ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 33 – రాం ఔర్ శ్యాం

2
10

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్‌కు ఏడవ ఫిలింఫేర్ అవార్డు తీసుకువచ్చిన రాం ఔర్ శ్యాం

[dropcap]తె[/dropcap]లుగులో 1964లో ఎన్.టి.ఆర్. నటించిన ‘రాముడు భీముడు’ని హిందీలో 1967లో ‘రామ్ ఔర్ శ్యాం’గా రీమేక్ చేసారు. 1965లో ఇదే సినిమాను ఎం.జి.ఆర్‌తో తమిళంలో తీసారు. అలెగ్జాండర్ డుమస్ ‘ది కార్సికన్ బ్రదర్స్’ నవల నుండి ప్రభావితమయి రాసుకున్న కథ ఇది. పూర్తి కామెడి సినిమా. దిలీప్ కుమార్ మొదటి సారి డబల్ యాక్షన్‌తో కనిపించిన సినిమా కూడా ఇదే. తరువాత బాలీవుడ్‌లో చాలా సినిమాలు ఈ కథ ఆధారంగా వచ్చాయి.

‘రామ్ ఔర్ శ్యామ్’ సినిమా ఇప్పటి తరానికి అంతగా నచ్చకపోవచ్చు. ఆ రోజులలోని వ్యక్తులను టెక్నాలజీని మనసులో పెట్టుకొని ఇది కేవలం ఎంటర్టెయిన్మెంట్ కోసం తీసిన సినిమాగా చూడాలి. డబల్ రోల్ సాధ్యమేనా అన్న అశ్చర్యంతో ఇంకా అప్పటి ప్రేక్షకులు ఉండేవారు. అమాయకుడైన రామ్‌గా, దుడుకువాడైన శ్యాం గా రెండు పాత్రల విభిన్న స్వభాలను దిలీప్ కుమార్ చక్కగా అభినయించారు ఒకే స్క్రీన్ మీద. ఈ సినిమాకు తాపి చాణక్య గారే దర్శకత్వం వహించారు. డి.వి నరసరాజు గారు కథ అందించారు. మార్కస్ బార్ట్లేది సినిమాటోగ్రఫీ. దిలీప్ కుమార్ సినిమాలకు ఎక్కువగా సంగీత దర్శకత్వం వహిచింది నౌషాద్. ఈ సినిమాలో కూడా వారు సంగీత దర్శకత్వం వహించిన ఆరు పాటలున్నాయి. రఫీ, లత, ఆశా. మహేంద్ర కపూర్ ఆ పాటలను గానం చేసారు. దిలీప్ కుమార్‌పై చాలా గొప్ప పాటలు పిక్సరైజ్ అయ్యాయి. కాని వ్యక్తిగతంగా దిలీప్ సాబ్‌తో నేను కనెక్ట్ అయిన పాటలు ఫుట్‌పాథ్ సినిమాలో తలత్ పాడిన “షామె గమ్ కీ కసం” అనే పాట, మధుమతిలో “టూటే హుయె ఖాభో నే” అన్న పాట, రాం ఔర్ శ్యాం లో “ఆజ్ కీ రాత్ మేరే” అన్న పాట. ఇంకా చాలా గొప్ప పాటలున్నాయి వారి పైన. కాని ఈ మూడు పాటలలో దిలీప్ సాబ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ మూడు పాటలను అలి సర్దర్ జఫ్రి,  మజ్రూహ్, శైలేంద్ర, షకీల్ బదాయినీలు రాసారు. ఆ పదాలలోని విషాదం, నిరాశ, వేదన మనసుకు చాలా దగ్గరగా వస్తాయి.

ఇష్టం అన్నది వ్యక్తిగతం అయినా కొన్నిపాటలు కొందరిని ఒక ట్రాన్స్ లోకి తీసుకువెళతాయి. రఫీ గొంతుతో వచ్చే ఎన్నో పాటలు ఒక అలౌకిక ప్రపంచానికి చేరువ చేస్తాయి. అందులో విషాదం కావచ్చు ప్రేమ కావచ్చు. ఆ ఇంటెన్సిటీ లోని నిజాయితీని అనుభవిస్తే ఇక జీవితంలో ఇంకేం వద్దు అనే స్థితికి   చేరుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. దిలీప్ కుమార్ నటనను కూడా నేను ఇష్టపడడానికి ముఖ్య కారణం ఆ ఇంటెన్సిటి. కథ బావోలేకపోయినా, కొన్ని కథలలో విషాదం అనవసరం అనిపించినా అతను ఎంత ఇంటెన్స్‌గా ఆ పాత్రలో లీనం అవుతాడంటే నిజాయితీగా ఆ పాత్రలను అతను ఓన్ చేసుకున్న విధానం కారణంగా అతని సినిమాలలో చూపే భావజాలాన్ని చాలాసార్లు వ్యతిరేకించినా దిలీప్ కుమార్‌ని ప్రేమించకుండా ఉండలేం. నటనలో ఆ ఇన్వాల్వ్‌మెంట్, ఆ లోతు, నాకు దిలీప్ కుమార్ కాకుండా ఒక్క సంజీవ్ కుమార్‌లో మాత్రమే కనిపిస్తుంది (ఇది కమర్షియల్ సినిమాని దృష్టిలో పెట్టుకుని చెబుతున్న మాట).

రామ్ ఔర్ శ్యాం లో   అమాయకుడు రాం. అతని బావ చూపే క్రూరత్వం వలన, తనపై తనకు నమ్మకం లేక, న్యూనతా భావంతో కుచించుకు పోతూ ఎందుకూ పనికిరాని వాడిగా ఉంటాడు రాం. మరో చోట పెరుగుతున్న శ్యాం మొండివాడు, బలవంతుడు. ఇద్దరూ తారుమారయి ఒకరి స్థానంలోకి మరొకరు వస్తారు. రామ్ ఇంటికి చేరిన శ్యాం అంజనను ప్రేమించడం, శ్యాం స్థానంలో రామ్ అక్కడ శాంతతో ప్రేమలో పడడం. బావ గజేంద్రకు బుద్ధి చెప్పి శ్యాం, రాం లు ఒకటవడం, వారిద్దరూ చిన్నప్పుడు తప్పిపోయిన కవలలు అని తెలియడం, ప్రేమించిన వారిని ఇద్దరూ పెళ్ళి చేసుకోవడం కథ. గజేంద్ర కొరడాతో కొడుతున్నప్పుడూ దాన్ని శ్యాం లాక్కుని గజేంద్రకు బుద్ది చెప్పడం, అక్క కూతురు పుట్టినరోజు నాడు ఆడి పాడే దిలీప్‌ను చూడడం బావుంటుంది. కథతో ప్రమేయం లేకుండా ఈ రెండు సీన్లు బావుంటాయి. లాజికల్ సినిమాను చాలా ఇష్టపడే నేను ఏ లాజిక్ లేకపోయినా కొన్ని సినిమాలను చూడడానికి ఉత్సాహం చూపుతాను – అది దిలీప్ కుమార్, సంజీవ్ కుమార్లు ఉంటే. అందుకే చాలా మందికి బోర్ అనిపించే రాం ఔర్ శ్యాం నాకు నచ్చుతుంది. ఇందులో “ఆజ్ కీ రాత్ మేరే” పాట మరీ మరీ ఇష్టం.

తన మొదటి సినిమా దర్ద్ తోనే సినీ ప్రపంచంలో విజయాన్ని చూసిన షకీల్ బదాయిని ప్రేమ పాటలకు పెట్టింది పేరు. ఈయన నౌషాద్‌తో ఎక్కువగా పని చేసారు. వీరిద్దరు కలిసి కొన్ని మర్చిపోలేని పాటలను హిందీ శ్రోతలకు ఇచ్చారు. నౌషాద్‌తో వీరికి అపురూపమైన స్నేహం ఉండేది. టీ.బీ.తో శానిటోరియంలో ఉంటున్నప్పుడు షకీల్ దగ్గర డబ్బు లేదని, అతనికి మూడు సినిమాలు ఇప్పించి మామూలుగా కన్నా ఎక్కువ పారితోషకం వాటి ద్వారా వచ్చేలా చేసి నౌషాద్ ఒక కళాకారుడిగా, స్నేహితుడిగా షకీల్‌ని వ్యక్తిగతంగా, మానసికంగా ఆదుకున్నారు. షకీల్ ఎన్నో గొప్ప పాటలు రాసారు. రాం ఔర్ శ్యాం కి వీరు రాసిన పాటలలో “ఆజ్ కీ రాత్ మేరే” అన్న పాటలోని పదాలు చూస్తే వారి కలానికున్న మనసు తెలుస్తుంది.

శ్యాం, రామ్‌గా ఆ ఇంట ప్రవేశించి అంజనను ప్రేమిస్తాడు. అయితే అంజనతో నిశ్చితార్థం జరగవలసినప్పుడు అతను ఆ నిశ్చితార్థానికి ఒప్పుకోడు. రాం గా ఆమెతో బంధం ముడేసుకోవడం మోసం అని అతనికి తెలుసు. అయితే అతను ఎందుకు వివాహం ఒద్దని అంటున్నాడో అంజనకు, మిగతా వారికి అర్థం కాదు. అలాంటి సందర్భంలో ఆమె పుట్టినరోజుకు ఆమెను కలవడానికి వెళ్ళవలసిన అవసరం వస్తుంది శ్యాంకి. అక్కడ పియానో మీద ఈ పాట పాడతాడు అతను, తన పరిస్థితిని, తన ప్రేమను తన నిస్సహాయత్వాన్ని ఆమెని వినిపిస్తాడు. ఇక్కడ దిలీప్ కుమార్ మొహంలో భావాలు, రఫీ గానం, ఆ సాహిత్యానికి ఎంత న్యాయం చేసాయో చూడవచ్చు. దిలీప్ కుమార్ సమాజానికి పనికి వచ్చే సినిమాలు చేయలేదు, సందేశాలు ఇచ్చే పాత్రలు చేయలేదు. కాని మనిషి మనసులో ఉన్న ప్రేమను, ప్రేమించడంలోని వ్యథను, ఆ వ్యథ వెనుక ఉన్న జీవన అర్థాన్ని గొప్పగా చూపించారు తన అన్ని పాత్రలలో కూడా. ఒక్క “కోయీ సాగర్ దిల్ కో బహలాతా నహీ” అన్న పాట కోసం దిల్ దియా దర్ద్ లియా ను భరించాం, “యె మెరా దీవానాపన్ హై” కోసం యహూదిని భరిస్తాం, “జవానీ మే ముహబ్బత్ కీ ఘడియా” అన్న పాట కోసం పైగామ్‌ను భరించాం, “తెరె హుస్న్ కీ క్యా తారీఫ్ కరూ” అన్న పాట కోసం లీడర్‌ని భరించాం, “యే హవా యె రాత్ యె చాందనీ” అన్న పాట కోసం ఎన్ని సంగ్దిల్ లనయినా భరిస్తాం.

ఈ పాటలలో రచయిత గొప్పతనంతో పాటు, గాయకుడి ప్రతిభతో పాటు దిలీప్ నటన అవసరమవుతుంది. ఆ మూడూ కలిస్తేనే ఆ పాట సొగసు ఇనుమడిస్తుంది. ఇప్పటి సినిమాలలో పాట వస్తే సెల్ ఫోన్లు చెక్ చేసుకోవడం, లేదా కాగితాలు చింపి స్క్రీన్ పైకి విసిరే వారికి, ఒక తరంలో అ పాటలను పెద్ద స్క్రీన్‌పై చూస్తూ వింటూ అస్వాదించాలనీ కోరికతో కొన్ని సినిమాలను భరించిన వారు ఉన్నారని తెలీదు. ఇప్పుడు మంచి పాట ఎక్కడయినా, ఎలాగయినా వినవచ్చు. కాని దిలీప్ కుమార్‌లా నటించే మరో దిలీప్ ఉంటే మజ్రూహ్, శైలేంద్రలు లాగా రాసే కవులకు ప్రేక్షకులకు ఇంకా దగ్గరవుతారు. రఫీ లాంటి గాయకులు అలా ఆ సాహిత్యాన్ని ఆలాపించగలితితే, వారు పూజింపబడతారు. కొన్ని సార్లు ఈ మూడు కాంబినేషన్లలో ఎవరు గొప్ప అనో ఎవరిని వదిలేయాలో తెలియనంతగా మమేకమవుతాయి పాత పాటలు. ఈ ఆనందాన్ని ఆ తరం అనుభవించినంతగా, ఆస్వాదించినంతగా మరే తరం చేయలేదు, చేయలేరేమో కూడా.

పై పాటను ఉదాహణగా తీసుకోండి పాటకు ముందు వచ్చె సాకిలో “యె రాత్ జైసె దుల్హన్ బన్ గయీ హై చిరాగో సె, కరూంగా ఉజాలా మై దిల్ కె దాగో సె” అని అంటారు రచయిత. “పెళ్ళి కూతురులా ముస్తాబయిన ఈ రాత్రిని వెలిగిస్తాను నా గుండె మరకలతో” అన్న భావం వస్తుంది. నాలోని దుఃఖాన్ని కూడా నీ రాత్రిని వెలిగించడం కోసం ఉపయోగిస్తాను. ఎంత గొప్ప భావన అది. ఎంత ప్రేమ ఉంది ఆ వాక్యాలలో . “ఆజ్ కీ రాత్ మెరే దిల్ కీ సలామీ లెలె. కల్ తెరీ బజ్మ్ సె దీవానా చలా జాయేగా… షమ్మ రహ్ జాయెగీ పర్వానా చలా జాయేగా” అన్నది చరణం. “ఈ రోజు రాత్రి నా మనసుతో నేను చేసే నమస్సు అందుకో. రేపు నీ సభ నుండి ఈ ప్రేమికుడు వెళ్ళిపోతాడు, వెలుగు ఉండిపోతుంది శలభం ఆ వెలుగు నుండి దూరమవుతుంది” ప్రేమికురాలి పై గుండెలనిండా ప్రేమ ఉంది. కాని ఆమెతో అతను జీవించలేడు. ఆమెకు నమస్కరిస్తున్నాడు. ఆమె జీవితం వెలుగులో ఉండాలని అతని కోరిక, తనను శలభంతో పోల్చుకుంటూ కూడా ఆమె ప్రేమలో పడి మసి అవలేడు తొలగిపోవడం ఒకటే అతనికి దారి. అంటే ఆమె ప్రేమలో పడి మరణించాలని ఉంది తనకి, అలా మరణించలేని స్థితిలో ఉన్నందుకు అతను బాధపడుతున్నాడు. ఈ బాధను ఎంత సున్నితంగా చెప్పారు ఈ పాటలో. దీన్ని దిలీప్ కుమార్ అభినయిస్తుంటే రాం ఔర్ శ్యాం కేవలం ఒక ఎంటర్‌టెయిన్‌మెంట్ సినిమా అనగలమా….

తెరి మెహఫిల్ తెరె జల్వె హొ ముబారక్ తుఝకొ, తెరీ ఉల్ఫత్ సె నహీ ఆజ్ భీ ఇన్కార్ ముఝె, తెరా మయ్ ఖానా సలామత్ రహె యై జాన్ ఎ వఫా, ముస్కురాకర్ తూ జరా దెఖ్ లె ఇక్ బార్ ముఝె, ఫిర్ తెరె ప్యార్ కా మస్తానా చలా జాయెగా…. నీ చుట్టూ ఇలా బోల్డు పండుగలు జరగాలి, నీ ప్రేమ నాకు అసమ్మతం కాదు మిత్రమా, నీ లోకం నీకు సుఖాన్నివ్వాలి అని కోరుతున్నా, ఒక్కసారి నా వైపు చూసి చిరునవ్వు నవ్వవా.. తరువాత నీ ప్రేమను ఆఘ్రాణించే వీడు వెళ్ళిపోతాడు…. ప్రేమికురాలిని ఎంత ఎత్తున పెట్టాడు కవి. ఇంత ఉదాత్తత విడిపోవడంలో ఉంటే అది అనుభవించడం కూడా అదృష్టమే అనిపిస్తుంది ఈ పాట వింటున్నంత సేపూ.

మైనె చాహా కి బతా దూ మై హకీకత్ అప్నీ, తూనె లెకిన్ న మెరా రాజ్-ఎ- ముహబ్బత్ సమ్ఝా, మెరీ ఉల్ఝన్ మెరె హాలాత్ యహా తక్ పహుంచే, తెరీ ఆంఖో నె మెరె ప్యార్ కొ నఫ్రత్ సమ్హా.. అబ్ తెరీ రాహ్ సె బెగానా చలా జాయెగా.” “నేను నీకు నా గురించి నిజం చెప్పాలనే అకునున్నా కాని నువ్వు నా  ప్రేమ రహస్యాన్ని  అర్థం చేసుకోలేకపోయావు. నా పరిస్థితులు, నా అయోమయం నన్ను ఈ స్థితికి తీసుకువచ్చాయి, నీ కనులు నా ప్రేమను ద్వేషం అనుకుంటున్నాయి. ఇక నీ దారి నుండి ఈ అపరిచితుడు తప్పుకుపోతున్నాడు…” ఏంత దుఃఖం చూపిస్తున్నడు ఇందులో, చెప్పాలనుకున్న నిజాన్ని చెప్పలేని పరిస్థితుల నడుమ ప్రియురాలు తనని ద్వేషిస్తుంటే భరిస్తూ ఆ రోజు నుండి ఆమెకు అపరిచితుడుగా మారుతున్నప్పుడు అతని నిస్సహాయత్వాన్ని రఫీ తన గొంతులో పలికిస్తుంటే దిలీప్ కుమార్ కళ్ళతో చూపిస్తాడు… అబ్ తెరీ రాహ్ సె బెగానా చలా జాయెగా అన్న వాక్యం దగ్గర దిలీప్ కుమార్ మొహంలోని ఆ నిస్సహాయత్వపు చూపుని మర్చిపోలేం.

తూ మెరా సాథ్ న దె రాహ్-ఎ-ముహబ్బత్ మె సనం, చల్తె చల్తె మై కిసీ రాహ్ పె ముడ్ జాఊంగా, కహ్కషా. చాంద్ సితారె తెరె చూమెగే కదం, తెరె రస్తె కీ మై ఎక్ ధూల్ హూ ఉడ్ జాఊగా, సాథ్ మెరె మెరా అఫసానా చలా జాయెగా, ప్రేమ దారిలో నువ్వు నాకు తోడు రాకపోయినా ప్రియా, కలిసి ప్రయాణిస్తూ నేను మరో దారిలోకి మరలిపోతాను ఆ చంద్రుడు తారకలు నీ పాదాలను ముద్దాడగా, నేను నీ దారిలో ధూళిగా ఎగిరిపోతాను. నాతో నా కథ కూడా కనుమరుగవుతుంది – అంటూ అతను తనలోని బాధను చెప్పుకోవడం వింటే మన మనసు కూడా కలుక్కుమంటుంది. ఈ పాటలో కల్ తెరె బజ్మ్ సె అంటూ వచ్చే ప్రతి సారి రఫీ ఒకో విధంగా గొంతుని పలికిస్తారు. ఒక చిన్న విరుపు, ఒక విరామం, పాటలో మూడ్‌ని ఎంతగా ఎలివేట్ చేస్తుందంటే ఆ నటుడి బాధతో మమేకమయి పోతాం.

ఇప్పటి సినిమాలలో గొప్ప పాటలు వస్తున్నాయేమో, గొప్ప పాటలు రాస్తున్నారేమో కాని ఇలా పాట, గానం, నటన మూడూ కూడా ఇంత గొప్పగా కలిసిపోయే పాటలు లేవు. అందుకే ఎన్ని వందల పాటలు వచ్చినా హిందీ లేక ఉర్దూ పాటలతో పరిచయం ఉన్నవారు ఈ పాతపాటలకు దూరం అవలేరు. దిలీప్ కుమార్ ఎన్నో సినిమాలలో భగ్న ప్రేమికుడిగా నటించారు. అసలు ప్రేమ భగ్నం అయితే తాగి చావాలా అనేవారు కూడా దేవదాసుని అతని విషాదాన్ని కాసేపు ఓన్ చేసుకుంటారు. ఆతనిపై చిత్రించిన పియానో పాటలు ఎన్నో, చాలా పార్టీలలో పెద్ద హాళ్ళూ, హీరోయిన్ పియానో పక్కన నుంచుని హీరో కళ్ళల్లోకి చూస్తూ ఉంటే, పియానో మీటుతున్నట్లు నటిస్తున్న దిలీప్ కుమార్…. ఇదో అసహజమైన చిత్రం. కాని అక్కడ ఆ కాసేపు ఆ హీరో ప్రేమ, బాధ, విరహం అసహజం అనిపించవు. దిలీప్ కుమార్ అలా అనిపించనివ్వరు. ఈ సినిమాలో మరో హిట్ పాట ఆయీ హై బహారే మిటె జుల్మ్-ఒ-సితం. చక్కటి పాట ఇది.

దిలీప్ కుమార్ సినిమాలు చూసి తరువాత ఇందులో ఏం ఉంది అని అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మళ్ళీ అతను స్క్రీన్‌పై పాడుతూ కనిపించినా, మాట్లాడుతునా కను రెప్ప వేయకుండా చూడడం కూడా అలవాటే, కొన్ని డైలాగ్స్ చెబుతున్నప్పుడు గొంతు అమాంతంగా తగ్గించడం, కొన్ని పదాలు మింగేయడం వినిపించి వినిపించనట్లు మాట్లాడడం దిలీప్ కుమార్ స్టైల్. కాని ఆ డిక్షన్ అతనికి పెద్ద ఎసెట్. దిలీప్ కుమార్ డైలాగ్ పలికే పద్ధతిలోనే భాషకు అందం, పరమార్థం దొరుకుతుంది. అ సీన్‌లో మూడ్ మెయింటేన్ అవుతుంది. ఇలాంటి విషయాల కారణంగానే రామ్ ఔర్ శ్యాం లాంటి సాగతీత సినిమా కూడా బావుంటుంది. ఈ సినిమాకు దిలీప్ కుమార్ ఏడవసారి ఉత్తమ నటుడి కేటగిరీలో ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఈ సినిమా చాలా పాపులర్ అయి రష్యన్ భాషలోకి కూడా అనువదించారట. దిలీప్ కుమార్ సినిమాలలో ఈ సినిమాను చూసిన వారు తరువాతి తరంలో ఎక్కువ మంది కనిపిస్తారు. దిలీప్ కుమార్ నటించిన గొప్ప సినిమాలలో ఇది ఒకటి కాకపోయినా, అతని సినీ ప్రస్థానాన్ని విశ్లేషించే క్రమంలో మర్చిపోలేని చిత్రం ‘రాం ఔర్ శ్యాం’ కూడా అన్నది నిజం. ఈ సినిమాలో దిలీప్ కుమార్ కి జోడిగా వహీదా రెహమాన్, ముంతాజ్‌లు నటించారు.

రాం ఔర్ శ్యాం లో చేసింగ్ దృశ్యాల్లో దిలీప్ కుమార్ ఆయాసపడటం తెలుస్తుంది. అయితే, ఈ సినిమాలో భయపడే రాం గా దిలీప్ కుమార్ నటన షారుఖ్ ఖాన్ ను గుర్తుకుతెస్తే అది దిలీప్ కుమార్ దోషం కాదు. అలాగని షారుఖ్ ఖాన్ దిలీప్ కుమార్ అంతటి నటుడూ కాదు.దిలీప్ కుమార్ నట జీవితంలో రాం ఔర్ శ్యాం ప్రాధాన్యం వహిస్తుంది. ఇది హీరోగా అతని చివరి హిట్ సినిమా. దీని తరువాత 1982లో మళ్ళీ శక్తి, విధాత సినిమాల్లో కారెక్టర్ నటుడిగా తెరపై కనిపించేవరకూ ఆయనకు హిట్ సినిమాలేదు. బైరాగ్ సినిమాలో మూడువేషాలు వేసినా సినిమా గొప్ప హిట్ కాలేదు. అందుకే, రాం ఔర్ శ్యాం సినిమా హీరో దిలీప్ కుమార్ కూ, కారెక్టర్ నటుడు దిలీప్ కుమార్ కూ నడుమ విభజన రేఖలాంటి సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here