ఒక దిలీప్ కుమార్ – 64 సినిమాలు – 60 – పారి

1
13

[box type=’note’ fontsize=’16’] సంచిక పాఠకుల కోసం దిలీప్ కుమార్ నటించిన ‘పారి’ సినిమాని పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

దిలీప్ కుమార్ మొదటి బెంగాలి చిత్రం ‘పారి’

[dropcap]క[/dropcap]ళకు భాషా భేదాలు లేవన్నది అందరం నమ్ముతున్న విషయమే. అయితే భాషను కళాత్మకతను ఒక మాధ్యమంగా కూడా అందరం గుర్తిస్తాం. అందమైన మాటలు, అందంగా వ్యక్తీకరించిన భావాలు, ఇవి భాషకు సొగసులు అద్దుతాయి. అందుకే భాషకు కళాకారులు అంతులేని ప్రాధాన్యతను ఇస్తారు. ఇంత వైవిద్యం లేకపోతే, భాష ఒక సమూహానికి అస్తిత్వం కానపోనట్టయితే, అందరం సైగల భాషతోనే సరిపెట్టుకుని ఉండేవాళ్ళం. భాష లేకపోతే సాహిత్యం పరిస్థితి ఊహించలేం. సాహిత్యమే సినిమాకు ఊపిరి. అంటే భాష సినిమాకు చాలా పెద్ద అత్యవసరమైన సాధనం. ప్రస్తుతం ఆధునిక సినిమాను చూస్తే అందులో ఎక్కడో ఆత్మ అన్నది మిస్ అవుతున్న భావన కలుగుతుంది. కారణం టెక్నాలజీ పుణ్యమా అని భాష కళాకారులకు పెద్ద అవసరం లేని విషయం అయిపోయింది. భాష తెలియని నాయికలు, భావయుక్తంగా అర్థవంతంగా డైలాగులు చెప్పలేని హీరోలు కూడా ఇప్పుడు నటులే. వారు ఇప్పుడు చేస్తున్న పని, వారికొచ్చిన భాషలో పెదాలు కదిలిస్తే డబ్బింగ్ మరొకరు చెబుతారు. ఇలా నటులవుతున్న వారు, నటులుగా ప్రశంసలందుకుంటున్నవారు, చాలా మంది కనిపిస్తారు. చాలా మంది తెలుగు హీరోయిన్లకు తెలుగు రాదు. అది ఇప్పుడు చాలా పెద్ద ఎసట్. మరో ప్రాంతపు పాపులర్ హీరోలు మన భాషలో డబ్బింగ్ సహాయంతో హీరోలయిపోతారు. వీరి టాలెంట్‌ని కించపరచట్లేదు. కాని మనం రోజు వారి జీవితంలో కేవలం పెదవి కదిలించి, పక్కన వారు మన బదులుగా మాట్లాడితే ఎంత గాప్ సంభాషణలో ఏర్పడుతుందో, అదే గాప్ ఒక ఆర్టిస్ట్‌కు ఆ పాత్రకు మధ్య ఏర్పడుతుంది ఆ డబ్బింగ్ ప్రక్రియతో. అందుకే ఆనాటి పాత తరం తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకుని చేస్తున్న పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చాలని తపన పడేవారు. అందుకే ఆ పాత సినిమాలలో ఒక నేటివిటి, ఒక ఆత్మ కనిపిస్తుంది.

ఇది చర్చించడానికి దిలీప్ కుమార్ నటీంచిన ‘పారి’ సినిమాను ఇక్కడ ప్రస్తావించవలసి వస్తుంది. పారి 1966లో జగన్నాధ్ చటర్జీ దర్శకత్వంలో వచ్చిన బెంగాలీ సినిమా. ధర్మేంద్రకు హీరోగా బెంగాలీలో మొదటి సినిమా. ఇదే సినిమాను ఇదే తారాగణంతో 1972లో అనోఖా మిలన్ అనే పేరుతో హిందీలో తీసారు. “అనోఖా మిలన్” సినిమా గురించి అంతకు ముందే చెప్పుకున్నా కూడా, ఇప్పుడు ‘పారి’ గురించి చెప్పడానికి కారణం, ఇది దిలీప్ కుమార్ బెంగాలీలో నటించిన మొదటి సినిమా కావడం, ఇందులో వారిది అతిథి పాత్ర కావడం, ఈ సినిమాకి ఆయన తన డబ్బింగ్ తానే చెప్పుకోవడం. బెంగాలీ భాషీయుల స్థాయిలో ఆ భాష నేర్చుకుని, ప్రాక్టీస్ చేసి దిలీప్ కుమార్ ఈ సినిమాకు డబ్బింగ్ తానే చెప్పుకున్నారు.

ఈ సినిమాలో చివర్లో వచ్చే అతిథి పాత్ర దిలీప్ కుమార్‌కి పెద్ద స్టార్‌డమ్ తెచ్చే పాత్ర కాదు. దిలీప్ కుమార్‌ను బెంగాలీ తెరకు పరిచయం చేస్తున్న పాత్ర. బెంగాలీ భాషీయులకు దిలీప్ సాబ్ ఒక హిందీ నటుడు గానే తెలుసు. మరో విధంగా చెప్పాలంటే హిందీలో దేవదాసును కూడా చేసిన నటుడిగా మాత్రమే గుర్తు పెట్టుకుంటారు. కాని ఒక్క 15 నిముషాలు మాత్రమే కనిపించే ఈ పాత్రకు దిలీప్ కుమార్ చేసిన హోమ్ వర్క్ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మధ్యలో కొన్ని ఇంగ్లీషు డైలాగులు వచ్చినా {హిందీ సినిమాలో కూడా ఇంగ్లీషు డైలాగులు వస్తాయి} చాలా ఈజ్‌గా అదే లో-గొంతుకతో, అదే స్టైల్‌లో ఆశువుగా ఆయన మాట్లాడే బెంగాలీ డైలాగులలో మనకు ఎక్కడా లోపాలు కనిపించవు. పాత్రలో ఆయన ఒదిగిపోయిన ఆ విధానం ఆయన కమిట్‌మెంట్‌ను చూపిస్తుంది. ఒక్క పదిహేను నిముషాల సేపు ఆయన కనిపించే సీన్‌లో సుమారు రెండు పేజీల డైలాగుల కన్నా ఎక్కువ ఉంటాయి. దిలీప్ కుమార్ తన కెరీర్‌లో తన కాంటెంపరీలతో పోలిస్తే ఎక్కువ సినిమాలు చేయలేదు. ‘పారి’ సినిమా వారి సినిమాల సంఖ్య పెంచుకోవడానికి చేసినది కాదు. ఆ చిన్న పాత్రకు భాషను నేర్చుకుని ఆయన చేసిన న్యాయం చూసిన తరువాత ఎంత నిడివి ఉన్న పాత్ర అని కాదు ఏ పాత్ర అయినా ఆయన ఒకేలా పని చేసేవారని, కష్టపడేవారని అర్థం అవుతుంది. దీనికి అంత సమయం కూడా పట్టే ఉంటుంది. అయినా తీసుకున్న పాత్ర కోసం పూర్తిగా ఆ పాత్రను ఓన్ చేసుకుని నటించడం దిలీప్ కుమార్ నైజం. ఈ విషయాన్ని స్పష్టంగా పారి సినిమాలో చూడవచ్చు.

బెంగాలీలో ఈ సినిమాను ఇందులో నాయిక పాత్ర వేసిన ప్రొణోతి ఘోష్ నిర్మించారు. హిందీలో అదే సాంకేతిక వర్గంతో, నటులతో ఆర్.జే. వాజీరాని నిర్మించారు. కథాపరంగా కూడా రెండు సినిమాలు గమనిస్తే బెంగాలీ భాషలో ఒక నేటివిటి కనిపిస్తుంది. బెంగాలీ వాతావరణంలోనే నిర్మించిన హిందీ చిత్రంలో ఆ నేటివిటి కనిపించదు. పాత్రలన్నీ బెంగాలీ సంప్రదాయానికి ప్రతీకలుగా నిలవడం చూస్తాం. అంటే సినిమాలో అన్ని పాత్రల కట్టూ బొట్టూ బెంగాలీ ప్రాంతంతో పోలి ఉన్నా భాష మాత్రం హిందీ అయి ఉండడం వలన బెంగాలీ సినిమా చూస్తున్నప్పుడు ఉన్న ఫీల్ హిందీ సినిమాలకు రాదు. అసలు బెంగాలీ సాహిత్యం, లేదా కథల ఆధారంగా తీసిన ప్రతి సినిమా కూడా హిందీలో బెంగాలీ సాంప్రాదాయాన్నిపాటిస్తూ హిందీ మాట్లాడే పాత్రలే. చివరకి దేవదాసు కూడా (ఒక్క తెలుగు దేవదాస్ మాత్రమే పూర్తిగా తెలుగు వాతావరణం చూపిస్తూ తీసారు). అంతగా బెంగాలీ కథల నేటివిటీ చెడకుండా వారి సాంప్రదాయాలతో హిందీ ప్రజలు ఆ సినిమాలు చూసేలా అలవాటు చేసారు ఆనాటి హిందీ సినిమా దర్శకులు. ఆనాటి బిమల్ రాయ్ దేవదాస్ నుంచి మొన్న మొన్నటి “పరిణితా” వరకు మనకు బెంగాలి సాహిత్యంలో నుండి తీసుకున్న కథలు హిందీలో తీస్తున్నప్పుడు అదే సాంప్రదాయ పద్ధతులతో తీయడం చూస్తాం. ఇది బెంగాల్ ప్రాంతపు ప్రజల భాషాభిమానం సాహిత్యాభిమానం. హిందీ సినిమాలను బెంగాలీ వాతావరణంలో కేవలం ఆ ఒక్క భాషీయులే తీయగలిగారు ప్రజలను మెప్పించగలిగారు. కాని బెంగాలీ సినిమాలను అదే కథలతో మళ్ళీ చూస్తున్నప్పుడు మనకు అర్థం అవుతుంది హిందీ సినిమాలలో లోపించిన నేటివిటి.

సినిమాకు ఈ నేటీవిటీ ప్రాణం. అందుకే నటులకు వారు నటిస్తున్న భాష తెలియడం చాలా అవసరం. దాన్ని పాటించారు కాబట్టే ఆనాటి తరం నటులు వారి పాత్రలతో పాటూ గుర్తుండి పోతారు. ఈ విషయాన్ని సాంకేతిక నైపుణ్యంతో కప్పి పుచ్చుకుని పోతున్నారు కాబట్టే నేటి తరం సినిమాలను సృష్టిస్తున్నారు కాని గుర్తుండిపోయే పాత్రలను కాదు. ‘పారి’ సినిమాలో ఒక జానపద గీతం ఉంటుంది “తోరా సుందోర్ సామీ పాబీ” {మీ కందరికీ అందమైన భర్తలు వస్తారు}. ఈ పాట సలీల్ చౌదరికి నిర్మలేందు చౌదరీ అనే ప్రఖ్యాత బెంగాలీ జానపద గాయకుడు అందించారట. బెంగాల్ ప్రాంతపు పల్లెటూర్లలో పెళ్ళికి ముందు ఈ పాట పాడే సాంప్రదాయం అప్పట్లో ఉండేదట. ఈ పాటలను అలాగే ఉంచి అదే బాణీలతో హిందీలో తీసారు. సలీల్ చౌదరి భార్య సబితా చౌదరి బెంగాలీలో ఈ పాట పాడారు. హిందీ సినిమాలో కూడా ఆమె గొంతు వినిపిస్తుంది. తమ సినిమాను హిందీలో తీస్తుంటే అచ్చం బెంగాలీ సాంప్రదాయాన్ని సూచిస్త్తూ తీసే ప్రాంతీయాభిమానం బెంగాలీల సొంతం. తమ సినిమాలలో దిలీప్ కుమార్ లాంటి పెద్ద నటుడి నటిస్తున్నా అతను బెంగాలీలో మాట్లాడడం వారికి ముఖ్యం ఆ రోజుల్లో. ఈ భాషాభిమానమే బెంగాలీ సాహిత్యానికి, సినిమాకు ఒక స్టేటస్ తీసుకురాగలిగింది.

తెలుగులో ఆ నేటీవిటి చక్కగా పాత సినిమాలు చూపించేవి. మన కృష్ణుడు ఉత్తరాది కృష్ణుడిని పోలి ఉండడు. మాయ బజార్‌లో కూడా గోంగూర ప్రసక్తి తీసుకువచ్చే వాళ్ళం. శరత్ నవలలను తెలుగులో తీస్తున్నప్పుడు అలనాటీ దర్శకులు వాటికి తెలుగు నేటివిటీ జోడించి తెలుగు ప్రేక్షకులకు అందించేవారు. రఫీ చేత కూడా తెలుగు పాటలు పాడించాం. వారు అదే శ్రద్ధతో ఉర్దూలో తెలుగు పదాలు రాసుకుని ప్రతి పదాన్ని ఎలా పలకాలో నేర్చుకుని పాడేవారు. ఈ సాంప్రదాయాన్ని ఇప్పుడు పరభాషా గాయనీ గాయకులు తెలుగులో పాడుతున్నప్పుడు పాటిస్తున్నారు.

కాని ఇప్పుడు మన తెలుగు సీమను ఏలుతున్న నాయికలు నాయకులకు ఈ నేటీవిటి అవసరం లేకుండా పోయింది. భాష రాకపోవడం ఒక పెద్ద గొప్ప అయిపోయింది. తెలుగు సినిమాలో తెలుగుతనం శూన్యం. బెంగాలీ సాంప్రదాయంతో హిందీ భాషలో తీసిన చిత్రం ఎంత గొప్పగా ఉన్నా, బెంగాలీ కథను పూర్తి బెంగాలీ భాషలో చూసినప్పుడు అర్థం అవుతుంది బెంగాలీ వర్షన్ హిందీ దాని కన్నా బావుంది అని. ‘పారి’ సినిమా “అనోఖా మిలన్” కన్నా ఖచ్చితంగా బావుంటుంది. కారణం బెంగాలీ భాషతో ఆ సినిమా నేటివిటీకి చేరువగా ఉండడం. కాని ఈ విషయాన్ని మర్చిపోయి హీరో ఇమేజ్, డబ్బింగ్ మీద ఆధారపడి తయారవుతున్న సినిమాలలో క్వాలిటీ తగ్గుతుంది. ఇదే ప్రస్తుతం తెలుగు సినిమా దిగాలు స్థితికి కారణం. సినిమాలో పాత్రలు డబ్బింగ్ మీద ఆధారపడితే సినిమా స్థాయి పడిపోతుందని పూర్తిగా నమ్మిన వారిలో దిలీప్ కుమార్ ఒకరు.

‘పారి’ సినిమాలో దిలీప్ కుమార్‌ని ఆ చివరి పదిహేను నిముషాలలో చూసిన తరువాత వారి హోం వర్క్‌కి, పాత్ర పట్ల వారి గౌరవానికి, వృత్తి పట్ల వారి నిబద్ధతకు తల వంచుతాం. ఆ రోజులలో తెలుగులో కర్ణ లాంటి సినిమాలు శివాజీ గణేశన్ గారు చేస్తే కూడా వారికి జగ్గయ్య గారు డబ్బింగ్ చెప్పారు కాని ఆయన తెలుగులో డైలాగులు చెప్పలేదు. ఊర్వశి అనే తెలుగు సినిమాలో సంజీవ్ కుమార్‌కు కూడా చక్రవర్తి గారు డబ్బింగ్ చెప్పారు. ఇలా డబ్బింగ్‌తో ఇతర భాషలలో కాంప్రమైజ్ అయిన నటులు ఆ తరంలో కూడా చూస్తాం. కాని దిలీప్ కుమార్ మాత్రం తాను బెంగాలీలో చేసిన పదిహేను నిముషాల అతిథి పాత్ర ‘పారి’తో పాటు పూర్తి నిడివి గల “సగీనా మహాతో”లో కూడా తన డబ్బింగ్ తానే చెప్పుకుని తాను చేసిన అన్నీ పాత్రలకు నూటికి నూరు శాతం న్యాయం చేసారు. ఈ విషయాన్ని ‘పారి’ సినిమా ద్వారా గుర్తించాలి.

పారి సినిమా  కథ ఇక్కడ ప్రస్తావించకుండా ఉండడానికి కారణం, ఈ కథను పూర్తిగా అనోఖా మిలన్ సినిమాలో చర్చించడం ముందుగానే జరిగింది కాబట్టి. దిలీప్ కుమార్ నటించిన బెంగాలీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పడానికి కారణం దిలీప్ కుమార్ ఈ పాత్ర కోసం చేసిన హోం వర్క్. ఆ కమిట్‌మెంట్ వారిని భారత దేశంలో గొప్ప నటుడని ఖచ్చితంగా నిరూపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here