ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 58 – ప్రతిమ

0
8

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం దిలీప్ కుమార్ నటించిన ‘ప్రతిమ’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

పైడి జయరాజ్ దర్శకత్వంలో వచ్చిన దిలీప్ కుమార్ రెండవ సినిమా ‘ప్రతిమ’

[dropcap]‘ప్ర[/dropcap]తిమ’ 1945లో వచ్చిన సినిమా. ఇది దిలీప్ కుమార్ నటించిన రెండవ సినిమా. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది మన తెలుగు వారు పైడి జయరాజ్. పైడిపాటి జయరాజ్‌గా ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్లలో జన్మించిన జయరాజ్ సరోజినీ నాయుడు గారికి మేనల్లుడు. నిజాం కాలేజిలో డిగ్రీ చదువుకుంటున్న సమయంలోనే సినిమాల పట్ల ఆకర్షణ పెరిగి బొంబాయి వెళ్ళిపోయారు. 1929లో స్టార్ కింగ్ యూత్ అనే మూకి సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన జయరాజ్ పదకొండు మూకీ సినిమాలలో నటించారు. తరువాత హిందీ సినిమాలలో చారిత్రక పాత్రలను ఫోషించి మెప్పించిన జయరాజ్ థియేటర్ ఆర్టిస్ట్‌గా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. రెండు డజన్లకు పైగా సినిమాలలో నటించిన తరువాత మొట్టమొదటి సారి ‘ప్రతిమ’ సినిమాను డైరెక్ట్ చేసారు. దిలీప్ కుమార్‌గా మారిన యూసఫ్ ఖాన్ అంతకు ముందు నటించిన జ్వార్‌భాటా పెద్దగా అయనకి పేరు తీసుకురాలేదు. జయరాజ్ ఆయనని మరోసారి తెర మీద నటించజేసి నటన పాఠాలు నేర్పారు, తన ‘ప్రతిమ’ సినిమాతో. హిందీ, మరాఠీ, గుజరాతీ  కలిపి 170 సినిమాలకు పనిచేశారు జయరాజ్.  దీర్ఘ కాలం  సినీ కెరీర్ నిలుపుకున్న వ్యక్తిగా రికార్డు కెక్కారు. వి. శాంతారాం, పృథ్వీరాజ్ కపూర్, మోతీలాల్‌కు సమకాలీనులైన వీరికి సినీ రంగంలో ఆ రోజుల్లో గొప్ప పేరు ఉండింది. 1980లో దాదా సాహెబ్ పురస్కారంతో ప్రభుత్వం వీరిని సత్కరించింది.

‘ప్రతిమ’ సినిమా బాంబే టాకీస్ నిర్మించిన చిత్రం. అప్పుడు దానికి యజమానురాలు దేవికా రాణి. ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రకు ముఖ్రీ అనే ఒక నటుడిని ఎన్నుకున్నారామె. ముఖ్రీ నవ్వు, అతనిలో ఉండే అ నిరంతర ఉత్సాహం చూసి అతను సినిమాలలో రాణిస్తాడని ఆమె నమ్మి ఈ సినిమాలో అవకాశం ఇచ్చారు. అ తరువాత కొన్ని వందల సినిమాల్లో ముఖ్రీ నటించారు. హిందీ సినిమాలో హాస్య నటుడిగా పేరు పొందిన మెహమూద్ తండ్రి ముంతాజ్ అలీ కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించారు. ముంతాజ్ అలీ నటుడిగా కన్నా నాట్యకారుడిగా మంచి పేరు ఉంది. అప్పట్లో ఆయనకి ఒక సొంత డాన్స్ ట్రూప్ ఉండేది. తాగుడు  కారణంగా త్వరగా ఆయన కెరీర్ ముగింపు కొచ్చింది. ఇంటిని పోషించడానికి మెహమూద్ బాల నటుడిగా, అతని సోదరి మిన్నూ ముంతాజ్ సినిమాలలోకి రావలసి వచ్చింది. బొంబాయ్ టాకీస్ వ్యవస్థాపకుడు హిమాన్షు రాయ్ బాంబే టాకీస్‌లో జీతానికి మొదట ముంతాజ్ అలీని తీసుకున్నారు.

‘ప్రతిమ’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన స్వరన్ లత దేశ విభజన అనంతరం పాకిస్తాన్ వెళ్ళిపోయారు. అప్పట్లో ట్రాజిక్ కారెక్టర్లకి ఆమె ప్రసిద్ధి. బ్రిటీష్ ఇండియాలో 22 సినిమాలలో నటించారామె. సిఖ్‌గా జన్మించిన ఆమె నాజిర్ అహ్మద్ అనే ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాతను వివాహం చేసుకుని ఇస్లాం స్వీకరించారు. వారు సంపాదించినదంతా వదిలి పాకిస్తాన్ వెళ్ళి మళ్ళీ జీవితాన్ని మొదలు పెట్టారట. పాకిస్తాన్ సినీ ప్రపంచంలో ఈ దంపతులకు మంచి పేరు, గౌరవం ఉంది. దిలీప్ కుమార్ తమ్ముడు నాసిర్ ఖాన్ వివాహం  ఈ నాజిర్ అహ్మద్ కూతురితో జరిగింది. స్వరన్ లత 1944లో “రత్తన్” అనే సినిమాతో పాపులర్ అయ్యారు. దీనికి ముందు ఒక అరు సినిమాలలో నటించినా రత్తన్ ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చిందని అంటారు. ఈ సినిమాతోనే నౌషాద్ కూడా హిందీ సినీ ప్రపంచంలో టాప్ సంగీత దర్శకుడిగా మారారు. స్వరన్ లతతో దిలీప్ కుమార్ నటించిన ఒకే ఒక సినిమా ‘ప్రతిమ’.

ప్రవాసి అనే ఒక వ్యాపారి కూతురు ప్రతిమ. ఒకప్పుడు ప్రవాసి బందిపోటుగా జీవించాడు. రాజన్ ప్రతిమను ప్రేమిస్తాడు. కాని అతని కుటుంబం వారి వివాహానికి ఒప్పుకోదు. ప్రవాసి అనే మాజీ బందిపోటు కూతురిని కోడలిగా స్వీకరించడానికి ఇష్టపడదు రాజన్ కుటుంబం. లాల్ సాహబ్ అనే ఒక ధనవంతుని కూతురిని అతను వివాహం చేసుకోవాలన్నది వారి కోరిక. లాల్ సాహెబ్ ఇంటి వెనుక ప్రతిమ అనే పేరుతో ఒక స్త్రీ శిల్పం ఉంటుంది. అది ఎవరిదో ఎవరికీ తెలీదు. ఒక పిచ్చి ముదుసలి అ శిల్పాన్ని కాపాడుతూ ఉంటుంది. అ శిల్పం ప్రసక్తి వచ్చినప్పుడల్లా భయంతో వణికి పోతుంటాడు లాల్ సాహబ్. ప్రతిమ ప్రేమ పొందలేని రాజన్ ఆమె పిచ్చిలో ఈ శిల్పంలో ప్రతిమను చూసుకుంటూ ఉంటాడు.   ఆ ప్రతిమ చుట్టూ ఒక గుడి కట్టిస్తాడు. చివరకు ఆ ముసలామె ప్రతిమ సొంత తల్లి అని, ఆ ఆస్తికి, ఎస్టేట్‌కు ఆమె యజమానురాలని, ఆమె భర్తను హత్య చేసి లాల్ సాహబ్ ఆ ఆస్తి కాజేసాడని, ప్రతిమను ప్రవాసి రక్షించి ఆమెను తన కూతురుగా పెంచుకున్నాడని తెలుస్తుంది. లాల్ సాహబ్ దుర్మార్గం ఆ ఊరి వాళ్ళు మర్చిపోకుండా ఉండాలని ఆ ప్రతిమను ఆమె తల్లే అక్కడ పెట్టించింది. చివరకు కథ సుఖాంతంగా ముగుస్తుంది.

ఈ సినిమాలో పాటలు రాసింది పండిత్ నరేంద్ర శర్మ. “ఆతా లబో పె నామ్ తెరా బార్ బార్ క్యో” అన్న పాట చాలా బావుంటుంది. దీన్ని జ్యోతి అన్న ఆమె పాడారని యూట్యూబ్ క్రెడిట్స్‌లో రాసారు. పారుల్ ఘోష్ “చాంద్ ఉగా రే” అన్న పాట కూడా అప్పట్లో పాపులర్ పాటగా చెబుతారు. ఈ సినిమాలో మొత్తం ఏడు పాటలున్నాయి. పండిత్ నరేంద్ర శర్మ హిందీలో పెద్ద రచయిత, కవి. వీరు ‘సత్యం శివం సుందరం’ అన్న సినిమాకు 1979లో రాసిన టైటిల్ సాంగ్‌కి ఉత్తమ గేయ రచయితగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. లతా మంగేష్కర్ ఆయన్ని నాన్న అని పిలిచేవారట. అంతే కాదు, ఆల్ ఇండియా రేడియో వివిధ భారతి ఫౌండర్ కూడా వీరే. ఆ తరం ‘ప్రతిమ’ నుంఛి నేటి తరం ఇష్టపడిన మహాభారత్ సీరియల్‌లో పాటలు దాకా రాసిన గొప్ప గేయ రచయిత ఆయన. హిందీ సినీ గేయ ప్రపంచంలో అత్యంత గౌరవం అందుకునే గేయ రచయిత పండిత్ నరేంద్ర శర్మ. ఈయన అంటే లతా కు ఎంత గౌరవం అంటే, సత్యం శివం సుందరం సినిమాలో పాటలు పాడేందుకు లతాను ఒప్పించటానికి రాజ్ కపూర్ ఇందులో పండిత్ నరేంద్ర శర్మ పాట రాసారు అని చెప్పటంతోటే, ఆయన పాట పాడే అవకాశాన్ని వదులుకోవటం ఇష్టంలేక లతా ఆ సినిమాలో పాటలు పాడింది. భాభీ కి చూడియా సినిమాలో నరేంద్ర శర్మ రాయగా, స్నేహల్ భాట్కర్ రూపొందించిన పాట “జ్యోతి కలష్ ఛల్కే”  పాట ఈ నాటికీ ప్రాతః కాలాన ఉషోదయాన్ని ఆహ్వానిస్తూ మోగుతూంతుంది. మహభారత్ సీరియల్ మొదటిసారి అంటే 1989లో టీవీలో ప్రసారమవుతున్నప్పుడే ఆయన కన్ను మూసారు. ‘ప్రతిమ’ సినిమాకి వీరు రాసిన పాటలకు అరుణ్ కుమార్ సంగీత దర్శకత్వం వహించారు.  ప్రతిమ సినిమాకు సంగీత దర్శకత్వం వహించిన అరూణ్ కుమార్ ముఖర్జీ,  అశోక్ కుమార్ కు బంధువు. అశోక్ కుమార్ సినిమాల్లో విజయం సాధించటం చూసి ఈయన కూడా సినిమరంగంలోకి వచ్చాడు. 1938లో నిర్మల సినిమాతో గాయకుడిగా రంగ ప్రవేసంచేశాడు. 1940లో బంధం సినిమాలోని పాతలతో గాయకుడిగా పెద్ద ఎత్తున గుర్తింపువచ్చింది. ప్రతిమ(1945), హాతింతై(1947), పరిణీత, షమ్షీర్(1953), సమాజ్(1954), తీన్ భాయి(1955) వంటి సినిమాలకు సంగీత దర్శకత్వం వహించాడు. ఆజాద్(1940), నయా సన్సార్, బేటి, అంజాన్ (1941) , జ్వార్ భట(1944) సినిమాల్లో నటించాడు. హమారి బాత్, అంధేరా(1943), కార్వాన్, భవ్రా(1944), ప్రతిమ(1945), ములాకాత్, సమాజ్ కో బదల్ డాలో(1947), సెహ్రా(1948), గ్రుహలక్ష్మి(1949), మషాల్, ముకద్దర్(1950), ఆందోలన్(1951), మా(1952) వంటి సినిమాల్లో హిట్ పాటలు పాడేడు. 1955లో అశోక్ కుమార్ నటించిన బంధన్ సినిమా షో చూస్తూండగా గుండెనొప్పి వచ్చింది. ఆస్పత్రికి వెళ్ళోలోగా, అశోక్ కుమార్ చేతుల్లో ప్రాణాలు విడిచాడు అరూన్ కుమార్. కిసోర్ కుమార్ కు పాటలు పాడటంపై ఆసక్తి అరూణ్ కుమార్ వల్లనే లభించింది అంటారు. పారుల్ ఘోష్ పాటలు పాడారు. అనిల్ బిస్వాస్ సోదరి అయిన పారుల్ హిందీ బెంగాలీ భాషలలో పాటలు పాడేవారు. ఆ నాటి మొదటి ప్లే బాక్ సింగర్‌గా ఈవిడని సినిమా చరిత్రలో గుర్తు పెట్టుకుంటారు సినీ విశ్లేషకులు.

దిలీప్ కుమార్ సినిమాలన్నీ పరిశీలిస్తున్న క్రమంలో ‘ప్రతిమ’ సినిమా కోసం చాలా ప్రయత్నించాను. కాని అది ఇప్పుడు లభ్యం కావట్లేదు. ఈ సినిమా గురించి సేకరించిన సమాచారమంతా కూడా ఇంటర్నెట్ ద్వారానే లభించింది. ఒక మూడు పాటలు మాత్రం వినడానికి దొరికాయి. అయితే ఈ సినిమాకు పని చేసిన వారి వివరాల సేకరించడం కోసం కొంత పని చేయడం వలన దిలీప్ కుమార్ ఆనాడు పని చేసిన సినిమా వాతావరణం, ఆయన కాంటెంపరీల స్థాయి అర్థం చేసుకోవడం జరిగింది. మన చుట్టూ మంచి పోటీ ఉంటే వృత్తిలో వ్యక్తులు రాణించడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజులలోని సినిమా వాతావరణం, ఆనాటి సాహిత్యకారులు, సంగీత దర్శకులు, నేపథ్య గాయకులు అందరు కూడా పటిష్టమైన కళాత్మక వాతావరణంలో తయారయ్యారు. అప్పట్లో కూడా రాజకీయాలు, ఈర్ష్యా ద్వేషాలు అన్నీ ఉండే ఉంటాయి. కాని వృత్తిపరంగా ఎదగడానికి, తమలోని టాలెంట్‌కు పూర్తి న్యాయం జరగడానికి అనుకూలమైన వాతావరణం ఉండేది. అందుకే పనిని వారు అంత నిబద్ధతతో చేసేవారు. ఆ వాతావరణం కారణంగానే సినిమాకి అది గోల్డెన్ పీరియడ్ అయింది. అటు ఉత్తరాదిన కాని దక్షిణాదిన కాని ఉత్తమమైన నటులు, మంచి సాహిత్యం, సంగీతం ఆనాడు సినిమాకు వన్నె తెచ్చాయంటే కారణం ఆ కళాకారుల కలయిక. దిలీప్ కుమార్ విజయం వెనుక వారందరి హస్తం ఉంది. వారితో పాటు పని చేసే అవకాశం లభించడం వలన దిలీప్ కుమార్ ఆ స్థాయికి వెళ్ళగలిగారు అన్నదాంట్లో సంపూర్ణమైన న్యాయం ఉంది. ప్రతి నిముషం దిగ్గజాలతో పని చేస్తున్న వ్యక్తి వారి ముందు తనను తాను నిలబెట్టుకోవడానికి ఎంత కృషి చేస్తాడు, ఎంతగా శ్రమ పడతాడో, ఎన్ని విధాలుగా తనను తాను మలచుకుంటాడో తెలుసుకోవడానికి దిలీప్ కుమార్ సినీ ప్రస్థానమే ఒక ఉదాహరణ.

బాంబే టాకీస్ విడిపోయి ఫిల్మిస్తాన్ ఏర్పడి అశోక్ కుమార్, శశిధర్ ముఖర్జీ లాంటి వారందరూ వీడి వెళ్ళిపోయిన తరువాత దిలీప్ కుమార్ బాంబే టాకీస్ లోకి వచ్చారు. అతనితో తీసిన జ్వార్‌భాటా ప్లాప్ అయింది. దిలీప్ కుమార్ నటన నచ్చలేదు ప్రేక్షకులకి. జ్వార్‌భాట సినిమాలో దిలీప్ కుమార్ మృదులలు నటించారు. బోంబే టాకీస్ లోని వారంతా దిలీప్ కుమార్ పనికిరాడని, మృదులకు చక్కని భవిష్యత్తువుందనీ భావించారు. కానీ, దిలీప్ కుమార్‌లో చక్కని నటుడు దాగివున్నాడని నమ్మింది దేవికా రాణి మాతమే.  కాని దేవికా రాణి మాత్రం అతనికి మరో అవకాశం ఇవ్వాలని నిశ్చయించుకున్నారు.  ఇప్పుడు దిలీప్ కుమార్ లెజెండరీ నటుడయ్యారు. ఆ కాలంలోనే మృదుల చిన్న పాత్రలకు పరిమితమయ్యింది. ఆమె హయాంలో బాంబే టాకీస్ నిర్మించిన ఆఖరి సినిమా  ‘ప్రతిమ’. ‘ప్రతిమ’ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. తరువాత దిలీప్ కుమార్ “మిలన్” అనే సినిమా చేసారు. అదీ సరిగ్గా ఆడలేదు. కాని మిలన్‌తో ఆయన నటనపై పట్టు తెచ్చుకున్నారు. తరువాత సినిమా “జుగ్ను” దిలీప్ కుమార్ మొదటి హిట్. అయితే ఆశ్చర్యంగా అందులో ఆయన పాత్ర కామెడీ పండించి ప్రజలను మెప్పించి చివరకు ట్రాజెడీతో ముగుస్తుంది. దిలీప్ కుమార్ సినిమాలలో చాలా ప్లాప్‌లు చూస్తాం కాని వాటి మధ్య కూడా తన నటనను ఆయన ఎలివేట్ చేసుకోగలిగారు. అదే ఆయన ప్రత్యేకత.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here