం. తరానా మీద ఉన్న ప్రేమను మరోలా చూపలేని అసహాయత మోతిది. తప్పిపోయి మళ్ళీ దొరికిన బిడ్డను చూసి తల్లి కొట్టడంలా ఉంటుంది ఆ సీన్. అందులో పురుషాధిక్యత కనిపించదు. అసహాయత, ఆమె కారణంగా తాను అనుభవిస్తున్న దుఃఖం, తనకు అందినట్టే అందీ ప్రతిసారి జారిపోయే ఆమె మీద కోపం ఇన్ని మోతి కొట్టే చెంపదెబ్బలో కనిపిస్తాయి. ఆ సీన్‌లో ఆ యిద్దరి భావోద్వేగాలు ఎంత అందంగా కనిపిస్తాయంటే వారితో పోటీకి మరెవ్వరూ రాలేరన్నంత బాగా ఉంటుంది ఆ సీన్.

ఈ ఆఖరి సీన్‌ని ఇంత అందంగా తీయడం వేరెవ్వరి వల్లా కాదు. వారి ప్రేమకు క్లైమాక్స్‌గా ఈ చెంపదెబ్బను తీసుకోవచ్చు. నాకు చాలా ఇష్టమైన సీన్ అది. థప్పడ్ సినిమా చూసి చెంపదెబ్బలపై అందరూ గంభీరంగా చర్చుస్తున్న ప్రతిసారి నాకు ఈ సీన్ గుర్తుకు వచ్చేది. ఏ చర్యలో అయినా ఆధిపత్య భావజాలంతో అర్థం మారుతుందేమో కాని ప్రతి చెంప దెబ్బ ఆధిపత్య భావజాలానికి ప్రాతినిధ్యం వహించదు. ఈ మాటతో ఎవ్వరూ ఏకీభవించకపోయినా సినిమాలలోని రొమాంటిక్ సీన్లలో ఈ చెంపదెబ్బ సీన్ నాకు చాలా ఇష్టమైన సీన్ అని ఒప్పుకోవడానికి నేను పెద్దగా బిడియపడను.

నిజానికి ఈ సినిమాతోనే దిలీప్ కుమార్ మధుబాలల ప్రేమ ఆరంభమయింది. ఆరేళ్ళపాటూ సాగిన ఈ ప్రేమ హిందీ సినీ ప్రపంచంలో నర్గిస్-రాజ్ కపూర్ , దేవ్ ఆనంద్- సురయ్యా ల ప్రేమ గాథలకు దీటుగా నిలుస్తుంది. తరానా సినిమా షూటింగ్ సమయంలో మధుబాల దిలీప్ కుమార్ కు తమ మేకప్ ఆర్టిస్ట్ మేరీతో పింక్ గులాబీ పంపిందని, ఆయన దాన్ని స్వీకరించి ఆ పూవును తన కోటు గుండీ పై పెట్టుకోవటంతో ప్రతీకాత్మకంగా ప్రేమ ఆరంభమని అంటారు. అదే సమయానికి మధుబాల బాదల్ లో ఆమెతో కలసి నటించిన ప్రేం నాథ్ తోనూ ప్రేమలోవుండేదనీ అంటారు. కానీ, దిలీప్ కుమార్‌ను తాను 12 ఏళ్ళ వయసునుంచీ ప్రేమిస్తున్ననని తరానాలో కలసి నటించటంతో కల నిజమయిందనీ మధుబాల చెప్పింది ఇంటర్వ్యూల్లో.. తరానాలో ప్రతి ఫ్రేంలో వారిద్దరి కళ్ళల్లో కనబడే ప్రేమ వారిద్దరిదీ నటన కాదని చెప్పకనే చెప్తుంది. వారిద్దరి ప్రేమ పుకార్లు కూడా తరానా సూపర్ హిట్ అవటంలో తోడ్పడ్డాయి. అయితే, దిలీప్ కుమార్, ప్రేం నాథ్ లు మంచి స్నేహితులు. వారిద్దరూ తమ తమ ప్రేమల గురించి చర్చించుకునేటప్పుడు ఇద్దరూ మధుబాలనే ప్రేమిస్తున్నారని తెలియటం దిలీప్ కుమార్ మధుబాలలు విడిపోవటంలో ప్రధాన పాత్ర పోషించింది. నయాదౌర్ కోర్ట్ కేసు పైకి చెప్పే సాకు మాత్రమే అంటారు. మరణానికి ముందు, చివరగా దిలీప్ కుమార్ తరానా సినిమాలో మధుబాల కళ్ళల్లోకి చూస్తూ.. నీ కళ్ళల్లో కళ్ళు కలిపి చూస్తూ జీవితకాలం గడిపేస్తాను…అన్న సంభాషణ పలికే 2.20నిముషాల దృశ్యాన్ని ట్వీట్ చేశాడంటేనే ఈ సినిమా దిలీప్ కుమార్ మనస్సుకెంత దగ్గరిదో అర్థం చేసుకోవచ్చు.

తరానా సినిమాలో పెద్ద హడావిడి ఉండదు. దిలీప్ కుమార్ బాడీ లాంగ్వేజ్‌లో ఒక గ్రేస్ ఉంటుంది. చాలా మెల్లగా కదులుతాడు అతను స్క్రీన్ పైన. ఆ హడావిడి పడుకుండా నిలకడగా ఎమోషన్స్ పలికించడమే అతనిలోని గొప్పతనం కావచ్చు. మోతి పాత్రను మాత్రను అద్భుతంగా పండించారు ఆయన. అందుకే నాకిష్టమైన ప్రేమ కథలలో తరానా మొదటి స్థానంలో ఉంటుంది. ఇక అనీల్ బిస్వాస్ సంగీతం లోని మధురిమ అనుభవించవలసిందే. నా వరకు ‘ముఘల్-ఎ-ఆజం’లో కన్నా దిలీల్ మధుబాలల జోడి ఈ సినిమాలో గొప్పగా ఉంటుంది. సినిమాకు రామ్ దర్యాని దర్శకత్వం వహిస్తే షీలా పాత్రలో శ్యామా నటించారు. సైడ్ రోల్ అయినా శ్యామా పాత్రను కూడా అంతే ఉన్నతంగా మలిచారు దర్శకులు. ఈ సినిమాకు మంచి పాటలందించిన మాధోక్ దీనికి మాటలు కూడా రాసారు. చూసి ఆస్వాదించవలసిన గొప్ప ప్రేమ కథ ఇది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here