ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 48 – కోషిశ్

1
6

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం దిలీప్ కుమార్ నటించిన ‘కోషిశ్’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్ ఒకే సీన్ లో నటించిన సినిమా గుల్జార్ ‘కోషిశ్’

[dropcap]గు[/dropcap]ల్జార్ మంచి చిత్రాలను హిందీ సినీ ప్రపంచానికి అందించారు. దిలీప్ కుమార్‌తో వీరి స్నేహం ‘సంఘర్ష్’ సినిమా సెట్స్‌పై మొదలయింది. సంఘర్ష్ సినిమాకి గుల్జార్ రచయితగా, అసిస్టెంట్‌గా పని చేశారు. అలా పరిచయం అయిన ఇద్దరూ స్నేహితులుగా మారారు. 1972 లో గుల్జార్ సంజీవ్ కుమార్, జయ బాధురీలతో ‘కోషిశ్’ అనే సినిమా చేసారు. దానిలో ఒక చిన్న సీన్‌లో కనిపించడానికి దిలీప్ కుమార్ ఒప్పుకున్నారు. ఇలా ఒక్క సీన్‌లో కనిపించడం వీరి కెరియర్‌లో ఇది రెండవసారి. దిలీప్ కుమార్ చిత్రాలన్నిటినీ పరిశీలిస్తున్న క్రమంలో ‘కోషిశ్’ను కూడా పరిశీలించడం అవసరం అనిపించింది. ఇందులో దిలీప్ కుమార్ చేసింది పెద్దగా ఏం లేదు. కాని ఒక రచయిత మిత్రుని కోరిక మీద ఒక చిన్న సీన్‌లో కనిపించడానికి చాలా పెద్ద మనసు కావాలి. ప్రతిఫలాపేక్ష లేకుండా ఏం చేయమని అంటున్న ఇప్పటి స్టార్లతో చూస్తే అంత పేరు ప్ర్రఖ్యాతలున్నప్పుడు, చేతినిండా సినిమాలున్నప్పుడు కూడా ఒక చిన్న షాట్ సినిమా కోసం ఇవ్వడం అన్నది వారి అప్పటి స్థాయిలో పెద్ద మాటే.

ఈ విషయాని గుల్జార్ గారు ‘ది క్వింట్’ అనే పత్రికకు జులై 7, 2021 న రాస్తూ దిలీప్ కుమార్‌తో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. మూగ చెవిటి వారి మీద సినిమా తీస్తున్నానని చెబుతూ దిలీప్ కుమార్ గారిని ఒక సీన్‌లో నటించని గుల్జార్ అన్నప్పుడు ఆయన వెంటనే ఒప్పుకున్నారట. ‘కోషిశ్’ లోనే కాకుండా మూగ చెవిటి వారి మీద ఒక ఇన్స్టిట్యూట్‌కి ప్రమోషనల్ ఫిలిం తీస్తున్నానని తరువాత గుల్జార్ చెప్పినప్పుడు కూడా ఆయన అందులో భాగం అవడానికి ఒప్పుకుని ఒక రోజంతా అ ప్రమోషన్ కోసం షూట్ చేసారట. ఒక మంచి పనికి తన సినీ గ్లామర్ ఉపయోగపడితే అది కొందరికి లాభం అయితే తనకు నటించడానికి ఇబ్బంది లేదని ఆయన ఆ సీన్లలో నటించారు. దిలీప్ కుమార్ సినిమాలన్నిటిని పరిశీలిస్తున్నప్పుడు ‘కోషిశ్’ సినిమా కుడా ఒకటిగా వారి ఫిల్మోగ్రఫీలో కనిపిస్తుంది కాబట్టి ఆ సినిమా గురించి కూడా తెలుసుకుందాం.

సంజీవ్ కుమార్ జాతీయ స్థాయిలో రెండవసారి ఉత్తమ నటుడిగా ‘కోషిశ్’ సినిమాకి ఎంపికయ్యారు. గుల్జార్ సంజీవ్ కుమార్ కాంబినేషన్‌లో చాలా మంచి సినిమాలు వచ్చాయి. గుల్జార్‌కి ఇష్టమైన నటుడు సంజీవ్ కుమార్. వీరిద్దరు కలిసి వైవిధ్యమైన సినిమాలను హిందీ సినీ ప్రపంచానికి కానుకగా ఇచ్చారు. ఈ సినిమాలో ఒక మూగ చెవిటి వ్యక్తిగా కేవలం కళ్ళతో భావాలు పలికించే సంజీవ్ కుమార్ నటనా నైపుణ్యాన్ని చాలా మంది కొనియాడారు. ‘కోషిశ్’లో సంజీవ్ కుమార్ భార్యగా జయ బాదురి నటించారు. ఆవిడ నటన కూడా చాలా గొప్పగా ఉంటుంది. సంజీవ్ కుమార్‌ని ఈ సినిమాలో చూసి అతన్ని అభిమానించని వారు ఉండరు. పంచ్ డైలాగులు, డాన్సులు, పాటలు, అనవసరమైన హీరోయిజంతో హీరోలయిన హిందీ నటులెందరినో చూసాం. కంప్యూటర్ టెక్నిక్స్‌తో ఏ ఎమోషన్ అయినా బాక్ గ్రౌండ్‌తో కవర్ చేసే టెక్నాలజీ మధ్య నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న హీరోలను చూస్తున్నాం. అవేమీ లేకుండా ఒక మూగ చెవిటి పాత్రలో కేవలం శరీర కదలికలతో, కళ్ళతో ఎన్నో భావాలను అవలీలగా పలికించిన సంజీవ్ కుమార్‌ని ఇప్పటి తరం చూడలేదంటే, అతని గురించి తెలుసుకోలేదంటే భారతీయ సినిమాలో ఒక గొప్ప అధ్యాయాన్ని విస్మరించినట్లే.

హరి చరన్, ఆర్తి ఇద్దరూ మూగ చెవిటి. ఒకసారి అనుకోకుండా పరిచయమైన ఆర్తిని ముందు హరి చరన్ గమనించి ఆమెను డెఫ్ అండ్ డంబ్ స్కూల్‌లో చేర్పిస్తాడు. అలా పరిచయం అయిన తరువాత పెద్దల అనుమతితో ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారు. మాటలు లేని వారి సంసారంలో ప్రేమకు మాత్రం లోటు లేదు. వారికి ఒక బిడ్డ పుడతాడు. బిడ్డకు ఏ సమస్యా లేదని తెలుసుకుని ఆ దంపతులిద్దరూ సంతోషించే సందర్భం కంట నీరు తెప్పిస్తుంది. కాని ఆర్తి అన్న బాధ్యతా రాహిత్యం, దుర్మార్గపు ఆలోచనల వలన ఒక ప్రమాదంలో ఆ బిడ్డ చనిపోతాడు. అర్ధరాత్రి బిడ్డ పాకుతూ బైటికి వెళ్ళడం వారికి వినపడదు. అలా తాము పోగొటుకున్న ఆ బిడ్డ మిగిలించిన విషాదాన్ని మరచి ఇద్దరూ మళ్ళీ జీవితం మొదలెడతారు. మరో బిడ్డ పుట్టిన తరువాత ఆ బిడ్డను పెంచుకోవడానికి మితృడైన ఒక గుడ్డి వ్యక్తి సహాయం తీసుకుంటారు. ఆ గుడ్డి వ్యక్తికి వీరిద్దరూ కళ్ళయితే, అతని చెవులు, మాట వీరికి ఉపయోగపడతాయి.

వీరి మధ్య ఆ బిడ్డ పెరగడం, బిడ్దతో వారు ఏర్పరుచుకునే సంబంధం చాలా గొప్పగా ఉంటుంది. భార్య మరణించిన తరువాత హరి ఆమె జ్ఞాపకాలతో బ్రతుకుతుంటాడు. చాలా రోజులుగా హరి పని చేస్తున్న ఆఫీసులోని ఆఫీసర్ కూతురు కూడా మూగ అమ్మాయి. ఆమెను హరి కొడుకికి ఇచ్చి వివాహం జరిపించాలని ఆ ఆఫీసర్ కోరుకుంటాడు. ఆ అమ్మాయిలో హరికి తన భార్య కనిపిస్తుంది. వారు ఇద్దరూ కలిసి బ్రతకడానికి పడిన కష్టాలు కనిపిస్తాయి. కాని కొడుకు ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోడు. అప్పుడు సంజీవ్ కుమార్ కొడుకుకి నచ్చచెప్పే సన్నివేశం, అక్కడ అతను చూపించే ఎమోషన్స్ సంజీవ్ కుమార్ గొప్ప నటనకు ఉదాహరణగా ఎప్పటికీ నిలిచిపోతాయి.

సినిమాలో ఇద్దరు ముఖ్య పాత్రలు మూగ, చెవిటి. కాని ఎక్కడా సినిమాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలగదు. ఆ ఇద్దరి నటుల నటన మనలను కట్టిపడేస్తుంది. నటనకు భాష్యం చెప్పే గొప్ప సినిమా ఇది. ముఖ్యంగా ఇందులో పాత్రలలోని పాజిటివిటీ. తమకేదో లోపం ఉన్నదన్న సంగతే పట్టించుకోకుండా తమకి మాత్రమే సొంతమైన ఒక ప్రపంచాన్ని సృష్టించుకుని వారు జీవించే విధానం చాలా ఇన్స్పైరింగ్‌గా ఉంటుంది. భారతీయ సినీ చరిత్రలోనే ఒక మంచి చిత్రంగా నిలిచిన ఈ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. సంజీవ్ కుమార్ జయ బాదురితో కలిసి ఇంటికి వెళ్తూ ఉంటాడు. మధ్యలో పార్కులో ప్రేమికులు మాట్లాడుకోవడం చూసి వారి వైపు చూస్తున్న అతన్ని తన సైగల భాషతో మందలిస్తుంది జయ. తరువాత ఒక టెలిఫోన్ బూత్‌లో గొంతు చించుకుని మాట్లాడుతున్న ఒక వ్యక్తిని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. అలా తనకూ ఫోన్ వాడాలని ఉందని సంజీవ్ కుమార్‌తో చెబుతుంది. సంజీవ్ కుమార్ ఆమెను ఫోన్ బూత్ లోకి తీసుకువెళ్ళి ఐదు నంబర్లు తిప్పి ఒకరికి ఫోన్ చేస్తాడు. అది ఎవరో వడ్డీ వ్యాపారస్తునికి వెళుతుంది. ఇటు పక్క సంజీవకుమార్ మూలుగులు అవతలి వారికి అర్థం కావు. అతని భాష ఇవతలున్న వారికి అర్థం కాదు. తరువాత మరో ఫోన్ జయ బాదురి చేత చేయిస్తాడు. ఈసారి ఒక తెల్ల దుస్తుల అఫీసర్ వద్దకు ఆ కాల్ వెళ్తుంది. మూడవసారి అది దిలీప్ కుమార్ ఇంటికి కనెక్ట్ అవుతుంది. దిలీప్ కుమార్ ఫోన్ తీసుకంటారు ఎవరు కావాలి. ఎవరితో మాట్లాడాలి అని అడిగి జవాబు రాక ఫోన్ పెట్టేస్తారు. పెట్టేస్తూ “యె తో ముజ్ సే భీ మద్దమ్ బోల్తే హై” అంటారు. దిలీప్ కుమార్ తన సంభాషణలను లో గొంతుకతో మాట్లాడతారని అందరికీ తెలుసు. దాన్ని గుర్తు చేస్తూ ‘వీరెవరో కాని నాకన్నా మెల్లగా మాట్లాడుతున్నారు” అంటూ ఫోన్ పెట్టేస్తారు దిలీప్ కుమార్.

ఈ సీన్‌కి ఆయనే ఉండవలసిన అవసరం లేదు. కాని గుల్జార్ ఇక్కడ ఒక వ్యాపారస్తుని చికాకు, ఒక ఉద్యోగి అసహనం, ఒక హీరో కుతూహలాన్ని చూపిస్తూ, వీటికి అతీతంగా ఉండే ఆ మూగ చెవిటి వారి ప్రపంచం, ప్రపంచంలో ఇన్ని సాధారణ విషయాలను వినలేని, మాట్లాడలేని ఒక జంట నిస్సహాయతను చూపించే ప్రయత్నం చేసారు. ఈ సీన్‌లో వచ్చే ఆ ముగ్గురిలో ఒకరు గట్టిగా, ఒకరు అరిచి ఒకరు అతి మెల్లిగా మాట్లాడడం చూస్తాం. మెత్తని సంభాషణ కోసం ఈ ఒక్క షాట్‌కి గుల్జార్‌కు దిలీప్ కుమార్ గుర్తుకు వచ్చారంటే, అప్పట్లో ఆ మెత్తటి డైలాగ్ డెలివరీకి దిలీప్ కుమార్ ఎలా అందరికి ట్రేడ్ మార్క్‌గా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు.

ఆ సమయంలో దిలీప్ కుమార్ తన ‘బైరాగ్” సినిమాకు రాజ్ కమల్ స్టూడియోలో పని చేస్తున్నారట. అక్కడకి వచ్చి షాట్ తీసుకొమన్నారట ఆయన. బైరాగ్ సినిమాకి అసిత్ సేన్ దర్శకులు. అతని అనుమతి తీసుకుని తన కెమెరా తెచ్చుకుని దిలీప్ సాబ్‌తో ఒక్క షాట్ తీసుకోవాలని అనుకున్నారు గుల్జార్. కాని దిలీప్ సాబ్ ఆ చిన్న షాట్ కోసం గుల్జార్ తన కెమెరాని తెచ్చుకునే ప్రయత్నంలో ఇబ్బంది పడడం ఎందుకని అసిత్ సేన్‌ని వారి కెమెరా లోనే ఆ షాట్ తీసి, అది డెవలప్ చేసి ఆ ఫుటేజి గుల్జార్‌కి ఇమ్మని చెప్పారట. అసిత్ సేన్ కుడా దానికి ఒప్పుకున్నారు. అలా ఆ ఒక్క షాట్ ‘కోషిశ్’ సినిమాలో చేర్చబడింది. అయితే సినీ కామియోలపై స్టడీ చేసిన సందర్భంలో ఈ సినిమాలో దిలీప్ కుమార్ కామియోని హిందీ సినీ రంగంలో ఒక మంచి కామియోగా దృవీకరిస్తారు సినీ విశ్లేషకులు.

‘కోషిశ్’లో సంజీవ్ కుమార్ తన శరీరంతో మాట్లాడే విధానం బావుంటుంది. అన్ని హావభావాలను కళ్ళు ముఖంతోనే కాక భుజాల వంపుతో కూడా సంభాషిస్తారు ఆయన. నటన నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరు ప్రతి సీన్‌లో సంజీవ్ కుమార్ వాడిన శరీర భాషను గమనించగలిగితే ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతారు. సంజీవ్ కుమార్ నటించిన గొప్ప చిత్రం “కోషిశ్’లో దిలీప్ కుమార్ గారు కనిపించే ఆ ఒక్క నిముషం కుడా ఎంజాయ్ చేసారు అప్పటి దిలీప్ కుమార్ అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here