ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు – 37 – శక్తి

1
8

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్ కు ఎనిమిదవ ఫిలిం ఫేర్ అవార్డు తీసుకొచ్చిన ‘శక్తి’

[dropcap]‘శ[/dropcap]క్తి’ 1982లో రమేశ్ సిప్పి దర్శకత్వంలో వచ్చిన సినిమా. దిలీప్ కుమార్‌కు ఎనిమిదవ ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ నటుడి కేటగిరిలో ఈ సినిమాకే లభించింది. చాలా మంది ఉత్తర భారతీయులకు తెలియనిది శక్తి సినిమాకి ఆధారం, 1974లో వచ్చిన తమిళ సినిమా “తంగపతక్కం”. తమిళనాట ఎంతో గౌరవంగా ప్రస్తావించే మహేంద్రన్ ఈ కథ సృష్టికర్త. చౌదరి అనే పేరుతో ఒక పాత్ర సృష్టించి “ఇరందిల్ ఒన్ద్రు” అనే ఒక నాటకాన్ని ఆయన రాసారు. అది చూసి శివాజీ గణేశన్ గారు తాను చౌదరి పాత్ర పోషిస్తూ పీ. మాధవన్ దర్శకత్వంలో తంగపతక్కం తీసారు. ఈ సినిమాకు మహేంద్రన్ గారే స్క్రీన్ ప్లే అందించారు. తమిళంలో సిల్వర్ జూబిలీ జరుపుకున్న ఈ సినిమాని తెలుగులో కె. రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో కొండవీటి సింహంగా కొంచెం కథ మార్చి తీసారు. దీన్ని మళ్ళీ వారే “ఫర్జ్ ఔర్ కానూన్” అని జితేంద్రతో 1982 లోనే తీసారు. ఈ కథనే సలేం జావేద్‌లు శక్తి సినిమాగా మలచారు. ఇన్ని సార్లు సినిమాగా వచ్చిన ఈ కథ రమేశ్ సిప్పి దర్శకత్వ ప్రతిభ దిలీప్ కుమార్, అమితాబ్ బచ్చన్‌ల పోటాపోటీ నటన కారణంగా ఒక గొప్ప చిత్రంగా నిలిచిపోయింది. తంగపతక్కం  సినిమాకు ప్రేరణ 1950లో వచ్చిన అశోక్ కుమార్, నళినీ జయవంత్‌ల సినిమా సంగ్రాం.

ఈ సినిమా ఒక తండ్రి కొడుకుల కథ. అశ్వినీకుమార్‌కు ఒకడే కొడుకు విజయ్. పోలీసు శాఖలో నిజాయితీగా పని చేసే అశ్వనీకుమార్ ఒక స్మగ్లర్‌ను అరెస్టు చేస్తాడు. అతను ఆ స్మగ్లర్ ద్వారా ఆ ముఠా మొత్తాన్ని పట్టుకునే పయత్నంలో ఉండగా అతనిపై ఒత్తిడి తీసుకొచ్చి, అతన్ని భయపెట్టి ఆ స్మగ్లర్‌ను విడుదల చేయించాలని అతని కొడుకు ఎనిమిది సంవత్సరాల విజయ్‌ని కిడ్నాప్ చేయిస్తాడు ఆ ముఠా నాయకుడు జే.కే వర్మ. అశ్వనీకుమార్‌కు ఫోన్ వెళుతుంది. కాని తాను ఎట్టి పరిస్థితులలో ఆ స్మగ్లర్‌ను వదలనని విజయ్‌ని ఏం చేసినా తాను లొంగనని అశ్వనీకుమార్ అ ఫోన్ చేసిన వ్యక్తికి చెబుతాడు. జె.కే. కి ఆ ఫోన్ రికార్డు చేసి వినిపిస్తాడు అతని అనుచరుడు. ఆ ఫోన్‌లో తండ్రి గొంతు విన్న విజయ్ తండ్రి తనను ప్రేమించట్లేదని, కోపం పెంచుకుంటాడు. తండ్రి పట్ల అదే జీవితాంతం ద్వేషంగా మారుతుంది. తండ్రి ఆ మాట ఎందుకన్నాడో, తన విడుదల కోసం అతను ఎంతగా ప్రయత్నిస్తున్నాడో అర్థం చేసుకునే వయసు అతనిది కాదు. అక్కడి నుండి తానే పారిపోయే ప్రయత్నం చేస్తాడు. ఆ సమయంలో విజయ్ జె.కే. కి పట్టుబడకుండా అతన్ని తప్పిస్తాడు జే.కే దగ్గర్ పని చేసే నారంగ్. నారంగ్ చేసిన మేలు ఆ చిన్ని హృదయంలో నాటుకుపోతుంది.

తండ్రి పట్ల ఆ ద్వేషమే విజయ్‌కి అశ్వని కుమార్‌కి మధ్య దూరం పెంచుతుంది. చదువు అయిపోయి ఉద్యోగం కోసం అతను ప్రయత్నిస్తున్నప్పుడు నారంగ్ హోటల్ లోనే అతనికి ఉద్యోగం దొరుకుతుంది. నారంగ్‌ని గుర్తు పట్టిన విజయ్ ఆ హోటల్‌లో పని చెయడానికి ఉత్సాహం చూపుతాడు. కాని నారంగ్ స్మగ్లర్ అని అతని వద్ద విజయ్ పని చేయడం తనకు ఇష్టం లేదని చెబుతాడు అశ్వినీకుమార్. విజయ్ దీనికి ఒప్పుకోడు. ఆ ఇల్లు వదిలి రోమా అనే స్నేహితురాలి ఇంటికి వస్తాడు. రోమాను దుండగుల నుండి రక్షించే క్రమంలో కూడా తండ్రి అశ్వనీకుమార్ ఇంటరాగేషన్‌ను ఎదుర్కుంటాడు విజయ్. తండ్రిలోని పోలీసు పట్ల ద్వేషం అతన్ని తండ్రిలోని ప్రేమను చూడనివ్వదు. ఒక సారి రోమాతో దురుసుగా ప్రవర్తించిన ఒక వ్యక్తిని కొడతాడు విజయ్. కాని అది జే.కే పన్నిన కుట్ర అని అతనికి తెలీదు. తాను కొట్టిన మనిషి అదే రోజు హత్య చేయబడడంతో విజయ్‌ని అనుమానించి పోలీసులు అతన్ని అరెస్టు చేస్తారు. అశ్వనీకుమార్ చట్టాన్ని గౌరవించే తండ్రిగా విజయ్‌కి సహాయం చేయాలనుకోడు. నారంగ్ వచ్చి విజయ్‌ని బెయిల్‌పై విడిపిస్తాడు. మెల్లగా విజయ్ నారంగ్ కార్యకలాపాలలో భాగం పంచుకుంటాడు. పోలీసుల రికార్డులలోకి ఎక్కుతాడు. అశ్వనీకుమార్ ఎంతో ప్రయత్నించినా విజయ్ ప్రయాణిస్తున్న దారి నుంచి అతన్ని మళ్ళించలేకపోతాడు. విజయ్ తండ్రి ప్రేమించే చట్టాన్ని ద్వేషించడం మొదలెడతాడు. చట్టవ్యతిరేకమైన పనులు చేస్తూ తండ్రికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ అతని అహాన్ని తృప్తి పరుచుకోవడం అతని స్వభావం అవుతుంది. అశ్వనీకుమార్ భార్య శీతల్ కొడుకు ప్రేమ మధ్య, భర్త కర్తవ్య దీక్ష మధ్య నలిగిపోతూ ఉంటుంది. భర్త నడేచే దారి సరి అయిందని తెలుసు. అందుకే తల్లిగా కన్నా భార్యగా తన భర్తతో ఉండడం తన కర్తవ్యం అని నమ్ముతుంది. కాని కొడుకు వెళ్ళే దారి ఎటువైపుకు దారి తీస్తుందో తెలుసు కాబట్టి మనోవ్యథతో మంచం పడుతుంది. కొడుకు రమ్మని పిలిచినా భర్తని వదిలి రావడానికి ఇష్టపడదు.

అశ్విని కుమార్ స్మగ్లర్ల్‌పై జరిపిన వేటలో మళ్ళీ విజయ్‌ని అరెస్టు చేయాల్సి వస్తుంది. కొడుకుని జైల్లో  చూడాలని శీతల్ అనుకున్నప్పుడు ఆమెను స్వయంగా విజయ్ దగ్గరకు అశ్వనీకుమార్ తీసుకు వెళ్ళేటప్పుడు జే.కే వారిపై కాల్పులు జరుపుతాడు. శీతల్ మరణిస్తుంది. జైలు నుండి తప్పించుకున్న విజయ్ తల్లి హంతకుడిని చంపి ఆ పోరాటంలో తండ్రి ఒడిలో చనిపోవడం కథకు ముగింపు.

ఈ సినిమాలో కర్తవ్యాన్ని ప్రేమించే తండ్రిగా, తండ్రి పట్ల చిన్నతనంలో ఏర్పడిన అపోహ కారణంగా అతన్ని జీవితాంతం ద్వేషించే కొడుకుగా దిలీప్ కుమార్ అమితాబ్‌ల నటన అత్యుత్తమ స్థాయిలో ఉంటుంది. వీరిద్దరి మధ్య నడిచే సంభాషణలు తరాల అంతరాల మధ్య చిక్కిన ఎందరో తండ్రీ కొడుకుల మనసులను ఆవిష్కరిస్తాయి. చివర్లో తండ్రి చేతిలో మరణిస్తూ తాను ఇంతకాలం ఆ తండ్రి ప్రేమ నుండి దూరంగా పారిపోవాలనుకున్నానని, తండ్రిని ద్వేషించాలని ఎంతో ప్రయత్నించానని కాని తండ్రి పట్ల తనలో గూడు కట్టుకుని ఉన్న ప్రేమ నుండి తప్పించుకోలేకపోయానని, అది కప్పి పుచ్చుకోవడానికి తాను చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదని విజయ్ తండ్రి ఒడిలో పడుకుని చెప్పే సీన్ ఈ సినిమాకు హైలైట్. అలాగే అశ్వినీకుమార్ విజయ్‌ను తన దారి మళ్ళించుకోమని, ఆ నిముషం తాను తండ్రిగా నచ్చచెబుతున్నానని కాని పోలీస్ ఆఫీసర్‌గా తానిలా మాట్లాడలేనని అనేటప్పుడు, విజయ్ మీరెప్పుడూ పోలీసాఫీసరే కాని తండ్రి కాలేకపోయారు అని బదులివ్వడంలో వారిద్దరి మధ్య ఏర్పడ్డ దూరానికి కారణమైన ఆలోచనా విధానం స్పష్టంగా అర్థం అవుతుంది.

ఈ సినిమా సక్సెస్ వెనుక మరో కారణం శీతల్ పాత్రలో నటించిన రాఖీ. ఆవిడ అంతకు ముందు ఎన్నో సినిమాలలో అమితాబ్‌కు హీరోయిన్‌గా నటించారు. “కభీ కభీ మేరే దిల్ మే”, “దిల్ తో హై దిల్” లాంటి పాటలు ఆమె పై చిత్రించబడ్డాయి. కాని ఈ సినిమాలో రాఖీని చూస్తే అవన్నీ గుర్తుకు రావు. అసలు ఆమె అమితాబ్‌కి నిజంగా తల్లేమో అన్నంత కన్విన్సింగ్‌గా నటించారు ఆమె. రాఖీ తరువాత హిందీలో అమ్మతనం ఉన్న పాత్రలు ఉన్నాయా… ఒక్కసారి ఆలోచిస్తే, ఆధునిక తల్లుల స్థానంలో వచ్చిన నటులు పోషించిన పాత్రలను చూస్తే రాఖీని ఆవిడ నటనను ప్రశంసించకుండా ఉండలేం. ప్రతి సీన్‌లో అటు దిలీప్ కుమార్ తోనూ ఇటు అమితాబ్ తోనూ ఆవిడ నటించిన విధానానికి అచ్చెరువు చెందుతాం. మంచం మీద పడుకున్న తల్లి వద్దకు కొడుకు వచ్చినప్పుడు ఆవిడ చూపించే ఎమోషన్స్, అంతకు ముందు ఇల్లు వదిలిన కొడుకుని తీసుకురావడాని ఆమె అతనింటికి వెళ్ళడం, భర్త క్రింద పని చేసే ఇన్‌స్పెక్టర్‌ని పిలిచి కొడుకు గురించి వివరాలు తెలుసుకోవడం, భర్త దగ్గర అతని గౌరవాన్ని అంగీకరిస్తూనే కొడుకు కోసం తల్లడిల్లే స్త్రీగా రాఖీ నటన చాలా గొప్పగా ఉంటుంది. కొడుకు దగ్గరకు వెళ్ళి లొంగిపొమ్మని అడిగినప్పుడు ఆ కొడుకు తన భర్తను అవమానించినప్పుడు ఆమె కొడుకుని సరి చేసే ఉద్దేశంతో తన భర్తను సమర్థించే భార్యగా దారి తప్పిన కొడుకుని నిస్సహాయంగా చూసే తల్లిగా రాఖీ పలికే ఆ సంభాషణలు సినిమా కథకు చాలా బాలాన్నిస్తాయి.

కేవలం దిలీప్ కుమార్‌తో కలిసి నటించాలని రాఖీ ఈ సినిమా ఒప్పుకున్నారట. ఇప్పటి తారలలో ఒక హీరోతో హీరోయిన్‌గా చేసి మళ్ళీ అతనికే తల్లిగా అదే స్థాయిలో చేయగల సత్తా ఉన్ననటీమణులను వెతికే ప్రయత్నం చేస్తే అపుడు రాఖీ గారి ప్రతిభ మనకు అర్థం అవుతుంది. తెలుగులో అంత గొప్పగా ఆ రెండు పాత్రలలో అంజలీ దేవి గారు మెప్పించారు. కొందరు ప్రయత్నం చేసినా అవి అంత గొప్ప నిడివి ఉన్న పాత్రలు కావు. తరువాత ఎనభైలలో హిందీలో అంత గొప్పగా రెండు పాత్రలలోనూ మెప్పించిన నటి రాఖీ. ఆమె ముందు హీరోలే చిన్నబోయిన సందర్భాలు ఎన్నో. కాని ఆవిడను కూడా మరచిపోయింది సినీ ప్రపంచం.

శక్తి సినిమాలో మరో గొప్ప సీన్ శీతల్ మరణించిన తరువాత అతన్ని కలవడానికి వచ్చే అమితాబ్‌ల మధ్య ఉంటుంది. అప్పటి దాకా దేనికీ చలించని తండ్రిని కన్నీళ్ళ మధ్య చూస్తూ కొడుకుగా అ తండ్రి చేయి పట్టుకుని దుఃఖాన్ని పంచుకునే సన్నివేశంలో దిలీప్ కుమార్ అమితాబ్‌లు మాటలు లేకుండా తమ బాడీ లాంగ్వేజ్‌తో గొప్పగా ఎమోషన్లకు పలికించగలిగారు. ఈ సీన్‌తో పాటు, ఆఖరున అమితాబ్ తండ్రి ఒడిలో చనిపోయే సీన్లో కూడా అమితాబ్‌పై కెమెరా ఫోకస్ ఎక్కువ సేపు ఉండడం అతనికి ప్లస్ పాయింట్ కాని తాను కనిపించే ఆ ఒక్క క్షణం దిలీప్ కుమార్ పలికించే భావాలు కళ్ళలో నీళ్ళు తెప్పిస్తాయి. ఆఖరి సీన్‌లో కెమెరా అమితాబ్‌పై ఫోకస్ అయి ఉంటుంది. దిలీప్ కుమార్ వీపు మాత్రమే కనబడుతుంది. ఆయనకి ఇక్కడ మూడ్‌కి అనుగుణంగా శరీరాన్ని కదిలించే అవకాశం లేదు, అప్పుడు ఆ సీన్‌ను పండించడానికి దిలీప్ కుమార్ తన గొంతును ఉపయోగిస్తారు. అటు వైపు తిరిగి అతను పలికే డైలాగులు ప్రేక్షకుల దృష్టిని అమితాబ్‌పై నుండి కొంత తప్పిస్తుంది. “ఏ సబ్ క్యూ హువా” అని నిస్సహాయంగా గంభీరమైన అమితాబ్ గొంతుకు బదులుగా అతను మృదువుగా పలకడం ప్రేక్షకులకు ఆ తండ్రి వ్యథను అర్థం చేయిస్తుంది. అమితాబ్ గంభీరమైన కంఠం మరొకరిని విననివ్వదు, కాని ఆ స్థితిలో కూడా దిలీప్ కుమార్ డిక్షన్ అదే స్టయిల్లో ఎక్కడా గొంతు పెంచకుండా తన సహజమైన విధానాన్ని మార్చకుండా బాలెన్స్‌డ్‌గా ఉంటూ ఆ తండ్రి పాత్ర పట్ల మనకు గౌరవం కలిగిస్తారు. అమితబ్ అభిమానులు కూడా కాసేపు దిలీప్ కుమార్‌ని పరీక్షగా చూస్తారు. అంత లోతుగా అ పాత్రలోకి ఒదిగిపోయి నటించారు దిలీప్ కుమార్.

ఈ సినిమా అమితాబ్ కెరియర్‌లో కూడా ఒక గొప్ప చిత్రంగా మిగిలిపోతుంది. ఉత్తమ నటుడు అవార్డుకు అమితాబ్ దిలీప్ కుమార్‌లు ఇద్దరూ పోటీ పడినా ఆ అవార్డు దిలీప్ కుమార్‌కు లభించడం అమితాబ్‌ని కొంత బాధించింది. అందుకే మషాల్ సినిమాకు మళ్ళీ అనిల్ కపూర్ చేసిన పాత్రకు ముందు అమితాబ్‌ను అనుకున్నా అయన ఆ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదు. శక్తి సినిమాలో దిలీప్ కుమార్ మనవడిగా ఒక సీన్‌లో అనిల్ కపూర్ కనిపిస్తారు. మనవడు పోలీసు అవ్వాలని అనుకుంటున్న సమయంలో తన కథను తాతగారి హోదాలో దిలీప్ కుమార్ అతనికి వినిపిస్తారు. చివరకు మనవడు రవి పోలీస్ ఆఫీసరు అవ్వాలనే తన నిర్ణయాన్ని తాతకు, తల్లికి వినిపించడం సినిమా చివర్లో చూస్తాం.

ఈ సినిమాలో అమితాబ్‌కు జోడిగా స్మితా పటేల్‌ను చూస్తాం. ఈ కథలో హీరో హీరోయిన్లు వివాహానికి ముందే కలిసి ఉంటారు. లివింగ్ టుగెదర్‌ను అంత బాహాటంగా చూపించిన సినిమా కూడా ఆ రోజుల్లో ‘శక్తి’ అనే అంటారు. జె.కే గా అమ్రీష్ పూరి, నారంగ్‌గా కుల్భూషన్ కర్బందా పాత్రలకు న్యాయం చేసారు. 30వ వార్షిక ఫిలింఫేర్ అవార్డులలో శక్తి సినిమా ఎనిమిది కేటగిరీలలో నామినేషన్లు పొంది ఉత్తమ సినిమా, ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ సౌండ్ డిజైన్ కాటగిరీలలో అవార్డులు గెలుచుకుంది. ఆనంద్ భక్షీ రాసిన పాటలకు ఎస్.డి. బర్మన్ సంగీతాన్ని అందించారు. స్మిత అమితాబ్‌లపై చిత్రించిన “జానె కైసె కబ్ కహాన్” అన్న పాట బాగా పాపులర్ అయ్యింది.

ఈ సినిమాను స్టడీ చేస్తున్నప్పుడు ప్రతి పాత్రను పోషించే సమయంలో దిలీప్ కుమార్ ప్రదర్శించే సెల్ప్ కంట్రోల్‌ని అర్థం చేసుకోవాలి. దిలీప్ కుమార్ నటించిన ఏ సినిమా తీసుకున్నా ఇతను ఇక్కడ అతిగా చేసారు అని అనిపించదు. ఆ పాత్ర ఇలా ఉండకూడదేమో అంటాం కాని దిలీప్ సాబ్ ఇలా చేయకుండా ఉండవలసింది అన్న మాట అనలేం. అతని సినిమాలలో ప్లాప్ సినిమాలను తీసుకున్నా అందులో దిలీప్ కుమార్ చరిష్మా ఉంటుంది. ఆ పాత్రలోకి ప్రవేశించి ఆయన చూపిన మేనరిజమ్స్‌లో ఎక్కడా అతి కనిపించదు. అందుకే ఎంతమంది గొప్పనటులు ఉన్నా దిలీప్ కుమార్ స్థానం అద్వితీయం. ఆయన సినిమా స్క్రిప్ట్‌లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతారని అందువలన దర్శకులు భయపడేవారని చాలామంది అనేవారు. కాని దిలీప్ సాబ్ ఎటువంటి నటుల మధ్య సినిమాలు చేసి వచ్చారు, తరువాత సినీ నిర్మాణంలో హీరోయిక్ ఎఫెక్ట్ కోసం మారుతున్న సినీ నిర్మాణం, తగ్గుతున్న కథల స్థాయి లాంటి మార్పుల మధ్య తన శైలిని బ్రతికించుకోవడాని ఒక ఆర్టిస్ట్ పడే తపన కనిపిస్తుంది. శక్తి సినిమాకు కూడా సలీమ్ జావేద్‌లు ఆయన్ని కథలో ఇన్వాల్వ్ అవ్వద్దనే ప్రతిపాదిక మీద తీసుకున్నారట. కాని ప్రతి సీన్‌ని ఆయన డిస్కస్ చేసి లాజికల్‌గా అనిపించినప్పుడు దర్శకుడికే సీన్ వదిలేసేవారని సిప్పి గారు కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. ఇది చేయలేక ఒకప్పుడు గొప్ప స్థాయి హీరోలందరూ చివర్లో అర్థం పర్థం లేని పర్ఫార్మెన్స్‌లు ఇచ్చి రిటైర్ అవడం చూసాం. చేసింది అతి తక్కువ సినిమాలయినా ప్రతి సినిమా తన పంథాలో నడవాలని దిలీప్ కుమార్ ప్రయత్నించడం వలన ఆయన ఎక్కువ సినిమాలు చేయలేకపోయినా మరో తరానికి నేర్చుకోవడానికి ఎంతో వదిలి వెళ్ళారని చెప్పవచ్చు. ఈ సినిమా చూసిన అమితాబ్ అభిమానులు కథ చాలా భాగం దిలీప్ కుమార్ కోసం మార్చబడింది అంటారు. దానికి బదులుగా రమేష్ సిప్పి తన ఇంటర్వ్యూలలో తాను దిలీప్ కుమార్‌కి అమితాబ్‌కు ఇద్దరికీ కూడా కలిపి కథ వినిపించానని, మొదట వినిపించిన కథలో ఒక్క లైను కూడా మార్చబడలేదని చెప్పారు. ఏమైనా శక్తి సినిమా దిలీప్ కుమార్ నటించిన సినిమాలన్నిటి మధ్య అదే స్థాయిలో ఉన్న మరో సినిమా… అమితాబ్ బచ్చన్‌కు అతని కెరియర్‌లోని మంచి సినిమాలలో ఒకటి. ఈ నిజం వెనుక ఎన్ని కారణాలున్నా శక్తిలో అమితాబ్ బచ్చన్ అసమాన నటన ప్రదర్శించినా దిలీప్ కుమార్ మాజిక్‌ను అతను డామినేట్ చేయలేకపోయాడన్నది నిజం.  ఈ సినిమాలో దిలీప్ కుమార్ సంభాషణలు అమితాబ్ కన్నా 10% ఎక్కువ. దిలీప్ కుమార్ సీన్లు అమితాబ్ కన్నా 3 రెట్లెక్కువ. ఇద్దరూ కలసి కనిపించే దృశ్యాల్లో 80% సంభాషణాలు పలికేది దిలీప్ కుమారే. వ్యంగ్య సంభాషణలు, చప్పట్లు పడే సంభాషణలూ దిలీప్ కుమార్‌వే. రాఖీ మరణించిన సన్నివేశంలో దిలీప్ కుమార్ నటన, గంగా జమునా సినిమాలో వైజయంతీమాల మరణించిన సన్నివేశంలోని నటనకు నకలు. కానీ, సినిమాలో స్క్రిప్ట్ దిలీప్ కుమార్ వైపు మొగ్గటంతో అత్యద్భుతంగా నటించినా అమితాబ్ నటన తేలిపోయినట్టు అనిపిస్తుంది. నిజానికి ఇద్దరు మహానటులు పోటా పోటీగా నటించారు. శక్తి సినిమా తరువాత దిలీప్ కుమార్ శక్తి పెరిగింది. దిలీప్ కుమార్ సినిమాలో వున్నాడంటే , సమకాలీన సూపర్ స్టార్లతో పోటీగా సినిమా ఆకర్షణ పెరిగేది. ఇదే సంవత్సరం విధాత కూడా హిట్ కావటంతో దిలీప్ కుమార్ బాక్స్ ఆఫీస్ శక్తి , అమితాబ్ శక్తితో పోటీపడే పరిస్థితి నెలకొంది. ఇదే సమయానికి సలీం జావేద్‌లు విడిపోవటంతో (వారిద్దరూ కలసి అమితాభ్ కు ఆంగ్రీ యంగ్ మాన్ ఇమేజీని సృష్టించి సూపర్ స్టార్‌గా నిలిపినవారు. అమితాబ్‌తో వారిద్దరూ కలసి పనిచేసిన చివరి హిట్  సినిమా శక్తి. 2003లో బాగ్‌బన్ సినిమాలో తన చివరి సీన్ ఉపన్యాసాన్ని అమితాబ్ జావేద్ అఖ్తర్‌తో రాయించుకుంటే సల్మాన్ ఖాన్ సలీంతో రాయించుకున్నాడు. అలా ఈ సినిమాలో  పరోక్షంగా పనిచేశారు.) అమితాబ్‌కు దుర్దినాలు మొదలయ్యాయి. మరే స్క్రిప్ట్ రచయితా అమితాభ్ నటనను నూతన కోణంలో చూపించలేకపోయాడు. 1980 దశాబ్దం చివరికల్లా కొత్త తరం తెరపైకి రావటం వేగవంతమయింది. అంటే శక్తి తో దిలీప్ కుమార్ రెండవ ఇన్నింగ్స్ విజయపథంవైపు నడిస్తే, అమితాబ్ మొదటి ఇన్నింగ్స్ పతనం ఆరంభమయిందన్నమాట.

శక్తి సినిమా  దిలీప్ నటన ప్రభావాన్ని స్పష్టం చేస్తుంది దిలీప్ కుమార్ మరణం తరువాత సోషల్ మీడియాలో ముంబై పోలీసులు చేసిన పోస్ట్. వారు శక్తి సినిమాలో ఒక కీలకమయిన సన్నివేశంలో దిలీప్ కుమార్ సంభాషణను పోస్ట్ చేశారు. కానూన్ కి హిఫాజత్ కర్నేవాలోమే, ఔర్ కనూన్ కో తోడ్నే వాలోమే తుం ఫర్క్ నహీన్ జాంతేతో తో జావో అప్నే దిమాగ్ కా ఇలాజ్ కరావో..అంటే చట్టాన్ని రక్షించేవారికీ, చట్టాన్ని ఉల్లంఘించేవారికీ నడుమ తేడ తెలియకపోతే, పోయి నీ మెదడు పరీక్ష చేయించుకో….ఈ సంభాషణను షేర్ చేసి వారు, దిలీప్ సాబ్, మేము మా కర్మను చిత్తశుద్ధితో నిర్వహిస్తూ మా శక్తిని కానూన్(చట్టం) మషాల్ (కాగడా) మరింత వెలుగులతో వెలుగేట్టు చేస్తాము అని రాశారు. కానూన్, కర్మ, మషాల్, శక్తి ఇవన్నీ దిలీప్ కుమార్ సినిమాలు. ఒకప్పటి హీరో అయిన దిలీప్ కుమార్, ఆ కాలం నాటి సూపర్ స్టార్ అయిన అమితాబ్‌ను డామినేట్ చేస్తూ, పులి ఎప్పటికీ పులే అని నిరూపించటంవల్ల దిలీప్ కుమార్ సినీ జీవితంలో శక్తి అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here