ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 47 – దునియా

1
10

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం దిలీప్ కుమార్ నటించిన ‘దునియా’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ సాబ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో చేసిన మరో రివెంజ్ డ్రామా ‘దునియా’

[dropcap]ఎ[/dropcap]నభైలలో వచ్చిన సినిమాలన్నిటిలో కూడా పగ ప్రతీకారం ముఖ్య విషయాలుగా ఉండేవి. అప్పటి కమర్షియల్ సినిమాలో ఇలాంటి కథలు ప్రేక్షకులను బాగా అలరించేవి. అందుకే సెకెండ్ ఇన్నింగ్స్‌లో దిలీప్ కుమార్‌కు అలాంటి సినిమాలే ఎక్కువగా వచ్చేవి. అలాంటిదే 1984లో వచ్చిన ‘దునియా’. మిగతా సినిమాలకి విరుద్ధంగా ఇందులో దిలీప్ సాబ్‌ది ప్రధానమైన పాత్ర. రిషీ కపూర్, అశోక్ కుమార్ లాంటి నటులున్నా వారు దిలీప్ కుమార్ పాత్రకు సహాయకులుగా మాత్రమే ఉంటారు. కథ అంతా కూడా దిలీప్ కుమార్ చుట్టూనే తిరుగుతుంది. అంటే ఈ సినిమాలో ఆయన మల్టీ స్టారర్ సినిమాలోలా నటుల మధ్య ఒక నటుడుగా కాక పూర్తి స్థాయిలో ప్రధాన నటుడిగా కనిపిస్తారు.

మోహన్ కుమార్ నీతీ నిజాయితీలకు ప్రాణం ఇచ్చే వ్యక్తి. అతను పని చేసే కంపెనీలో వ్యవహారం నచ్చక రాజీనామా చేస్తాడు. ఇది తెలిసి మోహన్ కుమార్ స్నేహితుడు దినేష్ తన షిప్పింగ్ కంపెనీకి జనరల్ మానేజర్‌గా అతన్ని నియమిస్తాడు. అంతకు ముందు తన బావమరిది అ పని చేసేవాడని, కాని కొన్ని అవకతవకలు చేయగా నచ్చక అతన్ని తీసేసానని మోహన్‌కి చెబుతాడు. మోహన్ కుమార్‌కి దినేష్ కంపెనీలో జుగల్ కిషోర్, భండారీ, బల్వంత్ అనే ముగ్గురితో పరిచయం ఏర్పడుతుంది. మెల్లిగా కంపెనీ వ్యవహారాలన్నీ తన క్రిందకి తీసుకుని వస్తున్న సమయంలో ఆ షిప్పింగ్ కంపెనీ ద్వారా సరుకు మరో చోటకు వెళుతున్నప్పుడు ఎవరికి అనుమానం రాకుండా చిన్న పిల్లల బొమ్మల్లో డ్రగ్సు రవాణా అవుతున్నాయని కనుక్కుంటాడు మోహన్ కుమార్. ఈ సంగతి స్నేహితుడు దినేష్‌కి చెప్పి ఇద్దరు కలిసి ఇది ఎవరి పనో తెలుసుకోవాలని అనుకుంటారు. దినేష్ తన ఇంట్లో మీటింగ్ ఏర్పాటూ చేస్తాడు. ఆ మీటింగ్‌కి కంపనీ వ్యవహారాలను చూసే జుగల్ కిషోర్‌ని కూడా పిలుస్తాడు. తమ చీకటి వ్యవహారాలు బైటకి వస్తే ప్రమాదమని జుగల్ కిషోర్, భండారీ, బల్వంత్‌లు కలిసి దినేష్‌ని హత్య చేస్తారు. అక్కడికి వచ్చిన మోహన్ కుమార్‌పై ఆ నేరం పడుతుంది. ముగ్గురు కలిసి ఇచ్చిన దొంగ సాక్షం కారణంగా మోహన్ కుమార్‌కి పద్నాలుగేళ్ళ జైలు శిక్ష పడుతుంది.

మోహన్ కుమార్ భార్య సుమిత్ర భర్త మోసపోయిన విధానం తెలుసుకుని కోర్టు తీర్పు తరువాత బల్వంత్‌ని దారిలో అడ్డగించి అతనితో కలబడుతుంది. ఆ తోపులాటలో ఆమె లారీ క్రింద పడి మరణిస్తుంది. మోహన్ కుమార్ ఏడేళ్ళ కొడుకు రవి అనాథ అయి అనాథ శరణాలయం చేరతాడు. జైలు నుండి విడుదలయిన మోహన్ కుమార్ కొడుకు కోసం వస్తే అతను శరణాలయం నుండి చిన్నప్పుడే పారిపోయాడని తెలుస్తుంది. మోహన్ కుమార్ జైలులో ఉన్నప్పుడు స్మగ్లింగ్ కేసులోనే జైలుకి వచ్చిన పూరి ప్రాణాలు కాపాడుతాడు. జైలు నుండి బైటకు వచ్చాక పూరిని మళ్ళీ కలుస్తాడు. పూరి అప్పటికి స్మగ్లింగ్ మానేసి వ్యాపారస్తుడుగా ఒక మంచి హోదాలో ఉంటాడు. అతను మోహన్ కుమార్ పగ తీరడానికి సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. దినేష్‌కి రోమా అనే ఒక కూతురుంటుంది. తల్లి చనిపోయిన ఆమెను మోహన్ కుమార్ భార్య చిన్నతనంలో దగ్గరకు తీసేది. జైలు నుండి వచ్చిన తరువాత మోహన్ కుమార్ రోమా గురించి వాకబు చేస్తాడు. ఆమె తన మేనమామ దగ్గర కష్టాలు పడుతుంది అని తెలుసుకుంటాడు. రోమా ఆస్తి అంతా కరిగించి ఆ మేనమామ ఆమెను చాలా కష్టాలు పెడుతూ ఉంటాడు. అతని దగ్గర నుండి రోమాని తీసుకు వస్తాడు మోహన్ కుమార్. ప్రపంచం గురించి బాగా తెలిసిన పూరి, ఆ తాగుబోతుకి పదివేలు ఇచ్చి రోమా బాధ్యత ఇక తమదే అని కాగితాలపై సంతకం తీసుకుంటాడు.

మోహన్ కుమార్ కొడుకు రవి తన చిన్నప్పటి ఆయా దగ్గర పెరుగుతాడు. చిన్న చిన్న దొంగతనాలలో ఆరితేరతాడు. అతని నైపుణ్యం చూసి జుగల్ కిషోర్ తమ చీకటి వ్యాపారంలోకి తీసుకుంటాడు. దొంగ బంగారంతో వచ్చే నౌకను స్వాధీనపరుచుకుని మొదటి దెబ్బ తన ప్రత్యర్థులకు రుచి చూపిస్తాడు మోహన్ కుమార్. ఇక అక్కడి నుండి వరుసగా ఆ ముగ్గురిని నాశనం చేస్తాడు. భండారి డబ్బు కాలిపోయే స్థితి వచ్చినప్పుడు అతను ఆ మంటల్లో ఇరుక్కుని చనిపోతాడు. బల్వంత్ మోహన్ కుమార్ బార్య లాగానే ఆక్సిడెంట్‌లో చనిపోతాడు. తన భార్యను లారీ క్రిందకు తోసినందుకు అలాంటి చావు అతనికి వచ్చేలా చూస్తాడు మోహన్ కుమార్. చివరగా జుగల్ కిషోర్‌ని జైలుకి పంపి తన పద్నాలుగేళ్ళ ఖైదు జీవితం రుచి చూపిద్దాం అనుకుంటాడు. కాని అతను తిరగబడి పోలీసులనే కాల్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అతన్ని మోహన్ కుమార్ తన పిస్టల్‌తో కాలుస్తాడు.

రవి ముందు జుగల్ కిషోర్ ప్రోద్బలంతో మోహన్ కుమార్ రహస్యాలు తెలుసుకోవడానికి రోమాతో పరిచయం పెంచుకుంటాడు. కాని నిజంగానే ఆమెను ప్రేమిస్తాడు. ఒకసారి మోహన్ కుమార్‌ని చంపే ప్రయత్నంలో అతను మేడపై నుండి క్రిందకు పడిపోతాడు. అప్పుడు మోహన్ కుమార్ అతన్ని రక్షిస్తాడు. మోహన్ కుమార్‌కు రవి మీద మొదటి పరిచయం లోనే ప్రేమ కలుగుతుంది. చివరకు రవి ప్రత్యర్థుల మనిషి అని తెలిసి అతన్ని దూరం పెడతాడు. కాని ఆఖరున అతను తన కొడుకు అని తెలిసి జుగల్ కిషోర్ తనపై కసి తీర్చుకోవడానికి రవిని బంధించాడని తెలుసుకుని, రవి ప్రాణాల కోసం పోరాడతాడు మోహన్ కుమార్. చివరకు తండ్రి కొడుకులు ఒకటవ్వడం కథకు ముగింపు.

‘దునియా’ సినిమాను నిరించింది ధర్మా ప్రొడక్షన్స్ తరపున యాష్ జోహర్. ఇతను కరణ్ జోహర్ తండ్రి. తన సొంత నిర్మాణ సంస్థ పెట్టక ముందు అతను దేవనాంద్ సొంత ప్రొడక్షన్ నవకేతన్ ఫిలింస్ తరుపున కొన్ని సినిమాలకు పని చేసారు. ‘దునియా’ సినిమాకు దర్శకత్వం వహించింది రమేష్ తల్వార్. యాష్ చోప్రా వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసారాయన. తరువాత స్వంతంగా కొన్ని సినిమాలకు దర్శకత్వం చేసారు. రవిగా రిషీ కపూర్ మంచి ఈజ్‌తో నటించారు. రోమాగా అమ్రితా సింగ్ బావుంటుంది. పూరి పాత్రలో అశోక్ కుమార్ నటించారు, ఇక అమ్రిష్ పూరి, ప్రాణ్, ప్రేం చోప్రాలు విలన్‌లుగా కనిపిస్తారు. మోహన్ కుమార్ స్నేహితుడి పాత్రలో ప్రదీప్ కుమార్ గెస్ట్‌గా కనిపిస్తే మోహన్ కుమార్ భార్య సుమిత్రగా సైరా బాను కనిపిస్తారు. రవిని పెంచిన ఆయాగా సులభా దేశ్‌పాండే నటించారు. అప్పుడప్పుడే మొదలయిన పారెలెల్ సినిమా బాటలో నడుస్తూ హిందీ సినిమాలలో చాలా మంచి పాత్రలు పోషించిన నటి సులభా దేశ్‌పాండే. ఈవిడ థియేటర్ ఆర్టిస్ట్‌గా మంచి పేరున్న నటి. మరాఠీ సినిమాలో గౌరవస్థానం పొందిన నటి. భర్త ఆనంద్ దేశ్‌పాండేతో సొంత థియేటర్ గ్రూప్ కూడా నడిపారామె.

ఈ సినిమాకు సంగీతం ఆర్. డి బర్మన్ ఇచ్చారు. మొత్తం ఆరు పాటలలో కిశోర్, లతాలతో పాటూ ఒక్క పాటకు ఆశా మహేంద్ర కపూర్లు గాత్రం అందించారు. కాని అంత హిట్ అయిన పాటలు కావు ఇవి. ‘దునియా’ సినిమా కూడా ప్లాప్ సినిమాగానే బాక్సాఫీస్ రికార్డుల్లో కనిపిస్తుంది. ఏ నటుడి సినిమా అయినా హిట్ అవడానికి ఫ్లాప్ అవడానికి కారణాలు చూస్తే ప్రేక్షకుల రుచి, సినిమాల పట్ల అభిరుచి మారుతూ కనిపిస్తుంది. దిలీప్ సాబ్ చేసిన పాత్రలో దేవదాసు గొప్ప పాత్ర, గొప్ప సినిమా కూడా. శరత్ చంద్ర దేవదాసుకు చాలా దగ్గరగా ఉన్న సినిమా ఇది. కాని క్రిటికల్‌గా ఎన్ని ప్రశంసలు పొందిందో కమర్షియల్‌గా బిమల్ రాయ్‌ని అంత ఏడిపించిన సినిమా ఇది. తన దగ్గరున్నదంతా కుదవ పెట్టి, ఆ తరువాత “మధుమతి” తీసి కాస్త కుదుటపడ్డారు బిమల్ రాయ్. కాని నటనాపరంగా, దర్శకత్వ పరంగా కూడా దేవదాస్ గొప్ప సినిమా. అలాగే “అమర్” సినిమా కూడా. మెహబూబ్ ఖాన్ దర్శకత్వానికి సలామ్ కొట్టాల్సిన సినిమా అది. మధుబాల నటించిన పాత్రలన్నిటిలో గొప్ప పాత్ర ఈ సినిమాలో కనిపిస్తుంది. కథాపరంగా కూడా అద్భుతమైన సినిమా. కాని అదీ కమర్షియల్‌గా ప్లాప్. అప్పట్లో ప్రజలు ఆ కథకు సిద్ధంగా లేరని అర్థం అవుతుంది ఆ సినిమా ఇప్పుడు చూస్తే. “తరానా” సినిమా కూడా మంచి ప్రేమ కథ. మధురమైన పాటలు. కాని అది కూడా వసూళ్ళ పరంగా ప్లాప్ అనే అంటారు.

ఇక దిలీప్ సాబ్ సెకెండ్ ఇన్నింగ్స్‌ని గమనిస్తే ఐదేళ్ళ విరామం తరువాత సహాయ నటుడిగా మారి దిలీప్ కుమార్ చేసిన క్రాంతి ఇప్పుడు చూస్తే తల నొప్పి పుడుతుంది. కాని ఇది ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్. మంచి కథతో చక్కని కథనంతో గొప్ప నటనతో సాగే మజ్దూర్, మషాల్ రెండు కూడా ప్లాప్ సినిమాలుగా బాక్సాపీస్ వసూళ్ళూ చెబుతాయి. ఆ క్రమంలోనే దునియా కూడా ప్లాప్ సినిమాగానే పరిగణించబడింది. కాని ఇప్పుడు చూస్తే సినిమా బావుంటుంది. దిలీప్ సాబ్‌తో పాటు మిగతా అందరి నటన కూడా బాలెన్స్‌డ్‌గా ఉంటుంది. బ్లాక్‌బస్టర్ అని చెప్పబడిన “కర్మ” సినిమా కన్నా కూడా దిలీప్ సాబ్‌కి ఈ సినిమాలోనే నటించడానికి మంచి స్కోప్ ఉంది. కథనం కూడా సాఫీగా సాగుతుంది. అందుకే సినిమా హిట్ ప్లాప్‌లను పట్టించుకుంటూ సినిమాలు చూస్తారు చాలా మంది సినీ ప్రేమికులు. ఒక్క సినిమా హిట్ అవడానికి నటుల పర్మామెన్స్ కన్నా ఇంకా చాలా విషయాలు తోడవుతాయి. కొన్ని సంవత్సరాలు పోయిన తరువాత బోర్ కొట్టిస్తాయి బ్లాక్‌బస్టర్లు, చాలా నచ్చుతాయి ఫెయిల్ అనబడిన సినిమాలు. ఇది బాలీవుడ్ లోనే కాదు హాలీవుడ్ లోనూ ఉన్న పరిస్థితే.

దునియా సినిమాను ఈ హిట్ ప్లాప్‌ల మాయాజాలాన్ని పక్కన పెట్టి చూస్తే ఇది మంచి ఎంటర్టెయినర్. చాలా పగ ప్రతీకారాల సినిమాల కన్నా బావుంటుంది. సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు రాసింది జావేద్ అఖ్తర్. సలీంతో విడిపోయిన తరువాత ఆయన ఒంటరిగా చేసిన సినిమాలలో ‘దునియా’ ఒకటి. దిలీప్ కుమార్ స్థాయికి తగిన సంభాషణలు రాసారాయన. దిలీప్ సాబ్‌కు రాసే సంభాషణలలో నాటకీయత తక్కువ, భాషకు భావానికి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుంది. అందుకే అతనికి రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా హిందీ, ఉర్దూ తెలిసిన వారు సంభాషణలు రాసేవారు. దిలీప్ కుమార్ గొంతు పెంచకుండా హెచ్చు స్థాయిలో అరవకుండా తన స్టైల్‌లో అన్ని ఎమోషన్స్‌ని లో-పిచ్‌లో మాట్లాడేవారు. ఆ స్టైల్‌లో సక్సెస్ అయిన హిందీ నటుడి కూడా ఆయన ఒక్కరే. తరువాత సంజీవ్ కుమార్. ‘దునియా’ సినిమాని ఒక మంచి ఎంటర్టెయినర్ గా చూడవచ్చు ఈ రోజుకి కూడా. దిలీప్ సాబ్ ఈ సినిమాను ఒంటి చేతితో నడిపించారు. ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో ఓం పూరి కూడా కనిపిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here