ఒక దిలీప్ కుమార్ – నలభై పార్శ్వాలు-7 – అమర్

0
8

[box type=’note’ fontsize=’16’] దిలీప్ కుమార్ నటించిన చిత్రాల నుంచి వైవిధ్యభరితమైన 40 చిత్రాలను పాఠకులకు పరిచయం చేస్తున్నారు పి. జ్యోతి. [/box]

నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో దిలీప్ కుమార్ అద్భుతమైన నటన – అమర్

[dropcap]నె[/dropcap]గటివ్ షేడ్స్ ఉన్న హీరో పాత్రలు ఇప్పుడు మనకు పరిచయమే కాని అలాంటి పాత్రలను ప్రజలకు 50వ దశకంలోనే పరిచయం చేసారు మెహబూబ్ ఖాన్. మెహబూబ్ ఖాన్ సినిమాలో స్త్రీలు బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలు. 1954లో అమర్ అనే సినిమా తీసారు మెహబూబ్ ఖాన్. ఆయన తీసిన సినిమాలలో కమర్షియల్‌గా ఆడనిది ఇదే. అయితే ఈ సినిమా తనకు చాలా ఇష్టమని ఆయన పలు సందర్భాలలో చెప్పుకున్నారు. ఇందులో దిలీప్ కుమార్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారు. హీరోగా భగ్న ప్రేమికుడిగా నటించి అప్పటి దాకా, ప్రేక్షకుల సానుభూతి విపరీతంగా సంపాదించిన వీరు ఈ పాత్రకు ఒప్పుకోవడమే చాలా గొప్ప సంగతి. ట్రెండ్‌తో కొట్టుకుపోకుండా ప్రతిభ కనబర్చాలనే ఆయన తపనే ఈ సినిమాకు ఆయన్ని హీరోగా చేసింది. ఆ రోజుల్లో ఈ సినిమా సాధారణ జనానికి నచ్చకపోయినా క్రిటిక్స్ అభిమానం సొంతం చేసుకోగలిగింది. ఇందులో ముఖ్య పాతలలో దిలీప్ కుమార్, మధుబాల, నిమ్మిలు కనిపిస్తారు. మెహబూబ్ ఖాన్ సినిమాలో హీరోయిన్లు హీరోతో పోటీ పడి సవాలు చేసేటంతటి వ్యక్తిత్వంతో ఉంటారు. ఈ సినిమాలో అంజుగా మధుబాల అంతటి విశిష్టమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఆమె నటించిన సినిమాలన్నిటిలో బలమైన పాత్రగా అంజు నిలిచిపోతుంది.

అమర్నాధ్, ఒక గొప్ప పేరున్న లాయర్. తప్పు చేయడని, అన్యాయం తరుపున అసలు వాదించడని అతని గురించి అందరూ చెప్పుకుంటారు. ఒక రోజు అతనికి పల్లెకు చెందిన ఒక పాలు అమ్మే అమ్మాయి కనిపిస్తుంది. ఆమె సోనియా. తల్లి చనిపోయి సవతి తల్లి వద్ద ఇబ్బంది పడుతూ జీవిస్తున్న అమాయకురాలు. అన్ని బాధలను మర్చిపోయి చాలా చలాకీగా ఉత్సాహంగా జీవిస్తుంటుంది. అమర్‌ని మొదటిసారి చూసినప్పుడు అతని పట్ల ఆమెలో ఆకర్షణ మొదలవుతుంది. అమర్ కూడా ఆ అమ్మాయి చలాకీతనాన్ని అభిమానిస్తాడు. అమర్ వివాహం అంజుతో పెద్దలు నిర్ణయిస్తారు. ఒక కేసు వ్యవహారంలో అంజు అతన్ని కలుస్తుంది. అతని లోని మంచితనం ఆమెను ఆకర్షిస్తుంది. అలాగే పేదల పాలిట అంజుకున్న ప్రేమ, సమాజానికి ఏదో మంచి చెయాలనే ఆమె తలంపు, ఆమెలోని ధైర్యం, ఆమె అందం, అమర్‌ను ఆకర్షిస్తాయి. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.

సోనియాని ఆ ఊరిలో రౌడిగా తిరిగే సంకట్ పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. సోనియా అతన్ని అస్సలు ఇష్టపడదు. కాని సంకట్ ఆమెను వెంబడిస్తూ ఉంటాడు. ఊరంతా అతనికి భయపడతారు. అతను ఊరి పేదవారిపై అధికారం చూపిస్తూ ఉంటాడు, అతని పనుల వల్ల అమర్, అంజు ఇద్దరు కూడా వేరు వేరు సందర్భాలలో అతనికి బుద్ది చెప్పవలసి వస్తుంది. అమర్ అంజుల నిశ్చితార్థం జరుగుతుంది. అంతా బావుంది అనుకున్న సమయంలో ఊరి తిరునాళ్ళలో నాట్యం చేసిన సోనియాని సంకట్ వెంబడిస్తాడు. అతని నుండి తప్పించుకునే క్రమంలో అమర్ ఇంట తలదాచుకుంటుంది సోనియా. ఆమెను గుర్తు పట్టిన అమర్ తన ఇంటిలోని ఒంటరితనాన్ని, సోనియా నిస్సహాయ స్థితిని అలుసుగా తీసుకుని ఆమెపై అత్యాచారం చేస్తాడు. అతని ఇంటి నుండి బైట పడిన సోనియాలో చలాకీతనం శాశ్వతంగా మాయమవుతుంది.

అంజు అమర్ మధ్య ప్రేమ ఇంకా గట్టిపడుతుంది. కాని సోనియాపై అత్యాచారం చేసాక అమర్‌లో ఒక మథనం మొదలవుతుంది. ప్రపంచం అంతా గొప్పగా కీర్తించే తనలోని మరో మనిషి గుర్తించి బాధపడడం మొదలెడతాడు అమర్. అంజుని వదులుకోవడం అతనికి అస్సలు ఇష్టం ఉండదు. కాని తాను చేసిన పని అతనికి ప్రతి నిముషం గుర్తుకు వస్తూ ఉంటుంది. సోనియాని చూసిన ప్రతిసారి తాను చేసిన పని కళ్ళ ముందు మెదులుతుంది. తనలోని మంచి, తనకే తెలియకుండా నిక్షిప్తంగా దాక్కుని ఉన్న చెడుకి మధ్య అతను నలిగిపోతూ ఉంటాడు.

అంజు అమర్‌లో మార్పు పసిగట్టుతుంది. తనకి కారణం తెలియకపోయినా అమర్ మునుపటిలా లేడని ఆమెకు అర్థం అవుతుంది. తన తండ్రి మరణంతో కృంగిపోయిన అతను కోలుకోవడానికి సమయం పడుతుందేమో అని వేచి చూస్తుంది. పెళ్ళి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి అమర్‌కి సోనియా గుర్తుకు వస్తుంది. కాని తాను ఆమెకు చెసిన అన్యాయం ఎవరికీ తెలియకూడదని కూడా అతని కోరుకుంటూ ఉంటాడు. ఈ లోపు సోనియ పెళ్ళి సంకట్‌తో నిర్ణయిస్తుంది ఆమె మారుటి తల్లి. తాను ఈ పెళ్ళి చేసుకోనని సోనియా తండ్రిని బ్రతిమాలుతుంది. తల్లి మాట ముందు తండ్రి ఏం అనలేకపోతాడు. సోనియా పెళ్ళి జరుగుతుందని తెలిసి అమర్ చాలా సంతోషిస్తాడు. తాను చేసిన పాపం ఇక మరుగునపడిపోతుందని ఆశపడతాడు. కాని పెళ్ళి మంటపంలో తాను ఆ వివాహం చేసుకోనని, తన పెళ్ళి ఒకరితో జరిగిపోయిందని ఊరందరి ముందు సోనియా చెబుతుంది. ఆమె పెళ్ళికి వచ్చిన అంజు, అమర్ ఇద్దరు కూడా ఆమె చెప్పిన మాట విని ఆశ్చర్యపోతారు. భర్త పేరు చెప్పమని సోనియాపై ఎంత మంది ఒత్తిడి తెచ్చినా ఆమె చెప్పదు. ఊరంతా ఆమెను చీత్కరిస్తారు, తల్లి ఇంటి నుండి గెంటేస్తుంది. ఆమెను విపరీతంగా కొడుతున్న వారినుండి అంజు అడ్డుపడి సోనియాను రక్షిస్తుంది. ఆమెను తన సంరక్షణలో ఉంచుకుంటానని, ఇష్టం లేని పెళ్ళి బలవంతంగా చేసే హక్కు ఎవరికీ లేదని ఆమె వాదిస్తుంది.

అంత మంది మర్యాదస్తుల మధ్య సంకట్ ఒక్కడికే జరిగింది అర్థం అవుతుంది. సోనియా అత్యాచారానికి గురి అయి ఉంటుందని ఊహిస్తాడు. అతని పేరు చెబితే ఎన్ని కష్టాలన్నా భరించి అతన్ని ఆమె ముందుకు తీసుకువచ్చి ఆమెకు న్యాయం చేస్తానని బ్రతిమిలాడతాడు. అప్పటి దాకా ఆమెను బలవంతంగా పొందాలనే కోరికతోనే అతనున్నాడని అనుకున్న వారందరికి సంకట్ మంచితనం కనిపించి ఆశ్చర్యపరుస్తుంది. కాని మంచివాడు, మర్యాదస్తుడైన అమర్ జరుగుతున్నవి చూసి చలనం లేకుండా ఉండిపోతాడు. తన కారణంగా ఒక ఆడపిల్ల పడుతున్న నిందలు చూసి కూడా ఆమెను కాపాడడానికి ముందుకు రాడు. అంజు మాత్రం అందరిని ఎదిరించి సోనియాను తనతో తీసుకుని వెళుతుంది.

ఇంటికి వచ్చాక అమర్‌లో మంచికి చెడుకి మధ్య విపరీతమైన సంఘర్షణ మొదలవుతుంది. సోనియా పట్ల అది కోపంగా మారుతుంది. ఆమె గొంతు నులిమి చంపేద్దామని కూడా ప్రయత్నిస్తాడు. చావుకు సిద్దపడినట్లు ఎదురుతిరగకుండా నుంచుని ఉన్న ఆమెను ఏం చేయాలో అర్థం కాక ఆమెను వదిలేస్తాడు. కాని ఆ పెనుగులాటలో రిపేర్‌లో ఉన్న ఇంటి చూరు అతనిపై పడుతుంది. సోనియా అతన్ని కాపాడుతుంది. తీవ్ర గాయాల పాలైన అమర్‌కు అంజు సేవలు చేస్తుంది. అమర్ క్షేమం కోసం సోనియా భగవంతుని ప్రార్థిస్తుంది. అమర్‌కు నయమయిన తరువాత అతన్ని తీసుకుని గుడికి వెళ్ళాలని అంజు అనుకుంటుంది. అమర్ గుడిలోనికి  రాలేకపోతాడు. అంజు ఎంత ప్రయత్నించినా ఆతను గుడి గడప దగ్గరకు రాడు. ఆమెను గుడి మెట్ల మీద ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతాడు. మొదటిసారి అంజు ఇది అతని తండ్రి మరణానికి సంబంధించిన దుఃఖం కాదని అనుమానిస్తుంది. గుడిలోకి వెళ్ళాక తన భర్తను కాపాడినందుకు దేవునికి మొక్కుతున్న సోనియా దగ్గర అమర్ రుమాలు చూసిన తరువాత అంజుకు జరిగిన సంగతి అర్థం అవుతుంది. ఈ గుడి మెట్ల మీడ దిలీప్, మధుబాలల నటన మర్చిపోలేం.

అంజుకి ఇప్పుడు తన కర్తవ్యం గురించి బాధ మొదలవుతుంది. అమర్‌ని ఆమె మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది. కాని తోటి స్త్రీకి అన్యాయం జరిగితే స్పందించకుండా కేవలం తన స్వార్థం తాను చూసుకోవడం ఆమె నైజం కాదు. ఇక్కడ మధుబాల నటన, ఆమె హావభావాలు చాలా గొప్పగా ఉంటాయి. కిటికీ నుండి అమర్ తండ్రి తన కాబోయే కోడలికి ఇచ్చిన ఉంగరాన్ని ఆమె సోనియా ముందుకు పడేయడం, సోనియా ఆ ఉంగరం అంజు పోగొట్టుకున్నదని ఆమెకు తిరిగి తెచ్చివడం, దాన్ని స్వీకరించనని అంజు ఆమెతో చెప్పడం, ఇక్కడ నిమ్మి, మధుబాల ఇద్దరూ పోటీ పడి నటించారు.

సంకట్‌కి సోనియా జీవితం పాడవడానికి అమర్ కారణమేమో అన్న అనుమానం వస్తుంది. కాని తన దొంగ కేసు వాదించడానికి ఒప్పుకోక తనకు నీతులు చెప్పి పంపించిన అతను ఇంతటి అన్యాయం ఒక స్త్రీకి ఎలా చేస్తాడు అన్న ఆలోచనతో ద్వైధీభావంతో కొట్టుకుపోతూ ఉంటాడు. ఇంతలో సోనియా గర్భవతి అని ఊరంతా తెలుస్తుంది. ప్రమాదంలో క్రింద పడిన సోనియాను డాక్టర్ పరీక్షించి ఈ నిజం చెబుతాడు. అది ఊరంతా పాకిపోతుంది. సోనియాను ఊరు బహిష్కరిస్తే ఆమె గుడిలో తలదాచుకుంటుంది. సంకట్ అప్పుడు కూడా ఆమెను స్థితికి తెచ్చింది ఎవరో చెప్పమని సోనియాను బ్రతిమిలాడతాడు. అమర్ మీద అనుమానంతో అతనిపై దాడి చేయడానికి కత్తితో వెళతాడు కాని వారిద్దరి మధ్య తోపులాట జరిగి సంకట్ మరణిస్తాడు. సోనియా చేతిలో ఊపిరి వదులుతాడు. సంకట్ రౌడీ అయినా సోనియాపై అతని ప్రేమ నిజమని అర్థం అవుతుంది. ఒక దుర్మార్గుడిగా కనపడే వ్యక్తి లోని మంచితనం కనిపించి ప్రేక్షకులను కదిలిస్తుంది.

ఆ హత్యా నేరం తన మీద వేసుకుంటుంది సోనియా. కోర్టులో సోనియాను ఆ స్థితిలో చూసిన అమర్‌కు తనలోని పాపం నిలువెత్తు రూపంలో కనిపిస్తుంది. న్యాయాధిపతి అయిన తాను ఒక మహిళను ఈ స్థితికి తీసుకురావడం చూసి అతనికి తాను మంచితనం పరదా చాటున ఉండిపోవడం ఇంకా పెద్ద అన్యాయం అనిపిస్తుంది.  ఇంతవరకూ స్కార్లెట్ లెటెర్ ని గుర్తుకుతెచ్చే సినిమా, ఇక్కడ  టాల్‌స్టాయ్ రిసరక్షన్ నవలలోని  కోర్ట్ సంఘటనని పోలివుంటుంది.   ఈ కోర్టు సీన్ ఆయన దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. చివర్లో అంజు అమర్‌కి నిశ్చితార్థపు ఉంగరం తిరిగి ఇచ్చేయడం, సోనియాని అతని వివాహం చేసుకోవడం సినిమా ముగింపు.

మనుషులందరూ బలహీన మనస్కులే. ఇది అందరికీ తెలిసిన సంగతే, కాని తెర మీద నిష్కళంకమైన జీవితాలను చూడాలని తాపత్రయపడతారు భారతీయ సినిమా ప్రేక్షకులు. ఈ పంథాకు విరుద్ధంగా నిర్మించిన సినిమా అమర్. ఒక న్యాయవాది అన్ని మంచి పనులు చేస్తూ గొప్పవాడిగా పేరు తెచ్చుకుని ఒక బలహీన క్షణాన రాక్షసంగా ప్రవర్తించడం సినిమా అంతా కనిపిస్తుంది. తన లోని మంచి చెడుల మధ్య అమర్ పడే సంఘర్షణను దిలీప్ కుమార్ తన కళ్ళతో అద్బుతంగా పలికిస్తారు. గంభీరమైన ముఖంతో తనలోని పాపాన్ని దాచుకోవాల్ని ప్రయత్నీంచడం కాని మనసులోని మథనాన్ని అతని కళ్ళు అతని గొంతు పలికించడం నిజంగా సూపర్బ్. మధుబాల అంజుగా జీవించింది. నిజం అర్థం చేసుకుని మౌనంగా ఉండి స్వార్థంగా ప్రవర్తించలేక ఆమె పడే మధన చాలా గొప్పగా వస్తుంది స్క్రీన్‌పై. ఇక నిమ్మి శరీరం ఒకరి పరం అయితే అతనే తనకు భర్త అనుకునే ఆనాటి మహిళలకు ప్రతినిధి, తనకు ఎవరు అన్యాయం చేసారో చెప్పకుండా అతన్ని కాపాడుతూ, తాను శిక్ష అనుభవిస్తూ తన శరీరాన్ని పొందిన వ్యక్తి తనకు భర్త అని అతని క్షేమం కోసం ఆరాటపడడం, ఇప్పటి తరానికి నచ్చకపోయినా అప్పటి తరం స్త్రీల ఆలోఛనకు చాలా దగ్గరగా ఉన్న పాత్ర అది.

సినిమాలో ముందు అంజు పాత్రకు మీనా కుమారిని ఎంచుకున్నారు మెహబూబ్ ఖాన్. కొన్ని సీన్లలో నటించి ఏదో కారణంతో ఆమె తప్పుకుంది. ఈ పాత్ర చాలా గొప్ప పాత్ర అని ప్రచారం ఉండడంతో దాని కోసం రాజ్ కపూర్ నర్గిస్‌ని తీసుకొమ్మని, దిలీప్ కుమార్ మధుబాలను తీసుకొమ్మని ఖాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చారట. కాని చివరకు ఖాన్ దిలీప్ మాట వినవలసి వచ్చింది. కాని అప్పటికే దిలీప్, మధుబాలలను జోడీగా చూడడం అలవాటయిన ప్రేక్షకులకు అమర్ అంజుని వదిలి సోనియాని వివాహం చేసుకోవడం నచ్చలేదు. అది కూడా అమర్ పరాజయానికి కారణం అయి ఉండవచ్చు. కాని ఈ రోజు చూస్తే దిలీప్ అత్యద్భుతమైన నటన ప్రదర్శించిన చిత్రంగా అమర్‌ను ఇష్టపడతాం. ఆ రోజులో అంతటి నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేసి క్రిటిక్స్ ప్రేమను పొందడం అంత సులువైన పని కాదు.

ఇక ఇందులో పాత్రల చిత్రీకరణ చాలా గొప్పగా ఉంటుంది. అంజుకి ఆమె తండ్రి నాట్యం నేర్పిస్తుంటాడు. కాని అతను నాట్యాన్ని ఇష్టపడడు. కారణం అడిగిన అంజుకి అప్పటి నవయువకులు నాట్యం, గానం తెలిసిన అమ్మాయిలను భార్యలుగా ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నారని, అతను యువకుల ఆలోచనలలో మార్పు, వారిలో వస్తున్న వింత పోకడల గురించి చెబుతూ అమ్మాయికి ఇల్లు దిద్దుకునే దక్షత ఉందా, సమర్థురాలా అని ఎవరూ చూడరు, నాట్యం, గానం రావాలంటారు, వీరికి జీవితం గురించి తెలుసా అని ప్రశ్నించే ఒక సీన్ ఉంటుంది. ఇందులో మెహబూబ్ ఖాన్ స్త్రీలు భోగ వస్తువులుగా తయారు చేయబడుతూ వివాహం కోసం సమర్థత కన్నా పై పై మెరుగులను దిద్దుకోవలసిన స్థితిలోకి నెట్టివేయబడడం వెనుక, స్త్రీల పరిస్థితి ఎలా మారబోతుందో అన్న బాధ కనిపిస్తుంది. చాలా ఆలోచింపజేసే సీన్ ఇది.

అలాగే ఫోటోగ్రఫీ పనితనం గురించి కూడా ఈ సినిమాను చెప్పుకోవాలి, సోనియాపై అత్యాచారం చేసిన తరువాత తండ్రి అంత్య క్రియలప్పుడు దిలీప్‌పై ఫోకస్ చేసిన కెమెరా యాంగిల్స్, సంకట్ సోనియాని వెంబడిస్తున్నప్పుడు నీళ్ళల్లో దాక్కుని తప్పించుకినే సోనియాపై చిత్రించిన షాట్, గుడి దగ్గర మధుబాల, దిలీప్‌లపై చూపిన కెమెరా పనితనం, ఇలాంటి కొన్ని షాట్లు బ్లాక్ అండ్ వైట్ గోల్డేన్ ఎరాకి గుర్తుగా మిగిలిపోతాయి. ఫరిదూన్ ఏ ఇరాని ఫోటొగ్రఫీ సినిమాలోని ఎమోషన్స్‌ను గొప్పగా ఎలివేట్ చేయగలిగింది. ఇక నౌషాద్ సంగీత దర్శకత్వంలో వచ్చిన 10 పాటలు చాలా పాపులర్ అయ్యాయి. “ఇన్సాఫ్ కా మందిర్ హై యె భగవాన్ కా ఘర్ హై” అన్న పాట రఫీకి పేరు తీసుకొచ్చింది. ఒక్క పాట ఆశా పాడితే మిగతావన్నీ నౌషాద్ లతాతో పాడించారు. “నా మిల్తా గమ్ తొ బర్బాది కె అఫ్సాని కహా జాతే” అన్న పాట నిమ్మిపై చిత్రించారు. ఈ పాట విన్న సాహిర్ హింది  సినిమాల్లో ఇంత గొప్ప గజల్ రాలేదని గేయ రచయిత షకీల్ బదాయునిని అభినందించాడు.  ఇది లతా పాడిన వాటిల్లో నాకు చాలా ఇష్టమైన పాట. ఎన్ని సార్లు విన్నా అందులోని తాత్వికత ప్రతి సారి కొత్త అర్థంతో ముందుకు వస్తుంది. ఆ రోజుల్లో ప్రేక్షకులు ఇటువంటి కథావస్తువుకు సిద్ధంగా లేరు. ఇప్పుడు ఇలాంటి కథను ఆదరించే ప్రేక్షకులు ఉన్నా ఈ స్థాయిలో దాన్ని తీయగల దర్శకులు లేరు. అంత సమయం ప్రతి సీన్‌కు ప్రేమ్‌కు వెచ్చించే కళాత్మకత వారిలో తక్కువ. అందుకే ఎప్పటికీ అమర్ ఒక దృశ్య కావ్యంగా మిగిలిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here