ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 31 – మషాల్

0
5

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో అత్యద్భుత నటన కనపరిచిన సినిమా ‘మషాల్’

[dropcap]ది[/dropcap]లీప్ కుమార్ హీరోగా చేయడం మానేసాక తరువాత కొన్ని కారెక్టర్ రోల్సు చేసారు. అందులో మర్చిపోలేని నటనను చూపించిన చిత్రం ‘మషాల్’. 1984లో యష్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా దిలీప్ కుమార్ నటనా పటిమకు గొప్ప ఉదాహరణ. తక్కువ సినిమాలు చేసినా దిలీప్ సాబ్ గొప్పతనం ఏమిటి అంటే ఒక నటుడుకి తనను తాను నిరుపించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన సీన్లు ఉండాలి. ఆ నటుడి పేరు చెబితే ఆ సీన్ మన కళ్ళ ముందు కదలాలి. అలాంటి పుల్ లెంత్ సీన్లు హీరోలమని చెప్పుకునే వారందరికీ రావు. ఆ స్థాయిలో చేయలేరు చాలా మంది నటులు. కాని దిలీప్ కుమార్‌కు అతని నటనను నిరూపించుకోగలిగిన పూర్తి నిడవి సీన్లు చాలా ఉన్నాయి. ముఘల్-ఎ-ఆజంలో పృథ్వీరాజ్ కపూర్‌తో సంభాషణ, దిల్ దియా దర్ద్ లియాలో  దేవుని విగ్రహం దగ్గర అతను జరిపిన సంభాషణ, దేవదాస్‌లో చంద్రముఖి దగ్గర, మధుమతిలో ప్రాణ్‌తో పతాక సన్నివేశం, దాగ్‌లో లలితా పవార్ దగ్గర ఇలా చాలా వరకు దిలీప్ సినిమాలలో అతనొక్కడి నటనను హైలైట్ చేసిన సీన్లు ఉంటాయి. అవే ఆయనని ప్రేక్షకులకు దగ్గర చేసాయి.

సపోర్టింగ్ యాక్టర్‌గా అయన మారిన తరువాత దిలీప్ కుమార్ మాత్రమే చేయగల సీన్లు రచయితలు అతని కోసం సృష్టించడం తగ్గిపోయింది. కొత్త తరం వచ్చేసి దిలీప్ సాబ్ హవా పడిపోయింది. అయినా ఆయనికి మాత్రమే సొంతమైన డైలాగ్ డెలివరీతో ఆయన ఎన్నుకుని చేసిన కొన్ని పాత్రలకు మరెవ్వరు అలా చేయలేరు అనే స్థాయిలో న్యాయం చేసారు దిలీప్ కుమార్. సపోర్టింగ్ యాక్టర్‌గా కూడా మిగతా నటులను పక్కకు తోసి దిలీప్ కుమార్ నటన ఎలివేట్ అయే సీన్లు ఆ తరువాతి సినిమాలలో కూడా చాలా కనిపిస్తాయి. అలాంటి ఒక సీన్, మర్చిపోలేని అసమాన నటన, దిలీప్ కుమార్ ప్రతిభకు ఉదాహరణ, మషాల్‌లో కనిపిస్తుంది. భార్యను హాస్పటల్‌కు తీసుకువెళ్ళడానికి కార్లను ఆపి జనాన్ని బ్రతిమిలాడుకునే సీన్‌లో దిలీప్ కుమార్‌ది మనం ఎప్పటికీ మరచిపోలేని అద్భుతమైన పర్ఫార్మెన్స్. దిలీప్ కుమార్‌  నచ్చనివారు, చాలా పాత యాక్టర్ అనో అతని సినిమాలు అర్దం కావు అనో కొట్టిపడేసే నవతరం ఆ ఒక్క్ సీన్ చూస్తే ఈ రోజు ఇలా ఆయన ప్రతి సినిమాను విశ్లేషించవలసిన అవసరం మాలాంటి దిలీప్ కుమార్ అభిమానులకు ఎందుకు కలిగిందో అర్థం అవుతుంది. దిలీప్ కుమార్ నటనను స్టడీ చేయడం ప్రతి ఒక్క భారతీయ సినీ ప్రేమికుని అవసరం. ఆయనను ప్రస్తావించకుండా భారతీయ సినిమా లేదు.

‘మషాల్’ సినిమా కథకు ఆధారం వసంత్ కనేట్కర్ రచించిన ప్రఖ్యాత మరాఠీ నాటకం “అశ్రూంచి ఝాలి ఫూలె”. దీన్ని 1969లో అశోక్ కుమార్, నిరూపా రాయ్, దెబ్ మిఖర్జీలతో “ఆంసూ బన్ గయే ఫూల్” అనే సినిమాగా కొంత మార్చి తీసారు. మషాల్ సినిమా  సమయానికి రచయితగా జావేద్ అఖ్తర్ మంచి ఫాంలో ఉన్నారు. అప్పటీ దాకా సలీమ్ జావేద్‌లు ఇద్దరు కలిసి సినిమాలకు రాస్తున్నా, జావేద్ తానొక్కరే “బేతాబ్” సినిమా నుండి రాయడం మొదలెట్టారు. మషాల్ జావేద్ అఖ్తర్ ఒక్కడే  రాసిన మూడవ సినిమా. ఈ సినిమాకు ఆయనే కథ, మాటలు, పాటలు అందించారు. దిలీప్ కుమార్‌కు జోడీగా వహిదా రెహమాన్ నటిస్తే, అనీల్ కపూర్ మరో ముఖ్య పాత్రలో కనిపిస్తారు. అనిల్ కపుర్ కంటే ముందు ఈ పాత్రకి అమితాబ్ బచ్చన్‌ని అనుకున్నారు. అయితే   “శక్తి” సినిమాలో దిలీప్ కుమార్‌కి కొడుకుగా నటించిన అమితాబ్ ఏవో కారణాల వల్ల ఈ సినిమా చేయనన్నారట. తరువాత కమల్ హాసన్‌ను అనుకున్నారు. అదీ కుదరకపోతే జావేద్ అఖ్తర్, షబానా అజ్మీల సిఫారసుతో అనీల్ కపూర్‌ని తీసుకున్నారు. దిలీప్ కుమార్ లాంటి నట దిగ్గజంతో పోటీ పడి నటించినందుకు అనిల్ కపూర్ ఆ సంవత్సరం ఉత్తమ సహాయ నటుడి ఫిలింఫేర్ అవార్డు గెలుచుకున్నారు. ఈ సినిమా విడుదల అయిన రోజే మరో రెండు సినిమాలు ఒప్పుకున్న అనిల్ కపూర్ తరువాత వెనుతిరిగి చూడలేదు.

సినిమా కథకు వస్తే ఒక సాధారణ మధ్యతరగతి పత్రికా ప్రతినిధి వినోద్ కుమార్. భార్య సుధ భర్త ఆదర్శాలను తూచ తప్పక పాటించే ఇల్లాలు. విలువలు లేని చోట పని చేయలేక ఉద్యోగాన్ని వదిలివేసి స్నేహితుని సహాయంతో ఒక చిన్న బస్తీలో చోటు సంపాదించి తానే సొంతంగా పత్రిక నడుపుతుంటాడు వినోద్. ఎస్. కె. వర్ధన్ బాంబేలో డ్రగ్ డీలింగ్ చేసే ఒక డాన్. అతని చీకటి ప్రపంచాన్ని లోకానికి పరిచయం చేస్తాడు వినోద్. కక్ష కట్టిన వర్ధన్ అతన్ని ముందు కొనాలనుకుంటాడు. కుదరక అతని ప్రెస్ కాల్చేసి చివరకు వినోద్ కుటుంబానికి నిలువ నీడలేని స్థితికి తీసుకువస్తాడు. ఉండే చోటు లేక ఇంటి నుండి గెంటివేయబడినా భయపడడు వినోద్. కాని అతని భార్య అనారోగ్యంతో రోడ్డు మీద కొట్టుకుంటూ ప్రాణాలు విడుస్తుంది. ఆదుకునే మానవుడు లేక తన నిజాయితీకి శిక్షగా భార్యను రోడ్డు మీద నుండి లేపి సమయానికి హాస్పటల్‌కు తీసుకువెళ్ళేవాళ్ళు లేక అర్ధరాత్రి ఆమె తన చేతుల్లో నిస్సహాయంగా   ప్రాణాలు వదిలేయడం చూసిన వినోద్‌లో నిజాయితీ చచ్చిపోతుంది. తనని ఆ స్థితిలో ఆదుకోని బొంబాయి నగరానికి, తనని ఆ స్థితికి తీసుకువచ్చిన వర్ధన్‌కి జవాబు చెప్పాలనుకుంటాడు. చీకటి వ్యాపారంలో ప్రవేశించి వర్ధన్‌కి పోటీ అవుతాడు.

వినోద్ ఉండే బస్తీలో చిల్లర దొంగతనాలు చేస్తూ ఉండే రౌడీ రాజా. ఒక చిన్న గొడవతో అతనికి వినోద్‌తో పరిచయం అవుతుంది. సుధ లోని అమ్మతనానికి రాజా ఆకర్షిస్తుడవుతాడు. అనాథ అయిన రాజా ఈ దంపతుల సాంగత్యంలో తాను ఇది వరకు చేసే బ్లాక్ టికెటింగ్, దొంగతనాలు, రౌడీ వసూళ్ళు మాని మనిషిలా బ్రతకాలని నిర్ణయించుకుంటాడు. అతన్ని చదువు కోసం వినోద్ బెంగుళూరు పంపిస్తాడు. రాజా తిరిగి బొంబాయి వచ్చే సరికి వినోద్ బొంబాయి నేర ప్రపంచానికి రాజు. రాజా నిజాయితీగా బ్రతకాలనుకునే ఒక జర్నలిస్ట్‌గా చీకటి సామ్రాజాన్ని పాలిస్తున్న వారిని చట్టానికి పట్టించాలని కృషి చేస్తూ ఉంటాడు. తనను దుర్మార్గం నుండి సన్మార్గం వైపుకు తీసుకు వచ్చిన వినోద్ కుమార్ ఇప్పుడు చీకటి సామ్రాజ్యానికి రాజు అని తెలుసుకుని రాజా ఆశ్చర్యపోతాడు. అతని లోని మార్పు వెనుక కారణాలను వినోద్ ద్వారానే తెలుసుకుని రాజా బాధపడతాడు. వినోద్‌ను మరలా సన్మార్గంలోకి తీసుకురావాలని ఆలోచిస్తాడు. కాని అది ఎలా మొదలవ్వాలో తెలీని పరిస్థితి.

తన పత్రిక ద్వారా రాజా నగరంలోని చీకటి సామ్రాజ్యాన్ని ప్రజల ముందుకు నిర్భయంగా తీసుకువచ్చే పనిలో వినోద్ కుమార్ గురించి పూర్తి సమాచారం సేకరించాల్సి వస్తుంది. తన కొత్త జీవితానికి మార్గం చూపిన వ్యక్తినే తాను చట్టం ముందు నిలబెట్టవలసి వస్తుందని అతనికి అర్థం అవుతుంది. వినోద్‌ను రాజా కలిసి తాను సేకరించిన సమాచారాన్ని చూపించి అతనా మార్గం ఎందుకు ఎంచుకున్నాడో తెలుసుకున్నాక బాధపడి, ఏది ఏమైనా వినోద్ ఒకప్పటి సిద్దాంతాల పైనే తన భవిష్యత్తుని నిర్మించుకున్నానని, తప్పుని తప్పుగా గుర్తించడం తన కర్తవ్యం అని ఆ మార్గంలో వినోద్‌కు  ఎదురు తిరగవలసిన స్థితి వస్తే తాను అందుకు సిద్దమని రాజా చెబుతాడు. తాను ఒకప్పుడు నమ్మిన నిజాయితీని, సమాజంలో మరణించిందనుకున్న న్యాయాన్ని ఇప్పుడు బ్రతికించే వ్యక్తిగా తన పుత్రుడి స్థానంలో రాజాని చూసిన దిలీప్ అతన్నిఅతని మార్గం నుండి మరలి పొమ్మని చెప్పడు. తాను ఎంచుకున్న మార్గాన్ని కూడా సమర్థించడు. ఒక తండ్రిగా రాజాకు విజయం కలగాలని ఆశీర్వదిస్తాడు. కాని తాను చాలా దూరం ప్రయాణించానని, తన పగ చల్లారే దాకా విశ్రమించనని రాజాకు చెబుతాడు. చివరకు రాజాని కాపాడి, వర్ధన్ పతనాన్ని చూసి, రాజా చేతిలోనే తృప్తిగా మరణిస్తాడు వినోద్. మషాల్ సినిమాలోని వినోద్ కుమార్ పాత్ర దిలీప్ కుమార్ కెరియర్‌లో ఒక ఉత్తమ పాత్రగా నిలిచిపోతుంది.

ఇందులో చాలా సీన్లల్లో దిలీప్ కుమార్ నటన ఉత్తమ  స్థాయిలో ఉంటుంది. ముఖ్యంగా వహీదాని రోడ్డు మీద పడుకోబెట్టుకుని కార్లని ఆపమని బ్రతిమాలుకునే నిజాయితీపరుడైన మధ్య తరగతి వ్యక్తిగా దిలీప్ చేసిన ఆ ఒక్క సీన్ సినిమాకు హైలైట్, అక్కడ దిలీప్ కనిపించరు. ఒక్క నిస్సహాయ నిజాయితీ కనిపిస్తుంది. అతని గొంతులోని ఆ భయం, నిస్సహాయత, కోపంతో కలిసిన జీర చాలా రోజులదాకా వెంటాడుతుంది. “అరే భాయ్ కోయీ హై,, కోయే హై మెరీ బీవీ బీమార్ హై.. ఆస్పతాల్ పహుంచా దో వర్నా వొ మర్ జాయెగీ” అంటూ అతను ఆ నడి వీధిలో చేసే ఆక్రందన మనల్ని కుదిపేస్తుంది.

మషాల్ సినిమాలో వహీదా మరణించే దృశ్యంలో రోడ్డుపై నిలచి నిస్సహాయంగా ఆక్రందించే దృశ్యంలో నటించటానికి దిలీప్ కుమార్ కు ప్రేరణ నిజజీవితం నుంచి లభించింది. అతని సోదరుడు ఆయూబ్ ఖాన్ మరణించిన సమయంలో తండ్రి మహమ్మద్ సర్వర్ ఖాన్ ముఖంలో కనిపించిన వేదన , కొదుకు మరణించాడని తెలియగానే తల్లి స్పృహ తప్పి పడిపోతే తండ్రి చేసిన ఆక్రందన తన మనస్సులో ముద్రించుకుపోయాయని, ఆ జ్ఞాపకాన్ని తన నటనలో ప్రదర్శించి సజీవంగా ప్రేక్షకుల ముందు నిలిపానని దిలీప్ కుమార్ తన జీవిత చరిత్ర  Dileep Kumaar: The Substance and the Shadow  లో చెప్పారు. ఈ సీన్ ను షూట్ చేసేందుకు 4 రోజులు పట్టిందని, ఆ నాలుగు రోజులూ తాను తాజ్ లో అందరికీ దూరమ్హా ఒంటరిగా తనలోకి తాను చూకుంటూ వున్నాననీ రాశారు. ఆ దృశ్యాన్ని ఒకే టేక్ లో చేస్తానని యాష్ చోప్రాతో చెప్పిన దిలీప్ కుమార్ మూడోరోజు షూటింగ్ కు వచ్చారు. జ్వరంలో వున్నా అర్ధరాత్రి దాకా షూటింగ్ చేసి ఓకే అనిపించారు. అయితే, సీన్ షూటింగ్ అయిన తరువాత అంతటా నిశ్శబ్దం నెలకొందనీ, అందరి కళ్ళల్లో నీళ్ళున్నాయనీ, అది చూసి తాను చలించిపోయాననీ, ఒక నటుడికి ఇంతకన్నా గొప్ప బహుమతి మరొకటిలేదనీ తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. ఈ సందర్భంగా నిజజీవితంలోని అనుభవాలు నటనను ప్రభావితం చేయటం గురించి వ్యాఖ్యానిస్తూ దిలీప్ కుమార్ చేసిన వ్యాఖ్య ప్రతి నటుడూ గుర్తుంచుకోవాల్సిన వ్యాఖ్య.

“No matter how much an actor may have in his emotional reservoir as personally experienced moments to build his make-believe responses before the cameras, when it actually comes to giving a final take, it takes all that he has and much more to render the scene credibly and powerfully.”

సుధ పాత్రలో వహీదా రెహమాన్ కూడా దిలీప్ కుమార్‌కు పోటీగా నటించారు. వహీదా దిలీప్ కుమార్లు కలిసి చేసిన ఆఖరి సినిమా ఇది. యష్ చోప్రా సినిమాలలో వహిదాకు ఎప్పుడూ సాత్వికమైన స్త్రీ పాత్రలే లభించాయి. వాటిని ఆమె అలవోకగా నటించి నీరాజనాలు అందుకున్నారు. అనిల్ కపూర్‌కు జోడిగా రతి అగ్నిహోత్రి నటించారు. ఈ సినిమాలో వీరిద్దరిపై చిత్రించిన “ముఝె తుమ్ యాద్ రఖనా” పాట చాలా పాపులర్ డ్యూయెట్. అలాగే “ఫుట్పాథ్ కే హమ్ రెహనే వాలే” అన్న పాట కూడా బావుంటుంది.ఇందులో మరో పాట” హోలీ ఆయి రే”, ఉత్తర భారతదేశంలో హోలీ పాటలలోఈ రోజుకీ వినిపిస్తూ ఉంటుంది.  మషాల్ సినిమాలో గొప్ప పాట కిషోర్ కుమార్ పాడిన లియే సప్నే నిగాహోమే…ఈ పాటలో జావేద్ అఖ్తర్ పలికించిన భావాలు మ్రృదువయినవి, మరపురానివి. ఒక రకంగా, ఈ పాట అనిల్ కపూర్ గుర్తింపు పాటగా ఎదిగింది. ఇదే రకమైన భావాలను జావేద్ అఖ్తర్ తరువాత యెస్ బా సినిమాలో షాహ్ రుఖ్ ఖాన్ కోసం చాంద్ తారే తోడ్ లావూన్ లో రాశారు. అదీ షాహ్ రుఖ్ గుర్తింపుపాటలా ఎదిగింది.  ఈ సినిమాకు లతా మంగేష్కర్ సోదరుడు హృదయనాధ్ మంగేష్కర్ సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా సినిమాటోగ్రఫీకి మొదట కె గీ ని అనుకున్నారు. ఈయన దీవార్, సిల్సిలా సినిమాలకు సినిమాటోగ్రఫర్‌గా పని చేసి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆయన హార్ట్ ఎటాక్‌తో చనిపోయారు. తరువాత అతని సహాయకుడు కిషన్ శర్మకు ఆ అవకాశం వచ్చింది. కాని షూటింగ్ సమయంలో క్రేన్ మీద నుండి పడి అతను మరణించారు. ఆ తరువాత సంతోశ్ శివన్ ఆ భాద్యతలు చేపట్టారు. ఈ సినిమాలో గమనించవలసిన విషయం ఎంటంటే జర్నలిజాన్ని సమాజానికి దారి చూపే మార్గంగా చూపించడం. అప్పటి దాకా హిందీ సినిమాలలో జర్నలిజం బేస్ చేసుకుని గొప్ప సినిమాలు రాలేదు. మషాల్ తరువాతే జర్నలిజానికి సినీ ప్రపంచంలో సమాజాన్ని ప్రభావితం చేసే వృత్తిగా గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఈ సబ్జెక్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి కూడా.

మషాల్ సినిమా హిందీ సినీ ప్రపంచంలో ఒక కీలకమైన దశలో వచ్చి భావి సినిమాలపై ప్రభావం చూపించింది. 1980లలో అర్ధం పర్ధంలేని ప్రతీకారపు డిషుం డిషుం సినిమాల నడుమ అర్ధవంతమయిన మషాల్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రొమాంటిక్ సినిమాలు నిర్మించే యష్ చోప్రా ఈ సినిమాను నిర్మించటం ఒక విశేషం. అయితే, ఈ సినిమా ప్రభావంతో గాంగులు గా ఏర్పడే యువత ఆధారంగా, అంకుష్, అర్జున్ వంటి సినిమాలు వచ్చాయి. అండర్ వల్డ్‌కూ పేద గుడిసెవాసులకూ నడుమ ఘర్షణలను చూపే అంగార్, వాస్తవ్ లాంటి సినిమాలూ మషాల్ ప్రభావంతో నిర్మించినేఅ. న్యూ ఢిల్లి, సుర్ఖియాన్, మైన్ ఆజాడ్ హూన్ వంతి సినిమాలు పత్రిక స్వేఛ్చ ఆధారంగా రూపొందించేందుకు ప్రేరణ మషాల్. క్రాంతివీర్ సినిమాలో జర్నలిస్ట్ పాత్ర (దింపుల్ కపాడియా), మషాల్ లో దిలీప్ కుమార్ పాత్రకు నకలు. అలాగే, జాకీ ష్రోఫ్, అక్షయీ ఖన్నాలు నటించిన లావారిస్ పూర్తిగా మషాల్ కాపీ.

మషాల్ సినిమా మరోసారి దిలీప్ కుమార్ ప్రతిభను అప్పటి తరానికి పరిచయం చేసింది. దిలీప్ కుమార్ చేసిన చాలా పాత్రలు వారు తప్ప మరెవ్వరు చేయలేరు అనిపించినవే. ఆ కోవలోకే వస్తుంది మషాల్ సినిమాలోని వినోద్ పాత్ర. 1985లో మషాల్ సినిమాకు గాను దిలీప్ కుమార్ మరోసారి ఉత్తమ నటుడి కేటగిరిలో ఫిలింఫేర్ నామినేషన్ పొందారు. కాని ఆ సంవత్సరం ఫిలింఫేర్ అవార్డులు పరిశీలిస్తే ప్రేక్షకుల ట్రెండ్ చాలా మారింది. బరిలో నిల్చిన పారెలెల్ సినిమాలు విజృంభించాయి. వాస్తవిక సినిమాను కోరుకుంటున్న ప్రజల సంఖ్య ఎనభైలలో ఎక్కువగా ఉండింది. మషాల్‌లో దిలీప్ కుమార్ నటనను తీసేస్తే అది పూర్తి కమర్షియల్ సినిమా. ఆ సంవత్సరం సాయి పరాంజపే స్పర్శ్, అనుపమ్ ఖేర్ సారాంశ్, రవి బాస్వాని జానే బీ దో యారో, మ్రిణాల్ సేన్ ఖాందహార్ లాంటి చిత్రాలు అవార్డుల కోసం పోటీ పడ్డాయి. చాలా అవార్డులు పారెలెల్ సినిమాలకు లభించాయి. అలా దిలీప్ కుమార్‌కు కాకుండా అనుపమ్ ఖేర్‌కి సారాంశ్ సినిమాకు ఆ అవార్డు లభించింది. సారాంశ్ గొప్ప సినిమా కాని దిలీప్ కుమార్ అభిమానులు వారికి ఈ సినిమాకు అవార్డు రాకపోవడం దురదృష్టం అని ఈ రోజుకీ చెప్పుకుంటారు. దిలీప్ కుమార్ నటనా వైభవాన్ని స్మరించుకునేటప్పుడు మర్చిపోలేని చిత్రం మషాల్. “ఇధిలె ఇనియమ్ వరు” అనే పేరుతో మషాల్‌ను మళయాళంలో మమ్మూట్టీ ప్రధాన పాత్రగా నిర్మించారు. మమ్ముట్టీ చాలా గొప్ప నటుడు కాని ఆ పాత్రకు మాత్రం దిలీప్ సాబ్‌కే మార్కులు పడతాయి. రెండు భాషలలో ఈ సినిమా చూసి ఈ మాట ఇక్కడ నిస్సంకోచంగా రాయగలుగుతున్నాను. దిలీప్ సాబ్ నటనకు జేజేలు పలకవలసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here